[శ్రీమతి నాగమంజరి గుమ్మా రాసిన ‘పరిష్కారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“దివ్యా.. మనకి గవర్నర్ గారి అప్పాయింట్మెంట్ దొరికిందమ్మా.. ఎల్లుండి ఉదయం 11 గంటలకు కలవమన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లీ.”
“కానీ నాన్నా.. నేను…”
“ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానమ్మా.. రాయవలసినది ఏదైనా ఉంటే మీ అమ్మకి చెప్పి రాయించు. వస్తాను తల్లీ” కూతురి నుదుటిపై ముద్దు పెట్టి అక్కడనుంచి వెళ్లారు మధుమూర్తి గారు.
***
“దివ్యా.. కాలేజ్ ఎక్సకర్షన్కి రానన్నావట.. ఎందుకు?” సింధు అడిగింది.
“అరకు, బొర్రా నేను చాలా సార్లు చూసాను సింధూ.. వేరే కొత్తప్రదేశం అయితే వచ్చేదాన్ని”
“ఏం.. మేము చూడలేదనుకున్నావా.. అయినా సరే .. కాలేజ్‌లో మన స్నేహితులంతా వెళ్తున్నారు కాబట్టి, ఇదే మన ఆఖరి సంవత్సరం కాబట్టి నువ్వు వచ్చి తీరాల్సిందే”
“సారీ సింధూ.. నేను రాను. మా నాన్నగారితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను.. ఈ 5 రోజులు సెలవుల్లో నాకు కాస్త పని అవుతుంది”
“టూర్ మూడు రోజులే కదా, ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. తర్వాత ఎలాగో రెండురోజులు సెలవులు ఉన్నాయి. మేము వచ్చి మీ నాన్నగారికి అడుగుతాం..”
“సరే మీ ఇష్టం” చెప్పింది దివ్య.
***
దివ్య నాన్నగారు కాలేజ్ లెక్చరర్. అమ్మ గృహిణి. దివ్య ఒక్కతే సంతానం. అల్లారుముద్దుగా పెంచడమే కాకుండా, ధైర్యం, స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా ఆలోచించడం, క్రమశిక్షణ, దైవభక్తి మొదలైన విషయాలలో కూడా చక్కని శిక్షణ నిచ్చారు. ఈమధ్య జరుగుతున్న చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలపై, వారొక స్వతంత్ర ప్రాజెక్టు చేపట్టారు. పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా బాధితుల ఇండ్లకు వెళ్లి, బాధితుల, నేరస్థుల సాంఘిక, మానసిక, ఆర్థిక పరిస్థితులు, నేరానికి పురిగొల్పే విషయాలు, పరిశోధించి, ఒక నివేదిక తయారు చేసి, అటువంటి నేరాలు భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యలు కూడా ఆ నివేదికలో పొందుపరచి, ప్రభుత్వానికి సమర్పించాలని వారి ఉద్దేశం.
ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న దివ్య కాలేజ్ అయిపోగానే ముందురోజు తండ్రి తీసుకువచ్చిన వివరాలు అన్ని చదివి, తల్లి తయారు చేసిన నోట్స్, సేకరించిన వివరాలతో సహా కంప్యూటర్లోకి ఎక్కించి, నివేదిక తయారుచేస్తుంది. సాయంత్రం తండ్రి వచ్చాక కాసేపు ముగ్గురూ చర్చిస్తారు. ఆ తరువాత మధుమూర్తి మిగతా వారి వివరాలు సేకరణకు బయలుదేరుతారు.. ఇది వారి ప్రస్తుత దినచర్య. ఆ ప్రాజెక్టు ఆఖరిదశలో ఉంది. అందుకే దివ్య అరకు టూర్‌కి వెళ్ళనంది. పైగా ఆ టూర్లో కొత్తదనం ఏమి లేదు. ఏదో సరదాగా కాలక్షేపం చెయ్యడానికి మాత్రమే.
