Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరీక్షా సమయం

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘పరీక్షా సమయం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

“హమ్మయ్య, అంతా దేవుడి దయ. మొత్తానికి మనం ఇన్నాళ్లు వేచి చూసినందుకు ఫలితం దక్కింది. అంతా స్వామి దయ” కాలెండర్‌లో వేంకటేశ్వర స్వామి ఫోటో వంక చూసి దణ్ణం పెట్టుకుంటూ అంది లక్ష్మమ్మ.

“అవును, నా నోట్లో మాటలు నీ గొంతులో నుండి బయటికి వచ్చాయి లక్ష్మి. నేను అదే అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మనం వేచి చూసిన ఆ మధురవాడ స్థలం తాలూకు ధర బాగా పెరిగింది. ఇప్పుడు కానీ అమ్ముకుంటే కోట్లకి పడగలెత్తేస్తాం. కానీ నాకే అమ్మ బుద్ధి కావడం లేదు” అని భార్య వంక చూశాడు.

“మీకు ఎప్పుడూ ఆ దిక్కుమాలిన డబ్బు గోలే. నేను అంటోంది మన అబ్బాయికి వచ్చిన ఆ అనకాపల్లి పెళ్లి సంబంధం గురించి”. చెప్పింది ఎర్రగా చూస్తూ

‘అమ్మో పప్పులో అడుగేశాను. ఇపుడు కవర్ చేసేయాలి’ అని మనసులో అనుకుని, “నేను జోక్ చేశాను లక్ష్మి, నిజంగా మనం అనుకున్న సంబంధం అనుకున్నట్టే కుదిరింది. ఇక ఇందులో మనం బూతద్ధం పెట్టి వెతికి మరీ చూడాల్సిన విషయాలు లేవు. అన్నీ సరిపోయాయి, జాతకాలు కూడా కలిసాయని ఇందాకే మన పురోహితుడుగారు కూడా ఫోన్ చేసి చెప్పారు. ఎలాగో అమ్మాయికి, అబ్బాయి ఫోటో నచ్చింది, మన అబ్బాయికి కూడా ఆ అమ్మాయి ఫోటో బాగా నచ్చింది. పైగా వాళ్ళ కుటుంబం కూడా బాగుంది. వాళ్లకి ఒక్కగానొక్క అమ్మాయి, మనకి కూడా ఒక్కగానొక్క అబ్బాయి. ఇక ఆస్తి పాస్తి అంటే మనకి ఆసక్తి లేదు. కులం అంటూ కిలుం పట్టిన ఆలోచనలు మనకి అసలే లేవు. పైగా మనల్ని వాళ్ళు పెళ్లిచూపులకి కూడా రమ్మని ఆహ్వానించారు. చూస్తుంటే వాళ్ళు కూడా మనలాగే ఆలోచిస్తున్నట్టుగా ఉంది. కనుక ఇక పెళ్లిచూపులకి వెళ్లి మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి గాను, నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే సరి” అన్నాడు శేఖరం నవ్వుతూ భార్యతో.

“మరీ అలా తొందరపడిపోకండి. ఇపుడు మరీ అంత దూరం మీరు ఆలోచించడం కూడా సాహసమే. అమ్మాయికి మన అబ్బాయి నచ్చితే మంచిదే కానీ, ఆ అమ్మాయికి వంట వచ్చా, ఓపిక, సహనం, పద్ధతులు, పాడులు ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోవద్దూ” అంది.

“అవన్నీ మనం ఎలా చూడగలం లక్ష్మి” అడిగాడు శేఖరం.

“ఏముంది! రేపు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, విడిగా మాట్లాడాలని మన అబ్బాయి అడుగుతాడు. అప్పుడు విడిగా మాట్లాడినప్పుడు, వంట వచ్చా, లేదా అని ప్రశ్న వేస్తాడు. వంట వచ్చు అని చెప్పి ఊరుకుందనుకోండి, అప్పుడు సరే అనేయకుండా, గుత్తి వంకాయ ఎలా చేస్తారు అని అడుగుతాడు. ఆ అమ్మాయి సరిగ్గా జవాబు చెబితే, మనం ఆ అమ్మాయికి వంట వచ్చని అర్థం చేసుకోవచ్చు. చెప్పలేకపోతే అమ్మాయికి వంటరాదని అర్థం. ఇక ఇల్లంతా నీట్‌గా ఉంది, మీరే సర్దుతారా అని అడుగుతాడు. అవును ఇల్లు నీట్‌గా ఉంచడం నాకు ఇష్టం అని అమ్మాయి అంటే, ఇంటి పనీ పాటా చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా, తెలియదు అమ్మ చూసుకుంటుందంటే, ఆ అమ్మాయికి ఇంటి పని మీద పెద్ద శ్రద్ధ లేనట్టే అనుకోవాలి. అలాగే పెద్దలంటే గౌరవం ఉందో లేదో తెలుసుకోవడానికి మనవాడు, మా బామ్మ ఒట్టి నసమనిషి, ఏమైనా అంటే పట్టించుకోకండి అని అంటాడు. అప్పుడు అమ్మాయి, అవును ఈ ముసలోళ్ళతో మనం పడలేం అని వంత పాడితే, ఆ అమ్మాయికి పెద్దలు అంటే పెద్దగా గౌరవం లేనట్టు లెక్క. అలా కాకుండా పెద్దవాళ్ళని అలా అనుకోకూడదు, వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా అని అంటే గనక, ఆ అమ్మాయికి పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్నట్టు. కనుక ఇలాంటి ఇంకో రెండు మూడు చెప్తాను. అవన్నీ మనవాడు అమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడినప్పుడు బయట పడతాయి లేండి” అంది.

