Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లేరు కాయలు-1

[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]

 

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగా
ధారాళమైన నీతులు నోరూరగ
చవులు పుట్ట నుడివెద సుమతి

గొంతెత్తి పాడిన సందర్భం పోటెత్తుతున్నది. అప్పుడప్పుడే బడికి వెళ్తున్న జ్ఞాపకం, సెలవురోజనుకుంట పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన గుర్తు. బహుశ ఉదయం పదకొండు గంటలు. పెద్దమ్మ వాళ్ళ పిల్లలతో పాటు నన్ను నిలబెట్టి పద్యాలు చెబుతున్నది. చేతిలో కట్టె ఉంది. ఇల్లు కూడా బడిలా అనిపించింది. పద్యం పాడుకుంటూనే దిక్కులు చూడడం మొదలు పెట్టిన. ఫట్‌మని పడింది దెబ్బ. మళ్ళీ పద్యం మొదలు. అలా పద్యం వచ్చే దాకా సాగింది ధోరణి. బయటి నుండి ఏదో గొడవ వినపడుతుంది. నా మనసటువైపే గుంజుతుంది. ఎదురుగా శక్తి స్వరూపిణి. ఏదో పని మీద లోపలి కెళ్ళింది. అంతే నేను బయటపడిన.

బజార్లో జులూస్‌ సాగుతుంది. ప్రతి ఒక్కరు అరుస్తున్నరు. అందులో కొంత మంది బడి పిల్లలు కూడా ఉండడం ఆశ్చర్యమనిపించింది. వెళ్ళి అందులో కలవాలని పించింది. ఇంతలో లోపలి నుండి కేక. బయట ‘జిందాబాద్‌’ అనే కేకలు. ఏదో ఆకర్షణ. ఏదో అయోమయం ఆనాటి నా మనసులో. ఇప్పుడదొక ఉద్యమం అనే విషయం అర్థమవుతుంది. ఉద్యమ వ్యతిరేకులను తిట్టుకుంటూ గోడలపై రాసిన రాతలు గుర్తుకొస్తున్నాయి. “ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌” అనే నినాదం ప్రముఖంగా గుర్తుంది. అదంటే ఏంటో తెలియదు. వాటి రుచి అనుభవంలో లేదు. అర్థం చేసుకునే వయసు కాదు. కానీ లీలగా గుర్తుంది. నేటి చదువు ఆ జ్ఞాపకాలకు తోడవుతుంది. మొత్తానికి ఆ జులూస్‌ మాత్రం నాపై చెరగని ముద్ర వేసింది.

మొదటి నుండి బడి అంటే ఏదో తెలియని ఆకర్షణ. ప్రార్థనకు ఉండటం అలవాటు ఆటపాటలతో హాయిగా బడి బతుకు సాగుతుంది. మార్కులు, పోటీలు, ముందు ఉండడం లాంటి ముచ్చట్లు అప్పుడప్పుడు వెన్ను నొప్పిలా అనిపించేవి. చదువుల్లో ముందే ఉండేవాడిని. ఒక రోజు గణితంలో వచ్చిన మార్కులు నాకు దుఃఖపు దెబ్బను రుచి చూపించాయి. అప్పటి నుండి లెక్కలంటే చుక్కలు కనిపించేవి. బడి దినచర్యలో లెక్కల పీరియడ్‌ మైనస్‌ పాయింట్‌గా మిగిలింది.

బాపుకు తబాదలా అయింది. నేను బడి మారాల్సి వచ్చింది. నాలుగోతరగతి ఎక్కిన. కొంత వయసు వచ్చింది. బాల్యం వీడలేదు. మా ఊరు, మా బడి అనే భావన కలిగింది. ఈత గుజ్జులాంటి ఆ భావన ఎంతో బలాన్నిచ్చేది. క్లాస్‌లో మొదటి స్థానం నాదే. నాతో పోటీ పడుతూ, ఒక్కోసారి ముందుండే వాడు భీముడు. పేరుకు తగ్గట్టే వాడు వయసులోను. శారీరకంగానూ నా కంటె పెద్ద. వాడి ముందు పుల్లలా ఉండేవాణ్ణి. సాయంత్రం బడి గంట కొట్టినాక వాడు భుజానికి బట్టల మూట వేసుకొని, ఇల్లిల్లు తిరిగి ఉతికిన బట్టలు ఇచ్చేవాడు. బజార్లో ఆటలాడి నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఆ సమయంలో వాడు ఎదురైనప్పుడు నవ్విన నవ్వు అర్థమయ్యేది కాదు. బడిలో వండిన దొడ్డు రవ్వ ఉప్మా మనం తినకూడదు అని బాపు శాసనం విధించాడు. పులుకు పులుకున ఉక్మావైపు చూసుకుంటూ వెళ్ళే సమయంలో నోటి నిండా బుక్క పెట్టుకొని భీముడు నవ్విన నవ్వు అనేక ప్రశ్నలు సంధించేది. ఫలితంగా దొంగచాటుగా, అటెండర్‌ సహాయంతో ఉక్మా రుచి చూశాను. ఏవో తెలియని ఎక్కువ తక్కువలు వాడికి, నాకూ మధ్యన కొలువు తీరినవనిపించింది. వయసు రీత్యా కలిగిన అవగాహన చదువులోను, కులం రీత్యా కుదిరిన వెసులుబాటు ఉక్మా తినడంలోను వాడికి సహాయ పడ్డాయనిపిస్తుంది ఈనాడు. సమానస్కందుల మధ్య పోటీ లేకపోవడం వల్ల విజయం ఎప్పుడూ వాడివైపే ఉండేది. వాడికి ఇంటిపని ఎక్కువైన రోజుల్లో నాకు మార్కులు ఎక్కువ వచ్చేవి. అదొక ఊరట.

