Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లేరు కాయలు-2

[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]

కౌమారం

కడప బయట కాలు పెట్టిన. ఇంతవరకు చదువు, బతుకు ఒకరి పర్యవేక్షణలో గడిచింది. స్వేచ్ఛా ప్రపంచం చేరువైంది. కరీంనగర్‌ పట్టణంలోని పాఠశాలలన్నింటిలో ధన్గర్‌వాడి ఉన్నత పాఠశాలకు మంచి పేరుంది. అందులో సీటు దొరకడం కష్టం. కాంపోజిట్‌ మాథ్స్‌ సెక్షన్‌లో దొరకడం ఇంకా కష్టం. అయినా దొరికింది. అప్పట్లో జనరల్‌ మ్యాథ్స్‌, కాంపోజిట్‌ మ్యాథ్స్‌ అని రెండు రకాలుండేవి. కాంపోజిట్‌ మాథ్స్‌లో సిలబస్‌ ఎక్కువ కఠినంగా ఉండేది. చిన్నప్పటినుండి మ్యాథ్స్‌ అంటే భయం. నా పరిస్థితి ఊరపిచ్చుకకు రోకలిబండ కట్టినట్లయింది. బాపు వర్కింగ్‌ స్టైల్‌ అది. పట్టణ పాఠశాల, పల్లెబడి కంటె భిన్నంగా ఉంది. అందరు కొత్తవారు. అధిక సంఖ్య. ఇరుకు గదుల తోటి గజిబిజిగా ఉంది బడి. ఆనాడు ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య కూడా తక్కువే. ఈ రెండు రకాల పాఠశాలల పిల్లల, ఆహార్యంలో విభజన స్పష్టంగా కనిపించేది. ఒక వైపు ఉర్దూమాట. మరోవైపు తెలుగు మాట. ఆడపిల్లల వేషధారణ, అందులోనూ ముస్లిం అమ్మాయిల వేషధారణ ఆకర్షణీయంగా ఉండేది. పల్లె నుంచి వచ్చిన నాకు అంతా వింతగా అనిపించేది. అందరు సార్లతో పాటు ‘కీసుపిట్ట సార్లు’ (పి.ఇ.టి.) ఇద్దరు ఉండేవారు. టీచర్ల సంఖ్య కూడా ఎక్కువ. మూడు సెక్షన్స్‌ ఉండేవి. సార్లకు ఆడపిల్లలకు అభిమాన సంఘాలుండేవి. లేడీ టీచర్స్‌ తక్కువ. ఒకరు చెప్పడంలో మరొకరు చదివించడంలో, ఇంకొకరు రాయించడంలో వేరొకరు దండించడంలో తలా ఒక రీతి కనిపించేది. ఒకాయనైతే క్రమశిక్షణ పేరున విపరీతంగా కొట్టేవాడు. ఆయన దండనలో కసి కనిపించేది. గూండాలా కనిపించేవాడు. ఆయనకు అందరు భయపడేవారు. విద్యార్థుల మధ్య జరిగే గొడవలు, బయట నుంచి వచ్చే ఒత్తిడులు ఆయన వరకు వచ్చి ఆగేవి. తనను తాను బడి రక్షకుడిగా భావించేవాడు.

