[డా. గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన ‘పెద్ద మనసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
గుండె గుభేల్ మంది.
టీవీ చూడటం ఆపేసి.. రూంలో ఫ్యాన్, లైట్లు ఆఫ్ చేసి.. రూం లాక్ చేసి రోడ్డు మీదకు వచ్చాను.
మా నరసాయమ్మ చనిపోయిందన్న వార్త నన్ను ఏనుగువాని లంకకు తరలించింది.
***
కొత్త సంవత్సర పండుగ సంబరాలు ముగిశాయి.
***
రాబోవు కొత్త సంవత్సరములో ఈ రాశుల వారికి అన్నీ విజయాలే అవి ఏ రాశుల వారికి అంటే.. అంటూ ఒక యూట్యూబ్ ఛానెల్లో; రాబోవు నూతన సంవత్సరం ప్రారంభం నుండి కుజుని వక్ర దృష్టి వలన ఈ నక్షత్రాల వారికి తీవ్రమైన కష్టాలు అవి ఏ రాశుల వారికి అంటే.. అంటూ మరో యూట్యూబ్ ఛానెల్లో.
ఇంతకీ కొత్త సంవత్సరం అంటే.. జనవరి నుంచి అనుకోవాలా? ఉగాది నుండి అనుకోవాలా?
ఈ యూట్యూబ్ ఛానెళ్లలో చెప్పేవన్నీ నిజమేనా?
వీళ్ళు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఎలా సంపాదించారో.. అసలు జ్యోతిష్యం వీరికి తెలుసా?
సెల్ ఫోన్‌లో రకరకాల వీడియోలను చూస్తున్న చకితా వర్మ బుర్రలో యెన్నో సందేహాలు పుట్టాయి.
అసలు హాయిగా ఢిల్లీలో ఉండకుండా.. ఈ ఏనుగువాని లంకకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది?
తలుచుకుంటే మృదుల చెల్లెలు చకితకి ఏడుపొచ్చింది. ఎందుకంటే ఇటువంటి విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కనిపించవు.
మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా అరుదుగా జరుగుతోంది కాబట్టి.
***
ఢిల్లీ వాళ్ళు ఢిల్లీకి, అమెరికా వాళ్ళు అమెరికాకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు.
ఈ నాలుగైదు రోజుల్లోనే బిడ్డ కూతురు మృదుల.. అమ్మమ్మ నరసాయమ్మను విడిచి ఉండలేనంత బలమైన ప్రేమ పెంచుకుంది.
ఎందుకో ఈసారి మెల్లిగా నరసాయమ్మ ఒడిలో చేరింది.
“ఏముంది అమ్మమ్మా! ఈ ఏనుగువాని లంకలో? మాతోపాటు వచ్చెయ్.” బుంగమూతి పెట్టింది మృదుల.
“దుర్గమ్మ తల్లి ఉంది. ఆ తల్లి గుడిని వదలి నేను రాను.”
“నా క్లోజ్ ఫ్రెండ్ బర్గర్ కూడా ఢిల్లీలో ఉంది. అయినా నేను వదలి వచ్చాను కదా.”
“దుర్గమ్మ అంటే నీ ఫ్రెండు, కుక్క, పిల్లి లాంటిది కాదు. కోరిన కోర్కెలు తీర్చే దేవత..” అంది కొంచెం కోపంగా.
“కోర్కెలు ఉంటే.. అమ్మ నాన్న తీరుస్తారు. దేవతలు యెందుకు? నాకు తెలీదు!” అమాయకంగా అంది.
“మీ అమ్మా నాన్నలే కాదు మనుషులు ఎవ్వరూ తీర్చలేని కోర్కెలు దుర్గమ్మ తీరుస్తుంది.”
“అలాగా, అయితే మా నాన్న అమెరికాలో బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తూన్నాడు. కానీ కుదరలేదుట. దుర్గమ్మ ఇప్పిస్తుందా?” అమ్మమ్మను ఉడుక్కునేలా చేయాలని అడిగింది, వాలుకంట నిర్లక్ష్యంగా చూస్తూ.
“తప్పకుండా”
నరసాయమ్మ నుండి అటువంటి సమాధానాన్ని ఊహించలేదు మృదుల.
“నీ దుర్గమ్మకి.. అమెరికా వెళ్లాలంటే వీసా కావాలి అని అయినా తెలుసా? సాప్ట్‌వేర్ కంపెనీల పేర్లన్నా తెలుసా?” అంది, పోదూ బడాయి అన్నట్లు నరసాయమ్మ వేపు చూస్తూ.
“నేను దుర్గమ్మను అడిగితే ఈ లోకంలో.. ఏ కోర్కెనయినా తీరుస్తుంది.” దృఢంగా అంది.
“అయితే అడుగు అమ్మమ్మా! మా నాన్నకి అమెరికాలో బిజినెస్ కుదిరేలా చూడు అని.”
“అడగను.”
అమ్మమ్మ ముఖం వేపు కోపంగా చూసి, “ఎందుకు? “ అంది మృదుల ఘాటుగా.
