[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘పదేళ్ళ పగ’ అనే క్రైమ్ థ్రిల్లర్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]
మనుషులు మారారు. స్వధర్మాల కన్నా పరధర్మ ప్రియులు తమ స్వార్థం కోసం ఎక్కువయ్యారు.
నీతి నిజాయితీ, న్యాయం, ధర్మం అని పలికే వాడిని నేడు సహచరులు వింతగా చూస్తున్నారు. బి.సి కాలం నాటి మనిషి అని అవహేళన చేస్తున్నారు. పట్టణాల్లో ఆధునిక విజ్ఞాన సంపన్నులు అన్నీ తెలిసినవారు.
ఆ గ్రామ పెద్ద గోపాలరావుగారు. వారి మేనేజర్ సదాశివం (నమ్మినబంటు). ఆ ఇంటి నౌకర్లు కార్య నిర్వాహకులు ముగ్గురు. వంటావార్పులు చెంగమ్మ. యజమానుల అవసరాలను తీర్చేవాడు యలమంద. ఇంట్లోని ఇతర పనులు, తోట పనులు నిర్వహించేవాడు రంగడు.
నీతికి, అవినీతికి, ధర్మం, అధర్మానికి అన్ని యుగాలలో వైరం. సత్యం, అసత్యానికి, న్యాయం, అన్యాయానికి శత్రువులు.
గోపాలరావు సంపన్నుడు. బంగారు వ్యాపారి. కోట్లు గడించాడు. అయినా వారికి ధనదాహం తీరలేదు. వారి కుమారుడు ముకుందరావు. ముమ్మూర్తులా తండ్రి పోలిక. అతని తల్లి గాయత్రి. అతని పన్నెండు సంవత్సరాల ప్రాయంలో గతించింది. వయస్సు పాతిక సంవత్సరాల ప్రాయంలో వున్న ముకుందరావుకు లేని అలవాటు అంటూ లేదు.
యలమంద ఆ ఇంటి నౌకరు. ఐదేళ్ళుగా తన పదిహేనవ సంవత్సరం నుండి ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. అతని నిత్య విధులు ఏడుగంటల నుండి ముకుందరావు బూట్లు పాలిష్ చేయడం, స్నానానికి వేడినీళ్ళు బక్కెట్లో గీజర్ నుంచి తోడడం, వంట మనిషి చెంగమ్మ చేసిన టిఫిన్, కాఫీలను ముకుందరావు గదికి చేర్చడం, పెద్దయ్యగారి ఆఫీస్ గదిని రోజూ శుభ్రం చేయడం, వారికి టిఫిన్, కాఫీ అందివ్వడం, వారు వసూలు చేసుకొని రమ్మన్న బాకీలు వసూలు చేసుకొని రావడం, సాయంత్రం ఏడుగంటలకు గోపాల్రావుకు మందు కలిపి అందివ్వడం, వారి కాళ్ళు పిసకడం, ఆపై రాత్రి తొమ్మిది గంటలకు తన ఇంటికి పోవడం, తల్లితో కలిసి భోజనం చేసి పడుకోవడం..
గోపాల్ రావు గారు బంగారం వ్యాపారి. పెద్ద షాపుకు ఓనర్. కొడుకు ముకుందరావు స్నేహితులతో కలిసి అడ్డదుడ్డాలు తిరగడం, త్రాగడం, అమ్మాయిలతో ఆనందంగా గడపటం అతని వర్తమానం. ఆ విషయంలో గోపాలరావు గారు కూడా గొప్పవాడే. చతురుడే. కానీ.. ఎవరి విషయంలోనూ ఏదీ శాశ్వతం కాదు. ప్రకృతిపై ఋతుధర్మాలు ఎలా వర్తిస్తాయో.. వ్యక్తుల జీవితంలో కూడా.. చీకటి వెలుగు సహజం. ఇది చరిత్ర సత్యం.
గోపలారావు తన ప్రియురాలితో కాశ్మీరుకు వినోదయాత్రకు వెళ్ళాడు.
బి.ఎ పాస్ కాని ముకుందరావుకు ఇంట ఎవరూ ఆక్షేపించేవారు లేనందున రోజుకొక అమ్మాయిని ఇంటికి రాత్రి తొమ్మిదిగంటలకు తీసుకొని వచ్చి, ఆనందంగా గడిపి ఉదయం ఐదు గంటలకు ఆమెను పంపేసేవారు.
ఆ విషయాన్ని తోటమాలి రంగడు గమనించాడు. రంగడికి ఎవరూ లేరు. ఆ ఇంట తిని అక్కడే వుంటాడు.
“ఓరే యలమంద!..”
“ఏంటి మామా!..”
“చిన్నయ్యగోరు తప్పుడు పని చేస్తుండాడురా!”
“ఏంది మామా అది?”
“రోజుకొక పిల్లని రాత్రిపూట తోడకొస్తుండాడురా!”
“ఎందుకు మావా!”
“నీవో తిక్కనాయాలివి. నీకేం తెలవదురా!”
“కాస్త ఇవరంగా సెప్పు మావా!”
“ఎందుకేందిరా!.. అనుభవించేదానికి!”
“అంటే మామా..”
“ఆ.. వడ్లగింజలో బియ్యపుగింజ.. ఓ ఆడదాన్ని ఓ మొగోడు ఎందుకు చేరదీస్తాడురా.. తెలవదా!..”
“మావా!.. సామీ తెలవదు మావా!..” అమాయకంగా చెప్పాడు యలమంద.
“సరే.. ఈ పూట నాతోనే తిని నాకాడే పడుకో!.. ఏమంటావురా!”
