[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]
ఆరోజు కళాశాల వార్షికోత్సవం. ఉదయం నుండి సందడే సందడి. పిల్లలంతా పెద్దవాళ్లు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పిల్లలు ఉన్నరు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు ఇంటర్మీడియట్ పూర్తి విద్యార్హత కలిగి ఉండటం ఈ కోర్సుకున్న నియమాలు. ఇది పూర్తి చేస్తే ఉద్యోగార్హత ఉంటుందని పిల్లలు పోటీ పడుతుంటరు. మొత్తానికి మేథోవికాసం కలిగిన విద్యార్థులు తరగతిలో ఉంటరు. పాఠం చెప్పడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళకు తర్ఫీదును ఇచ్చేవాణ్ణి. ముఖ్యంగా ఒక ఈవెంట్‌ను ఎలా నడపాలో, వాళ్ళతోచేయించి చెప్పేవాణ్ణి. చాలా మంది సంతోషంగా నేర్చుకునేవాళ్ళు. పాటలు, ప్రసంగాలు, నాటకాలు, కోలాటం ఇలా అనేక కళారూపాలు ప్రదర్శించేవారు. సంవత్సరం పొడవునా నేర్చుకున్న వాటిని ఆరోజు ప్రదర్శించాల్సిన సమయం ప్రిన్సిపాల్ గారికి కూడా ఇలాంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. అతిథి ప్రసంగాలకు ముందు పిల్లల ప్రసంగాలు మొదలయివని. మొదటి సంవత్సరం వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఫైనలియర్ పిల్లలకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ముందుగా లేడీస్ రిప్రజెంటేటివ్‌ను పిలిచారు. ఆమె వచ్చింది.
“తమ్ముళ్ళకు శుభాకాంక్షలు. ఇది మొక్కుబడి పిలుపు. ముందే చెబితే ఇంకా సంతోషించే వాళ్ళం కదా” అంటూ ఏవేవో విమర్శలు గుప్పించి దిగింది.
ఆమె మాటలు ప్రిన్సిపాల్ గారికి కోపకారణమైనవి. రెండు సంవత్సరాలు చెప్పిన విధానం అంతా ఆమె మాటల ద్వారా బ్రెజిల్ అగ్నికీలలకు ఆహుతి అయింది. వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా పేరున్న సాహితీవేత్తను పిలిచారు. ప్రసంగాలు అయినవి. బహుమతి ప్రధానాలు అయినవి.
స్టేజీ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మొదటగా ప్రార్థన మొదలయింది. ఎజెండాలో అంశాలను మరొకసారి చూడాలనిపించి చూసిన ఒగ్గుకథ, ఎరుకల సోది, బతుకమ్మ ఆట, నాటకం, యక్షగానం,కీర్తనలు, జానపదపాట, సినిమా పాట, మిమిక్రీ, ఏక పాత్రాభినయం, మూకాభినయం, చిరుతల రామాయణం ఇలా చాలా అంశాలున్నాయి. క్రమశిక్షణతో సాగకపోతే అర్థరాత్రి అవచ్చు అనిపించింది.అది అవాంఛనీయ పరిణామం అవుతుంది. కళాశాల పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇంటికి వెళ్ళడం కష్టం అవుతుందనిపించింది. ఎలాగైనా దీన్ని త్వరగా ముగించాలనుకొని వ్యాఖ్యానం చేసేవాళ్ళను కఠినంగా హెచ్చరించిన. మీరు ప్రతీ సన్నివేశానికి వ్యాఖ్య జతచేయకూడదని చెప్పిన. ప్రదర్శన ఇచ్చేవాళ్ళు వచ్చి స్టేజీ వద్ద నిలబడాలని సూచించిన. మామూలు కళాశాల వార్షికోత్సవానికి, ఈ ట్రైనింగ్ కళాశాలకు తేడా ఉంటుందని సంవత్సరం పొడవునా చెప్పడం వల్ల కార్యక్రమం ఎజెండా భిన్నంగా కుదిరింది. చాలా కళారూపాలకు చోటు దొరికింది. కార్యక్రమం ఫాస్ట్.. ఫాస్ట్..గా సాగుతుంది. వడివడిగా వస్తుపోతున్నరు. చప్పట్లు మోగుతున్నని. అన్నిటినీ చూస్తు ఆనందం అనుభవిస్తున్న.
“ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టు మీ ముందుకు వస్తున్నడు” అనౌన్స్ వినబడింది. నా గొంతులో పచ్చి వెలక్కాయపడింది. ఈ స్టూడెంట్ తెలివిగలవాడు. అట్లాగే మంచి క్రిటిక్ వాడు రాసుకున్న స్క్రిప్ట్ చదవాలనుకున్న కాని పని ఒత్తిడిలో చదువలేకపోయిన. ఇప్పుడు ఏం మాట్లాడుతాడో, ఎవరిని అనుకరిస్తాడో అని భయం పట్టుకుంది.
“మా హైస్కూల్ తెలుగుసార్ చాలా బాగా చెప్పేవాడు. అందరి క్లాస్‌లో అల్లరి జరిగినట్లే సార్ క్లాస్‌లోను జరిగేది. అది తట్టుకోలేక పోయేవాడు. మమ్మల్ని తిడుతూ, కొడుతూ చదివిస్తూ, రాయిస్తూ, రకరకాల పద్దతులతో పాఠం చెప్పేవాడు. ఆయన క్లాస్ ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ప్రదర్శిస్తున్న సార్ గొంతును పిల్లల గొంతును అనుకరిస్తున్న” అంటు ప్రదర్శన మొదలు పెట్టిండు.
సార్ క్లాసులోకి రాగానే స్టాండ్ సిట్ అని నాలుగుసార్లు చేయించేవాడు. కొందరు కూర్చుంటే మరి కొందరు నిలుచునేవారు. కూర్చునే వాణ్ణి చూసి.
“ఓరేయ్ నన్ను చూస్తూ బయట గద్దెల మీద కూర్చుంటివి. కనీసం క్లాసులోనైనా లేచి నిలబడాలనే సోయి లేదురా వెధవా” అనేవాడు.
“నిన్న పాఠం ఎంతవరకు అయింది” అడిగేవాడు. సమాధానం ఉండకపోయేది.