***
బిలబిలమంటూ దివ్య స్నేహితులందరూ ఆ సాయంత్రం ఇంటి మీదకి దండయాత్ర చేసినట్లు వచ్చేసారు. దివ్య అందర్నీ నవ్వుతూ ఆహ్వానించింది. తల్లి ప్రసన్న అందరికి కాఫీ ఫలహారాలు అందించింది. “ఏమిటి సంగతి అందరూ ఒకేసారి వచ్చారు” అని పలకరించింది. మధుమూర్తి ఇంకా కాలేజ్ నుంచి రాలేదు.
‘దివ్య టూర్‌కి రానంటోంది, మీ ఇద్దరిని అడుగుదామని వచ్చా’మని ముక్తకంఠంతో స్నేహితులు బదులిచ్చారు.
ఇంతలో మధుమూర్తి వచ్చారు. సందడిగా ఉన్న ఇల్లు చూసి.. “ఏమిటి రామదండు మా ఇంటి మీదకి దాడిచేసింది” అన్నారు హాస్యంగా..
“మీరు ఫ్రెష్ అయి రండి అంకుల్.. మీతో చాలా మాట్లాడాలి” అన్నాడు రోహిత్.
“అబ్బో విషయం పెద్దదే.. ఇదిగో చిటికెలో వచ్చేస్తాను” చెప్పినట్లే పది నిమిషాల్లో ఫ్రెష్ అయివచ్చారు మధుమూర్తి.
కాఫీ ఫలహారాలు ఇచ్చింది ప్రసన్న.
“ఇప్పుడు చెప్పండి.. ఏమిటి మా మీద ఇంత దయ కలిగింది అందరికి..”
“అంతా దివ్య చేసిందే అంకుల్”
“అవునా.. అంత తప్పు మా దివ్య ఏం చేసింది? చేసింది నిజంగా తప్పే అయితే కనుక శిక్షిస్తాను” అన్నారు మధుమూర్తి.
“చాలా.. చాలా అంటే చాలా.. మేమంతా అరకు బొర్రా టూర్ ప్లాన్ చేసాం అంకుల్.. దివ్య రానంటోంది. ఏదో ప్రాజెక్టు ఉందని, ఇంతకు ముందే చూసేసానని, బోరని సాకులు చెప్తోంది. మీరైనా చెప్పండి అంకుల్, ఇదే ఆఖరి సంవత్సరం కదా, ఒక్క రెండు రోజులు మాతో వస్తే తప్పేంటి? ఆంటీ.. మీరు చెప్పండి దివ్య రాననడం తప్పుకాదూ.” ఏకధాటిగా చెప్పింది సింధు.
“కాస్త మంచినీళ్లు తాగు” నవ్వుతూ నీళ్లు అందించింది దివ్య.
“ఊఁ.. మా దివ్య తప్పే చేసింది..” గంభీరంగా అన్నారు మధుమూర్తి గారు..
“నాన్నా..”
“అవును దివ్యా.. స్నేహితులు అంతగా బ్రతిమలుతున్నప్పుడు బెట్టు చేయడం తప్పుకాదూ..” అన్నారు మధుమూర్తి గారు.
“సరే నాన్నా.. వెళ్తాను లెండి” చెప్పింది దివ్య.
“అంతేకాదు దివ్యా.. నేనొక శిక్ష కూడా వేస్తాను..”
“అమ్మో శిక్షే”
“మరి.. మీ స్నేహితులందరికి ఒక సాయంత్రం స్నాక్స్ ఖర్చు నీ పాకెట్ మనీ లోంచి తీసి ఇవ్వాలి.”
“సరే నాన్నా..” నవ్వింది దివ్య.
“కానీ దివ్య మంచిపనే చేసింది కదా.. అప్పుడు రానని చెప్పడం వల్లనే వీళ్లంతా ఇప్పుడు మనింటికి వచ్చారు. “ అంది తల్లి ప్రసన్న.
అందరూ హాయిగా నవ్వుకొన్నారు.
“ఇంతకీ ప్రయాణం ఎప్పుడు?” అడిగారు మధుమూర్తిగారు
“నెక్స్ట్ వీక్ అంకుల్, మా అందరికి ఒక స్పెషల్ బోగీ రిజర్వేషన్ చేయిస్తున్నాం.” చెప్పాడు రోహిత్.
“అయితే లీడ్ చేస్తోంది నువ్వేనా.. ఎంతమంది వెళ్తున్నారు.. అక్కడి ఏర్పాట్లు ఏంటి?” అడిగారు మధుమూర్తి.
