[బాలబాలికల కోసం పండ్ల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది మొదటి భాగం.]
~
ప్రశ్నలు:
1.
గోధుమ వన్నె దేహం
సోగ కన్నుల విత్తనం
తింటే నోటికి జిగట
2.
అమ్మాయి పేరున్న పండు
సిందూరంలా మెరిసే పండు
సిట్రన్ జాతి తినే పండు
3.
పండ్లన్నింటికీ రారాజు
రుచిని తూచలేదు తరాజు
4.
ఒళ్లంతా ముళ్ళుంటాయి
నెత్తి మీద ఆకులుంటాయి
పులుపు తీపి రుచులుంటాయి
5.
కాటుక రంగు పిల్లల్ని
కడుపుపున దాచుకున్న (మోస్తున్న)
మిసిమి దేహపు అమ్మ
6.
బాలిక నామం పెట్టుకున్నది
దేహమంతా కన్నులు కలది
విత్తుల చుట్టూ కండ కలిగినది!
7.
ఎండాకాలంలో ఎర్రని రసాలు
నేలన పాకే తీగాలకే కాయలు
దీని పొట్ట నిండా నీటి నిల్వలు
8.
రంగేమో మేలిమి బంగారం
రుచేమో మధురాతి మధురం
పిల్లేమో ముదురు నీటి టెంక ఫలం
9.
ఒళ్లంతా పసుపు పూసుకున్న ముత్తైదువ
పూజలకూ వ్రతాలకూ ముందుండే ముత్తైదువ
10.
ఈ పండును రోజూ తింటే
డాక్టరు వద్దకు వెళ్ళే పని లేదు
ఈ చెట్టు కింద కూర్చుంటేనే
భూమ్యాకర్షణ తెలిసింది!
~
జవాబులు:
1.సపోటా 2. కమలా పండు 3. మామిడి 4. అనాసకాయ 5. బొప్పాయి 6. సీతాఫలం 7. పుచ్చకాయ 8. మామిడి 9. అరటి పండు 10. యాపిల్
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.