Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదసంకీర్తనాచార్యుడు అన్నమయ్య

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘పదసంకీర్తనాచార్యుడు అన్నమయ్య’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“సురలకు నరులకు పారిది విన విన

నరుడు తాళ్లపాక అన్నమయ్య పదములు

పదం అంటే పాటే! తెలుగు వారికి పాటంటే మేలుకొలుపు పాటలు, సువ్వి పాటలు, రోకటి పాటలు, అత్తాకోడళ్లు వియ్యపురాళ్ల పాటలు, తుమ్మెద పదాలు, వెన్నెల పదాలు అల్లోనేరేళ్ళు పదాలు, వీరులపాటలు, అక్కలపాటలు, జాతరపాటలు ఇలాంటివి, సరదాగా ఇళ్ళలో ఆడవాళ్ళు పాడుకునేవే గానీ, పండితుల ఎదుట కచ్చేరీ చేసే స్థాయి కలిగినవి కావని మన పూర్వుల అభిప్రాయం. నేటి పరిస్థితి నాటి పరిస్థికి నకలుగానే ఉంది!! రోలు రోకలి చీపురు లాంటి పదాలకు నిఘంటు గౌరవం లేనట్టే, ఈ పాటలకు సభాగౌరవం లేదు. పద్యంలో చెప్తేనే సాహిత్యం అనే భావన ఇందుకు కారణం. 15వ శతాబ్ది వరకూ ఇదే పరిస్థితి.

“మహనీయంబగు సంకీర్తన నామక పద సంప్రదాయం బెట్టిదనిన..” అనే వాక్యాన్ని బట్టి, పదం, సంకీర్తన, పాట, గేయం ఇవన్నీ పర్యాయపదాలే! భక్తిసాహిత్యానికి అన్నమయ్య నూతన వరవడి సాధించిన కారణంగా పదకవితలకు సభాగౌరవం ఆరంభం అయ్యింది.

“చక్కెరై చవిచూపి జాజులై తావి చల్లి/నక్కజపుమాతు వజ్రాలై మెఱసీనీ

నిక్కుటద్దములై మా నిలువు నీడల చూపీ/నక్కర తాళ్లపాక అన్నమయ్య పదములు”

అని తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల తన తండ్రి అన్నమయ్య పద సంకీర్తనల తీపిని వివరించాడు.

పాడదగినది పదం. అందులో సొగసైన పదాలు, మధురమైన రాగతాళాలు మిళితంగా ఉంటాయి. భగవంతుడికన్నా భగవంతుడి నామం ఎక్కువ పుణ్యదాయకం అనేది నామసిద్ధాంతం. భగవన్నామాన్ని కీర్తించేది సంకీర్తన. సంకీర్తనాచార్యుడు, హరికీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడుగా అన్నమయ్య కీర్తిని పొందాడు. పంచమాగమ సార్వభౌముడు ఆయన!

వెంకటేశ్వరుని నాయకుడిగా, అలమేలు మంగని నాయికగా తీసుకుని అన్నమయ్య 32,000 అధ్యాత్మసంకీర్తనల్ని, శృంగార సంకీర్తనల్ని జాను తెనుగులో పామరులు సైతం అర్థం చేసుకోగలిగే రీతిలో వ్రాసినందువలన అన్నమయ్య పదసాహిత్యానికి పండితులతో పనిలేకుండా పోయింది. 500 యేళ్లనాటి ప్రజలు మాట్లాడుకునే పదజాలమే ఈ సంకీర్తనల్లో ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఏల పాటలకో సువ్వి పాటలకో సాహిత్య గౌరవం ఇవ్వని సమకాలీన పండితులు సామాన్యుడి భాషలో ఉన్న ఈ పదకవితల్ని మాత్రం ఎంత ఇష్టంగా అమోదించారనేది సందేహమే!

