Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిరసన స్వరాలూ, సంఘీభావ కవనాలూ – ‘పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవితలు’

[గీతాంజలి (డా. భారతి దేశ్‍పాండే) గారి సంపాదకత్వంలో వెలువడిన ‘పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవితలు’ అనే కవితా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

యుద్ధం ఒక ఉన్మాదం! యుద్ధం ఒక వికృత క్రీడ! యుద్ధం మానవతపై మాయని మచ్చ! ఆధిపత్య భావనతో యుద్ధానికి కాలుదువ్వేవి కొన్ని దేశాలయితే, బలవంతగా తమపై రుద్దబడిన యుద్ధాలలో పాల్గొనాల్సి వచ్చిన దేశాలు కొన్ని! తమ అస్తిత్వాన్ని నిలుపుకోడానికి కొన్ని దేశాలు చేసే యుద్ధాలు కొన్ని! ఏ రకం యుద్ధమైనా, అది సుదీర్ఘ కాలం కొనసాగితే జాతివైరంగా పరిణమిస్తుంది. అత్యాధునిక ఆయుధాలు, బాంబులు ఉపయోగించడం ఆ యుద్ధం చేస్తున్న దేశాల వారిపైనే కాకుండా సమస్త మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పర్యావరణానికి పెను ముప్పు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ధరలు పెరుగుతాయి. సామాన్యుల బతుకులు అస్తవ్యస్తమవుతాయి.

ఇక యుద్ధంలోకి లాగబడిన దేశాలలో పౌరుల మరణాలు, నగరాలు పట్టణాల విధ్వంసం, క్షతగాత్రులు, కుటుంబాలు విడిపోవడం, శరణార్థులవడం, ఎదిగిన బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మానాన్నలను పోగొట్టుకున్న పిల్లలు! ఆహార గిడ్డంగులపై, వైద్యశాలలపై బాంబులు వేయడం వల్ల ఆహారం, వైద్యం లభించక; ఆకలితో అలమటించి, గాయాలతో పోరాడి అశువులు బాసే జనం!

ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్న యుద్ధాల వల్ల మధ్యప్రాచ్యం రగులుతున్న కాష్టంలా మారింది!!

~

గత కొన్నేళ్ళుగా పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధానికి నిరసనగా, గాజాలో ప్రాణాలు కోల్పోయి, క్షతగాత్రులై, శరణార్థులుగా మారుతున్న ప్రజలకు సంఘీభావంగా తెలుగు కవయిత్రులు వ్రాసిన/అనువదించిన కవితల సంకలనం ‘పాలస్తీనా యుద్ధ వ్యతిరేక కవితలు’ అనే పుస్తకం. ఇందులో 74 కవితలు, కొన్ని విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. పాలస్తీనా ప్రజల వేదనలు, కడగండ్లకు, శిథిల జీవితాలకు అద్దం పట్టాయి ఈ కవితలు.

~

“నేల కొరకు మనిషిని చంపే సంస్కృతి/ఈ ప్రపంచపు ముఖానికెప్పుడూ చిరునవ్వై పూయలేదు” అని అన్నారు జి. కళావతి ‘దుఃఖం మనది కూడా!’ కవితలో. విధ్వంసం ఎన్నడూ విలువల జాబితాలోకి చేరదు అని కవయిత్రి పలికిన మాటలు అక్షరసత్యాలు.

‘విషాద యుద్ధనీతి’ అనే కవితలో “కొసప్రాణపు అన్వేషణలో మోంబత్తి వెలుగు/చారికలై దుఃఖ బిందువులుగా కరుగుతునే ఉంటుంది” అన్న సి.హెచ్. ఉషారాణి ఆవేదనలో తాము గాయపడినా, మృత్యువుకి చేరువవుతున్నా, తమ ఆత్మీయుల కోసం వెతుక్కునే మనుషులు కనబడతారు.

“అక్కడ తరతరాల్ని/ యుద్ధానికి/ లీజుకిచ్చేసారు పాలకులు../ పసివాళ్ళు/ ఆటపాటల్ని/ యుద్ధానికెప్పుడూ తాకట్టు పెట్టేసారు..” అంటూ అముల్య చందు వ్రాసిన ‘రక్తపు ముఖచిత్రం’ కవిత యుద్ధాలలో పాలకుల పాత్రను ప్రస్తావిస్తుంది.

యుద్ధాన్ని అగ్రదేశం ఎలా రెచ్చగొడుతోందో, ఇజ్రాయిల్ పై ఒకప్పుడున్న అభిప్రాయం ఇప్పుడెలా మారిందో కాంతి నల్లూరి తన కవిత ‘ఇజ్రాయిలా! ఇజ్రాయిలా’లో చెప్తారు. నెత్తుటితో గాజా కొత్త చరిత్ర రాస్తోందని జ్వలిత తన కవిత ‘కొత్త చరిత్ర’లో రాశారు.

