Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద్యనాటకరంగానికి పునాది ‘మేలట్టూరు’-3

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘పద్యనాటకరంగానికి పునాది ‘మేలట్టూరు’’అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 3వ భాగం.]

యక్షగానం – నృత్యరూపకం – పద్యనాటకం: త్రివేణి సంగమం

నాటక కళల పరంపరలో యక్షగానం, నృత్యరూపకం, పద్యనాటకం పరస్పరం సంబంధం ఉన్న మూడు ప్రధాన ప్రదర్శన కళారూపాలు. ఇవన్నీ కవిత్వం, సంగీతం, నాట్యం, నటనల సమ్మేళనంగా ప్రేక్షకులకు సంపూర్ణ రసానుభూతిని అందిస్తాయి.

యక్షగానం సమగ్ర నాటకరూపం. ఇందులో కథ, పాటలు, నృత్యం, హావభావాలు, గానం అన్నీ కలిసిపోతాయి. ఇతివృత్తం సాధారణంగా పౌరాణికం, భక్తిమయమై ఉంటుంది. పాత్రధారులు సంగీతం, నృత్యం రెండింటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. స్త్రీ పాత్రలను పురుషులే పోషించడం వల్ల గాత్రం, ఆహార్యం, అభినయం మూడూ సమానంగా ప్రాధాన్యం పొందుతాయి. కోణంగి వంటి పాత్రలు కథానడిపింపుకు కేంద్రమవుతాయి. యక్షగానం కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడింటి రసాన్ని ఒకే వేదికపై సమ్మేళనం చేస్తుంది.

నృత్యరూపకంలో కథనానికి నృత్యమే హృదయం! గానం, పద్యాలు, సంభాషణలు ఉన్నా అవి నృత్యానికి మద్దతుగా మాత్రమే పనిచేస్తాయి. కథా ప్రవాహం హావభావాలు, శరీరభాష, అభినయాల ద్వారా ముందుకు సాగుతుంది. సంగీతం, రాగాలు, లయలు భావవ్యక్తీకరణకు ఆధారాలు. ఇక్కడ ప్రధానంగా నృత్యసౌందర్యం, రసానుభూతి లక్ష్యం. గాత్రం నేపథ్యమై, నటన శరీరమై ఉంటుంది. నృత్యాభినయంలో ప్రావీణ్యం ఉంటే చాలు, నృత్యరూపకం తన సౌందర్యాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలబెడుతుంది.

పద్యనాటకంలో కథా ప్రవాహం పద్యాల రూపంలో పాడి, పాటల ద్వారా వ్యక్తమౌతుంది. నృత్యం సహాయక పాత్రలో ఉంటుంది.  సంగీతం, లయ, రాగాల సహాయంతో పద్యాల ద్వారా కథ, భావాలు, సందేశాలు స్పష్టంగా ప్రేక్షకులకు చేరుతాయి. సంభాషణలు, గద్యభాగాలూ ఉంటాయి కానీ, ప్రధాన శక్తి పద్యానిదే! గాత్రం, రాగస్ఫూర్తి, భావప్రకటనలో నైపుణ్యం ఉంటేనే ఈ రంగంలో రాణిస్తారు.

మొత్తం మీద, ఈ మూడు కళారూపాల లక్ష్యం ఒకటే — ప్రేక్షకులకు కళాత్మక రసానుభూతి అందించడం. కానీ, దానికి చేరే మార్గాలు వేరు.

* కథ, పాట, నృత్యం, అభినయం కలిపిన సమగ్ర నాటకరూపం యక్షగానం; * నృత్యప్రధానంగా, సంగీతమద్దతుతో నడిచేది నృత్యరూపకం; * పద్యప్రధానంగా భావప్రకటన జరిపేది పద్యనాటకం. ఈ మూడింటి సమ్మేళనం జరిగితే ఒకే ఇతివృత్తానికి మూడు రకాల రసానుభూతులు కలగవచ్చు. వీటి సమన్వయం నాటకకళకు వైవిధ్యాన్ని, వైభవాన్ని అందిస్తుంది.

సంగీత–నాట్య రూపకాలకూ, పద్యనాటకాలకూ మాతృక యక్షగానం అన్నది స్పష్టమైన నిజం. దానికి సాహిత్యం ప్రాణప్రదం అవుతుంది. సాహిత్యబలం లేని కళలో కాంతి నిలవదు.

“హరి హరి యని పలుకుచు తా
ధరలో నిఖిలము హరిమయమని
మిగుల తెలుపుచు ముదమున
సారసాక్ష! హరి నామమె తారకమని మదిలో స్మరియింపుచు..”