దేవుడి కొలువులో తెలుగు పాటకు అన్నమయ్య పెద్ద పీట వేయించటంతో, అది ప్రజలకు చేరువ కావటంతో పండితామోదం అప్రధానం అయ్యింది. భక్తి ముందు పాండిత్య ఆభిజాత్యం తలవొగ్గక తప్పలేదు. అన్నమయ్య సాహిత్యాన్ని భగవంతుడే బతికించాడు.

“తాళ్లపాకవారు తెలుగు పాటను తీర్చిదిద్దినన్ని విధాల మరే వాగ్గేయకారుడూ ఏ భాషలోనూ చేయలేదంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు” అన్నారు బాలాంత్రపు రజనీకాంత రావుగారు.

శృంగార వైరాగ్య పదాలు

పద్యం ముందా? పాటముందా? అని అడిగితే పాటలోంచే పద్యం పుట్టిందని విశ్లేషకులు భావిస్తారు. వేదసూక్తాలన్నీ ఆనాటి పదాలే! గాథాసప్తశతిలోని గాథలు పాటలకు పల్లవి లాంటివి. నాయనారులు తమిళంలో అనేక దేశీయమైన గొబ్బి పాటలు, జోలపాటలు వ్రాశారు. పన్నిద్దరు ఆళ్వారుల భక్తిగీతాలు వైష్ణవాన్ని త్వరగా వ్యాప్తిలోకి తేవటానికి తోడ్పడ్డాయి. అటు లీలాశుకుడు, జయదేవుడు ఇంకా కృష్ణచైతన్యప్రభు ఇలా ఎందరో భక్త కవులు పాటని సాధనంగా చేసుకుని శృంగార వైరాగ్యాలని ప్రచారం చేశారు. వీటన్నింటి ప్రభావం అన్నమయ పదసంకీర్తనలకు పునాదులే! ఆయనది మధురభక్తి. ఈ భక్తి సూత్రాన్ని క్షేత్రయ్య, నారాయణతీర్థులు సద్వినియోగపరచారు.

అటు శైవంలోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితి లేదు. 1130 నాటి నన్నె చోడుడు కుమారసంభవంలో ఊయలపాటల్ని, గౌడు గీతాల్ని, అంకమాలికల్ని పేర్కొన్నాడు “ఇవి దేశి శాఖకు చెందిన గేయఫణితులే!” అని వ్రాశారు ఆచార్య జి నాగయ్య.

“ఆతత బసవ పురాతన భక్తి గీతార్థ సమితియే మాతృకగాఁగ” బసవపురాణాన్ని రచిస్తున్నట్టు పాల్కురికి సోమనాథుడు (1160-1240) పేర్కొన్నాడు. బసవపురాణంలో తుమ్మెద పదాలు, ప్రభాతపదాలు, వెన్నెలపదాలు ఇంకా చాలా పదాల్ని ఉదహరించాడు. కోలాటపాటలు, ఛాంగుబళాలు కూడా 11వ శతాబ్దినాటికే తెలుగునాట ప్రసిద్ధాలు. ఆ కాలపు కవులు వాటిని విస్తృతంగా వ్రాసేవాళ్లు, నేటి కాలపు సినిమాపాటల్లా ఆనాటి ప్రజలు వాటిని ప్రేమగా పాడుకునే వాళ్లు. అవి తాళపత్రాల్లో మనకి దొరక్కపోయినా, జనం నాలుకల మీద భద్రంగా ఉన్నాయి. వీటినీ చారుగీతాలనీ పిలిచేవాళ్లు. ఈ పేరు బసవపురాణంలో ప్రముఖంగా కనిపిస్తుంది.

జోలపాటల్ని ‘బాలునంకించి పాడెడు పాటలు’ అన్నాడు పోతన మహాకవి. శ్రీనాథుడు ‘యక్షగానసరణి’ని పేర్కొన్నాడు. ఇవన్నీ పాట ఆరంభ వికాసాలకు సంబంధించిన అంశాలు. అన్నమయ కారణంగా పాట రసపుష్టి పొందింది. లక్షణ సమన్వితం అయ్యింది. సాహిత్య గౌరవాన్ని పొందింది. సభామర్యాద సాధించింది.

