Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లేరు కాయలు-3

[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]

యవ్వనం

ఉండటం ఎక్కడ అనే సమస్య తలెత్తింది. తర్జనభర్జనలు, సంప్రదింపులు అయిన తరువాత పెద్దబాపు ఇంట్లోనే ఉండటం ఖరారు అయింది. పెద్ద కుటుంబం వాళ్ళది. వాళ్ళలో ఒకడిగా కలిసిపోయిన. వాళ్లింట్లో తింటూ, ఉంటూ చదువుకున్న. డిగ్రీ కళాశాల వాతావారణం భిన్నంగా ఉంది. అందరు అన్ని విషయాలు తెలిసిన వాళ్లు. ఆడ, మగలతో కోలాహలంగా ఉంది. నాకైతే అంతా కొత్త కానీ ఆ ఫీలింగ్‌ నాలో కలుగలేదు. క్లాసులో చాలా మంది ఉన్నరు. ఎవరు ఎప్పుడొస్తరో తెలియదు. ఎప్పుడు వెళ్తరో అంతకంటే తెలియదు. Optional Subject లో ఆరుగురం ఉండేవాళ్లం. అందరం మగవాళ్లమే. క్లాసులు అంతంత మాత్రంగా జరిగేవి. నిజం చెప్పాలంటే తరగతికి రావడానికి లెక్చరర్స్‌ ఆసక్తి చూపేవాళ్లు కాదు. తెలుగు చెప్పే సార్లలో ఒకతను పెద్ద ఆకారంతో నల్లటి శరీరంతో బాన పొట్టతో కదలమే కష్టంగా ఉండేవాడు. దానికి తోడు ‘నశం’ పీల్చేవాడు. ఆయన తరగతికి రావడమే గగనంగా ఉండేది. అతణ్ణి క్లాసుకు రప్పించడానికి మా స్నేహితుడు ఒక సారి పెద్ద ప్రయత్నం చేసిండు.

“ఎండలు కొడుతున్నయి. ఏం క్లాసులు” అని సార్‌ అన్నప్పుడు

“మీరు వస్తే వాతావరణం చల్లబడుతది సార్‌” అన్నాడు

“మాటలు బాగా నేర్చినవు”

“మీరు తరగతి వరకు రండి కూల్‌డ్రింక్‌ తెస్త” అంటూ వెళ్లిండు.

అన్నట్టుగానే డ్రింక్‌ తెచ్చిండు. సార్‌ వచ్చిండు. ఆనాటి నుండి “నడిసొచ్చే నల్లకొండ. నీ కడుపు సల్లగుండ” అని సార్‌ వెనకాల పాడడం మొదలు పెట్టిండు మా స్నేహితుడు. అలా రోజులు, చదువులు కుటుంబ వాతావరణంలో సాగినవి. మా కాలేజీ ప్రక్కనే లైబ్రరీ ఉండేది. దానికి దగ్గరే పబ్లిక్‌ గార్డెన్‌ ఉంది. నడవగలిగే దూరంలోనే హన్మకొండ చౌరస్తా ఉంది. అన్నీ అందుబాటులో ఉండడం వల్ల దేనికి కష్టం అయ్యేది కాదు. మా కళాశాలలో విద్యార్థి సంఘాలు ఉండేవి. కాని వాటి ఉధృతి అంతగా ఉండేది కాదు. రైట్‌ వింగ్‌, లెఫ్ట్‌ వింగ్‌ భావజాలాలు బలంగానే ఉండేవి. అవి ఎలక్షన్లలోనే బయటపడేవి. దీంతో బాటు ఎన్‌ఎస్‌యుఐ లాంటి ప్రభావం చూపగలిగిన విద్యార్థి సంఘం కూడా ఉంది. ఎందుకో నా మనసు వేటిపట్ల లగ్నం కాలేదు. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ, గార్డెన్‌, చౌరస్తా, ఒకరిద్దరు స్నేహితులు, ఈ ఆరు అంశాలకే నేను పరిమితమైన. వృత్తి నిబద్ధతకు ఉదాహరణగా నిలిచే ఇంద్రారెడ్డి లాంటి లెక్చరర్‌ ఇక్కడే తారసపడ్డడు. ఆయన చెప్పే రాజనీతిశాస్త్రం పట్ల ఆసక్తి ఎక్కువైంది. తరగతి గది నుండి నేర్చుకున్న విషయానికి తోడు పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల్ని లైబ్రరీలో విపరీతంగా చదివేవాణ్ణి. ఐచ్ఛికంగా తీసుకున్న ఆధునిక సాహిత్యాన్ని ఇష్టంగా చదివేవాణ్ణి. రెండు సబ్జెక్టులు నాకు రెండు కళ్లుగా కనిపించేవి. ఇంద్రారెడ్డి గారికి నేనంటే అభిమానం ఏర్పడింది. ఆయన ఆచరణ, పనివిధానం ఆశ్చర్యం గొల్పేది. చాలా మంది ఇందుకు విరుద్ధంగా ఉండేవారు.

