[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘పద్యనాటకరంగానికి పునాది ‘మేలట్టూరు’’అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]
నాటకం దృశ్యరూప కళ – కంటితో చూసి, మనసుతో ఆస్వాదించేది. పద్యాలు, పాటలు, సంగీతం, చిందులు, సంభాషణలు అన్నీ కలసి నాటకాన్ని రసరమ్యం చేస్తాయి. సాంఘిక నాటకాలకే నటుల ఆసక్తి ఎక్కువగా ఉన్నా పద్యనాటకాలూ తిరిగి ప్రాచుర్యం పొందుతున్నాయిప్పుడు! నిజమైన నాటకాన్ని అది ప్రాచీనం కావచ్చు అర్వాచీనం కావచ్చు, మనసారా చూస్తే, “కావ్యాలలో నాటకమే రమ్యం” అనటానికి అసలైన అర్థం కనిపిస్తుంది.
తెలుగువారి నాటక కళకు గట్టి పునాదులున్నాయి. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్లు 11వ శతాబ్దంలోనే గంధర్వులు, యక్షులు, విద్యాధరులు నృత్యనాట్యరంగంలో ప్రసిద్ధులు పాత్రలలో లీనమై రసాన్ని ఒలికించేవారు. శ్రీనాథుడు కూడా “యక్షగాన పద్ధతిలో గంధర్వులు గానంతో కీర్తిస్తారు” అని భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. ఇది 14–15వ శతాబ్దంలో యక్షగానాలు, నాటకాలు విస్తారంగా ప్రాచుర్యంలో ఉన్నాయని సూచిస్తుంది.
దక్షిణాంధ్రయుగంలో పరిణామాలు
రాయలవారి తరువాత రాజకీయ అస్థిరత వచ్చినా, దక్షిణాదిలోని తెలుగు నాయకరాజులు విజయనగర వారసత్వాన్ని కొంత కొనసాగించారు. ముఖ్యంగా తంజావూరు నేలిన తెలుగు నాయకరాజులు భరతనాట్య, శాస్త్రీయ సంగీత సంప్రదాయాలకు రక్షకులుగా నిలిచారు. భరతనాట్య నట్టువాచార్యులు కూడా తంజావూరు రాజుల ఆశ్రితులే. గేయనాటకాలు, యక్షగానాలు, కురవంజి లాంటి నృత్య నాటకాలు, భాగవతమేళ నాటకాల్లాంటి ప్రయోగాలు తంజావూరు లోనే ఎక్కువగా జరిగాయి. క్షేత్రయ్య, మేలట్టూరు వెంకట రామశాస్త్రి, త్యాగరాజస్వామి ప్రభృతులు తమ సంగీత భరిత సాహిత్యంతో తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ని చేశారు!
తంజావూరు తెలుగు నాయకరాజుల తరువాత మరాఠా రాజులు పాలించినప్పటికీ, సంగీతం – నాట్యకళల భాషగా తెలుగు ఆధిపత్యాన్ని వారు కొనసాగించారు. శాహోజీ, శరభోజీ వంటి మరాఠా రాజులు కూడా యక్షగానాలు, ద్విపద కావ్యాలు, కురవంజి నృత్యనాటకాలు తెలుగులోనే రాశారు. తంజావూరు, మధుర, జింజి రాజ్యాలలో నృత్యానుకూల సాహిత్యం విస్తారంగా అభివృద్ధి చెందింది. కర్ణాటక సంగీతం కొత్త పంథాలను అందుకుంది. విష్ణుభక్తితో నిండిన సంగీతనాటకాలకు భాగవతులు పవిత్రతను ప్రసాదించారు.
మేలట్టూరు అవతరణ
తమిళనేలపై, తంజావూరుకు కూతవేటు దూరంలో మేలట్టూరులో ఆనాడు భాగవత కళ, కళాకారులే లేకపోయినట్ట్లైతే సంగీత, నాటక రంగాలలో పెద్ద వెలితి ఏర్పడి ఉండేది! ఈనాటికీ వర్థిల్లుతున్న తెలుగు పద్యనాటక రంగానికి పునాదులు మేలట్టూరు లోనే ఉన్నాయి. మనం వెళ్లి వాటిని సజీవంగా చూడవచ్చు!
