[డా. రాజేశ్వరి దివాకర్ల గారి ‘పగడాల దీవి’ అనే కథానికల సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
డా. రాజేశ్వరి దివాకర్ల గారు ఇటీవల వెలువరించిన కథానికల సంపుటి ‘పగడాల దీవి’. ఇందులో 56 కథానికలు ఉన్నాయి. నాలుగైదు తప్పితే, మిగతా వన్నీ రెండున్నర-మూడు పేజీల నిడివి కలవి. క్లుప్తత ఓ ఆభరణంగా అమరిన ఈ కథలు జీవన సారాన్ని విపులంగా చాటిచెప్తాయి. దేశవిదేశాలలోని మధ్య తరగతి తెలుగువారి జీవితాల్లో వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించి అల్లిన కథానికలివి. జీవితంలోని ఆనందాలు, విచారాలూ, ఉత్సాహాలు, నిరుత్సాహాలు, ఆశలు, నిరాశలు, సంకోచాలు, సందేహాలు, అవమానాలు, సన్మానాలు ఆయా కథానికల్లో వ్యక్తమవుతాయి. అందువల్ల చాలావరకు మనల్ని మనమే తరచి చూసుకున్నట్టు అనిపిస్తుంది ఈ కథానికలు చదువుతుంటే.
రచయిత్రిది బోధనా నేపథ్యం కాబట్టి, చదువులు, అధ్యయనం, అభ్యాసం వంటి అంశాలపైమంచి కథానికలు అందించారు. ఇందులో విద్యార్థుల కథానికలూ, అధ్యాయపకుల కథానికలూ ఉన్నాయి. అంతే కాదు, నిత్యజీవితంలానే virtual world లో.. అంటే అంతర్జాల మాధ్యమాలలో మన ప్రెజెన్స్‌ని నిలుపుకుంటూనే, వాటి ద్వారా ఎలా ప్రభావితం కాకుండా ఉండచ్చో కొన్ని కథానికలు సూచిస్తాయి. సమీక్షార్థం ఈ కథానికలను కొన్ని విభాగాల్లోకి ఒదిగించే ప్రయత్నం చేశాను.
చదువులు, ఎదుగుదల:
తమ పిల్లలు చదువులో రాణించాలని, విద్యావంతులవ్వాలని గత తరం తల్లిదండ్రులు కోరుకునేవారు. చదువుతో పాటు ఇతర కళలలో ప్రావీణ్యం సంపాదిస్తే, అది అదనపు అర్హతగా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు, ప్రాధాన్యతలు మారాయి. పిల్లల్లో ఇతర రంగాలలోని ప్రావీణ్యాలు ఇప్పుడు ముందువరసకి వచ్చాయి. సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుని గుర్తింపు పొందాలన్న ఆరాటం తల్లిదండ్రులలోనూ, ఆ పిల్లలు చదివే విద్యా సంస్థలలోనూ అధికమవుతోంది. పిల్లలలోని ప్రతిభని ప్రదర్శించటానికి ప్రోత్సాహం కల్పించటం అవసరమే అయినా, కేవలం చదువు మీదే దృష్టి పెట్టమని ఒత్తిడి చేయటం తగనిదని ‘గోడ’ కథ చెబుతుంది. జీవితంలో చదువొకటే ముఖ్యం కాదు, మరెన్నో కీలకమైనవి ఉన్నాయన్న నిజాన్ని ‘రంగులు’ కథానిక చెబుతుంది. ఎప్పుడూ నేర్పడమే కాదు, నేర్చుకుంటూ కూడా ఉండాలని ‘విద్య’ అనే కథానిక చెబుతుంది. అవాంతరాలెదురయినప్పుడు ఎలా సర్దుకుపోవాలో, కఠిన పరిస్థితులలో నెగ్గుకొచ్చేందుకు మనల్ని మనం ఎలా మార్చుకోవాలో ‘కొత్త టీచర్’ కథానిక వెల్లడిస్తుంది. పిల్లల అభిరుచి తెలుసుకుని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే, జీవితంలో పిల్లల ఎదుగుతారని, ఉన్నత స్థితికి చేరుకుంటారని ‘పగడాల దీవి’ కథానిక తెలుపుతుంది.