ఎక్కువగా లైబ్రరీ పుస్తకాల్ని ఇంటికి తెచ్చుకునేవాడిని. అందరి కవిత్వం చదివిన. కృష్ణశాస్త్రి మొదలుకొని నేటి కవుల వరకు అందరినీ చదివిన. కృష్ణశాస్త్రి భావుకత, నండూరి ఎంకి, తిలక్‌ స్వచ్ఛత, రాయప్రోలు ప్రేమతత్వం. శ్రీశ్రీ విప్లవ ధోరణి ఇలా ఒక్కొక్కరి ప్రభావాలు అనంతం కథలు, నవలలు ఇలా ఏది దొరికితే అది చదవడం ఇష్టం అనిపించేది. డిగ్రీ మొదటి సంవత్సరం అంతా లైబ్రరీ పుస్తకాలతోనే సరిపోయింది. డిగ్రీలో ఇంటర్నల్స్‌ ఉండేవి. వాటి మార్కులు లెక్చరర్స్‌ వేసేవారు. వాటిని యాన్యువల్‌ పరీక్షా ఫలితాలకు జమ చేసేవారు. ఇంటర్నల్స్‌ పూర్తి అయినవి ఫలితాలు చూసుకున్నాక సంతృప్తి కలిగింది. నా మీద నాకు నమ్మకం దృఢపడింది. ఇష్టమున్న పని కష్టం అనిపించదు. పైగా అందులో విజయం సులువు. ఇంటర్నల్స్‌ ఇచ్చిన స్పూర్తితో యాన్యువల్‌ ఎగ్జామ్స్‌ పూర్తి చేసిన. ఫలితాలు వచ్చినయి. కళాశాల స్థాయిలో మంచి మార్క్స్‌ తెచ్చుకొని పదిమంది దృష్టిని ఆకర్షించిన. ఉన్నది పరాయి వాళ్లింట్లో కనుక బాపు ఖచ్చితత్వం తెలుసు కనుక. చేతి ఖర్చులకు కటకట అయ్యేది. ఖర్చులు వెళ్లదీసుకోను ట్యూషన్స్‌ చెప్పేది. చిన్న పిల్లలకు బోధన అనే అనుభవం వాటి ద్వారా నాకు అందింది. నాకు నేను సంపాదించుకునే క్రమంలో ఖర్చు ఎలా చేయాలి అనేది తెలిసివచ్చింది. ట్యూషన్‌ చెప్పడం బరువుగా ఫీల్‌ అయ్యేవాడిని. అవసరమున్నంత సంపాదిస్తే చాలు అనుకొన్నందువల్ల ఒక్క ట్యూషన్‌కే పరిమితమయిన. లేకుంటే రెండు, మూడు ఇళ్లల్లో చెప్పే అవకాశం ఉండే. ఎక్కువగా విశ్రాంతి సమయం ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు. చదవడమే పనిగా పెట్టుకోవచ్చు అనుకునేవాడిని. ఇలా రెండవ సంవత్సరం కూడా గడిచింది. ఈలోపు పస్ట్‌ ఇయర్‌లో మంచి మార్క్స్‌ ఉన్నవాళ్లు హాస్టల్‌కు అప్లయి చేసుకోవచ్చు. అని తెలిసి అప్లయి చేసిన. సీటు వచ్చింది. హాస్టల్లో ఉండని వారికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉండే. అలా ప్రతి నెలా ఆదాయం వచ్చే మార్గం ఏర్పడింది. వెంటనే ట్యూషన్‌ మానేసిన. స్వేచ్ఛా ప్రపంచంలో వొచ్చినట్లయింది. ఈ సమయంలోనే హన్మకొండలోని సాహిత్య సంఘాల పరిచయం జరిగింది. సాహితీ సమావేశాలు వక్తల ప్రసంగాలు, రచయితల ధోరణులు, సంఘాల నాయకుల ప్రవర్తన ఇలా అనేకం అవగతమైనవి. కవిత్వం చదవడమే తప్ప రాయలేదు. వచనం చదవడం కూడా ఇష్టమే. కానీ ఆ కాలం రాయడానికి అనుమతి ఇవ్వలేదు.

కళాశాల ఎన్నికలు దగ్గరయ్యాయి. ఆర్ట్స్‌ వింగ్‌, సైన్స్‌ వింగ్‌ అని రెండు భాగాల య్యాయి. గత సంవత్సరం వరకు వామపక్ష విద్యార్థి సంఘంది పై చేయిగా ఉండే. ఈ సంవత్సరం ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి నాయకుడు విద్యార్థుల్లో పట్టు నిలుపుకొన్నాడు. పైగా అతడు స్థానిక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నాయకుడి అనుచరుడిగా పేరుగాంచాడు. అలా ఆ సంఘ నాయకులు అన్ని విధాల ప్రభావాల్ని చూపి కళాశాల ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. ఆ కాలంలో విద్యార్థి సంఘాల మధ్య గొడవలు ఎక్కువగా ఉండేవి. ఒక కళాశాలలో ఒకరిది పై చేయి అయితే మరో కళాశాలలో వేరే సంఘం వారిది పై చేయిగా ఉండేది. అన్ని కళాశాలల్లో తమదిపై చేయి కావాలనే తపన అధికంగా ఉండేది. ఇదే సమయంలో వామపక్ష విద్యార్థి నాయకులపై పోలీసు నిఘా ఎక్కువగ ఉండేది. పౌర హక్కుల సంఘం చేసే పనుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండేది. మొత్తానికి పట్టణం నిత్యచైతన్యంతో తొణికిసలాడేది. కాకతీయ విశ్వ విద్యాలయం, కాకతీయ మెడికల్‌ కళాశాల, రీజనల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల. మేధావులైన ప్రొఫెసర్లతో, చైతన్యవంతులైన విద్యార్థులతో ప్రభావశీలంగా కనిపించేవి. అక్కడ జరిగే చర్చలు, ఆచరణలు, ఆలోచనలు మార్గదర్శకాలుగా ఉండేవి. ఇదే స్థాయిలో వామపక్షానికి బదులిచ్చేవిగా జాతీయవాద, దేశభక్తి పూరిత పక్షాలు ఉండేవి. వరంగల్‌ పట్టణంలో డా. రామనాథం హత్య, హన్మకొండ చౌరస్తాలో విద్యార్థి నాయకుల హత్యలు సంచలనం కలిగించాయి. ఈ హత్యలు వివిధ వ్యక్తులు చేసిన కృత్యాలు. ఖండించడాలు, అంగీకరించడాలు ఆనవాయితీగా జరిగేవి. వరంగల్‌ ఒక విద్యాకేంద్రము, చైతన్యవంతమైన ప్రదేశము. ఈ సంఘటనలన్నీ విద్యార్థిలోకంపై మెండుగా ప్రభావం చూపేవి. ఈ మొత్తం క్రమంలో అమ్మాయిలపై దాడులు, హింస జరిగేవి కావు. ప్రతీ విద్యార్థి, రాజకీయ సైద్ధాంతిక మూలాలు కలిగి ఉన్నవాడుగా కనిపించేవాడు. అశ్లీల అసహ్యకర పనులు ఎవరూ చేయలేదు.