ఆ రోజు పంజాబీ డ్రెస్‌లో వచ్చిన ముస్లిం అమ్మాయి ఆకర్షణీయంగా కనిపించింది. ఒక అబ్బాయి ఆమె వేసుకున్న చున్నీని ముట్టి చూసాడు. బట్టను మాత్రమే తాకిన వాడి చేష్ట గమ్మత్తనిపించింది. వాడు తాకిన విషయం అమ్మాయి కూడా గ్రహించలేదు. ఆ బట్టను ముట్టి చూడాలనిపించింది. చూసిన. అదొక పిల్ల చేష్ట. ఇదంతా ఆమె గ్రహింపులో లేదు. డ్రెస్సింగ్‌ అనేది మనిషికి ఆకర్షణను కలిగిస్తుందని తెలిసింది. ఇది పల్లెటూరులో కనిపించదు. పట్టణీకరణకు ఇదొక పార్శ్వం. ఇంటి బాధ్యతలు, బాపు ప్రభావం లేకపోవడం వల్ల స్వేచ్ఛగా ఉండగలిగిన. దానికి తోడు హాజరుతో పాస్‌ కావచ్చనే ఎరుక మరింత స్వేచ్ఛను ప్రసాదించింది. ఇంటి నుండి బడి వరకు గల ప్రతీ దుకాణం, ప్రతీ హోటల్‌ ఆహ్వానించేది. ఎక్కని దుకాణం మెట్లు లేవు. దూరని హోటల్‌ లేదు. చదువు వెనకబడింది. జీవించడానికి ఇతరేతర మార్గాలు కనిపించాయి. అలాంటి మార్గాల్లో ఫోటోగ్రఫి ఒకటి. ఇంటి నుండి బడికి వెళ్ళేదారిలో ‘శిల్పి ఫోటోస్టూడియో’ ఉండేది. ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్‌ పెట్టిన స్టూడియో అది. నాలాంటి పిల్లలు ఒకరిద్దరు ఎప్పుడూ ఉండేవారు. విలువైన కెమరాలు, పరికరాలు ముట్టుకున్నా పట్టుకున్నా ఏమీ అనేవాడు కాదు. బడి ఎగ్గొడితే మందలించేవాడు. తను మాత్రం స్టూడియో వదలి వెళ్ళేవాడు. జీవన భృతి కోసమే స్టూడియో పెట్టినట్లు కనిపించేవాడు కాదు. పెదాల మధ్య సిగరేట్‌ కాలుతుండేది. సిగరేట్‌ చివరికొస పెదవుల్ని ముద్దాడినపుడు ఈ లోకంలోకి వచ్చేవాడు. చక్కటి చిత్రాలు గీసేవాడు. ఏవో రాతలు రాసేవాడు. రాత్రిళ్ళు ఆయన స్టూడియో ఒక సభను తలపించేది. ఆ ముచ్చట్లు అర్థం కాకపోయేవి. అదొక ప్రపంచం.

అనేక కుటుంబాల మధ్య నా రూం ఉండేది. బాపు మాటల వల్ల వారి నిరంతర నిఘా నాపై ఉండేది. ఎక్కువగా తిరిగేది కనుక, వారు నాకు పనులు చేప్పేది. నేను చేసేవాణ్ణి. ఫలితంగా నాకు కూరలు అందేవి. అలా పని తప్పేది. బద్ధకం ఎక్కువ. అటుకులు తిని గడిపిన రోజులు అధికం. ఇష్టంగా తినడం, చదవడం అనే వాటిపై ఆసక్తి ఉండేది కాదు. సినిమాలు, షికార్లపై గాలి మళ్ళింది. తినడం, తిరగడం, సినిమాలు చూడడం, అలవాటయింది. లోకం మరింత దగ్గరగా కనబడింది. బడిపాఠాల కన్నా జీవిత పాఠాలు బలీయంగా కనిపించాయి.

ఆ కాలంలో వాడ పేరున, కులం పేరున, మతం పేరున, కండబలం పేరున ఆధిపత్యం చెలాయించే మనుషులు కనిపించారు. వారంటే హడల్‌. తమ వారికి హీరోలుగా, తటస్థులకు గుండాలుగా కనిపించేవారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేవారు. రెండు గుంపుల మధ్య గెలుపోటములు దోబూచులాడేవి. ఒకరివాడనుండి, మరొకరు వెళ్ళాలంటే ఒక రకమైన భయం. ఈ భయమే ఒకరి నుంచి మరొకరికి రక్షణ కలిగించేది. మనిషిని చూస్తే భయం కలగడం, భయం నీడలో బ్రతకడం, కండబలం, గుంపుబలాన్ని ఉపయోగించడం ఆనాటి పట్టణబ్రతుకు చిత్రం. పల్లెల్లో మాత్రం ఒకరికొకరు ఆసరాగా కలిసి పనులు చేసుకుంటూ భయం లేకుండా బ్రతకడం కనిపించేది. వినాయక నిమజ్జనం, పీరీల పండగ, ఇతర సందర్భాలలో జరిగే గొడవలు, భయంకర దాడులు విచారాన్ని కలిగించేవి. పల్లెల్లో లేని ఈ విచిత్ర సన్నివేశాలు పట్నంలో కనిపించేవి. వీటిని ప్రోత్సహించి ముందుండి నడిపించే శక్తులకు బ్రహ్మరథం పట్టిన కాలమది. ఈ శక్తులు తమ వారికి అన్యాయం జరగకుండా, ఇతరుల ఆధిపత్యం తమవారిపై పడకుండా కాపాడేవి. దీనికి భిన్నంగా ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తే శక్తులు కూడా తారసిల్లినవి. అలాంటి వారు మాట్లాడితే వినాలనిపించేది. వారు చెప్పినట్లు చేయాలనిపించేది. అట్లా చెప్పిన వాళ్ళందరు, నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళంతా కాలేజీ విద్యార్థులని, ఎవరో చెబితే తెలిసింది. ఒకరోజు వాళ్ళు వచ్చి బడిగంట కొట్టారు. చుట్టీ అయింది. తరగతుల నుండి బయటికి రావాలన్నారు. సార్లు కిమ్మనకుండా ఉన్నారు. మా బడి రక్షకుడు వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. బడిలో ఉన్న పిల్లలందరిని లైన్లలో నిలబెట్టారు. అందులో ఒకరు ఈ విధంగా చెప్పిండు.