“నేను నా గుడిశకు పోతాలే మామా!”
“ఉండమన్నాను కదరా !.. వుండు!”
“సరేలే మావా!.. అట్టాగే!”
యలమంద భవంతిలో తన పనులు చేయలోనికి వెళ్ళాడు. రంగడు తోటపనిలో నిమగ్నుడైనాడు. సాయంత్రం ఆరుగంటలు..
ముకుందరావు కారు పోర్టికోలో ఆగింది. అతని కారు దిగి వ్యతిరేక దిశకు వచ్చి డోర్ తెరిచి, ముందు సీట్లో తన ప్రక్కన కూర్చున్న అమ్మాయి చేతిని తన చేతిలోనికి తీసుకొని వేగంగా హాల్లో వున్న మేడపైకి మెట్లను ఎక్కి తన పడక గదిలో ప్రవేశించి తలుపును బిగించాడు.
పనంతా ముగించుకొని అంతకుముందు పావుగంట క్రింద యలమంద రంగడిని సమీపించాడు. చాటుగా వుండి వారు ముకుందరావును, అతని ప్రక్కనే వున్న అమ్మాయిని ఇరువురూ చూచారు.
“వాళ్ళిద్దరూ గదిలో భార్యా భర్త ఆటాడుకొంటార్రా!” వికారంగా నవ్వాడు రంగడు.
అయోమయంగా రంగడి ముఖంలోకి చూచాడు యలమంద.
***
రాత్రి సమయం..
చలిగాలి.. వాన..
ఉరుములు.. మెరుపులు..
భవంతి సింహద్వారం తలుపులు గాలికి గోడకు తగిలి వికారమైన సవ్వడి.
వంటగదిలోవున్న పనిమనిషి చంగమ్మ రంగడిని, యలమందను పిలిచి భోజనం పెట్టింది. తిని ఇరువురూ అవుట్ హౌస్ లోకి పరుగెత్తారు.
చంగమ్మ సింహద్వారాన్ని మూసింది. తాను అన్నం తిని వంటగది ప్రక్కవున్న హాల్లో ఒక మూల పడుకొంది. దుప్పటి కప్పుకొంది.
ముకుందరావు తన గది తలుపు తెరిచి మెట్లు పైకి వచ్చి..
“చంగమ్మా..” బిగ్గరగా పిలిచాడు.
చంగమ్మ ఉలిక్కిపడి లేచింది. మెట్లపై నిలబడి వున్న ముకుందరావును చూచింది.
“తాగేదానికి నీళ్ళు పెట్టలేదే చంగీ!..” అరిచాడు ముకుందరావు.
“యలమంద పెట్టినాడనుకొన్నా చిన్నయ్యా!”
“లేదు. త్వరగా తీసుకురా!..” గాండ్రించాడు ముకుందరావు గదిలోనికి పోయాడు.
చంగమ్మ.. “అట్టాగే చిన్నయ్యా!” వంటగదిలోకి పరుగెత్తింది.
స్టీల్ జగ్ నిండా నీళ్ళు నింపుకొని పరుగున మెట్లు ఎక్కింది. హాలువైపు వున్న ఆ గది కిటికీ తలుపులు తెరిచి వున్నాయి. గది ముందు నిలబడి..
“చిన్నయ్యా!..” పిలిచింది చంగమ్మ.
తలుపు ఒక రెక్క తెరిచి చంగమ్మ చేతిలోని వాటర్ జగ్‍ను అందుకొని తలుపును మూసి గడియపెట్టాడు ముకుందరావు.
తిరిగి క్రిందికి వచ్చే సమయంలో చంగమ్మ మంచంపైన తాళ్ళతో కట్టివేసి వున్న ఆడపిల్లను చూచింది. ఆమె నోట్లో గుడ్డను తురిమి ఉన్నాడు ముకుందరావు.
చంగమ్మ కొన్నిక్షణాలు ఆ అమ్మాయిని చూచింది. ముఖాన్ని గమనించలేదు.
ఆ గదికి పడమటివైపు బాల్కనీ వుంది. ఆ బాల్కనీ డోర్ ఒక రెక్క తెరిచి ఉండటం గమనించింది చంగమ్మ.
ఆ అమ్మాయి పరిస్థితిని చూచిన చంగమ్మ మనస్సులో ఆవేదన. ‘ఆమెను మంచానికి కట్టి బలవంతంగా అనుభవించబోతున్నాడు చిన్నయ్య’ అనుకొంది. మనస్సున ఏవేవో గత జ్ఞాపకాలు..
ఆ అమ్మాయిని కాపాడాలనుకొంది. ఆ పని తన ఒక్కదాని వలన సాధ్యం కాదని ఆమెకు తెలుసు.
వేగంగా అవుట్ హౌస్ వైపుకు వెళ్ళి, విషయాన్ని రంగడికి, యలమందకు తాను చూచిన దృశ్యాన్ని గురించి చెప్పింది. ఆ ఇరువురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.
“పెద్దోళ్ళ యవ్వారం, మనం ఆళ్ళ జోలికి ఎల్లకూడదు. నీవెళ్లి తొంగో పో!” అన్నాడు రంగడు.
“మామా!..”
“ఏరా!”
“పెద్దోడైనా, చిన్నోడైనా తప్పు తప్పే కదా మామా!” ముఖాన్ని చిట్లించి అడిగాడు యలమంద.
“రేయ్!.. నువ్వు నోరుమూసుకో. నీకేం తెలవదు. ఇదో చంగక్కా నీవెళ్లి తొంగో. వానగాలి పెద్దదవుతా వుంది పో..పో!..” అన్నాడు రంగడు.