తెలుగు పాఠాలు చెప్పిన భట్టు సారు, రామయ్య సార్‌ చెప్పిన సైన్స్‌ పాఠాలు మంచి ముద్రను వేసాయి. ఇద్దరిలో భట్టు సార్‌దే పై చేయి. ఆయన బోధనా విధానం సాలెగూడులా ఉండేది. అందరు అందులో పడాల్సిందే. బహుమతులూ, శిక్షలూ పొందాల్సిందే. నిన్న చెప్పిన పాఠం ఈ రోజటి నాందీ ప్రస్థావన. నేటి పాఠం రేపటికి ఇంటిపని. ఈ రెంటి నడుమ నిరంతర మూల్యాంకనం జరిగేది. ఇది ఒక నాటి మాట కాదు. ఆయన సర్వీసంతా ఇలానే నేర్పించాడు. బాగా చదివే పిల్లలకు చదవని పిల్లలకు మధ్య వివక్ష చూపేవాడు కాదు. అవసరమైనప్పుడు అతని బెత్తం దెబ్బలవాడి, వేడి సమానంగా సోకేది. పద్య పఠనం, గద్యవివరం చేసేటప్పుడు తన్మయుడయ్యేవాడు. అదేం చిత్రమో కాని పిల్లలందరం నిశ్శబ్దంగా వినేవాళ్ళం. నేటి పిల్లల మనస్తత్వం ఆనాటి మాకు లేకపోవడం కూడా ఆయన బోధనకు ఒక గెలుపు సూత్రం అయింది. తెలుగు సబ్జెక్టుపై ఆనాడే ఒకానొక మమకారం బీజరూపంగా పడింది.

రామయ్య సార్‌ పాఠ్య విషయం ఎంత చెప్పేవాడో, పాఠ్యేతర విషయాలు అంతే బాగా చెప్పేవాడు. అతడు ఏం చెప్పినా ఆసక్తిగానే ఉండేది. కిరణ జన్యసంయోగక్రియ గురించి ఎలా వివరించేవాడో, ఊరి పట్వారి చేసే అసంగతులను అంతే బలంగా చెప్పేవాడు. అలాంటి విషయాల్ని మా వయసు పిల్లలకు చెప్పాలా? వద్దా? అనే విచక్షణ ఆయనకుండేది కాదు. అలా చెప్పడం వల్ల ఆయనకు సాంత్వన దొరికినట్లు అనిపించేది. నాకైతే ఇవి ఆసక్తికరంగా ఉండేవి. ఈ ఆసక్తే పాఠ్య విషయాలు వినడానికి ఉపయోగ పడింది. సంఘంలో జరిగే అన్యాయాలను అసమ సమాజ విశేషాలను కళ్ళకు కట్టినట్లు చూపేవాడు. ఎందుకో ఆయన భీముడిపై ప్రత్యేక శ్రద్ధ కురిపించేవాడు. అదెందుకో ఆనాడు నాకు బోధ పడలేదు. నా మనసు మాత్రం మూల్గేది. ఆయన బోధన వల్లనే కరీంనగర్‌ పట్టణం గురించి తెలిసింది. సినిమాలంటే ఏమిటో తెలిసింది. రైతుల కష్టాలు, వ్యవసాయంలోని ఆటుపోట్లు ఆయన వల్లే విన్నాను. ఈ బోధనలన్నింటికన్నా ఆయన సాయంత్రం పొలం పనికి పోయి రావడం ఆకర్షించేది. ఆయన ఏం చెప్పినా ఆకర్షణీయంగా ఉండేది. ఒక రోజు తరగతిలో ఆయన చెప్పిన విషయం ఆలోచనలో పడేసింది. ఆనాటి గొంతు రోజువారి గొంతుకు భిన్నంగా వినిపించింది. విద్యార్థుల గురించి, సమస్యల గురించి గొడవల గురించి, జార్జిరెడ్డి హత్య గురించి భావోద్వేగంతో చెప్పిండు. అవేవో అర్థం కాలేదు. మనసులో నాటుకు పోయిందల్లా జార్జిరెడ్డి హత్య, హత్యలు ఎందుకు జరుగుతాయి?! ఒకర్నొకరు ఎందుకు చంపుకుంటరు? అనే ప్రశ్నలు బలంగా నాలో నాటుకు పోయాయి. ప్రశ్నలతో పాటు రామయ్య సార్‌ కూడా యాదిలో ఉండిపోయాడు. ఈ బాల్య పరిణామాలన్నీ ఆరవ తరగతి చదివే నా పసిమనసుపై వేసిన చెరగని ముద్రలు.