యక్షగానం, భరతనాట్యం, భాగవతమేళా, ఆంధ్రనాట్యం, కథాకళి, మోహినీయట్టం, కూచిపూడి, మేలట్టూరు వంటి నృత్యరీతులు వికసించాయి. రస, భావ, తాండవ, లాస్యాల వ్యక్తీకరణలో తెలుగువారి కృషి ప్రత్యేకమైంది. కృష్ణదేవరాయల అల్లుడు, సామ్రాజ్య సంరక్షకుడు అళియరామరాజు తళ్ళికోట యుద్ధంలో వీర మరణం పొందాక విజయనగర సామ్రాజ్యం పతనం ప్రారంభం అయ్యింది. మైసూరు, తంజావూరు, మధుర, జింజి రాజ్యాలకు మాత్రమే విజయనగర సామ్రాజ్యం పరిమితమయ్యింది. తరువాత మైసూరు, మధుర కూడా స్వతంత్రం ప్రకటించుకున్నాయి. హంపి నుండి పెనుగొండకు, ఆ తరువాత చంద్రగిరికి రాజధాని చేరింది. ప్రభువు నామమాత్రం అయ్యాడు.
పాలనా వ్యవస్థ అస్తవ్యస్తం కావటాన తంజావూరు రాజ్యపాలకుడు అచ్యుతప్పనాయకుడి (1577–1640) కాలంలో, తెలుగు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి అనేక విద్వత్సంగీత, నాట్య కుటుంబాలకు తంజావూరు రాజ్యం ఆశాకిరణం అయ్యింది. కాదనకుండా ఆదరించిన తంజావూరు తెలుగు ప్రభువులు చిరస్మరణీయులయ్యారు.
జనశ్రుతి ప్రకారం, ఒకసారి తంజావూరు ప్రభువు అచ్యుతప్పనాయకుడు పొరపాటున ఎడమచేత్తో తాంబూలం నోట్లో పెట్టుకోవడంతో ‘ఆచార అపచారం’ జరిగి, రాజు చేసిన పాపంగా పరిగణించబడింది. ఆ పాప పరిహారార్థంగా, అదే సమయానికి ఆశ్రయం కోసం వచ్చిన పిశుపాటి బ్రాహ్మణ కుటుంబాలకు ఆయన ‘మేలత్తూరు’ అనే గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు. తమిళంలో ‘మేల్’ అంటే ఎగువ లేదా ఉన్నతం; అందువల్ల ఆ గ్రామాన్ని ‘ఉన్నతపురి’గా సంస్కృతీకరించారు. తర్వాత అది ‘అచ్యుతపురం’ లేదా ‘అచ్యుతాదిపురం’గా ప్రసిద్ధి చెందింది. ఈ అచ్యుతపురి అగ్రహారం తంజావూరుకు ఈశాన్యదిశగా పన్నెండు మైళ్ల దూరంలో, కావేరి నది పాయ వెట్టారు నదీతీరాన ఉంది.
అచ్యుతప్ప నాయకుడు మేలట్టూరును 510 ఖండాలుగా విభజించి, అందులో 500 భాగాలను పిశుపాటి బ్రాహ్మణులకూ, మిగతా 10 భాగాలను కోమట్లకు, శిల్పకారులకు కేటాయించాడు. ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి ఒకటిన్నర ఎకరాల పొలం, బావితో సహా ఒక ఇల్లు ప్రసాదించి, దాన శాసనం పై ముద్రవేశాడు. ముద్ర ద్వారా హక్కులు పొందిన వారిని ‘అరక్కొండవారు’ (అరక్కు = రాజముద్ర) అని పిలిచారు. ఈ ఇంటిపేరుగల కుటుంబాలు మేలట్టూరులో ఇప్పటికీ ఉన్నాయని ఆరుద్రగారు సమగ్రాంధ్ర సాహిత్యంలో వివరించారు.
అచ్యుతప్పనాయకుడు నాట్యవిద్యా కోవిదులకు మరికొన్ని అగ్రహారాలను కూడా దానం చేశాడు. శాలియమంగళం, శూలమంగళం, నల్లూరు, ఊత్తుకాడు, తెప్పెరుమనల్లూరు వంటి గ్రామాలు ఆ దానాల వల్ల వెలసి, భాగవతమేళా నాటకాలకు కేంద్రాలుగా నిలిచాయి. ఈ నాట్యసంప్రదాయాల అభివృద్ధికి అచ్యుతప్పనాయకుని ఆదరణే ప్రధాన కారణమంటారు ఆరుద్ర,
మేలట్టూరుకు వచ్చింది కూచిపూడివారేనా?
“కృష్ణాజిల్లా దివిసీమలోని కూచిపూడి నుండే భాగవత నాట్యమేళాల కుటుంబాలు తంజావూరు వెళ్ళి దానాలు పొందినట్టు కూచిపూడివారు చాటుకొంటారు. వారి మాటని కొందరు నాట్య కళాభిమానులు బలపరుస్తారు. అయితే ఇందుకు వారివారి ప్రగాఢవాంఛలే తప్ప ప్రబలమైన చారిత్రక ప్రమాణాలు ప్రస్తుతం ప్రచారంలో లేవు. మేలట్టూరులో పిశుపాటి వారితోపాటు ‘కోమండూరు’ వారు కూడా వచ్చి స్థిరపడ్డారు.” అని పాదసూచికలో ఆరుద్ర వ్రాశారు. కూచిపూడి భాగవతులు మేలట్టూరి భాగవతులకు పూర్వీకులు అనే వాదాన్ని ఆరుద్ర ఖండించలేదు గానీ, అంగీకరించినట్టుగా కూడా ఈ వ్యాఖ్య చెప్పటం లేదు.