తెలుగు ఆప్షనల్‌గా కలిగిన ఆరుగురిలో ముగ్గురం మంచి మిత్రులమయ్యాము. మాలో నాలాగే ఒకడు వాళ్ల చిన్నాయన దగ్గర ఉండేవాడు. వాళ్ళ చిన్నమ్మ, చిన్నాయనలు వృద్ధులు. వాళ్ళకు సేవలు చేసుకుంటూ చదువుకునేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. రోగిష్టి అన్న బాధ్యత వాడిపై ఉండేది. అన్న వైద్య ఖర్చులు, వీడి చదువు ఖర్చులు అన్నీ చిన్నాయన వాళ్లు భరించేవారు. వాళ్ళకు సేవలు చేసేవాడు. వాళ్ళ ఇల్లు చౌరస్తాలో ఉండేది. వాడి పరిస్థితి, వాడున్న ఇల్లు నన్ను రెండు రకాలుగా కట్టివేసాయి. మా వాడి పరిస్థితి దయనీయంగా ఉండేది. అనేక కష్టాలు చెప్పుకునేవాడు. అన్న బాధ్యత లేకుంటే ఈ చదువులో, ఈ ఊర్లో ఉండేవాణ్ణి కాదు అనేవాడు. సాయంత్రం కొద్దిసేపు చౌరస్తాలో వాహ్యాళికి వెళ్లడం అలవాటుగా ఉండేది. వాడి ఇల్లు కూడా చౌరస్తాలో ఉండడం వల్ల ఇంటికి పోయేది. అలా ఇద్దరి మధ్య ఎక్కువ సాన్నిహిత్యం పెరిగింది. ఆ స్నేహం కలిసి చదువుకోవడం వరకు సాగింది. మా ఇద్దరికి తోడుగా మరొక మిత్రుడు చేరిండు. అత్యంత పేద కుటుంబం నుండి వచ్చిన వీడు చదువుల్లో కూడా పేదగానే ఉండేవాడు. అనేక ట్యూషన్స్‌ చెప్పి సంపాదించేవాడు. సంపాదన రుచి తెలిసిన వ్యక్తి. నన్ను ఎక్కువగా ఇష్టపడేవాడు. పరీక్షలప్పుడు రాత్రుళ్లు మాతో కలిసి చదువుకునేవాడు. అనేక చాప్టర్స్‌ బోధించేవాడిని. చిత్రంగా నా కంటే ఎక్కువగా ఆయా విషయాల్లో మార్కులు తెచ్చుకునేవాడు. మార్కులైతే వచ్చేవి కాని సబ్జెక్టుపై అవగాహన ఉండేది కాదు. పరీక్షల సమయంలో చదివి గట్టెక్కేవాడు. తెలుగు ఐచ్చికంగా తీసుకున్నా ఇష్టంగా చదివేవాడు కాదు. ఈ స్నేహం ఫైనలియర్‌ పరీక్షల వరకు సాగింది. ఫైనల్‌ పరీక్షలయ్యాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణుడనయ్యాను.

సెలవుల్లోనో, మరో సందర్భంలోనో హన్మకొండ నుండి మా ఊరికి వెళ్ళేవాణ్ణి. ఇంట్లో ఉన్న ఒక్క స్త్రీ మూర్తి నాయనమ్మ వృద్ధాప్యంతో ఘర్షణపడుతూ ఉంది. దానిమ్మ గింజల్లాంటి దాని పలువరుస మాయమై, ఆకులూడిన కొమ్మలా బోసిపోయిన నోరు మిగిలింది. నా ఎదుగుదలలో నాయనమ్మ పాత్ర గణనీయమైనది. ఆమె సుఖం కోసం నేనేమైనా చేయగలనా? అనిపించేది. ఏదో ఒకటి చేయాలని అనిపించేది. నెరవేర్చలేని ఆ కోరిక నాపై వేసిన భారం కింద నలిగిపోయేది.

నాయనమ్మ జ్ఞాపకమొస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. చిన్నతనాన వైధవ్యం ప్రాప్తించింది. కొడుకును వెంటేసుకుని అన్నల ప్రాపకంతో జీవితం వెళ్లదీసింది. కొడుకు పెద్దయ్యాక మా కుటుంబానికి ఊడిగం జేసింది. రుబ్బురోలు జీవితం నాయనమ్మది. ఎంతసేపు ఆ ఇంట్లోనే తిరగాల్సిఉండేది. బహుశా ఈ పరిస్థితులేనేమో ఆమెలోని తడిన ఇగిర్చినవి. ఎటు పోవాలన్నా ఏమి చేయాలన్నా కొడుకు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఈ పరిస్థితిలో అప్పుడప్పుడు ఆమెకు విడిది కేంద్రంగా వాళ్ల అన్నయ్య ఉండేవాడు. అక్కడికి నన్ను వెంటేసుకుని వెళ్లేది.

