[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]
కుటుంబం
చిన్న పిల్లలకు చదువు చెప్పాలనే కోరిక నాకు చిన్నప్పటి నుండి ఉండేది. ఏదైనా పల్లెలో చిన్న ప్లిలలకు విద్య నేర్పాలనే ఆదర్శం నాది. పల్లెబడి అంటే సర్కారు బడి అని ఉద్దేశం. దానికి విరుద్ధంగా పట్నంలో ప్రైవేట్ బడి పనికి కుదిరిన. అంతా కొత్త. పిల్లలకు చెప్పడంలో ఒక తృప్తి. బెత్తెడు జీతం. ఆర్థికావసరాల్ని లెక్కలోకి తీసుకోకుండా సంసార బరువును పెంచుకోవడంలోని అసంబద్ధత తెలిసి వచ్చింది. కుటుంబం కోసం త్యాగం చేసిన పేరు కూడా దక్కలేదు. దోని సప్పుడయింది. కాని దొయ్య పారలేదు. నా త్యాగం ఆధిపత్యం కింద అణిగిపోయింది. నా సహచరి ఇంట్లో వంటలు, సేవలతో గడిపితే, నేను యూనివర్శిటీలో పరీక్షలతో గడిపిన. కుటుంబ యజమానిగా బాపు ధోరణి ‘వాట్సప్‌లో వచ్చిన ప్రతి మెసేజ్‌ను డిలిట్ చేయడ’మే అన్నట్లుగా ఉండడం వల్ల భరించలేపోయినం. నాయనమ్మ కోసమని నెత్తికెత్తుకున్న బరువు బాపు ఉపేక్ష వల్ల నీరు కారింది. యూనివర్శిటీ నుండి వచ్చి ప్రైవేట్ స్కూల్‌లో చేరిన. కరీంనగర్‌లో కాపురం పెట్టడం వెంటనే జరిగింది. అధిక బరువు మోయాల్సి వచ్చింది. తలమీది బరువులు పక్కకు తిరగనీయవు. తలలోని బాధలు ధైర్యాన్ని చంపివేస్తవి. జీవితం ‘బండి ఇరుసు’గా మారింది. నలుగుతూ, ఉన్నచోటనే ఉండిపోతూ కాలం గడపాల్సి వచ్చింది.
ఉదయం ఐదు నుండి మొదలయ్యేది దినచర్య. రాత్రి తొమ్మిది వరకు సాగేది. ఇన్ని గంటలు పనిచేస్తే గడిచేది. పిల్లలు పెరగటం జరుగుబాటు తరగటం, బోధనపై ప్రభావాన్ని చూపాయి. అవసరం కోసం ఒక నెలలో మూడు రోజులు సెలవు పెట్టిన. నెల జీతం ఇచ్చే రోజు.
“ఈ నెల ఒక రోజు ఎక్కువ సెలవు పెట్టినవు. ఆ రోజటి జీతం కట్ చేసి ఇస్తున్న” అన్నాడు యజమాని.
“సెలవే పెట్టకుండా పనిచేస్తే ఎక్కువ జీతం కట్టిస్తరా” అడిగిన.
ప్రతినెలకు రెండు సెలవులు పెట్టుకునే వెసులుబాటు ఉపాధ్యాయునికి ఉండేది. అలాంటి సెలవులు పెట్టుకోకపోతే ఆ రెండు రోజుల జీతం కట్టించి ఇవ్వాలని యాజమాన్యాన్ని ఒప్పించిన. దాని వల్ల వ్యక్తిగతంగా నాకు, సంస్థకు లాభం జరిగింది. రోగాలు, నొప్పులు, పండుగలు, పబ్బాలు, సంతోషం, విషాదం ఇలా వరుసగా ఏది వచ్చినా తడిసి మోపెడయ్యేది. అలాంటి దశలో ‘గవర్నమెంట్ జాబ్’ కోసం మనసు తహతహలాడేది. ఆనాడు పోలీసు రిక్రూట్‌మెంట్ ఎక్కువగా ఉండేది. మిగతా ఏ ఉద్యోగ నోటిఫికేషన్ పడేది కాదు. ఇద్దరు పిల్లలతో కుటుంబం విస్తరించింది. వారు చదువుల వరకు వచ్చారు. నాతో పాటు బడికి రావడం మొదలయింది. ప్రైవేట్ అంటేనే పైసలతో పని. ఇందులో శ్రమ ఎక్కువ. వేతనం తక్కువ. యాజమాన్యం లాభాలు తీసుకొని వేతనం రూపంలో మిగతాది పంచేవారు. గవర్నమెంట్ రికగ్నయిజ్డ్ స్కూల్ కనుక సర్కారు పెట్టిన షరతులకు లోబడి ప్రైవేట్ స్కూల్ నడవాల్సి ఉంటది. అదంతా కాగితం మీది కందిపప్పు మాత్రమే. ఈ విషయం సంస్థ యాజమాన్యం ప్రభుత్వం, ఉద్యోగి, పేరెంట్స్, విద్యార్థి ఇలా అందరికీ తెలిసి జరిగేది.