సంకీర్తనలక్షణ గ్రంథరచన

సామాన్యుడి బాషలో వ్రాస్తే పండితులు మెచ్చరనే కాబోలు సంస్కృతంలో అన్నమయ్య “సంకీర్తనలక్షణం” పేరుతో ఒక గ్రంథం వ్రాశారు. ఇది ఆనాటి పండితుల్ని పదకవితలకు సాహిత్య గౌరవం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన గ్రంథంగా రజనీగారు భావించారు. ఈ గ్రంథానికి అన్నమాచార్యుల కుమారుడు పెద తిరుమలాచార్యులు తెలుగులో వ్యాఖ్యానం వ్రాశాడు. అయితే ఈ రెండు గ్రంథాలూ ప్రస్తుతం అలభ్యం. ఈ గ్రంథానికి పెదతిరుమలాచార్యుని కుమారుడు, అన్నమయ్య మనుమడు చినతిరుమలాచార్యులు పద్యాలలో చేసిన తెలుగు అనువాదం వలన ఈ గ్రంథం వివరాలు తెలిశాయి.

“ఈ పదస్వరూపాన్ని రచనకై పరిగ్రహించిన తెలుగు లయకర్తల్లో ఇప్పటికీ అన్నమాచార్యులే ప్రాచీనతముడుగా కానవస్తున్నాడు. పద్యకవితాపితామహ బిరుదాన్ని సంపాదించుకున్న అల్లసాని పెద్దన్న గూడా ఇతని వలెనే నందరీక నియోగి కావడం-ఇతని వలెనే శ్రీవైష్ణవమత స్వీకారం చేసినవాడు కావడం కొంత వింత గొలిపే సందర్భాలు” అన్నారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు.

స్వామి ప్రత్యక్షం

అన్నమయ్యకు పదారేళ్ళప్పుడు స్వామి ప్రత్యక్షం అయినట్టు ఆయన సంకీర్తనల తొలి రాగిరేకుల్లో ఉందని వేటూరివారు తెలిపారు. “ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు నప్పఁడగు తిరువెంకటాద్రీశుఁ గంటి/అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి! ప్రతిలేని గోపురప్రభలు గంటి!/శతకోటిసూర్యతేజములు వెలుఁగఁ గంటి!/చతురాస్యుఁ బొడగంటిఁ జయ్యన మేలుకంటి” అనే కీర్తన అన్నమయ్యకి స్వామి దర్శనం జరిగిందనటానికి సాక్ష్యం. ఆ తరువాతే ఆయన సంకీర్తనలు వ్రాయటం ప్రారంభించాడని, అది బాల్యంలోనే జరిగిందని పండితాభిప్రాయం. ఉపనయనం జరిగిన ఎనిమిదేళ్ళ తరువాత ఈ దర్శనభాగ్యం కలిగింది కాబట్టి, ఎనిమిదో యేట దర్శనం అయ్యిందనే కథ ప్రచారం అయ్యిందని వేటూరివారి అభిప్రాయం. తిరుపతి బయల్దేరి వెళ్ళి స్వామిని దర్శించుకున్న ఆనందంలో “అదివో అల్లదివో హరివాసము! పదివేల శేషుల పడగల మయము” అనే కీర్తన ఆయన ఉత్సాహాన్ని, పరమానందాన్ని చాటుతుంది.

తిరువులనంబి అనే గురువు దగ్గర రామానుజులవారు రామాయణ రహస్యాలు తెలుసుకునేవారని, మధ్యాహ్నం పూజా వేళ దాటిపోతుంటే స్వామి పాదాలే అక్కడ ప్రత్యక్షమయ్యాయని ఒక ఐతిహ్యం. ఆ స్వామి పాదాలు ఇప్పటికీ ఉన్నాయి. పాదదర్శనం చేసుకున్న అన్నమయ్య “బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము దా నీపాదము” సంకీర్తనని ఆలపించారని చెప్తారు.

