[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘పంచరంగుల పాత కథ’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
శ్లో:
కిం నామేదం బత సుఖం యేయం సంసార సంతతిః।
జాయతే మృతయే లోకో మృయతే జన నాయచ॥
తా: ఈ సంసార చక్రమున సుఖ మేమున్నది? చచ్చుటకై పుట్టుచున్నారు. మరల పుట్టుటకై చచ్చుచున్నారు!!
***
“ఆ తేలు ఆ ముగ్గురు దొంగలనీ కుట్టింది.” అన్నారు స్వామి బ్రహ్మ విద్యానంద.
“ఆ తేలు దొంగల్ని మాత్రమే కుడుతుందా?” అడిగారు శాంతి రెడ్డి.
“ఈ సందర్భంలో తేలు అంటే సంసారం అనీ, దొంగలు అంటే సంసారులు అనీ అర్థం చేస్కోండి.” స్వామీజీ.
“ఈ సంసారులు గృహస్థుల్లోనే వుంటారా?” శాంతి రెడ్డి.
“ఈ సంసారులు గృహస్థుల్లోనే కాదు, సన్యాసుల్లో, బ్రహ్మచారుల్లో కూడా వుంటారు.” స్వామీజీ.
“చిత్రంగా వుందే! సంసారులు సన్యాసుల్లో, బ్రహ్మచారుల్లో కూడా వుంటారా? పెళ్లి అయితేనే కదా సంసారం ఉండేది?” శాంతి రెడ్డి.
“అక్కరలేదు! నేను – నాదీ (అహం – మమ) అనే భావం వున్న ప్రతివారూ సంసారే!” చెప్పారు స్వామీజీ
“మరి.. సంసారికి జ్ఞానికీ తేడా తెలీదా?” శాంతి రెడ్డి
“ఎందుకు తెలిదూ? జ్ఞాని సర్వాన్నీ సాక్షిగా తన లోపలే దర్శిస్తాడు. సంసారి తన లోపల వున్న సర్వాన్నీ తన బయట వివిధ నామ రూపాలుగా చూస్తాడు! జ్ఞాని తన ఇంద్రియాలను నిగ్రహించి శాంతచిత్తుడై ఉంటాడు. సంసారి తన ఇంద్రియాలలో సుఖాలు వెదుక్కుంటాడు – విగ్రహాలలో దేవుణ్ణి వెదికినట్టు! ఒక బ్రహ్మచారి వివాహం గురించి గానీ, తాను స్వీకరించబోయే సన్యాస దీక్ష గురించి గానీ కలలు కంటుంటే అతను తప్పకుండా సంసారే! ఒక జ్ఞాని వర్తమానమే నిజమని తనకు దొరికిన దానితో తృప్తిగా ఉంటాడు. సంసారి గతాన్ని తల్చుకొని బాధపడుతుంటాడు. భవిష్యత్తును గూర్చి బెంగతో భయపడుతూ వర్తమానంలో కూడా తృప్తి అనే మాటకు దూరంగా ఉంటాడు. ఒక సన్యాసి ఆ రోజు లభించిన భిక్షతో తృప్తి చెందక రేపు భిక్ష ఏమి దొరుకుతుందో అని ఆలోచిస్తుంటే అతను తప్పకుండా సంసారే! ఒక గురువు తన దగ్గర కొచ్చే శిష్యులు తగ్గితే ఆందోళన, పెరిగితే ఆనందం పడుతుంటే ఆ గురువు తప్పకుండా సంసారే! ఒక ఆశ్రమ పీఠంపై వున్న స్పిరిట్యువల్ హెడ్ ఆ పీఠం ఆస్తుల గురించి అవి అనుభవించబోయే వారసుల గురించీ ఆలోచిస్తుంటే ఆ పీఠం అధిపతి అతిపెద్ద సంసారి!” వివరించారు స్వామీజీ.
“సరే స్వామీజీ! ఇక తేలుకుట్టిన ఆ ముగ్గురు దొంగలు అదే సంసారుల గురించి చెప్పండి.” శాంతి రెడ్డి.