అయితే బాలాంత్రపు రజనీకాంతరావుగారి అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయనంటారు:
“అచ్యుతప్పనాయకుని పరిపాలనాకాలంలో ఆంధ్రదేశంలో కూచిపూడికి చెందిన భాగవతమేళం వారు తంజావూరు వచ్చి తమ భాగవత ప్రదర్శనలతో రాజును మెప్పించి అచ్యుతరాయసముద్రం అనే గ్రామాన్ని అరణం పొందారు. మేలట్టూరు ఇంటిపేరున్న వీరభద్రయ్య, కాశీనాథయ్యగారలు ప్రసిద్ధమైన స్వరజతులు, కీర్తనలెన్నో వెలయించారు. ఈ రాగపద్ధతులే తరువాతి కర్ణాటక సంగీత వాగ్గేయకారత్రిమూర్తులకు మార్గదర్శకాలయ్యాయి” అని!
అచ్యుతప్పనాయకుడు మేలట్టూరు, శూలమంగళం, శాలియమంగళం, నల్లూరు, ఊత్తుకాడు, తెప్పెరు మనల్లూరు, ఉత్తకమాడు మొదలైన గ్రామాలను కేవలం నాటక కళాకారుల కోసమే కేటాయించినట్టు భావించవచ్చు. ఈ నాటక కళాకారులు సంగీత సాహిత్య, నాట్యాది కళల్లో కూడా నిష్ణాతులు. కాబట్టే, తమ సృజనతో నూతన నాట్యకళా రీతుల్ని ఇక్కడ సృష్టించ గలిగారు.
మేలట్టూరులో తీర్ధులవారు, త్యాగయ్యగారు
“అన్నమాచార్యుల కాలానికి సంకీర్తనంగాను, ఆధ్యాత్మిక పదం గాను ప్రారంభమైంది. నారాయణతీర్థులు, రామదాసు, సుబ్రహ్మణ్య కవివంటి వాగ్గేయకారుల రచనల్లో భజనకీర్తన గాను, అధ్యాత్మకీర్తన గాను పరిణమించింది. మార్గదర్శి శేషయ్యం గారు, మేలట్టూరు వీరభదయ్యగారల రచనలలో ధాతుకల్పనకు (సంగీతబంధములో) కొత్తదారులు తొక్కింది. ఆ నూతన రూపంలో త్యాగరాజు నాటికి కృతి అనేపేరు వహించి, పరిపక్వత పొందింది. కృతులు బయలుదేరేనాటికి రాగాల స్వరూపంలో కూడా చాలామార్పులు వచ్చాయి. మధ్యలో క్షేత్రజ్ఞాదుల పదకవితలో సాహిత్యబంధమూ, రాగబంధమూ సమాన ప్రాధాన్యత పొందాయి. రాగస్వరూపానికి దర్పణం అనదగిన పదరచనలు ప్రభవించాయి. త్యాగరాజునాటి “కృతి’ ‘రాగస్వరూపానికి దర్పణం..” అంటూ, మేలట్టూరు యక్షగాన కవులు సంగీతంలో కొత్త రీతులు ప్రవేశపెట్టడానికి కారకులయ్యారనే విషయాన్ని నొక్కి చెప్పారు.
నారాయణ తీర్థులు, త్యాగరాజస్వామి ఈ ఇద్దరు తెలుగు ప్రముఖులూ మేలట్టూరు కళను అభిమానించిన వారే! మేలట్టూరు ప్రదర్శన కోసం యక్షగానాలు వ్రాసి ఇచ్చి ప్రోత్సహించినవారే! నారాయణ తీర్థులవారి వరుగూరు, త్యాగరాజస్వామివారి తిరువైయారు సమీప గ్రామాలే! రాకపోకలకు వీలైనవే! ఈ మహాకవులిద్దరూ మేలట్టూరు కవులను సమానస్థాయి గౌరవం ఇచ్చి ఆదరించారనే చెప్పాలి.
ఆధునిక యుగంలో మేలట్టూరు
జాతీయోద్యమ కాలంలో దేశీయ కళలకు పునరుజ్జీవనం లభించడంతో మేలట్టూరు కళాకారులు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ప్రారంభించారు. వారి నాటకాలు పూర్తిగా తెలుగు గ్రాంథిక భాషలో ఉండేవి, స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించేవారు. మేలట్టూరు వెంకటరామశాస్తిగారి నాటకాలే వీరి ప్రదర్శనలకు ప్రాణం.