డబ్బులున్న యువత, నిరుద్యోగ యువత కలిసి ప్రైవేట్ బడి పెట్టుకోవడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆ విధంగా ఉద్యోగాల్ని డిమాండ్ చేసే గొంతులను కట్టడి చేసింది. కొంతవరకు ఈ విధానం సామాజిక ఆమోదం పొందింది. అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి ఒక రక్షణ కవచంలా పనిచేసింది. తెలుగు మీడియంలో ఎక్కువ పాఠశాలలు ఉండేవి. చిన్న మొత్తాలలో ఫీజులు వసూలు చేసేవారు. అందులో కొంత బడి జరుగుబాటుకు కొంత వేతనాలకు, మరికొంత యాజమాన్యానికి మిగిలేది., ఈ విధానం వల్ల నిరుద్యోగ యువతకు భృతి దొరికింది. పేరెంట్స్‌కు చదువు భారం కాలేదు.
ఆ రోజుల్లో చదువుకొని, చిన్న చిన్న జీతాలకు ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేసే నాలాంటి వాళ్ళు అనేకులు కనిపించేవారు. ఎప్పుడో ఒకసారి అందరం కలిసేవాళ్ళం. అప్పుడు ఆయా పాఠశాలల యాజమాన్య వైఖరులపై చర్చజరిగేది. ప్రతీ సబ్జక్టు చెప్పేవాళ్ళం ఉన్నాం. మనమే స్కూల్ పెట్టుకుంటే అయిపోతది అనేవాళ్ళు. అది నిరాశ, నిస్పృహ నుండి వచ్చిన మాట. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగినయి. ఒకరిద్దరు మిత్రులు కలిసి స్కూల్ ఓపెన్ చేశారు. “ఎందరికో, ఎన్నో ఆలోచనలు వస్తయి. నీకు మాత్రం రావు” అని నన్ను విమర్శించిన మిత్రులున్నరు. నవ్వి ఊకుండేవాడిని.
గతంతో పోలిస్తే చదువు ‘కొనడం’ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ రంగంలోకి వ్యక్తులే కాదు సంస్థలు కూడా వచ్చిచేరినయి. క్రైస్తవ మిషనరీలు, హిందూ సంస్థలు (సరస్వతి శిశుమందిరాలు) మైనారిటీ పాఠశాలలు (మదర్సాలు) ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. ఎప్పుడైతే విద్య ప్రైవేట్ చేతిలోకి వెళ్లిందో, అప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం విస్తరించడం మొదలయింది. తక్కువగానే అయినా ఉర్దూ మీడియం కూడా మొదలైంది. ఈ ధోరణి పేరెంట్స్‌లో ఆలోచన కలగజేసింది. ఆలోచన వారిని ఇంగ్లీషు మీడియం వైపు కదిలించింది. కదలిక ఒక మోజుగా మారింది. దాని వల్ల ప్రైవేట్ ఆధ్వర్యంలో ఇంగ్లీషు మీడియం, గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలుగు మీడియం నడవడం అనివార్యమైంది. ఈ మార్పుకు దశాబ్దాలు పట్టింది. తెలుగు మీడియం విద్యార్థులంటే పల్లెటూరు వారని, ఇంగ్లీషు మీడియం విద్యార్థులంటే పట్నం వారనే విలువ స్థిరపడింది. విద్యార్థి లోకంలో విభజన వచ్చింది. ఇది కెరియర్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఈ ధోరణితో పట్టణాల్లో తెలుగు మీడియంకు ఆదరణ సన్నగిల్లింది. దీని ప్రభావం మొదట గవర్నమెంట్ స్కూల్స్ పై పడింది. అక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రైవేట్ తెలుగు మీడియం బడులు విద్యార్థులను కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసినయి. ఆ సందర్భంలోనే బడి అయిపోయాక పెద్ద తరగతి పిల్లలకు ప్రైవేట్ క్లాసులు, స్టడీ అవర్స్ పేరిట ప్రైవేట్ స్కూల్స్ ఉచితంగా చదువు చెప్పాయి. దీని వల్ల ఉపాధ్యాయులకు పనిభారం పెరిగింది. జీతం మాత్రం అంతే ఉండేది. ఇదంతా ఉనికి కాపాడుకోవడం కోసం యాజమాన్యాలు చేసిన పని. దీని వల్ల విద్యార్థులు ఆటకు దూరం అయ్యారు. ఆటలు అంటే 26వ జనవరికి జరిగేవి అనే భావన బలపడింది. ఈ విధానాల్ని ఒక్క గవర్నమెంట్ బడి తప్ప అన్ని బడులు పాటించేవి. గవర్నమెంట్ పంతులుకు పని తక్కువ, జీతం ఎక్కువ అనే మాట వినపడేది. “బతకలేక బడి పంతులు” అనే సామెత మరుగున పడింది.
