Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెద్దాపురం అల్లుడుగారికి బుద్ధి వచ్చింది

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన నల్లబాటి రాఘవేంద్రరావు గారి ‘పెద్దాపురం అల్లుడుగారికి బుద్ధి వచ్చింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

చింతామణిరావు కొడుకు పేరు కృపాకరం. కృపాకరానికి పెళ్లయ్యి రెండు సంవత్సరాలయింది. భార్య పేరు అహల్య. భార్యతో సరిపడక చాలా పెద్ద గొడవలు అయిన మీదట కృపాకరం ఆమెను సంవత్సరం క్రితం ఆమె పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చాడు.

ఇప్పుడు 10 రోజులు తర్వాత అతని తమ్ముడు వల్లభ రావు పెళ్లి.

చింతామణిరావు బంధువులకు చెప్పి వచ్చాడు, కొంతమందికి శుభరేఖలు పంచాడు, ఇంకొంత మందికి మెసేజ్‌లు కూడా పెట్టేసాడు. తన అత్తవారిని పెళ్లికి పిలవద్దని శుభరేఖ పోస్టులో కూడా పంపవద్దని కొడుకు కృపాకరం తండ్రికి అభ్యంతరం చెప్పడంతో చింతామణిరావుకు ఏం చేయాలో తోచలేదు.

‘భార్యతో చిన్నచిన్న గొడవలే కదా మాట మాట పట్టింపు అంతే.. ఈ శుభకార్యం సందర్భంలో సర్దుబాటు చేసుకోమని అవసరమైతే పెద్ద మనుషులను తీసుకొని మనందరం వెళ్లి కోడల్ని తీసుకు వచ్చేద్దామ’ని గతంలో చాలా సార్లు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్పి చూశాడు తండ్రి.

చిన్నప్పటినుండి కృపాకరం కొంచెం మొండి పట్టుదల కలవాడు అని, తను అనుకున్నదే జరగాలి అనే మన స్తత్వం కలవాడు అని.. తండ్రి చింతామణిరావుకు తెలుసు. కనుక తను చెబితే వినక పోవడంతో ఊర్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్దల చేత కూడా పట్టుదల వదిలి వెళ్లి భార్యను తీసి తెచ్చుకోమని నచ్చ చెప్పించాడు కొడుకు కృపాకరానికి.

“చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇలా పెళ్లి అయిన సంవత్సరానికే భార్యను పుట్టింటి దగ్గర వదిలేసి వస్తే ఎలా?..” అంటూ బంధువులు, పెద్దలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, హితబోధ చేసినా ఇంతవరకు కృపాకరం వినలేదు. అణు మాత్రం కూడా పని జరగలేదు.

సరే.. శుభంగా రెండవ కొడుకు వల్లభరావు పెళ్లి సందర్భంలో తగవులాట లాంటి ఆ సమస్య ఒక పక్కన పెట్టేసాడు చింతామణిరావు.

***

ఆ రోజు ఉదయం..

ఆ పక్క వీధిలో ఉన్న తన చినతాతగారు అగస్తేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు కృపాకరం.

“నమస్కారం చినతాతగారు. మా డాడీ మీ ఇంటి దగ్గర రోలురోకలి తెమ్మని పంపించారు. 4 రోజుల్లో తమ్ముడు పెళ్లి కదా.. మీకు తెలుసు కదా. తమ్ముడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు రేపు. ఈ సమయంలో రోలురోకలితో పూజా కార్యక్రమాలు, అలాగే ఆడవాళ్లు చేసే ఏవో తతంగాలు ఉంటాయట కదా. మా ఇంట్లో కూడా ఒక రోలురోకలి ఉండేవి. అవి ఈ మధ్య మా కొత్త ఇంట్లోకి మారుతున్నప్పుడు పగిలిపోయాయి చినతాతగారు..” అంటూ అడిగాడు.

“మీ నాన్న ఫోన్ చేసి నాకు చెప్పాడురా కృపాకరం. అవిగోరా రోలురోకలి ఆ మూల ఉన్నాయి. ఉదయమే వంటింట్లో ఆగ్నేయ మూలను ఉన్న వాట్లని నువ్వు వస్తావని తీసి తెప్పించి బయట పెట్టాం. పట్టుకెళ్ళు.” అంటూ చూపించాడు ఆగస్తేశ్వరరావు.

కృపాకరం వీధి అరుగు మూలన ఉన్న రోలు పైకి ఎత్తబోయాడు. అది చాలా బరువుగా ఉండడంతో పైకి ఎత్తి భుజాల మీద పెట్టుకోవటం చాలా కష్టమై పోయింది. సాయానికి తన చినతాతగారిని పిలుద్దాం అంటే ఆయన చాలా పెద్ద వయసువాడు. పైగా మడత కుర్చీలో కూర్చుని రిలాక్స్‌డ్‌గా టీ తాగుతున్నాడు.