మొత్తం సర్వీసులో పట్టుమని పదిసార్లు కూడా పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళని ఉత్తమ ఉపాధ్యాయుడు బాపు. ఆయన కెరీర్‌ అలా సాగడానికి తల్లి, భార్య, పిల్లలు పునాదిరాళ్ళు. ఉదయం ఇంట్లో వాళ్ళందరు, గడియారం ముల్లుతో సమానంగా కదలాల్సిందే. గడియారం చెడిపోయినప్పుడు ముళ్ళకు విశ్రాంతి దొరికేది. ఇంట్లో వాళ్ళకు మాత్రం విశ్రాంతి దొరకడానికి ఆయన ఒప్పుకోలేదు. బడిలో పిల్లలకు, ఇంట్లో పిల్లలకు, బడిలోని ఉద్యోగులకు, ఇంట్లోని వారికి తేడా చూపలేదు. వ్యక్తులుగా కాక, యంత్ర భూతములుగా పనిచేయాల్సిందే. ఇలాంటి నడక వల్ల మంచి ఉపాధ్యాయుడిగా పేరు దక్కింది. అమ్మ సేవకురాలయింది. ఇతడు మాత్రం సమయానికి బడికి వెళ్ళగలిగాడు. చిన్న వయసులో బాపు వెనకనే నేను బుడిబుడి అడుగులతో వడివడిగా బడికి వెళ్ళేది. ఒక రోజు నేను తయారు కావడం ఆలస్యం అయింది. వదిలి వెళ్ళాడు. వేరొకరు నన్ను తీసుకెళ్ళారు. ఆనాటి నుండే నేను ముందో వెనకో ఒంటరిగా వెళ్ళేది.

వర్షాలతోనే బడి మొదలయింది. ఏడవ తరగతి ప్రారంభం అయింది. ఈ సారి బోర్డు పరీక్షలు. అందరు బాగా చదవాలి. ఫస్ట్‌క్లాస్‌ తెచ్చుకోవాలి. బడి పేరు నిలబెట్టాలి. అందరు సార్లు ఇదే విషయాన్ని అనేక సార్లు వల్లెవేసారు. ఏదో తెలియని భయం, బరువు అందులో ప్రవేశించింది. ఈ సంవత్సరంలో బడిలోకి ఒక కొత్త సార్‌ తబాదలా పై వచ్చిండు. అందరూ ఆయనను తురక సార్‌ అందురు. ఆయన ఆహార్యంలో ప్రశాంతత, చదువు చెప్పడంలో నిబద్దత కొట్టవచ్చినట్లు కనిపించేది. బడిలో అందరూ బాగా చెప్పేవాళ్ళే. ఒక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడే వేరీ పూర్‌. చుట్టు పక్కల ఊర్లనుండి మా ఊరి బడికి చదువుకోవడానికి వచ్చే పిల్లలు అనేక మంది దాదాపు అందరూ నడిచి వచ్చే వాళ్ళు. సీనియర్‌ స్టూడెంట్స్‌గా మా అందరికి ఒక గుర్తింపు బడిలో ఉండేది. ఏడవ తరగతి పిల్లలంటే పెద్ద పిల్లలు అనే భావన సార్లలోనూ కనిపించేది. అంతకు ముందు లేని కొన్ని ధోరణులు ఏడవ తరగతిలోనే మాలో ప్రవేశించాయి. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు గుంపుగా మసలే వాళ్ళు. దానికి తగ్గట్టుగా స్థానికులం అనే భావన, అధిక సంఖ్యాకులం అనే చింతన మా ఊరివాళ్ళకు ఉండేది. టీచర్లకు అభిమానులు తయారయి గుంపులుగా మారారు. ఇలా విభజన అనేది వచ్చి చేరింది. ఇది చదువుల్లో కంటే ఆటల్లో బహిర్గతమయ్యేది. పనిలో పనిగా ఆడపిల్లల అభిమానులుగా కొందరు అవతారమెత్తారు. ‘సార్‌ కొడుకు’ అనే ప్రభావం వల్లనో, కఠిన క్రమశిక్షణ వల్లనో, స్వభావం వల్లనో నేను ఏ గుంపులో చేరక పోయేవాణ్ణి. అందరికి సమాన దూరంలో ఉండి ఒంటరిగానో ఒకరిద్దరితోనో గడిపేవాణ్ణి. ఇలా సాగుతున్న సమయంలో బడిని దర్శించి, పర్యవేక్షించడానికి డిప్యూటీ స్కూల్స్‌ ఆఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వస్తున్నాడనే విషయం తెలిసింది. సార్లలో ఆందోళన కనిపించింది. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రమయిది. “గోళ్ళు కత్తిరించుకోవాలి” చిన్నగా కటింగ్‌ చేయించు కోవాలి. ‘శుభ్రమైన బట్టలతో రావాలి’. ‘హోంవర్క్‌ పూర్తి చేసి, నోట్‌ బుక్స్‌ పట్టుకొని రావాలి’ ఇలాంటి సవాలక్ష సూచనలు విద్యార్థులకు చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది. డిప్యూటీ స్కూల్స్‌ ఆఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ (నాజర్‌ సాబ్‌) గారు పాఠశాలను పర్యవేక్షించడానికి వచ్చారు. ఆయన రావడంతోనే తరగతిగదుల్లోకి వచ్చారు.