కురువనంబి అనే కుమ్మరి భక్తుడు కొయ్యతో స్వామి విగ్రహం చేసి, మట్టితో పువ్వులు చేసి స్వామిని పూజించేవాడని, ఒకరోజు తొండమాను చక్రవర్తి స్వామికి బంగారు పూలతో అర్చన చేస్తే అవి పక్కకు జరిగి మట్టి పూలు ప్రత్యక్షమైనాయని, కారణం విచారిస్తే కురువనంబి పూజ కథ తెలిసిందని చెప్తారు. “బంకమన్నది యెంతవాసనో లేక పారిజాతముల కెక్కుడో!” అని అన్నమయ్య ఈ కథ గురించి ఒక సంకీర్తన వ్రాశారు.

చెప్పులు విడిచి కొండ ఎక్కమని అలమేలుమంగమ్మవారే దర్శనమిచ్చి చెప్పి, స్వామి ప్రసాదం పెట్టి ఆకలి తీర్చిన కథ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సేకరణే!

కర్ణాటక సంగీతం-అన్నమయ్య

తెలుగు వాఙ్మయపు చరిత్రలో 15వ శతాబ్దం ఒక ప్రధాన ఘట్టం. “కవితాకన్యక ముగ్ధమై, అసందిగ్ధమై, కౌమార వయో మాధుర్యాన్ని మీరి తొలిప్రాయపు తళుకుల్ని, అందరినీ ఆకర్షించే బెళుకుల్నీ నేర్చుకున్న కాలం” అంటారు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.

 “పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు కర్ణాటక సంగీత పితామహుడు కన్నడ పదకర్త పురందరదాసుకు ముందరి కాలం వాడు. అన్నమాచార్యుల మనుమడు చినతిరుమలాచార్యుడి వయసు వాడు కావచ్చు. ఈ చినతిరుమలాచార్యుడు, పురందర దాసు, విజయనగర పాలకులైన అచ్యుతదేవరాయలు (1529-42) సదాశివరాయలు (1542-76), “స్వరమేళకళానిధి” గ్రంథ రచయిత రామయ్యమంత్రి వీళ్లందరి పూనికతో సరళీస్వరాలు, జంటస్వరాలు, గీతాలు, అలంకారాలు, వర్ణాలు, అనే క్రమతరగతి పద్ధతిలో సంగీత విద్యార్థులకి శిక్షణ ఏర్పాటు జరిగిందని, రాజులు కన్నడ రాజ్య రమామణులు కాబట్టి రాజకీయ వ్యవహార భాష తెలుగైనను సంగీతమునకు కర్ణాటక సంగీతమని పేరు పడిపోయింది” అనీ, ‘తెలుగు వారి సంగీత రీతులు’ అనే వ్యాసంలో రజనీగారు పేర్కొన్నారు.

15వ శతాబ్ది ముందునాటికి వైష్ణవదాసుల ప్రభావం ముఖ్యంగా కన్నడం మీద ఎక్కువగా ప్రసరించింది. విజయనగర ప్రభువులు వైష్ణవ మతానుయాయులు కావటాన వారికి ప్రోత్సాహం కూడా మెండుగానే దొరికింది. అన్నమయ్య పదకవితలకు ఈ నేపథ్యం బాగా ఉపయోగపడింది. దేశిరాగాలు, దేశీయమైన పదాలతో ఏర్పడిన లయ, అందుకు తగిన తాళాలతో సరళీకరించిన సంగీత రచనే పదసంకీర్తనగా వెలిసింది. అన్నమయ్య సృష్టించిన బహువిస్తారమైన పదకవితా సాహిత్యం కర్ణాటక సంగీతానికి బీజావాపన చేసింది. కర్ణాటక సంగీతానికి ఒక ఒరవడిని కల్పించి దిశా నిర్దేశం చేయటంలో అన్నమయ్య పాత్ర ప్రముఖమైంది.