“మొత్తం 70 మంది అంకుల్. అబ్బాయిలు 40, అమ్మాయిలు 30. అక్కడ భరద్వాజ్ వాళ్ళకి రెండు రిసార్ట్స్ ఉన్నాయి. ఒక రిసార్ట్‌లో అమ్మాయిలకు, ఒక రిసార్ట్‌లో అబ్బాయిలకు అకామడేషన్, బుధవారం ఉదయం ప్రయాణం, బొర్రా గుహలు, అరకు మ్యూజియం, కాఫీ తోటలు, చాపరాయి జలపాతం చూడటం, కాంప్ ఫైర్, థింసా నృత్యాలు.. మళ్ళీ శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణం.. బస్‌లో..” ఏకబిగిన చెప్పాడు రోహిత్.
“బావుంది. అందరూ మనసుల నిండా మరచిపోలేని మధురానుభూతులు నింపుకొని, క్షేమంగా వెళ్లి లాభంగా రండి”
“సరే అంకుల్, ఆంటీ వెళ్ళొస్తాం. దివ్యా బై..” అందరూ బయలుదేరి వెళ్ళేరు..
***
రైలు పెట్టి కోలాహలంగా ఉంది. రంగు రంగుల దుస్తులు, రకరకాల ఫ్యాషన్లు.. అమ్మాయిలు అబ్బాయిలు గలా గలా కబుర్లాడుతూ.. ఫోటోలు దిగుతూ.. హడావుడిగా ఉన్నారు. శృంగవరపుకోటలో టిఫిన్లు వచ్చాయి. తినేసి, అక్కడ నుండి రాబోయే టన్నెల్స్ కోసం ఎదురు చూశారు. టన్నెల్ వచ్చినప్పుడల్లా “ఓ” అని అరుస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. దివ్యలా ఇంతకు ముందు చూసినవాళ్ళు సీట్లలో కూర్చుని, చూడని వారికి కిటికీల దగ్గర, తలుపు దగ్గర చోటు వదిలేసారు. కొందరు బిజీగా ఫోటోలు తియ్యడంలో మునిగిపోయారు.
బొర్రా గుహలు స్టేషన్లో దిగి గుహలు చూసారు. కోతులకు, కోతిపిల్లలకు ఫోటోలు తీసుకున్నారు.. వెదురుతో చేసిన టీ సెట్, వివిధ కళాకృతులు కొనుక్కున్నారు. అక్కడే భోజనాలు చేసి, తమ బస్సులు ఎక్కి అరకు బయలుదేరారు. దారిలో సుందర దృశ్యాలు చూసుకుంటూ రాత్రి సమయానికి తమ మజిలీ చేరుకున్నారు. థింసా నృత్యం చేసే అమ్మాయిలు వచ్చి ఉన్నారు. నృత్యం చూసి, వారితో కలిసి నృత్యం చేసి, ఫోటోలు, వీడియోలు తీసుకుని, అక్కడి స్పెషల్ భోజనం అయిన బొంగులో చికెన్, పనసకాయ బిర్యానీ తిని ఎవరి రిసార్టుకు వారు వెళ్లిపోయారు.
రెండవరోజు అరకు మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, కాఫీ మ్యూజియం, చాపరాయి జలపాతం చూసారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేశారు. కొంతమంది రాళ్లపై దొర్లి, నీటి వేగానికి పడిపోయి ముక్కు మూతి చితక్కొట్టుకున్నారు. రకరకాల కాఫీ రుచులు చవిచూశారు. సందడి సందడిగా గడిచిపోయింది ఆరోజు. అక్కడ ఏవో రెండు నెట్‌వర్క్‌లు మాత్రమే పని చేయడంతో కొంతమంది తమ కుటుంబసభ్యులతో, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం కుదరక అసహనానికి గురయ్యారు. ఫోటోలు, వైఫై షేర్ చేసుకున్నారు.
మూడోరోజు ఇళ్లకు వెళ్లే దారిలో కాఫీతోటలు చూడటానికి ప్లాన్ చేసుకున్నారు. అందరూ లగేజీ పాక్ చేసుకున్నారు. తనకి తండ్రి విధించిన శిక్ష ప్రకారం అందరికి స్నాక్స్ ఇచ్చింది దివ్య.