***
రుషీకేశ్ కైలాస్ ఆశ్రమం నుండి నీలకంఠ మహాదేవ్ సన్నిధిలో జరుగనున్న అతి రుద్ర యాగంలో పాల్గొనడానికి ఆ ముగ్గురు బ్రహ్మచారులు, శ్రీరామ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య, శ్రీ కుచేల చైతన్య, నడక మార్గంలో కబుర్లు చెప్పుకొంటూ బయలుదేరారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. ఉన్నవి రెండే మార్గాలు – బరువులు మొయ్యడానికి గాడిదలు, మనుష్యులను మొయ్యడానికి చిన్న గుర్రాలు ఉండేవి. ఆ మార్గంలో 25 కిలోమీటర్లు దూరంలో నీలకంఠ మహాదేవుని సన్నిధి వస్తుంది. అడ్డదారిలో నడక మార్గమైతే 13 కిలోమీటర్లు ఉంటుంది. కొండలు ఎక్కాలి, లోయల్లోకి దిగాలి. జలపాతాలు చాకచక్యంగా దాటాలి.
భయంకరమైన క్రూర జంతువులు, విష సర్పాల నుండి ప్రతీ క్షణం ప్రమాదం పొంచి ఉంటుంది. వీరు ముగ్గురూ నైష్ఠిక బ్రహ్మచారులు కాబట్టి నడక మార్గం లోనే ప్రయాణించాలిసి ఉంటుంది. ప్రయాణ బడలిక మర్చి పోవడానికీ కబుర్లు మొదలెట్టారు.
“ఐ హావ్ మెనీ ప్రోబ్లమ్స్ ఇన్ మై లైఫ్. బట్ మై లిప్స్ డోంట్ నో దట్! దె ఆల్వేస్ స్మైల్ అన్నాడు చార్లీ చాప్లిన్.” అన్నాడు రామ చైతన్య.
“అవును తెలిసిన వాడికి దుఃఖమునకు హేతువు లేదు. ‘నాను శోచంతి పండితః’,” అన్నాడు కృష్ణ చైతన్య
“అద్దానికి, అర్థానికి తేడా ఏమిటి?” అడిగాడు కుచేల.
“అద్దం లోకి చూసుకొంటే నీ ముఖం మాత్రమే నీకు కనిపిస్తుంది. అదే అర్థం చేసుకొంటే ప్రతీ జీవి ముఖం లోనూ నీ ముఖమే కనిపిస్తుంది.” కృష్ణ చైతన్య.
“దేవుడు ఎక్కడ ఉంటాడు?” కుచేల చైతన్య
“తెలివి ఎక్కడఉంటే అక్కడ ఉంటాడు. స్థూలంగా చెప్పాలంటే విష్ణు భక్తుని దేవుడు వైకుంఠం లోనూ, శివ భక్తుని దేవుడు కైలాసం లోనూ ఉంటాడు. వైకుంఠానికి తిరుపతి, కైలాసానికి శ్రీశైలం ప్రతిరూపాలు. సూక్ష్మంగా చెప్పాలంటే దేవుడూ – దానవుడూ కూడా మనిషి లోనే వుంటారు!” శ్రీ రామ చైతన్య.
“దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలి?” కుచేల చైతన్య.
“జనులు దేవుణ్ణి పూజిస్తున్నామనుకొంటారు. కానీ వారు పూజించేది వారి వారి కోరికలను మాత్రమే. మనకు అవసరం లేని వాటిని కోరుకొంటే అవసరమైనవి దూరం అయి పోతాయని తెలుసుకోరు.” కృష్ణ చైతన్య.
“దేవుణ్ణి పూజిస్తే మనసు ప్రశాంతం అవుతుందా?”
“మనసు లోని విషయాలను మర్చిపోతే ప్రశాంతత ఏర్పడుతుంది.” రామ చైతన్య జవాబు.