అన్నమయ్య ఒరవడిలో వచ్చిన క్షేత్రయ్య తన పదకవితలను నాట్యాభినయానికి అనుకూలంగా ఉండేలా వివిధ మనో అవస్థల్ని, సాత్త్విక భావాల్ని అభినయించటానికి అనువుగా వ్రాశాడు. అదే దారిలో సారంగపాణి, సభాపతయ్య, గోవిందస్వామి, ఘనం శీనయ్య ఇంకా ఎందరో.. కర్ణాటక సంగీతానికి పదకవితలతో ప్రాణం పోశారు ఇది అన్నమయ్య శృంగార సంకీర్తనల ప్రబావంలో వచ్చిన ఒక పాయ.

అధ్యాత్మికత, భక్తి తాదాత్మ్యతలను ప్రతిఫలించేలా, భజన, సంకీర్తన గోష్ఠుల సంప్రదాయం మరో పాయ. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తజన సందోహం ఎదుట నాట్యం చేస్తూ పాడదగిన కీర్తనలకు వ్యాప్తి పెరిగింది. ఈ ఉద్యమానికి భక్త రామదాసు అనే కంచర్ల గోపన్న, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, తాళ్లూరి నారాయణ కవులను రజనీగారు ప్రస్తావించారు. అన్నమయ్య కన్నా ముందునాటి కృష్ణమాచార్యుని సింహగిరి వచనాలు గేయపద్ధతిలోనే నడిచినా అన్నమయ్య చెప్పిన సంకీర్తనాలక్షణాలు కొరవడి, “అవి అంగాంగి విభాగం లేక అఖండ గద్యధారగా, గేయగంధులుగా మాత్రమే ఉన్నవి” ఆని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అభిప్రాయపడ్డారు.

మూడవ పాయ యక్షగాన పద్ధతి. సిద్ధేంద్రయోగి బామాకలాపం, నారాయణ తీర్థుల కృష్ణలీలాతరంగిణి కూచిపూడి, మేలట్టూరు కళాకారుల కృషి అంతా ఈ మూడో పాయలో ప్రతిఫలిస్తుంది. ఇలా మూడుపాయలుగా సాగిన అన్నమయ్య వారసత్వంలో జానుతెనుగు సహజమైన సంగీతత్త్వాన్ని తనలో ఇముడ్చు కుంది. ఈ సంగీతానికి అనువైన భాష కావటాన కర్ణాటక సంగీతం తెలుగు సంగీతంగా వెలుగు లీనసాగింది.

అన్నమయ్య ఆరంభించిన సంకీర్తనా ఉద్యమానికి కొనసాగింపుగా సంగీత బంధంలో మరింత కట్టుదిట్టం చేసి, కృతుల అవతరణకు కారకులయిన వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి. వీరిని కర్ణాటక సంగీత మూర్తిత్రయం అంటారు. “అన్నమయ్య పదసంకీర్తనల్లోని భక్తి శృంగార గానాంశలే క్రమంగా రామదాసాదులను చేరి భజన సాంప్రదాయంగాను, త్యాగరాజాదులను పొంది సంగీత సంప్రదాయంగానూ విస్తృతి నంది”నట్టు డా|| వేటూరి ఆనందమూర్తి వ్రాశారు.

ఆంధ్ర పదకవిత్రయము

“చిన్నన్న ద్విపద కెఱఁగును, బన్నుగఁబెదతిరుమలయ్య పదమున కెఱఁగున్,

మిన్నంది మొరసె నరసి గన్న కవిత్వంబు పద్యగద్య శ్రేణిన్”

