Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పక్కింటి పెరట్లో మామిడి చెట్టు

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘పక్కింటి పెరట్లో మామిడి చెట్టు’ అనే కవితని అందిస్తున్నాము.]

క్కింటి పెరట్లో మామిడి చెట్టు
కాయలు కాసే కాలం ఇది

ఉదయం పగలు సాయంత్రం
దాని వైపు చూడటం అలవాటైంది
పూత కాత కోసం

వన్ ఫైన్ మానింగ్
పూత పూసింది
ముచ్చటేసింది

రోజులు గడుస్తున్నవి
పూత పిందేసింది
పిందెలు కాయలుగా
రూపాంతరం చెందుతున్నాయి

చూస్తుండగానే కాయలు
పక్వానికి వచ్చినవి

పొడుగాటి కర్ర
దాని కొసన జాలీ సంచితో
వచ్చిన యజమాని
యమ భటునిగా తోచాడు

యజమానిని చూసి
ఆకుల చాటున దాక్కుంటున్నాయి
పక్వానికి వచ్చిన పండ్లు
తల్లి చాటు బిడ్డలా

తప్పించుకుంటున్నాయి
మాటి మాటికీ
తల్లిని గట్టిగా
హత్తుకుంటున్నాయి

వదలలేక వదలలేక
తల్లి వదిలేసింది
ఆపే బలం లేక

కన్నీరు కారుస్తూ
వలలో పడిన పండ్లు
ఎడబాటు తలుచుకొని
కన్నీరు మున్నీరు
అవుతున్నవి

అక్కల ఎడబాటు తలుచుకొని
చెల్లెల్లు నిశ్శబ్దంగా నిట్టూరుస్తున్నవి

శోక సంద్రంలో మునిగిన
తల్లి మామిడి చెట్టును
ఓదారుస్తూన్నవి

గట్టిగా హృదయానికి
హత్తుకుంది తల్లి
పక్వానికి వస్తున్న
మామిడి కాయలు చూసి
లోలోన కుమిలిపోతూ

Exit mobile version