కృపాకరం అతి కష్టం మీద మళ్లీ పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు ఆ రోలుని. ఆయాసం వచ్చినంత పని అయింది కానీ దానిని పైకి ఎత్తలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు.. ప్రయత్నించాడు.. చివరికి ఎలాగైతేనే రోలును రెండు చేతులతో బలంగా పైకి ఎత్తి భుజం మీద పెట్టుకోగలిగాడు. వెంటనే కిందనున్న రోకల్ని పట్టుకోవడానికి అతను ఒక చెయ్యిని కూడా రోలు పట్టు నుండి తప్పించుకోలేకపోతున్నాడు. చాలా ప్రయత్నిస్తున్నాడు. రెండు చేతులతో గట్టిగా పట్టుకున్న రోలు మీద నుండి ఒక చెయ్యి తీసేస్తే భుజం మీద ఉన్న రోలు వచ్చి అతని కాళ్ళ మీద పడిపోవడం ఖాయం. ఇప్పుడేం చేయాలి.. పోనీ రోలుని ముందుగా ఇంటి దగ్గర పెట్టేసి మళ్లీ వచ్చి తర్వాత రోకలి పట్టికెళితే సమస్య తీరిపోతుంది కదా అనుకున్నాడు మనసులో. రెండు చేతులు పట్టుతో భుజం మీద రోలు ఉంటుండగానే అదే విషయం చెప్పాడు తన చినతాతగారికి.

“అబ్బే అలా కుదరదురా కృపాకరం.. రోలురోకలి అంటే అవి రెండు భార్యాభర్తలు లాంటివి. వాటిని విడదీయకూడదు. పట్టుకు వెళ్ళగలిగితే రెండు ఒకేసారి పట్టుకెళ్ళు. నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. లేకపోతే మానేయ్. ఒకవేళ రెండు విడివిడిగా పట్టుకెళ్ళడానికి నీకు ఇష్టమైనప్పటికి ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోదు.. నాకు ఇష్టం లేదు.” ఖచ్చితంగా అన్నాడు అతని చినతాత గారు అగస్తేశ్వరరావు.

“అదేమిటి చినతాతగారు.. రోలురోకలి విషయంలో ఇంత కథ ఉందా. ఇలాంటి విషయం ఉంటుందని నాన్న నాకు చెప్పలేదే. అయినా ఇలాంటి అతి చాదస్తపు నమ్మకాలు ఇంకా ఈ రోజుల్లో ఏమిటి చినతాత గారు? రోలురోకలి భార్యాభర్తలా.. ఇంకా నయం రోజు కాపురం చేస్తున్నాయి అనలేదు. సరే మీరు చెప్పినట్టే చేద్దాం. ఉండండి.. వీధిలో మా ఫ్రెండ్ ఎవరైనా వెళ్తున్నాడేమో నిలబడి చూస్తాను. వాడు వచ్చాక ఇద్దరం ఒకేసారి చెరొకటి పట్టుకు వెళ్తాం. అప్పుడు మీకు అభ్యంతరం ఉండదు కదా, అలా చేస్తాను” అంటూ నెమ్మదిగా ఆ రోలును తన రెండు చేతుల సహాయంతో జాగ్రత్తగా క్రిందకు దింపి యథాస్థానంలో పెట్టాడు. వీధిలోకి వెళ్లి రోడ్డుమీద తన ఫ్రెండ్ ఎవరైనా వెళ్తుంటే బ్రతమలాడి లోపలకు తీసుకు వద్దామని ముందుకు వెళ్ళబోయాడు కృపాకరం.

“ఆగరా ఆగాగు కృపాకరం. ఇలా వెనక్కు రా. నా పక్క నే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చో. ఆవేశం, ఆయాసం పడకు. నేను చెప్పేది విను. ముందు ఈ మంచినీళ్లు తాగు. ఇప్పుడు విషయం ఏమిటి అంటే.. నువ్వు పెళ్ళాన్ని వదిలేసిన వాడివి కనుక నీకు మొగుడు పెళ్ళాల బంధం అర్థం అయి చావదు. ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. భార్యభర్తల బంధం, అనుబంధం, ప్రేమ గురించి నీకు ఎన్ని పాఠాలు చెప్పినా అడవిలో గంధపు చెట్టు మాదిరి నిరుపయోగం.

సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నీ భార్య నువ్వు మోటర్ బండి మీద సినిమాకి వెళ్తున్నారు అనుకుందాం. నీ మోటర్ బండి చక్రాల్లో గాలి తక్కువగా ఉందని నీ మోటార్ బండి మీద నువ్వు ఒక్కడివే ఉండి నీ పెళ్ళాన్ని దారిన పోయే ముక్కు ముఖం తెలియని వేరొక మోటార్ బండి వాడిని ఆగమని అతని వెనకాతల కూర్చోబెట్టించి సినిమాకు తీసుకువెళ్తావా? చాలా అసహ్యం కదా. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇది కూడా అంతే్. పెద్దవాడిని కనుక నీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ మొండి ఉదాహరణ విధానంలో చెప్పాను. ఇలా చెప్పినా నీకు అర్థం అయ్యి చావదు కానీ, ఒక పని చేస్తాను. అది కూడా ఎందుకంటే నా బంధువర్గంలో వాడివి కనుక.

అడుగో సోమయాజులుగారని పక్క ఊరి పెద్ద సిద్ధాంతి గారు. నీకు తెలియదులే. నాకు స్నేహితుడు. అదిగో ఆ రావిచెట్టు కింద రచ్చబండ మీద కూర్చున్నాడు చూడు ఆయనే. లోపలకు పిలుస్తాను.. రోలురోకలి గురించి ఎవరికి తెలియని చాలా విషయాలు పూసగుచ్చినట్టు చెప్పగలడు. ఇదంతా నీ గురించి కాదు గాని ఈ రోలు రోకలి విషయంలో క్లారిటీ నాకు కూడా అంతగా తెలియదు. నేను విందామని సుమా, నీ కోసం కాదు.”

అంటూ కృపాకరాన్ని తన పక్కనే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టి.. అగస్తేశ్వరరావు లేచి బయటకు వెళ్లి మోపెడ్ స్టార్ట్ చేసి వెళ్లబోతున్న తన స్నేహితుడు సోమయాజిని ఆపి నమస్కారం పెట్టి లోపలకు తీసుకు వచ్చాడు. ఆయనను మరో పెద్ద కుర్చీ మీద కూర్చో బెట్టి, టీ తెచ్చి ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగాడు. సోమయాజిగారు కూడా స్నేహితుడితో చాలా చాలా విష యాలు ఆనందంగా మాట్లాడారు.

అగస్తేశ్వరరావు చివరగా సోమయాజిగారితో మాట్లాడుతూ.. “నాకు ఒక ధర్మ సందేహం ఉంది సోమయాజి గారు.. ఇది నవ్వులాట విషయంగా తీసుకోవద్దు. దయచేసి సీరియస్‌గా చెప్పండి అసలు పెళ్లిళ్లలో రోలురోకలి యొక్క ప్రాముఖ్యత ఏమిటండి?” అంటూ ప్రశ్నించాడు.

సోమయాజిగారు ఆజానుబావుడు. ఆయనది కంచు కంఠం. ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.

“ముందు ఈ అబ్బాయి ఎవరు చెప్పు? నీకు దగ్గర బంధువా..?” అంటూ కృపాకరాన్ని చూసి ప్రశ్నించాడు.

అవునన్నట్టు తల ఊపాడు అగస్తేశ్వరరావు.

సోమయాజిగారు మాట్లాడడం మొదలు పెట్టారు..

“సరే ఎవరైతే నాకెందుకు కానీ.. చూడు అబ్బాయ్ చూస్తే నువ్వు బాగా అమాయకపు ముఖం గాడిలా కనిపిస్తున్నావు. అసలు రోలురోకలి గురించి వివరంగా చెప్పేముందు పెళ్లి అనే కార్యక్రమం దగ్గర నుంచి మొదలుపెడదాం.

నీ మొఖం చూస్తే ఇంకా పెళ్లయ్యి ఉండకపోవచ్చు. పెళ్ళాంతో కాపురం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. సరే ఆ విషయం కూడా నాకెందుకు కానీ నువ్వు కూడా జాగ్రత్తగా విను ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. నీలాంటి కుర్రకారు ముఖ్యంగా వినాలి.

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. దీనిని ఏవిధంగా జరుపుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యం. మన దేశంలో వివిధ రకాల మతాలు కులాలు ఉన్నాయి కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఎన్నో సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. అసలు పెళ్లి అంటే ఎన్నో పనుల సమ్మేళనం..

ఎంగేజ్‌మెంట్, ఇంటి దేవుళ్లను పూజించడం.. గౌరీ పూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం, మధు పర్కం, మంగళసూత్ర ధారణ, బ్రహ్మముడి, సప్తపది, నాగవల్లి, అరుంధతీ నక్షత్రం, అప్పగింతలు వంటి ఎన్నో సంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో చాలా మందికి తెలిసిన విషయాలే.