“నిన్న హైదరాబాద్‌లో ఒక పోలీస్‌స్టేషన్‌లో నలుగురు పోలీసులు రమీజాబీ అనే స్త్రీపై దారుణంగా అత్యాచారం జరిపిండ్రు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో హర్తాళ్ళు, అల్లర్లు జరుగుతున్నవి. పోలీస్‌ ఫైరింగ్‌ జరిగింది. ఆమె భర్త కూడా చనిపోయాడు. హైదరాబాద్‌ మొత్తం కర్ఫ్యూనీడలో ఉంది. రమీజాబీకి నైతిక మద్దతునిస్తూ విద్యార్థులు కదలాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. అందుకు మన కరీంనగర్‌లో స్కూల్స్‌, కాలేజీలు బాయ్‌కాట్‌ చేసి రోడ్ల మీద జులూస్‌ తీద్దాం. జరిగిన సంఘటనను ఖండిద్దాం. బాధితులకు న్యాయం కలిగేలా చేద్దాం. అత్యాచారానికి వ్యతిరేకంగా మన గళం వినిపిద్దాం” అంటూ ముగించాడు.

అందరం రోడ్డుపైకి వచ్చినం. ఒకే కూడలిలో కలిసి ముందుకు సాగినం. సుమారు రెండు కిలోమీటర్ల పొడవైన లైన్‌ కొలువుదీరింది. ప్రైవేటు, గవర్నమెంటు అనే తేడా లేకుండా అన్ని పాఠశాలల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. అది పునరావాస బాధితుల లాంగ్‌ మార్చ్‌లా ఉంది. విద్యార్థి శక్తి కనిపించింది. చేయాల్సిన పనేదో అర్థం అయింది. మా ఊరు మొదలుకొని హైదరాబాద్‌ వరకున్న విద్యార్థి లోకం, ఎక్కడెక్కడ ఎలా ఉందో తెలిసింది. ఇంత పెద్ద విద్యార్థి ప్రపంచంలో కొంత మంది విద్యార్థి నాయకులు ఎలా పనిచేస్తున్నారో ఎందుకు పనిచేస్తున్నారో ఆ రోజు అర్థం అయింది. జులూస్‌ పూర్తయ్యాక సమీక్షొకటి జరిగింది. సమీక్ష జరిగిన చిన్న గుంపులో నేను అభిమానించే వాళ్ళు ఉన్నరు.

అతడు ఒకే ఒక్కడు. సమస్త విద్యార్థి శక్తి ఒక వైపుంటే దానికి దూరంగా వాడు. ఆ మేరకు వాడి విల్‌పవర్‌ను శంకించలేము. పుస్తకం పురుగు. పేజీలనే తప్ప పక్కవాణ్ణి చూడడు. మహా అయితే ఆడపిల్లలవైపు చూడడం, వారికి కావల్సిన నోట్స్‌ ఇవ్వడం వాడి పని. తరగతి ప్రథముడు. సార్లందరు వాడిని అభినందిస్తుంటే వాణ్ణి ఆప వశం కాదు. తెలివిగలవాడు, చదవరి, బాగుపడగలడు అని కొందరి విశ్వాసం. అందుకు తగ్గట్లే బెల్‌ కావడంతో బడికి రావడం వెళ్ళడం చేసేవాడు. అన్ని సబ్జక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. తరగతిలో ఒక్కో సబ్జెక్టులో ఒక్కొక్కరు చురుకైన వాళ్ళుండేవారు. వారందరికి వీడిపై గురి. వాళ్ళంతా కలిసి ఒక గుంపు. దానికి వీడు నాయకుడు. నోట్స్‌ కలెక్ట్‌ చేయడం, కరెక్షన్‌ చేసిన వాటిని పంచడం వీడి పని. అంతకు మించి దేన్నీ చూడడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే టైం వేస్ట్‌ అయితదని వాడి భావన. దీనికి భిన్నంగా ప్రతిదాన్ని ప్రశ్నించి పరిష్కరించే ప్రయత్నం చేసే నన్ను వాడు కాస్త పలకరించేవాడు. అభిమానించేవాడు. నేను పరిష్కరించిన ఫలితాలన్నీ వాడి ఖాతాలో జమయ్యేవి. దాన్ని నేను పట్టించుకోక పోయేవాణ్ణి. అది వాడికి కాస్త ఆశ్చర్యమనిపించేది. “నువ్వు కాస్త ప్రత్యేకం” అని నన్ను అనేవాడు. కారణం ఏదైనా కావచ్చు. వాడి బాధలేమైనా ఉంటే నాముందు వెళ్ళగక్కేవాడు. వాడి బాధలన్నీ మార్కుల గురించే.