నటేశయ్యర్ అనే మేలట్టూరు నటుడు ‘ప్రహ్లాదచరిత్ర’లో లీలావతీ పాత్రలో ప్రసిద్ధి పొందాడు; వరదయ్య, దొరైస్వామి, ముత్తు కృష్ణశాస్తి వంటి సహనటులతో కలిసి 1937 వరకు ప్రదర్శనలు చేశాడు. తర్వాత గణేశయ్యర్ ‘లక్ష్మీనరసింహ జయంతి భాగవతమేళా నాట్యనాటకసంఘం’ను స్థాపించి, 1938-39లో భక్తమార్మండేయ, ఉషాపరిణయం వంటి నాటకాలు ఆడాడు. ఈ బృందంలో కె.పాలయ్యర్, కె.రమణ అయ్యర్, పీసుపాటి రామమూర్తి అయ్యర్, ఏ.నారాయణస్వామి అయ్యర్, స్వామినాథన్ తదితరులు నటించారు.
1939లో బాలూ భాగవతార్ ‘ఉషాపరిణయం’, ‘గొల్లభామ’ నాటకాలు ప్రదర్శించి విశేష ఖ్యాతి పొందాడు.
తమ మాతృభాషను చాలావరకు మరచిపోయినప్పటికీ, ఈ కళాకారులు నాటకాలను తమిళంలో వ్రాసుకొని, సంభాషణలను, వర్ణనలను అపూర్వ నిబద్ధతతో ప్రదర్శించడం వారి కళా తపస్సుకు నిదర్శనం.
ప్రస్తుతం ఎస్. నటరాజన్ అనే వారసుడు వృత్తి రీత్యా ఇంజనీరు, దుబాయిలో ఉద్యోగం చేస్తూ, ప్రతి సంవత్సరం నృసింహజయంతికి ఇక్కడకు వచ్చి భక్తిశ్రద్ధలతో ప్రహ్లాదచరిత్రం ప్రదర్శించడం ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. వారి తమ్ముడు కుమార్ అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆచార్య తిరుమల రామచంద్ర ‘హంపీ నుండి హరప్పాదాకా’ గ్రంథంలో వీరి గురించి కొన్ని వివరాలు వ్రాశారు.
“ప్రత్యేకంగా రామాయణాన్ని ఒక నృత్యకేళికగా, మత విషయంగా దసరా సమయంలో ప్రదర్శించు ఒక సంప్రదాయం గలదు. ఈ నర్తనం, నాట్యబృందాలు వృత్తిగా నాట్యం చేయువారు గాక, రామకథ నాడుట ఒక దైవసేవగా తలంచిన బృందాలు. ఇట్టి బృందాలే మేలట్టూరు (తంజావూరు వద్ద) నర్తన మేళములవారు, రామలీల నర్తకులు దసరా సమయమందు మాత్రం కేళిక జేతురు. ఇతర సంచార బృందాలు గూడా అదే పేరుతో పిలువబడు చున్నవి. ఉన్నావ్, ప్రతాప్ ఘర్ జిల్లాల్లో ముఖ్యంగా ఈ బృందాలువారు (సంచార నర్తన బృందాలు) యెక్కువగా వున్నవి. వీరు మధ్యప్రదేశ్ గూడా పర్యటింతురు.” అని నటరాజ రామకృష్ణగారు మేలట్టూరు ప్రత్యేకతని వివరించారు.
అన్నమయ్యను మరువని మేలట్టూరు
32,000 కీర్తనల్ను వ్రాసిన పదకవితా పితామహుడు అన్నమయ్యని 400 యేళ్లపాటు తెలుగువారు ఒక్కసారిగా మరిచిపోతే, వందేళ్ల క్రితం వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రభృతుల పుణ్యమా అని వెలుగులోకి వస్తే, తిరుమతిరుపతి దేవస్థానం ప్రచారం ముమ్మరంగా చేస్తే జనాలకు ఇప్పుడు తెలిశారాయన! అన్నమయ్య కుమారులు ఇద్దరూ ఆ కీర్తనలకు ప్రాచుర్యం తేవటానికి చేసిన కృషి కూడా మరుగునపడిపోయింది. కానీ మేలట్టూరు తెలుగువారు అన్నమయ్యని మరచిపోలేదు. ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఏ కార్యక్రమాన్నైనా సరే అన్నమయ్య వ్రాసిన ఐదు కృతులను తప్పనిసరిగా పాడి ప్రారంభించే ఆచారం ఉంది: ఆ ఐదు కీర్తనలు ఇవి:
1.