“ఈ భూమండలాన్ని ఎవరు నిలబెడుతున్నారు?” శ్రీకృష్ణ చైతన్య.
“తాబేలు.” టక్కున చెప్పాడు కుచేల చైతన్య
“మరి.. ఆ తాబేలును నిలబెట్టేదెవరు?” కృష్ణ చైతన్య.
జవాబు లేక తడబడ్డాడు శ్రీ కుచేల చైతన్య.
“జగత్తులో దేనికోసమో వెదికే వాడు దారి తప్పుతాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబు కోసం గుడుల్లోనూ, ఆశ్రమాల లోనూ వెదికేవాడు అప్పటికే దారి తప్పినవాడు. తనకు కావాల్సింది తనలోనే వెదికేవాడు సరైన దారిలో వెళుతున్నవాడు.” కృష్ణ చైతన్య వివరణ
“రామాయణం, భారతాల్లో ప్రధాన భేదం ఏమిటి?”
“రామాయణంలో అంతా క్షమే! భారతంలో అంతా పగే!”
“తిరుపతి లడ్డు తినడం, హనుమాన్‌కు వడమాలలు వెయ్యడం భక్తికి నిదర్శనాలే కదా?” కుచేల చైతన్య ప్రశ్న.
“హనుమాన్ వడమాలలు కావాలని ఎవర్నైనా అడిగాడా? వెంకటేశ్వరుడు లడ్డులు తినడమే భక్తి అని ఎక్కడైనా, ఎవరికైనా చెప్పాడా? వడలు, లడ్డులు ఇష్టమైనవారు వాటిని ఆ దేవునికి అంటగడుతున్నారు. అవునా?” అడిగాడు రామ చైతన్య
“మరి.. ఆ పరమాత్మ ఉండి ప్రయోజనం?” కుచేల.
“తెలివైన వాడి జీవితాన్ని, తెలిసున్న వాడి జీవితాన్ని, తెలివితక్కువ వాడి జీవితాన్నీ కూడా నడిపించేది ఆ పరమాత్మయే.” కృష్ణ చైతన్య జవాబు
కబుర్లలో పడి నడక లోని అలసటను మర్చిపోయారు!
‘సూర్ కండ్’ దేవి ఆలయం వరకూ వచ్చేసారు. అక్కడికి కొద్ది దూరం లోఉన్న ‘నీర్ గర్’ వాటర్ ఫాల్స్ చేసే గలగలలు వినిపిస్తున్నాయి. కాళ్ళు చేతులూ కడుక్కొని దేవతా మూర్తిని దర్శించుకున్నారు. అక్కడి నుండి సుమారు 200 మీటర్ల లోతున్న లోయలోకి దిగి ‘నీర్ గర్’ జలపాతాన్ని ఎలా దాటాలా అని పరిశీలన మొదలెట్టారు. ఒక్కటే మార్గం కనిపించింది. అదే ఈత! రామ చైతన్యకు, కృష్ణ చైతన్యకూ ఈత వచ్చు. కానీ.. కుచేల చైతన్యకు ఈత రాదు. ఆ ప్రవాహ వేగాన్ని చూడగానే చెమటలు పట్టేస్తున్నాయతనికి. మంత్రాలు వల్లించడం మొదలెట్టాడు.
“నువ్వు నోరు మూసుకోరా కుచేలా! ప్రతీ సమస్యకూ మంత్రాలు పరిష్కారం కాదు. నీ మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు! ‘యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా, శాస్త్రం తస్య కరోతి కిం?! లోచనాభ్యాం విహీనస్య దర్పణ: కిం కరిష్యతి?’!!” అన్నాడు శ్రీకృష్ణ చిరాగ్గా.
“ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై:! నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా:!! మరి.. ఏమి చేద్దాం?” అడిగాడు శ్రీరామ.
“నాకైతే ఒకే మార్గం కనిపిస్తుంది.” శ్రీకృష్ణ
“ఏంటి అది?” ఇద్దరూ అడిగారు ఆత్రుతగా.