మేలట్టూరు వెంకటశాస్త్రిగారి ఈ తెలుగు సుబోధకమైన సుందరభాష! పోతన మహాకవి భక్తజనులకి నేర్పినంత మృదుమధుర భాగవతభాష. ఆ తరువాతి వాగ్గేయకారులందరికీ కృతి మరియు కీర్తన నిర్మాణానికి సహజ అనుకూలమైన భాష. ప్రదర్శనకళలకు అంతటి సాహిత్య బలం అందించారాయన. ఆయన నృత్యనాటకాల వివరణలు, దరువుల వినియోగ పద్ధతులు నేటికీ శాస్త్రీయంగా నేర్పిస్తే పద్యనాటకాలు తిరిగి రాణించగలవు.

మేలట్టూరు భాగవతులు, కూచిపూడి భాగవతులు

కూచిపూడి, మేలట్టూరు భాగవతమేళాలు రెండూ, శాస్త్రీయ నాటక సంప్రదాయాలకూ భక్తి, సంగీతం, నాట్యం మూలాధారాలు. కానీ, వాటి స్వరూపం, ప్రదర్శన విధానం, నర్తకుల పాత్రలో గణనీయమైన తేడాలున్నాయి.

కూచిపూడి నృత్యకేంద్రీయ కళారూపం. నాట్యశాస్త్ర నియమాలనుసారం నృత్త, నాట్య, అభినయ సమన్వయంతో కథ, భావాలను వ్యక్తపరుస్తుంది. నర్తకులు స్వయంగా పాడుతూ నృత్యం చేస్తారు. వేషధారణ సంప్రదాయబద్ధమైనది, లాస్య ప్రధానమైనది. భక్తి భావం కేంద్రంగా, వినోదం ద్వితీయ స్థాయిలో ఉంటుంది. ప్రదర్శన వ్యవధి పూర్వం పలు గంటలుగా ఉండగా, ప్రస్తుతం సుమారు మూడు గంటలకు పరిమితమైంది.

మేలట్టూరు భాగవతమేళా యక్షగానం ప్రభావంలో ఏర్పడిన నాటకరూపం. ఇందులో నాటక, సంగీత, నృత్య అంశాలు సమన్వయంగా ఉంటాయి. నర్తకులు కేవలం నృత్యం చేస్తారు; గానం వేరే వ్యక్తులు చేస్తారు. వేషధారణ, మేకప్, ఆభరణాలు పౌరాణిక పాత్రల ప్రకారం ఉంటాయి. భక్తి, వినోదం రెండూ సమానంగా ప్రదర్శించబడతాయి.

రెండు రూపాలూ తెలుగు భక్తి సంప్రదాయంలోంచి ఏర్పడినవే! పౌరాణిక ఇతివృత్తాలు, కీర్తనల వినియోగం, రసానుభూతి రెండింటికీ ప్రధాన లక్ష్యం. కానీ, కూచిపూడి శాస్త్రీయ నియమబద్ధత, లాస్యాభినయ విశిష్టత కలిగిన నృత్యరూపంగా రాణించింది.  మేలట్టూరు భాగవతమేళా భక్తి-వినోద సమన్వయమై, స్థానిక మౌఖిక సంప్రదాయానికి దగ్గరగా నాటక రూపంగా వాసికెక్కింది.

ఈ రెండు కళారూపాలు కలసి తెలుగు నాట్యసంప్రదాయానికి శాస్త్రీయత, భక్తి, వినోద వైవిధ్యాలను అందించాయి.

మేలట్టూరు సంప్రదాయం

మేలట్టూరు భాగవతమేళా నాటకాలు భక్తి, సంగీతం, నాట్యాల సమ్మేళనం. ప్రధానంగా నరసింహుడు, ప్రహ్లాద ఇతివృత్తాల ప్రదర్శనలకు ప్రసిద్ధి. నటుడు నరసింహుడి పాత్రలో దేవుడి ఆవహింపుతో నటిస్తాడు. భక్తులు అతడిని తాళ్లతో కట్టి పట్టుకుంటారు. ఎందుకంటే “దేవుడే ఆవహించాడు” అనే భయమూ, భక్తిభావమూ ప్రేక్షకులలో తారస్థాయిలో ఉంటాయి.

హిరణ్యకశిపుడు పాత్రధారి విష్ణువుపై భీతావహ యుద్ధరంగం సృష్టిస్తాడు. ఈ ప్రదర్శనలు కేవలం నటన కాదు, భక్తి పరవశంతో నిండిన ఆధ్యాత్మిక అనుభవం.

