Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లె సంశ్రయము – ప్రగతి నిశ్చయము

[రెడ్డిశెట్టి పవన్ కుమార్ గారి ‘పల్లె సంశ్రయము – ప్రగతి నిశ్చయము’ అనే రచనని అందిస్తున్నాము.]

ప్రజా భవిత, దేశ శ్రేయస్సు పాదుకొల్పడంలో పల్లె, పట్టణాలను తరాజులో వేస్తే మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు నా సొంతమని పట్టణం ఛాతి విరిస్తే, తనను మించిన గురువు ఎక్కడనే ప్రకృతి, కాలుష్యమెరుగని ఆహ్లాదం తన సొంతమంటూ పల్లెనే మొగ్గు చూపుతుందేమో.

అన్నం పండించే రైతు కాడి వదిలి పట్టణం వలస వెళ్లితే ఆకలి చావులు, దరిద్రం, దోపిడి, దొంగతనాలు, వర్గభేదాలు మొదలగు దేశానికి గల సర్వదారిద్య్రాలకు ఇంతకు మించిన బీజం లేదు. అన్నం పెట్టే అమ్మే బిడ్డకు ఆకలి అవుతుందంటే రాబోయే పెను ప్రమాదానికి ఇంతకు మించిన సూచకం లేదు.

విత్తన లేమి, పెట్టుబడికి అప్పులు, ఎరువుల కొరత, వర్షాభావం, అకాలవర్షం, గిడ్డంగుల ఎద్దడి, ఉపాధి హామీలు లాక్కెళ్లడంతో కొరవడిన కూలీలు, అన్నింటికీ మించి తన కోసమే పనిచేసే మార్కిటింగ్ భాగస్వామి అంటూ ఒకరు లేకపోవడం ఇలా రైతుకు ప్రతి అడుగులో అడ్డంకులెన్నో. NCRB నివేదిక ప్రకారం ఒక్క 2022 సంవత్సరంలోనే ఋణభారంతో 11,290 మంది రైతులు, వ్యవసాయ రంగ కూలీలు ఆత్మహత్య గావించారు. ఇంకా ఎందరో రైతులు ఉరి కొయ్య నీడలోనే జీవనం సాగిస్తున్నారు.

వేల కోట్లతో సాలీనా దూసుకెళ్లే సినీ పరిశ్రమకు కోరినప్పుడల్లా కాసులు కురిపించేది బతుకు దుర్భరమైన మన రైతన్ననే. ఈ రోజు దేశమంతా తన కాళ్ళ మీద తాను నిలబడి భోంచేస్తుందంటే అదంతా ఈ దేశంలోని రైతు బలమే. కానీ ఆ రైతే తన కాళ్ళ మీద తాను నిలబడలేక పోవడానికి కారణం తనలోని బలహీనమైన వ్యాపార సరళి మాత్రమే. వ్యవసాయ రంగం ఒక వైపు ఉరికొయ్యకు నెలవైతే కొండొకచో రైతుకు సిరులనందిచక పోలేదు. రైతు ఒక్కడైతే సాంకేతికత దూరమవుతుంది, భారమవుతుంది. సంఘటితమవుతేనే ఒంటరితనం మాయమవుతుంది, గెలుపు ఖాయమవుతుంది. ఒకటి, రెండు గ్రామాలలోని రైతులంతా ఐక్యమవ్వాలి. ఐక్యతే వారి విజయానికి మొదటి మెట్టు. ఇక నుండి ఏ రైతూ ఒంటరి పోరాటం చేయకూడదు. అప్పుడే రైతులంతా ఒకే పంట వేసుకుని తమ గిట్టుబాటు ధరకి తామే తిలోదకాలు ఇవ్వరు. 20ఏళ్ల క్రింద మొదలై 500కి పైగా ఏర్పడ్డ ఎఫ్.పి.ఓ.లు (రైతు ఉత్పత్తి దారుల సంఘాలు) ఒకవైపు రైతుకు చేయందిస్తూనే మరోవైపు కేంద్ర బడ్జెట్లో వేలకోట్లతో తమ అస్తిత్వానికి వన్నెలద్దుకోవటం అస్తమిస్తున్న రైతు జీవితానికి గొప్ప వెలుగు రేఖ. ఐతే ప్రతీ రైతు ఈ వెలుగు రేఖను అందిపుచ్చుకోవడానికి అడుగులు వేయాలి. పచ్చదనంతో వెలిగే మాగాణిలా ఎఫ్.పి.ఓ.ని అందిపుచ్చుకొని వ్యవసాయ రంగాన్ని వెలిగించాలి. సంగమే రైతు బలం. రైతు ఐక్యత ముందు తమ కష్టాలన్నీ చెల్లాచెదురవటం ఖాయం. ఒక్క నీటి చుక్క కూడా వృధా కాకుండా చూసే ‘సెన్సర్ల’ను కొనుగోలు చేయాలి. చీడ ఉన్న మొక్క పై మాత్రమే క్రిమి సంహారక మందు స్ప్రే చేసే ‘నిక్ రోబోటిక్స్’ని ఉపయోగించాలి. దీని ద్వారా నీటి ఖర్చు, మందుల ఖర్చు తగ్గుతుంది. రైతుకు చేయందించే ఎన్నో ఆప్స్ నేడు చరవాణిలో చేరి రైతుల మన్ననలందుకుంటున్నాయి. ఒక రోగికి వైద్యుడు ఎంత సునిశితంగా పరీక్షిస్తాడో, ఎంత మోతాదులో మందు నిస్తాడో, ఏ భాగానికి రోగాన్ని తొలగిస్తాడో అంతే కచ్చితంగా తన పంటలో ఏ ఆకుకు ఏ చీడ ఉందో, ఏ కాండానికి ఏ పురుగు ఉందో, ఎంత మోతాదులో క్రిమి సంహారక మందు అవసరమో తెలిపే ‘ప్రెసిషన్ అగ్రికల్చర్’ను రైతు అందిపుచ్చుకుంటేనే ఖర్చు తగ్గడమే కాకుండా అనవసర రసాయనాల నుండి రేపటి తరానికి భూమిని కాపాడుకోగలడు. పంట కోతకి వచ్చే నాటికే, కొనేవాడు రైతు ముంగిట కొలువు తీరాలి. రైతుకు నచ్చిన ధరకి కొనేవాడిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అప్పుడు రవాణాభారం, పంట నిలువలు, అమ్మడానికి పడిగాపులు వంటి వాటి నుండి కూడా విముక్తుడవుతాడు. ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి వడ్డించిన కంచంలా రైతు జీవితం కళకళలాడుతుంది.