చిన్నన్న అనే చినతిరుమల వేంగళనాథుడు అన్నమయ్యకి మనుమడౌతాడు. ఆయన ద్విపదలు వ్రాయటంలో ప్రతిభావంతుడు. అష్టమహిషీ కళ్యాణం, పరమయోగి విలాసం వ్రాశాడు. చిన్నన్న తండ్రి పెద తిరుమలయ్య అన్నమయ్య కుమారుడు. ఇంక పెద క్రీ.శ. 1480-1547 కలాంనాటి వాడు. తండ్రికి తగిన తనయుడు. ఈ పెద తిరుమలాచార్యుని కాలానికి ప్రబంధ యుగం ప్రారంభం అయ్యింది. ఆ ప్రభావం పెదతిరుమలయ్య మీద ఉంది. అతను వ్రాసిన ‘చక్రవాళమంజరి’ అనే ప్రణయకావ్యంలో అలమేలుమంగ శ్రీవేంకటేశ్వరుని వలచి శృంగారావస్థలకు లోనై చివరికి నాయకుని చేరటం ఇతివృత్తం. ప్రబంధ కవు లనుసరించిన కావ్యరచనా విధానంలో ఇది సాగుతుంది.

పెదతిరుమలయ్య అన్నమయ్య ఒరవడిని కొనసాగిస్తూ అనేక పదసంకీర్తనలు కూడా వ్రాశాడు. వాటిలో చాలా వరకూ రాగిరేకుల్లో, తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలో ఉన్నాయని చెప్తారు. ఈ వంశీకుడే నరసింగన్న. కవికర్ణ రసాయన కర్త ఇతను. తాళ్లపాక నృసింహకవి ఇతని అసలు పేరు. బహుశా చినతిరుమాచార్యుడి తరువాతి తరంవాడు కావచ్చని, వందేళ్లు చిన్నవాడని, అన్నమయ్య వార్ధక్యంలో కృష్ణదేవరాయలు అధికారంలోకి వచ్చి ఉంటాడని మానవల్లి రామకృష్ణకవి అభిప్రాయపడ్డారు. ఇలా, తాత, కొడుకు, మనుమడు పద కవితాప్రక్రియల్లో శేముషీ కృషిచేసి ఆంధ్ర పదకవిత్రయంగా ప్రసిద్ధులయ్యారు.

శ్రీవారి బంగారు వాకిలి దగ్గర నిలబడి ఎదురుగా చూస్తే స్వామి విగ్రహం, కుడిపక్కకు చూస్తే భాష్యకారుల విగ్రహాలు, పక్కనే అన్నమాచార్యుల విగ్రహం కనిపిస్తాయి. సంకీర్తనభండారం ద్వారానికి ఎడమవైపున వృద్ధుడిలా కనిపించేది అన్నమయ్య విగ్రహం, కుడిప్రక్కన కొంత యువకుడిగా కనిపించేది పెదతిరుమలాచార్యుల విగ్రహం అని వేటూరి వారు వ్రాశారు.

“అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను/మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా||

నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక/అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య
పన్ని యాతనినే చూచి పాతకులమైన మమ్ము/మన్నించవయ్య వో మధుసూదనా||

సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్లపాకన్నయ్య/ అంకెల నీసన్నిధినే అదిగోవయ్య
అంకించి నే వారివాఁడనని దుష్టుడనైనా నా/సంకె దీరఁ గావవయ్య సర్వేశ్వరా||

పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు/ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య
యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను/నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా||

అనే సంకీర్తనలో స్వామి పాదాల చెంతే ఉన్న తాళ్లపాక అన్నమయ్య ప్రస్తావన ఉంది.

“అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు/ యిదె వీఁడె శ్రీవెంకటేశునెదుట

వెదవెట్టి లోకములో వేదము లన్నియు మంచి పదములు సేసి పాడి పావనము సేసెను ఈతడే||”

అంటూ వెంకటేశ్వరుని చెంత అన్నమయ్య స్థానాన్ని ఈ కీర్తన పదిలం చేస్తోంది. బహుశా ఇవి చినతిరుమయ్య కీర్తనలు కావచ్చు. తిరుమల గుడిలో అన్నమయ్య విగ్రహానికి పూజాదికాలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి, చినతిరుమలాచార్యుఁడు మంగాపురంలో మరొక వెంకటేశ్వరస్వామి గుడి కట్టించి, అక్కడ ఆళ్వార్లు, భాష్యకార్లు, దేశికులతో సహా అన్నమాచార్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాపురస్కారాలు కల్పించాడు.