అయితే ఇక్కడ పెళ్లి సందర్భంగా రోలు రోకలిని పూజిస్తారని ఎవరికైనా తెలుసా..? దీనికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయంటున్నారు పూర్వీకులు మరియు మన పవిత్ర వేదాలు. సనాతన ధర్మం ప్రకారం ‘ఏ ప్రవర్తనా నియమావళి.. మూలసూత్రాలు మరియు ఏ న్యాయం చేత వ్యక్తిగత, సామాజిక, మతపర జీవితం సజావుగా సాగుతుందో దానికి కారణం సర్వ జీవజాలం. ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్క వస్తువు లేదా జీవజాలం మరొక దానితో అనుసంధానం చేయబడి ఉంటుంది.

దానిలో భాగంగా మన తెలుగు వాళ్లు పెళ్లిళ్ల సందర్భాలలో, కొన్నిశుభకార్యాల సందర్భాలలో, పూజల సందర్భాలలో రోలు రోకలిని ఎక్కువగా ఉపయోగిస్తుండడం అనాదిగా జరుగుతుంది. అంతే కాకుండా వాటికి ఎక్కువగా పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు.

ఎందుకంటే రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ఎంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. విను.. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు తదితర ధాన్యాలను బాగా దంచి వంటకు అనువుగా చేసుకుని వండుకు తినేవారు మన పూర్వీకులు. ఇవన్నీ రెగ్యులర్‌గా చేస్తూ ఉండేవారు. ఆ ధాన్యాలను పిండిగా చేయడానికి నూకలుగా ఆడించడానికి అప్పుడు మిక్సీలు ఉండేవి కావు, మిషన్లు ఉండేవి కావు. ఈ రోలురోకలి తిరగలని ఉపయోగించే తమ ఆహార పదార్థాలు తయారు చేసుకునేవారు. అందుకే అప్పటి తరం వారికి రోగాలనేవి ఎక్కువగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడలా కాదు మనము ప్రతి ఒక్క పదార్థాన్ని బయటనే కొంటున్నాము. అవి మిషన్ల ద్వారా తయారవుతున్నవి. వాటినే తింటున్నాము, తద్వారా మన ఆరోగ్యం పాడయిపోతోంది.

కాబట్టి మన వంటకాలను మన ఇంటిలో ఉన్న రోలు రోకలితో చేసుకోవడం ఉత్తమం. అందుకే శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తు చేయడం, స్వయంగా అన్నింటినీ మనమే సిద్ధం చేసుకోవడం అలాంటి ప్రక్రియలు మళ్ళీ మొదలు పెట్టాలని ఈ రోలు, రోకలి, తిరగలినీ పూజించి వాటికి మహోన్నతమైన విలువ గౌరవం ఇస్తున్నాం అన్నమాట.

ఇదిగో అబ్బాయి అసలు నీకు ఒక విషయం తెలుసా? పురాణాల్లో బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. అంటే నాగలితో భూమిని దున్ని ధాన్యం పండించడం ద్వారా నాగలికి విలువ ఇస్తూ.. వచ్చిన ధాన్యాన్ని రోకలితో దంపి పిండి చేసి ఆహారం భుజించడం ద్వారా రోకలికి విలువ ఇస్తూ.. అవి రెండింటిని ఆయుధాలుగా స్వీకరించిన బలరాముడే నిజమైన రైతుకు ప్రతీక అన్నమాట. అలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నావ్ ఏమిటి? నోట్లోకి ఈగలు పోతున్నాయిరా కుర్ర కుంకా. ఇంకా విను..

గ్రహణ సమయంలో రోటిలో కొంచెం పసుపునీళ్లు పోసి ఏ ఆధారం లేకుండా రోకలిని నిలబెడితే నిలబడుతుంది. గ్రహణం విడిచాక రోకలి దానంతట అదే పడిపోతుంది.. ఆ విషయం నీకు తెలుసా?

ఇవి అన్ని పనికిరాని చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు, మూఢ విధానాలు అనుకోకురా.. సైన్స్ విజృంభించేస్తుందని మనం ఆకాశంలో విహరించేస్తున్నామని అనవసరంగా హైరానా పడకు. ఈ సందర్భంలో ఈ రోలు రోకలి తిరగలి ఈ చెత్త కథ ఏమిటి అనుకోకు. ఎంత సైన్స్ అయినా ఈ సనాతన ధర్మాలు, ఆచారాలతో ముడిపడితేనే రోజు ముందుకు వెళుతుంది.