మేలట్టూరు నాటకాలలో దరువులు, చిందులు, పద్యాలు, వచనాలు కలగలిసి ఉంటాయి. స్త్రీ పాత్రలు పురుషులే వేస్తారు.

మహాభారత నాటకాలు – తొండనాడు సంప్రదాయం

చిత్తూరు జిల్లాలోని తొండనాడు ప్రాంతం కుప్పంలో కంగుంది మహాభారత నాటకాలు మేలట్టూరు సంప్రదాయానికి వారసత్వం వంటివి. ఈ నాటకాలను “ఆట” అని పిలుస్తారు. “సినిమా వందరోజులు ఆడింది” వంటి పదప్రయోగాల మూలం ఇదే. కంగుందివారు ప్రతి సంవత్సరం జరిగే మహాభారత యజ్ఞంలో రాత్రిపూట ఈ “ఆట” ప్రదర్శిస్తారు. 18 రోజులపాటు సాగుతున్న ఈ కార్యక్రమం భక్తి రక్తి సమ్మేళనమై ఉంటుంది. వేదికను “ఆటపాక” అంటారు. కృష్ణాజిల్లాలోని ఆటపాక అనే గ్రామం పేరు వెనుక కూడా ఇలాంటి ఆట  సాంప్రదాయం ఉండి ఉండవచ్చు. మహా నటుడు బందా కనకలింగేశ్వరరావు గారి జన్మ స్థలం అది!

మన ప్రాచీన నాటక కళలన్నీ భక్తినే మూలంగా తీసుకుని వృద్ధి చెందాయి. ఇక్కడ “భక్తి” అంటే అంధ విశ్వాసం కాదు, కళాకారుడి అంకితభావం, తపన, కళాప్రేమ. ఈ దృష్టితో చూసినపుడు, మేలట్టూరు, కూచిపూడి, కంగుంది నాటకాలు ఇవన్నీ భక్తి, కళా సమన్వయానికి అద్భుత ఉదాహరణలు.

కంగుంది వారి ప్రత్యేకత

కంగుంది మహాభారత నాటకాలలో విరాటపర్వంలోంచి ఓ ఘట్టం పరిశీలిద్దాం! విరటుడి కొలువుకు ఒక మల్లయోధుడు వచ్చి తనను ఓడించేవారే లేరన్నప్పుడు వలలుడి పేరుతో వంటవాడుగా పనిచేస్తున్న భీముణ్ణి పిలిపిస్తారు. భీముడికీ ఆ మల్లయోధుడికీ మధ్య జరిగిన సంభాషణ ఇది.

“అట్టి కట్టడి గనుకనే విరాటు నింట వంటలు జేయుచు కంటికింపైన
అత్తిరసంబులు పిండి వంటలు, అప్పడంబులు, మండిగెలు, సండిగెలు, గారెలు,
బూరెలు, పేణీలు, వడలు, హోలిగలు నప్పచ్చులు, కుప్పలు కుప్పలు నేతిని అద్ది
సప్పరించుక మింగి దొడ్డకాగవలె కడుపు పెంచుకొని నిండు చూల బర్రెలాగ
బుసకొట్టుచు మట్టుమీరి ఇట్టి కూతలు గూసిన నే బిట్టల్ముదునా తిండిపోతు రందా”

“చిత్తూరు జిల్లా వీధినాటకాలు” అనే పరిశోధనా గ్రంథంలో శ్రీ వి. గోవిందరెడ్డి పద్దెనిమిది రాత్రులు ప్రదర్శించే “కంగుంది” వారి  మహాభారత నాటకం వివరాలు వ్రాశారు. వారు ఉదహరించిన పద్యం ఇది.

“వంటవాడివి, తింటానికే పనికొస్తావు. అరిసెలు, పిండి వంటలు, అప్పడాలు, మండిగెలు, సండిగెలు, గారెలు, బూరెలు, పేణీలు, వడలు, హోలిగలు, అప్పచ్చులు-వీటిని కుప్పలు కుప్పలుగా పోసుకుని నెయ్యద్ది చప్పరించుకుంటూ మింగి, దొడ్డకాగులాగా బానకడుపు పెంచుకుని నిండుచూలాలైన బర్రెలాగా బుసకొడ్తూ మల్లయుద్ధాని కొచ్చిన తిండిపోతా!” అని వలలుణ్ణి ఆ జెట్టి యద్దేవా చేస్తాడు. దానికి వలలుడు అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు. ఆ ఇద్దరి సంభాషణా ఇలా సాగింది.