“పేజీ నెం. 83 చదువు అందరు వినండి”
“సార్. ఇయ్యాల పాఠం ఏం చెబుతరు. రేపు చెప్పండి.” మధ్యలో నుండి ఒక గొంతు.
“ఇవ్వాళ ఏం చేస్తర్రా. ఆడోళ్ళు, మొగోళ్ళు మొకాలు చూసుకుంటూ కూసుంటరా. బుద్దిలేదు ఇంత కూడా. నువ్వు చదువురా” అంటూ విసుక్కునేవారు.
“చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ”
“అయ్యో! అప్పుడే పద్యం మొత్తం అయిపోయిందా”
“మీరు అటుపోయేసరికి రెండు పాదాలు మింగింది సార్”
“చివరి బేంచివాడు గుట్కా నములుతున్నడని పోతే, నువ్విక్కడ పద్యం మింగితివి ఖర్మ”
“మీరు జవాబు చెప్పుండ్రి సార్”
“జవాబు అనకూడదు. పద్యతాత్పర్యం చెప్పండి అనాలి”
“ఏదో ఒకటి సార్. చెప్పుడైతే చెప్పండి”
ప్రహ్లాదుడు, హిరణ్య కశ్యపుని కథ మొత్తం చెప్పిండు. అంతా విన్నాక ఒక విద్యార్థి లేచి “ఎక్కడన్నా తండ్రి, కొడుకుకు విషమిస్తడా, ఏనుగుల తోటి తొక్కిస్తడా సార్” అని అడిగిండు.
“ఓరేయ్ మీరు ప్రతి రోజు వాడుకునే ఫ్యాన్లు వంచితిరి, డెస్క్‌లు పగలకొడితిరి నల్లాలు విరగగొడితిరి, కరెంట్ బుగ్గలు మాయం చేస్తిరి. వైర్లు కోసేస్తిరి, బ్లాక్ బోర్డు పైన గుట్కా నమిలి ఉమ్మి వేస్తిరి, ఒకడైతే ఏకంగా కిటికీ పగులగొట్టీ దాంట్ల నుండి బయటకు, లోపలికి రాకపోకలు సాగించే. బడి ఆస్తి అందరిది. మీరు దాన్ని ధ్వంసం చేయగా లేంది కన్నకొడుకును వాడు ఏమైనా చేసుకుంటడు మీకంటే వాడు నయం” అని అన్నాడు.
ప్రదర్శన చూస్తుంటే గతం కళ్ళముందు కదలాడింది. హైస్కూల్‌లో పడ్డపాట్లు గుర్తుకొచ్చినయి. “సార్ రేపటినుండి పదిరోజులు నేను బడికి రాను. ఊరికి పోతున్నం. ఇవ్వాళ పరీక్ష రాయమంటే రాస్త” అని అడిగిన పిల్లవాడు యాదికొచ్చిండు. నేటి పరీక్షా విధానం గురుశిష్యుల మధ్య తెచ్చిన మార్పు ఇది. ఒకడు ‘ఇత్తనపు కోడె’ తీరుగా ప్రవర్తించేవాడు. ఆడపిల్లలు, మగ పిల్లలు క్లాసురూంలోనే కబడ్డీ ఆడిన సంఘటన మరిచిపోలేనిది. పిల్లల గడుసుదనం, భరించలేక స్టాఫ్ ఈసడించుకునేవారు. అసహ్యకరమైన ర్యాగింగ్ భరించలేనిదిగా ఉండేది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉన్న సున్నితమైన బంధం తెగిపోయింది. ఆరవ తరగతి అమ్మాయి వెనుక ఐదవ తరగతి అబ్బాయి పడి వేధించడం, ఐలవ్‌యూ చెప్పడం, పెద్ద పిల్లలు గోడల మీద రాతలు రాయడం, జీర్ణం అయ్యేది కాదు. పిల్లలకు ఉపాధ్యాయులకు మధ్య అలవాట్లలోనూ, ఆలోచనల్లోనూ, వ్యవహారంలోనూ, మాటల్లోనూ పూరింపలేని వ్యత్యాసం ఉండేది. దానివల్లే విద్యార్థులంటే విసుగు అందరిలో కనిపించేది. ఇహ వాళ్ళకు చెప్పడం ఎట్లా? ఉద్యోగం భారంగా మారడానికి ఇదొక కారణం అనిపించేది. భరించలేని, వినలేని బూతులను సరదాగా, నోటి తీట తీర్చుకోవడానికన్నట్లుగా అనుకునేవారు. వాయు, శబ్ద కాలుష్యం వ్యాపించేది. ఆ రోజుల్లో పక్క పాఠశాలలో ఉపాధ్యాయుణ్ణి, విద్యార్థి కొట్టిన సంఘటన సంచలనం కలిగించింది.
చప్పట్లు వినిపించినయి. వర్తమానంలోకి వచ్చిన. ప్రదర్శన ఇచ్చిన వాడు నా ముందు నుండే వెళుతుంటే “శభాష్” అని పిలిచిన.
“థాంక్యూ సార్. మీరు నేర్పిందే కదా” అనుకుంటూ వెళ్ళిండు.
అనుకున్న ప్రదర్శనలు నిర్దేశించిన సమయానికి అయినవి. ఉత్సాహవంతులు కొందరు పాటలు పాడుతమని, మరొకటేదో చేస్తమని వచ్చారు. “సాద్యం కాదు” అని చెప్పిన. అయినా వినలేదు. “వందన సమర్పణ చేయండి. మేం అందరం వెళుతం తర్వాత మీరేమైనా చేసుకోండి” అని లేచి వచ్చిన. వందన సమర్పణ జరిగింది. కార్యక్రమం ముగిసింది.