ఈ విధంగా రోలును లక్ష్మీదేవితో, రోకలిని విష్ణువుతో, తిరుగలిని శివుడితో తద్వారా వచ్చిన పిండిని పార్వతీ దేవితో పోల్చుకుంటూ వాటిని దేవతలుగా ఆరాధిస్తారు. దీనివల్ల వారికి ధన ప్రాప్తి సిద్ధిస్తుందని గట్టిగా నమ్ముతారు.

ఇలాంటి పరిస్థితులలో ఈ పద్ధతులను అన్నిటినీ పెడచెవిని పెడుతున్న మీలాంటి పింజారి వాళ్లు ఉన్నారే, ఇదిగో వీళ్ళ వల్లే దేశం అధోగతి పాలు అవుతుంది. సరే మూర్ఖత్వంలో కొట్టుకుపోయే బుర్రలకు ఎంత లెక్చరిచ్చిన అనవసరం.

ఇదిగో అగస్తేశ్వరరావు.. ఆప్తమిత్రుడివి నువ్వు అడిగావు కనుక ఈ రోలురోకలి గురించి ఎంతో వివరంగా చెప్పాను. చివరి విషయం ఏమిటి అంటే ఈ రోలు రోకలిని ఏ బడుద్దాయి వెధవ అయినా పట్టుకెళ్తాను అంటే.. విడివిడిగా ఇవ్వకు. పట్టుకెళ్లగలిగితే ఒక్కసారే అవి రెండు కలిపి పట్టుకెళ్ళగలిగే శక్తి ఉన్నవాళ్లకైతేనే అవి ఇస్తూ ఉండు.. లేకుంటే కుదరదు గాక కుదరదు. శాస్త్రం ఒప్పుకోదు. ఇంతకీ ఈ పకోడీగాడికి అసలు పెళ్లి అయిందా?” వెళ్తూ వెళ్తూ మళ్లీ అడిగారు సోమయాజి గారు.

“అయిందండి రెండు సంవత్సరాల క్రితం. కానీ సంవత్సరం క్రితం ఏదో చిన్ని సమస్యతో పెళ్ళాన్ని పుట్టింటి దగ్గర దిగపెట్టి వచ్చేసాడు.”

“అదిగదన్నమాట విషయం. అర్థముఖంగాడన్న మాట. ఇలాంటి వాడికి ఎంత చెప్పినా అది మురికి గుంటలో పోసిన అమృతం అవుతుంది. పెళ్ళాంతో కాపురం చేస్తున్న వాడు అయితే వాడికి ఇదంతా అర్థమయ్యేది. నేను చెబుతుంటే నోరు వెళ్ళబెట్టి వెర్రి చూపులు చూస్తున్నాడు. వెర్రివెంగళప్పగాడు అని ఇప్పుడు తెలిసింది. సరే వాడెవడైతే నాకెందుకు కానీ నాకు గుడికి వెళ్లే సమయం దగ్గర పడింది.. ఉంటాను మరి.” అంటూ మెట్లు దిగి గేటు తీసుకొని బయటకు వెళ్లి తన మోపెడ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు సోమయాజిగారు.

***

అంతా విన్న కృపాకరం తన బుర్ర ఒక్కసారి విదిలించాడు. శతసహస్ర సూక్ష్మక్రిములు తన బుర్ర మీద నుండి దూరంగా వెళ్లిపోయిన అనుభూతి కలిగిన తర్వాత తన చినతాతగారితో ఇలా అన్నాడు.

“సరే చిన తాతగారు ఇదంతా నాకెందుకు కానీ.. ఒక రిక్షా బండిని పిలిచి దాంట్లో నేను కూర్చుని రోలురోకలి రెండు ఒకేసారి పట్టుకెళ్తాను.. మీకు ఏమైనా అభ్యంతరమా?” అంటూ అడిగాడు.

“చాలా ఆనందం నాయినా.. చాలా ఆనందం. ఇదన్న మాట సరైన విధానం అంటే. టైం వేస్ట్ చేయకుండా ఈ పని నువ్వు ముందే చేయవలసింది. సరే బయట రిక్షా బండివాడు ఎవరైనా ఉంటే పిలు. మన రిక్షా సింగినాదం ఉంటే మరీ మంచిది. వెళ్లి తీసుకురా.” అన్నాడు అగస్తేశ్వరరావు.

ఆ ఊరిలో ఉన్న ఇద్దరు రిక్షాబళ్ళ వాళ్లలో ఒక అతను ఊరు విడిచి వెళ్లిపోయాడు. మరొకతను సింగినాదం.