జీవన విలువలు:
తనకి మేలు కల్గుతుందన్న ఓ చిన్న ఆశ, అప్పటిదాకా పాటించిన జీవన విలువలని త్రోసిపుచ్చేట్టు చేస్తుంది. అంతకుముందు దాకా, చేయకూడదనుకున్న పనిని చేయిస్తుంది. ‘మానస’ కథలో మానస అలానే చేస్తుంది, అదృష్టవశాత్తు, ఆమె అత్తయ్య చెప్పిన మాటలతో, మానస పూర్వపు మనిషవుతుంది. ఇదే థీమ్‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకి అన్వయించి రాసిన కథానిక ‘చందమామ కథ’. భార్య వివేకపు మాటలతో, తన పద్ధతిని మార్చుకుంటాడు, మూన్ లైటింగ్ చేస్తున్న ప్రభాస్.
మూల్యాంకనం అంటే బోధనా పరిభాషలో ‘విద్యార్థుల పరీక్షా పత్రాలు దిద్దడం’. కానీ ఈ సంపుటిలోని కథానిక లోని అంతరార్థం జీవితాన్ని దిద్దుకోవడం! చక్కని కథ. పరీక్షల జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేయవల్సిన టీచర్ మానసిక ఆందోళనతో ఉంటే, మూల్యాంకనం ఎంత అసంబద్ధంగా ఉంటుందో, దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండవచ్చో ‘మూల్యాంకనం’ కథానిక వెల్లడిస్తుంది.
భాషాభిమానం:
రచయిత్రి తెలుగు భాషాభిమాని కావడం వల్ల కొన్ని కథానికల్లో అచ్చ తెలుగు పదాలు అధికంగా వాడారు. డా. సి. మృణాళిని గారు చెప్పినట్టు, సంబంధిత ఇంగ్లీషు పదం స్ఫురిస్తే గాని, ఆ సందర్భంలో వాడిన తెలుగు పదాల అర్థం తట్టకపోవచ్చు. ఉదాహరణకి ‘చదువుల పండగ’ అనే కథానిక. పదవీ ప్రాప్తి సమారంభం, స్నాతకోత్సవ ఉడుపులు, సమవస్త్రాల ప్రాధాన్యం వంటి పదాలు కాస్త చిత్రంగా తోస్తాయి. అమెరికాలోని ఓ విద్యాసంస్థలో ప్రణవ్ అనే విద్యార్థి 12th గ్రేడ్ స్థాయి విద్య పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకని ఉద్దేశించిన కథానిక. మామూలు పద్ధతిలో వ్రాసి ఉంటే, ఈ కథానిక మరింత బాగుండేదేమో అని పాఠకులకు అనిపించవచ్చు.
తెలుగు సాహిత్యంలో వస్తున్న ఆధునికతని ప్రస్తావించిన కథానిక ‘వినుత’. రచయితలు, పాఠకులు (ఇప్పుడు శ్రోతలు అనాలేమో) ఆడియో కథల వైపు మొగ్గుతుండాన్ని ప్రస్తావిస్తూనే, చదివేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథానిక సూచిస్తుంది. మానవీయ కోణాన్ని ఇముడ్చుకున్న ఈ కథ హృదయాన్ని తాకుతుంది.