ఉత్సాహభరితంగా కాలం గడుస్తుంది. పదోన్నతిపై రెగ్యులర్‌గా ఇక్కడే బోధన చేయాల్సిన పరిస్థితికి బదులుగా డెప్యూటేషన్‌పై పనిచేయాల్సి రావడం ఇబ్బందికరంగా ఉండేది. ఇదిలా సాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. బదిలీకి దరఖాస్తు చేశాను. వారం పదిహేను రోజుల తరువాత ట్రాన్స్‌ఫర్ లిస్టులు పెట్టారు. హుజూరాబాద్ నుండి కరీంనగర్‌కు వచ్చే అవకాశం కనిపించింది. అంది కొంత ఊరట నిచ్చింది. బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించారు. ఈ విధానంలో కూడా రాజకీయాలు చోటు చేసుకొన్నాయి. వాటన్నిటిని అధిగమించాను. కరీంనగర్ పట్టణంలో అత్యంత సమస్యాత్మక పాఠశాల కార్ఖానగడ్డ బడి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ బడిని వదిలి వేరే బడికి వెళ్ళడం ఆనవాయితీ. నాకు ఇక అవకాశం లేదని తెలిసి ఆ పాఠశాలను కోరుకున్నాను. బడిలో కొత్తగా చేరాను. అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరిసరాలు, బడి ప్రదేశము, అన్ని సమస్యాత్మకాలే. ఏ మాత్రం వసతులు లేని బడి అది. కరీంనగర్ దాటి బయటకు వెళ్ళడానికి ఇష్టపడని వారు మాత్రమే ఆ బడిని కోరుకుంటారు. అందులో చేరి కూడా డైట్‌లో డిప్యూటేషన్‌పై పనిచేసే వీలు ఉంది. వ్యక్తిగతంగా అది నాకు నష్టమే కాని ఇష్టమైన పని. డైట్ కళాశాలలో పనిచేయడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొన్నాను. కొంత వరకు విజయం సాధించాను. ఎప్పటి కైనా పాఠశాలకు రావడమే సమంజసమని తలచి బడిలోకి వచ్చి చేరాను. ఇక్కడి పని పరిస్థితులు, ప్రదేశ ప్రభావాల వల్ల క్రమ క్రమంగా నాలో బోధనేచ్ఛ సన్నగిల్లింది. పిల్లలకు, పంతుళ్ళకు మధ్య చెప్పలేనంత ఎడం కనిపించింది. సర్దుబాటు చేసుకునేవాళ్ళు హాయిగా కాలం గడిపారు. సర్ధుబాటు కాలేని వారు బాధగ కాలం గడిపారు. ఇద్దరి వల్లకూడా బోధన నామమాత్రంగానే జరిగేది.
టీచర్ ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితి, కుటుంబ స్థాయి, వ్యక్తిగత హోదా, ఇవన్ని కూడా విద్యార్థుల స్థాయికి మించి ఉండటం సహజం. ఆ మేరకు టీచర్లు తమను తాము తగ్గించుకొని బోధన చేయడం తప్పదు. అలా బోధించే సమయాన విద్యార్థి ఆసక్తిగా విషయాన్ని అందుకోవాలనే తపన కలిగి ఉండాలి. కుటుంబ, పరిసర, ప్రభావాలు విద్యార్థుల ఆసక్తులను నిర్దేశిస్తాయి. చాలా వరకు ప్రభుత్వ బడి విద్యార్థుల ఆసక్తులు చదువులపై ఉండటం లేదు. దానికి కారణం వారి ఆర్థిక మరియు ఇతరత్రా విషయాలు, పరిసరాలు వారిని అరాచకత వైపు మళ్ళిస్తున్నాయి. దాని వల్లనే తరగతి గదిలో వారుక్రమశిక్షణగా ఉండలేకపోతున్నారు. క్రమశిక్షణారాహిత్యము బోధన పై ప్రభావం చూపుతుంది. ఒక స్థాయి వరకు పిల్లల అల్లరి భరించవచ్చు. దాన్ని దాటిన విశృంఖలత తరగతి గదిలో రాజ్యమేలుతున్నందున టీచర్లకు బోధనపై విముఖత కలుగుతుంది. వినయవిధేయతల స్థానంలో బూతు, అశ్లీల మాటలు, చేష్టలు సాగుతున్నవి. ఇకరిద్దరు కాదు మెజారిటీ విద్యార్థులు ఈ బాటలో నడుస్తున్నందున బడిలో విద్యార్జన తక్కువ అయింది. టీచర్లకు స్టూడెంట్స్‌కు మధ్య తరగని ఖాళీ ఏర్పడింది. విద్యార్థుల మాటలు వినలేని స్థితి టీచర్లు, ఉపాధ్యాయులు చెప్పే బోధనలను వినలేని స్థితిలోకి స్టూడెంట్స్ నెట్టబడ్డారు. ఈ స్థితి అన్ని ప్రభుత్వ బడులల్లో ఉది. కార్ఖానగడ్డ పాఠశాలలో ఎక్కువ మోతాదులోఉంది. దాని వల్ల మహోన్నతమైన బోధనేచ్ఛ అడుగంటింది. మరబొమ్మలా బడికి వెళ్ళడం రావడం జరిగింది. జీవశ్చవంలా బడి బతుకు సాగింది. తాత్కాలికంగా ఆ స్థితి మారాలంటే కొత్త బడికి వెళ్లక తప్పదు. బదిలీ, పదోన్నతి అందుకు మార్గాలు. రెంటికి అర్హత కలిగి ఉన్నా అవి అందని ద్రాక్షలుగానే ఉన్నవి. ప్రభుత్వ, ఉపాధ్యాయ వర్గాలు అందుకుకారణాలుగా నిలుస్తున్నవి. కోర్టు కేసులు, ప్రభుత్వ ఉత్తర్వులు, ఉపాధ్యాయుల ఆందోళనలు, నాయకుల రాజకీయాలు అన్ని కలిసి పదోన్నతులను అందని ద్రాక్ష చేసాయి. పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేసిన వారు కోకొల్లలు.
జూన్ నెల, వేసవి సెలవులు పూర్తి అయి బడి తెరుచుకుంది. ఉపాధ్యాయులు అందరు వచ్చారు. పిల్లలు కొందరు వచ్చారు. బడి పుంజుకునే రోజులు. ఆయారాం, గయారాం అన్నట్లే ఉంది పరిస్థితి. మెల్లమెల్లగా బాల్యావస్థను దాటి బడి, గాడిన పడుతుంది. పిల్లలకు సమస్త సౌకర్యాలు చేకూర్చుతూ తల్లిదండ్రులు, సౌకర్యాల లేమితో బడులు కొట్టుమిట్టాడుతున్నయి. పుస్తకాల కొరతను తీర్చాలని, నీరు సమకూర్చాలని, బడులలో అసౌకర్యాలను పూరించాలని విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టినయి. సంఘాలన్ని ఏకతాటి పైకి వచ్చి నిరసన తెలుపాల్సింది పోయి, విడివిడిగా బంద్‌లకు పిలుపునిచ్చాయి. ఆయా సంఘాల అస్తిత్వ ప్రదర్శనకు ఇవన్నీ తోడ్పడ్డయి. అలాంటి రోజుల్లో ఒకరోజు బంద్ పుణ్యమా అని టీచర్స్ అందరు పనిలేక ఊరకనే కూర్చున్నరు. బంద్ వల్ల విద్యార్థులు బడి బయట పడ్డారు. స్టాఫ్ రూంలో రకరకాల మాటలు విన పడుతున్నయి. బంద్‌ను సమర్థిస్తూ కొందరు.వ్యతిరేకిస్తూ కొందరు వాదించు కుంటున్నరు.