“చూసావా దివ్యా.. ఎంతటి ఆనందం మిస్ అయ్యేదానివో.. రాకుంటే..” అంది సింధు.
“అవును నిజమే” అంది దివ్య.
బిలబిలమని అందరూ కాఫీతోటలు చూడటానికి దిగారు. అక్కడి గైడ్లు ఆహ్వానించారు. పిల్లలు గైడ్ వద్దని చెప్పి జట్లు జట్లుగా బయలుదేరారు. ముందు వెనుక ఎవరు వస్తున్నారో చూసే ప్రసక్తి లేదు. ఫోటోలు తీసుకుంటూ ప్రకృతిలో పరవశిస్తూ నడుస్తున్నారు.
అప్పుడు జరిగిందా సంఘటన.. సింధు, దివ్య ప్రకృతి దృశ్యాలు కెమెరాలో బంధిస్తూ నడుస్తున్నారు. ఒక గిరిజన యువకుడు సింధుపై దాడి చేశాడు. రెక్కపట్టుకుని ఈడ్చుకుంటూ పోసాగాడు. దివ్య ధైర్యంగా పక్కన పడి ఉన్న రాతిని తీసి ఆ యువకుడిపై విసిరి, కర్రతో కొట్టి గాయపరచింది. సింధును వదిలేసాడు ఆ యువకుడు. సింధు వేసుకున్న డ్రెస్ చిరిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సింధు బెంబేలెత్తిపోయింది. ఇద్దరు నెమ్మదిగా వెనుదిరిగారు. చుట్టుప్రక్కల ఎక్కడ స్నేహితులు కనబడలేదు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు. సింధు కాలికి గాయమవడంతో గబగబా నడవలేకపోతోంది.
ఇంతలో ఆ గాయపడిన గిరిజన యువకుడు మరో ముగ్గురు యువకులతో కలిసి వచ్చి, దివ్యను చూపిస్తూ తన భాషలో ఏదో చెప్పాడు.. వాళ్ళు వెంటనే సింధును పక్కకు నెట్టి, దివ్యను నోరు నొక్కి, చేతులు వెనక్కి విరిచిపెట్టి, ఎత్తుకుని కొండపైకి తీసుకు పోసాగారు. సింధు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తేరుకొని, అరుస్తూ కిందకి పరిగెత్తింది. పదడుగులు దిగేసరికి, కేకలు విని ఎదురుగా పరిగెత్తుకొచ్చిన ఆరుగురు స్నేహితులకు జరిగిన విషయం వివరించింది. వాళ్ళు సింధుకు మంచినీళ్లు తాగించి ఇద్దరిని తోడిచ్చి కిందకు పంపించారు. మిగతా నలుగురు దివ్యను వెతకడానికి వెళ్ళేరు.
అరగంట వెతకగా స్పృహలేని స్థితిలో దివ్య కనిపించింది. దారుణంగా ఉంది ఆమె పరిస్థితి. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు. అసలు దివ్య బతికి ఉందో లేదో తెలీదు. ముట్టుకోవచ్చో లేదో తెలీదు. ఒక విద్యార్థి ధైర్యం చేసి తన షర్ట్ విప్పి దివ్యపై కప్పి, ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాడు. మెల్లగా ఊపిరి తగిలింది. ఎవరి ఫోన్ కైనా సిగ్నల్ ఉందేమో చూసి ఫోన్ చేశారు.
ఈలోగా కిందకు వెళ్లిన పిల్లలు చెప్పిన వివరాలు తెలుసుకున్న మిగతా పిల్లలు స్థానిక పోలీసును కూడా తీసుకుని సంఘటన జరిగిన చోటుకు వచ్చారు. పోలీస్ తన అధికారులకు విషయం వివరించి, దివ్యను స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్ నుంచి దివ్య తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
దివ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్సులో విశాఖపట్నం బయలుదేరారు. మిగతా స్నేహితులంతా విషాద వదనాలతో వెనుక బస్సులలో అనుసరించారు. విశాఖలో మిగతా అందరు స్నేహితులను వారి వారి ఇళ్లకు బలవంతంగా పంపేసి, రోహిత్, భరద్వాజ్, సింధు, మొదట దివ్యను ఆ పరిస్థితిలో చూసిన ఆరుగురు హాస్పిటల్లో ఉండడానికి నిర్ణయించుకున్నారు. వినోదయాత్ర ఇలా భయంకర విషాదయాత్రగా మారడం అందరినీ కలచివేసింది. ప్రసన్న, మధుమూర్తి హాస్పిటల్ దగ్గరే ఉండి, అంబులెన్సు రాగానే దివ్య పరిస్థితి చూసి బావురుమన్నారు.