“ఆ కనిపించే మర్రి చెట్టు ఊడ తీసుకొని, దాని చివర మన కుచేలను కట్టేద్దాము. దాని మొదలు మన ఇద్దరం పట్టుకొని ఈదుకొంటూ, చివర్లో మునుగుతూ -తేలుతూ వాడు, అవతలి గట్టుకు వెళ్ళిపోదాము! పది నిముషాల్లో ఆవలి తీరంలో ఉంటాము. ఏమంటారు?” అన్నాడు శ్రీకృష్ణ.
అదే మంచి మార్గం అనుకొన్నాడు శ్రీరామ చైతన్య
“వేరే దారేది లేదా?” అడిగాడు కుచేల ఆశగా.
“లేకేం వుంది. కానీ..” నాన్చాడు శ్రీకృష్ణ.
“ఏంటది?” ఆత్రుతగా అడిగాడు కుచేల
“అటు చూడు! జలపాతానికి ఉత్తరం వైపు పెద్ద పర్వతం కనిపిస్తుంది. దాని శిఖరం మీది కెక్కి అవతలి వైపుకు దిగిపోవడమే! కానీ.. కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. ఇంకో నాలుగు కిలోమీటర్ల దూరంలో పట్నా వాటర్ ఫాల్స్ వస్తాయి. వాటిని కూడా అదే విధంగా దాటాలంటే మన ప్రయాణం గంటల్లోంచి రోజుల్లోకి మారుతుంది. పైగా రాత్రి ఈ అడవిలోనే గడపాలంటే ఏ క్రూరమృగాల బారినో పడాల్సి రావొచ్చు! అందుకని మనం ఈదుకొని జలపాతాల్ని దాటేస్తే చీకటి పడకుండా నీలకంఠ మహాదేవుని సన్నిధి చేరుకోవచ్చు. ఆలోచించండి!” చెప్పాడు శ్రీ కృష్ణ చైతన్య.
“అలాగే చేద్దాం.” అన్నాడు శ్రీరామ చైతన్య.
ఆంజనేయ దండకం మొదలెట్టాడు శ్రీకుచేల చైతన్య.
మర్రి ఊడ ఒక చివర కుచేల నడుముకు గట్టిగా కట్టేసారు. ఒక చివర ఇద్దరూ పట్టుకొని జలపాతంలో దిగిపోయారు. కుచేల పెడ బొబ్బలు, దండకాల మధ్య పది నిముషాల్లోపే జలపాతం ఆవలి ఒడ్డున వున్నారు ముగ్గురూ క్షేమంగా! అరగంట సేపు బట్టలు ఆరబెట్టుకొని నడక ప్రారంభించారు పాట్నా వాటర్ ఫాల్స్ వైపు.
“అసలు భయం అనేది ఎందుకు వేస్తుంది?” కుచేల ప్రశ్న.
“ఏ మనసులో కోరిక, లోభం, క్రోధం ఉంటాయో అక్కడే భయం పుడుతుంది. కామన వున్న అంతరంగంలో ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణ పేరే భయం! మనసు దేనిని చూసి భయపడినా అది భయం కాదు! నీ మనస్సు నీ అధీనంలో ఉండాలి. నీవు నీ మనసు యొక్క అధీనంలో ఉండరాదు!” చెప్పాడు శ్రీరామ.
“శరణు కోరితే దేవుడు రక్షించడా?” కుచేల ప్రశ్న
“మొదట నీ మీద నీకు విశ్వాసం ఉందో లేదో ప్రశ్నించుకోవాలి. తనపై తనకు విశ్వాసం కలవాడు మాత్రమే దేవుణ్ణి నమ్మగలడు. ఆ నమ్మకమే దేవుడు.”
వాళ్లు అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ఒక చోట దారికడ్డంగా పడుకొన్న కొండచిలువ కనిపించింది. మరోచోట వాగులో నీళ్లు తాగుతున్న ఏనుగుల గుంపు కనిపించింది. వివిధ రకాల పక్షులు కనిపించాయి.
