Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పలకరించు!

[గీతాంజలి గారు రచించిన ‘పలకరించు!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

చూడు!
మౌనంగా ఉండకు!
ఎక్కడినుంచైనా..
ఎలాగైనా పలుకు.. పిలువు, పలకరించు
కాస్త కుశలమడుగు!
~
వర్షం నుంచైనా
వెన్నెల నుంచైనా
వేసవి వేడి లోంచైనా
చలి కాలపు వొణుకు లోంచైనా
ఏ ఋతువు లోంచైనా సరే
పలకరించు చాలు.
అడవిలోంచైనా
మైదానం లోంచి అయినా
పలకరించిపో.
~
జాబిలిని ఆకాశం పలకరించినట్లైనా,
భూమిని సూర్యుడు స్పర్శించి నట్లైనా
తోటని పరిమళం కౌగలించి నట్లైనా
వేణువుని పెదవులు తాకినట్లైనా
ఏదీ.. ఒకసారి పలకరించి పో.
~
నీ బాల్కనీ పిట్ట కువకువ లాడినట్లైనా
నీ కిటికీ మూల కూర్చొని చదివే పుస్తకంలా అయినా,
సమ్మోహక గజల్ నీ హృదయాన్ని తేనెలో ముంచినట్లైనా,
పొద్దున్నే నువ్వు తాగే చిక్కటి చాయ్ తొలి గుటక రుచి లోంచైనా,
ఓహ్.. ఒకసారి పలకరించి పోరాదు?
~
రాత్రిలోనుంచైనా,
కలలోంచైనా
ఉదయం నుంచైనా
రోజులో ఎప్పుడైనా
ఎక్కడైనా ఎదురుపడ్డపుడైనా
పోనీ పక్కకి తప్పుకున్నప్పుడైనా
రోజులో ఏ క్షణమైనా సరే,
ఒక్క క్షణమైనా సరే ఒక్కసారైనా సరే
పలకరించు.. పలకరించు!
~
ఒక్క చూపుతో అయినా
పెదవి విరుపుతో నైనా
నిర్లక్ష్యపు కనుబొమల కదలికతో నైనా..
రా.. పలకరించు!
అరే.. మౌనానికి కూడా గుండె ఉంటుంది..
అది కొట్టుకుంటుంది!
~
కవిత్వంగా నైనా
పాటగా నైనా..
పోనీ రాయలేని ప్రేమలేఖ లోంచైనా
పలకరించు!
చూడూ.. మౌనంగా ఉండకు!
కొన్నిసార్లు మౌనం ఒక హింసాత్మకమైన భాష.
మౌనం హింసిస్తుంది.
~
అయినా ఒకటి చెబుతా విను!
నువ్వు మౌనంగా ఉన్నా
పలకరిస్తున్నట్లే ఉంటుంది.
నువ్వు దూరాన ఉన్నా
నన్ను చూస్తున్నట్లే ఉంటుంది.
నువ్వూ నా పలకరింపు కోసం
ఎదురు చూస్తూన్నట్లే ఉంటుంది.
నువ్వూ నేనూ ఒకేసారి
శ్వాసిస్తున్నట్లు ఉంటుంది.
నువ్వూ నాలాగే మౌనంగా
నన్ను ప్రేమిస్తున్నట్లే ఉంటుంది.
మౌనంగా పలవరిస్తున్నట్లు ఉంటుంది.
మన మధ్య మౌనమే ప్రేమలేఖ రాసుకుంటుంది!
అయినా సరే.. ఒకసారి పలకరించు!
మౌనం లోంచైనా పలకరించు!
కాస్త కుశలమడుగు!

Exit mobile version