“తెలుగు సారు నేనెంత మంచిగా రాసినా తక్కువ మార్కులే వేస్తడు”

“హిందీ సార్‌కు ఫలానా వాడంటే ఇష్టం. అందుకే నా కంటే వాడికి ఎక్కువ మార్కులు వస్తయి”

“డయాగ్రాంలు వేస్తేనే సార్‌ మార్కులు వేస్తడు. జవాబులు ఎంత మంచిగా రాసిన వేయడు”

ఇవీ వాడి బాధలు. ఇంతా చేస్తే వాడికి ఇంగ్లీషు, గణితంలో ఎక్కువ మార్కులు రావడం వల్ల తరగతిలో మొదటి స్థానంలో నిలబడుతాడు. సోషల్‌ స్టడీస్‌ అనేది వాడి దృష్టిలో కేవలం మార్కులు తెచ్చే పరికరం. వాడు నమ్ముకున్న మార్గం నుండి, ఏ పరిస్థితుల్లో కూడా పక్కకు కదలడు. బడి బాయ్‌కాట్‌ చేసి బయటికి వెళ్ళిన రోజు వాడు ఇంటికి వెళ్ళాడు. రోడ్డుపైకి రాలేదు. అటువంటి వాడికి కూడా అనేక బాధలు ఉండటం, అవి నాకు చెప్పుకోవడం ఒక వాస్తవం.

పదవతరగతి ప్రారంభం నుండే విద్యార్థుల్లో భయం నాటేవాళ్ళు. బోర్డు పరీక్ష అనీ, పది సంవత్సరాల చదువు, కాలం ఫలవంతం కావాలంటే పదిపాస్‌ అవ్వాలనీ, పరీక్షలు కఠినంగా ఉంటవనీ, వేరే పాఠశాలలో సెంటర్‌ పడుతుందనీ, అక్కడ మీకు తెలిసిన సార్లు ఉండరనీ, కాపీ చేయడానికి అవకాశం ఉండదనీ చాలా స్ట్రిక్ట్‌గా పరీక్షలు జరుగుతాయనీ, యూనిట్‌ టెస్ట్‌లు, హోమ్‌ ఎగ్జామ్స్‌ రాసినంత సులువు కాదని, మీరు రాసిన పేపర్లను మేం దిద్దమనీ, ఇలా అనేక కారణాలను చెప్పి ఎగ్జామినేషన్‌ ఫోబియాను విద్యార్థుల్లో పెంచేవారు.

నయానా భయానా సంవత్సరం పొడుగుతా బెదిరించి చదివించేవాళ్ళు. అందుకే అంతకు ముందు చదవని వాళ్ళు కూడా కాస్త శ్రద్ధ పెట్టి చదివేవారు. ఇలాంటి స్థితిలో ‘అతడు’ అనేకంగా చదువుపై మనసు పెట్టి తనువు అర్పించాడు. ఇంతలో యూనిట్‌ టెస్ట్‌లు వచ్చాయి. త్రైమాసిక, షాణ్మాసిక పరీక్షలు వచ్చి వెళ్ళాయి. చదువుతోడిదే వాడి లోకం. నాతో కాని, ఇతరులతో కాని మాటలు తగ్గించాడు. ‘రిపబ్లిక్‌డే’ వచ్చింది. అందరికి ఆటవిడుపు. ఆటల పోటీలు జరుగుతున్నవి. బడే ఒక జాతరగా మారింది. ఆ నాలుగు రోజులు చదువు ఒక మూలకు నక్కింది. సార్లకు పిల్లలకు విశ్రాంతి దొరికింది. ఆ నాలుగు రోజుల్లో ఒక రోజు వాడు నా దగ్గరకు వచ్చిండు.

“ఏం రా పుస్తకం పట్టుకొచ్చుకోలేదా ఈ రోజు” అడిగిన.

