[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్నట్లుంది. దానికి తగ్గట్టు ఉదయం ఎనిమిదింటికి స్కూల్‌లో ఉండాలి. కనుక ఉదయం నాలుగింటికే లేవాలి. అనుకోగానే తెల్లవారినట్లయింది. సర్వకాల సర్వావస్థల్లోను మా ఆవిడ సహకారం వల్ల అగ్నిగుండాల్లాంటి సమస్యల్ని దాటగలిగిన. ఉదయాన్నే లేచి వెళ్ళడం అనేది ఇప్పుడు పూలబాట అయింది. రెండో రోజు బడికి వెళ్ళిన. ప్రార్థనకు చాలా మంది ఉపాద్యాయులు, పిల్లలు లేరు. అందరూ ఇతర ఊర్లలో నుండి రావడం ఒక కారణంగా కనిపించింది. వేసవి మొదట్లో నడిచే ఒక్కపూట బడి వాతావరణం కనిపించింది. ఇలా ఎన్నేండ్లుగా నడుస్తుందో, ఒక్కపూట పనిచేసి రెండు పూటల జీతం తీసుకోవడం అన్యాయం అనిపించింది. కొత్తగా, బెరుకుగా అనిపించింది. ఇది పోవాలంటే ఏదో ఒక క్లాసుకు వెళ్ళాల్సిందే. హెడ్‌మాస్టర్ చెబితేనే కదా వెళ్ళాల్సింది అని మౌనం వహించిన. తెచ్చిన స్వీట్ అందరికి పంచాలని అనిపించి హెడ్‌మాస్టర్ ముందు పెట్టిన. ఇంటర్వెల్‌లో అందరూ వస్తరు. ఒక్క దగ్గర ఇక్కడే జమ అయితరు. అప్పుడే ఇద్దువు ఆగు అంటూ పక్కకు పెట్టిండు.
“ఏ క్లాసుకు వెళ్తవు” అడిగిండు.
“మీ ఇష్టం”
“హైస్కూల్ సెక్షన్స్ చెప్పిన అనుభవం ఉందా”
“చెప్పగలను”
“తొమ్మిదవ తరగతికి వెళ్ళు. ఆ సార్ రాలేదు”
“సరే సర్”
క్లాస్ కిటకిటలాడుతుంది. అందరు మగపిల్లలే. ఆజానుబాహులే. పల్లెటూరి పిల్లలు వాళ్ళ మొహాల్లో ‘రఫ్‌నెస్’ కొట్టొచ్చినట్లుంది. ఎత్తుల ప్రకారం కూర్చోలేదు. వరుసగా లేరు. ‘ఎద్దుచ్చపోసినట్లు’ వంకర టింకరగా కూర్చున్నరు. యూనిఫాం లేదు. వాళ్ళ డ్రెస్ అర్బన్ నేటివిటీని ప్రతిబింబిస్తుంది. అది వాళ్ళ పేదరికాన్ని కనిపించ నీయకుండా వేసుకున్న తొడుగులా అనిపించింది. వీళ్ళకేం పాఠం చెప్పడం అని ఆలోచిస్తుండగానే క్లాస్ ముందున్న వేపచెట్టు కింద గొడవ జరిగింది. ‘ఏమిటా అని’ చూసిన. ఒకడు, మరొకణ్ణి పిడిగుద్దులు గుద్దుతున్నడు. ఇంకొకడు తన్నుతున్నడు. ఎవరూ కూడా వాళ్ళను ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం కలిగింది. కొట్లాడుతున్న వాళ్ళలో ఒకణ్ణి ఇంత క్రితమే నా క్లాసులో చూసిన. నేనుండగా వాడు బయటకెట్లాపాయె అనుకొని తిరిగి క్లాసులో చూసిన. వాడు క్లాసులో ఉన్నడు. ‘వాళ్ళు కవలలు’ అని తేలింది. గొడవ పూర్తయినట్లుంది. కవలల్లో ఒకడు తరగతి గది ముందుకొచ్చిండు.