ఇంగ్లీషు మీడియం బడిలో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు కాస్త ఎక్కువ ఉండేవి. కాని అందులో పనిచేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపేవారు కాదు. ఎందుకంటే అప్పటికి అందరు తెలుగు మీడియంలో చదువుకున్నవారే ఎక్కువగా ఉండడం. యాజమాన్యాలు కేరళ రాష్ట్రం వెళ్లి టీచర్స్‌ను తెచ్చేవారు. ఇక్కడ ఏ పాఠశాలలో ‘కేరళ టీచర్స్’ ఎక్కువ ఉంటారో ఆ బడికి ఎక్కువ ఇమేజ్ పెరిగింది. కేరళ టీచర్స్ ఇంగ్లీషు బోధన బాగుంటుందనేది పేరెంట్స్‌లో బలపడింది. వారికి జీతాలు కూడా ఎక్కువ ఇచ్చేవి. ఆ మేరకు ఫీజులు కూడా పెరిగినవి. ఇంగ్లీష్ మీడియం బడులు యూనిఫాం, క్లాస్ బుక్స్ పెంచడం, ఏకంగా నర్సరీ, ఎల్.కే.జీ., యు.కే.జీ లాంటి తరగతులు ప్రారంభించాయి. ఇది పేరెంట్స్‌పై అధిక బరువును మోపింది. విద్యార్థులు ఎక్కువ చదువుల భారాన్ని మోయాల్సి వచ్చింది. ఐదు సంవత్సరాలకు బడికెళ్ళాల్సిన పిల్లవాడు మూడు సంవత్సరాలకే బడికి వెళ్ళాల్సి రావడం కొత్త వైఖరులను పెంచింది. దీని వల్ల యాజమాన్యాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. హంగులు, ఆర్భాటాలు వచ్చి చేరాయి. బడి నడపడం ఖర్చులతో కూడిన పని అయింది. మామూలు నిరుద్యోగులు నడిపే పాఠశాలలు వెనుకబాట పట్టాయి. వీరి చేతుల్లో విద్య సేవలకు చెందినదిగా కనపబడింది. కాని ఎప్పుడైతే బడి నడపడం ఖర్చుతో కూడినదిగా మారిందో, అప్పుడది కమర్షియల్ విలువను సంతరించుకుంది. డబ్బున్న వాడే బడి పెట్టడం, డబ్బున్న వాడే ప్రైవేట్ బడికి పంపడం మొదలైంది. ఇది తల్లిదండ్రులకు భారమైంది. ఖర్చు వల్ల తల్లి దండ్రులకు, పెట్టుబడితో యాజమాన్యాలకు, పనిభారంతో ఉపాధ్యాయులకు, బడిగంటలు పెరగడంతో విద్యార్థులకు, ఇలా విద్య బ్రహ్మ పదార్థంలా తయారైంది.క్రీడ కాస్త పనిగా మారింది. వికాసం చెందాల్సిన విద్యార్థి, మార్కులకు పరిమితమైండు.