చంగమ్మ మౌనంగా విచారవదనంతో భవంతిలో ప్రవేశించింది. మరోసారి కిటికీని సమీపించి ఆ అమ్మాయిని పరీక్షగా చూచింది. ఆమె సందేహం తీరిపోయింది. త్వరత్వరగా మెట్లు దిగింది. కన్నీటితో పడుకొంది.
***
ఆ రాత్రంతా గాలీవాన, ఉరుములు, మెరుపులు..
సమయం వేకువన నాలుగున్నర గంట. అది కొత్త స్థలం, పైన గాలివాన యలమందకు నిద్రపట్టలేదు. రంగడు చంగమ్మను సాగనంపి, తన దగ్గర స్టాక్ వున్న కల్లును సేవించి హాయిగా నిద్రపోయాడు. నాలుగున్నరకు లేచిన యలమంద తన గుడిశకు అమ్మ ఎలా వుందో అనుకుంటూ బయలుదేరాడు. అతని నివాసం వూరు చివర. నడుస్తున్నాడు. అదే సమయానికి ముకుందరావు కారు అతన్ని క్రాస్ చేసి వేగంగా వెళ్ళిపోయింది.
అది ముకుందరావు కారని యలమంద గ్రహించాడు.
‘ఏదో పనిమీద చిన్నయ్యగోరు వేకువనే బయలుదేరిండు.’ అనుకొన్నాడు.
వెంటనే అతనికి రాత్రి ముకుందరావు వెంట వుండిన అమ్మాయి గుర్తుకు వచ్చింది.
‘ఆ అమ్మ ఏమైనట్టు!.. తొరగా ఎల్లి రంగన్న నడిగితే తెలస్తది.’ అనుకొన్నాడు యలమంద. స్నానంచేసి బట్టలు మార్చుకొని తల్లికి జాగ్రత్తలు చెప్పి ఏడుగంటలకు యలమంద తన కొలువుకు గోపాల్రావు భవంతికి వెళ్లాడు.
***
భవంతి ముందు వీధిలో పోలీస్ జీప్, వ్యాన్, అంబులెన్స్ వున్నాయి.
భవంతి ఆవరణం నిండా వూరి జనం, పోలీసులతో కిక్కిరిసిపోయి ఉంది.
కొందరు పోలీసులు జనం.. హాల్లోకి వరండాలోకి నడుస్తున్నారు.
చిత్రంగా ఒకేరోజు రాత్రి.. తండ్రి, కొడుకులు మరణించారు. అంటే గోపాలరావు, ముకుందరావులు.
అది మరణం కాదు హత్య.
వారి వారి గదులలో వారికి, బెడ్ టీ అందించ వెళ్ళిన రంగడు రక్తపు మడుగులో పడియున్న తండ్రి కొడుకులను చూచి బెదిరిపోయాడు. పరుగున పోలీస్ స్టేషనుకు వెళ్ళి వారికి విషయం తెలియజేశాడు. ఆ విషయాన్ని విన్న వాడ జనం ఆ ఇంట ముందరి ఆవరణలో చేరారు.
పోలీసులు ఇరువురి శవాలను అంబులెన్స్ ఎక్కించారు. యలమందను చూడగానే పోలీసులు అతన్ని సమీపించి అతని చేతులకు బేడీలు వేశారు. యలమంద భోరున ఏడవసాగాడు. రంగడి చేతులకు యలమంద కన్నా ముందే బేడీలు తగిలించి జీప్ ఎక్కించారు. రంగడు ఏడుస్తున్నాడు.
అంబులెన్స్ హాస్పిటల్ వైపుకు వెళ్ళిపోయింది.
భోరున ఏడుస్తున్న చంగమ్మను కొందరు ఆడవారు ఓదార్చసాగారు. జనం ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు.
పోలీస్ జీప్, వ్యాన్, స్టేషన్ వైపుకు వెళ్ళిపోయాయి.
***
స్టేషనులో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్.ఐ కృష్ణారావు తన గదిలో కూర్చుని ముందు నిలబడి వున్న హెడ్ కానిస్టేబుల్ కనకం బాబు ద్వారా రంగడిని తన గదికి పిలిపించాడు.
వారి ఎదురు సీట్లో గోపాలరావుగారి పినతండ్రి హనుమంతరావు విచారవదనంతో కూర్చొనియున్నారు.
“హనుమంతరావు గారు!.. మీరు ఇంటికి వెళ్ళండి. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ను నేను హాస్పిటల్లో కలెక్ట్ చేసుకొని, మిమ్మల్ని కలుస్తాను” అన్నాడు ఎస్.ఐ కృష్ణారావు.
హనుమంతరావు తలాడించి కుర్చీనుండి లేచి వెళ్ళిపోయాడు. కృష్ణారావు రంగడి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. రంగడు భయంతో కన్నీటితో తలదించుకొని నిలబడ్డాడు.
“కనకం!..”
“సార్!..”
“తలుపు మూయండి!”
హెడ్ కానిస్టేబుల్ కనకం బాబు తలుపు మూశాడు.
“ఇతన్ని విచారించారా!”
“అడిగాను సార్!”
“ఏం చెప్పాడు?”
“అతడు తనకేం తెలీదన్నాడు సార్!”
“అలాగా!..”
“అవును సార్!”