“ఒక క్రూర జంతువు కూడా కనిపించ లేదేమి?” కుచేల.
“ఏమీ మళ్ళీ మంత్రాలు మొదలు పెడతావా?” వేళాకోళం ఆడారు ఇద్దరూ.
అలా మాటల్లోనే రెండు గంటల్లో పాట్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసారు. పరిశీలించారు. వాటర్ ఫాల్స్ పెద్దదే కానీ దాటాల్సిన వాగు ప్రశాంతంగా వుంది. చాలా సులభంగా దాటేశారు. ఆవలి తీరంలో ‘కాలీ కంబలివాలా’ సత్రం వుంది. సిబ్బంది ఎవరూ లేరు. యాత్రికులు విశ్రాంతి తీసుకొనే విధంగా వుంది. అక్కడ ఆ ముగ్గురూ కూర్చుని కూడా తెచ్చుకున్న ఆహారాన్ని భుజించారు. ఒక గంట సేపు సేద తీరిన తర్వాత పరిసరాలు పరిశీలించడం మొదలెట్టారు. పక్కనే వున్న పొదలో పాడైపోయిన వినాయకుని విగ్రహం కనిపించింది. ఆ ముగ్గురినీ ఆకర్షించింది. పెద్ద బొజ్జ! నాభి ప్రదేశంలో ఒక రంధ్రం! ముగ్గురిలోనూ కతూహలం! వినాయకుని విగ్రహంలో ఏదైనా నిధి ఉండవచ్చేమో అనే ఊహ!!
శ్రీరామ చైతన్య విగ్రహాన్ని సమీపించి తన చూపుడు వేలు ఆ నాభి ప్రదేశంలో వున్న రంధ్రంలో పెట్టాడు. ఆ వేలుని కుట్టింది ఒక భయంకరమైన తేలు. భయంకరమైన మంట, బాధ! కానీ కళ్ళ లోని నీరు బలవంతంగా ఆపుకొని, ఒక ఆహ్లాదకరమైన సుగంధం ఆ వేలికి అంటుకున్నట్టు.. ఆ వేలిని ముక్కు దగ్గర పెట్టుకొని ఆఘ్రాణిస్తున్నట్టు నటిస్తూ “ఇంతటి సుగంధ పరిమళాన్ని ఇంతకు ముందెప్పుడూ వాసన చూడలేదు.” అన్నాడు లోపలి బాధ పైకి వ్యక్తపరచకుండా ఆనందాన్ని అభినయిస్తూ!
వెంటనే శ్రీకృష్ణ చైతన్య తాను కూడా ఆ సుగంధాన్ని అనుభవం లోకి తెచ్చుకోవాలని తన చూపుడు వేలు ఆ రంధ్రంలో పెట్టగానే అదే అనుభవం! అదే నటన! రామ చైతన్య వైపు చూసి ఒక వెకిలి నవ్వు నవ్వాడు ఏడవలేక!
అలాంటి గొప్ప మధురమైన అనుభవాన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్‌లో ఉన్న శ్రీ కుచేల చైతన్య కూడా వాళ్ళు చేసినట్టే చేసి అదే అనుభవాన్ని తన సొంతం చేసుకున్నాడు!
వారు ముగ్గురూ చేస్తున్న నటనకు నంది అవార్డులు, ఆస్కారు అవార్డులు కూడా చిన్నవే అవుతాయి!!
ఆ బాధను అనుభవిస్తూ, నటిస్తూ నీలకంఠం మహాదేవుని సన్నిధి వైపు నడక ప్రారంభించారు ఆ సంసారం కాటేసిన ఆముగ్గురు నైష్ఠిక బ్రహ్మచారులు!!!
నామ రూప, దేశ, కాల బుద్ధులను విడిచి పెట్టనంత కాలం వారిని తేలు (సంసారం) కుడుతూనే ఉంటుంది. వారలా నటిస్తూనే వుంటారు తేలుకుట్టిన దొంగల్లా!!!
స్వస్తి