జయ జానకీ రమణ జయ విభీషణ శరణ
జయ సరోరుహచరణ జయ దనుజ హరణ 1॥పల్లవి॥
2.
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీపతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకటనాయకా ॥పల్లవి॥
3.
మురహర భవహర ముకుంద మాధవ
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నారదప్రియతే నమో నమో॥
ఈ సంకీర్తన మొదటి చరణంతో ప్రారంభమవుతుంది. ఈ కీర్తన ప్రారంభం: “నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో 1||పల్లవి||
ఇది భజన సంప్రదాయంలో కలిగిన మార్పు.
4.
దేవేశ గణారాధిత దివ్యాంబుజ పాదా
శ్రీవేంకటగిరినాయక శ్రీశ హెచ్చరికా! 1॥పల్లవి॥
5.
మాధవ భవతు తే జయ మంగళం
మధు మురహర తే జయ మంగళం 1॥పల్లవి॥
ఈ అయిదు సంకీర్తనలను ఉమ్మడిగా ‘తోడదయమంగళం’ అంటారు. దీనికి తొలుతటి మంగళం (మయంగళాదిని) అని అర్థం. ఈ తోడదయమంగళం అయిదు సంకీర్తనలు మేలట్టూరు భాగవతమేళా ప్రదర్శనలకు ముందు మాత్రమేగాక తమిళనాడులోని భజనకూటాలలో కూడా ఈ అయిదు తాళ్ళపాకవారి సంకీర్తనలను కార్యక్రమం మొదట్లో పాడుతారు. ఈ భజన సంప్రదాయ ప్రవర్తకుడు అన్నమాచార్యుల మనుమడు, పెద తిరుమలాచార్యుల నాల్గవకుమారుడగు చిన్నన్న. తాళ్ళపాకవారి సంకీర్తనలు భజన సంప్రదాయం నాయకరాజుల కాలంలో దక్షిణదేశంలో వ్యాపించి, నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి” అని ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు పరిశోధనా గ్రంథంలో డా. కె వి రాఘవాచార్య వ్రాశారు.
మేలట్టూరి వెంకటరామశాస్త్రి
కూచిపూడి కళకు సిద్ధేంద్రయోగి ఎంతటి ప్రముఖుడో, మేలట్టూరు కళకు వెంకట్రామశాస్త్రి అంతటి ప్రముఖుడు. ఈయన తంజావూరు పాలకులు తుల్జాజీ, శరభోజి మహరాజు (1798-1939), వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి (1767-1847)లకు సమకాలికుడు. ఈనాటికి ఆయన తెలుగులో వ్రాసిన నాటకాలు, యక్షగానాలనే మేలట్టూరు కళాకారులు ప్రదర్శిస్తున్నారు.
“తెలుగు భాగవత సంప్రదాయానికి తమిళనాట నిలయమైన మేరత్తూరు (మేలట్టూరు) వాసి. పౌరాణిక కథితి వృత్తాలతో, తెలుగు పాటలతో కూడిన భాగవత మేళ నృత్య నాటకాలకు, యక్షగానాలకు ఈయన జీవం, సౌందర్యం పోసి తెలుగులోవ్రాశాడు. ఈయన వ్రాసిన నృత్యరూపకాలకు కూచిపూడి సంప్రదాయానికి చాలా దగ్గర సంబంధ ముంది. సులలితమైన క్రైశికీవృత్తి కవితా రచనలో ప్రవీణుడు, ఈయన నృత్య రూపకాలలో సంగీతాన్ని గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వీటిలో అరుదైన రక్తిరాగాలకు లక్ష్యాలున్నాయి. ఈయన త్యాగరాజు కంటే వయసులో పెద్దవాడు. త్యాగరాజు కీర్తనలను ఈయన మెచ్చుకొంటే, ఈయన సాహిత్యాన్ని త్యాగయ్య మెచ్చుకొనేవాడట. కొన్ని చిందులు, అద్వైత కీర్తనలు కూడా వ్రాశాడట” అని, బాలాంత్రపు రజనీకాంతరావుగారు పేర్కొన్నారు. వెంకటరామశాస్త్రి సంగీతపరంగా తెచ్చిన మార్పులు త్యాగరాజస్వామిని ప్భావితం చేశాయన్నదే ఇక్కడ ముఖ్య విషయం. వెంకటరామశాస్త్రిగారి రచనలు అచ్చులోకివచ్చి తులనాత్మకంగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఈ నిరూపణలు గుర్తు చేస్తున్నాయి.