సామాజికం:
నర్సుల పట్ల సమాజంలో ఉన్న అపోహలని ప్రస్తావిస్తుంది ‘అశ్వని’ కథానిక. ఈ కథానికలోని రాజ్యలక్ష్మిలా అందరూ తమ తప్పుని ఒప్పుకుని, క్షమాపణలు అడగరు. అధ్యాపకుల మధ్య ఒకరంటే మరొకరికి ఉండే అసూయ ఎన్ని విపత్కర పరిస్థితులకు దారితోస్తుందో ‘పురస్కారం’ కథానిక రేఖామాత్రంగా చెబుతుంది. వ్యాపారంలో అతి మంచితనం పనికిరాదనీ, అందరిచేతా మంచిమనిషి అనిపించుకోవాలన్న ఆరాటంలో నష్టాలు కొనితెచ్చుకోవడం సమంజసం కాదని చెబుతుంది ‘రాజమ్మ టిఫిన్ సెంటర్’ కథానిక.
కాలం తీసుకొచ్చే మార్పులు వ్యక్తులను, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మారినవారు నిలదొక్కుకోగలుగుతారు, మారలేని వాళ్ళు వెనుకబడకతప్పదు. కాలనికి ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి మరలడం ఉండదు. ఇదే విషయాన్ని వివరిస్తుంది ‘గతం, వర్తమానం, భవిష్యత్తు’ కథానిక.
కుటుంబం – బంధాలు:
కుటుంబ సభ్యుల మధ్య బంధాలకు సంతోషాలకు ‘మనసుకు మరమ్మత్తు’ ఎంతో ముఖ్యమని ఆ శీర్షికతో ఉన్న కథానిక సూచిస్తుంది. మన ఉన్నతికి కారణమైన ఆత్మీయులని బయట మెచ్చుకుని, ఇంట్లో పట్టించుకోకుండా ఉంటే ఎవరికైనా కోపం రావడం సహజమే. అందుకే విశాలాక్షికి కూడా కోపం వచ్చింది. టైటిల్ జస్టిఫై అయిన కథానిక ‘విశాలాక్షికి కోపం వచ్చింది’. వృత్తికే ప్రాధాన్యమిచ్చి, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఏమవుతుందో ‘కొలువు’ కథానిక చెబుతుంది.
డిస్టన్స్‌తో దగ్గరడవడం సాధ్యమా? ప్రయత్నిద్దామంటుంది ‘జాహ్నవి’ కథానిక. ఒకేచోట ఉండి అనుమానాలు, అపోహలు పెంచుకునే కన్నా, దూరంగా ఉండి అభిమానాలు ఆప్యాయతలు మిగుల్చుకోడం మంచిదని సూచిస్తుంది.
‘సరిలేరు నీకెవ్వరు’ కథానిక కుటుంబాన్ని, బంధాలని నిలుపుకునేవారి ప్రయత్నాలను హర్షిస్తుంది.
సంకోచాలు – నైతికత – అపోహలు తొలగడం:
‘ముడుపు’ కథానికలో దేవుడికి ముడుపు కడుతుంది దేవకి. గుడిలో ఇవ్వాల్సిన తేదీని మరిచిపోయి, కూతురు ప్రసవానికి అమెరికా వెళ్ళిపోతుంది. తిరిగి ఇండియా వచ్చేసరికి పెద్దనోట్లు రద్దయిపోతాయి. ఆమె కట్టిన ముడుపులోనివన్నీ పెద్ద నోట్లే. ఎన్నో సంశయాలు, సందేహాలు.. అయినా ఆ డబ్బుని హుండీలో వేసేస్తుంది. అంతర్మథనం నిలవనీయదు. చివరికి జరిగినదంతా భర్తతో పంచుకుంటే, ఆయనో మార్గం సూచిస్తాడు. దేవకి మనసు తేలికవుతుంది.
బలహీనతకూ, అసమర్థమతకూ సంకేతంగా భావించిన చక్రాల కుర్చీని తొలుత ఏవగించుకున్నా, దాన్ని తోసే వ్యక్తి జీవిక కోసం వృత్తి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం చూసి, తన అపోలని తొలగించుకుంటుంది తరుణి ‘వీల్ చెయిర్’ కథలో.