దేశం నాకేమిచ్చింది? అనే కంటే దేశానికి నేనేమిచ్చిన అనేప్రశ్నను తెలిపిన ఇంద్రారెడ్డి సార్ మాట గుర్తుకొచ్చింది. జీవితంలో అనేక మంది సార్లు తారసపడ్డరు. బోధనలో సార్‌ను మించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరు యాదికి రారు. కారణమేమిటి? కరికులంను దాటి బతుకు వలయంలోకి వెళ్ళి చెప్పడం సార్ ప్రత్యేకత. పాఠ్య బోధనకు, బతుకు పాఠాలను ఉదాహరణగా తీసుకోవడం సార్ సమర్థత. బోధించినట్లు బతకడం వారి కార్యశీలత. బతుకుబడిలో తారసిల్లే గుణపాఠాలు, అనుభవాలు, వాస్తవాల్ని బ్లాక్ అండ్ వైట్‌లో చూపెడుతయి. సామాజిక బాధ్యత వహించేలా తీర్చిదిద్దుతయి. మనకు తెలియకుండానే ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణాన్ని ఆవిష్కకరిస్తయి.
“ఇవ్వడం ఇష్టం లేనప్పుడు తీసుకోవడం తప్పు” భట్టుసార్ మాట
“చెట్టుకు ఆకులు మొలచి, పెరిగి, పండి, రాలినట్లు, మనిషి కూడా అలా రాలిపోవాలి” తురకసార్ బాట.
ఇవన్నీ విద్యార్థులకు చెప్పాలనిపిస్తది. విశృంఖలాయుత స్వేచ్ఛను అనుభవించే విద్యార్థులు నాలుగు గోడల మధ్యజరిగే తరగతి బోధనను, కేవలం సర్టిఫికెట్ కోర్సుగానే భావిస్తున్నరు. ఆకర్షణీయమైన రంగుల ప్రపంచాన్ని నిత్యం కళ్ళ ముందుంచే మీడియా తలకిందుల విలువల్ని బోధిస్తున్నది. దాన్ని తలకెక్కించుకున్న విద్యార్థిలోకాన్ని తరగతిగది ఆకర్షించలేకపోతుంది. బోధన, అభ్యసన, మూల్యాంకన అనే మూడు విభాగాలు మార్పులకు లోనైనవి. మార్పు విద్యార్థులకు వెసులుబాటును అందించింది. ఇంకా అనేక కారణాల వల్ల తరగతి గది తన ప్రభావశీలతను తగ్గించుకొంది.
“రామారావు సార్ చనిపోయిండట”
“అవునా ఎట్లా?”
“కరోనాతో కాలం చేసిండు”
“కరోనాతో సహజీవనం చేయ్యాలి కదా”
“జోకులొద్దు”
“ఆయన బతుకే జోక్ అయింది”
“ఎట్లా?”
“ముప్పై సంవత్సరాల సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్ అయినా రాకపాయే అని బాధపడేవాడు. పదవీవిరమణ దగ్గరపడింది. ఇక ఈ జీవికి ప్రమోషన్ రాదనుకున్నడు. అందుకు భిన్నంగా పదవీ విరమణ వయసు పెరిగింది. కాని కరోనా మింగింది. దేనికీ నోచుకోలేదు.”
“ఆయన తోటి వారికైనా ప్రమోషన్ వస్తది కదా. పాజిటివ్‌గా ఆలోచించాలి”
“ఇప్పుడు పాజిటివే కొంపముంచింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ కరోనా కంటే భయంకరంగా పరిణమించినవి.”
“రెమిడిసివర్ వాడదాం. వాక్సిన్ వేద్దాం. దాని దుంప తెంచుదాం. ప్రమోషన్ సాదిద్దాం.”
స్టాఫ్ రూంలో రకరకాల మాటలు, వ్యాఖ్యానాలు వినిపించాయి. భౌతిక వాస్తవికత, ప్రభుత్వ నిర్ణయం, వ్యక్తుల మానసిక, కౌటుంబిక జీవితాల్ని ఎంతమేరకు ప్రభావితం చేస్తయో, చెప్పడానికి స్టాఫ్‌రూం సాక్ష్యంగా పనిచేస్తుందనిపించింది.