ఇలాంటి స్థితిలో నాలాంటి వారికి పిల్లల చదువులు గుది బండలయ్యాయి. నా పిల్లలు నాతోనే బడికి రావడం వల్ల వారికి తెలుగు మీడియమే గతి అయింది. భాష మీద నాకున్న అభిమానం కూడా వారికి శాపంగా పరిణమించింది. రామబాణంలా ఇంగ్లీషు మీడియం దూసుకెళ్ళింది. దీపావళి తారాజువ్వలా తెలుగు మీడియం కిందికి సాగింది. ఈ విధానం మార్పులకు పెద్దపీట వేసింది. అనాలోచితంగా బట్టీ పద్దతికి తెరలేపింది. ఎక్కువ డబ్బు పెట్టి చదివిస్తున్నరు కనుక పేరెంట్స్ కూడా పిల్లలకు మార్కులు రాకుంటే యాజమాన్యాలను నిలదీయడం మొదలయింది. దీంతో వారు విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయడం, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ముందే చెప్పడం, కేవలం వాటినే చదివించడం చేసేది. ఈ పెడధోరణుల విశ్వరూపమే ‘ప్రశ్నపత్రం లీక్ కావడం’. మొత్తానికి సమాజంలో ఇంగ్లీష్ మీడియం చదివిస్తే విద్యార్థులకు ఎక్కువ తెలివి వస్తుందని భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఏర్పడింది. అప్పటినుండి తెలుగు మీడియం విద్యార్థులే, ఇంగ్లీషు మీడియంలోకి వలసలు పోయారు. వీరందరికి వసతులు కల్పించడానికి అధిక పెట్టుబడులు అవసరమయ్యాయి. అది విద్య కార్పొరేటీకరణకు దారి తీసింది. దీన్ని తట్టుకోలేని బలహీన శక్తులు, పట్నాలను వదిలి పల్లెల్లో ఇంగ్లీషు మీడియం స్థాపించి సేవలు ప్రారంభించాయి. కొన్నాళ్లకు పట్టణ కార్పోరేట్ శక్తులు పల్లెలకు తమ బస్సులను విద్యార్థుల కోసం పంపడం వల్ల అక్కడి సాధారణ ఇంగ్లీషు పాఠశాలలు మూతపడ్డాయి. ప్రైవేట్ విద్య అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది.
రాసుకున్న రచనల్ని పోగొట్టుకున్న రచయిత స్థితిలా నిరామయంగా కాలం గడిచింది. పురుళ్ళు-పుట్టెంటికలతో బతుకు భారంగా కదిలింది. పాడ్యమి నాటి చంద్రరేఖ ఎదిగినట్లు పిల్లలు పెరుగుతున్నరు. దేనికీ తక్కువ కాకుండా పెంచడానికి అన్నిటిని తగ్గించుకోవడం అలవాటైంది. జీవితం గురువులాగా పాఠాలు నేర్పుతుంది. పండుగ-పబ్బాలంటే వణుకు. పూజలు-పునస్కారాలంటే బెరుకు. జేబులో తేనెతుట్టెను పెట్టుకున్నట్లుంది పరిస్థితి. సరదాలు సంతోషాలు గల్లంతయ్యాయి. బయటకు చూడడానికి పచ్చని కాపురం అనే పేరు దక్కింది. రెండు వైపులా కావాల్సిన వారు చేతులెత్తేసారు. ఒకరు ఉండి దాచుకున్నరు. మరొకరు లేక ముడుచుకున్నరు. మొత్తానికి శుష్క వాగ్దానాలు-శూన్యహస్తాలు మిగిలినయి. నిరుద్యోగం మనిషి మూలుగును చప్పరిస్తుంది. రేషన్ షాపు వరుసలో కాసేపు, గ్యాస్‌నూనె లైన్‌లో కాసేపు, పిల్లల ఆరోగ్యం కోసం డాక్టర్ వద్ద కొంతసేపు, ఇలా జీవితం ఆవిరైంది. ఎడారిలో చిక్కుబడ్డ మనిషి దాహం కోసం అల్లాడినట్లు, సర్కార్ నౌకరి కోసం ఎదురుచూడడమైంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ పడినయి. కలలో కూడా అందులో నెగ్గలేను. ఊబిలో