‘అరచేతిన తట్టివేతునా” అన్నాడు వలలుడు. “రొట్టె చేసినట్టా” అని హేళన చేశాడు జెట్టి. “మెత్తగా నొత్తి మడచి వేతునా” అంటే, ‘హోలళిగెలాగా” అనీ, ’ఓరీ నిన్ను కాలన్‌ దన్ని నేలన్‌ పొర్లింతునా” అంటే, “పూర్ణమ కుడుములాగా” అనీ, “బండతో మెదపిముద్ద జేతునా” అంటే “గోధుమపిండి లాగా” అనీ, “నీ కండ్ల రక్తము దింతునా” అంటే “కూటికుండ దించినట్లా” అనీ, “నీ కండ క్రొవ్వు కరిగింతునా” అంటే, “నేతి కడవలా” అనీ, “నీ కాల్లు చేతులు విరతునా” అంటే, ’వంటకట్టెలా” అనీ ఆ జెట్టి వలలుణ్ణి రెచ్చగొడతాడు. చివరికి వలలుడి చేతిలో వాడు చస్తాడు.

తిక్కనగారి విరాటపర్వానికి భిన్నంగా జానపదుల కోసం ఉద్ధేశించి కంగుందివారు తగిన మార్పులు చేసుకున్నారు.

“బ్రాందీ శీషా నీకేల గోషా
దావేలనే నీ షోకుల్‌ జూప
శీషా షోకుల్‌ జూప
నీవే గదా మా కులదైవము
శీషాకుల దైవము”

అంటూ కీచకుడికి ఓ పాట కూడా పెట్టారు. “బలే బలే ఉన్నది దా డ్రింక్‌ బ్రదర్‌” అని కూడా అంటాడు కీచకుడు. సామాజిక జీవన  విశేషాలతో అన్వయించి ప్రజల భాషలో ప్రజలకు నచ్చేలా ఈ నాటకం సాగుతుంది.

మధ్యాహ్న భోజనానంతరం, దాదాపుగా 1–2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, హరిదాసు కథా మాధ్యమంగా హరికథగా మహాభారతాన్ని వివరిస్తాడు. రాత్రి అదే కథాభాగాన్ని తెల్లవారే వరకు నాటకరూపంలో ప్రదర్శిస్తారు. యజ్ఞ నిర్వాహకులు కంగుంది నాటక కళాకారులతో ఒప్పందం చేసుకుని, 18 రోజులపాటు మహాభారత కథని నాటక రూపంలో ప్రదర్శిస్తారు. మేలట్టురు కళాకారుల్లాగానే కంగుంది కుటుంబీకులూ ఎక్కడెక్కడో జీవిస్తున్నా ఆ సమయానికి గ్రామాలకొచ్చి రాత్రిళ్లలో నాటకాలను ప్రదర్శిస్తారు.

పద్యాలు, దరువులు, చిందులు, వచనాలతో కంగుంది నాటకాలు నిండి ఉంటాయి. రచయిత ఎవరో ఖచ్చితంగా వాళ్లకీ తెలియకపోవచ్చు.

కంగుందివారి ప్రదర్శనలు వంశపారంపర్యంగా, మౌఖికంగా సంక్రమించిన విద్యలాగ నేర్చుకుని ప్రదర్శించేవి! నటులు చిత్రవిచిత్ర వేషధారణతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. దుర్యోధనుడు నల్ల కళ్లద్దాలు, చేతిగడియారంతో భయంకరంగా రంగప్రవేశం చేస్తాడు. వీళ్ల నాటకాలలో కూడా స్త్రీ పాత్రలను సాధారణంగా పురుషులే పోషించినా, కొన్నిచోట్ల వారి కుటుంబాల స్త్రీలు కూడా పాల్గొంటున్నారు. ఈ కళను ఆధారంగా చేసుకుని జీవించే వారే ఎక్కువ. పెద్ద స్థాయికి ఎదిగినవారు అరుదు, నాటకమే జీవనాధారం అయిన వారే ఎక్కువ అని వీరి పరిస్థితుల గురించి శ్రీ మధురాంతకం నరేంద్ర అమ్మనుడి పత్రికలో రాశారు.

మేలట్టూరు భాగవతులు బ్రాహ్మణులు కాగా, కంగుంది నాటకాలవారు బ్రాహ్మణేతరులు. మేలట్టూరు కళాకారులు తమ ప్రదర్శనల్ని కేవలం గ్రామ ఆలయ ఉత్సవంలో మాత్రమే నిర్వహించడం, కాలానుగుణంగా తమ విద్యను మారుస్తూ, జీవనానికి అనుకూలమైన వృత్తులను ఎంచుకోవడం వంటివి ఈ సంప్రదాయాన్ని భక్తిమార్గంలోనే నిలబెట్టాయి.