“మీరు ఆ లాఠీ కర్రను టేబుల్ పైన వుంచి బయటికి నడవండి. హాస్పిటల్‌కు వెళ్ళి పోస్టుమార్టమ్ రిపోర్టును తీసుకు రండి”
చంకను తగిలించుకొని వున్న లారీకర్రను ఎస్.ఐ గారి టేబుపై ఉంచి, కుడిచేతిని పైకెత్తి సెల్యూట్ చేసి.. “ఎస్. సార్!..” అని, కనకంబాబు గదినుండి బయటికి నడిచి తలుపును మూశాడు.
“నీ పేరు ఏమిటి?”
“రంగడు సార్!..” గద్గద స్వరంతో పలికాడు రంగడు.
“రంగయ్యా!.. భయపడకు నేను నిన్ను ఏమీ చేయను. నేను అడిగే ప్రశ్నలకు నీకు తెలిసినంతవరకూ నిజాన్ని జవాబుగా చెప్పు. సరేనా!..” అనునయంగా చెప్పాడు ఎస్.ఐ కృష్ణారావు.
విచారవదనంతో రంగడు తలాడించాడు.
“మీ పెద్ద అయ్యగారు కాశ్మీరుకు వెళ్ళాడని విన్నాను. వారు ఎప్పుడు తిరిగి వచ్చారు?” “రాత్రి నడిపొద్దుకాడ వచ్చారు సార్!..”
“ఆయనతో వేరెవరైనా వున్నారా!”
“టాక్సీలో వచ్చి దిగినారు సారు. టాక్సీ వాలాకు అయ్యగారు డబ్బులిచ్చిండు. అతను ఎల్లిపోయిండు.” “మీ పెద్దయ్యగారికి మందు తాగే అలవాటుందా!”
వుందన్నట్లు తలాడించాడు రంగడు.
“వారు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు తాగివున్నారా!”
“ఆ ఇసయం నాకు తెలవదుగానండే. అయ్యగోరు గదిలోకెల్లగానే నన్ను ముందును కలపమన్నారండే, బీరువాలోంచి బాటిల్ తీసి మూత వూడదీసి, ఓ గ్లాసు కలిపి అయ్యగోరికి అందించినాను, అయ్యగోరు నన్ను ఎల్లిపొమ్మాన్నాడండే. నేను ఔట్ హౌస్ కెల్లి పడుకొంటినండే!”
“నీవు చెప్పిందంతా నిజమేనా!”
“అమ్మతోడు సామి. సత్తెం..”
“అయితే మీ అయ్యగారిని చంపింది ఎవరు?”
“ఆ ఇసయం నాకు తెలవదు సామీ!”
“వారి దగ్గర నీవు ఎంతకాలం పనిచేస్తున్నావ్?”
“పాతికేళ్ల నుంచి సామీ!..”
“మీ అయ్యగారు మంచివారా.. చెడ్డవారా?”
ఆ ప్రశ్నకు రంగడు వెంటనే జవాబు చెప్పలేదు. కన్నీళ్ళతో తలదించుకొన్నాడు.
“నా ప్రశ్నకు జవాబు?” హెచ్చు స్థాయిలో ఎస్.ఐ కృష్ణారావు అడిగాడు.
“మంచోడే..”
“మీ అమ్మగారు చనిపోయి ఎంతకాలం అయింది?”
“సుమారుగా పదకొండేళ్ళు సామీ!”
“మీ అయ్యగారికి నీకు తెలిసిన విరోధులు ఎవరైనా వున్నారా!”
“నాకు ఎరుకలే సామీ!”
కృష్ణారావు టేబుల్ పైన ఉన్న బెల్ నొక్కాడు.
హెడ్ కానిస్టేబుల్ కనకంబాబు తలుపు తెరుచికొని లోనికి వచ్చాడు.
“సార్!”
“ఇతన్ని వదిలెయ్యండి, ఆ రెండవ వాడిని తీసుకురా!”
కనకంబాబు రంగడి చేయి పట్టుకొని గదినుండి బయటికి నడిచాడు. విప్పిన బేడీలు తగిలించాడు. ఐదు నిముషాల్లో యలమంద చేతిని పట్టుకొని లోనికి వచ్చాడు.
యలమంద ఎస్.ఐ గారిని చూచి భోరున ఏడవసాగాడు.
“కనకంబాబూ!.. మీరు వెళ్ళండి” అన్నాడు కృష్ణారావు.
వారు గదినుండి బయటికి నడిచారు. రంగడిని వదిలిపెట్టారు. రంగడు తన ఇంటివైపుకు బయలుదేరాడు.
“రేయ్!.. ఏడవకు. ఇక్కడ నిన్ను ఎవరు ఏమన్నార్రా!” అడిగాడు ఎస్.ఐ.
యలమంద తమాయించుకొని చేతులు జోడించాడు.
“రేయ్!.. ఏడవకు నేను నిన్ను ఏమీ చేయను. నా ప్రశ్నలకు నీకు తెలిసిన నిజమైన జవాబు చెప్పు!”
“సరే సారూ!..” కన్నీటితో తలాడించాడు యలమంద.
“నీకు పెండ్లి అయిందా!”
“లేదు..!”
“అమ్మా నాన్న వున్నారా!”
“ముసలి అమ్మ ఉంది సారూ!”
“నీవు గోపాల్రావు గారి ఇంట్లో ఎంతకాలంగా పనిచేస్తున్నావు?”
“ఐదేళ్ళుగా సారూ!”
“ఏఏ పనులు చేస్తావ్?”
కొడుకు తండ్రికి తాను చేసే పనులను గురించి చెప్పాడు యలమంద.
“నీవు రాత్రి సమయంలో ఎక్కడ పడుకొంటావ్?”
“మా ఇంటికాడ!”
“నిన్నరాత్రి ఎక్కడ పడుకొన్నావ్?”