వెంకట్రామశాస్త్రి గారి రచనలు 12 వరకూ ఉన్నాయంటూ వాటిలో పదకొండింటిని రజనీగారు పేర్కొన్నారు: 1. ప్రహ్లాద చరిత్ర 2. మార్కండేయ చరిత్ర 3. రుక్మాంగద చరిత్ర 4. ఉషా పరిణయము 5, హరిశ్చంద్రనాటకము (రెండు భాగాలు) 6. రుక్కిణీ కల్యాణము 7. శివరాత్రి నాటకము 8. సత్సంగ రాజనాటకము 9 అసత్సంగ రాజనాటకము 10. సీతాకల్యాణము 11. జగన్మోహన విలాస నాటకము. ఈ 11 మాత్రమే దొరుకుతున్నాయని, 12వది ఏదో తెలియదనీ రజనీకాంతరావుగారు పేర్కొన్నారు.
వెంకటరామశాస్త్రిగార్ని రామపండితుడని కూడా పిలిచేవారు! తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో ‘రామపండితుల నాటకాలు’ అనే సంకలన గ్రంథం ఉన్నదని ఆరుద్ర పేర్కొన్నారు. నానావిధ నాటకాలు అనే పుస్తకంలో రామపండితుడి నాటకాలు ఇంకా ఇతరులవి కూడా ఉన్నాయన్నారు. పచ్చిమిరియం అడియప్ప ఈయనకు సమకాలికుడు. వీరి తండ్రి గోపాలకృష్ణశాస్త్రి చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడే వయోవృద్ధుడిగా ఉన్న నారాయణతీర్థుల వారి వద్ద శిష్యుడై ఉంటాడని ఆరుద్రగారు కూడా అభిప్రాయపడ్డారు.
భజన సాంప్రదాయాలకు నాట్యాన్ని జోడించి, ఉత్సవ సమయాలలో రథం ఊరేగింపు ముందు నర్తించే పద్ధతిని నారాయణతీర్థులే ప్రారంభించారని చెప్తారు. దేశీయపద్ధతిలో సాహిత్య, సంగీత, నృత్య, నాట్యాలను మేళవించి వినూత్న నాట్య ప్రక్రియ రూపొందటానికి ఒక వైపు సిద్ధేంద్రయోగి, వేరొక వైపు మేలట్టూరు గోపాలకృష్ణశాస్త్రి, వారి కుమారుడు వెంకట్రామ శాస్త్రి ఎంతో శ్రమించారు.
మేలట్టూరు వెంకట్రామశాస్త్రి, త్యాగరాజస్వామి సన్నిహిత మిత్రులు. ఒకింత వెంకట్రామశాస్త్రిగారే పెద్ద. ఇద్దరూ సాహిత్య పరంగా సంగీత పరంగా ఒకరికొకరు గురువుగా ఒకరికొకరు శిష్యుడిగా సాధన చేశారు.
ఈనాటికీ మేలట్టూరు కళాకారులు త్యాగరాజస్వామి సమకాలికుడైన వెంకటరామశాస్త్రిగారి తెలుగు యక్షగానాలనే ప్రదర్శిస్తున్నారంటే ఆ మహనీయుడి కృషిని మనం సరిగా గుర్తించలేదనే చెప్పాలి. పూర్వకవులకు తమిళులు కన్నడిగులూ ఇచ్చిన గౌరవం మనం ఇవ్వలేకపోతున్నాం. చరిత్రకారులు, విమర్శకులు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలి. అలాంటిది జరగలేదు.
“వలసపోయిన తెలుగు భాగవతులు శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ అపూర్వ సాంస్కృతిక నిధిని, వెంకటరామ శాస్తిగారి 12 నాటకాలను సేకరించి ప్రచురించడం, వాటిపై విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు చేపట్టడం, ప్రభుత్వ నాట్యనాటక సంస్థల కర్తవ్యం.” అని ఆచార్య తిరుమల రామచంద్ర వ్రాశారు. ఒక వీధికో ఒక సంస్థకో పేరుపెట్ట దగిన ప్రముఖుడాయన. విస్మరించటం తెలుగువారికి తగదు.
యక్షగానం నుండి పద్యనాటకానికి పరిణామక్రమం
తెలుగు నాట్యరూపాల చరిత్రలో యక్షగానం నుండి పద్యనాటకం దాకా వచ్చిన మార్పు ఒక సాంస్కృతిక ప్రయాణం మాత్రమే కాదు – మన సమాజం, భాష, సాహిత్యరుచులు, ఆలోచనల విలాసాల రూపాంతరం కూడా! యక్షగానంలో భక్తి ఉప్పొంగితే, పద్యనాటకంలో బుద్ధి వికసించింది. ఒకటి దైవానికి దగ్గరైతే, మరొకటి మనిషి మనసుకు చేరింది. యక్షగానం భక్తికాలపు ఫలితం. అది భగవంతుని కథలతో ప్రజానీకాన్ని ఆకర్షించిన, సంగీతం, నృత్యం, వాచికం సమ్మిళితమైన సమగ్ర కళారూపం.