కరోన
ప్రయాణాలు, వ్యాపారాలు, జీవనాధారాలు, స్థంభించాయి. సామాజిక జీవనం కుంటుపడింది. రెండుసార్లు, కరోనా చేసిన దాడి వల్ల వ్యవస్థ కూలింది. లాక్‌డౌన్ వల్ల పనులు లేక, ఉపాధి కరువై, ఆకలితో పొట్ట చేతపట్టుకొని వలస జీవులు నడక దారి పట్టారు. భారతావని రోగగ్రస్థలా మారింది. “మేము ఇప్పటి వరకు ఇన్ని శవాలను ఎన్నడూ చూడలేదు. శవాల కుప్పల మధ్య శ్మశానంలో కాలుపెట్టలేక పోతున్నాము” అని లక్నో ముక్తిధామ్ శ్మశానవాటికలో పనిచేస్తున్న ఉద్యోగి చెప్పారు. హాస్పిటల్‌లో వదిలిన శవాలను దహనం చేయలేక, గంగానదీ ప్రవాహంలో పడవేశారు. ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఆక్సిజన్ అందక వేలాదిమంది మరణించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్ని హైకోర్టు మొట్టికాయలు వేసింది. “పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు మళ్ళించండి” అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. మహమ్మారి బారి నుండి కాపాడుకోవడానికి శారీరక వ్యాయామం, యోగ, ధ్యానం లాంటి వాటిపై దృష్టి పెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సమతులాహారం తీసుకోవాలి. “Rainbow Fruits, Rainbow Vegetables” తీసుకోవాలి. చేతులు శుభ్రపరుచుకోవడం, సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం, జనసమూహాల్లో, సమావేశాల్లో తిరగకుండా ఉండడం లాంటి పద్దతుల్ని పాటించాలని వైద్యులు, ప్రభుత్వం సూచించింది. భయానక కోవిడ్‌ను వ్యాక్సినేషన్ ప్రక్రియతో కొంత వరకు కట్టడి చేయవచ్చనే నమ్మకాన్ని ప్రచార, ప్రసార మాధ్యమాలు కలిగించాయి. కోవిడ్-19ను ‘మానవహారి’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 మార్చి 11న ప్రకటించింది. రెండు వారాల తరువాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. మహమ్మారి గొలుసు వ్యాప్తిని లాక్‌డౌన్ అడ్డుకుంది. కోవిడ్ దాడి చేసిన ప్రతిసారి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్య, పారిశుధ్య కార్యకర్తలతో పాటు, పోలీసు సిబ్బంది, ఆశాకార్యకర్తలు, అవిశ్రాంతంగా పనిచేశారు. శానిటైజర్లు, మాస్కులు, పిపిఈకిట్లు, చేతి గ్లౌజులు, మొదలుకొని వెంటిలేటర్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల వరకు ఉత్పత్తిలో పాల్గొన్న తయారీదారులు, శాస్త్రజ్ఞులు, ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు యుద్ద ప్రాతిపదికన పనిచేశారు. అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యాధి బారినపడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు విడిచారు.
జీవిత సుఖం కోసం ఉపయోగపడ్డ వస్తువులపై ఇష్టం, జీవితంపై అంతుమాలిన ప్రేమను పెంచింది. దాంతో సహజమైన చావు అంటే అమితమైన భయం ఏర్పడింది. కరోనా వైరస్ వల్ల ఆ భయం రెట్టింపైంది. ఆ భయమే మనలోని ఇమ్యూనిటీని తగ్గించి, వైరస్‌కు మార్గం సుగమం చేసింది. వ్యాక్సిన్ అనంతర జీవితం భద్రమైందిగా లేకపోవడం వల్ల భయం మరింత ఎక్కువైంది. ఆ భయాన్ని సృష్టించి మనిషి పై, వైరస్ పైచేయి సాధించింది. ఐసోలేషన్ లోకి వెళ్ళడం, భౌతికదూరం పాటించడం మనిషిని ఒంటరిని చేశాయి. అతిశయం, అతిలాలసలతో అమృతాహారానికి, సహజ జీవనశైలికి దూరమై గొప్పవాళ్ళమనే అహంకు దగ్గరైన మనుషులను భూమిపై నిలబెట్టింది వైరస్. వాతావరణం నిండా ముసిరిపోయిన కాలుష్యం, వైరస్ తర్వాత కొంత తగ్గింది. రోడ్డు ప్రమాదాల శాతం తగ్గింది. ఇవన్నీ చిరుఫలితాలు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని గంటల వ్యవధిలోనే వైరస్ దేశాల సరిహద్దులు దాటి ప్రయాణం చేసింది. తనను తాను విస్తరింప జేసుకుంది. దేశాలను వల్లకాడులుగా మార్చింది. నిత్యజీవితంలోని దీని ప్రభావానికి గురికాని రంగం ఏదీలేదు. ఆర్థిక, ఆరోగ్య రంగాల్ని అతలాకుతలం చేసింది. ఏ రాష్ట్రానికారాష్ట్రం స్వతంత్రంగా లాక్‌డౌన్ ప్రకటించుకున్నాయి. పొరుగు రాష్ట్ర కోవిడ్ రోగులను, పక్క రాష్ట్ర పాలకులు తమ నగరాల్లోకి రానివ్వలేదు. రాజకీయాల్ని ప్రభావితం చేసింది. విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. విద్యార్థుల్ని చదువులకు దూరం చేసింది.
మార్చ్ 2020 నుండి దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రపంచంలో దాదాపు 150 కోట్ల మంది విద్యార్థులు, విద్యాసంస్థలకు దూరమయ్యారు. ఇందులో మన విద్యార్థులు సుమారు 20 కోట్ల మంది 2019-20 విద్యాసంవత్సరపు మార్చ్ నెలలో కరోనా మూలంగా బడులు మూతపడ్డాయి. వార్షిక పరీక్షలు జరగలేదు. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకు పరీక్షలు రాయకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్ళారు. అది కరోనా మొదటి బ్యాచ్. 2020-21 విద్యాసంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేవలం 44 రోజులు మాత్రమే బడుల్లో ప్రత్యక్ష బోధన సాగింది. ఆ తరువాత యథావిధిగా పాఠశాలలు మూసివేశారు. ఆ విద్యాసంవత్సరం ప్రత్యక్షబోధన సాధ్యపడలేదు. పరోక్ష పద్దతిన ఆన్‌లైన్ తరగతులు నడిచాయి. దాని ప్రభావం అంతంత మాత్రమే. అలా విద్యకు విద్యార్థులు దూరమయ్యారు. ఈ సంవత్సరం కూడా ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకు పరీక్షలు రాయకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్ళారు. ఇది కరోనా సెకండ్ బ్యాచ్. ఒక సంవత్సరం విద్యాబోధన కుంటుపడటం మూలంగా ఒక దశాబ్ద కాలం అభ్యసనలో వెనకపడే అవకాశం ఉందని యునిసెఫ్ హెచ్చరించింది. ఆన్లైన్ మాద్యమాల ద్వారా పాఠాలు అందించేందుకు ప్రభుత్వాలు, వివిధ సంస్థలు ప్రయత్నించినప్పటికీ, విద్యార్థులకు వనరుల అందుబాటు, ఉపాధ్యాయుల అనుభవ రాహిత్యం వల్ల బోధన, అభ్యసన సక్రమంగా సాగలేదు. ఓనమాలు దిద్దని పిల్లలు సైతం పై తరగతికి ప్రమోట్ అయ్యారు. వాళ్ళలోని విద్యాసామర్థ్యాలు కొడిగట్టిపోయాయి. కరోనావేవ్ విద్యార్థుల్ని ముందుకు నెట్టింది. కే.జీ నుండి పీ.జి. వరకు విద్యార్థులు నష్టపోయారు. విద్యాప్రమాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుండి పోయాయి. మూడవ వేవ్ ముప్పు ఉందనే హెచ్చరికలు విద్యారంగాన్ని వణికించాయి. ఎలాంటి నైపుణ్యాలు లేని సర్టిఫికెట్ హోల్డర్స్ వల్ల దేశం వెనక్కిపోతుందనే భయం వెంటాడింది. డిజిటల్ మాధ్యమంలో జరిగిన బోధనలో పేద, మధ్య, ఉన్నత తరగతి విద్యార్థులకు మధ్య ఉన్న అంతరాలు ప్రస్ఫుటంగా కనిపించాయి.
