ఉదయం పది గంటల వేళ. వెంకటేశ్వరస్వామి గుడి ముందు ఇసుక వేస్తే రాలనంత జనం. ముక్కోటి ఏకాదశి కావడంతో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించాలని భక్తులంతా తహ తహలాడిపోతున్నారు. తొక్కిసలాట లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గుడి ప్రాంగణమంతా ‘గోవింద’ నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం చేసుకుంటే, సకల పాపాలు పోతాయని ఉదయం ఐదు గంటలకే గుడి దగ్గర చేరారు. “జరగండి జరగండి” అంటూ, “త్వరగా నడవాలమ్మా” అంటూ వాళ్ళని తొందర పెడుతున్నారు దేవాలయ సిబ్బంది. స్వామిని ఎక్కవ సేపు చూసుకోలేకపోతున్నామే అనే అసంతృప్తితో బయటకు వస్తున్నారు భక్తులు. ఇంతలో క్యూలైన్ ఆగిపోయింది. ఎంతకూ కదలడం లేదు. లోపలికి వెళ్ళే వాకిలి మూసేశారు. ఏం జరిగింది? ఎందుకు దర్శనం ఆపేశారు? మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు? ప్రశ్నిస్తున్నారు అందరూ. “ఎవరో రాజకీయ నాయకుడు దర్శనానికి వచ్చాడు. అందుకే మనలాంటి సామాన్యులను ఆపేశారు” అన్నారు ఒకరు. ఎవరు వచ్చింది అడిగారొకరు. ప్రతిపక్ష నాయకుడు వామనరావు అట. ‘అయితే మళ్ళీ ఎప్పటికి దర్శనం ఆవుతుందో ఇక్కడి నుండే నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళడం మంచిది’ అనుకుంటు కొంత మంది ఇంటి దారి పట్టారు. వామనరావు ఎవరో అక్కడ చాలా మందికి తెలీదు. అతడేమీ సంఘ సంస్కర్త కాదు. ప్రజల కోసం కనీసం చిన్న ఉపకారం కూడా చేసి ఎరగడు. డబ్బు వస్తుందంటే అపకారం చెయ్యడానికి కూడా వెనుకాడడు. అతనికి డబ్బే పరమార్థం. వామనరావుకి ఎలా సంపాదించాం అనేది ముఖ్యం కాదు. ఎంత సంపాదించాం అనేది ముఖ్యం. డబ్బుకు లోకం దాసోహం అనే సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణ నమ్మిన మహా గొప్ప పర్సనాలిటి వామనరావు. తండ్రి గోవిందయ్య దగ్గర రెండెకరాల పొలం, రెండు గదుల పెంకుటిల్లు తన వాటాగా తీసుకుని జీవితాన్ని మొదలు పెట్టాడు వామనరావు.
ఆ పొలంలో బంగారమేమన్నా పండిందేమో, రెండేళ్ళలో ఇరవై ఎరకాలకు ఎదిగాడు. పొలంలో మందు చల్లాలన్నా, కూలీలకు డబ్బులివ్వాలన్నా, అబ్బాయికి కాలేజీ ఫీజు కట్టాలన్నా అందరికీ ఆపద్భాంధవుడు అతడే. పేదవారి అవసరాలను నిచ్చెనగా చేసుకున్నాడు. వారి నిస్సహాయతకు వడ్డీ వసూలు చేశాడు. వడ్డీ కట్టలేని పేద రైతుల పొలాలను తను కలిపేసుకున్నాడు. రోడ్డు నుండి రైళ్ళ వరకు అన్ని కాంట్రాక్ట్‌లు తనే దక్కంచుకున్నాడు. ఇళ్ళు, స్థలాలు, డబ్బు, బంగారం అన్నీ సొంతం చేసుకున్నాడు. పట్నానికి మకాం మార్చాడు. ధనదాహం మరీ ఎక్కువైంది వామనరావుకి. అతను కట్టించిన పాఠశాల గోడ కూలి పది మంది పిల్లలు చనిపోయారు. అతన అమ్మే పాలు తాగడం వల్ల చాలా మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. డబ్బు కట్ట విసిరి న్యాయం నోరు నొక్కేస్తాడు కాని అవసరమని చెయ్యి చాపిన వాళ్ళ చేతిలో ఒక్క రూపాయి కూడా పెట్టడు. అతని అంతస్తు, హోదా పెరిగిపోయింది. పాలక వర్గంలోనూ, ప్రతిపక్షంలోనూ పలుకుబడి ఉంది వామనరావుకి. ఈసారి ఎన్నికల్లో నిలబడతాడని, తప్పకుండా గెలిచి మంత్రి అవుతాడనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. వామనరావు ఆస్తి, అంతస్తు పెరిగిపోయాయి. ఈ అరాచకాలన్నీ జీర్ణించుకోలేని గోవిందయ్య మరణించాడు. అప్పుడప్పుడు వామనరావు కల్లో కనిపించి ‘తప్పు చేస్తున్నావురా వామనా’ అని హెచ్చరిస్తుంటాడు గోవిందయ్య. విలువలు లేని సంపాదన వెనుక ఎన్నో విధ్వంసాలు. భార్య సుభద్రకు వామనరావు చేసే పాపాలన్నీ తెలుసు. కానీ డబ్బుతో కొనే ఆడంబరాలన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి సుభద్రకు. ఏడు వారాల నగలు, జమిందారు పాలెస్ లాంటి పెద్ద భవంతి. ఏ సభకు వెళ్ళినా వామనరావుతో బాటు ఆమెకు ప్రత్యేకంగా కుర్చీ. మందీ మార్బలం. లెక్కలేనన్ని పట్టు చీరలు. ఖరీదైన కారు ఎక్కడికి వెళ్ళినా. ఈ ఖరీదైన అనుభవాలే జీవితం అంటే అనుకుంది. న్యాయం, ధర్మం అంటున్న అంతరాత్మ నోరు నొక్కేసింది.