“మీరు పుట్టక ముందు మీ మమ్మీ డాడీ ఈ ఏనుగు వాని లంకలోనే ఈ ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మీ మమ్మీ నీ లాగే అడిగింది. నేను దుర్గమ్మను అడగబట్టే మీ మమ్మీ డాడీలకి సాప్ట్‌వేర్ జాబ్‍లు రావడంతో ఫారిన్ వెళ్లారు. తర్వాత ఈ ‘ఏనుగువాని లంక’ను మరచి పోయారు. కోట జంపన గుర్రాజు తాతయ్య గారు, బామ్మ గాదిరాజు రామభద్రమ్మ చనిపోయినా కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అందుకే అదే దుర్గమ్మ తల్లిని మళ్ళీ నేనే అడిగాను – ‘వాళ్ళు ఎలాగైనా ఇండియాకి రావాలని..’. తల్లి మహిమ చూపింది కాబట్టే.. మీ మమ్మీ డాడీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అమెరికా వాళ్ళు ఇలా మీ మమ్మీ డాడీ లను ఇద్దరినీ శాశ్వతంగా వదిలిపెట్టేలా చేసింది దుర్గమ్మ” అంది.
***
అప్పుడు ఏం జరిగిందో నరసాయమ్మకు తెలీదు.
కానీ.. వారు ఇండియాకు వచ్చేశారు. అమెరికన్ కంపెనీ వాళ్ళు అలా అర్ధాంతరంగా పంపించినందుకు మృదుల తల్లిదండ్రులకు భారీగా డబ్బు అందించారు.
అయినా ఇండియాకి వచ్చినారే కానీ.. డిల్లీలోనే పెద్ద పెద్ద భవనాలు కొనుక్కుని ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు.
‘ఏనుగు వాని లంక’ కు రాలేదు.
అంతేకాదు ఏదో పెద్ద ప్రైవేట్ బిజినెస్సు కూడా చేస్తూ లక్షలు లక్షలు సంపాదించుకుంటూ నరసాయమ్మను చూసేందుకు రావటం మరచిపోయారు.
అప్పుడే మొదలయ్యాయి వారికి కష్టాలు. ఉద్యోగాలలో చిక్కులు, వ్యాపారంలో నష్టాలు. కోర్టుల్లో కేసులు, అప్పులు రకరకాల మనుషుల వేధింపులు ఎక్కువయ్యాయి.
దిక్కు తెలియని పరిస్థితిలో.. మృదుల తల్లిదండ్రులు నరసాయమ్మ దగ్గర తలదాచుకోవటానికి ఏనుగువాని లంకకు వచ్చారు.
***
నరసాయమ్మ తన వాళ్ళు కష్టాల్లో వున్న విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరుగా ఏడ్చింది.
మృదుల తల్లిదండ్రులను వెంటబెట్టుకొని వెళ్లి దుర్గమ్మ గుడిలో బోనాలు పెట్టింది.
పిల్లలను ఇండియాకు రప్పించమని అడిగితే ఇలా కష్టాల పాలు చేస్తావా? అంటూ దుర్గమ్మ గుడిలో పూజల్లో మునిగింది.
ఆశ్చర్యంగా ఆ రోజు అక్కడ ఒక ముత్తైదువ కనిపించి.. అది అంతా దుర్గమ్మ లీల అని చెప్పింది. తన భక్తులు తనను మరువకుండా ఉండటం కోసమే దుర్గమ్మ ఇలా చేస్తూ ఉంటుందని చెప్పింది. కొత్త సంవత్సరము మొదటి రోజున తన గుడిలో పూజ చేస్తే, కష్టాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పింది. కళ్ళు మూసి తెరిసే లోపు భక్తుల మధ్యలో దూరి మాయమైపోయింది.
మరుసటి రోజే కొత్త సంవత్సరం మొదటి రోజు కావటంతో అందరూ ఆ మహా తల్లి చెప్పినట్లే చేశారు.
డిల్లీలో మృదుల తల్లిదండ్రుల కష్టాలు తొలగి పోయాయి.
కానీ మృదుల తండ్రికి మాత్రం అమెరికాపై వ్యామోహం పోలేదు.
***
“మీ నాన్నకు విదేశాల పిచ్చి పోలేదు. కొత్త ఆశలు, కొత్త జీవితాలపై మోజు ఉండటంలో తప్పు లేదు. అలాగే మేమూ మీ మధ్య మీ చేతుల్లో నిశ్చింతగా కన్ను మూయాలని కోరుకోవటం లోనూ తప్పు లేదు కదా! మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో.. సరేలే.” అంటూ కళ్ళు మూసుకున్న అమ్మమ్మ కళ్ళ వెంట కన్నీరు కారటం చూసింది మృదుల.
కొడుకూకోడలూ కూతురూఅల్లుడూ మనవళ్ళు, మనవరాళ్లు వెళ్లి పోతున్నారన్న బాధ తట్టుకోలేక పోయిందేమో కోటజంపన నరసాయమ్మ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు.
ఓ నూతన సంవత్సర వేడుక ముగింపు ఇలా.