ఆ కాలంలో తాత మా కులం కాని స్త్రీతో సహజీవనం చేసాడు. అరడజను పిల్లల్ని కన్నాడు. అదేమి చిత్రమో కాని, ఆమె చేతివంట తినేవాడు కాదు. ఆమె తన పిల్లలకు వండి పెట్టుకుంటూ పనిచేసుకుంటూ బతికేది. అందరూ ఒకే కప్పు కింద ఉండేవారు. తాత పురోహితుడు. ఆ ఊరిగుట్టపై ఉన్న తాపాల నరసింహాస్వామి గుళ్లో అర్చకత్వం చేసేవాడు. ప్రసాదాలు వండడం, పెట్టడం లాంటి పనులు ఎక్కువ ఉండేవి. అందుకే మా నాయనమ్మ రావడం ఆయనకు ఆటవిడుపుగా ఉండేది. వాతావరణ మార్పు మాకు బలాన్నిచ్చేది. ముఖ్యంగా గుట్ట ఎక్కడం, దిగడం, కాలువ నీళ్లల్లో ఈదులాడడం, చింతకాయ కొట్టుకొని తినడం లాంటి బాల్య చేష్టలు అత్యంత మానసిక ఆనందాన్నిచ్చేవి. అక్కడ అమ్మమ్మ చూపిన ఆప్యాయత మరువలేనిది. కులానికి, గుణానికి సంబంధం ఉండదు అనడానికి చదువులేకున్నా సంస్కారం ఉంటదని చెప్పడానికి ఆమె ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆ ఇంటికి వెళ్లడం నాయనమ్మకు ఒక టానిక్‌లా పనిచేసేది. తల్లిగారింటికి వెళ్ళిన తలపు ఆమెలో స్పష్టంగా కనపడేది. అది తప్ప ఆమె జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ కనపడవు. అలాంటి ఊరు ‘లోయర్‌ మానేర్‌ డ్యాం’ ప్రాజెక్టులో భాగంగా నీట మునగటం ఒక కఠోర వాస్తవం.

నా ఆలోచనలే నన్ను వృత్తి విద్య వైపు నడిపించాయి. నేను చదివిన తెలుగు ఆప్షనల్‌తో ‘తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌’ చేసే అవకాశం లభించింది. అందులో జాయిన్‌ అయ్యాను. ముగ్గురు మిత్రుల్లో ఒకరికి ట్రైనింగ్‌ సీటు రాలేదు. ఇద్దరం జాయిన్‌ అయినం. కాలం ఆటపాటలతో గడిచింది. ఇది ట్రైనింగ్‌ కాలం. కాలేజీలో గడిపినట్లు ఎంజాయ్‌ చేయడం కుదరదు అని లెక్చరర్స్‌ అనేవారు. తొమ్మిది నెలల కాలం అలవోకగా గడిచింది. మాకు ట్రైనింగ్‌లో అడ్మిషన్స్‌ లేట్‌ కావడం మూలంగా చాలా వరకు తరగతులు జరగలేదు. కాలేజీలో జరిగిన ప్రతి ఫంక్షన్‌లో పాల్గొనేవాడిని. నా చురుకుదనమే నన్ను పదిమందికి పరిచయం చేసింది. కోర్సు కాలం పూర్తవస్తోంది. నాలో ఎక్కడా లేని నిస్సత్తువ ఆవరించింది. పరీక్షల తరువాత ఎటు వెళ్ళడం? ట్రైనింగ్‌ పరీక్షలకు ముందే రంది మొదలయింది.

“ఇదివరకులా చురుకుగా ఉండడం లేదెందుకు”

“ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా”

“ఆర్థిక ఇబ్బందులా”

“ఆరోగ్యం బాగాలేదా”

“ఎవరికైనా ప్రమాదం జరిగిందా”

“నాకు తెలిసి కాలేజీలో ఎలాంటి ఇబ్బంది నీకు జరగలేదు”

ఇలాంటి ప్రశ్నలు అనేకం నా మిత్రులు వేయడం ఇబ్బంది కలిగించింది. ఎప్పటిలా ఉండడం మంచిది అనుకున్న ఆ రోజుల్లోనే అంటే మేం ట్రైనింగ్‌లో జాయిన్‌ అయిన కొత్తలో ఇందిరాగాంధీ హత్య జరిగింది. అంగరక్షకుల చేతుల్లోనే ఆమె హత్యకు గురి కావడం జాతి యావత్తును కలవరపెట్టింది. తనను కాలుస్తున్న సిక్కు పోలీస్‌ రక్షకుడిని చూస్తు “యే ఆప్‌ క్యాకర్‌ రహేహో” అన్న మాట కొన్ని రోజులు ప్రపంచమంతా ధ్వనించింది. ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ప్రతిధ్వనిగా హత్య జరిగిందనేది జగద్విదితం. ఊహకు కూడా అందని ఘటనలో నిస్సహాయంగా ఆమె నోటి నుండి వచ్చిన మాట మనసును కదిలించింది. ఆమె మరణానికి సంతాప సూచకంగా కాలేజీ ఆడిటోరియంలో పెద్ద సభ జరిగింది. ఆ సమయానికి కాలేజీ పరిసరాలు నాకు కొత్తనే. కానీ ఆనాడు సభలో మాట్లాడిన విధము, నేనిచ్చిన నినాదాలు ఇప్పటికీ గుర్తున్నవి. “జబ్‌తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేగా, తబ్‌తక్‌ ఇందిరాజీ కా నామ్‌ రహేగా” అనే నినాదం సభంతా మారు మోగింది. ఆనాటి చురుకుదనం ఈనాడేమైంది? రంది నీడ లాగా మనిషి వెంటే ఉంటుంది. ఉత్సాహం ఉదృతంగా ఉరకలెత్తే సమయాన కురచగాను, ఆలోచనలు, బాద్యతల బరువు పెరిగి మనిషి కుంగిన సమయాన పొడవుగానూ రంది సంకోచ, వ్యాకోచాలను కనబరుస్తుంది. ముందున్న పరీక్షలు కర్తవ్యాన్ని గుర్తుచేసాయి. పరీక్షల భయం అనేది లేదు. అర్థవంతంగా పరీక్షరాసి, ఫలవంతంగా ఫలితాల్ని అందుకొన్నాను.