“రావచ్చా సార్” అన్నాడు
“ఈ క్లాసేనా నీది”
“ఈ క్లాస్ కాకపోతే నేనెందుకస్త”
“లోపలికి రా”
“హాజరెయ్యిండ్రి సార్”
“నువ్వు ముందు కూచో, నీ పుస్తకాలు ఏవి”
“పుస్తకాలు లేవు”
“ఏమయినయి”
“ఇయ్యలేదు”
“ఎవరు”
“బల్లె అందరికిచ్చిండ్రు కని నాకే ఇయ్యలేదు. అయిపోయినయట. మల్లస్తయా”
“నీ చేతుల ఉన్నదేంది”
“ఒకటే కాపి’
“వెళ్ళికూచో”
“హాజరెయ్యిండ్రి సార్”
“ఇంక తీసుకోలేదు”
“గట్లనా” అంటూవెళ్ళి కూర్చున్నడు. నిలువెత్తు నిర్లక్ష్యంగా ఉన్నడు. అటెండెన్స్ పూర్తి అయ్యేసరికి అరగంట పట్టింది. డెబ్బయి మంది ఉన్న క్లాస్ అది, ‘దొంగ అటెండెన్స్’ కూడా ఇచ్చినట్లు అనిపించింది. క్రమశిక్షణారాహిత్యం కనిపించింది. ప్రైవేట్ స్కూల్‌లో నలభై మంది ఉన్న క్లాసుకు చెప్పడం కష్టంగా అనిపించింది. ఇంతమందికి చెప్పడం, నోట్స్ దిద్దడం ఇంకా కష్టం కదా అనిపించింది. క్లాస్‌లో ముచ్చట్లు తారాస్థాయికి చేరినయి. కూర్చునే పద్దతి, సర్దుకునే తీరు వీళ్ళకు తెలియదనిపించింది. ఒవర్ ఏజ్ పిల్లలు చాలా మంది కనిపించారు. ముందు వీళ్ళను ఎత్తుల వారీగా కూర్చోబెట్టాలని పించింది. వీళ్ళక్లాస్ టీచర్ చెయ్యాల్సిన పని నేను చేస్తే ఎట్ల!
“మీ క్లాస్ టీచర్ ఎవరు”
“జాంబవంతుడు” వెనుక నుండి ఓ గొంతుక వినిపించింది.
“ఎవరు” రెట్టించి అడిగిన.
“తెలుగుసారు”
“ఇవ్వాళ రాలేదా”
“బడికి వస్తుండు కని, మా క్లాసుకు వస్తలేడు”
వీళ్ళనడిగి లాభం లేదు అనిపించింది. మోస్ట్ డిస్టర్బ్‌డ్ క్లాస్ అని అర్థమయింది. అప్పుడే సెకండ్ బెల్ అయింది. బయటకొచ్చిన. నాతో పాటు కొందరు బయటకు వచ్చిండ్రు అందులో ఒక విద్యార్థి.
“సార్, మా క్లాసోల్లు కొంతమంది మార్నింగ్ షో సినిమాకు పోయిండ్రు” అన్నడు.
“ఏం సినిమా”
“ఏమో సార్, ఏదో ఇంగ్లీష్ సినిమా అట”
“నువ్వెందుకు పోలేదు”
“మా బాపుకు తెలిస్తే కొడుతడు”
“వాళ్ళ బాపులు కొట్టరా”
“కొట్టినా, తిట్టినా, వీళ్ళు ఇనరు. వాళ్ళకు మీరు ఇయ్యాల హాజరు ఏసిండ్రు”
“అటెండెన్స్ ఎవరు పలికిండ్రు”
“వాళ్ళ దోస్త్‌లు. వాళ్ళు పోతే వీళ్ళు.. వీళ్ళు పోతే వాళ్లు హాజరు ఇస్తరు”
“అట్లనా”
“రేపు కూడా మీరు రాండ్రి సార్” అన్నాడు.
“అనుకున్నదే అయింది” పైకే అనేసిన.
పిల్లవాడికి అర్థం కానట్టుంది. అయోమయంగా నా వైపు చూసిండు.
స్టాఫ్ రూంకు వెళ్ళి కూర్చున్న. అటెండెన్స్ రిజిష్టర్‌తో క్లాస్‌కెళ్ళి వస్తున్న సార్‌ను చూసి ఆశ్చర్యపోయిన. దగ్గరికి వచ్చాక అతడు ఆశ్చర్యపోయిండు.
“నువ్విక్కడ..” అడిగిండు
“నిన్ననే జాయిన్ అయిన”
“నిన్న నేను రాలేదు”
“నువ్వెన్నేండ్లయింది ఇక్కడ..”
“దాదాపు నాలుగు సంవత్సరాలయింది”
“మీకిది వరకే పరిచయం ఉందా” హెడ్‌మాస్టర్ గారి ప్రశ్న
“ఇద్దరం క్లాస్‌మేట్స్‌మి”
“మా స్నేహం ఇంటర్మీడియట్ వరకు సాగింది.”
“ఆ తర్వాత”
“ఇద్దరి దారులు, కాలేజీలు, ఊర్లు వేరయినయి”
“వీడే పొరుగూరికి పోయిండు” అన్నడు.
“వీడికి నేను పెట్టిన నిక్‌నేమ్ ‘అతడు’” సరదాగా చెప్పిన.