మధ్యయుగాలలో వైష్ణవ భక్తి యక్షగానాలను కొత్త పుంతలు తొక్కించింది. ఈ మార్పుకు మేలట్టూరు ప్రధాన కేంద్రం అయ్యింది. 1770ల్లో మేలట్టూరు వెంకటరామశాస్త్రి ఈ మార్పులకు ప్రధాన కారకుడు. సంగీత పరంగానూ, నాట్యపరంగానూ సాహిత్యపరంగా కూడా ఆయన నూతనత్వాన్ని తెచ్చే ప్రయత్నాలు చేశాడు. మేలట్టూరు కళాకారులు దాన్ని అక్షరాలా అభినయించి ప్రత్యేకతను నిలబెట్టారు.
దేవాలయ ఉత్సవాలు, గ్రామోత్సవాలు, పండుగ సందర్భాల్లో యక్షగాన ప్రదర్శనలు ముమ్మరంగా జరిగేవి. ప్రదర్శకుడు భాగవతుడు, వాద్యాలు మద్దెల, తాళం, హార్మోనియం, నాట్యరంగం ఓపెన్ ఎయిర్ మైదానం ఇవన్నీ యక్షగానానికి సహజ వాతావరణం. ఈ రూపంలో కవిత్వం గానం రూపంలోనే ఉద్భవించింది. సంభాషణ కూడా గానం ధోరణిలో సాగేది. భవిష్యత్ పద్యనాటకాలకు ఈ మార్పులు పునాదులుగా నిలిచాయి.
మేలట్టూరు ప్రత్యేకత
ఈనాటి మేలట్టూరు గ్రామంలో గుడి ఎదురు రాజవీధి
ఉన్నతాపురం, అచ్యుతాపురం, అచ్యుతాబ్ది ఉత్తమాండునాపురం.. ఇవన్నీ మేలట్టూరు పేర్లు. 1730లలో కంచి నుండి వరదరాజ స్వామి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఉన్నతాపుర వరదరాజ స్వామి దేవాలయంగా ఇది ప్రసిద్ధం. తెరుకుత్తు, కావిడిచిందు, విల్లుపాటు, కురవంజి లాంటి స్థానిక నాట్యప్రక్రియలు మేలట్టూరు భాగవత కళలో చేరాయి.
మరాఠావారి కారణంగా ఉత్తర భారత దేశపు రీతులు కూడా కొన్ని అక్కడ ప్రవేశించాయి. మేలట్టూరు భిన్నమైన నాట్యప్రక్రియను ఆ విధంగా రూపొందించుకో గలిగింది. తంజావూరులోనే తెలుగు యక్షగానాలు అనేకం తమిళంలోకి, మరాఠీలోకి అనువాదం అయ్యాయి. తెలుగు, తమిళ మరాఠీ భాషల సంగమంగా తంజావూరు నిలిచింది. త్యాగరాజ స్వామి తాతగారైన ‘గిరిరాజ కవి’ తంజావూరు మరాఠా రాజుల కాలంలో తెలుగు యక్షగానాలకు ప్రత్యేక వ్యాప్తిని కలిగించారు.
ఈ యక్షగానాలలో ఒక ప్రధానపాత్ర కోణంగి! పొట్టిగా లావుగా చూడగానే నవ్వుపుట్టించే వేషభాషలతో ఒక దరువు ఆడుతూ, పాడుతూ వేదిక పైకి వస్తాడు కోణంగి.
దక్షిణాదిలో 18వ శతాబ్ది వరకూ భరతనాట్యాన్ని తంజావూరు నాట్యకళగానే వ్యవహరించారు. దేవదాసీ వ్యవస్థలో భరతనాట్య ప్రక్రియ చిక్కుకు పోయిన కాలంలో భక్తినీ, రక్తినీ, సామాజిక చైతన్యాన్నీ రంగరించిన కూచిపూడి మరియూ మేలట్టూరు భాగవత మేళాలు మహిళా కళాకారులను దూరంగా పెట్టారు. ఆధునిక కాలంలో నాట్యకళాకారులుగా స్త్రీలకు నిషేధాన్ని కూచిపూడి వారు సడమంచినా మేలట్టూరువారు విధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. దేవదాసీ ముద్ర ఇందుకు ప్రధాన కారణం. కూచిపూడి కళలో వేదాంతం సత్యనారాయణ శర్మగారు సత్యభామ పాత్ర నటించిన తీరు అమోఘం.
