Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పైస పిశాచీ

[‘పైస పిశాచీ’ అనే పద్య కవితని అందిస్తున్నారు శ్రీమతి సూర్యదీప్తి.]

పైసా..
నీవొక పిశాచివి
నీవెంటే పరిగెత్తిస్తావు..
మాలోమాకు పగలు పుట్టిస్తావు
అనుబంధాల్ని నిలదీస్తావు
ఆత్మీయతల్ని వెక్కిరిస్తావు
మనసులమధ్య దూరం పెంచుతావు..
మనుషుల్ని దుర్మార్గుల్ని చేస్తావు..

పెంచి పోషించిన పేగుబంధాన్ని
నువ్వెవరు అనిపిస్తావు..
పాలిచ్చి పెంచిన కన్నతల్లిని పరీక్షిస్తావు
కోట్లు పోగేసినా కన్నీళ్లు పెట్టిస్తావు
పాట్లు పెట్టయినా నోట్లపై
మా పేరు రాయించుకునేలా చేస్తావు

తెలిసి తెలిసి గోతిలో పడేలా చేస్తావు .
తెలియక తెగువకు బోతే తెల్లమొహం వేయిస్తావు..
అన్నం తినేవేళ కూడా అవమానాలకు గురించేస్తావు .
అడుక్కుతిందమంటే ఆత్మాభిమానాన్ని గుర్తుచేస్తావు..

చావనివ్వవు చచ్చేదాకా,
బతుకనివ్వవు బతికున్నన్నాళ్లు
బంధాల్ని బలిచేసే బ్రహ్మరాక్షసీ..
సృష్టిని కలుషితం చేసే శూర్పణఖా..

‘నాకు’ అనే చిన్న ఆశతో మొదలై
నాకే అంతా అనేలా చేస్తావు.. ఆక్రమించమంటావు
నరకం చూపిస్తావు.. నడత ను చెరిపేస్తావు
నగుబాట్లకు గురిచేస్తావు
మా మెడకు మా చేతే ఉరి వేయిస్తావు

కలిసి పెరిగామన్న భావనను కాలరాస్తావు
బతుకును అల్లకల్లోలం చేస్తావు
చితిలా అహర్నిశలూ సాధిస్తావు..

నువులేని లోకంలో ఉండాలనిపిస్తుంది
అంతటా నువ్వే ఉంటే
నా ఉనికే ఉండంద్దనిపిస్తుంది..
ఈ ధనదాహంలో నేనూ కొట్టుకుపోకుండా
ఈ వెర్రిమోహంలో నేనూ ఇతరుల్ని వేధించకుండా
హే భగవన్.. నువ్వే నన్ను కాపాడు.

Exit mobile version