“పాఠాలు జరుగుతున్నాయా”

“చదువులెట్లా సాగుతున్నాయి”

“మీ నోట్స్‌ చూపించండి”

“మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుత”

ఇలాంటి మాటలతో అందర్ని ఉక్కిరిబిక్కిరి చేసారు. మా ప్రధానోపాధ్యాయులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన మొహంలో ఉక్కపోత స్పష్టంగా కనిపించింది. యావత్‌ పాఠశాల నిశ్శబ్దంలో మునిగింది. అన్ని సబ్జక్టులకు చెందిన ప్రశ్నలు అడిగిండు. నాతో సహా చాలా మంది జవాబులు చెప్పారు. కొంత మంది చెప్పని వాళ్ళు ఉన్నారు. రిపోర్ట్‌ మంచిగా రాసిండనే విషయం రామయ్య సార్‌ ద్వారా తెల్లారి తెలిసింది.

భీముడు బడికి రావటం లేదు. పెళ్ళయిందని కొందరు. వాళ్ళక్క లేచి పోయిందని మరి కొందరు. వ్యవసాయం చేస్తున్నడని ఇలా రకరకాల మాటలు వినపడ్డవి. మొత్తానికి వాడు చదువుకు దూరం అయిండని అర్థం అయింది. చదువులో నాకు పోటీ లేదని తేలింది. అలా నాకో గుర్తింపు లభించింది. త్రైమాసిక, షాణ్మాసిక పరీక్షలు ముగిసాయి.

దసరా సెలవులు మొదలయ్యాయి. వాకిళ్ళలో ఆడపిల్లలు బొడ్డెమ్మల్ని పెట్టుకొని చుట్టూ తిరుగుతూ ఆడేవారు. అభిమాన సంఘాల వారు వారి చుట్టూ తిరిగే వారు. ఎంగిలిపూల బతుకమ్మ నాడు ఆడవాళ్ళు ఆడితే మొగవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో నుండి నేను తీసుకెళ్ళేది. అమ్మ అనారోగ్యం ముదిరింది. ఆడేది కాదు. కేవలం పేర్చి ఇచ్చేది. వైధవ్యం వల్ల నాయనమ్మ ఆడేది కాదు. అమ్మ చక్కటి పాటలు పాడేది. మొదటిరోజు పేర్చితే, తిరిగి చివరి రోజే పేర్చేది. మా ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళల్లో సాయంత్రం కాగానే బతుకమ్మ పాటలు సామూహికంగా వినిపించేవి. నేను వాటికి శ్రోతను ప్రేక్షక పాత్రను. చివరి రోజు తీవ్రమైన అనారోగ్యం వల్ల అమ్మ బతుకమ్మ పేర్వలేదు. ఆ రోజు నేను ఖాళీ చేతులతో బతుకమ్మ చూడ్డానికి వెళ్ళిన. ప్రతి ఇంటిముందు బతుకమ్మ కొలువుదీరింది. అవికాస్త ఒక కూడలిలో ఆడిపాడి మురిసాయి. మగ పిల్లలు పటాసులతో ఆడవారిని భయభ్రాంతులకు గురిచేసేవారు. వారు తిడితే పడేవారు. ఆడిపాడి అలసి పోయాక, పెద్ద బతుకమ్మలను మగవారు నెత్తినెత్తుకొని మా ఊరి పక్కనే పారే “మోయతుమ్మెద” వాగుకు వెళ్ళి అందులో వేసేవారు. చివరిసారిగా ఆడవాళ్ళు వాగులో కొంతసేపు ఆడి తమతో తెచ్చుకున్న రకరకాల పిండిపదార్థాలను “ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం” అనుకుంటూ ఒకరికొకరు ఇచ్చుకునేవారు. అలా చేతులు మారిన సత్తుపిండ్లను తిని పాటలు పాడుకుంటూ ఏ రాత్రికో ఇండ్లు చేరేవారు. ఇంట్లో బతుకమ్మకు ఆ సంవత్సరం నుండి కరువు వచ్చింది. సత్తుపిండికి మాత్రం ఏనాడు కరువు రాలేదు. సెలవులు పూర్తయ్యేసరికి అమ్మ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. రక్త విరోచనాలతో కృంగి కృశించింది. ఒక రకమైన శూన్యం ఇంటినిండా ఆవరించింది. పల్లెటూర్లలోని రకరకాల వైద్యాలకు అమ్మ శరీరం ఒక ప్రయోగశాలగా మారింది. నాటువైద్యం, మోటు వైద్యం, సూది వైద్యం, మంత్ర, తంత్ర వైద్యాలు అన్ని అయ్యాయి. కాని నయం కాలేదు. కరీంనగర్‌ వెళ్ళాలని అందరూ అంటే వెళ్ళడానికే మొగ్గు చూపినం.