వామనరావు ఒకే ఒక మంచి పని చేశాడు. కొడుకులిద్దరినీ, తన అవినీతి నీడ పడకుండా హస్టల్లో ఉంచి చదివించాడు. తన డబ్బు, పలుకుబడి ఉపయోగించి అమెరికా పంపించాడు. బ్రతకు బాటలో నడవడనికి వాళ్ళకు గట్టి వంతెన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వామనరావుకి ఎటు చూసినా డబ్బు. బ్యాంకులో ఎంత ఉందో, ప్రామిసరీ నోట్లు ఎన్ని ఉన్నాయో? అసలు మొత్తం ఆస్తి విలువ ఎంత ఉందో అతనికే తెలీదు. ఎన్నికల్లో తప్పకుండా గెలవాలి. ఇంకా సంపాదించాలి. అదే లక్ష్యం అతనికి. దేవుడిని తన కోరిక తీర్చమని అడగడం కోసం సుభద్రతో కలిసి గుడికి వెళ్ళాడు వామనరావు. పొరపాట్లను భగవంతుడు చూసీ చూడనట్లు వదిలేస్తాడు. పాపాలకు శిక్ష మాత్రం తప్పించుకోలేరు. వామనరావు చేసిన పాపాలు సుభద్రను పీడిస్తున్నాయి. కీళ్ళ జబ్బు రూపంలో పీడిస్తున్నాయి. కాళ్ళకు పట్టుకున్న బురదను వదిలించుకున్నట్లు ఒంటికి పట్టిన పాపాన్ని కడగడానికి ఏ నీళ్ళు సృష్టించబడలేదు. అందుకే సుభద్రమ్మ నెలలో సగం రోజులు మంచం మీద ఉండాల్సిందే. పనిమనిషి సాయం లేనిదే కదలలేదు. పనిమనిషి సాయంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ గుడి లోపలికి వచ్చింది. పూజారి వాళ్ళను గర్భగుడిలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజ చేస్తున్నాడు. ఇంతలో సుభద్రమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, అయ్యో అంటూ అందరు చుట్టు చేరారు. ముఖం మీద నీళ్ళు చల్లారు. కానీ ఆమె కళ్ళు తెరవలేదు. వామనరావు చకచకా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేశాడు. నిముషాల మీద అంబులెన్స్ వచ్చింది. ఆమెను హాస్పటల్‌కి తీసుకెళ్ళి ఐ.సి.యు.లో జాయిన్ చేశారు. బి.పి ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాడు డాక్టర్. ఓ రెండు రోజులు ఐ.సి.యు.లో ఉంచితే మంచిదన్నారు. “మేడమ్‌ని మా వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళండి సార్” అన్నారు డాక్టరు. “సరే” అంటూ ఒక్కడే ఇల్లు చేరాడు వామనరావు. ఇంట్లో ఒంటరి. ఆకలిగా ఉంది. తినమని అడిగేవాళ్ళు లేరు. నౌకర్లంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. డబ్బు బీరువాలో పెట్టకుండా అండర్‌గ్రౌండ్‌లో గది కట్టించాడు. ఆ గది నుండా డబ్బు కట్టలు. వాటిని చూస్తుంటే మొదటిసారి భయం వేసింది అతనికి. తనకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎవరైనా వచ్చి తనను కొట్టి మొత్తం దోచుకెళితే. గేటు దగ్గర వాచ్‌మన్‌తో చెయ్యి కలిపితే, భయంతో ఒళ్ళంతా చమట పట్టింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. అలాగే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నెమ్మదిగా నిద్రపట్టింది. కల్లో గోవిందయ్య చెప్పడం మొదలుపెట్టాడు. “నేను చెప్తే విన్నావా? ఏం చేసుకుంటావు ఆ డబ్బంతా? ఏనాడన్నా దానం, ధర్మం చేశావా? మన ఊళ్ళో రైతుంతా నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు. నీలో దయా, దాక్షిణ్యం లేవు. వృద్ధాప్యంలోకి అడుగు పెట్టావు. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో. దాన ధర్మాలు చెయ్యి. దేవుడిని క్షమించమని వేడుకో. లేకపోతే శిక్ష అనుభవిస్తావు” అని తండ్రి హెచ్చరిస్తున్నాడు కల్లో.