కోవిడ్-19 లాంటి క్లిష్టపరిస్థితుల్లో విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా, విద్యార్థుల సమయం వృథా కాకుండా ఆన్‌లైన్ పాఠాలు ఉపయోగపడతాయని అందరూ ఆశించారు. ఆన్‌లైన్ పాఠాలు వినడానికి ఇంట్లో డిష్‌కనెక్షన్ ఉన్న టీ.వి., లేక చేతిలో స్మార్ట్‌ఫోన్ అవసరం ఏర్పడింది. చాలా మంది విద్యార్థులు చేతిలో సెల్‌ఫోన్ కోసం ఆరాటపడ్డారు. తల్లిదండ్రులను సాధించి, సెల్‌ఫోన్ చేజిక్కించుకున్నారు. పదవతరగతి పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ దురుపయోగమైంది. ఆన్‌లైన్ పాఠాలు విడిచి ఫోర్న్ పాఠాల వేటలో పడ్డారు. ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావడం లేదని సర్వత్రా విద్యార్థులు అన్నారు. సెల్‌ఫోన్ కొనివ్వలేక పోతున్నామని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్ కొనిచ్చిన పేరెంట్స్ పిల్లలు చెడుదారిపడుతున్నారని గగ్గోలు పెట్టారు. ఇంట్లో పిల్లలు, బడిలో పంతుళ్ళు, ఆన్‌లైన్‌లో పాఠాలు, ఈ మూడింటి మధ్య సయోధ్య కుదరక వ్యవస్థ అభాసుపాలైంది. ఆన్‌లైన్ పాఠాల నిర్వహణకు పెట్టిన ఖర్చు తడిసిమోపెడైంది. ఫలితం శూన్యమైంది. ఆన్‌లైన్ క్లాసుల అటెండెన్స్ నమోదు చేసిన కాగితాలు, డిజిటల్ పాఠాల వీడియోలు, కరోనా కాలంలో జరిగిన బోధనాభ్యసన ప్రక్రియలకు సాక్ష్యాలు. ప్రత్యక్ష తరగతి బోధనకు, ఆన్‌లైన్ బోధన ప్రత్యామ్నాయం ఎప్పటికి కాదు. అపరిపక్వ వయసులో విద్యార్థుల చేతికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబులు ఇవ్వడంతో చెడు అలవాట్లకు గురయ్యారు. ఆన్‌లైన్ విద్యావిధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆర్థిక భారంతో కూడుకున్నది. కనీసం 3000/- రూపాయలు పెట్టి స్మార్ట్‌ఫోన్, దానికి నెట్ బ్యాలెన్స్ కోసం మరికొంత ఖర్చు పెట్టలేని స్థితి వారిది. పల్లెటూర్లలో నెట్‌సిగ్నల్ సమస్యలు అధికం. కనుక అంతరాయం ఎక్కువగా ఉంటుంది. పట్టణ పేదలు పిల్లలకు సెల్‌ఫోన్ కొనివ్వలేరు. పెద్దలు ఇంటివద్ద ఉన్నప్పుడే పిల్లలు పాఠాలు వినడం, వారు పనులపై బయటకెళ్తే పాఠాలు అటకెక్కడం ఖాయం. వారి ఇరుకు గదుల్లో నలుగురైదురు నివసిస్తారు. ఉన్న ఒక్క టీవీలో కుటుంబసభ్యులకు సీరియల్స్ చూసే అలవాటు ఉంటుంది. ఇద్దరు ముగ్గురు విద్యార్థులున్న ఇండ్లల్లో అన్ని తరగతుల పాఠాలు వినడం ఎలా సాధ్యం? ఇవన్ని గ్రౌండ్‌రియాలిటీస్ ఇవి ఆన్‌లైన్ బోధనకు ఆటంకాలు.
విద్యారంగంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు కీలక వ్యక్తులు. కోవిడ్ కాలంలో పరీక్షల్ని రద్దు చేయడమనే చర్యకు విస్తృత మద్దతు లభించింది. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. బడికి సెలవులు కనుక, విద్యార్థులు, టీచర్లు ఇంట్లోనే ఉన్నారు. కరోనా ఫస్ట్‌వేవ్ సందర్భంలో ఇది చర్చకు దారితీసింది. అందరు అన్ని కష్టాలకోర్చి బయట విధులు నిర్వహిస్తుంటే, టీచర్లు మాత్రం “ఇంట్ల పన్నరు” అనే మాట వినవచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో 44 రోజులు ప్రత్యక్ష తరగతులు నడిచాయి. ఛెంగు ఛెంగునా వచ్చే పిల్లలు, మూతికి మాస్క్, చేతిలో శానిటైజర్‌తో వచ్చారు. విద్యార్థులపై ప్రేమతో బడి నడపలేదు. నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో టీచర్ ఓటు బ్యాంకు కోసం, స్కూల్స్ తెరిచారని పుకారు లేచింది. ఎలక్షన్స్ అయ్యాక కొద్ది రోజులకు, స్కూల్స్ మూతపడడం అనివార్యమైంది. విద్యార్థులు బడికి రావడం మానేసారు. టీచర్స్ మాత్రం బడికి హాజరయ్యారు. పిల్లలు లేని బడులల్లో పంతుళ్ళు ఏం చేస్తరు? అనే చర్చ మొదలైంది. ఎన్నాళ్ళుగానో సమస్త ఉపాధ్యాయ, ఉద్యోగ లోకం ఎదురుచూస్తున్న “ఆష్ట్ర్పు” రూపంలో జీతాలు పెరగడం, కరోనా ఫస్ట్ వేవ్‌లో ఉపాధ్యాయులపై పడిన నింద, రిటైర్‌మెంట్ వయసు పెంపుల ప్రభావం ఉపాధ్యాయుల మనసుపై పడింది. స్వీయ మానసిక నిర్ణయాలతో బడికి వచ్చారు. వచ్చి చేసింది మాత్రం ఏమీ లేదు.
ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల క్షేమం కోసం బడికి సెలవులు ఇవ్వాలని కోరాయి. ఫీజులు రాబట్టడం కోసం బడులు తెరవాలని ప్రైవేట్ యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. బడి మూస్తే జీతం రాదని ప్రైవేట్ ఉపాధ్యాయులు పాఠశాలలు నడపాలని కోరుకున్నారు. “బడులు తెరవాలి” అని ఒక వర్గం “బడులు మూయాలి” అని మరో వర్గం అభిప్రాయపడ్డాయి. అలా ఒక వైరుధ్యం కిందిస్థాయి నుండి పై వరకు విద్యారంగాన్ని చీల్చింది. ప్రైవేటు ఉపాధ్యాయుల ఆర్థికస్థితి దిగజారింది. ఉన్నత చదువులు చదివి, కూలి పనులు చేసుకొని పొట్టపోసుకున్నరు. కొందరు ఆస్తులు అమ్ముకొని పూట గడిపారు. మరికొందరు పట్టణాలు వదిలి, పల్లెల్లో జరుగుబాటు చూసుకున్నరు. ఇంకొందరు దొరికిన చోటల్లా అప్పులు చేసి కాలం వెళ్లదీసారు. ఇవేవీ చేయలేక ఆత్మన్యూనతకు గురి అయి, ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. సమాజం ‘భయ విహ్వల’ అయింది. “విద్యా, వైద్య రంగాలకు ఎన్నటికీ చావులేదు” అనే ఆలోచన మసకబారింది. ప్రైవేట్ ఉపాధ్యాయుల క్షేమం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వంపై పడింది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు 2000/- రూపాయలు 25 కిలోల బియ్యం ఉచితంగా పంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఆశావహులు, అర్హులు అయిన ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వారి ఎంపిక కోసం ప్రభుత్వం అనేక షరతులు విధించింది. అవన్నీ అధిగమించిన వారికి లబ్ది చేకూరింది. సంక్షేమ రాజ్య అవసరం తెలిసివచ్చింది. జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నిర్ణయం పాలక పక్షానికి విజయం చేకూర్చి పెట్టింది.
ట్రాన్స్‌ఫర్లు, కోర్టు కేసుల మద్య పదోన్నతులు పిడచ కట్టుకపోయాయి. చేయని నేరానికి అర్హులు గడ్డకట్టుక పోయారు. వారికి పదోన్నతి అందని ద్రాక్ష అయింది. మోస్ట్ సీనియర్స్ అనుకునే వారికి అనివార్యంగా ఇవ్వక తప్పదు కనుక, ఇచ్చినా అది పదోన్నతి కాదు కనుక Head Master ఖాళీలను ఏదో ఒక విధంగా నింపాలి కనుక పూర్తి అధికారాలు కల్పిస్తూ కొందరికి ప్రధానోపాధ్యాయులుగా అదనపు బాధ్యతల్ని అప్పజెప్పింది ప్రభుత్వం. అలా నాకు Full Additional Charge Head Master గా అవకాశం వచ్చింది. అంతవరకు విద్యార్థుల మంకు మాత్రమే తెలిసిన నాకు అధికారుల దాడులు తెలిసివచ్చాయి. బోధనా సిబ్బంది నిరాసక్తతను దగ్గరగా చూసిన నేను దానిని అనుభవించాల్సి వచ్చింది. కరుడు కట్టిన స్వార్థాన్ని భూతద్దంలోంచి చూడక తప్పని పరిస్థితి వచ్చింది. అలసత్వం ఎన్ని రీతుల్లో ప్రదర్శించవచ్చో తెలిసింది. ప్రతి హెడ్ మాస్టర్ తలలెందుకు పట్టుకుంటాడో అర్థమయింది. గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. DIET College లో లెక్చరర్‌గా Deputetion పై పనిచేయడం కోసం అర్హులైన టీచర్స్ నుండి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆహ్వానించాడు. అర్హులైన చాలా మంది హెడ్‌మాస్టర్స్ అప్లై చేసుకున్నారు. స్కూల్ హెడ్‌మాష్టర్ మరియు డైట్ లెక్చరర్ పోస్టులు సమాన హోదాకలవి. పాఠశాలలో పాలనా పరమైన చిక్కులను తెంపలేక, తలపోటులను భరించలేక డైట్‌లో పాఠాలు చెప్పడానికి అనేకమంది హెడ్‌మాస్టర్స్ బయలుదేరారు. పదోన్నతి పొందిన సమయంలో ఉన్న సంతోషం అందులో చేరిన కొన్నాళ్ళకే ఆవిరి అవడం చాలా మందిలో కనిపించింది. దీనంతటికీ పనుల పట్ల గల ఉదాసీనత ప్రభుత్వ ఉద్యోగంలో గల భద్రత, పనిచేసినా చేయకున్నా చెల్లుతది అనే విశృంఖలత, పరోక్షంగా వీటన్నిటిని సమర్థించే ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం కారణాలుగా కనపడతాయి.
కారణాలేమైనా తల్లిదండ్రులకు, ప్రభుత్వ టీచర్లపై చిన్నచూపు ఉన్నదనేది నిర్వివాదాంశం. అది కాస్తా విద్యార్థినీ విద్యార్థుల తలలోకి ప్రవేశించింది. దానివల్ల తరగతి బోధనలో ఆటంకం, పాఠశాలలో అల్లరి, విద్యార్థినీ విద్యార్థుల మధ్య ప్రబలిన అసంబద్దత సమస్యలుగా మారి హెడ్‌మాస్టర్ ముందు తిష్ట వేయడం వారి తలనొప్పులకు దారితీసాయి. వీటికి తోడు అధికారుల అహం, అటెండర్ల అలసత్వం, మిగతావారి నిర్లక్ష్యం ఇవన్నిటిని భరిస్తూ కాలం వెళ్ళదీయాల్సిన బాధ్యత వల్ల హెడ్‌మాస్టర్స్ అసహనానికి, రక్తపోటుకు, మధుమేహాలకు గురవుతున్నారనేది పచ్చినిజం. దీనికి అతీతంగా ఉండేవారు బహు అరుదు. వీటన్నిటికి తోడు కొత్తగా ఎత్తుకున్న బాధ్యతలు నన్ను సాహిత్యానికి దూరం చేశాయన్నది వాస్తవం. బాధ్యతల ఒత్తిడికి, సృజనకు చుక్కెదురు. పాఠశాల ప్రథముడిగా కనిపించినా, అడ్డమైన ప్రతి పనికి జవాబుదారి కావడమనేది ఒక విరోధాబాస. అదే ఈ పదవి ప్రత్యేకత.