యలమంద వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. తలదించుకొన్నాడు.
ఎస్.ఐ కృష్ణారావు అతని ముఖంలోకి నిశితంగా చూచాడు.
“రేయ్!.. జవాబు చెప్పు!” అన్నాడు.
యలమంద తలపైకెత్తి క్షణంసేపు ఎస్.ఐ గారి ముఖంలోకి చూచి, విచారంగా తలదించుకొన్నాడు.
“రంగ మామతో పాటు అవుట్ హౌసులో పడుకొన్నా సార్!”
“మీ ఇంటికి ఎందుకు పోలేదు?”
ఎస్.ఐ ప్రశ్నకు యలమంద ‘రంగ మామ నాతో సెప్పిన మాటలు సెబితే వారికి అనుమానం వస్తది. గాలీవాన వల్ల అని సెబితే సరిపోద్ది’ అనుకొన్నాడు.
“పెద్దగా గాలివాన, ఉరుములు వచ్చినాయి కదా సార్. అందువల్ల ఆడనే కాళ్ళు ముడుచుకొన్నా”
“రాత్రి మీ పెద్ద అయ్యగారు ఎన్నిగంటలకు వచ్చారు?”
“తెలవదు సారూ!”
“ఇంకా నీకు తెలిసిన విషయాలు ఏమిటి?” అడిగాడు ఎస్.ఐ కృష్ణారావు.
యలమంద ఎస్.ఐ ముఖంలోకి ఒకసారి క్షణంసేపు చూచి తలదించుకొన్నాడు.
‘రాత్రి చిన్నయ్యగోరు అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చిన ఇసయం చెప్పాలా వద్దా!’ అనే సందేహం. కొన్ని క్షణాలు ఆలోచించాడు యలమంద.
“యలమందా!”
“సారూ!..”
“జవాబు చెప్పు!”
“ఓ ఇసయం వుంది సారూ!”
“అదేమిటో నిర్భయంగా చెప్పు’
“చిన్నయ్యగోరు రాతిరి ఓ అమ్మాయిని బంగళాకు తీసుకొచ్చారండీ!” మెల్లగా చెప్పాడు.
“అమ్మాయినా!”
“అవును సారూ!.. ఇద్దరూ చిన్నయ్యగోరు గదికి ఎల్లిపోయిండ్రు.”
“ఆ అమ్మాయి ఎవరు?”
“నాకు తెలవదు సారూ!”
హెడ్ కానిస్టేబుల్ తలుపు తట్టాడు.
“కమిన్!..” గట్టిగా పలికాడు ఎస్.ఐ కృష్ణారావు.
హెడ్ కానిస్టేబుల్ కనకం బాబు గదిలోనికి వచ్చాడు. పోస్టుమార్టమ్ రిపోర్టును ఎస్.ఐకి అందించాడు.
“సార్!.. మరో విషయం!..”
“ఏమిటి?”
“గ్రామానికి హైవేకి మధ్యన వున్న ఓరవ ఒడ్డున ఒక ఆడమనిషి శవం బయట పడిందంట. చూచినవారు వచ్చి చెప్పారు”
“చూచింది ఎవరు?”
“ఆ గ్రామస్థులే!”
“వారు ఎక్కడ వున్నారు?”
“మన స్టేషనులోనే వున్నారు సార్!”
“వారిని లోనికి పిలువు!”
కనకంబాబు వేగంగా బయటికి వెళ్ళి ఆ ఇరువురితో గదిలో ప్రవేశించాడు. వారు ఎస్.ఐ సారును చూచి చేతులు జోడించారు.
“కూర్చోండి”
ఇరువురూ ఎస్.ఐ ముందు టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు.
“మీ పేర్లు?”
“రామకోటి, ఆంజనేయులు సారూ” రామకోటి చెప్పాడు.
“మీరు ఎక్కడ ఏం చూచారు?”
“మావూరికి హైవేకి దూరం ఆరుకిలో మీటర్లు సార్. రెండు కిలోమీటర్ల తర్వాత హైవే వరకు అడవి. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక వాగు ఉందండి. వాగు ఒడ్డున గుంటలో ఓ ఆడమనిషి శవం ఉందండి. నక్కలు అరుస్తూ ఆడ మూగి వున్నేయండి. నేను నా బామ్మర్ది ఈ ఆంజనేయులు రెండెడ్ల బండిలో పట్నంలో కూరగాయల్ని పెద్ద మార్కెట్లో దించి తిరిగి వస్తూ నక్కల్ని ఆ మనిషి శవాన్ని చూచామండి. తమకాడికి తెలియజేయ వచ్చామండి!” ఎంతో వినయంగా చెప్పాడు రామకోటి.
ఎస్.ఐ కృష్ణారావు కుర్చీనుండి లేచాడు.
“కనకంబాబూ! స్పాటుకు పదండి. మరో ఇద్దరు పోలీసులను పిలవండి”
వచ్చినవారి వైపు చూచి.. “మీరూ మాతో రండి. రేయ్ యలమంద నీవూ రా!..” వేగంగా నడిచి గదినుండి బయటికి వచ్చాడు ఎస్.ఐ. కృష్ణారావు.
తన జీపును సమీపించాడు.
హెడాకానిస్టేబుల్ కనకం బాబు, రామకోటి, ఆంజనేయులు, యలమంద ఒక జీప్ లోనూ, ఎస్.ఐ వారి డ్రైవర్ రహీమ్ మరో జీప్లోనూ శవం వున్న ప్రాంతానికి బయలుదేరారు.
హాస్పిటల్ నుండి గోపాలరావు, ముకుందరావు శవాలు వారి భవంతికి అంబులెన్స్ ద్వారా చేర్చబడ్డాయి.