ఆ ఊరిలో అందరికీ తెలిసిన వ్యక్తి సింగినాదం. కొంచెం వీధి చివరకు వెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న అతడినే తీసుకొచ్చాడు కృపాకరం. సింగినాదం లోపలకు వచ్చి విషయం పూర్తిగా తెలుసుకుని సరే అన్నాడు అగస్తేశ్వరరావుతో.

కానీ.. సమయం కుదిరింది కదా.. ఒక మాట అడగాలని అగస్తేశ్వరరావు దగ్గరే మెట్టు దిగువన కూర్చుండి పోయాడు.. సింగినాదం.

తన పని కోసం వచ్చి ఏమిటీ కాలయాపన ఇలా చేస్తున్నాడు అనుకుంటూ కృపాకరం అర్థంకాక ఆశ్చర్యంగా నిలబడ్డాడు.

వెంటనే సింగినాదం కృపాకరం వైపు చూసి..

“కొప్పాకురం బాబుగారు మీ నాన్నగారు నాకు బాగా తెలుసున్న వారు గందా. ఈడ సిన్న పని చూసుకుని ఈ రోలురోకలి నాను అట్టికెళ్ళి మీ ఇంటి కాడ ఆడేత్తాను. మీకు ఏదైనా పనుంటే మీరు ఎల్లిపొండి బాబు.” అంటూ చెప్పాడు కృపాకరానికి.

“పర్వాలేదులే నీ పని చూసుకో.. నేను కూడా వింటాను. తర్వాతే వెళదాం” అంటూ కృపాకరం తన చినతాత గారు పక్కనే కూర్చుండిపోయి సింగినాదం చెప్పేది వినడం మొదలు పెట్టాడు.

“దొరగోరు.. సిన్నమాట అడగాలండి మిమ్మల్ని..” చేతులు నలుపుకుంటూ ఉన్నాడు సింగినాదం అగస్తేశ్వరరావు వైపు చూస్తూ.

“సింగినాదం.. అడగరా ఏమైనా డబ్బు అప్పు కావాలా?”

“ఎంతమాట ఎంతమాట.. ఇసయం అది కాదండి. నాకు నాలుగు అడుగుల బాగా లావు కర్రదూలం ముక్క కావాలండయ్యా. డబ్బులు పెట్టి కొనలేను. తమరు బాగా తెలిసిన వారు గందా. ఏదైనా పాతది ఉంటే ఇప్పించండి.” అంటూ అడిగాడు .

‘కర్రదూలo ముక్క దేనికి?’ అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు అగస్తేశ్వరరావు.. సింగినాదం వైపు.

“ఏమీ లేదండయ్యగారు.. మాది తాటాకు కొంప కదా. నిన్న రేతిరి మా కొంపకి ఈశాన్యం మూల లావుపాటి కర్రదూలం సెదబట్టి ఊడిపోనాదండి. నా కాడ లావు కర్ర దూలం ముక్కలు ఏమీ లేవు. అందాకా అక్కడ ఏదో ఒకటి దాపు పెట్టకపోతే పాక పూర్తిగా ఒరిగిపోతుంది. మరప్పుడు అర్జెంటుగా ఏం సేశానో తెలుసాoడయ్యా. మా ఇంటి దాన్ని అడిగి రోలుమీద రోకలి తీసుకొని ఈశాన్యం మూల చెదపట్టిన కర్ర దూలం పీకి పడేసి ఆ మూల ఈ రోకలి దాపు పెట్టేసానండి. నా తెలివితేటలకు మా ఇంటిది సేనా సంతోషించిందనుకోండి. మీరిప్పుడు లావుకర్రదూలం ఇస్తే.. దీన్ని అక్కడ మోపుచేసి ఆ రోకలి తీసేసి రోలు మీద పెట్టేత్తానండి. అదిగదండి నా ఐడియా.” అంటూ పకపక నవ్వుతూ చెప్పాడు సింగినాదం.

“ఇదేం పనిరా. ఇంత అప్రతిష్ఠపు పని చేయాలని నీకు ఎలా బుద్ధి పుట్టింది రా నీచుడా. నీకసలు ఇంగిత జ్ఞానం ఉందా. నువ్వు తినేది అన్నమేనా. భార్య ఒక చోట భర్త ఒకచోట ఉంటే ఎంత ఛండాలంగా ఉంటుందో ఏవైనా ఊహించావా?. అవునులే నీకెలా తెలుస్తుంది చదువు సంధ్య లేని అడ్డ గాడిదివి నువ్వు.” అంటూ మహాకోపంతో అగస్తేశ్వరరావు అరిచి కరిచినంత పని చేశాడు సింగినాదం వైపు చూసి.