మేలట్టూరు ప్రదర్శనలు భాగవత మేళాలు కాగా, కంగుంది వారి ప్రదర్శనలు మహాభారత మేళాలని చెప్పాలి.

కంగుంది లాగానే చిత్తూరు జిల్లాలో వీధి నాటకాల ప్రదర్శనలు చేసే నాట్యసంఘాలు ఇంకా అనేకం ఉన్నాయి. హాస్యభాగాలు, స్థానిక వినోదం ఈ ‘ఆట’లో ప్రధాన ఆకర్షణ. ఆంగికాభినయాలు సాధారణ ప్రేక్షకులను అలరించేలా, జీవంతో నిండినవిగా ఉంటాయి. ఈ కళారూపం ఇప్పటికీ మౌఖిక సంప్రదాయంగా కొనసాగుతోంది. వ్రాతప్రతులు లేవు. గ్రామీణులు, కుటుంబాలు సమిష్టిగా అనుసరించే ఈ నాటకాలు భక్తి, వినోదం రెండింటినీ సమన్వయపరుస్తాయి.

జానపద పరిశోధకులు ఆచార్య యన్ భక్తవత్సలరెడ్డి గారిని సంప్రదించినప్పుడు సుశిక్షితుడైన గురువు వద్ద శాస్త్రీయమైన పద్ధతిలో ఒక టెక్స్ట్ ని అనుసరిస్తూ వీళ్ల ప్రదర్శనలు జరిగితే ప్రామాణికంగా ఉంటాయన్నారు. దాదాపుగా కంగుంది కళ పలచనై పోతున్నదనే ఆవేదన వెలిబుచ్చారు.

చిత్తూరు జిల్లాలోనే మొగరాల గ్రామంలో వినాయకుని గుడి ఉంది. సంవత్సరానికోసారి జరిగే మహాభారత నాటకోత్సవాలు ఈ గ్రామ ప్రత్యేకతగా చెప్తారు. అర్జునుడు తపస్సు మాను ఎక్కే దృశ్యాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. వినోదమే ఈ కళకు ప్రత్యేక లక్ష్యంగా కనిపిస్తుంది.

మేలట్టూరు భాగవత మేళా ప్రదర్శనలు కేవలం వినోదం కోసం కాదు, అవి భక్తి, సంగీతం, నాట్యం, నాట్యవైభవాల సంగమం. వేషధారణ, వేషభూషణాలు, మేకప్, కిరీటాలు, పూలమాలలు అన్నీ ప్రామాణికంగా సిద్ధమవుతాయి. ఆముదం దీపాల వెలుగులో జరిగే ఈ నాటకాలు భక్తి నాట్యరంగానికి అపూర్వమైన వెలుగు ప్రసరింపజేస్తాయి.

సాంకేతిక పరిజ్ఞానం తెలీకపోవటం, సుశిక్షితులైన గురువులు లేకపోవటం ఈ కళకు పునరుజ్జీవన అవకాశాల్ని దెబ్బ తీస్తున్నాయి. “కంగుంది ఆట”లో దాగి ఉన్న ఆ ప్రాథమిక ప్రజానాట్యశక్తి, సహజమైన నటనా వైభవం, అభివృద్ధికి చేయూత కోసం ఎదురు చూస్తున్న అపూర్వ వారసత్వం ఎన్నదగినవి. నాటక కళను ఉద్ధరించాల్సిన సంస్థలు దృష్టి సారించాల్సిన అంశం ఇది.

శాస్త్ర విహిత సాధన

మేలట్టూరు, కంగుంది కళలతో పోలిస్తే, కూచిపూడి నాట్య సాధన పరిణతి చెందిన గురువుల శిక్షణలో శాస్త్రీయంగా అభివృద్ధి పంధాన సాగుతోంది. కూచిపూడి నర్తకులు నాట్యశాస్త్రం, సంగీతం, సాహిత్యం, వేదాలు, వేదాంగాలలో కూడా గాఢమైన పరిజ్ఞానాన్ని సాధించిన వారి ప్రదర్శనలో పరిణతి ఉంటుంది. వన్ టూ త్రీల లెక్కన స్టేజీ ఎక్కించటమే ధ్యేయంగా నేర్పించే గురువుల వలన కూచిపూడి కళకు కొంత అపకారం జరిగినప్పటికీ, ఈ కళలో నిష్టాతులుగా, క్రమపద్ధతిగా శిక్షణ పొంది రాణించిన వారి సంఖ్య అధికంగానే ఉంది. స్త్రీలకు కూచిపూడి నేర్చుకునే అవకాశం వచ్చాక కూచిపూడి కళ సిరిమయం అయ్యింది.