దిగ్గన లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా చమటతో తడిసిపోయింది. ఇంక నిద్ర పట్టలేదు. లేచి టి.వి. ఆన్ చేశాడు. ఒక ఇంట్లో దోపిడీ దొంగలు కత్తులతో బెదిరించి డబ్బంతా దోచుకెళ్ళారు. పోలీసులు దొంగల కోసం వెతుకుతున్నారు. వామనరావు కాళ్ళల్లో వణుకు మొదలైంది. కాసేపు అలా గేటు దాకా వెళ్తామని బయటకు వచ్చాడు. బయట కాపలా కాయాల్సిన వాచ్‌మన్ అక్కడ లేడు. ఎక్కడికెళ్ళాడు? అంటే డ్యూటీ చెయ్యకుండా నన్ను రోజూ మోసం చేస్తున్నాడన్నమాట. దూరం నుండి సిగరెట్ తాగుతూ వస్తున్నాడు వాచ్‌మన్. అతన్ని ఏమీ అడగదలచుకోలేదు. లోపలికి వచ్చాడు. మనసులో అంతా శూన్యం. శూన్యానికి ఆవల పెద్ద అఖాతం. ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను, ఆసుపత్రి గదిలో అనాథలా సుభద్ర ఒంటరి అనుకున్నాడు వామనరావు. ఆమె అనారోగ్యానికి నేనే కారకుడినా? అనిపించింది. మోసంతో దగా చేసి, సంపాదించిన సొమ్ము ఎలాంటి సంతోషాన్ని ఇవ్వడం లేదు. మొదటిసారిగా తప్పు చేశానా? అనిపించింది. నాన్న చేసిన హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. నాన్నకు ఏమీ తెలియకపోయినా గొప్ప జ్ఞాని. తనకు చాలా మంచి విషయాలు చెప్పాడు. జీవితానికి రాచబాట అనుకున్నాను కానీ ముళ్ళ కంప అని తెలుసుకోలేక పోయాను. నాకన్నా నా పిల్లలు తెలివైన వాళ్ళు. బ్రతుకు బాటలో నడవాడానికి చాలా గట్టి వంతెన నిర్మించుకున్నారు. నా వంతెనే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది.
‘సుభద్రను తనసలు సరిగా పట్టంచుకోలేదు. హోదా, అంతస్తు, ఇవ్వడమే గొప్ప అనుకున్నాను.’ అనుకంటూ వెక్కి, వెక్కి ఏడ్చాడు వామనరావు. నాన్న ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ‘హిమాలయాల్లోని యోగుల బోధనలు వింటే మనసు కుదుటడుతుందని, చాలా ప్రశాంతంగా ఉంటుందని. ఆ మాటలు నేనెప్పుడు పట్టించుకోలేదు. నా కెందుకీ మనోవ్యథ? అసలు నేనెందుకు భయపడుతున్నాను? అసలు ఈ డబ్బంతా నేనేం చేసుకోను? ఇవన్నీ ఆలోచించకుండానే, కాలం రకరకాలుగా మభ్యపెట్టి ముందుకు లాకెళ్ళింది. పాపం అంతా డబ్బు రూపంలో నా దగ్గర చేరింది. దీనికి జవాబు దొరకకపోతే నేను పిచ్చివాడినైపోతాను’ అనుకున్నాడు.
