[మాయా ఏంజిలో రచించిన ‘One more round’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(మాయా రాసిన ఈ బలమైన కవిత ఆనాటి ఆఫ్రికన్ అమెరికన్ జాతి శ్రమదోపిడీని, బానిస బతుకులను ప్రతిఫలిస్తుంది. చేసే పని పట్ల గౌరవం, బానిసలుగా మార్చబడడాన్ని తిరస్కరించడం ఏక కాలంలో ఇందులో కనిపిస్తాయి.)
~
సూర్యుని గొడుగు కింద
నేను చేసే శ్రమకు
ఎటువంటి చెల్లింపూ లేదు
పని మొత్తం పూర్తయినప్పుడు
దొరికే విశ్రాంతి ఎంతో తీయగా ఉంటుంది
నేను చచ్చేంత వరకు
పని చేయడానికే పుట్టాను
కానీ
బానిసగా బతికేందుకు
నేనెంత మాత్రమూ పుట్టలేదు
మరో పని.. మరో పని
ఈ పనిని కాస్త తగ్గించండి
పప్పా ఉక్కుబండి నడుపుతాడు
అమ్మ సహాయంగా కాపలాగా నిలబడ్తుంది
చేస్తున్న పని కష్టంగా ఉందని
వాళ్ళు విసుక్కోగా నేనెప్పుడూ వినలేదు
కానీ
వాళ్ళు కట్టుబానిసలుగా బతకడానికి
ఎంత మాత్రం పుట్టలేదు
పని వెనక పని
పని వెనక పని
ఈ పనిని కొంత తగ్గించండి
అన్నలకు అక్కలకు –
అనునిత్యపు చాకిరీ
రోజువారీ కష్టాలు బాగా తెలుసు
వారు తమ బుద్ధిని మనసులను
కోల్పోయేలా చేసింది
నిరంతర శ్రమ మాత్రమే కాదు
వాళ్ళు చచ్చేంతవరకు శ్రమించడానికే పుట్టారు
కానీ
కట్టుబానిసలుగా బతకడానికి మాత్రం కాదు
పని.. పని.. పని..
ఓ పని తరవాత మరో పని..
నాకు నేనుగా పెట్టుకున్న
ఓ బంగారు నియమాన్ని
మీకు చెబుతానిపుడు
నేను పని చెయ్యడానికి పుట్టాను నిజమే
కానీ
తెలివి తక్కువగా
ఓ కంచరగాడిదలాగా
నేను సమాధి అయ్యేంతవరకు
ఓ బానిసలాగా
పని చేసేందుకు మాత్రం నేను పుట్టలేదు
పని.. పని..
ఇంకో పని.. పని తర్వాత మరో పని
ప్రతిఫలం లేని పనిని
తగ్గిద్దాం.. తగ్గిద్దాం..!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.