సింగినాదం భయపడిపోయి నిలబడ్డాడు.. “నాను తప్పు ఏం మాట్లాడాను అయ్యగోరు. కర్రదూలం అడగడం కూడా తప్పేనా?.. భార్యాభర్త అంటున్నారు, చండాలుడా అంటున్నారు.. నాకేటి తెలియటం లేదండి అయ్యగోరు. మీరింత కోప్పడతారని తెలిసుంటే ఏది అడిగేవాడిని కాదండయ్యా.” భయపడుతూ అన్నాడు సింగినాదం.

“నువ్వు కర్రదూలం అడగడం తప్పులేదురా కానీ రోలును రోకలిని వేరు చేసావు చూడు.. అది తప్పు. తప్పు కాదు భరించరానిది. నేను చెవులతో ఆ మాట వినలేకపోతున్నాను. చక్కగా కాపురం చేసుకుంటున్న నీ భార్యను నిన్ను దూరం దూరంగా పెట్టేస్తే ఎలా ఉంటుంది రా.. అదే ఇది. నీ బుర్రకు అర్థం కాలేదు కదూ. రోలురోకలి అంటే భార్యాభర్తలు. భార్య ఒకచోట భర్త ఒకచోట ఉంటే అది జీవితం ఎలా అవుతుందిరా. నరకప్రాయం అవుతుంది”. చాలా బాధగా అన్నాడు అగస్తేశ్వరరావు.

“అయ్యగోరు.. ఎంత గొప్ప ఇసయం సెప్పారండి. రోలురోకలి అంటే మొగుడుపెళ్ళాలునా. అమ్మో.. అట్టాగైతే అట్లని ఇడదీసి నేను సానా పెద్ద తప్పు సేశానని ఎరుకైనాదండి. అలాగైతే నన్ను సంమించ కూడదండి.. చంపేయండి బాబు. అయ్యా. నిజమేనండయ్యా ఇప్పుడు కూతంతా అర్థమైంది. మొగుడు పెల్లాలు దూరం దూరంగా ఉండ కూడదండి. ఆ ఇసయం నాకు బాగా తెలుసయ్యా.

మా పెదనాన్నగారి అబ్బాయిది పక్క ఊరండి. మాట మాట పెరిగి గొడవపడి ఓతూరి పెల్లాన్ని పుట్టింటి కాడ ఒగ్గేసాడండి. సరే చూద్దాంలే అనుకొని నాను నెమ్మదిగా ఉన్నానండి. అయితే మా ఎదవ.. పెళ్ళాం లేకపోవడంతో ఆగలేక ఇంటికాడ దారిని పోయే ఆడపిల్లలతో ఎదవ ఏసాలు ఏయడం మొదలెట్టాడండి. ఆల్లు ఊరుకుంటారా అండి. మా సన్నాసిని సెరువు గట్టు కాడికి తీసుకెల్లి సితకొట్టేసారండి. కొట్టులో పెట్టిం చేసారండి. పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయండి. నాకు తిక్కరేగిందండి.

ఇది కాదు పని అని నాను ఆల్ల ఊరు ఎల్లి ఆడిని ఒక సారి కోకో పెట్టి.. ‘ఒరే సాంబయ్య.. పెల్లాన్ని వది లేసి నువ్వు ఇక్కడ ఆడపిల్లల తోటి ఎదవ ఏసాలు ఏస్తూన్నట్టే.. అక్కడ నీ పెల్లం కూడా మొగోల్లతోటి ఎదవ ఏసాలు ఏస్తుంటుంది కదా. అలా ఇద్దరూ సెడిపోతే దరిద్రం కదరా. ఆ తర్వాత ఎప్పుడైనా కలుసుకున్న కాపురం సేయలేరు రా. కూతంత ఆలోచించి ఎంటనే ఎల్లి నీ పెల్లాన్ని అట్టుకొని తెచ్చేసుకో.’  అని నాలుగు సివాట్లు ఎట్టానండి. ఆడి బుర్రకు బాగా ఎక్కిందండి. ఎంటనే ఎల్లి సాయంకాలనికి ఆడి పెల్లాన్ని అట్టుకొని వచ్చేసినాడండి.. ఇప్పుడు అర్థమైనాది బాబు. రోలు రోకలి ఇసయoలో నాను సానా పెద్ద తప్పు సేసినాను.