“నీలో రచయిత లక్షణాలున్నయి” కనిపెట్టిండు హెడ్‌మాస్టర్
“సర్ మేం కాస్త బయటకు వెళ్లివస్తం” అడిగిండతడు
“మీ ఫ్రెండ్ తీసుకొచ్చిన స్వీట్ తీసుకొని వెళ్ళు”
తలా ఒక స్వీట్ ముక్కతీసుకొని బయటకు వచ్చినం. పక్కనే ఉన్న ‘తడకల హోటల్’లో కూర్చున్నం. అక్కడ టీ తప్ప మరేం దొరకదు. చిన్నప్పటి స్నేహితుడు కనిపించేసరికి చాలా ఆనందం కలిగింది. అతడు కూడా అదే స్థితిలో ఉన్నాడు.
“ఇలా కలుస్తం అనుకోలేదు” అన్నాడు
“బతికే ఉన్నం కనుక కలిసినం”
“నిజమే. నీ ఆశయాలే నిన్ను ఒక్క దగ్గర ఉండకుండా చేసినయి ఇప్పటికైనా కుదురుకున్నవా”
“పెండ్లయింది. పిల్లలు”
“ఎప్పుడు, ఎంతమంది”
“ఐదు సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు”
“తొందరపడ్డవు”
“దేనికి”
“పెళ్ళికి పిల్లలకు”
“బాధ్యత నెరవేర్చాలే కదా”
“పిల్లలు బడికి పోతున్నరా”
“పెద్దవాడు బడికి వెళ్తున్నడు శిశు తరగతి”
“తెలుగు మీడియంలో వేసినవా”
“ఏం వేయకూడదా”
“వాడి భవిష్యత్తుకు ఉరివేసినవు. ప్రపంచం ఒక వైపు ఇంగ్లీషును డిమాండ్ చేస్తుంటే, నీవేమో తెలుగు అంటూ పాకులాడతున్నవు. నీ భాషాభిమానం వాడికి కూడు పెట్టదు. ఇంతకూ నీ ఆర్థిక స్థితిలో మార్పు ఏమైనా ఉందా?”
“రెక్కలు చక్కగా ఉన్నయి. బట్టకు పొట్టకు వెళ్ళదీసిన”
“ఆనాడు, ఈనాడు ఒక్కలాగే ఉన్నవు. సిద్ధాంతాలు కూడు పెట్టవు అని చెబితే వినలేదు”
“నీవు మారలేదురా”
“నువ్వు మాత్రం మారినవా! అక్కడక్కడ నెరసిన వెంట్రుకలు తప్ప”
“నా సంగతెందుకు కానీ, నీకు పిల్లలెంతమంది”
“పెళ్ళే కాలేదు. పిల్లలెక్కడి నుండి వస్తరు”
“ఎందుకు చేసుకోలేదు. మంచి జాబ్ ఉంది”
“ఈ నౌకరి తోటి పెండ్లాం పిల్లల్ని సాదుడెట్ల”
“నాకు వెళ్తలేదా.. ఏ ఈడుకు ఆ ముచ్చట ఉండాలె కదా”
“నీకు నడుస్తది. అందరు కుడికి నడిస్తే. నీవు ఎడమకు నడిచినవు. నేను కుడిచేత్తో రాస్తేనీవు ఎడమ చేత్తో రాస్తవు. అయినా మనిద్దరికి మంచి స్నేహం కుదిరిందెట్లో!”
“అదంతా ఇప్పుడెందుకని, ఎన్నేండ్లయింది. ఉద్యోగం చేయవట్టి”
“మూడేండ్లు ఎస్.జి.టి. (సెకండ్ గ్రేడ్ టీచర్)గా పనిచేసిన. పల్లెటూర్లో పనిచేయడం ఇష్టం అనిపించలేదు. ఏ.పి.పి.ఎస్.సీ. (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ పడితే అప్లయి చేసి రాసిన. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ జాయిన్ అయి రెండేండ్లయింది. మొత్తం ఐదేండ్ల సర్వీస్ పూర్తి కావస్తుంది. పంచాయతీ రాజ్ సెక్టర్ నుండి గవర్నమెంట్ సెక్టర్‌లోకి వచ్చిన. టీచింగ్ లైన్లో ఉండాలనిపిస్తలేదు. జూనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ వస్తది. అది కూడా టీచింగే కదా! గ్రూప్స్ రాస్తున్న ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ కొట్టాలే. అప్పుడే తృప్తి.”