ఎస్.ఐ బృందం నది ఒడ్డున అరగంటలో చేరారు. అడవి అయినందున ఒక కిలోమీటర్ జీప్ కూడా పోలేనందున అందరూ వాహనాలు దిగి నడిచి వెళ్ళారు.
ఎస్.ఐ ఫొటోలు తీశారు. నక్కలు పీక్కొని తిన్న ఆ శవం గుర్తుపట్టడానికి వీలులేని స్థితిలో ఉండినది. యలమంద ఆ శవానికి వున్న డ్రస్ నన్ను చూచి ఆ పిల్ల రాత్రి చూచిన బాబుగారు తీసుకొచ్చిన అమ్మాయేనని యలమంద గ్రహించాడు. కానీ.. నోరు విప్పలేదు.
ఇంతలో వూరిజనం కట్టకట్టలుగా పరుగులాంటి కాలినడకతో ఆ ప్రదేశానికి వచ్చారు. శవాన్ని చూచారు. ఆశ్చర్యపడ్డారు. బాధపడ్డారు.
ఎస్.ఐ, పోలీసులు స్టేషనుకు వెళ్ళిపోయారు.
యలమంద ఊరిజనంలో కలిసిపోయాడు.
ఆ అమ్మాయి పినతల్లి ఆమెను గుర్తించింది. భోరున ఏడుస్తూ శవంపై పడిపోయింది. ఆమె యలమంద మేనత్త మంగ.
అయినవారు ఆమెను ప్రక్కకు లాగి సముదాయించే ప్రయత్నం చేశారు.
సర్పంచ్ మాట ప్రకారం నక్కలు తిన్న ఆ శవాన్ని అడవిలో ఎండుకట్టెలు వేసి కిరోసిన్ చల్లి తగులబెట్టారు. అందరూ విచారవదనాలతో కన్నీటితో వూరివైపుకు నడిచారు.
డి.ఎస్పీ భరద్వాజ్, ఎస్.పి కృష్ణారావు ఆఫీసుకు వచ్చారు. ఎదురుగా వెళ్ళి కృష్ణారావు.. “సార్!.. గుడ్ మార్నింగ్!”
“ఎస్. కృష్ణా!.. గుడ్ మార్నింగ్ పద..”
ఇరువురూ ఎస్.ఐ గదిలో ప్రవేశించారు.
కృష్ణారావు సీట్లో డి.ఎస్పీ భరద్వాజ్ కూర్చున్నారు. టేబుల్ ముందు కుర్చీలో కృష్ణారావు కూర్చున్నారు.
“కృష్ణా!..”
“సార్!..”
“గోపాలరావు, మాధవరావులను చంపినది ఎవరన్న విషయం తేలీదా!..”
“ఇంకా లేదు సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది”
“ఏటి ఒడ్డున చూచిన ఆ ఆడపిల్లను చంపింది ఎవరు?”
“విచారణ జరుగుతూ ఉంది సార్!”
“గోపాలరావు గారి పినతండ్రి హనుమంతరావుగారు మనకు చాలా ముఖ్యులు. చాలా మంచివారు సార్. వారు ఇప్పటికి నాకు నాలుగుసార్లు ఫోన్ చేశారు.”
“వారు నన్ను కూడా కలిశారు సార్!.. పోస్టు మార్టన్ రిపోర్టును చూపించి నేనూ వారితో మాట్లాడి వచ్చాను”
“త్వరలో నేరస్థులను పట్టుకోవాలి కృష్ణా!”
“ఎస్ సార్!.. ఆ ప్రయత్నంలోనే వున్నాను.”
తలుపు తట్టిన శబ్దం..
“ఎస్. కమిన్!” కృష్ణారావు గారి జవాబు.
కానిస్టేబుల్ కనకంబాబు లోనికి వచ్చారు.
“సార్!.. గోపాలరావు గారి పి.ఎ. సదాశివంగారు వచ్చారు సార్!..”
“లోనికి పంపు”
హెడ్ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు.
ఐదు నిముషాల్లో సదాశివం గదిలో ప్రవేశించాడు.
కన్నీళ్ళతో ఆఫీసర్లకి నమస్కరించాడు.
“ఘోర అన్యాయం జరిగిపోయింది సార్. మా యజమానుల ఇద్దరినీ ఎవరో ఒకే రాత్రి చంపేశారు సార్!” భోరున ఏడ్చేడు సదాశివం.
“ఏడవకండి కూర్చోండి” చెప్పాడు ఎస్.ఐ కృష్ణారావు.
“మీరు వూర్లో లేరా!”
“కుటుంబ సమేతంగా వారణాసి యాత్రకు వెళ్ళి రాత్రి వచ్చాను సార్!” విచారంగా చెప్పాడు.
“మీ యజమానులకు మీకు తెలిసిన విరోధులు ఎవరైనా వున్నారా” అడిగాడు ఎస్.ఐ.
ఒక్కక్షణం ఎస్.ఐ ముఖంలోకి చూచి తలదించుకొన్నాడు సదాశివం.
“సదాశివంగారు! నిర్భయంగా మీకు తెలిసిన నిజాలను చెప్పండి” అన్నాడు కృష్ణారావు.
“ఆస్తి పంపకాల విషయంలో గోపాలరావు గారికి, వారి పినతండ్రి హనుమంతురావు గారికి తగాదాలున్నాయని నాకు తెలుసు సార్!.. అంతేకాదు జిల్లా నగరంలో వున్న గోపాలరావు గారి బంగారు షాపు ప్రాంతంలో కూడా ఇరువురికి అభిప్రాయ బేధాలున్నాయి సార్. “
“అంటే.. మీ ఉద్దేశం వారిరువురినీ చంపించింది హనుమంతురావుగారని మీ అనుమానమా?” అడిగాడు డి.ఎస్పీ భరద్వాజ్.