ఒంటరిగా శిక్షణా కళాశాల మెట్లు దిగుతున్న సమయాన ఒక్కసారిగా ఆలోచనలు ముసురుకున్నాయి. ఊర్లోని ప్రాథమిక పాఠశాల విద్య చెట్లకింద, వర్షం వస్తే కురిసే గుడిసెలోపల జరిగింది. ఉన్నత పాఠశాల ఇరుకు గదులకు, చెమట కంపుకు గుర్తుగా మిగిలింది. రేకుల షెడ్స్‌ అయినా, అరకొర వసతులతోనైనా కొంతవరకు జూనియర్‌ కళాశాల నయమనిపించింది. వసతులు కరువై కొన్నాళ్ళు ఒక్కపూట నడిచిన డిగ్రీ కళాశాల చాలా అనుభవాల్ని ఇచ్చింది. శిక్షణా కళాశాల బతుక్కి ఒక భరోసాను కల్పించింది. మొత్తంగా హన్మకొండ బతుకులో విడదీయరాని భాగమైంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఇక్కడే చేయాలనిపించింది. అందుకు ప్రవేశ పరీక్ష రాయాలి. అందులో మెరిట్‌ పొందాలి. దానికి కఠినంగ శ్రమించాలి. హన్మకొండలో ఉండి చదవడానికి, తయారు కావడానికి స్థలం లేకుండా అయింది. పెద్ద బాపు ఇంటి పరిస్థితి మారింది. కనుక కరీంనగర్‌లోనే ఉండి చదవడం మొదలు పెట్టాను. కలిసి చదువుకున్న అలవాటువల్ల, ఒంటరిగా చదవలేకపోయిన. మొత్తానికి ఎలాగోలాగా ప్రవేశ పరీక్ష రాసిన. వచ్చిన మార్కులతో ఎం.ఏ.లో సీటు వస్తదో లేదో అనే అనుమానం వచ్చింది. అనుమానం నిజమైంది. నా దారిలోనే డిగ్రీలో సహాధ్యాయి అయిన మిత్రుడు నడిచాడు. ఆపద్భాంధవిలా నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు వారి నోటిఫికేషన్‌ కనిపించింది. అందరం అప్లై చేసినం. అక్కడ డిగ్రీ మార్కులతోనే ప్రవేశాలు కల్పించారు. మాలో కొంత మందికే ఎం.ఏలో ప్రవేశాలు దొరికాయి. నాకు తెలుగు మరియు ప్రాచీన చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ప్రవేశం లభించింది. నాతో ఉన్న స్నేహితుడికి నిరాశే మిగిలింది. నాన్‌లోకల్‌ కోటా కింద మాకు సీట్స్‌ దొరికినయి. నేను జాయిన్‌ కాకపోతే తెలుగు యం.ఏ.లో నా వెనకే ఉన్న నా మిత్రుడికి సీట్‌ దొరుకుతుందని తేలింది. అందుకనే నేను యం.ఏ. తెలుగులో కాకుండా యం.ఏ (ఏనిషెంట్‌ హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ) అనే కోర్సులో జాయిన్‌ అయిన. ఇద్దరం మిత్రులం ఆ విధంగా యం.ఏ. రెగ్యులర్‌గా నాగార్జున యూనివర్శిటీలో చదువగలిగాము.

కొత్త ప్రదేశము, మాట, యాస కూడా కొత్త. నాగార్జునా యూనివర్సిటీలో అడుగు పెట్టేసరికి కొత్తలోకం లోకి ప్రవేశించినట్లయింది. పక్కన పాత మిత్రలు ఉండడం కొండంత అండ. మాట్లాడేది తెలుగైనా దీర్గం తీసి శానిగా మాట్లాడుతుంటే వినబుద్ది అయ్యేది. విచిత్రంగా అనిపించేది. వాళ్ళలోను పలికే పలుకుల్లో భేదం కనిపించేది. కోస్తాంధ్రలోను అందరూ ఒకే తీరు మాట్లాడరు. పత్రికల్లో రేడియో, టీవీల్లో వచ్చే భాషను పలికేవాళ్లు తక్కువ మంది. వీళ్ళు మిగతావాళ్లను ‘పడమటోళ్లు’ అని గేలిచేసే వారు. ఎస్సీ, బీసీలకు కలిపి ఒక హాస్టల్‌, విమెన్స్‌ హాస్టల్‌ ఒకటి. ఓసీలకు వేరుగా ఒక హాస్టల్‌ ఉండేవి. కులాల వారిగా హాస్టల్స్‌ ఉండడం అప్పటికి మాకు కొత్త. అదే సమయంలో హిందూ కాలేజి, ఏసీ (ఆంధ్ర క్రిస్టియన్‌) కాలేజీ లాంటి ప్రఖ్యాత కళాశాలలు కనిపించాయి. ఇదంతా ఆలోచింపజేసింది. అక్కడి విద్యార్థులు ఆనాడే కుల, మత ప్రాతిపదికన విభజితమైనారు. వామపక్ష విద్యార్థి సంఘాల్లో కూడా కులాధిక్యం ఉండేది.

నేను ఉన్న హాస్టల్‌లో అందరు ఎస్సీ, బీసీలు ఉండడం, వారు ఆంధ్రప్రాంతం వారు కావడం కొత్త అనుభూతినిచ్చింది. కులాల వారీగా విభజించడం ఆదర్శప్రాయం కాదు. కాని అందరి సామాజిక, ఆర్థిక స్థితిగతులు దాదాపు ఒక్కటిగా ఉండడం వల్ల కలుపుగోలుతనం సాధ్యమైంది. బుక్స్‌, నోట్స్‌, డ్రెస్‌లు ఇలా ఒకరివి మరొకరు వాడుకోవడం వల్ల సన్నిహితం పెరిగింది. ఆర్థిక భారం తగ్గింది. హాస్టల్‌ పుణ్యమా అని రెండు డ్రెస్‌లతో రెండు సంవత్సరాలు గడపడం జీవితాంతం యాది పెట్టుకోదగిన విషయం. డబ్బు లేనితనం, హాస్టల్‌లో మిత్రుల సాంగత్యంతో తెలియలేదు. డిగ్రీ నుండి ఇంట్లో డబ్బులు అడగకపోవడం ఒక నిష్ఠుర నిజం. అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు పేదరికం వరించి వచ్చింది. డిగ్రీ నుండి చదువు పూర్తయ్యేవరకు హాస్టల్‌లో స్కాలర్‌షిప్స్‌తో కాలం గడిచింది.