శేఖరం కూడా లక్ష్మమ్మను మెచ్చుకోలుగా చూస్తూ, “ఏదో అనుకున్నాను కానీ, నీ బుర్ర కూడా బానే పనిచేస్తుంది” అన్నాడు

“మరి ఏమనుకున్నారు! ఇది పెళ్లి, అంత ఆషామాషీ కాదు”  కాస్త గర్వం పోతూ అంది.

ఇంతలో పెళ్లిళ్లు పేరయ్యగారు ఫోన్ చేయడంతో, ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టి,  “చెప్పండి” అన్నాడు శేఖరం.

“మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. అబ్బాయి, అమ్మాయికి నచ్చాడు కానీ, వాళ్ళు మీ అబ్బాయి నిజంగానే వినయవంతుడూ, సౌమ్యుడూ అవునా కాదా అనే సందేహాలు ఉన్నాయట. మిగతా విషయాల్లో కూడా వాళ్ళకి నచ్చాల్సి ఉందట. అందుకని వాళ్ళు పెళ్లిచూపుల్లో అబ్బాయికి పరీక్షలు పెడతారని ఇప్పుడే నాతో అన్నారు. మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తి గనుక, ఈ సంబంధం కుదిరితే బాగుంటుందని, మీకు ఈ పేపర్ లీక్ చేస్తున్నాను. రేపు అబ్బాయి అమ్మాయితో ఒంటరిగా మాట్లాడుతున్నపుడు, అబ్బాయిని అమ్మాయి కిచెన్ వైపుకి తీసుకెళ్లి, ఆకలేస్తుంది నాకు ఓ దోస వేసి పెడతారా, ఇద్దరం కలిసి తిందాం అని అడిగితే, అబ్బాయి అహం పోకుండా, వేసి ఇవ్వాలట. కనీసం ప్రయత్నం చేయాలట. అలా కాకుండా నేను వంట చేయడం ఏంటి, ఇలాంటివి నాకు నచ్చవు అంటూ మాట్లాడితే, మీ అబ్బాయిని  సమానత్వం లేని వాడిగా చూస్తారట. అట్లాగే అమ్మాయి చున్నీ కింద పడేస్తే, వెంటనే తీసి మీ వాడిని ఆ అమ్మాయికి ఇవ్వమనండి. అంతేగాని, నీ చున్నీ పడిపోయింది తీసుకోమంటే, అబ్బాయి డామినేటింగ్ నేచర్ గలవాడని అర్థం చేసుకుంటారట. ఇలాగే ఇంకో రెండు మూడు ఉన్నాయి. మీకు నేను వాట్సాప్ ద్వారా అవి పెడతాను. రేపటికి మీ అబ్బాయిని  ప్రిపేర్ అవ్వమని చెప్పండి. ఆల్ ది బెస్ట్” చెప్పి ఫోన్ పెట్టేసాడాయన.

అతను మాట్లాడిన మాటలు స్పీకర్లో విన్న లక్ష్మమ్మ, తెల్ల మొహం వేసి,  “చూస్తుంటే, ఆడపిల్ల వాళ్ళకి కాదు, మనకి పరీక్షా సమయంలా ఉంది. వాళ్లు కూడా మనలాగానే ఆలోచిస్తున్నారనిపిస్తోంది. మనకంటే వాళ్ళు నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. అయినా ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి అంటూ పట్టింపులకి పోవడం మనదే తప్పు. ఇద్దరూ అన్నిటిలోనూ సమానమే అనుకోవడమే మంచిది” అని భర్తతో అని, అప్పుడే అక్కడికి వచ్చి ఆ సంభాషణ విన్న కొడుకుతో “రారా దోస వేయడం నేర్పిస్తాను” అందామె కాస్త నీరస స్వరంతో.

Exit mobile version