[బాలబాలికల కోసం ‘పంచ భక్ష్యాల భోజనం’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.]
చందనపురి రాజు గుణకీర్తి తన మంత్రి సుబుధ్ధితో కలసి మారువేషాలలో నగర పర్యటన చేస్తూ పూటకూళ్ళ ఇంటిలో భోజనం చేసి అక్కడ ఎదురుగా ఉన్న పెద్ద వేపచెట్టు అరుగు నీడన విశ్రాంతి తీసుకోసాగాడు. అక్కడే ఉన్న ముగ్గురు పండితులలో ఒకరు “బాటసారులూ, పూటకూళ్ళమ్మ భోజనం ఎలా ఉంది?” అని అడిగాడు.
“బ్రతకడానికి ఆహరం కాని ఆహరం కొరకు బ్రతకలేము కదా” అన్నాడు మారువేషం లోని మంత్రి సుబుధ్ధి.
“అంతేగా, మనమేమైనా మహారాజులమా, నవకాయకూరలతో, పిండివంటలతో పంచభక్ష్యాలతో తినడానికి” అన్నాడు పండితుడు.
“ఏమిటి రాజుగారి భోజనం అంత బాగుంటుందా?” అన్నాడు మారువేషంలోని రాజు.
“ఓ బాటసారి, రాజుగారికి పనేముంటుంది తిని నిద్రపోవడం తప్ప. రాజభోజనం షడ్రసోపేత భోజనం. అంటే ఏమిటో తెలుసా? సంస్కృతంలో ‘రస’మే మన ‘రుచి’. రుచుల గురించి చరక సంహితలో యే యే మునులు ఏమేమి అన్నారో ఒక వివరణ ఉంది. అందులో ఒకటి నుంచి ఎనిమిది దాకా సంఖ్య కనపడుతుంది. అసలు రుచులు అనేకం అని ఇంకో వివరణ ఉంది. చివరగా అత్రేయ పునర్వసు ఆరే రుచులని తేల్చాడు. ఇవే ఈనాడు మనం చెప్పుకుంటున్న ఆయుర్వేద షడ్ రుచులు. షడ్ = ఆరు. రసం=రుచి. కాబట్టి ఆరు రుచులు షడ్ రుచులు. అర్ధం అయింది కదా.
ఇవి వరుసగా మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), తిక్తం (చేదు), కటు (కారం), కషాయం (వగరు). ఇహ పంచ భక్ష్యాలు అంటే ఏమిటో తెలుసా?మనిషి తినగలిగిన, త్రాగగలిగిన పలు పదార్థాలను ఐదుగా పెద్దలు నిర్ణయించారు. వాటిని పంచ భక్ష్యాలు అంటారు. వాటిని కలిపితే మనం తినే పూర్తి స్థాయి భోజనం అవుతుంది. మనం తినే ఆహారం సమీకృతంగా, జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగం ఇది.
పంచ భక్ష్యాలు అనేవి ఇవి, భక్ష్యము = కొరికి తినేవి (పూర్ణాలు, పండ్లు, గారె, అప్పము వంటివి), భోజ్యము = నమిలి తినేవి (అన్నం, పులిహోర, దధ్యోదనం వంటివి), చోష్యము = పీల్చుకునేది/జుర్రుకునేది (పాయసం, రసం, పప్పుచారు వంటివి), లేహ్యము = నాక్కుంటూ తినదగినది (తేనె, బెల్లం పాకం లాంటివి), పానీయము = త్రాగేది (నీళ్ళు, కషాయం, పళ్ల రసం వంటివి). ఈ ఐదు రకాల ఆహారాలను రోజూ తీసుకోలేము. కానీ పండగల సందర్భాలలలో వీటన్నింటినీ తీసుకొంటారు. కనుక వీటిని పంచభక్ష్యాలు అంటారు” అన్నాడు పండితుడు.
వారి చిరునామా, పేర్లు తెలుసుకున్న మంత్రి, రెండు రోజుల అనంతరం వారిని రాజభోజనానికి ఆహ్వానం పంపాడు. రాజభవనం చేరిన పండితులను భోజనశాలకు తీసుకువెళ్ళారు. అరటి ఆకుల్లో వడ్డించబడిన పలు పదార్థాలతో భోజనం ప్రారంభించబోయారు. ఇంతలో పరుగు పరుగున వచ్చిన రాజభటుడు “ఆగండి పండితులు, కత్తిరించబడిన రాజుగారి తలవెంట్రుకలు గాలి తోలడంతో వంటగదిలో ఉన్న పదార్థాల పైన విరజిమ్మపడ్డాయి. మీ భోజనంలో వెంట్రుకలేమైనా వస్తే తీసివేసి భోజనం చేయండి” అని చెప్పి భటుడు వెళ్ళిపోయాడు.
పండితులకు వెంట్రుకలు పడిన భోజనం సహించక సంభావన కొరకు రాజ దర్శనం చేసుకున్నారు.
“పండితులూ, రాజభోజనం బాగుందా?” అన్నాడు మంత్రి. ఏమని సమాధానం చెప్పాలో తెలియని పండితులు మౌనం వహించారు.
“తలవెంట్రుకలతో మీకు భోజనం ఎలా సహించలేదో, రాజుగారికి కూడా పలు రాచకార్యాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రజల పలు సమస్యలు, శత్రురాజులను ఎదుర్కుకొనడాని పలు వ్యూహాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేయడంతో రేయింబవళ్ళు విశ్రాంతి లేకుండా శ్రమించడం వంటివాటితో మానసిక ఒత్తిడికి లోనై భోజనం సహించదు. ప్రతివారికి వారి స్ధాయికి తగిన పనుల ఒత్తిడి ఉంటుందని తెలుసుకోండి. ఈ వెంట్రుకల కథ నేనే ఏర్పాటు చేయించాను. వంటగది వద్దకు తలవెంట్రుకలు ఎందుకు వస్తాయని ఆలోచించలేక పోయారు. వెళ్ళండి ఆకులు మార్చించి మరలా భోజనం వడ్డించారు” అన్నాడు మంత్రి. సంతోషంగా భోజనానికి వెళ్ళారు పండితులు.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.