తెలంగాణ విద్యార్థులపై చిన్న చూపు చివుక్కుమనిపించేది. ‘నైజామోడు’ అనేవారు. ప్రొఫెసర్లలో కూడా ఈ ధోరణి ఉంది. దాని వల్లనే నాకు ఇష్టమైన ‘రాజనీతి శాస్త్రం’లో సీటు రాకుండా పోయింది. “నీవు వెళ్ళి కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువు” అన్న నాటి ప్రొఫెసర్‌ మాట ఇప్పటికీ ‘ఫజర్‌’ నమాజు ముందు వినిపించే ‘అజా’లా మారు మోగుతుంది. విద్యార్థుల్లో పేద, ధనిక అనేది స్పష్టంగా కనిపించేది. ఒకవైపు అత్యంత దుర్భరత తాండవిస్తుంటే మరోవైపు సంపద పోగుపడి ఉండేది. ఆహారంపై శ్రద్ద అధికం. హోటల్స్‌ ముందు అలుకు చల్లడం, తోరణాలతో అలంకరించడం ఆకర్షించేవి. ఇడ్లీ, సాంబార్‌ను రకరకాలుగా తినేవారు. హాస్టల్లో సాంబార్‌తో పెరుగు తప్పనిసరి ఇచ్చేవారు. ఎనభైలోనే విశ్వవిద్యాలయంలో ఆడ, మగ కలిసి సినిమాల్లో తిరిగినట్లు గడిపేవారు. తెలంగాణలో పోలీస్‌ ‘రైడింగ్‌’ అంటే విద్యార్థులను ‘సంఘ వ్యతిరేకులు’ అనే ముద్రవేసి పట్టుకెళ్ళడం అని అర్థం. ఇక్కడ రాత్రిళ్లు యూనివర్సిటీ బాయ్స్‌ హాస్టళ్లలో పోలీస్‌ రైడింగ్‌ జరిగేది. అలా జరిగినప్పుడల్లా హాస్టల్స్‌ నుండి ఒకరిద్దరు అమ్మాయిలను పట్టుకెళ్లేవారు. అబ్బాయిలపై కేసులు నమోదయ్యేవి. రాత్రిళ్లు విద్యార్థులు వ్యభిచరిస్తూ పట్టుబడేవారు. పగలు కూడా అప్పుడప్పుడు ‘స్నేహం’ పేరిట అబ్బాయిల గదుల్లో యూనివర్శిటీ అమ్మాయిలు కనిపించేవారు. ‘అడ్వాన్స్‌డ్‌ సొసైటీ’ అనే మాట ఆ సందర్భాల్లో తరుచుగా వినిపించేది.

తెలంగాణలో నాకు ముస్లిం స్నేహితులు అధికం. వాళ్లలో ఉర్దూ భాష రానివారు లేరు. వాళ్ళ తెలుగు భాషలో స్పష్టత కరువు. ఇక్కడి సాయబులు (ముస్లింలు) స్పష్టంగా తెలుగు మాట్లాడడం సంతోషం కలిగించింది. వీళ్ళలో ముస్లిం ఫండమెంటలిజం తక్కువ. ‘మస్తానయ్య’ లాంటి పేర్లు హిందువులలో అధికంగా కనిపించాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒక ముస్లిం విద్యార్థి తరుచుగా క్యాంపస్‌లో కనిపించే వాడు. తలపై ‘కుల్ల’, షేర్వాని ధరించి ప్రత్యేకమైన ఆహార్యంతో కనిపించేవాడు. చూడగానే ‘హైదరాబాదీ’ అనిపించేవాడు. మూడుసార్లు నమాజ్‌ చేసేవాడు. కొద్దికాలంలోనే అక్కడి ముస్లిం విద్యార్థులతో కలిసిపోయి తన అస్తిత్వాన్ని ప్రదర్శించాడు. తన మతస్తులతో కలిసి ఒక చిన్న గ్రూపును ఏర్పాటు చేశాడు. అంతకు ముందు కనిపించని ఆ గుంపు అతని నాయకత్వ పటిమకు నిదర్శనంగా కనిపించింది. తెలంగాణ ముస్లిం విద్యార్థికి అక్కడి ముస్లిం విద్యార్థులకు తేడా స్పష్టంగా కనిపించేది. హైదరాబాదీ విద్యార్థులకు మైనారిటీ స్పృహ ఎక్కువ.

ఆనాడున్న చిన్న యూనివర్శిటీలలో నాగార్జున ఒకటి. తక్కువ పరిధి కలది. యూనివర్శిటీలో కులం ఆధిపత్యం వహించేది. అణగారిన, అట్టడుగు కులాల నుంచి ఎక్కువ విద్యార్థులు ఉన్నారు. వీరు ఆర్థికంగా కొంత అభివృద్ది చెందడం వల్ల విద్యాపరంగా ముందంజలో ఉన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు ఇరువురిలో కూడా కులస్పృహ అధికం. అలా యూనిర్శిటీ మొత్తం విభజితమై ఉంది. సందర్భానుసారంగా అది బయటపడేది. నిమ్న కులం వారు “మీ కంటే మేం ఏం తక్కువ” అనే ధోరణిలో ఉండేవారు. ప్రతీచోట ఆత్మగౌరవం ప్రదర్శించేవారు. దీనికి తగ్గట్టుగా అగ్రవర్ణాల వారు ఒక్కటిగా ఉండి ఆధిక్యాన్ని ప్రదర్శించేవారు. పరోక్షంగా రెండు వర్గాలు ఎదురెదురుగా మోహరించి ఉండేవి. ప్రచ్ఛన్న యుద్ద వాతావరణం ఉండేది. తెలంగాణాలో ‘బాంచెన్‌ కాల్మొక్త’ బతుకులు ఉన్నవి. ఇక్కడి అడుగు వర్గాలు ఆకలికి అర్రులు చాచినట్లుండేవి. ఆకలి తీరడానికి భూమి ఉండడం ఒక్కటే మార్గం. అదే భావన రోజులు పోయే కొద్ది పెరిగింది. అందుకే ఇక్కడ భూ పోరాటాలు సాధ్యమయ్యాయి. ఇక్కడివన్నీ ఆకలి పోరాటాలు. అక్కడివన్నీ ఆత్మగౌరవ పోరాటాలు. అక్కడ జరిగిన కారంచేడు సంఘటన ఈ విషయాల్ని విదితం చేసింది.