ధన్-తేరాస్ నాడు బంగారం కొనాలన్న ఆలోచనని విక్రేతలు విజయవంతంగా జనాల బుర్రల్లోకి ఎక్కించారు. పసిడి కన్నా పెన్నిధి ఆరోగ్యమేనని తల్లికి హితవు చెప్తుందో కూతురు ‘త్రయోదశి’ కథానికలో.
డబ్బంటే పెద్ద నోట్లే కాదు, చిల్లర కూడా. అలాగే జీవితమంటే భారీ విజయాలు మాత్రమే కాదు, చిన్న చిన్న గెలుపులు కూడా అని చెబుతుంది ‘చిల్లర ముఖ్యం’ కథానిక.
ప్రతీ ఏడాదీ బ్యాంకుకి వెళ్ళి తాను సజీవంగా ఉన్నట్టు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నామోషీగా భావించే భ్రమరకు – యాదమ్మ మాటలు గొప్ప సత్యాన్ని వెల్లడిస్తాయి. “డబ్బు సంకల్పబలాన్నిస్తుంది. సార్థకమైన వినియోగం జీవన సంతృప్తినిస్తుంది” ఈ రెండు వాక్యాలు ‘ఓజోన్’ కథానికకి ఆయువుపట్టు లాంటివి.
తమని తాము మార్చుకోడానికి జీవితం అందరికీ ఓ అవకాశం ఇస్తుంది. కొందరు అందుకుంటారు, కొందరు దూరం చేసుకుంటారు. ‘జుంబా’ కథానికలో గిరిజ అవకాశాన్ని అందుకుంది. తదుపరి ఏమవుతుందో పాఠకులే ఊహించుకోవాలి.
కరోనా సమయంలో కలిగిన భయాలు, రేగిన అపోహలకు తమ కుటుంబంలోని పెద్దవారు భీతిల్లకూడడని ప్రహర్ష్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి ‘ప్రహర్ష్’ అనే కథానికలో. నవ్విస్తునే ధైర్యం చెబుతుందీ కథానిక.
రాత్రి వేళ తమని వెంబడిస్తున్నారనుకుని ఇద్దరు యువకులను తిడతారు లలిత, రజని. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మరు. కానీ వారు చెప్పింది నిజమని, వారిది వేధింపు కాదనీ, తోడ్పాటని తర్వాత అనుభవం మీద తెలుసుకుంటారు ‘అంచనా’ కథానికలో.
~
కొన్ని కథానికలలో పాత్రలకి పెట్టిన పేర్లు ఎంతో సముచితంగా ఉంటాయి. వాటర్ మీటర్ చూసి బిల్ వేసే అమ్మాయి పేరు నీరజ, ‘ప్రహర్ష్’ కథానికలో ప్రహర్ష్ లాంటివి.
సరళ, సుబోధక, సునిశితమైన కథానికల సంపుటి ఇది. పాఠకులని ఏ మాత్రం నిరాశపరచదు. నిజజీవితంలో నిబద్ధతతో జీవించిన వ్యక్తి, ఆ విలువలకి అక్షర రూపం కల్పిస్తే, ‘పగడాల దీవి’ లాంటి పుస్తకాలు రూపొందుతాయి. ఇంతకంటే చెప్పాల్సిందేమీ లేదు.
***
రచన: రాజేశ్వరి దివాకర్ల
పేజీలు: 206
వెల: ₹ 300/-
ప్రతులకు:
శైలి గ్రాఫిక్స్,
5-126/51
వెంకటాద్రి నగర్,
గోవిందపల్లె
జగిత్యాల 505327
~
రచయిత్రి: 9343716723 (వాట్సప్)
Email: rajeswari.diwakarla@gmail.com
~
డా. రాజేశ్వరి దివాకర్ల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-rajeswari-diwakarla/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.