అమ్మ అనారోగ్యం, బాపు విధినిర్వహణకు ఆటంకంగా మారింది. కరీంనగర్‌లో వైద్యం జరగాలంటే అమ్మ అక్కడే కొద్ది రోజులు ఉండాల్సివచ్చింది. ఇది మా కుటుంబానికి అశనిపాతమైంది. అమ్మతో ఉండటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇద్దరు తమ్ముళ్ళను పట్టుకొని నాయనమ్మ ఇంట్లో ఉండాల్సివచ్చింది. నెలల పాటు బడి వదిలి ఉండే పరిస్థితి బాపుకు లేదు. అనివార్యంగా భారం నాపై పడింది. అమ్మతో పాటు కరీంనగర్‌ వెళ్ళాల్సి వచ్చింది. అలా చదువులకు గండి పడింది. బోర్డు పరీక్షలనే భయం గాలికి పోయింది. సార్లు, విద్యార్థులు, ఆటలు వీటి స్థానంలో బాధ్యతలు వచ్చి చేరినయి. అంతకుముందు రామయ్య సార్‌ నోటి ద్వారా విన్న కరీంనగర్‌కు వెళ్ళటం ఉద్వేగంగా అనిపించింది. ఊరు వదిలివెళ్ళడం అదే మొదటిసారి. నెలల తరబడి ఉండాల్సి వచ్చింది. బొంగరం, పయ్య ఆటల మధ్య గడపాల్సిన గంటలు సిరంజి, గ్లూకోజ్‌ల మధ్య గడచినవి. ఇంటికి బడికి మధ్య పగలంతా రాకపోకలు సాగేవి. ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌కు డాక్టర్‌ రూంకు మధ్య పగళ్ళు గడిచినవి. అత్యంత వేగంగా గడిచిన ఉదయాలు భారంగా గడవడం ఇబ్బందులకు గురిచేసినవి. అమ్మకు నేను ఆలంబనగా ఉన్నానా? భారంగా ఉన్నానా? అనేది వేయి మిలియన్ల ప్రశ్న. అమాయకమైన బాల్యం వల్ల నేను అనారోగ్యం వల్ల, పరాధీనత వల్ల అమ్మ నిర్ణయాలు తీసుకోలేకపోయేవాళ్లం. అలా బాహ్య పరిస్థితులు, వారం రోజులకో సారి వచ్చే బాపు కోసం ఎదురుచూసేవి. ఆయన వచ్చాకే మాకు సౌకర్యాలలో మార్పు జరిగేది. ఎన్ని రోజులైనా అమ్మ ఆరోగ్యంలో మాత్రం మార్పు కనిపించలేదు. డాక్టర్లు ఇంకా కొద్ది రోజులు ఉండనివ్వండి అంటే ఉండక తప్పలేదు. అప్పుడప్పుడు ఆసుపత్రి నుండి బయటకు వచ్చి కూర్చునేది.

వ్యవసాయక వాతావరణంలో తొణికిసలాడే పల్లెకు, అత్యంత భిన్నమైన వేగంతో కూడిన వాతావరణం గల పట్టణానికి మధ్య మొదటిసారి తేడా తెలుసుకోగలిగిన. నాలాంటి బడి పిల్లలు కూడా నా వలె కాక అందమైన డ్రెస్‌తో వెళ్ళడం కనిపించింది. సైకిళ్ళు, రిక్షాలు, అక్కడొకటి ఇక్కడొకటిగా కనిపించే స్కూటర్స్‌ అరుదుగా కనిపించే కార్లు మొత్తానికి అదొక కొత్త ప్రపంచంగా అనిపించింది. అన్ని అందుబాటులో ఉండేవి. పలకరింపులు ఉండేవి కావు. పల్లెల్లో దొరకని వస్తువులు అనేకం ముందే ఉండేవి కాని అందేవి కావు. మేం ఉన్న ఆసుపత్రి కరీంనగర్‌ మధ్యలో అత్యంత వ్యాపారం జరిగే “తీరందాజ్‌” టాకీస్‌ రోడ్డులో ఉండేది. నేనెక్కడ తప్పిపోతానో అని అమ్మ నన్ను బయటికి వెళ్ళనిచ్చేది కాదు. నేను మాత్రం బయట షాపుల గద్దెల మీద గంటల తరబడి కూర్చునే వాణ్ణి. వచ్చే పోయే వాటిని చూస్తూ గడిపేవాడిని. అత్యంత వేగంగా గడిచే పట్టణ జీవన విధానంలో ఏక సూత్రత కూడా కనిపించేది.

అమ్మకు వైద్యం చేసే డాక్టర్‌ రోజుకోసారి కనిపించేవాడు. ఒక నర్స్‌ మాత్రం ఎప్పుడూ వచ్చేది. తెల్లటి డ్రెస్‌, నల్లటి రూపం, ఆకర్షణీయమైన అందం, ఆత్మీయంగా పలకరించే కళ్ళు ఆమె సొంతం. నేనంటే ప్రత్యేక అభిమానం చూపేది. ఆమెతో చనువు ఏర్పడింది. అది కాస్త నన్ను ఆమె ఇంటి వరకు నడిపించింది. ఆమెకు పిల్లలు లేరని అర్థమైంది. ఆ ఇంట్లో కాలు లేని మగవాడు కనిపించాడు. వంట చేయటం అతని పని. వంట అయ్యాక వచ్చి ముందుహాలులోని కుర్చీలోనో, పడకపైనో రిలాక్స్‌ అయ్యే వాడు. అతడామె భర్త. సంపాదన కోసం ఆమె బయటకు వెళ్ళటం. అతను ఇంట్లో పనులు చేయడం నాకు కొత్తగా కనిపించింది.