మేలట్టూరులో ప్రతి సంవత్సరం నృసింహజయంతి నాడు భాగవత మేళా వారోత్సవాలు నిర్వహిస్తారు. 1888 లో ఈ వారోత్సవాన్ని నిర్వహించిన దాఖలాలు దొరికాయి కాబట్టి 120 ఏళ్లుగా ఈ విధానం ఆచారంగా ఉందని అర్థం అవుతోంది. 1938 నుండీ వరుస తప్పకుండా నిర్వహిస్తున్నారు.
కంసవధ, సత్యహరిశ్చంద్ర, ప్రహ్లాద చరిత్రం, లాంటి యక్షగాననాట్య ప్రబంధాలను ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. అలరిప్పులు, శబ్దాలు, స్వరజతులు, జతిస్వరాలు నిండిన భాగవత మేళా కళకు అభినయంలో హావభావాల అత్యున్నత వ్యక్తీకరణ, ఎముకలు లేవన్నంతగా శరీరాన్ని తేలికగానూ, వేగంగా, లయాన్వితం గా కదిలించగలగటం: క్షేప, రేచక, కదలికలు, శృంగారభక్తి, నాటకీకరణ ఇవి భాగవత మేళాలో ప్రధానాంశాలు. వీటిని కూచిపూడి వారూ, మేలట్టూరు వారూ తమవైన పద్ధతుల్లో అభివృద్ధిపరచారు. అభివృద్ది పరిచేందుకు స్థానిక సామాజిక ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా కారణం అవుతాయి. ఒకే కుదురులోంచి వెళ్లిన ఇద్దరన్నదమ్ములు వేర్వేరు చోట్ల వేర్వేరు జాతులుగా ఎదగటం లాంటిదే ఇది!
మేలట్టూరు నృత్యరీతి వరకూ పరిశీమంచినప్పుడు, కళాకారుడికి విష్ణుభక్తి ప్రధానమైంది. ప్రాణం కన్నాకళకు ప్రాధాన్యతనిచ్చే నిబద్ధత, అంకితభావం చాలా ముఖ్యం. నారసింహ పాత్రధారి మహా భక్తుడైతే తప్ప ఈ పాత్రను ధరించటానికి ముందుకు రాలేడు. 40 రోజుల నారసింహ దీక్ష తీసుకుని, నియమబద్ధంగా జీవిస్తూ ఉండే వ్యక్తి ముందురోజు ఉపవాసం చేసి పరమ పవిత్రంగా ఈ పాత్రను అభినయిస్తారు.
ప్రహ్లాద చరిత్ర యక్షగానంలో నరసింహ స్వామి స్తంభంలోంచి వెలువడిన దృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు నరసింహ స్వామి పూని హిరణ్య కశ్యపుడిని వధిస్తున్నంత భయానక అనుభూతి కలుగుతుంది. హారతులిచ్చి, పూజలు చేసి, పానకాలిచ్చి ఆ పాత్ర ధారిని శాంతింప చేయవలసి వస్తుంది. నారసింహ దీక్ష తీసుకుని, దీక్షా నియమాలు పాటించకపోతే నరసింహుని పాత్రధారికి అపకారం జరుగుతుందని వారి నమ్మకం.
నరసింహ పాత్రధారి ధరించే మాస్క్ ఇది
అక్కడ వరదరాజ స్వామి దేవాలయంలో నరసింహుని ముఖాకృతి (మాస్క్)ని ఒక అద్దాల బీరువాలో భద్రపరిచి ఉంచారు. ఈ నారసింహ ముఖాకృతికి నిత్య పూజలర్పిస్తున్నారు. నృత్యప్రదర్శన నాడు ఈ ముఖాకృతిని ఊరేగింపుగా తీసుకొచ్చి వేదిక పైన ఉంచి పూజిస్తారు. స్తంభాన్ని పగలగొట్టే దృశ్యానికి ముందు నరసింహ పాత్రధారి ముఖానికి ఈ మాస్కుని తొడుగుతారు. ప్రదర్శన అనంతరం మళ్ళీ భక్తిగా దేవాలయానికి చేరుస్తారు. ఇలా ఈ ముఖాకృతిని అనేక తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు.
మేలట్టూరుని సందర్శించినప్పుడు కళ, భక్తి, మేధ త్రివేణీ సంగమంగా పెనవేసుకుని అక్కడ ప్రవహిస్తున్నాయని తప్పకుండా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం.. కూచిపూడి నాట్యకళతో పాటుగా మేలట్టూరు కళాకారులకు కూడా తగురీతి సత్కార పురస్కారాలను అందజేయవలసిన అవసరం ఉంది.
అందరూ పురుషులే వేసిన ఈ స్త్రీ వేషాలు మైమరపిస్తాయి
(ఇంకా ఉంది)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