“నువ్వు కరుడుగట్టిన కెరియరిస్టువిరా”
“కమ్యూనిస్టులందరూ కేపిటలిస్టులు అవుతున్నరు.వాళ్ళకంటే నేను నయం కదా”
“బీ.ఎస్సీతో చదువు ఆపినవా. ఆ తరువాత మనం కలువలేదు కదా”
“డిగ్రీ అయ్యాక బి.ఇడి. చేసిన. యూనివర్శిటికి వెళ్ళి పొడిచేసేదేం లేదు. నా బి.ఇడి. పూర్తి కాగానే డిఎస్సీ పడింది. మంచి ర్యాంక్ వచ్చింది. ఉద్యోగం వచ్చింది. రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఎక్స్‌టర్నల్‌గా కట్టి పూర్తి చేసిన. ఎప్పుడు చదువు ఆపలేదు. ఇప్పుడు కూడా గ్రూప్స్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న.”
“అమ్మా నాన్న ఎట్లున్నరు”
“అమ్మ అనారోగ్యం నీకు తెలిసిందే కదా. ఆమె కష్టం ఆమెది. నాన్న రిటైర్డ్ కాలేదు. ఆయన ఉద్యోగం ఆయనది”
“అక్క పెళ్ళి అయిందా. ఎక్కడుంటున్నరు”
“అక్కకు పెళ్ళి అయింది. వాళ్ళిద్దరు ఉద్యోగస్థులు. వాళ్ళకు అన్నీ ఎక్కువే ఉన్నవి. వాళ్ళు మంకమ్మతోటలోనే ఉంటున్నరు. మాది నీవు చూసిన ఇల్లే. నీవు ఇక్కడ ఉండలేక చదువు పేరు మీద ప్రపంచం తిరిగి వచ్చినవు. నిన్ను చూస్తే ‘భూమి గుండ్రంగా ఉంటది’ అనేది రుజువు అవుతుంది” అని లేచిండు.
“స్కూల్‌కు కొన్ని టీలు తీసుకురా” అన్ని చెప్పి హోటల్ వాడికి డబ్బులిచ్చి లేచిన.
ఇంటర్వెల్ అయింది. సార్లందరు స్టాఫ్‌రూంకు వచ్చారు. అందరికీ స్వీట్స్, స్నాక్స్, టీ అందించిన. మా హెడ్‌మాస్టర్ నన్ను నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు పరిచయం చేసిండు. అందులో యు.డి.సి. ఎల్.డి.సి., టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఉన్నరు. నిన్నటి నా ఆర్డర్ నాముందే యుడిసికి ఇచ్చి జాయినింగ్ రిపోర్ట్ తయారు చేయమన్నడు.
“నీకు జీతం చేసేది. సర్వీస్ మ్యాటర్స్ చూసేది, అన్ని బెనిఫిట్స్ ఇప్పించేది ఈయనే. ఇతణ్ణి మంచిగా అరుసుకోవాలే నువ్వు” అంటూ నవ్విండు హెడ్‌మాస్టర్.
“మంచిది సార్” అన్నాను.
యు.డి.సి. దొంగకోళ్ళు పట్టేవాడిలా అగుపించాడు. వాడినవ్వు ‘శకుని మామ’ను గుర్తుచేసింది. ఎల్.డి.సి. చాలా అమాయకంగా, పిచ్చివాడిలా వాగుతూ కనిపించిండు. అతని ప్యాంటు జేబు నుండి గుట్కా ప్యాకెట్ల గుత్తి వేలాడుతూ కనిపించింది. వేళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నట్లు టకటక లాడిస్తుంది టైపిస్టు. మాటకు ఒకసారి నవ్వుతూ రికార్డ్ అసిస్టెంట్ తొమ్మిదో తరగతి విద్యార్థిని తలపిస్తున్నడు. మొత్తానికి ఆఫీస్ రూంకు ఒక ప్రాధాన్యత ఉందనిపించింది.
నా ముందే లెక్చరర్ ఒకరు యు.డి.సి వద్దకు వచ్చిండు. ఎరియర్ డబ్బులేవో వచ్చినట్లుంది. అక్విటెన్స్‌పై సంతకం పెట్టించిండు. చేతిలో డబ్బులు పెట్టిండు. లెక్కించిండు లెక్చరర్.
“తక్కువున్నయి” అన్నడు లెక్చరర్.
“ఆప్‌కు మాలూమ్‌హైనా సార్” అంటూ వెకిలిగా నవ్విండు యుడిసి.
“ఈ అలవాటు మంచిది కాదు” అంటూ విసురుగా లేచివచ్చిండు లెక్చరర్.
రేపు నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటదనిపించింది. ఆ పరిస్థితే వస్తే ఒక సారి కాకున్నా మరోసారైనా వాడికి బుద్ది చెప్పాల్సిందేనని నిర్ణయించుకున్న.