తరగతి గదిలో ఉపాధ్యాయలు వ్యవసాయం యొక్క ఉనికిని, పల్లె అందించగల సంశ్రయాన్ని విశదపరచాలి. నేటి బాలల భవిష్యత్ కళ రైతవ్వాలి. పల్లె లో పుట్టడం వరమనుకోవాలి. చిన్నప్పటి నుండే వ్యవసాయం అన్నది మహోన్నత వృత్తే గాక కడు దేశ సేవ అన్న వాస్తవం వేళ్లూనుకోవాలి. అది వారికి గొప్ప వృత్తే కాకుండా భారత జాతికి భద్రతా కవచమవుతుంది.

కోళ్లు, మేకలు, చేపలు, గేదెలు, కుటీర పరిశ్రమలు పచ్చని పంటపొలాలు దేశ ఆర్ధిక సంపదకు పెట్టని గల్లాపెట్టెలు, యువతకు పుష్కల ఉపాధి హామీ కేంద్రాలు, ఆర్ధిక స్వేచ్ఛ ప్రదాయకాలు. అభివృద్ధి పథంలో నడవని పల్లె గ్రామీణులు పట్టణాలకు వలస బాట పట్టితే అది ఖచ్చితంగా పట్టణ అభివృద్ధి చక్రాలకు అడ్డం పడడమే అవుతుంది. పల్లె పట్టణాలు రెండూ వేటికవే అభివృద్ధి సాధించినప్పుడు దేశసమిష్టి అభివృద్ధి సాధ్యపడుతుంది. దేశ ఆర్ధిక లక్ష్యానికి పల్లెపట్టణ ప్రగతులు రెండు కాళ్ళు. రెండూ స్వతహాగా, స్వతంత్రంగా బలిష్ఠమైనపుడే ప్రపంచ ఆర్ధిక రంగంలో దేశాన్ని ముందు నిలపెడతాయి. గ్రామాల నుండి పట్టాణాలకు కొనసాగుతున్న వలస రేటు ఏ కోణంలోనూ శ్రేయస్కరం కాదు.

పురుషులకు చేదోడుగా పొలం పనులలో నడుం బిగించిన గ్రామ మహిళలు వ్యవసాయాధారితమగు భారతావని ఆర్థిక ప్రగతికి అసలైన పునాదిరాళ్ళు. కష్టం వినా సుఖం సున్నా అని చెప్పకనే చెప్పడం కాకుండా శ్రమ లోని జీవన సౌందర్యాన్ని నలుగురికి చూపించే స్ఫూర్తి కారకులు.