హాస్పటల్ డాక్టర్‌కి ఫోన్ చేసి “నేను ఒక వారం రోజులు ఊరు వెళుతున్నాను. మీరు ఆమెను నేను వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పాడు. తన మాటలకు తనకే ఆశ్చర్యం వేసింది వామనరావుకు. ఎందుకంటే సుభద్ర గురించి ఈ మాత్రం శ్రద్ధ తనెప్పుడూ చూపించలేదు. ‘తను ఎవరినీ ఆదుకోలేదు. ఎవరికీ సాయపడలేదు. అందుకే ఈ రోజు నా బాధను ఎవరూ అర్థం చేసుకోరు’ అనుకున్నాడు వామనరావు. ఎక్కడివక్కడ వదిలేసి మర్నాడే బయలుదేరి గుళ్ళూ, గోపురాలు తిరిగాడు. ఎవరెవరినో కలిశాడు. అతని సమస్యకు సమాధానం దొరకలేదు. ఎక్కడా ఆగకుండా తిరిగాడు. చివరకు హిమాలయాలు చేరాడు. ఒక యోగి దగ్గరకు వెళ్ళి తన ఆందోళనను వివరించాడు. “ముందు నువ్వొక రెండు రోజులు మాతో బాటు గడుపు నాయనా, తర్వాత మాట్లాడుకుందాం” అన్నాడు స్వామి. వాళ్ళతో బాటు వామనరావు కాయలు, పండ్లు, ఆకులు ఏవి దొరికితే అవి తింటున్నాడు. ఎ.సి. రూమలు లేవు, పడుకోవడానికి పరుపు లేదు. డబ్బు కట్టలు లేవు. ఎవరికీ భయపడనవసరం లేదు. ఏ సంబంధం లేని తనని ఓ అతిథిలా గౌరవిస్తున్నారు వీళ్ళంతా. ఇక్కడ అందరు సేవకులే. యజమానులెవరు లేరు. వీళ్ళంతా ఎంతో నిరాడంబరంగా బ్రతుకుతున్నారు. వీళ్ళకు దేని మీద వ్యామోహం లేదు. కొంతమందికి ఒంటి మీద సరియైన బట్టలు లేవు. ఆశ్ఛర్యం,
ఎంతో నిర్మలంగా ఉన్న యోగుల కళ్ళల్లో దైవత్వం కనిపిస్తోంది. పూలు, పండ్లు, ఆకులు, సెలయేళ్ళు, జలపాతాలు, కొండలు అన్నీ దైవ స్వరూపాలుగా ఉన్నాయి వామనరావుకు. రెండు రోజుల తర్వాత స్వామి, వామనరావును పిలిచి, “నాయనా, నీ సమస్యకు సమాధానం దొరికిందా? నీ భయాలన్నీ తొలగిపోయాయా?” అని అడిగాడు. “తెలీదు స్వామీ, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది” అన్నాడు వామనరావు. దానికి స్వామి, “అశాశ్వతమైన జీవితం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్నావు. లోకంలోని డబ్బంతా నీ దగ్గరే ఉండాలని కోరుకున్నావు. నీ వల్ల చాలా మంది నిరాశ్రయులు, నిర్భగ్యులయ్యారు. ఆ పాపమే నీకు మనశ్శాంతి లేకుండా చేసింది. నీ డబ్బుకు సార్థకత కలిగించు. అది సద్వినియోగమైతే నీ మనసులోనే మలినం తొలగిపోతుంది. అధర్మంగా సంపాదించిన డబ్బు నిన్ను భయపెడుతోంది. ఆలోచించుకో నాయనా” అన్నాడు స్వామి. వామనరావులో మానసిక పరవర్తన మొదలైంది. ఈ మధ్య తండ్రి కల్లోకి రావడం మానేశాడు. వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. సుభద్రను ఎంతో ఆదరంగా ఇంటికి తీసుకొచ్చాడు. చెల్లెళ్ళిదరినీ పిలిచి వాళ్ళు సంతోషపడేటట్లుగా వాళ్ళ పేరున కొంత ఆస్తి వ్రాసిచ్చాడు. తండ్రి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆనాథలైన వృద్ధులకు, పిల్లలకు, పేదలకు డబ్బు అందేటట్లుగా వీలునామా రాశాడు. తండ్రి కోరుకున్నట్లుగా సొంత ఊరు వెళ్ళి, అక్కడి రైతుల పొలాలు ఎవరివి వాళ్ళకు ఇచ్చేశాడు. అప్పుడప్పుడు తను వెళ్ళి, అక్కడ ఉండి వచ్చేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటిని మాత్రం తన ప్రేమకు గుర్తుగా కొడుకులిద్దరికీ సమంగా రాశాడు. సుభద్ర మాత్రం భర్తలోని ఈ మార్పు అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. గోవిందయ్య పై నుండి కొడుకుని చూస్తూ సంతృప్తిగా దీవించాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విశాల హృదయాలు
2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
జ్ఞాపకాల పందిరి-133
మౌనం ఒక నిశ్శబ్ద నిగూఢ పెను తరంగం
కొత్త చిగుళ్లు
ప్యాడ్‌మ్యాన్
అన్నమయ్య పద శృంగారం-18
రామసేతు
పూచే పూల లోన-5
ఫొటో కి కాప్షన్-30
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®