క్షమించు తండ్రీ!
వృద్ధులు అనాథాశ్రమాల పాలు కాకూడదని
వేదికలెక్కి ఆదర్శాలను ఎంత గొప్పగా వల్లిస్తానో!
అనర్గళంగా ఉపన్యసించి ఎంత బాగా అలరిస్తానో!
చక్కగా వివరించి ఎంతమందిని ఒప్పిస్తానో!
వాస్తవానికొస్తే నాన్నా!
పెళ్ళాం అహంభావం ముందు పరాభవం పాలయిన వాణ్ణి!
అత్తగారి ఆధిపత్య పోరులో నలిగిపోయిన వాణ్ణి!
స్వార్థ, కుటిలత్వాల మధ్య కుమిలిపోయిన వాణ్ణి!
చరమాంకంలో నిన్ను చేరదీయని వాణ్ణి!
ప్రేమతో పట్టెడన్నెం పెట్టలేని దరిద్రుణ్ణి!
అక్కున చేర్చుకొని నీ మనసు పంచుకోలేకపోయిన వాణ్ణి!
నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వాణ్ణి!
నీ పెద్దరికాన్ని గౌరవించలేకపోయిన వాణ్ణి!
ఆత్మవంచన చేసుకుంటూ అసమర్థుడిగా మిగిలిపోయిన వాణ్ణి!
నీ లక్షలకు వారసుణ్ణయ్యాను కానీ
నిన్ను లక్షణంగా చూడలేకపోయిన వాణ్ణి!
ఎన్ని చెప్పినా నాన్నా –
జీవితంలో కృతఘ్నుడిగా నీ ముందు నిలబడ్డ వాడిని!
నా వైభవాల్ని ప్రదర్శించడం, నా అభిప్రాయాల్ని రుద్దడం తప్ప
నీ సూచనలకు విలువ యిచ్చిన దెప్పుడు?
నీ అలోచనలనీ, అంతరంగాన్ని అర్థం చేసుకున్నదెప్పుడు?
నువ్వు తనువు చాలిస్తే –
ఇక ప్రాయశ్చిత్తం ఏముంటుంది?
ఈ ఋణానుబంధం ఎప్పుడు తీరుతుంది?
వచ్చే జన్మంటూ ఉంటే –
నాకు కొడుకుగా పుట్టి, నీ కక్ష తీర్చుకో!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.