Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరిష్వంగం

బిట్లు*గా, బైట్లు*గా
చిట్లి పోయిన జీవితపు
నెత్తురే
కవిత్వపు అత్తరవుతుంది!

కహ షూరు,
కహ ఖతమ్
అవుతుంది
ప్రొజెక్ట్‌ల డోలనాలు చూస్తే!

కాలమంతా
టీమ్స్‌గా, జూమ్‌లుగా
గిరికిలూ కొడుతూ,
ముక్తి నివ్వని
వక్త్ అయి
వాట్సప్ వలయాలై
అవతలి వైపు నుండి
విదేశీ అవమానమై
అనివార్య విషాదమవుతుంది!

గుండెకి చేరని
ఈ మెయిల్ ఐడిలు ఎన్నో
ఫేస్‌బుక్ నిండా
ప్రేమించలేని మిధ్యా బింబాలెన్నో!

గండి పడిన
దుఃఖానికి నిద్ర రాని రాత్రు లెన్నో
వాడికేరా సాఫ్ట్‌వేర్ అనే
జనాల
అసూయ నయనాలకి
అశృ నయనాల దూరం
యోజనాలే!

నేను కనిపెట్టిన పరికరమే
నా భవిష్యత్‌ని
అనిశ్చితం చేస్తున్నప్పుడు

సాంకేతిక సర్ప పరిష్వంగానికి
చిక్కుకుని
అస్తిత్వం కోల్పోయిన
ఆత్మ లెన్నో!

* Bits and bytes -Computer memory

 

Exit mobile version