“అనుమానం మాత్రమే సార్!”
“కృష్ణా!.. విన్నావా!..” కృష్ణారావు ముఖంలోకి చూచి అడిగాడు భరద్వాజ్.
తలాడిస్తూ కృష్ణారావు “విచారిస్తాను సార్. ఏది ఏమైనా ఒక్క వారంలోపల నేరస్థులను పట్టుకొంటాను సార్!”
“సరే!.. ఇక నే వెళతాను. కేర్‌ఫుల్‌గా డీల్ చెయ్యి కృష్ణా!.. ”
కుర్చీనుండి భరద్వాజ లేచాడు. గదినుండి బయటికి నడిచాడు.
కృష్ణారావు వారితోటే నడిచి, వారు కార్లో కూర్చొన్న తరువాత పద్దతిగా వారికి సెల్యూట్ చేశాడు. భరద్వాజ్ డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.
ఎస్.సి కృష్ణారావు తన గదిలో ప్రవేశించాడు.
గోపాలరావు ముకుందరావులు శవాలను గొప్ప హంగామాతో ఔటులు పేలుస్తూ, పూలు వెదజల్లుతూ, తప్పెట్లు తాళాలతో స్మశానానికి తరలించారు వారి బంధువులు, మిత్రులు.
***
యలమందకు, రంగడికి భయంతో జ్వరం.
గోపాలరావు బంధువులు, ఇంటి నౌకర్లు యలమంద, రంగడికి తెలియకుండా వారి ఇరువురి హత్య జరిగి ఉండదని, వారిని విచారించే రీతిలో విచారిస్తే నిజం బయటపడుతుందని స్టేషనుకు వచ్చి కృష్ణారావుతో చెప్పారు. వారి ఇరువురిపైన కంప్లైంట్ వ్రాసి ఇచ్చాడు హనుమంతరావు కుమారుడు అశోక్ బాబు. ఫలితంగా యలమందను, రంగడిని పోలీసులు జైలుకు లాక్కెళ్ళారు. చిత్రహింసలు పెట్టారు. పోలీసులు పెట్టే బాధలను భరించలేకే యలమంద.. “నేనే వారిని చంపాను” అని ఒప్పుకొన్నాడు.
“నేను వాడికి సాయం చేశాను” అని రంగడు తలాడించాడు.
ఇరువురికీ పోలీసు బాధలు తప్పాయి. వారికి బేడీలు వేసి జైల్లో తోశారు.
కానీ.. కృష్ణారావు గారికి వారి మాటల మీద నమ్మకం లేదు.
యలమందను తన గదికి పిలిపించాడు.
శరీరం లాఠీ దెబ్బలతో హూనమైపోయిన యలమంద సోలిపోతూ కృష్ణారావు ముందు నిలబడ్డాడు. అతని స్థితిని చూచి ఎస్.ఐ కృష్ణారావు యలమందను కుర్చీలో కూర్చోమన్నాడు. అతను కూర్చున్నాడు.
“యలమందా!..”
“సారూ!..”
“నిజంగా నీవు, రంగడు కలిసి గోపాలరావును, ముకుందరావును చంపారా! మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆ పని చేశారంటే నేను నమ్మలేకపోతున్నానురా!” విచారంగా అన్నాడు కృష్ణారావు.
యలమంద భోరున ఏడ్చాడు.
“యలమంద ఏడవకురా!..” లాలనగా చెప్పాడు ఎస్.ఐ.
పై గుడ్డతో ముఖాన్ని తుడుచుకొని..
“సారూ!.. నేను మీకు ఒక ఇసయం సెప్పాలి” దీనంగా అన్నాడు యలమంద.
“ఏమిటో చెప్పు..!”
“ఆ చచ్చిపోయిన పిల్ల గోపాలరావుగారి ఇంట్లో వంట మనిషిగా పనిచేసే చంగమ్మ మనవరాలు. వాళ్ళమ్మ పదేళ్ళ ముందు బావిలో పడి చచ్చిపోనాది. ఆ పిల్లనే ఆరాత్రి ముకుందరావు ఇంటికి తీసికొచ్చినాడు” గద్గద స్వరంతో చెప్పాడు యలమంద.
“ఆ చంగమ్మ ఇప్పుడు ఎక్కడ వుంది?” అడిగాడు కృష్ణారావు.
“వాళ్ళ గుడిశలో వుంటదనుకొంటా సారూ!”
వెంటనే కృష్ణారావు కుర్చీనుండి లేచాడు.
“యలమందా!.. నీవు నాతోరా !..”
ఇరువురూ గదినుండి బయటికి నడిచారు. జీప్‌ను సమీపించారు.
“యలమందా!.. ముందు కూర్చో!”
యలమంద ముందు కూర్చున్నాడు.
ఎస్.ఐ కృష్ణారావు జీపును స్టార్ట్ చేశాడు. స్టేషను ఆవరణం దాటి జీప్ రోడ్డుపైకి వచ్చింది. “యలమందా!..”
“సారూ!..’
“ఆ రాత్రి చంగమ్మ భవంతిలోనే వుండిందా!”
“వుండింది సారూ!.. నాకు రంగ మామకు అన్నం పెట్టింది.”