మేలట్టూరువారిలో కళాకారుల సంఖ్యే తక్కువ. వారు కూడా పెద్దల సమక్షంలో బాగా చర్చలు జరిపి స్త్రీలను అనుమతించటం, ప్రదర్శనను ఆధునీకరించటం, అంకాలుగా విభజించి నిడివిని తగ్గించుకోవటం లాంటి చర్యలకు ఉపక్రమిస్తే మేలు జరుగుతుంది.

కూచిపూడి రూపక ప్రదర్శనలలో రంగాలు సన్నివేశాల్ని, కథాగమనాన్ని నడిపించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. పద్య నాటకాల్లో మయసభ, పడకసీను, రాయబారం, కాటిసీను ఇలా అంకాలుగా విడగొట్టుకుని ప్రదర్శించటం ద్వారా ఎంత నిడివిలో కావాలంటే అంతవరకే ప్రదర్శించే వీలుంటుంది. ఈ సౌలభ్యం కూచిపూడి నాట్యంలోనూ ఉంది. మేలట్టురు , కంగుంది వారు కూడా ముఖ్య ఘట్టాలను ప్రదర్శిస్తే నిడివి తగ్గి ఎక్కువగా ప్రజల్లోకి చేరే అవకాశం ఉంటుంది. కూచిపూడి, మేలట్టూరు కంగుంది ప్రదర్శనలు నృత్యం, సంగీతం, సాహిత్యం, శారీరక నైపుణ్యం, ఆత్మనిష్టా సమ్మేళనంగా ఉన్నప్పుడు నైపుణ్యం వర్థిల్లుతుంది.

నలుగురు కళారత్నలు

నాట్యాచార్య కె.వి. సత్యనారాయణ

కళారత్న కె వి సత్యనారాయణ

కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన నాట్యాచార్యుడు కె.వి. సత్యనారాయణ. కోరాడ నరసింహారావు, వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాదశర్మ వద్ద శిక్షణ పొందిన ఆయన, 1982లో శ్రీ సత్య కూచిపూడి అకాడమీని స్థాపించి అనేక శిష్యులకు నృత్యబోధన అందిస్తున్నారు. ఆయన నృత్యరూపకాలు ఆముక్తమాల్యద, మోహిని భస్మాసుర, బుద్ధం శరణం గచ్చామీ, మహిషాసురమర్ధని అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి. తెలుగు సినిమాల్లో శృతిలయలు, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం చిత్రాలకు నృత్యదర్శకత్వం వహించారు.

అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, శ్రీలంక, దుబాయి, ఫ్రాన్స్, సింగపూర్ వంటి దేశాల్లో ప్రదర్శనలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. కళారత్న, విశ్వశ్రీ నాట్యాచార్య, భరతముని అవార్డు, నాట్యకళావిశారద వంటి అనేక బహుమతులు అందుకున్నారు.

కూచిపూడి నాట్యాన్ని భక్తి, నాట్యం, సంగీతం, సృజనాత్మకతల సమన్వయంగా ప్రపంచానికి పరిచయం చేసిన అరుదైన నాట్యకళాసాధకుడు ఆయన.

ఆలయనృత్య పునఃసృష్టి కర్త సప్పా దుర్గాప్రసాద్

 

సప్పా దుర్గాప్రసాద్ 1960 నవంబర్ 7న విజయవాడలో సప్పా సత్యనారాయణ, రమణమ్మ దంపతులకు జన్మించారు. పదేళ్ల వయసులోనే నాట్యశాస్త్రంపై ఆసక్తి పెంచుకుని, నృత్యంలో ప్రాథమిక జ్ఞానం తండ్రి వద్ద పొందారు. వీణ, మృదంగం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళారంగాల్లో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది.

పద్మశ్రీ నటరాజు రామకృష్ణ వద్ద ఆంధ్రనాట్యం మరియు పేరిణి శివతాండవంలో శిక్షణ పొందారు. గురుదక్షిణగా ఆయన స్మారకార్థం 1983లో నటరాజ నృత్యనికేతన్ను స్థాపించి యువ కళాకారులకు ప్రాచీన నృత్యం, సంగీత రీతులలో శిక్షణ అందిస్తున్నారు.