దయసేసి తమరు కర్రదూలం ఇప్పించండయ్యా. ఏంటనే ఎల్లి దాపు పెట్టిన రోకలి తీసి ఓ దండం పెట్టి రోలుకాడ ఎట్టేత్తానండి. తప్పైపోనాదని రోలురోకలికి నేను, మా ఆడది పసుపు కుంకుమ రాసి పూజలు కూడా సేత్తామండి బాబు.” సింగినాదం లెంపలు వాయించుకుంటూ అన్నాడు.

“సరే తప్పు తెలుసుకున్నావు కదా. ముందు మా కృపాకరం పని చూడు. మా కృపాకరం నీ కూడా రావక్కర్లేదు కదా నువ్వు వెళ్లి ఈ రోలురోకలి కృపాకరం తండ్రి చింతామణి రావు గారి ఇంటి దగ్గర దించి తిరిగి వెళ్ళేటప్పుడురా. దొడ్లో నువ్వు అడిగినంత సైజు లావుకర్రదూలం ఉంది ఇస్తాను.” అంటూ చెప్పాడు అగస్తేశ్వరరావు.

వెంటనే సింగినాదం ఆ మూలను ఉన్న రోలును సునాయాసంగా ఒక చేత్తో పట్టుకుని భుజం మీద పెట్టుకుని మరో చేత్తో రోకలిని పట్టుకుని బయటకు వెళ్లి తన బండిలో పెట్టుకుని వెళ్లిపోయాడు.

కృపాకరానికి ఇప్పుడు తన ఇంటికి వెళ్ళాలి అనిపించడం లేదు. తన మెదడులోని కణాలన్నీ.. ఏదో గొప్ప కార్యం సాధించరా.. అన్నట్టు తనకు ఇప్పుడు సుగమమైన మార్గం చూపిస్తున్నట్టు అనిపించింది. ఇంతకు ముందు సోమయాజి గారు, ఇప్పుడు తన చినతాత గారు, సింగినాదం.. వాళ్లందరి మధ్య సంభాషణ పూర్తిగా విన్న కృపాకరం.. తన భార్య పట్ల తను ప్రవర్తించిన తీరు ఎంత చెడ్డదో గ్రహించగలిగి సిగ్గుతో కుంచించుకు పోయాడు. వెంటనే తన చినతాతగారి వైపు తిరిగి..

“చినతాతగారు ఇప్పుడు నేను పెద్దాపురం వెళ్దాం అనుకుంటున్నాను.” అన్నాడు.

“ఇప్పుడెందుకురా అది మీ మామగారి ఊరు కదా. సడన్‍గా ఈ నిర్ణయం ఏమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు అగస్తేశ్వరరావు.

“అహల్యకు ఏమాత్రం ఇష్టమైనా.. నా భార్య అహల్యను తీసుకువచ్చేస్తాను. ఈరోజే తీసుకొచ్చేస్తాను.”

“బాగుందిరా.. ఈ సంబంధం కుదిర్చీ దగ్గరుండి పెళ్లి చేసిందే నేను కదా. నీ భార్యను తీసుకు వెళ్లడానికి నువ్వు ఎప్పుడు వస్తావా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీ భార్య, మీ మామగారు కూడా ఏమి ప్రశ్నలు వేయరు అభ్యంతరాలు చెప్పరు. ఏ గొడవలు ఉండవు.

పెద్దాపురం వాళ్లకు నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఇటునుంచి ఇటే బయలుదేరి వెళ్ళు. ఇదిగో నువ్వు మీ మామగారు ఇంటికి వెళ్లేసరికి వాళ్లు సారే, చీరలతో అమ్మాయిని రెడీ చేసి ఉంచేలాగా మాట్లాడతాను. నువ్వు చక్కగా వాళ్లతో మాట్లాడి మీ మామయ్య గారిని అత్తయ్యగారిని కూడా రేపు మీ ఇంటి దగ్గర జరగబోయే శుభకార్యానికి రమ్మని అడిగి ఈ రోజే మీతో పాటు వాళ్లను కూడా తీసుకుని వచ్చేయి. అంతా నేను సర్దుబాటు చేస్తాను కదా. ఇక నువ్వు బయలుదేరు. మీ నాన్నకు నేను ఫోన్ చేసి చెప్తాలే.” అగస్తేశ్వరరావు మహదానందంగా కుర్చీలోంచి పైకి లేచి కృపాకరం భుజం తట్టి పంపించాడు.

తనలో మానసిక మార్పు కలిగినందుకు కృపాకరం శరీరం పంచామృతంతో తడిచి ముద్దయిపోయినట్టు అయిపోయింది.

తన నుంచి ఒక చెడు గ్రహం పరిగెత్తుకొని దూరంగా పారిపోయినట్లు అనిపించింది.. పెద్దాపురం వెళుతున్న కృపాకరానికి.

Exit mobile version