జీవితంలో హాస్టల్‌ తిండి రుచి చూసింది నాగార్జునలోనే. ఉన్నత పాఠశాల నుండి ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు స్వయంపాకమే. ఉప్పో-కారమో, పప్పో-పులుసో, ఏదో ఒకటి అన్నట్లుగా గడిచింది. డిగ్రీలో పెద్దమ్మ చేతి వంటతో కడుపు నిండింది. యూనివర్శిటీ రెండు సంవత్సరాలు హాస్టల్‌ తిండి. ఆదివారం చికెన్‌, మధ్యలో ఒక రోజు గుడ్డు ఇచ్చేవారు. ప్రతిరోజు రసం, సాంబార్‌, చట్నీ మాత్రం ఉండేవి. హాస్టల్‌ మొదటి సంవత్సరం బాగానే అనిపించింది. రెండవ సంవత్సరం నుండి కడుపు నొప్పి మొదలైంది. మజ్జిగతో గడిపిన రోజులున్నయి. హాస్టల్‌ వదిలితే తిండి కరువు. వదలకుంటే కడుపునొప్పి. కొందరు తినడానికే హాస్టల్లో ఉంటున్నామన్నట్లు తినేవారు. వాళ్ళను చూస్తే అసూయగలిగేది. ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక వరమే.

అనారోగ్యంతో ఇంటికొచ్చి నెలరోజులు గడిపిన.

“వెంకటరమణా చాతనైతలేదురా” అంది నాయనమ్మ

“నేనేం చేయాల్నే నీకోసం” అత్తిపత్తి మొక్కలా ఉంది నా స్థితి.

“ఎన్ని రోజులుంటనో తెలియదు నాలుగు అక్షింతలు నీ మీద వెయ్యాలనుందిరా” అంది.

వృద్ధాప్యం, అనారోగ్యం రెండూ నాయనమ్మను ఆవరించినయి. తన అవసాన దశలోనైనా నాయనమ్మను సుఖపెట్టాలనిపించింది. అందుకు నేను చేయగలిగేది పెళ్ళి చేసుకోవడమే. అప్పటికింక చదువు పూర్తి కాలేదు. ఇంటి పరిస్థితులు ఊపిరాడనివ్వలేదు. ఎలాంటి ఆలోచన లేకుండా తల వంచుకొని తాళికట్టిన. ఆమెను ఇంట్లో ఉంచి పరీక్షలు రాయడానికి గుంటూరు వెళ్ళిన. బతుకంటే ఏమిటో ఆలోచించకుండా చేసిన పని అది. పరీక్షలు ముగించుకొని ఇంటికొచ్చిన నాకు నాలుగు మూలల నుంచి సమస్యలు చుట్టుముట్టినయి. ఒక చేత నిరుద్యోగిత, మరోచేత సంసార బాధ్యత అందుకొని అడుగుముందుకు వేసిన. ప్రైవేట్‌ ఉపాధ్యాయుడిగా కుదురుకున్న.

చాలా కాలానికి నాగార్జున యూనివర్శిటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడో పాత జ్ఞాపకం తట్టింది. ఎన్నో యాదులు కదిలినయి. రెండు కళ్ళు వేయి చూపులై కలయ జూచినయి. అనూహ్యమైన మార్పులకు గురైన ఆ ప్రాంగణంలో పురాతన చిహ్నాలను వెతికి ఆనాటి మైలురాళ్ళను పట్టుకోవాలనుకున్న. పురాస్మృతులు అలలు అలలుగా మెదడు పొరలను తాకుతుంటే భౌతికంగా వాటి జాడలను కనుక్కోవాలని పరితపించిన. యాతనే మిగిలింది. కాస్మోపాలిటన్‌ పొర ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హరిత వర్ణపు పచ్చి వాసనలతో నిండిన ఆ ప్రదేశం నేడు బాడీస్ప్రేల సుగంధాలతో కాంతులీనుతుంది. అర్థరాత్రి వచ్చినా, బార్లా తీసివున్న హాస్టల్‌ తలుపులు ఆహ్వానించేవి. ఇప్పుడవి పగటిపూట కూడా గూర్ఖా చేతిలో బందీ అయి ఉన్నవి. ప్రహరీయే లేని వసతి గృహం గాజుపెంకులు, ఇనుపముళ్లతో అలంకరించబడి ఉంది. నేను బతికిన గది అందులోనే ఉందనిపించింది. ఆనవాళ్ళు కూడా లేకుండా మారిందది. లోపలికెళ్దామంటే సైంధవుడిలా వాచ్‌మెన్‌. ఆనాడు ప్రేమజంటలకు అనేక పొదరిళ్ళు ఉండేవి. నేడు అలాంటి జంటలు టీ కార్నర్స్‌ దగ్గర ఊసులాడుకుంటున్నవి. ప్రణాళికాబద్దంగా, కంటికి ఇంపుగా ఉన్న నిర్మాణాలు అధునాతన సొబగులను, బోన్సాయ్‌, హరితవర్ణాల్ని పొదవికొని ఉన్నవి. ఆనాడు అక్కడ మోస్ట్‌ లగ్జూరియస్‌ లైఫ్‌ చూసి ఆశ్చర్యపోయిన. ఈనాడు మోస్ట్‌ లంపెన్‌ కల్చర్డ్‌ లైఫ్‌ చూసి విస్తుపోయిన.