నలుగురు యువకులు సామూహిక మానభంగం చేసారని, చేతులు, కాళ్ళు విరిచి కట్టడంతో చేతులు రెండు చోట్ల, రెండు కాళ్ళు విరిగి పోయాయని, సున్నిత భాగాలలో అనేక గాయాలున్నాయని, ముఖంపై, కంటిపై గాయాలున్నాయని దాదాపు నాలుగు ఆపరేషన్లు చెయ్యాలని, రెండు రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు చెప్పేరు.
దివ్యకు జరిగిన ఈ విషయం ఏ మీడియాలో ప్రసారం కాకూడదని పోలీసులను తల్లిదండ్రులు కోరారు. నేరస్థులను విడిచిపెట్టకూడదని, వారిపై కేసు ఫైల్ చెయ్యమన్నారు. సింధుకు ప్రాథమిక చికిత్స చేసి పంపేసారు. మిగతా విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, అందరి ఫోన్ నెంబర్లు తీసుకుని పంపేసారు. మూడు రోజులు గడిచాక దివ్యకు మెలకువ వచ్చింది. కానీ మాట్లాడలేక పోతోంది. మరో రెండు రోజులు గడిచాక మెల్లగా జరిగిన విషయం వివరించింది.
తండ్రితో చెయ్యవలసిన పని కూడా చెప్పింది. ఇంకో రెండు రోజులకు మరికొంచెం కోలుకుంది.
దివ్య కోరిక ప్రకారమే గవర్నర్ గారిని కలవడానికి డాక్టర్లు, పోలీస్ అధికారుల సహాయంతో పరిస్థితి వివరించి అనుమతి కోరారు. ఇప్పుడు అనుమతి లభించింది. ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్న అంబులెన్సులో బయలుదేరి వెళ్లారు. వెనుక పోలీసులు, ఇద్దరు న్యాయవాదులు కూడా కారులో వారిని అనుసరించారు. గవర్నరు గారి నివాసంలో అంబులెన్సులోనే దివ్యతో సమావేశం కావడానికి గవర్నర్ గారు నిర్ణయించారు.
దివ్య పరిస్థితి చూసి గవర్నర్ గారు చలించిపోయారు. ముందుగానే అన్ని వివరాలు ఆయన తెలుసుకుని ఉండటంతో దివ్య ఎందుకు కలవాలనుకున్నదో అడిగారు. దివ్య తండ్రిని తమ ప్రాజెక్టు చూపమని అడిగింది. ఆ ఫైలును, ఒక సాఫ్ట్ కాపీ ఉన్న పెన్ డ్రైవ్ అందించారు. పెన్ డ్రైవ్ సెక్రటరీకి ఇచ్చి, ఫైల్లో వివరాలు పరిశీలించారు.
“చాలా సమగ్రంగా తయారు చేశారు మధుమూర్తి గారు. కానీ ఈ విషయంలో మీ అమ్మాయి కూడా ఒక పేజీ కావడం చాలాబాధ కలిగించింది. ఇప్పుడు చెప్పండి మీ ఉద్దేశం” అడిగారు గవర్నరు గారు.
“నేను కాదండీ మా అమ్మాయి చెప్తుంది” చెప్పారు మధుమూర్తి.
“చెప్పగలదా”
“ప్రయత్నిస్తాను సర్” అంది దివ్య.