“ఎందుకురా బనాయిస్తవు. నా బాధ నాది” అన్నడు.

“నీ కున్న బాధ ఏంది”

“వాడికి నా కన్నా ఎక్కువ మార్కులు అన్నిట్ల వస్తయి. ఎట్లస్తయో తెలుస్తలేదు”

“వాడెవడు నాకు తెలువనోడు”

“నీకు తెల్వదు. నా దోస్త్‌, ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతడు”

“అవన్ని బోగస్‌ మార్కులురా”

“అంటే.. అదెట్లా?”

“వాళ్ళ స్కూల్‌ల ముందే ప్రశ్నలు చెప్పుతరు. వాటినే చదివిస్తరు. అవ్వే యూనిట్‌ టెస్ట్‌లో ఇస్తరు.”

“మరి త్రైమాసిక, షాణ్మాసికలో కూడా వాడికే ఎక్కువ మార్కులు ఎట్లవచ్చినయి”

“మన సార్లు ఎక్కువ మార్కులు వెయ్యరు. ఆ స్కూల్‌ వాళ్ళు ఎక్కువ మార్కులు వేస్తరు. తక్కువ మార్కులు వేస్తే తల్లిదండ్రులు విమర్శిస్తరు”

“విమర్శ ఎందుకు”

“ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ చదువు వచ్చినట్లు మార్కులు రాకుంటే చదువు రానట్లే అని వారి భావన.”

“ఇంత మతలబు ఉందా దీని వెనుక”

“నీ వెనుక లేదా? భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? చదువు మీద తప్ప నీకు దేని మీదా దృష్టి ఉండదు ఎందుకు.”

“ఏమోరా నీ తీరుగా నాకు అన్ని తెల్వయి. బాగా చదివి మంచి ఉద్యోగం దొరికించు కోవాలె” అన్నాడు.

ఎదిరిచూస్తున్న పబ్లిక్‌ పరీక్షలు రానే వచ్చినయి. అందరిలో ఉన్న భయం నాలోనూ వచ్చింది. అది పరీక్షల సీజన్‌. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ పరీక్షల గురించే ఆలోచిస్తున్నరు. విద్యార్థుల పరీక్షలు, సమాజంలో ఒక చలనాన్ని కలిగిస్తయి. పరీక్షలతో సంబంధం లేని వారిని కూడా అవి ఆలోచింప జేస్తయి. వాటికి ఇలాంటి స్థాయిని చేకూర్చారు. హాల్‌టికెట్స్‌ వచ్చినవి. సెంటర్స్‌ చూడడానికి వెళ్ళడం, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా అని వాకబు చేయడం ఇలా రకరకాల ప్రయత్నాలు జరిగినయి. పరీక్షలకు ప్రిపేర్‌ కమ్మని పదవతరగతి విద్యార్థులకు, పరీక్షలకు ముందు వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు మాయమైన ‘అతడు’ పరీక్షలయ్యాక తారసపడ్డాడు. వాణ్ణి చూస్తే ‘భీముడు’ గుర్తుకొచ్చేది. భీముడికి అవకాశం లేక చదువు ఆగింది. వీడికి ఉండి సాగింది.

“పరీక్షలు ఎలా రాశావు” అడిగిన.

“నీకు తెలియంది ఏముంది. నీవు రాసినట్లే నేను రాసిన” అన్నాడు.

“నీకు అన్యాయం జరిగింది”

“అవునా!” అన్నాడు.

“నీకు అర్థం కాలేదా’

“నా గురించి, నాకే తెలియని విషయం నీకు ఎట్ల తెలిసింది”

“అందరి గురించి ఆలోచిస్తే అన్నీ అర్థం అయితయి. కొత్త విషయాలు తెలుస్తయి.

“నాకు అవన్నీ అవసరం లేదు” అంటూ వెళ్ళిండు.

నవ్వొచ్చింది. ఆ సంవత్సరం పదవతరగతి పేపర్లన్నీ ‘లీక్‌’ అయినయి. చురుకుగా ప్రయత్నించిన వాల్లకు అందినవి. దానికి తోడు జోరుగా కాపీయింగ్‌ జరిగింది. లీక్‌ కావడానికి కాపీ జరగడానికి లింకు కనబడింది. ఎక్కడో ఒక చోట మొదలయిన ‘లీక్‌’ క్రమంగా విస్తరించింది. అతడు సహా అందులో అందరు, ఆనందంగా ఈదులాడారు. గవర్నమెంట్‌/ప్రైవేట్‌ రెండింటి మధ్యగల పోటీ సమాజానికి అందించిన ప్రభావాల్లో ‘లీక్‌’ ఒకటి. ఫలితాలు వచ్చినయి. చాలా మంది ప్రథమ శ్రేణిలో ఉన్నరు. కేవలం ఉత్తీర్ణతలో ఉన్నవారిలో నేనొకణ్ణి. ఉన్నత పాఠశాలకు ‘గుడ్‌బై’ చెప్పే సమయంలో గుర్తుంచుకున్నవి రెండు.