ఆమె చేయి గుణం మంచిది. ఇంట్లో ఉన్న సమయంలో రోగులు వచ్చి వెళ్ళే వాళ్ళు. రోగులను చూడడానికి ఆమెకు ఒక ప్రత్యేకమైన గది ఉండేది. అదంతా మందుల వాసనతో ఉండేది. ఇంటా, బయటా ఆమె వైద్య సేవలు అందించడం సంతోషంగా అనిపించేది. వాళ్ళ ఇల్లు కూడా ఆసుపత్రిని తలపించేది. ఉండేది ఇద్దరే అయినా నాలుగైదు గదుల ఇల్లు వాళ్ళది. చిన్న వాణ్ణి అని కాబోలు, ఎక్కువ గారాబం చేసేది. ఆమెకు పనుల్లో తోడ్పడేవాడిని. అమ్మ కూడా అభ్యంతర పెట్టకపోయేది. అమ్మ ఆమె నాకు మధ్య తెలియని దగ్గరితనమేదో కనిపించింది. అమ్మ ఆరోగ్యం కాస్త కుదుట పడినట్లనిపించింది. అయినా ఆసుపత్రివాళ్ళు వదలలేదు. ఆసుపత్రిలో కాక, బయట ఉండి ప్రతిరోజు వచ్చి కలవమన్నాడు డాక్టర్‌. ఈ అంశం మరో సమస్యను తెచ్చిపెట్టింది. ఎవరూ తెలియని ఆ జనారణ్యంలో ఉండేదెక్కడ? ఆపద్భాందవిలా ఆమె ఆదుకుంది. ఆ నర్సు ఇంట్లో ఉన్న ఒక చిన్నరూంలో ఉండేవాళ్ళం. అక్కడికి వచ్చే రోగుల వల్లా అమ్మ వల్ల ఆమె గురించిన కొన్ని విషయాలు తెలిసాయి. కాలు విరిగి ఇంట్లో ఉన్నవాడు పెద్ద పటేలు అనీ, అతడామెను ఉంచుకున్నాడని వినవచ్చింది. అతడు ఊరినుంచి లేచి వచ్చి ఈమె దగ్గర ఉన్నాడని తెలిసింది. మా ఊర్లో భీముని అక్క ఇంటి నుండి లేచిపోయి పటేలు ఇంట్లో ఉంది. ఇక్కడేమో పటేలు లేచివచ్చి ఈమె ఇంట్లో ఉంటున్నాడు. అక్కడ ఆమె, ఇంట్లో పనిచేస్తే ఇక్కడ ఇతడు ఇంట్లో పనిచేయడం కనిపించింది. కాని గుసగుసలు మాత్రం ఆడవాళ్ళ గురించే రావడం విచిత్రమనిపించింది. ఎందుకట్లా అనుకుంటారో అర్థం కాకపోయేది. పనిమంతురాలైన నర్సు. తరగతి గదిలో విన్న జార్జిరెడ్డి హత్య, చిన్ననాడు పెద్దమ్మ ఊర్లో చూసిన ఉదృతమైన ఊరేగింపు ఈ మూడు నాలో బలమైన ముద్రలు వేసాయి

అమ్మ ఆరోగ్యం కుదుట పడ్డట్టు కనిపించింది. కుదుటపడటం, క్షీణించడం ఇలా జరుగుతూ ఉంది. లేచి తన పనులు తను చేసుకుంటుంది. ఎలాగోలా లేచి వంట చేస్తుంది. అప్పుడప్పుడు బడి మీదికి చదువుల పైకి ధ్యాస మర్లేది. పక్కకే పుస్తకాలుండేవి. కాని చదువ బుద్ది అయ్యేది కాదు. వచ్చి చూసి వెళ్ళే వారు ఎవరూ లేరు. నర్సు అంటీ, నర్సు అంకుల్‌ ఇద్దరే బంధువులు, మిత్రులు, సమస్తం. ఎప్పుడో ఒకరు అలా వచ్చివెళ్ళినట్లు గుర్తు. వాళ్ళెవరంటే అమ్మ చేతి వంట తిన్న దూరపు తమ్ముడు. నాకు ఇంటి మీద బెంగ కలిగింది. బోర్డు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. బాపు, తొందరపడ్డాడు. కాని అక్కడినుండి కదలేలా లేదు. ఒక రోజు బాపు వచ్చిండు. నర్సు ఆంటీతో మాట్లాడుతున్నాడు. అక్కడే ఉన్న నేను వింటూ ఉన్నా.

“మేం చేయగలిగిన వైద్యం చేసినం”

“ఇంతకంటే నయం అయ్యే మందులు లేవా”

“ఈ రోగానికి ఎక్కడికి వెళ్ళినా జరిగే వైద్యం ఇదే”

“మమ్మల్ని ఇక్కడే ఉండమంటారా! వెళ్ళమంటారా”

“ఇక్కడ ఉన్నా, మీ ఊరికి వెళ్ళినా వేసుకోవాల్సిన మందులు ఇవే”

“అయితే ఊరికే వెళ్తం”

“మీ ఇష్టం”

ఆ సంభాషణ వింటున్న నాకు ఇబ్బంది అనిపించింది. మెత్తగా మాట్లాడే ఆంటీ ఇలా ఎందుకు మాట్లాడ్తది. రోగులతో కాని ఇబ్బంది ఉన్నవాళ్ళతో కాని ఇలా మాట్లాడాల్సిందేనా? నిష్కర్షగా సాగిన ఆ సంభాషణతో అమ్మకు క్యాన్సర్‌ అని తెలిసింది. ఊరికి వెళ్ళాల్సిందే అని తేలింది. వెంటనే పయనం అయ్యాం.

అమ్మ వచ్చిందని తెలియగానే చుట్టుపక్కల వాళ్ళందరు వచ్చి చూసారు. రెండు మూడు రోజులు అలా సాగింది. “ఏడ్పులు-ఓదార్పులు”, “రాత-గీత” లాంటి మాటలు వినిపించాయి.