రేపటి నుండి యూనిట్ టెస్ట్‌లు ప్రారంభం అనే నోటీసుచేతికొచ్చింది. ఇప్పట్లో నాకు ‘టీచర్ టైంటేబుల్’ ఇవ్వరని అర్థం అయింది. పాఠాలు చెప్పే పని లేదు. యూనిట్ టెస్ట్‌లు రాయడానికి ప్లిలందరు గ్రౌండ్‌కు వచ్చిండ్రు. విశాలమైన మైదానం. ఏండ్ల నాటి వేపచెట్లు, వాటి నీడన పిల్లలు పరీక్షలు రాస్తూ, పెద్దలుకుర్చీలో కూర్చొని చూస్తూ ఉన్నరు. వాళ్ళందరినీ చూస్తూ నేనూ తిరుగుతున్న. యథేచ్ఛగా కాపీ కొడుతూ విద్యార్థులు, వాళ్ళకది మామూలే అన్నట్లు ఉపాధ్యాయులు ఉన్నరు. నాకే ఆశ్చర్యం. ప్రైవేటు స్కూల్‌లో ఇదంతా నడవదు కదా అనిపించింది. ఇరు వర్గాలకు ఒత్తిడి లేదు. ‘అతడు’ ఎక్కడున్నాడో అని చూసిన. చెట్టుకిందచేతిలో పుస్తకంతో కనిపించిండు. వెళ్ళి చూసిన. అది పోటీ పరీక్షల పుస్తకం. నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకులే అనుకొని అక్కడి నుండి కదిలిన. పాఠశాల నలుమూలలు తిరిగిన ‘యూరినల్స్’ లేవు. కాలేజీ అమ్మాయిల సమస్య అర్థమయింది.
నేను జాయిన్ అయి పదహేను రోజులైంది. ఫస్ట్ తారీఖు వచ్చింది. ఉద్యోగు లందరు జీతాలు తీసుకునేరోజు. నా జీతం ఎంత వస్తదో లెక్కలు కట్టి చెప్పిండు హెడ్ మాస్టరు. బ్యాంకుకు వెళ్ళిన క్లర్క్ ఇంకా రాలేదని తెలిసింది. టైం పట్టేలాగుంది.
“జీతాలు నాలుగు గంటల వరకు వస్తయి. ఉంటే ఉండండి. లేదంటే రేపు ఆదివారం మా ఇంటికి రండి. అక్కడే ఇస్త” అన్నాడు యుడిసి. ‘ఎంత మంచోడు’ అనుకున్న. తెల్లవారి యుడిసి ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిన. ముస్లిం ఏరియా అది. పాత బడిన ఇండ్లన్నీ ఒకేలా ఉన్నయి. ఇల్లు దొరకపట్టడం కష్టం అయింది. తలుపులన్నీ మూసి ఉన్నవి. బయట నుండి తలుపు కొట్టి అడిగితే “మాలూమ్‌నహీ” అనే సమాధానం లోపలి నుండి వచ్చింది. చాలాసేపు తిరిగి ఇల్లు దొరకపట్టిన. మూసి ఉన్న తలుపును ‘ధైర్యంతో’ కొట్టిన. చాలాసేపటికి తెరుచుకుంది. ఎదురుగా నవ్వుతూ యుడిసి.
“ఆయియ్యే..” అంటూ లోపలికి తీసుకెళ్ళిండు. అక్విటెన్స్ తీసి బయటపెట్టిండు. జీతం ఎంతో చూసిన. సంతకం పెట్టిన తర్వాత జీతం ఇచ్చిండు.
“డబ్బులు తక్కువ ఉన్నయి” లెక్కపెట్టి అడిగిన
“బస్సు కిరాయి మందం తీసుకున్న”
“ఎందుకట్ల”
“అదంతే” నవ్వుతూ లేచి లోపలికెళ్ళిండు.
రక్తం సలసలా మరిగింది. నా అనుమతి లేకుండా, నా డబ్బు తీసుకోవడం జులం కాదా అనిపించింది. ఇంత అన్యాయమా? మనసు ఆక్రోశించింది. ఇది కొత్త అనుభవం. తెల్లారి స్టాఫ్‌రూంలో అందరి ముందు విషయం ఉంచిన.
“వాడంతే” అన్నాడు హెడ్‌మాస్టర్
“టేకిట్ ఈజీ” అతడు అన్నాడు
“నువ్వు ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నవి” హెచ్చరికగా ఒకరన్నరు.
“తక్కువ మొత్తంతో వదలిండు” మరొకరన్నరు
“వాడితో పెట్టుకోకు” ఇంకొకరు బుద్దిచెప్పిండు.
“అడుగుదాం పదా” అని ఎవరూ ముందుకు రాలేదు.
యు.డి.సి. గురించి ఎవరూ చెప్పలేదు. ఆఖరికి ప్రిన్సిపాల్‌కు కూడా ఇతనితో చేదు అనుభవం ఉందని తెలిసింది. బాధితుల పక్షాన నిలబడి అడగడానికి ఒక్క లీడర్ కూడా లేడా అనిపించింది. అదే విషయం అడిగిన. అందుకు ‘అతడు’ ఇలా అన్నడు.