“ఈ భూమిని ఆలింగనం చేసుకుంటూ/పాలస్తీనా ఘనతను గుర్తుచేస్తూ” దుర్లభ శిఖరాలను గెలిచే ప్రేమ నమ్మకాల గురించి ఆలివ్ చెట్లు మాట్లాడుతాయని – మాయా ఆంథోని కవితకి అనువాదమైన ‘ఆలివ్ చెట్ల గుసగుసలు’ కవితలో డా. కె. గీత వ్యాఖ్యానించారు.

“నిశ్శబ్దం బావురుమన్న శూన్య గృహాలు, మాయమైన మానవతకు మాయని ఋజువులు” అన్నారు డా. చెంగల్వ రామలక్ష్మి తన కవిత ‘విధ్వంసం’లో, పసిపిల్లలు హతమవుతున్నందుకు బాధపడుతూ.

డా. కొండపల్లి నీహారిణి రాసిన ‘ఆ చేతుల్లో..’ అనే కవితలో పాలస్తీనా, ఇజ్రాయిల్ రెండూ నష్టపోతున్నాయని అన్నారు. “జయమన్నవాళ్ళనూ భయమున్నవాళ్ళను/మట్టిలో కలిపి చూపిస్తున్నాయి” అన్న ఈ పదాలు యుద్ధపు దుర్మార్గాన్ని చాటుతాయి.

“యుద్ధాలు/మనుషుల్ని గెలిచిన దాఖలాలెక్కడా లేవు/ఏదోరోజు అందరూ కలిసిపోయే యోజనాల మట్టిని తప్ప!” అన్నారు నిర్మలారాణి తోట తన కవిత ‘పీస్ ఇన్ రెస్ట్!’లో. యుద్ధమెంత నిరర్థకమో ఈ కవిత చెబుతుంది.

“ఏళ్ళ తరబడి ఆరని యుద్ధ జ్వాలల్లో నుండి/యుద్ధానంతర సత్యస్థాపన కనుచూపుమేరలో కానరాదు../ ఇంకా ఏముందని అక్కడ/ఛిద్రం కావడానికి, గగగనమంత గాయం తప్ప..” అన్నారు వి. ప్రతిమ తన కవిత ‘గగనమంత గాయం’లో. పరిధిలేని ఆకాశమల్లే, యుద్ధ గాయాలు కూడా అంతే విస్తరించాయక్కడ.

మోసాబ్ అబూ టోహా రాసిన కవితని ‘యుద్ధం కంటే నేను చిన్నవాడిని’ అనే పేరుతో అనువదించారు ప్రొ. సి.హెచ్. సునీతారాణి. యుద్ధం పట్ల పసిపిల్లల దృక్పథాన్ని ఈ కవిత గొప్పగా వ్యక్తీకరించింది.

మణి వడ్లమాని రాసిన ‘విధ్వంసంలో జననం’ కవిత ఓ జీవన వైచిత్రిని చాటింది. “ఈ శవాల గుట్టలో, ఈ మరుభూమిలో అందరూ మరణిస్తుంటే/నువ్వు మాత్రం, ఈ భూమి మీదకి రావడానికి పడే తపన, తాపత్రయం/నాలో కొత్త ఊపిరిని నింపింది పాపా!” అంటుందో తల్లి. తన కోసం మరో మనిషి ఉండబోతోంది ఈ లోకంలో అనుకుంటూ ధైర్యం తెచ్చుకుందా తల్లి.

మౌమిత ఆలమ్ కవితని ‘గాజా చిన్నారులు’ పేరిట అనువదించారు మనోజ్ఞ ఎండ్లూరి. తుపాకీ కాల్పులు లేని రోజు వస్తుందనీ, ఆశ కోల్పోవద్దని సూచించారీ కవితలో. మౌమిత ఆలమ్ మరో కవితని ‘తరలింపు హెచ్చరిక’ పేరిట అనువదించారు మానస ఎండ్లూరి.

ఫధ్వ తుఖాన్ రాసిన కవితని ‘హంజా’ పేరిట అనువదించారు మమత కొడిదెల. హంజా సామాన్యుడని అంటూనే, యుద్ధోన్మోదాన్ని వ్యతిరేకించడంలో అతని తెగువని చెప్తుందీ కవిత.

ఖాలిద్ జుమా రాసిన కవితని ‘ఓహో గాజా అల్లరి పిల్లలూ’ పేరిట అనువదించారు రజిత కొమ్ము. బాల్యం అదృశ్యమైన నేపథ్యంలో, పిల్లలు చేసే సందడి మళ్ళీ రావాలని కవి కోరుకున్నారు.