“నీకు అందరూ సుద్దరోల్లే దోస్తులు, వాళ్ళే వస్తున్నరు” ఈసడింపుగా బాపు “ఎన్నోసార్లు పసుపుకుంకుమలకు పెద్దకులపు ఇండ్లల్లకు పోయిన. వాళ్ళు ఒక్కరు రాలేదు” జవాబిచ్చింది అమ్మ.

అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో పనికాగానే చుట్టుపక్కల ఉన్న శాల, వడ్ల, సొన్నాయి. బెస్త కులపోల్ల ఇండ్లల్లకు వెళ్ళి మాట్లాడేది. ఇంటిపక్కకు ఉన్న అందరితో చనువుగా ఉండేది. వాళ్ళు మా ఇంటికి వస్తే తనకు కలిగిందాంట్లో కొంత పెట్టేది. తెలిసింది చెప్పడం, తోచింది అనడం అమ్మ అలవాటు. కరణం, పటేలు, పెద్ద కులం వాళ్ళతో బాపు స్నేహంగా ఉండేవాడు. అమ్మ బోళామనిషి అనిపించేది. అందుకు భిన్నంగా బాపు కనిపించేవాడు.

నాయనమ్మ బాపుకు వత్తాసు పలికేది. పచ్చివేప చెక్కకు తేనే పూసినట్టుండేది ఇల్లు.

“అమ్మ ఎప్పుడు బాధతో ఉంటవెందుకు?” ఒక రోజు అడిగిన.

“నీకు చెప్పినా అర్థం కాదు బిడ్డ”

“ఏం చేస్తే నీ బాధ తగ్గుతుంది”

“నువ్వు పెరిగి పెద్ద కొలువు చేస్తే తగ్గుతది”

“అయితే ఇప్పుడే జేస్త”

అమ్మ పగలబడి నవ్వింది ముద్దులతో ముంచెత్తింది.

ఊరికి వచ్చాక తెల్లారినుండే బడికి వెళ్ళిన. అంతా కొత్తగా అనిపించింది. అందరి పరామర్శల్తో తడిసి ముద్దయిన. నాపై బడి ఆయాకు ప్రేమ ఎక్కువ. చాటుగా బడి ఉక్మా తినిపించింది. “సుద్దరోళ్ళ వంట మనం తినొద్దు” అనే బాపు మాట, వాళ్ళ వంట రుచి ముందు చేదుగా కనిపించేది. క్లాసులన్ని శ్రద్ధగా వింటున్న ఆరోజు రామయ్య సార్‌ పాఠం మొదలు పెట్టుడే.

“మన ఊరి కరణం పంతుల్ని వాగులో కొంతమంది కొట్టిండ్రట” అని అన్నడు. పాలలో నీళ్ళలా, ప్రజలతో అధికారులు కలిసి పోవాలి. నీళ్ళు ఎక్కువైతే పాలు పలచగ అయి వాటి స్వభావం కోల్పోతాయి. అధికారులు, ప్రజలకు సేవకులుగా ఉంటే గౌరవం ఉంటది. అధికారం చలాయిస్తే ప్రజలు సహనం కోల్పోతరు. ‘ఘర్‌పట్టీ’ కట్టలేదని ‘ఎల్‌ఎంబి’ చెల్లించలేదని, పంతులు హింసించిండు. ఇంటి తలుపులు ఊడబెరకడం లేదా కొట్టం వాసాలు తీసుకెళ్ళడం, శిస్తు కట్టలేదని భూముల్ని తనపేర రాసుకోవడం, బ్యాంకు అధికారుల్ని రైతులపైకి ఉసిగొల్పడం ఇలాంటివి పంతులు చేసిండు. కోల్పోయిన వాళ్ళకు కోపం ఎక్కువ ఉంటది. అదను చూసి వాగుల ఒంటరిగా దొరికిచ్చుకొని కొట్టిండ్రు” అని ఆనాటి పాఠం ముగించిండు.

లంచ్‌ బెల్‌ మోగింది. అందరం గుంపులుగుంపులుగా ఇంటికి బయల్దేరినం.

“మన రామయ్య సార్‌ కమ్యూనిస్టట, మా బాపు చెప్పిండు” అన్నడు దొరకొడుకు.

“మరి పంతులు ఎవరట?” అడిగిండొకడు.

“కాంగ్రెసట”

అలా మాట్లాడుకుంటూ ఎవరి ఇండ్లకు వాళ్ళం వెళ్ళాం. మొత్తానికి మనుషులంతా ఒక్కటిగా లేరు అనే విషయం అర్థం అయింది. ఊరు సర్పంచ్‌ది కమ్యూనిస్టు పార్టీ. పంతులుది కాంగ్రెస్‌ పార్టీ. ఊర్లో రెండు అధికార కేంద్రాలు, రెండు వర్గాల వారికి ఒకరంటే ఒకరికి పడదు. దాడులు జరపటానికి సందర్భం కోసం చూస్తుంటరు. దసరా అందుకు అనువుగా ఉంటది. సాయంత్రం పూట జంబి చెట్టు దగ్గర రాత రాసి, పూజ చేసి, ఆకు తెంపడం కరణం పని. పండగ సందర్భంగా ప్రజలు తిని, తాగడం అత్యంత సాధారణం. జంబి ఆకు కోసం తాగి రావడం, అక్కడ గొడవ పడడం, తలలు పగలడం జరిగేది. “దసరా రోజు తాగి కొట్టుకుంటే పోలీసుకేసు ఉండది” అని అనుకునేవాళ్ళు. ఈ గొడవంతా ఎందుకని పగలే జంబి పూజ మొదలుపెట్టారు. అలా ఒక సంప్రదాయం తన సమయాన్ని మార్చుకుంది. నాటి రాజకీయాల ప్రభావం అలాంటిది. పల్లెలు ఆత్మీయతలకే కాక పట్టింపులకు కూడా నిలయాలు.