‘మండల్‌-కమండల్‌’, ‘కారంచేడు’, ‘బడ్జెట్‌’, ‘పౌరహక్కులు’, ‘కులవాదం’, ‘వామపక్షభావజాలం’ మొదలగు అనేక సమస్యలపైన, సమకాలీన అంశాలపై ప్రగతిశీల చర్చలకు విశ్వవిద్యాలయంలో చోటుండేది. ఈనాడు ర్యాగింగ్‌, కన్జ్యూమరిజం, కెరియరిజంలు బాడీ లోషన్‌లు పూసుకొని తిరుగుతున్నవి. అందులో చదువుతూ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తలపులు ‘పాటు, పోటు’ల్లా మెదడును కల్లోలానికి గురిచేసినయి. నా తల ఒక కల్లోలిత ప్రాంతమైంది. ఆత్మహత్యకు ఒక ప్రొఫెసర్‌ కారణమైనట్లు, అధికారంలో ఉన్న అతని చేష్టలు ఆధారమైనట్లు మీడియా ఎలుగెత్తి కూసింది.

ఆనాడు ‘లా’ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ప్రొఫెసర్‌ గుర్తుకొచ్చిండు. ఆయన చైన్‌స్మోకర్‌. ఎప్పుడు చూసిన ఫిల్టర్‌ సిగరేట్‌ ఒకటి ఆయన వేళ్ళమధ్య కాంతులీనేది. ఒకరోజు అందుకు భిన్నంగా కన్పించాడు.

“ఏంటి సార్‌, ఫిల్టర్‌ లెస్‌ సీజర్స్‌ సిగరెట్‌ తాగుతున్నారు?” అని ఆశ్చర్యంగా అడిగిన.

“కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. సిగరేట్‌ ధరలు మండుతున్నవి. ఫిల్టర్‌ సిగరెట్‌ ధర అటకెక్కింది. నేను అటకెక్కలేను కదా! కనుక ఫిల్టర్‌లెస్‌ పొగ తాగుతున్న” అంటూ జవాబిచ్చిండు.

“మీకొచ్చే జీతానికి ఫిల్టర్‌ సిగరెట్‌ కొనుక్కోవడం అంత కష్టమేం కాదు కదా”

“మనం ఏ ప్రజల కోసమైతే ఆలోచిస్తున్నామో, వారి జీవన ప్రమాణం ఈ బడ్జెట్‌తో నేలకు దిగింది. కనుక నేను కూడా తక్కువ రేటు సిగరేట్‌ తాగుతున్న”

“సిగరేట్‌ మానేస్తే అన్ని విధాల నయం కదా సార్‌”

“అది నా వల్ల కావడం లేదు” ఒప్పుకున్నాడు.

అలాంటి ప్రొఫెసర్‌ను చూసిన ఈ నేలమీద ఇలాంటి ఆచార్యుణ్ణి తలచుకోవాల్సి రావడం ఒక విషాదం. కాలం ముందుకా, వెనక్కా వెళ్ళేది. తెలుస్తలేదు.

ఆనాటి నా అడుగుల కోసం పిచ్చెత్తినట్లు తిరగిన. ఆనాడు మాకు కేరాఫ్‌గా ఉన్న క్యాంటీన్‌ వైపు వెళ్లిన అది ఉంది. కాని రూపు చెదిరింది. వెనక్కి తిరిగి తరగతి గదుల కోసం వెతకడం మొదలు పెట్టిన ఏదో నమ్మకం ముందుకు నెట్టింది. మార్నింగ్‌ వాక్‌ సమయమది. డిపార్ట్‌మెంట్‌ అడ్రస్‌ ఎవరినైనా అడగాలనిపించింది. పల్చగా ఉంది జనం. దూరదూరంగా కనిపిస్తున్నారు. అడగలేక ముందుకెళ్ళిన కాస్త దట్టంగా ఉన్న చెట్ల మధ్య నుండి, పాత పరిమళాల్ని పంపుతూ కనిపించిందో భవనం. పదడుగులు వేసిన. నారచీర కట్టుకున్న సీతమ్మ వారిలా నిల్చునుందో భవనం. ఏడుస్తున్న పసివాడికి తాయిలం దొరికినట్లుగా ఉంది నా పరిస్థితి. అది హ్యూమానిటీస్‌ బ్లాక్‌. మూడు దశాబ్దాల నాటి కట్టడం. ఎలాంటి మార్పుకు గురి కాకుండా ఉంది. ముందున్న తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. లోపలికెళ్ళి చూస్తే తరగతి తలుపుల తాళం వెక్కిరించింది. పై ఫ్లోర్‌ కెళ్ళి చూసిన అనేక జ్ఞాపకాలు ఊపిరాడనీయలేదు. ఏమాత్రం మార్పులేదు. బయట జరిగిన మార్పు, ఈ బ్లాక్‌లో జరగని మార్పు రెండూ ఆశ్చర్యార్థకాలే. డిపార్ట్‌మెంట్‌ గోడలపై ఉన్న స్టాఫ్‌ వివరాలు వెక్కిరించినయి. అనేకులు కాంట్రాక్ట్‌ బాపతులే. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశాన్ని వీడి, బయటికి వచ్చిన. లతాగుల్మాదులతో నిండిన సెలయేటి పచ్చిక బయలు నుండి ఆకాశాన్ని ముద్దాడాలనే తహతహలాడే నిర్మాణాల మధ్య కాలిడిన. రెండు ప్రపంచాలు, రెంటికి ప్రత్యక్ష సాక్షిని, అంతర్జాతీయ పరిణామాలను ధోరణులను పుక్కిట పట్టుకొని ఉన్న విద్యాలయం కళ్ళ ముందు కనిపిస్తుంది. అటవీ ప్రాంతపు గురుకుల శోభతో జ్ఞానతృష్ణతో ఉన్న నాటి విద్యాలయం గురుతులతో ఉంది. గతానికి, వర్తమానానికి మధ్య నడుస్తున్న బాటసారిని, తిరుగుబాట పట్టిన ప్రయాణీకుడిని.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version