“ఆలయనృత్యం” మరియు “యజ్ఞనర్తనం” పునఃసృష్టి కర్తగా, సాంప్రదాయ నృత్యానికి నూతన జీవం పోసిన నాట్యాచార్యుడిగా సప్పా దుర్గాప్రసాద్ గారు ప్రసిద్ధి పొందారు. భక్త అన్నమాచార్య, ఓంకార గణపతి, భస్మాసుర చరితం రూపకాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినిమాలు సూత్రధారులు, అమ్మాయి నిశ్చితార్ధాలకు దర్శకత్వం వహించారు. శాంతి తీరాలు, పుష్కర గౌతమి.పుష్కర గోదావరి నృత్య రూపకాలను దూరదర్శన్లో ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొరకు “గోదావరి పుష్కర స్వాగత గీతం”

తిరుమల తిరుపతి దేవస్థానం వారి బ్రహ్మోత్సవ గీతాలకు నృత్య దర్శకత్వం అవహించారు. ప్రముఖ సాహితీ వేత్త కూడా! నవలలు కథలు వ్రాశారు. ప్రాచీన నాట్యకళాకారిణుల చరిత్రలను వ్రాశారు.

నాటాచార్య వేదాంతం రాధేశ్యాం

కళారత్న వేదాంతం రాధేశ్యాం

ప్రఖ్యాత కూచిపూడి నాటాచార్యుడు వేదాంతం రాధేశ్యాం కూచిపూడి గ్రామంలో ఐదో ఏటనే పినతండ్రి కళావాచస్పతి వేదాంతం పార్వతీశం వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ ప్రారంభించారు. సోదరుడు సీతారామశాస్త్రి వద్ద నాట్య మెలకువలు, వెంపటి చినసత్యం వద్ద నృత్య నాటకాలలో, వేదాంతం సత్యనారాయణ వద్ద స్ర్తీవేషాభినయంలో శిక్షణ పొందారు.

నాటాచార్యుడిగా ఆయన వేలాదిమంది శిష్యులకు కూచిపూడి నాట్యాన్ని బోధించారు. అమెరికా, యూరప్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి కూచిపూడి కళను ప్రపంచానికి పరిచయం చేశారు. శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా సేవలందించి 2013లో విరమణ చేశారు. గిన్నిస్ రికార్డు సాధనలో కీలక పాత్ర వహించారు. సత్యభామ, గొల్లభామ, సూత్రధార పాత్రల్లో విశేష కీర్తి పొందారు. కూచిపూడి నాట్యాన్ని ప్రచారకులాయన. సంగీత నాటక అకాడెమీ సహా పలుసంస్థల పురస్కారాలు పొందారు.

పి.వి.ఎన్. కృష్ణ – నవరస నాటకరంగజీవి

పౌరాణిక పాత్రలను నవరసభరితంగా ఆవిష్కరించే రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకసమాజ నిర్వాహకుడు పి.వి.ఎన్. కృష్ణ తెలుగు నాటకరంగానికి శ్రద్ధ, శక్తి, శైలీ సమన్వయంగా నిలిచారు. 1962 నవంబర్ 11న తూర్పుగోదావరి జిల్లా విలసవల్లి గ్రామంలో జన్మించిన పొన్నపల్లి విశ్వనారాయణ కృష్ణ బి.ఏ., ఎం.ఏ. (తెలుగు సాహిత్యం) పట్టాలు పొందారు. 1983లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి, సేవలో ఉండగానే నాటకరంగాన్ని తన జీవనసాధనగా మార్చుకున్నారు.

బాల్యంలోనే “భక్త ప్రహ్లాద” ఏకపాత్ర నాటికతో రంగప్రవేశం చేసి, ప్రథమ బహుమతి పొందారు. భీమనపల్లి పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కూచిబొట్ల సత్యనారాయణ శిక్షణలో “అశ్వత్థామ” పాత్ర పోషించి, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. విజయవాడ పోలీస్ శాఖలో పనిచేస్తూనే శ్రీసాయిబాబా నాట్యమండలి ద్వారా దుర్యోధనుడు, కర్ణుడు, విశ్వామిత్రుడు వంటి పౌరాణిక పాత్రలు పోషించి, పద్యనాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాధవవర్మ కథను చారిత్రక నాటకంగ అమలచి ప్రసిద్ధి పొండారు రెండు డజన్ల నంది బహుమతులు పొందారు. తనదైన రీతిలో పద్యనాటక వ్యాప్తికి కృషి చేస్తున్నారు.

మేలట్టూరు కళకు మహాలింగంగారూ వారబ్బాయి స్వామినాథన్ నిబద్ధతతో అంకితమైన రీతిలో ఈ నలుగురు కళారత్నాలూ వారివారి రంగాలకు చేస్తున్న సేవలకు ప్రసంసా పూర్వకంగా వారి ప్రస్తావనను ఇక్కడ తీసుకువచ్చాను.