“ముందు ముందు నీకు వాడితో పని ఉంటది. సర్వీస్ బుక్ ఓపెన్ చేసేది, ఇంక్రిమెంట్ మంజూరు చేసేది వాడే. ఎందుకు అతనితో పెట్టుకుంటవు. నిన్నగాక మొన్న సర్వీస్‌లో జాయిన్ అయినవు. ముప్పై ఏండ్ల సర్వీసు చేసినవాళ్ళే వాణ్ణి ఏం చేయలేక పోయిండ్రు ఇక నీవెంత?”
“ఇంతకీ వాడి బలం ఎంత? ఏం చూసుకొని అన్యాయం చేస్తున్నడు?”
“మొండితనం, కాలేజీ గుట్టు తెలిసి ఉండడం, అధికారి బలహీనతలు, ఉద్యోగస్తుల ఉదాసీనత, ఇవన్నీ కలిసి వాడు బలంగా తయారైండు”
“ఉపాద్యాయులకు సంఘాలు ఉంటయి కదా! నీది ఏ సంఘం, మనలో సంఘనాయకులెవరు?”
“నేను ఏ సంఘంలో లేను, కానీ అన్ని సంఘాలకు చందాలు రాస్త”
“అయితే నీకు సంఘ నిర్మాణంఎట్లా తెలుస్తది’
“ఎందుకు తెలియదు”
“తెలిస్తే చెప్పు చూద్దాం”
“అధికారుల జులుంకు వ్యతిరేకంగా టీచర్స్ ఆత్మగౌరవం కోసం, నిజాం కాలంలో ఏర్పడిన సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్. కేవలం ఆనాటి గవర్నమెంట్ టీచర్స్‌కు మాత్రమే అది ప్రాతినిథ్యం వహించింది. ఆ తర్వాత 1951లో జిల్లా పరిషత్‌లు ఏర్పడినవి. ఇందులో పనిచేసే కొంతమంది తమ సెక్టర్ పేరుమీద పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ స్థాపించారు. అలా సెక్టార్ ప్రాతిపదికన ఒక సంఘం ఏర్పడింది. ఈ ధోరణి తరువాత విస్తరించింది. ఆనాడు పంచాయతీరాజ్ టీచర్స్‌కు ఎలాంటి సౌకర్యాలు లేవు. గవర్నమెంట్ బళ్ళలో పనిచేసే పంతుళ్ళకు అనేక సదుపాయాలుండేవి. ఈ తేడాను ప్రశ్నిస్తూ పంచాయతీ రాజ్ యూనియన్ పనిచేసింది. ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్‌ఫర్, సర్వీస్‌రూల్స్, ఎల్.టి.సి. ఇంకా అనేక వృత్తి సంబంధిత సమస్యలపై ఈ యూనియన్ పనిచేసింది. ఇదిలా ఉండగా “హక్కులకై కలబడు-బాధ్యతకునిలబడు” అనే సైద్దాంతిక భూమికతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడింది. వామపక్ష భావజాలంతో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడింది. తరువాతి కాలంలో సంఘం చీలిపోయింది. 1999 ఫిబ్రవరిలో డెమాక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడింది. వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత ఈ సంఘం నినాదాలు. ‘కామన్ స్కూల్’ విధానం కోసం పోరాడుతుంది. జాతీయవాద భావజాలం, దేశభక్తి, సాంస్కృతిక నేపథ్యం కలిగిన సంఘాలు (ఆపస్, తపస్) ఉన్నవి. విద్యావ్యవస్థ విస్తరించిన కొద్దీ అనేక పెడ ధోరణులు తలెత్తినయి. ఉపాధ్యాయుల సంఖ్య, అధికారుల సంఖ్య పెరిగింది. దాంతో రకరకాల సమస్యలు పుట్టుకొచ్చినయి. సమస్యల సాధనకు కొన్ని యూనియన్స్ లంచాలు ఇస్తే, కొన్ని యూనియన్స్ అవినీతి అధికారులను సస్పెండ్ చేయించాయి. ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ విద్యా పరిరక్షణకు వామపక్ష సిద్ధాంత నేపథ్యం కల సంఘాలు పాటుపడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు నాయకులు నిర్బంధాన్ని చవిచూసారు. ఇదే క్రమంలో ఒక్కో సంఘంలో చీలికలు వచ్చాయి. అనేక సంఘాలు పుట్టుకొచ్చాయి.”
“ఉపాధ్యాయులంటే మేధావులు కదా.. ఎందుకిన్ని చీలికలు?”
