[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘పెద్దల కష్టాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మహా మణిమయ మందిరాలనూ,
బడా బడా మసీదులనూ,
చక్కని చర్చిలనూ
నెలకొల్పడం సులువైన పనే!
నిరుపేద నిరాశ్రయులకు
కొన్ని నీడలను నిర్మించడం,
గుండె చెదరిన శ్రమ జీవులకు
కొన్ని ఆసరాల ఆశ్రమాలను
ఏర్పర్చడం,
చింతలతో చితికే
గ్రుడ్డి చీకటి బ్రతుకు గూళ్ళల్లో
ఆశా జ్యోతుల ప్రకాశాన్ని
ప్రసరింప జేయడం
అత్యంత కష్ట భూయిష్ట కార్యం సుమా!
సుదూర సుందర సుఖకర
ప్రదేశాలలో,
వినోదాల విలాసాల వియత్తలాలలో
అనాయాసంగా స్వేచ్ఛగా విహరించడం
సునాయాస కృత్యమే!
కట్టెదుట నున్న గరీబుల కలతల
గబ్బు చీకటి వలయాలనూ,
కన్నీటి వరదలనూ
మానవీయ మానసిక శక్తితో దాటి
వారి ఎదలోకి ప్రవేశించి
దయతో దర్శించి సాయపడడం
అపరిమిత కష్ట చర్య సుమా!
దీన జన బాంధవుల్లా,
పీడిత జనోద్ధారణ దీక్షా బద్ధుల్లా
బరువైన సుదీర్ఘోపన్యాసాలనూ,
బారెడు ప్రణాళికలనూ
ప్రసాదించడమూ,
గాలి బుడగల లాంటి ప్రమాణాలను గుప్పడమూ,
గంధర్వ నగరాల గల్లీలలో త్రిప్పడమూ
సులభమైన వ్యాపారమే!
పరితప్తులను ప్రత్యక్షంగా పరామర్శించి
కస్తిని బాపడం,
స్వస్తిని కూర్చడం
సమధిక కష్ట కర్మ సుమా!
శిలా విగ్రహాలకు
భారీ బడాయి రీతుల్లో
దుగ్దాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ
క్షీరాన్ని నేల పాలు చేయడం
సుకరమైన చెయిదమే!
ఆకలితో అల్లల్లాడే
పేద పసి పిల్లలకు
గరిటెడు పాలను పంచడం
గరిష్ట కష్ట చేష్ట సుమా!