1) ఉపాధ్యాయ దినోత్సవం రోజు ‘చానమ్మ’ పాఠం చెబుతూ ఉపాధ్యాయుడిగా తృప్తి చెందడం.

2) ‘బహుకృతవేషం’ అనే నాటకానికి ‘ఉదరపోషణార్థం బహుకృతవేషం’ అనే డైలాగ్‌ను నేపథ్యం నుండి చెప్పి కళారంగంతో అనుసంధానం కావడం.

బాపు క్లాస్‌ పీకిండు “ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌వి. థర్డ్‌క్లాస్‌కు దిగజారినవు. కొట్టడమే తక్కువ. మ్యాథ్స్‌పై దృష్టి పెట్టు-భవిష్యత్‌ చేపట్టు” అన్నాడు. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ చదవమని శాసించినాడు. MPC (Maths, Physics, Chemistry) అప్లయి చేసిన ఇంగ్లీషు మీడియంలో సీటు దొరికింది. జాయిన్‌ అయిన. వైతరణీ నదిలో దిగినట్లయింది. వెనుకడుగు వేయలేను. ముందుకేస్తే నరకం. ఇప్పుడు కూడా ‘అతడు’ నా క్లాస్‌మేట్‌ అయిండు. అతడు ఇష్టంగా ఇంగ్లీష్‌ మీడియం తీసుకున్నడు. అతడిప్పుడు స్వర్గంలో ఉన్నట్టు సంబరంగా కనిపించిండు.

“ఇంగ్లీషు మీడియం చదవడం కష్టంగా ఉంది.” అన్నాను.

“నాల్గురోజులు పోతే అదే అలవాటు అయితది”. అన్నాడు

“అలవాటు కావడానికి అదేమన్నా పదార్థమా”

“నీకు అన్నీ ఎగతాళిగానే ఉంటయి. ముందు ముందు తెలుస్తది”

“నా సమస్యను పరిష్కరించు”

“మీడియం మార్చమని, ప్రిన్సిపాల్‌కి చాలా మంది అప్లికేషన్లు పెడుతున్నరు”

“మార్చుతడంటవా”

“నీవు అభిమానించే విద్యార్థి నాయకులు కాలేజీలో ఉన్నారు కదా. వాళ్ళకు చెప్పు.”

“ఇన్నేండ్లకు నీవు ఇతరుల గురించి ఆలోచించినవు” అభినందించిన.

మీడియం మార్చమని అప్లికేషన్‌ పెట్టిన. కోరిక నెరవేరింది. కొంత ఊపిరి తీసుకోగలిగిన. తెలుగు మీడియం క్లాసుకు రాగలిగిన. అతనికి నాకు మధ్య కొంచెం ఎడం పెరిగింది. యాంత్రికంగా తరగతుల్లో, చురుకుగా బయటి ప్రపంచంలో బ్రతుకుతున్న. కాలేజీ వెళ్ళడానికి సైకిల్‌ కొనిచ్చిండు బాపు. ఆయన కోరుకున్న చదువులో చేరినందుకు అదొక బోనస్‌. గతానికి, వర్తమానానికి అదొక మార్పు ఒక దగ్గరి అసంతృప్తిని మరొక చోట తృప్తిగా మార్చుకోవాలి. లేకుంటే బ్రతకడం కష్టం. కొత్త కొత్త పిల్లల పరిచయాలు. స్నేహాలుగా మారినయి. విద్యార్థి సంఘాలు చురుకుగా ఉన్న కాలం. కుడి ఎడమల భావజాలం పోటీ పడుతున్న సమయం. ‘అతడు’ లాంటి ఎవరో కొందరు తప్ప చాలా మంది ఏదో ఒక సంఘానికి చేరువయ్యారు. అలా చేరువైన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. భావాల్లో ప్రగతిశీలత, ఆచరణలో చలనశీలత స్పష్టంగా కనిపించింది. కాలేజీల్లో ఎన్నికల నగారా మోగింది. ప్రతీ సంఘం ప్యానల్‌ను ఏర్పరిచింది. కొంతమంది స్వతంత్రులుగా నిలబడ్డరు. స్వతంత్రుల్లో ఒక ముస్లిం నాకు దగ్గరి స్నేహితుడు. అతణ్ణి గెలిపించడానికి ప్రయత్నించిన. చిట్టచివరికి సెక్రటరీగా గెలిపించిన. నా వాళ్ళ నుండి ముందు విమర్శలు వచ్చినయి. తరువాత అభినందనలు అందినయి. గెలిచిన స్నేహితుని ఆసరాతో, కళాశాల ప్రెసిడెంటుకు ఓట్లు వేయించిన. ఈ క్రమంలో ఏ పదవీ లేని నేను అనేక మందికి పరిచయం అయిన. ‘అతడు’ ఓటు వేసిండు. అతని రెండు సంవత్సరాల బాధ్యత నాపై పడింది. అంక గణితము, బీజగణితము, కలనగణితము ఇలా రకరకాల పేర్లతో విషయం విస్తరించింది. సమాజంలో పేదలు ఎన్ని పాట్లు పడుతున్నారో అన్ని రకాలుగా గణిత సూత్రాలు కనపడుతున్నాయి. ఆ సూత్రాలనుపయోగించి గణితంలో సమస్యలను పరిష్కరిస్తున్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించే సూత్రాలు గణితంలో లేవెందుకు! అట్లా లేకపోవడమే గణితం పట్ల నా అసహనానికి కారణమైందేమో.