“మేధావుల మధ్య ఐక్యత కరువు. ఇందుకు జనతా పార్టీ గవర్నమెంట్ ఉదాహరణ సమాజంలో నెలకొన్న సమస్త ధోరణులు ఉపాధ్యాయుల్లో కూడా నెలకొన్నవి. అవే చీలికలు, కొత్త సంఘాల ఏర్పాటుకు దారి తీసినవి. ఒక్కసారి సంఘాల నిర్మాణం, ఆవిర్భావం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంఘ నాయకుల తీరు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి ప్రాతిపదికగా ఆవిర్భవించిన. సంఘాలు కొన్ని. సెక్టోరియల్ సంఘాలు మరికొన్ని. సైద్దాంతిక భావజాలం ఆధారంగా ఏర్పడిన సంఘాలు మరిన్ని, ఆచరణలో విభేదాలు ఏర్పడి నాయకత్వ చాపల్యంతో వెలసిన సంఘాలు కూడా ఉన్నవి. సమాజంలో కులసంఘాల ప్రాధాన్యత చూస్తున్నదే. ఆ ప్రభావం ఉపాధ్యాయ లోకంపై పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, టీచర్స్‌యూనియన్ నెలకొన్నాయి. బహుజన టీచర్స్ యూనియన్ ఏర్పాటు ఒక ఉదాహరణ.
ఇవే కాకుండా క్యాడర్ వారీ సంఘాలు కూడా ఉన్నవి. ఉదాహరణకు ప్రధానోపాధ్యాయుల సంఘం, సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూనియన్, ఎల్.ఎఫ్.ఎల్. హెడ్‌మాస్టర్స్ అసొసియేషన్ ఇలా చాలా కనబడుతయి. భాషా పండితులు తమ కోసం తాము యూనియన్స్ ఏర్పరచుకొన్నరు. ఇందులో కూడా చాలా చీలికలు ఉన్నవి. నాయకత్వం కోసం అర్రులుజాపే వ్యక్తులు చీలికలు తెచ్చి నాయకులై వ్యక్తిగత ప్రయోజనాల్ని పొందిన సంఘటనలు కొల్లలుగా ఉన్నవి. ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలు కలిసి సక్సెస్ స్కూల్స్ నడుస్తున్నవి. ఈ థలో మీడియం పేరున వెలిసిన టీచర్స్ యూనియన్స్ కూడా ఉన్నవి. సుమారు అరవై వరకు యూనియన్స్ ఉన్నట్లు వినికిడి.”
“విద్యావ్యవస్థలో ఇన్ని యూనియన్స్ అవసరమా”
“అట్లా అంటే వినేదెవరు. ప్రమోషన్లు, పి.ఆర్.సి.లు డి.ఎ.లు, ట్రాన్స్‌ఫర్లు, విద్యాపాలసీలను ప్రభావితం చేయగలిగేవిగా యూనియన్స్ తయారైనవి. ‘టీచర్స్ యూనియన్స్ మాఫియాను తలదన్నే విధంగా ఉన్నవి’ అని ఒక మంత్రివర్యుడు అన్నడు. విద్యలో క్వాలిటీ, క్వాంటిటీ రెండూ ఉండాలి. వీటి కోసం పాటు పడే సంఘాలు అరుదు. అందుకే సమాజంలో టీచర్స్‌పై చిన్న చూపు ఉంది.”
“ఇన్ని తెలిసిన నీవు ఏదో ఒక సంఘంలో ఉండి పనిచేస్తే బాగుండు”
“టీచర్‌గా ఉండడమే ఇష్టం లేదు. ఇహనేను సంఘంలో ఏం పనిచేస్త. నేను గ్రూప్స్ రాస్తున్న కదా. ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు, నేను చేస్తున్న పనిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందుకే ఈ చరిత్ర అంతా తెలుసుకున్న.”
“నువ్వ దండోడివి”
“చూస్తూ ఉండు. ఇది నేను చేసే రెండో జాబ్. నీ ముందు మూడో జాబ్‌లోకి వెళ్త.”
“వెళ్ళగలవు. నీకు వెసులుబాటు ఉంది. అంతకు మించి దేన్ని పట్టించుకోనితనం కూడా ఉంది”. అంటూ అతని దగ్గరి నుండి కదిలిన.
ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్ అనేది ప్రభుత్వం కల్పించిన సదుపాయం. దసరా పండుగ వచ్చిందంటే అందరు అడ్వాన్స్ కోసం అప్లయి చేస్తరు. అందులో నేను ఒకణ్ణి. అలాంటి అడ్వాన్స్‌ను ప్రతి నెల చొప్పున తిరిగి ప్రభుత్వానికి ఉద్యోగి చెల్లించాలి. అది నిబంధన. అప్లయి చేసిన పదిహేను రోజులకు డబ్బులు వచ్చినయి. యు.డి.సి. డబ్బులు పంచిండు. ఆరోజు నేను స్కూల్‌కెళ్ళలేదు. తర్వాత యు.డి.సి. నుండి పిలుపు వచ్చింది.