‘భవంతిలో వున్న రంగడిని, యలమందను విచారించాను. ఆ చంగమ్మను విచారించలేదు. మిస్ అయింది. ఇప్పుడు విచారించాలి’ అనుకొన్నాడు కృష్ణారావు.
యలమంద చూపిన దారిన, ఇరవై నిముషాలలో జీపును నడిపిన కృష్ణారావు, జీపును చంగమ్మ గుడిశ సమీపంలో ఆపాడు. దిగాడు. యలమంద కూడా జీపు దిగాడు. ఇరువురూ చంగమ్మ గుడిశను సమీపించారు.
“చంగమ్మా..” పిలిచాడు కృష్ణారావు.
గుడిశ నుండి చంగమ్మ, మరో ఆవిడ, బయటికి వచ్చారు. కృష్ణారావును, యలమందనూ చూచారు. వారి కళ్ళల్లో భయం.. వదనంలో ఏడుపు.
“మీలో చంగమ్మ ఎవరు?”
గద్గద స్వరంతో “నేను సారూ!..” అంది చంగమ్మ,
“ఆమె ఎవరు?”
“నా చెల్లెలు మంగ” చెప్పింది చంగమ్మ.
“చంగమ్మా.. భయపడకు. నేను నిన్నేమీ చేయను. నా ప్రశ్నలకు నీకు తెలిసిన నిజాలను చెప్పు.” ఏడుస్తూ తలాడించింది చంగమ్మ.
“చనిపోయిన అమ్మాయి నీకేమౌతుంది?”
“నా కూతురు బిడ్డ, మనవరాలు. ఆ రాచ్చసుడు ముకుందరావు బలవంతంగా చెరిచి గొంతు పిసికి కసితో చంపినాడు. ఆ రాత్రి కిటికీ గుండా నేను అంతా చూచినా.. చచ్చిన నా మనవరాలిని బుజానేసుకొని, కారు డిక్కీలో దాన్ని పడేసి ఆ ముకుందగాడు ఎటో ఎల్లిపోయిండు. గంట తరువాత వచ్చిండు. ఈలోగా వాడి అయ్య గోపాలరావు గాడు వచ్చిండు. నన్ను మంచినీళ్ళు తీసుక రమ్మన్నాడు. వాడికి నాకు ఒక పాతలెక్క బాకీ. ఆ రాక్షసుడు పదేళ్ల క్రిందట బలవంతంగా ఆ ఇంట పనిమనిషిగా వున్న నా కూతురు సత్యను బలవంతంగా చెడిపాడు. భోరున ఏడుస్తూ నా కూతురు నాకు ఆ కత సెప్పింది. అవమానంతో మేమంతా నిదరపోయేటప్పుడు నడిరేయిన బాయిలో దూకి చచ్చిపోనాది. వాడిపై పగ తీర్చుకోవాలనే నేను వాడి ఇంట్లో పనికి చేరినా. ఇంతకాలం సమయం కోసం కాచుకోనున్నా!.. నీళ్ళ బాటిలుతో పాటు సానపట్టిన చురకత్తిని తీసుకొని వాడి గదికి ఎల్లినా.. తాగి సోఫాలో పడివున్న వాడిని చూచి ఇదే తగిన సమయం అని కత్తితో వాడి గుండెల్లో పొడిచినా. సోఫా నించి కిందపడి విలవిలా తన్నుకొని చచ్చిండు.
అదే సమయానికి నా మనవరాలిని ఏటి ఒడ్డున పాతిపెట్టి ముకుందగాడు వచ్చిండు. తండ్రి నా కూతురు చావుకు కారకులు. వాడు నా మనవరాలి చావుకి కారకులు.
గదిలో దూరి విస్కీ తాగి మంచంపై వాలినాడు ముకుందగాడు.
బాల్కనీ వైపు తలుపు తెరిచి వుంది. అందులో నుంచి గదిలో దూరినా. వాడి గుండెపై కూకున్నా. నా కసితీరా నా గుండెల్లో పొడిచినా. వాడు చచ్చిండు. వాడి ఆవేశం సల్లారినాది. నా ‘పదేళ్ళ పగ’ తీరినాది.
సామీ!.. నేను సెప్పిందంతా సత్తెం. నాకు మీరు ఏ శిక్ష అయినా ఇదించండి. ఆనందంగా అనుభవిస్తా. చావంటే నాకు భయం లేదు సామీ!..” విరక్తితో కూడిన నవ్వు నవ్వుతూ చేతులు రెంటిని ముందుకు సాచింది చంగమ్మ.
కృష్ణారావు ఆమె చేతికి సంకెళ్ళు తగిలించాడు. జీప్ ఎక్కించాడు.
“యలమందా!.. నీవు నిర్దోషివిరా. నీవు నీ ఇంటికి పో. స్టేషనుకు వెళ్ళి రంగడిని విడిపిస్తాను. చంగమ్మా.. నీవు భయపడకు. ఇద్దరిని చంపావు. అది నేరమే. కానీ.. నీవు వారిని చంపేదానికి బలమైన కారణాలున్నాయి. నీ తరుపున గవర్నమెంటు లాయరు వాదిస్తాడు. కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంతే.. భయపడకు, బాధపడకు” అనునయంగా చెప్పాడు ఎస్.ఐ కృష్ణారావు.
చంగమ్మ కన్నీటితో బేడీలు వున్న చేతులను పైకెత్తి ఎస్.ఐ గారికి నమస్కరించింది. కృష్ణారావు జీపును స్టార్ట్ చేశాడు. వారికి సెల్యూట్ చేసి యలమంద చిరునవ్వుతో తన తల్లిని తలచుకొంటూ తన ఇంటివైపుకు నడిచాడు.
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.