బోర్డు పరీక్షలకే కాదు. అమ్మకు కూడా రోజులు దగ్గరపడ్డయి. ఆరోగ్యం మరింత క్షీణించింది. బాపు నా పరీక్షలపై దృష్టి పెట్టిండు. పరీక్షల్లో నేను ఫస్ట్‌క్లాస్‌ రావాలని ఆయన దీక్ష. పరీక్షలయ్యాయి. ఫలితాలు తేలిశాయి. ప్రథముడిగా నిలిచాను.

అమ్మ చనిపోయింది. వేసవి సెలవులు కనుక బాపు ఇంటివద్దే ఉన్నడు. బంధు మిత్రులందరికి విషయం చేరవేసినం. చాలా మంది వచ్చారు. అందరు నాకు కొత్తగా కనిపించారు. ఒకరిద్దరు తప్ప. అమ్మకు చిన్నబాపు కొడుకులట (తమ్ముళ్ళు) ఒకరిద్దరు వచ్చారు. నా పదమూడేళ్ళ కాలంలో వాళ్ళను ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కువగా చూడలేదు. కారణం బాపే అనిపిస్తది. మా ఊరివాగుదాటి వెళ్ళడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. బడే లోకం ఆయనకు. వాగు దాటి నెలల తరబడి ఉన్న నాకు లోకమే బడి అయింది. అమ్మశవం అక్కడుంది. నా కంటె చిన్నవాళ్ళయిన ఇద్దరు తమ్ముళ్ళు దూరంగా ఉన్నరు. దుఃఖం, చావు అనే రెండు విషయాలు మా కప్పుడు తెలియవు. అనుభూతులకు అతీతంగా ఉండే అమాయక బాల్యం అది.

“ముత్తైదువగా పోతుంది” అని ఒకరు

“కష్టాలు తీరినయి” మరొకరు

“ఏం సుఖపడ్డది” ఇంకొకరు

“పిల్లల గతి ఏం కావాలి” ఎవరిదో కంఠం

ఇలా ఎవరికి తోచిన మాటలు వారు అంటున్నరు. చావు కబుర్లు చాలా వినిపించినయి. వారి మాటల్లో అమ్మ కష్టాలు చాలా దొర్లినయి. అంత్యక్రియలకు అన్నీ సిద్దం అయినయి. అమ్మకు వీడ్కోలు పలికిన, నిప్పు పట్టిన చితి ఎగసి ఆరింది. అమ్మ చనిపోయి నెలరోజులైంది.

నెల మాసికానికి మా ఊరు పక్కకే ఉన్న వరుసకు మామ అయిన బంధువు వచ్చిండు. ఇంట్లో కార్యక్రమాలయ్యాక, మాతో కలిసి అతను సమాధి (తిరుపళ్ళె) వద్దకు వచ్చిండు. అక్కడ పూజాదికాలు అయ్యాక పక్కనే ఉన్న కాలువకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళిన నాతో పాటు అతను వచ్చిండు.

“సచ్చిపోయినామెకు నువ్వే మైతవయ్యా” అడిగింది బట్టలుతికే ఆడమనిషి

“అన్ననైత” అన్నడు.

“ఎన్నడన్న మీ చెల్లె కష్టసుఖం చూసినవా. నీ అసొంటి తోడబుట్టినోడు ఉంటెంత లేకుంటెంత? అత్తపోరు, మొగని పోరుతో సగం సచ్చింది. రోగంతో పూర్తి సచ్చింది. ఏమాత్రం నెనరు లేని మనుషులు” అంటూ పనిలో మునిగింది.

చెయ్యని నేరానికి మామయ్య మాట పడ్డడు. అతడు నొచ్చుకున్నట్లనిపించింది. నిరంతరం సలిపే పుండులాంటి జ్ఞాపకమది.

మా ఊర్లో చదువులేదు. ఉన్నత పాఠశాల కోసం ఊరికి దూరంగా మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ తోటపెల్లికి చదవడానికి వెళ్ళాలి. అది కాదనుకుంటే కరీంనగర్‌కు వెళ్ళాలి. ఎటు వెళ్ళాలో నిర్ణయించేది నేను కాదు, కరీంనగర్‌ వెళ్ళాలని బాపు నిర్ణయించిండు. కరీంనగర్‌ ఇప్పుడు నాకు పాతదే. పల్లెటూరు నుండి పట్నం బయలుదేరిన. కన్నతల్లి పోయింది. పుట్టిన ఊరును వదిలిన అలా రెంటికి దూరమై బడి కోసం బయల్దేరిన. ఇక ఆ ఊర్లో మిగిలింది నాయనమ్మ మరికొన్ని జ్ఞాపకాలు. “రెక్కాడితేనే డొక్కాడాలే” అనే అమ్మ మాటను వెన్నెముకగా మలచుకొని నగర జీవితంలోకి వెళ్ళిన.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version