పడ్డట్లయింది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూడడం, నిరాశపడడం కర్తవ్యంగా మారింది. చుక్కతెగిపడ్డట్టు నాలుగు ఉద్యోగాల కోసం జిల్లా స్థాయి ప్రకటన పడింది. ఉపాధ్యాయుల ఉద్యోగాలు అమ్ముకున్నరు. రాసినా రాదు. అనే మాట వ్యాపించింది. అలా ప్రాణం ఉసూరుమంది. ‘ఎప్పటిపని ఎనుగుల్ల’ అన్నట్ల యింది. కాలం గడుస్తుంది. రాష్ట్రవ్యాప్త ఉపాధ్యాయ నోటిఫికేషన్ పడింది. తెలుగు పండిట్ పోస్ట్‌లు జిల్లలో కేవలం నాలుగే ఉన్నవి. దానికి రాత పరీక్ష, మౌఖిక పరీక్షలున్నవి. యూనివర్శిటీ నుండి బైటికి రావడం తోనే చదువులు అటకెక్కినయి. తరువాత నాలుగేళ్ళు ఈతి బాధలు, సంసార యాతనలో పోటీతత్వం ఇగిరి పోయింది. కోల్పోయిన ఓపిక తెచ్చుకొని పోటీ పరీక్ష రాసిన. రాత పరీక్షనెగ్గిన. ఇక మౌఖిక పరీక్ష ఉంది. ఉద్యోగాలు అమ్మకానికి పెట్టలేదని తెలిసింది. ఏదో ధైర్యం వచ్చింది. మౌఖిక పరీక్షకు కూర్చున్న జవాబులు చెప్పిన. ఉద్యోగం పొందిన. కోల్పోయిన సర్వశక్తులు తిరిగి పొందినట్లయింది. ‘ఊబి’ నుండి బయటపడొచ్చు అనేది తేలింది. అదొక ఊరట. భరోసా.
ఉద్యోగం
అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో బయల్దేరిన. చాలా సంతోషంగా ఉంది. పేదతనం తొలిగింది. అనేక ఆలోచనల మధ్య నా బస్సు ప్రయాణం సాగింది. బీదతనం కుటుంబ సభ్యురాలుగా తిష్టవేయడం కలిచి వేసింది. అదను కోసమే అన్నట్లు కాచుకున్న ఇంటి పెద్ద పంజా విసరడంతో కకావికలమయింది మనసు. చిన్న నాటి నుండి నాతో పెరుగుతున్న ప్రత్యామ్నాయ ధోరణి నన్ను నిలబెట్టింది. లోక పరిశీలన చైతన్యాన్నిచ్చింది. ఏదో కసి స్వతంత్రంగా ఎదగడానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఇవన్నీ నేను పడిపోకుండా పట్టుకున్నయి. సంప్రదాయం పురుషుడికి పెత్తనాన్ని దఖలుపరిచింది. పెత్తనంతోనే పెత్తందారి మనస్తత్వాన్నిచ్చింది. నియంత లక్షణాల్ని ఆపాదించింది. అతడేం చేసినా, ఎట్ల చేసినా కుటుంబం కోసమే అనే ఒప్పుకోలును స్థిరపరిచింది. ఆ ముసుగులో నిన్నటి తరం వరకు ప్రేమకు బదులు అహంకారం, లాలనకు బదులు దండన రాజ్యమేలాయి. కుటుంబంలో స్త్రీలు, పిల్లలు రక్షణ పేరున బిక్కుబిక్కుమంటూ గడపడడం వాస్తవం. అలాంటి వాస్తవాల్ని బద్దలు కొట్టాలనే ఆలోచన ఒక వైపు, అధికారం చెలాయించే మనుషులపై అసహనం మరోవైపు నాలో పేరుకుని నాతోనే పెరిగాయి. అందుకే అడుగడు గున కష్టాలు ప్రతీక్షణం జీవన్మరణ సమస్యగా బతకడం దుర్బరం. ఇరవైలోనే ఎనభైలు వచ్చినట్లు అనిపించేది. అది బయటకు పరిపక్వతగా కనిపించినా, గుండె లావాలో దొర్లుతున్నట్లుండేది. ఆర్థికంగా లేకపోవడం వీటన్నింటిని రెండింతలు చేసింది. ఇప్పుడు వెసులుబాటు కలిగింది. ఇప్పటికిదే వేయిరెట్ల బలం. దిగాల్సిన బస్టాప్ వచ్చింది. దిగిన.
బడి అడ్రస్ అడుక్కుంటూ, వెతుక్కుంటూ వెళ్ళిన ప్రిన్సిపాల్ గారి రూం తెలుసుకొని అందులోకి వెళ్ళిన, నమస్కరించిన.
“ఎవరు? ఏం కావాలి?”