రూపకకళ-భావభాష

మానవుడి తొలి భాష హావభావాలే. మాట పుట్టకముందు ముఖం, కళ్ళు, చేతులు, శరీరభంగిమలే మనసు చెప్పే పదాలు. భాష ఉద్భవించిన తరువాత కూడా నృత్యం, గానం భావవ్యక్తీకరణకు సహజమైన రూపాలుగానే నిలిచాయి. ఈ హావభావ శోభలే క్రమంగా నాట్యం, సంగీతం, నాటకరూపం, సాహిత్యం వంటి కళారూపాలుగా పరిణమించాయి.

భారతీయ సంస్కృతిలో ఈ సమన్వయం ఒక జీవనతత్వం. భరతనాట్యం, కూచిపూడి, మేలట్టూరు, ఆంధ్రనాట్యం, యక్షగానం వంటి రూపాలు దక్షిణ భారత భూభాగంలో నాట్యసంప్రదాయాలను సుసంపన్నం చేశాయి. భరతముని నాట్యశాస్త్రం నుండి వెలువడిన రస, భావ, తాండవ, లాస్య సిద్ధాంతాలు తెలుగు కళాకారుల అభినయాల్లో నేటికీ సజీవంగా కనిపిస్తాయి.

ప్రబంధయుగానంతరం తంజావూరు సాంస్కృతిక వాతావరణం సంగీతసాహిత్య సమ్మేళనానికి పునాది వేసింది. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి మహానుభావులు కర్ణాటక సంగీతానికి శాస్త్రీయ రూపం ఇచ్చారు. విజయనగర రాజులు, తరువాత నాయకుల పాలనలో ఈ కళారూపాలకు రాజాశ్రయం లభించింది. తంజావూరు నట్టువనార్ సంప్రదాయం నేటి భరతనాట్యానికి ఆత్మను అందించింది.

భావం, భంగిమ, రసం- ఇవే సంభాషణకు మూలాలు. ఈ మూలాలే నేటి నాట్య, సంగీత, నాటక కళల హృదయ స్పందన.

ఆనాటి యక్షగానాల వారసత్వంగా పద్యనాటకం ఈనాటికీ కొనసాగుతోంది. ఈ రంగం మరింత అభివృద్ధి చెందాలంటే నటులు సంగీత, నాట్య ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలి. మేలట్టూరు సంప్రదాయం ఈ దిశలో కళానిబద్ధతకు చిరస్మరణీయ నిదర్శనం. అనేకమంది నటులు ఆధునికంగా పద్యనాటకానికి ఊపిరి పోస్తున్నారు. ఈ కళ మరింత రాణింపు పొందాలంటే సంగీత నాట్య ప్రావీణ్యాన్ని కూడా నటులు సంతరించుకోవలసిన అవస్యం ఉంది. కళాప్రతిభకు మేలట్టూరు ఒక నిదర్శనంగా నిలవటానికి సంగీత నాట్యాలతోపాటు సాహిత్యాభినివేశం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

మేలట్టూరు కేవలం నాటకమేగాదు – అది భక్తి, సంగీతం, నాట్యరసాల సంధ్యాబంధం. ఆ ప్రక్రియలో కళాకారుడు పాత్రకంటే ఎక్కువగా ఆరాధకుడవుతాడు. అతని చేతి తాళం, కళ్లలోని భావం, గాత్రంలోని గానం ఇవన్నీ ఆ ఆరాధనకు మాధ్యమాలవుతాయి. ఈ భక్తి నిబద్ధ నాట్యసూత్రమే తరువాతి కాలంలో పద్యనాటకానికి జీవరసమైంది.

మేలట్టూరి భక్తి–రక్తి సమ్మేళనం పద్యనాటకంలో కూడా పులకరించిన భావరసంగా మారింది. నర్తనానికి లయ ఇచ్చిన సంగీతం, సంభాషణకు రసమిచ్చిన పద్యం ఇవే నేటి నాటకరూపాల్లో కొనసాగుతున్న మేలట్టూరి వారసత్వం.

భావమే భాషగా మారిన చోట సంగీతం ఉద్భవిస్తుంది;

భక్తి భాషగా మారిన చోట నాట్యం అమరమౌతుంది.

రసమే జీవనంగా మిగిలిన చోట సాహిత్యం సజీవమౌతుంది;

కళా చైతన్యమే నిత్యనూతన రూపాలలో ప్రకాశితమౌతుంది.
*

Exit mobile version