“పండుగ అడ్వాన్స్ డబ్బులు ఇస్తడట రమ్మంటున్నడు” అటెండర్ వచ్చి చెప్పిండు.
“తమ్మీ మా దగ్గర యాబైరూపాయలు కట్‌చేసిండు” ఒక సార్ అన్నడు. వెళ్ళి నమస్కరించిన నింపాదిగా. గుర్రుగా చూసిండు.
“పిలిస్తేనే వచ్చుడా” అడిగిండు.
“రెండు, మూడు రోజులాయె మీరు రాక. ఇవ్వాళ వచ్చింది తెలియదు”
“సంతకం పెట్టు” అక్విటెన్స్ రిజిష్టర్ ముందు పెట్టాడు.
“డబ్బులిచ్చాక పెడుత”
మొత్తం డబ్బులిచ్చిండు. సంతకం పెట్టిన. వాడి మొకం కమిలిపోయింది. నా హృదయం గాలిలో తేలిపోయింది. ఏదో సంతృప్తితో ఆ గదిలో నుండి బయట కొచ్చిన ఈ విషయం అనేక రంగులు పులుముకొని నాలుగు రోజులు చక్కర్లు కొట్టింది.
తొలకరికి పులకరించిన పుడమి లాగా, పరవశించి చిగిర్చిన మొలకలాగా ఇప్పుడిప్పుడే కంటి నిండ నిద్ర సుఖం తెలిసి వస్తుంది. ఆర్థికంగా కలిగిన వెసులుబాటు ఆనందాన్నిస్తుంది. జీవితానికి విశ్రాంతి కూడా అవసరం. శరీరం ఒక యంత్రం దానికి ఖాళీ సమయం అవసరమని కూడా తెలిసింది. హాస్టల్లో రాత్రి పూట స్టడీ అవర్స్‌కు వెళ్ళడం మానేసిన. “గవర్నమెంట్ సెక్టర్‌లో పనిచేస్తున్నవు. నీకు చకచకా ప్రమోషన్స్ దొరుకుతవి” అన్న సీనియర్స్ మాట వల్ల ఉరుకులాట తగ్గింది. “ఇక్కడికి చాలు” అనే స్వీయమానసిక తృప్తిని పొందిన. ఆ దశలో నవీన్ సార్ పరిచయం కలిగింది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటడు. ఒక రోజు ఇంటికి వచ్చిండు.
“రండి సార్!” అంటూ ఆహ్వానించిన
“ఇప్పుడు జీవితం ఎట్లుంది” అడిగిండు.
“ఇప్పుడే స్వేచ్ఛ దొరికినట్లనిపిస్తుంది”
“వినియోగం, దుర్వినియోగం రెండూ మన చేతిలోనే ఉన్నవి”
“అర్థం కాలేదు”
“ఇంతవరకు కష్టపడ్డవు. ఒకేసారి పైస దొరికే సరికి విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశముంటది. నిన్నటి వరకు అనవసరమనుకున్నవి, నేడు అత్యవసరాలుగా మారుతవి. పొదుపుచేయడం నేర్చుకో. పిల్లలు పెరుగుతున్నరు. ముందు ముందు ఖర్చులుంటవి. ఇప్పటి నుండి జమ చేయడం మొదలు పెట్టండి.”
“ఏం చేయమంటారు”
“నేను చిట్టీలు నడుపుతున్న ప్రతినెల కొంత ఖర్చుకు ఉంచుకొని, మిగతాది చిట్టి కింద జమచేయండి. చిట్టి పూర్తి అయినాక మొత్తం డబ్బు నీకు ఇస్త. మంచి లాభం మీకు ఉంటది.”
“సరే మంచిది” అని ఒప్పుకున్న
దొరికిన స్వేచ్ఛ కుదించబడింది. పిల్లలు పెరుగుతున్నరు అనే సోయి భయాన్ని కల్పించింది. పిల్లలు పుట్టాక, వారికి పెట్టాల్సి రావడం వల్ల నోరు కట్టేసుకోవడమైంది. వాళ్ళు పెరుగుతున్న క్రమంలో అవసరాలు పెరగడం వల్ల, ఇష్టం వచ్చినట్లు తిరగడం తగ్గింది. అలా కాళ్ళకు సంకెళ్ళుపడ్డవి. మొత్తంగా ఖైదీలా అయింది పరిస్థితి. ‘కూపస్థ మండూకం’ అయితనా ఏంది? అనే భయం కలిగింది.
(మళ్ళీ కలుద్దాం)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.