అపాయింట్‌మెంట్ ఆర్డర్ చూపెట్టిన.
“కంగ్రాజులేషన్స్ కూర్చోండి”
“ఏ ఊరు మీది”
“కరీంనగర్”
బెల్ కొట్టి అటెండర్‌ను పిలిచాడు. హెడ్‌మాస్టర్ గారి వద్దకు తీసుకెళ్ళు ఆజ్ఞాపించాడు. ఇద్దరం హెడ్‌మాస్టర్ గదికి వెళ్ళినం.
అది ప్రభుత్వ జూనియర్ కళాశాల. అందులోనే హైస్కూల్. రెండు కలిసి ఉండడం వల్ల ప్రిన్సిపాల్ గారే అందరికి డ్రాయింగ్ ఆఫీసర్. హైస్కూల్ మెయింటైన్ చేయడం కోసం సీనియర్ టీచర్‌కు ఇంచార్జి అప్పగించారు. ఇంచార్జ్ గారికి నన్ను అటెండర్ పరిచయం చేసిండు.
“నమస్తే సార్.” అంటూ పలకరించిన. అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందించిన.
“అభినందనలు, కూర్చోండి”
అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించి అందులో పేరు రాసిండు. సంతకం చేయమన్నడు. సంతకం చేసిన. నేనిప్పుడు గవర్నమెంట్ టీచర్‌ను. కల నెరవేరింది.
“మీ క్వాలిఫికేషన్ ఏంటి”
“యం.ఏ., బి.ఇడి”
“తెలుగు పండిట్ ట్రైనింగ్ ఎక్కడ చేసినవు”
“వరంగల్ లో”
“ఏదైనా రచనలు చేసినవా”
“లేదు సర్. అవకాశము లేదు.”
“తెలుగు సార్‌కు రచనలో ప్రవేశం ఉండాలి”
“సరే సార్”
“నా కోసం కాదు, సమాజం కోసం రచనలు చేయి”
“మంచిది సార్”
“ఇంకో గంట అయితే చుట్టి అయితది. ఇంటికి వెళ్ళు”
“మధ్యాహ్నం బడి లేదా”
“ఉదయం హైస్కూల్, మధ్యాహ్నం కాలేజి నడుస్తది”
“ఉదయం ఎప్పుడు రావాలె సర్”
“ఉదయం ఎనిమిది నుండి ఒంటిగట వరకు స్కూల్ అవర్స్”
“వస్త సార్”
“ప్రార్థనకు తప్పనిసరిగా అటెండ్ కావాలి”
“నాకు అలవాటే సార్”
“ఇంత క్రితం ఎక్కడ చేసినవు”
“ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన”
“అంటే నీకు అన్ని తెలిసే ఉంటయి. అక్కడ ఎట్ల పనిచేసినవో ఇక్కడ అట్లేచేయి”
అట్లాగే చాల సేపు కూర్చున్న అందులో పనిచేసే సార్లు ఒక్కొక్కరు వస్తున్నరు. వచ్చిన వాళ్ళకు పరిచయం చేసిండు. అందరూ నా కంటే పెద్దవారే. లేడీ టీచర్స్ ఎవరూ కనిపించలేదు.
“ఒకరిద్దరు సార్లు ఈ రోజులీవ్‌లో ఉన్నరు. రేపు వారిని పరిచయం చేస్త” అంటూ టీ తెప్పించిండు. నాకు కాస్త సిగ్గనిపించింది. స్వీట్స్ తెస్తే బాగుండనిపించింది. ‘సరే రేపుంది కదా’ అనిపించింది. వాయిదా మనస్తత్వం చావనీయదు. చుట్టీ బెల్ మోగింది. విద్యార్థులందరూ సాయంత్రం ఇంటికి మరలిన పకక్షుల్లా బయటికొచ్చారు. ఒక్కొక్కరు నాకంటే పెద్దగున్నరు. బహుశా పదవ తరగతి విద్యార్థులు కావచ్చు. వాళ్ళు వెళ్తుంటే లేచిన దుమ్ము ఉక్కిరిబిక్కిరి చేసింది. అమ్మాయిలు కనిపించలేదు. నాతో పాటు కరీంనగర్‌కు వచ్చే సార్లు చాలా మందే ఉన్నరు. అందులో ఒకరు ‘టీ’ ఆఫర్ చేసిండు. ఇద్దరం పక్కనున్న హోటల్‌కు వెళ్ళినం.