ఆరోజు కాలేజీ టైం అయిపోయింది. అందరం వెళుతున్నాం. ‘అతడు’ కనిపించాడు.

“ఏం రా లీడర్‌. ఏం ఆలోచిస్తున్నావు” అన్నాడు.

“కొత్తగా పిలుస్తున్నవు. ఏంది”

“కలుస్తలేవు. క్లాసులు ఎగ్గొడుతున్నట్లున్నవు”

“అర్థమయినా, కాకున్నా క్లాసులో కూర్చోకతప్పదు. ఇప్పుడు మనిద్దరం ఒక క్లాస్‌ కాదు కదా”

“నేను లెక్కల ట్యూషన్‌ పోతున్న నీవు వస్తవా”

“ట్యూషన్‌, ఎక్కడికి పోతున్నవు”

“మన లెక్కల సారు దగ్గరకే. అతనైతే అన్నీ చూసుకుంటడు”

“రెండు చేతుల సంపాదిస్తున్నాడన్నమాట”

“ఎందుకురా, నెగెటివ్‌గా ఆలోచిస్తవు”

“ఉన్నమాటే అంటున్న”

“ఇంతకు ట్యూషన్‌కు వస్తవా, రావా”

“నేను కూడా వస్త. రేపటి నుండి”

అలా ‘అతడు’ నా చేయి పట్టుకొని తన వెంట తీసుకెళ్ళాడు.

రోజులు గడుస్తున్నవి. విద్యార్థుల్లో చైతన్యం నింపడానికి విశాఖపట్నంలో మహా సభలు జరిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణంతా విద్యార్థి పక్షులతో నిండింది. ప్రజాస్వామిక విలువలు, శాస్త్రీయదృష్టి, ప్రశ్నించడం, విద్యార్థి సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, స్కాలర్‌షిప్స్‌, హాస్టల్‌ సమస్యలు ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సమస్యల్ని సాధించుకునే విషయమై అవగాహన కల్పించారు. ఆ మాటలు ఎంతో ఉత్తేజితాలు, మేథోవికాసం కంటే వయసిచ్చిన వేగం ఆగనిచ్చేది కాదు. రెండు రోజుల సభల తర్వాత సామాజిక అభివృద్ది నమూనాల పట్ల అవగాహన ఏర్పడింది. విద్యార్థి అంటే కేవలం తరగతి గదికే పరిమితం కారాదు. సమాజంలో తిరగాలి. జరుగుతున్న వ్యవహారాల వెనుక గల విషయాలు పట్టించుకోవాలి. అలా ఆలోచించి చూస్తే ఉసిళ్ళ గుంపోలే సమస్యలు కనిపించాయి. వాటిని చూసినాక ‘లెక్కలు రాకపోవడం’ ఒక సమస్యా అనిపించింది. సామాజిక సమస్యలు, కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కనిపిస్తుండగా ఏ సమస్యలు లేనట్టే ‘బలాదూర్‌’గా తిరిగే ఒకరిద్దరు స్నేహితులు జ్ఞాపకం వచ్చి మనసు మూలిగింది. తిట్టుకోవడం, తన్నుకోవడం, అమ్మాయిల వెంబడి పడడం, పోకిరి పనులు చేయడం, హింసించడం, ఇలా అసహజ రీతిలో సాగే ఒకరిద్దరు స్నేహితులు రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్‌ కాలం గడిపారు. మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయినా ఇంటర్‌ రెండో సంవత్సరం చదవొచ్చు అనే వెసులుబాటు చాలా మంది విద్యార్థులకు కాలం వెళ్లబుచ్చటానికి అవకాశం ఇచ్చింది. దానివల్ల నాతో పాటు అనేకులు ఇంటర్‌ రెండవ సంవత్సరానికి కేవలం ప్రమోట్‌ అయ్యారు. ‘అతడు’ అందుకు మినహాయింపు. సప్లమెంటరీ పరీక్షలకు చాలా మంది హాజరయ్యారు. ‘అతడు’ రాయడం కనిపించి ఆశ్చర్యపోయిన.