నెల్లుట్ల రమాదేవి గారి ‘సమర సముద్రం’ కవిత ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. “ఎవరు ముందు కాలు దువ్వారో/ఎవరు మొదట రాళ్ళు రువ్వారో/ఎవడు ఇళ్ళు నేలమట్టం చేసాడో/ఎవడు శవాల గుట్టలు పేర్చాడో/ఏది ముందు ఎవరు ముందు?” అని అడుగుతూ, “అనాది ప్రశ్నల కన్నా/అనేక చర్చల కన్నా/అనంత విశ్వమానవుడు ముందు కాదా/” అంటారు కవయిత్రి. లోతైన ఆలోచనలని కలిగిస్తుంది ఈ కవిత.

డా. సమ్మెట విజయ రాసిన ‘చెప్పమ్మా..’ అనే కవిత యుద్ధమంటే ఏమిటని అడుగుతూ, జీవించే హక్కును దోచేయటమే యుద్ధమా అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలకు వైష్ణవి శ్రీ రచించిన ‘యుద్ధాన్ని ప్రేమించొద్దు!’ అనే కవిత జవాబులు చెబుతుంది. కంటి చెమ్మ వొడలి రాలిపోయిన పేదవాడి బ్రతుకు చిత్రం యుద్ధం అంటుందీ కవిత.

“నిప్పుల వర్షంలో శిథిలమైంది/కుటుంబాలు, రోడ్లు భవనాలేనా..?/కాదు, మానవీయ విలువలూ మానవ జీవితం/పర్యావరణం సమస్త జీవుల జీవనం” అని వ్యాఖ్యానించారు వి. శాంతి ప్రబోధ తన కవిత ‘యుద్ధ గాయం’లో.

మౌమిత ఆలమ్ ఇంకో కవితని ‘గాజా తునకలో..’ పేరిట అనువదించారు శాంతిశ్రీ బెనర్జీ. ఎందరు మరణిస్తున్నా, వాళల్లో ఇప్పటికీ కలలున్నాయని అంటారు కవయిత్రి. Khaoula Basty రాసిన కవితని ‘పాలస్తీనీయుల ఆశ’ పేరిట అనువదించారు స్వాతి తక్కల్లపల్లి. ఓ ఐదేళ్ళ బాలిక ఆశలని వెల్లడిస్తుందీ కవిత.

పుట్టని పిల్లల్లో కూడా భయం ఎలా ఉంటుందో హిమజ రాసిన ‘భయం’ అనే కవిత వ్యక్తం చేస్తుంది.

ఇక్బాల్ తమీమి రచించిన కవితని ‘గాజా తల్లుల కోసం ఒక కవిత – నాక్కొంచెం సమయం ఇవ్వండి’ పేరుతో అనువదించారు గీతాంజలి. దాడుల్లో పిల్లలని కోల్పోయిన తల్లుల ఆవేదనకి ఈ కవిత అక్షరరూపం!

మోసాబ్ అబూ తోహా కవితని ‘ఇల్లంటే?’ అనే పేరుతో అనువదించారు అచ్యుతుని సునీత. ఇల్లు అనే రెండు అక్షరాల్లో ఏమేమి ఉంటాయో చెబుతూ, ఇల్లు ధ్వంసమైపోవడం వల్ల వాటిని కోల్పోయిన పాప ఆవేదనని ఈ కవిత వ్యక్తం చేస్తుంది.

~

సాధారణంగా, ఏదైనా సంకలనంలోనూ, సంపుటిలోనూ మంచి కవితలు చదివినప్పుడు, ఇలాంటి కవితలని ఆ కవి/కవులు మరిన్ని రాయాలని ఆశిస్తున్నామని సమీక్షలోనో/పుస్తక పరిచయంలోనో/వ్యాసంలోనో రాస్తూంటాము. కానీ ఈ కవితలు ఎంత బావున్నా, ఆలోచింపజేసినా, ఇటువంటి కవితలు మరిన్ని రావాలని మాత్రం కోరుకోను. ఇటువంటి కవితలు రాయాల్సి వచ్చిన పరిస్థితులు సమూలంగా మారాలని; యుద్ధం అనేది లేకుండా, ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు నెలకొని మనుషులు విశ్వమానవులుగా జీవించే పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షిస్తాను.

***

పాలస్తీనా-యుద్ధ వ్యతిరేక కవితలు (కవితా సంకలనం)
సంపాదకురాలు: గీతాంజలి
పేజీలు: 270
వెల: ₹ 150
ప్రచురణ:
వెన్నెల-గీత సాహిత్య సామాజిక అధ్యయన వేదిక
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
డాక్టర్ భారతి (గీతాంజలి), 8897791964
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/palestine-yuddha-vyathireka-kavithalu

Exit mobile version