“ఈ నేరాలు జరగడానికి ప్రధాన కారణం ప్రచారం అని మా పరిశీలనలో తేలింది. నేర స్వభావం మొదటి కారణం కాగా.. ఒకడు చేసాడు కదా.. చిన్న పిల్లల్ని మనం కూడా అనుభవించితే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో నేరం చేస్తున్నవాళ్ళు, ‘చిన్న పిల్లలు, ఏం జరిగిందో ఎవరికి చెప్పలేరులే’ అనుకుని చేస్తున్నవారు, మద్యం మత్తు, వ్యసనాలు, అన్నిటికీ మించి ప్రచారం వలన కూడా ఇలాంటి సంఘటనలు చెయ్యడానికి పురిగొల్పుతున్నాయి”
దివ్య మరి చెప్పలేకపోయింది. తల్లి వైపు పూర్తిచేయమన్నట్లుగా చూసింది.
ప్రసన్న “నమస్తే సర్.. ఈ వివరాలన్నీ నేనే నోట్స్‌గా రాసిపెట్టేదాన్ని. మా దివ్య ఉద్దేశం ఏమిటంటే బాధితుల చిత్రం, పేరు దాచిపెట్టడం మాత్రమే చేస్తున్నారు. నేరస్థున్ని చూపించడం, బాధితురాలి వివరాలు మాత్రం చెప్పడం, సంఘటనను గురించి నాటకీకరణ చేసి దృశ్య మాధ్యమాలలో చూపించడం, పత్రికలలో ప్రచురించడం కూడా మానేయాలి. స్వభావాలలో ఎలాగో మార్పు తేలేము. కానీ ఈ విధమైన ప్రచారం చెయ్యకుండా నిషేధం విధిస్తే మరికొంతమందికైనా కొత్త ఆలోచనలు కలగకుండా వుంటాయి. బాధితులు ప్రశాంతంగా ఉండగలుగుతారు.
నేరస్థులకు శిక్షలు త్వరగా, కఠినంగా అమలుజరగాలి. ఆ విషయం మాత్రం ‘ఒక అత్యాచార ఘటనలో నేరస్థులకు ఈ తీవ్రమైన శిక్ష విధించబడినది’ అని మాత్రమే ప్రకటన రావాలి.” అని ముగించింది ప్రసన్న.
“ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకుని, ఫైల్ పరిశీలించి, చట్టం తీసుకురావాలి సర్” అన్నారు మధుమూర్తి.
“మీరు చెప్పిన విషయం సబబైనదే.. మంత్రివర్గంతో ఆలోచించి చట్టం తీసుకురావడానికి కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు గవర్నరు గారు. మెరుగైన వైద్యానికి ఆదేశించి, దివ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సమావేశాన్ని ముగించారు గవర్నరు గారు. చట్టం వస్తుందన్న ఆశతో తిరుగుప్రయాణమయ్యారు ముగ్గురూ.
ఏ సంఘటన అయిన జరగడానికి ఆ వ్యక్తుల మనస్తత్వం, పరిస్థితులు, పరిసరాలు ఎలా కారణం అవుతాయో, ఒక్కొక్కసారి పదే పదే చూసిన విషయాలు కూడా కారణం అవుతాయి. ఈ సమస్యకి అదొక్కటే పరిష్కారం కాకపోవచ్చు. కానీ కొంత వరకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. మంచి ప్రచారం వలన మంచి జరుగుతున్నప్పుడు, చెడు ప్రచారం నిషేదించినా కూడా మంచి జరిగే అవకాశం ఉంది కదా.

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఆంగ్లోపాధ్యాయులు అయినప్పటికీ మాతృ భాష మీద మక్కువతో సాహితీసేవ చేస్తున్నారు, అలవోకగా అలతి అలతి పదాలతో పద్యాలు రాయడం ఈమెకు పెన్నుతో పెట్టిన విద్య. శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి శతకాలను ప్రచురించారు. పుష్పమంజరి(1116 పద్యాలు) విహంగవిలాస శతకం, జలచర విలాస శతకం, మొదలగు శతకాలు ప్రచురణకు సిద్ధంగా న్నాయి. ఇవే కాకుండా బాలల కథలు, సాంఘిక కథలు, నవలలు రాస్తూ ఉంటారు. వీరి కథలు చాలా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆకాశ వాణి కార్యక్రమాల్లో, అష్టావధానం, శతావధానాల్లో పృచ్చకురాలిగా పాల్గొంటున్నారు.