ఒక బాహువుతో వంద వింజామరలు విసిరితే ఎంత హాయి. అలాంటి బాహువులు వందకు పైగా నా కోసం అవని వేదికపై అలరారితే ఎంత అద్భుతం. మండుటెండలో వేచి, నేనెప్పుడొస్తానోనని కాచి, రాగానే చల్లని గాలితో వీచే మా మర్రి చెట్టు పట్నంలో ఉంటుందా . ఒక వేళా ఉంటే ఆ చెట్టును బతకనిస్తామా ? నాలుగుగోడల మధ్య బందించుకొని డబ్బులు వెచ్చించి డబ్బా లోంచి వచ్చే గాలికి జేజేలు కొట్టే నగర గరిమ ఏ పాటిది మా పల్లె ముందు.

హద్దులు కానరాని విశాల జలరాశిలో గల గల పారె నీటి అలల తోడుగా కేరింతలు కొడుతూ తన వారందరితో సరదాగా పోటీలు పడుతూ పేదరికపు కోరలను వెక్కిరిస్తూ అత్యంత వైభవంతో జీవితాన్ని సంపన్నం చేసుకునే పల్లె లోని బుడతలకు మించి, ఎత్తైన ఆకాశహర్మ్యాల్లో వంద గజాలకు మించని కుదించిన కొలనులో పారలేని నీటిలో ఈతకొట్టే శ్రీమంతుడి వైభవం ఉంటుందా ?

ఎదిగొచ్చిన్న కొడుకులా నింగినంటే తాటిచెట్లు, నేలంతా ముగ్గు వేసినట్లుండే పచ్చని పంట పొలాలు, ఇంటివారితోనే చరవాణితో గడిపే ఈ రోజుల్లో వీధివారంతా నా కుటుంబమేననే అరుగు మీది ముచ్చట్లు, ఎండ వాన చలిల నుండి కాపాడే ఇంటి గోడల్లా కాలుష్య కోరల ఉనికి హరించే నలుదిక్కుల పచ్చని పహారా, శివపాదం చేరడమే జీవిత పరమార్థం అనే పెరటి మొక్కలా నీ కడుపు నింపుటకే ఏపుగా పెరిగిన పంట ధాన్యాలు, బువ్వపెట్టి బుజ్జ్జగించే తల్లిలా పాలతో, రోగాన్ని ముందుగానే దరి చేరనివ్వని ఇంటి వైద్యుడిలా పేడతో మూత్రంతో నీ జీవితాలు కాపాడే పాడి దేవతల కొలువులు, సంవాహనంలో చెలికత్తెలా అలసిన మేనుకు కలిసే సెలయేర్లు, చిన్న కుటుంబాన్ని కనిపెట్టుటకు అవసరం లేని కాపలాదారునిలా సమ్మిళిత కుటుంబాల పరిమిత పరిధులు, అటక మీద దాచిన లడ్డూలడబ్బాలా పలు రకాల పండ్ల చెట్లతో, ఒత్తైన చెఱకు గడలతో వివిధ రుచుల నెలవైన పల్లెశివార్లు, బెత్తం పట్టుకుని దారితప్పకుండా కాచే తండ్రిలా ఒంటికి కొవ్వు పట్టకుండా దారుఢ్యం తిష్ట వేయించే నారుమడులు, నీ ఆర్ధిక అవసరాలకై నేల నుంచి పంట సంపద, నీటి నుంచి మత్స్యాది సంపదలు, ఆప్యాయతను, ఆర్ధిక శక్తిని కలిపి అందించే పాడి సంపదను, తరాలకు సరిపడ కడుపులో కొంత దాచుకుని, చేతిలో కొంత నోచుకుని, నీ ఆరోగ్యాన్ని కాచుకుని, పెట్టని ఆభరణాలు, ఎదురులేని అస్త్రాలతో పల్లె పలురకాలుగా అంగరంగ వైభవంగా, నిను ఔదల దాల్చే అక్షౌహిణిగా, ముస్తాబై వస్తాదై నీ కోసం పుడితే కనబడని కర్ణుని శాపాల రూపాన గ్రామప్రగతి సాధించే ప్రతి లంకెలు వీగిపోవడం, నేడు గ్రామాలు కాంతులు కోల్పోవడం, గ్రామీణులు పట్టణాలకు వలస బాట పట్టడం కడు శోచనీయం.

జరిగిన పూడ్చలేని నష్టం నేర్పే గుణపాఠం నుండి జరుగాల్సిన దిద్దుబాటు చర్యల దిశగా అడుగువేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించినపుడే మహాత్ములు చెప్పినట్లు పల్లె వెన్నుముక ద్వారా దేశ ప్రగతి సిద్ధించేది.

Exit mobile version