“ఏరా! నీవెందుకు రాస్తున్నవు” అడిగిన.

“ఇంప్రూవ్‌మెంట్‌ కోసం”

“ఏం చేసుకుంటవు”

“డిగ్రీ లో మంచి కాలేజీలో, మంచి కోర్సులో సీటు రావాలంటే మంచి మార్కు లుండాలి.”

ఇహ వీణ్ణెవరు దారి మళ్లించలేరనిపించింది. భవిష్యత్తులో వీడేం కావాలనుకుంటున్నడో అడగాలనిపించింది. కానీ అడగలేకపోయిన. అందుకు నా మార్కుల వెనుకబాటు అడ్డొచ్చింది.

విద్యార్థి లోకం ఎదురుచూస్తున్న సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రానే వచ్చినయి. నిబంధనలు ఉల్లంఘనల మధ్య పరీక్షలు జరిగినయి. పరీక్షలు ముగిసినయి. ఫలితాలు వచ్చినయి. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఉత్తీర్ణుడనయ్యాను. ‘అతడు’ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. ‘భీముడు’ వెక్కిరించినట్లనిపించింది. ఇబ్బంది పడిన నాపై పీకలమంటి కోపంతో ఉన్న బాపు మొదటిసారి కిమ్మనలేదు. దొంగపోటు కంటే లింగపోటు అధికం అనిపించింది. సమాజం గురించి ఆలోచిస్తూ చదువును నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం? చదువుపై ఉన్న అయిష్టత, బయటి పనులపై ఇష్టంగా మారిందా? పరిపరి విధాల ఆలోచనలు ముసురుకున్నయి. బాల్యం నుంచి క్రమశిక్షణ పేర మొదలయిన నియంత్రణ, నాకు ఆసక్తి ఉన్నదాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కబళించింది. స్వేచ్ఛాయుత ఎంపిక వికాసానికి దారి తీస్తుంది. ఇప్పటికి నా జీవితం నాకు నేర్పింది ఇదే. ఆర్గనైజేషన్‌ పనులు నాకున్న పరిచయాలకు, ఇక్కడ ఉంటే చదువు సాగదని అర్థమైంది. ఇప్పటికైనా గణిత బంధంనుంచి బయట పడకుంటే పుట్టగతు లుండవని తెలిసింది. మానసికంగా, సాంఘికంగా అప్పటికే నాకో గుర్తింపు, సంతృప్తి కలిగించిన ‘తెలుగు సాహిత్యం’ చదవాలనిపించింది. కాకతాళీయంగానే ఆ సమయంలో హన్మకొండలోని మా ‘పెద్దబాపు’ ఇంటికి వెళ్లిన. ఎడ్యుకేషన్‌ హబ్‌గా అప్పటికే దానికి పేరు. మా సోదరులతో జరిపిన మాటామంతిలో ‘తెలుగు సాహిత్యం’ కోర్సుగా కలిగిన కళాశాల వివరాలు తెలుసుకున్న కరీంనగర్‌లో అలాంటి కోర్సులు లేవని నిర్దారించుకున్న డిగ్రీ కళాశాలలో సీట్‌ కోసం అప్లయ్‌ చేస్తే నాకున్న మార్కులతో కాకతీయ డిగ్రీ కళాశాలలో ప్రవేశం దొరికింది. అలా ‘తెలుగు సాహిత్యం’ ఐచ్చికంగా చదివే వీలు కలిగింది. ఈ పరిణామమే కరీంనగర్‌కు దూరం చేసింది. హన్మకొండకు దగ్గర చేసింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version