“కరీంనగర్‌లో ఎక్కడుంటవు” అడిగిండు
“రాంనగర్, మీరు సర్” అడిగిన
“మంకమ్మతోటలో” టీ తాగుతూ అన్నడు
“ఈ స్కూల్‌కు వచ్చి ఎన్నేళ్ళయింది”
“రెండు సంవత్సరాలయింది”
“అంతకుముందు”
“కరీంనగర్‌లో పనిచేసిన”
“ఇక్కడికెందుకు వచ్చిండ్రు”
“ట్రాన్స్‌ఫర్ మీద” సిగరేట్ వెలిగించిండు
“అక్కడ వేరే స్కూల్‌కు వెళ్ళొచ్చు కదా”
“దొరకలేదు. అవకాశం లేదు”
“ఇక్కడ నుండి మళ్ళీ కరీంనగర్‌కేనా”
“మనది గవర్నమెంట్ సెక్టర్. అయితే కరీంనగర్, లేకుంటే కొన్ని పాత తాలూకాల్లో ఉన్న స్కూల్స్‌కు వెళ్ళాల్సి ఉంటది. పల్లెటూర్లకు వెళ్ళే వీలు మనకు ఉండదు. అవన్నీ పంచాయతీ రాజ్ టీచర్స్‌తో నిండి ఉంటయి. వాళ్ళు పల్లెల్లో, మనం పట్నాల్లో పనిచేయాల్సి ఉంటుంది.”
హోటల్ నుండి బయటకు వచ్చినం. బస్టాండ్ వైపుకు బయల్దేరినం. సెమీ అర్బన్ లక్షణాలున్న ఆ ఊరు పాత తాలూక. ప్రస్తుతం మండల కేంద్రం. అక్కడ మూడు హైస్కూల్స్ ఉన్నవి. అందులో మాది ఒకటి. రోడ్డు పక్కనే, ప్రయాణానికి అనువుగా ఉంది. ప్రైవేట్ హైస్కూల్స్ కూడా ఉన్నవి. బుర్కపిట్టల్లా ఆటోలు తిరుగుతున్నవి. పెచ్చులూడిన సినిమా టాకీస్ వెలుగుతున్నది. మార్కెట్ పక్కనే నెహ్రూ విగ్రహం. మార్కెట్ మాయను అర్థం చేసుకోలేక వెలవెలబోతున్నది. సింగిల్ రోడ్డుకు ఇరువైపుల కొత్త భవనాలు కనబడుతున్నవి. అందులో రకరకాల దుకాణాలు కొలువుదీరినవి. వాటి వెనకాల అన్నీ పెంకుటిండ్లు. గుడిసెలు. ప్రతీ దుకాణం ముందు కొంత మంది యువకులు బాతాఖానీ కొట్టుకుంటూ కనపడుతున్నరు. ఆ గుంపులో స్కూల్లో కనిపించిన పిల్లలున్నరు. కొంతమది పిల్లలు మా ముందునుండే సైకిల్స్‌పై రయ్‌మని దూసుకెళ్ళిండ్రు. మాటల్లోనే బస్టాండ్ వచ్చింది. దాని ముందర ఒకట్రెండు జీపులు వున్నవి. “కరీంనగర్, కరీంనగర్” అంటూ అరుస్తున్నరు. అంతా కొత్తగా ఉంది.
“ప్రతిరోజు ఎట్ల వెల్తరు. బస్సుకేనా” అడిగిన.
“బస్‌పాస్ తీసిన నెలలో తప్పసని సరి బస్‌కే, లేని నెలలో జీప్ ఎక్కుడే. నీవు కూడా బస్‌పాస్ తీయి. బస్ కిరాయిలో కన్సెషన్ దొరుకుతుంది.”
“అట్లాగే”
బస్ ఎక్కినం. ఎర్రటి ఎండ. మాడు పగిలే పగలు. శరీరమంతా చెమట చెలిమెలా ఉంది. అవన్నీ కూడా నా సంతోషం ముందు ‘హుష్‌కాకి’ అయినవి. సర్వీస్‌లో ఒక రోజు ముగిసింది. జీవితంలో మరువలేని రోజుగా మిగిలింది. ఆ నాలుగు రోజులు నేను కలిసిన వాళ్ళు. నన్ను కలిసిన వాళ్ళ మధ్య అభినందనలు తారాడినవి.
(మళ్ళీ కలుద్దాం)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.