పదోన్నతి
ఎదురుచూసిన కాలం వచ్చింది. ప్రభుత్వం పదోన్నతులకు తెరలేపింది. కోర్టుకేసులు అడ్డుకున్నవి. అధికారులు కోర్టు ముడులను విప్పారు. మరో రూపంలో అసమ్మతులు అడ్డుకున్నారు. కాలహరణం కొనసాగింది. కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసింది. ఆశావహులు భంగపడ్డారు. నిలువుగా, అడ్డంగా ఉపాధ్యాయలోకం చీలింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. అధికారులు చోద్యం చూశారు. పదోన్నతులను పూర్తి చేయడానికి ఎన్నడూ లేని విధంగా అధికారులు తహతహలాడారు. బదిలీలకు, పదోన్నతు లకు పీటముడి వేసింది ఉపాధ్యాయ లోకం. ఒకడుగ ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా దోబూచులాట సాగింది. ఇగవచ్చే, అగవచ్చే అంటుండగానే వేసవి సెలవులు వచ్చె. వేసవి సెలవుల్లో పదోన్నతులు పూర్తి చేస్తరు అనే వాడుక వచ్చే. సెలవులు బడికే కాదు కోర్టుకు కూడా ఉంటాయి అని కొందరు సంబరపడ్డారు. సెలవులు గడిచాయి. కోర్టు, బడి తలుపులు తెరచుకున్నాయి. పదోన్నతుల కోసం కళ్ళు కాయలు కాచాయి. బడిలో గడపడం పెద్ద గండంగా మారింది. బడిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల మధ్య జరిగిన గొడవల మూలంగా ప్రశాంతత కరువైంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు గొడవల మూలంగా Full Additional Charge అనే ముళ్ళ కుర్చీ నుండి దిగి పోయాను. ఇక బడినుండి దూరంగా వెళ్ళి పోవడమే మిగిలింది. పదోన్నతి కోసం ఆత్రంగా చూసాను. అనుకున్నరోజు ఆరునెలలు ఆలస్యంగా వచ్చింది. అనేకులు ఊపిరి పీల్చుకున్నారు. మొదటిసారిగా పదోన్నతులను Online System ద్వారా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ అంటేనే వణుకు. తెలియని బెరుకు. సిస్టమ్ మీద పనిచేయలేని వారు నిరక్షరాస్యుడు. నేను మిత్రుని సహాయం తీసుకుని స్కూల్స్ ఎన్నుకున్నాను. ఈ ఎన్నిక కోసం అనేక విధాల ఆలోచనలు చేశాను. అంచనాలు, ఆలోచనలు, సలహాలు, పరిస్థితులు, ప్రదేశాలు, కోరికలు అన్నీ కలిసి వరంగల్ దారి చూపాయి.
వరంగల్ అంటేనే ఒళ్ళు పులకరించింది. నా జ్ఞాన వికసన కేంద్రమది. నాలుగు దశాబ్దాల కిందటి జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. డిగ్రీ, ట్రైనింగ్ అక్కడే జరగడం వల్ల, నాలుగు సంవత్సరాలు అక్కడ ఉండడం వల్ల అక్కడి పరిసరాల పట్ల అవగాహన ఉంది. ఈ రోజు అక్కడి పాఠశాలల పరిస్థితి తెలియదు. అక్కడ పనిచేసే మిత్రుల సలహాలు, సూచనల మేరకు ఒక అవగాహనకు వచ్చి ఆన్‌లైన్‌లో ప్రియారిటీ బేస్డ్‌గా స్కూల్స్‌కు ఆప్షన్ ఇచ్చాను. ఇచ్చిన మొదటి మూడు పాఠశాలల్లో ఒకటి తప్పనిసరి వస్తదనే నమ్మకం, ఉత్కంఠ ఒక చోట ఉండనీయలేదు. ముచ్చటగా మూడు రోజుల తర్వాత సెల్‌ఫోన్ గంట మోగింది. ఓపెన్ చేసి చూడగానే నేను కోరుకున్న మొదటి మూడు పాఠశాల్లో మూడవ పాఠశాలకు గెజిటెడ్ హెడ్‌మాస్టర్‌గా పదోన్నతిపై వెళ్ళే అవకాశం దక్కింది. పదోన్నతి వచ్చినందుకు కోరుకున్న ప్లేస్ దక్కినందుకు, ప్రస్తుత బడి వదలి నందుకు ఇలా త్రిగుణీకృతం అయింది సంతోషం.
కొత్త బడి, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబంలా ఉంది. ఇంటింటికి మట్టిపోయ్యి ఉంటుందన్నట్లు ఇక్కడా రాజుకుని ఉన్న పొయ్యి ఉంది. దాన్ని అట్లాగే వదిలేసి నాదైన దారిలో వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నిప్పుల కొలిమి నుండి చంద్ర కిరణాల మధ్యకు వచ్చినట్లయింది. శక్తిమేర పనిచేసి తృప్తి దీర పొంగిపోవాలి అనుకున్నాను. ఆ మేరకు సంస్కరణలు చేపట్టాను. అభివృద్దిని సాధించాను. ప్రైవేటు వ్యక్తుల సహకారం, ప్రభుత్వ నిధుల సద్వినియోగం అనే రెండు కొలతలతో పనులు జరిపించాను. అనేక మార్పులను తెచ్చాను. బడిలోని మానవ వనరులను, ఆర్థిక వనరులను చక్కగా వినియోగించుకుని సఖ్యతను, చక్కటి ఫలితాలను సాధించాను. అన్నిటికి మించి నా పాత స్నేహితుల ఆప్యాయతను అనుభవించాను. బందువుల అనురాగాన్ని అందుకున్నాను.
జీవితంలో సంతృప్తి నిండింది.
(సమాప్తం)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.