“దినము ద్వాదశి నేఁడు తీర్థ దివసము నీకు/జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే” అంటూ “ద్వాదశి తిథి రోజున నీకు నదీతీరంలో దివసము పెడ్తున్నాము. తండ్రీ! అన్నమాచార్యా! విచ్చేయవయ్య” అంటూ పితృదేవతల్ని ఆవాహన చేస్తున్న సంకీర్తన ఇది, బహుశా అన్నమయ్య కుమారుడు పెదతిరుమలయ్య రచన ఇది కావచ్చు. తన తండ్రిని అనంత గరుడ ముఖ్యులైన సూరి జనులతో, నారదుడివంటి భక్తాగ్రేశ్వరులతో, దనుజమర్దనుడైన ఆ దైవశిఖామణితో వచ్చి ఆరగించమంటున్నాడు.

శ్రీకృష్ణదేవరాయలు పాలన కొచ్చేసరికి అన్నమయ్య కడు వృద్ధుడు. ఆయన కుమారుడు పెదతిరుమలయ్య మధ్యవయస్కుడు. చినతిరుమలయ్యకి ఉపనయనం అయ్యింది. 1503లో అన్నమయ్య స్వయంగా బ్రహ్మోపదేశం చేశాడని వేటూరి వారు వ్రాశారు. పెదతిరుమలయ్య అన్నమాచార్యుని రెండవభార్యయగు అక్కలాంబకు పుట్టాడు. 1553 దాకా జీవించాడు.

అన్నమయ్య ప్రశస్తిని రాయలవారు ఎందకు గుర్తించలేదనేది పెద్ద ప్రశ్నే! 1512 నుండి, 1523 దాకా 7సార్లు తిరుమలకు వచ్చిన రాయలవారికి అన్నమయ్య గురించి తేలీదనుకోలేము. ఆయన ఎందరో కవుల్ని పోషించి ఆంధ్రభోజుడనిపించుకున్నవాడు. స్వయంగా సంస్కృతాంధ్రకవి. అప్పటికే పెద తిరుమలయ్య కూడా కవిగా ప్రసిద్ధుడైనవాడు. అల్లసాని పెద్దనకి అన్నమయ్య స్వయంగా గురువు. బహుశా కావ్యాలు రాసే కవులకు వాగ్గేయకారులపట్ల చిన్నచూపు రాయలవారిక్కూడా ఉందేమో చెప్పలేము.

సంకీర్తన లక్షణాలు

అన్నమయ్యే సంకీర్తనలకు కొన్ని లక్షణాలను ప్రతిపాదించాడు. సంకీర్తన లక్షణగ్రంథంలో వాటిని చక్కగా వివరించాడు:

వర్ణన: సంకీర్తనలో ఆధ్యాత్మిక వర్ణన లేదా శృంగార లీలా వర్ణన ఏదైనా ఉండవచ్చు.

పల్లవి: పదముల యర్థము పల్లవి/వదలక యన్నిటికి నేకవాక్యత సేయన్/ గుదిగృచ్చినట్లు తగులై/పదము తుదిన్ మరియుఁ బల్లవి యలరున్” అని పల్లవి గురించి అన్నమయ్య లక్ష్య నిర్దేశం చేసినట్టు చినతిరుమలయ్య అనువాద పద్యం ఇది. మకుటంగా పల్లవి ఉంటుంది. పల్లవిలో కేంద్రభూతమైన అర్థం ఉంటుంది.

అనుపల్లవి: పల్లవి భావం ఒక వాక్యంలో ముగియకపోతే రెండవ వాక్యాన్ని అనుపల్లవిగా చేరుస్తారు. ఉదాహరణకి “తనకర్మ మెంత చేతయు నంతే” అనేది పల్లవైతే “గొనకొన్న పని యెంత కూలీనంతే” అనే రెండవ వాక్యం అనుపల్లవి అవుతుంది.

చరణాలు: 2-6 చరణాలు ఉంటాయి. ఒక్కో చరాణానికి 2 లేదా 4 పాదా లుంటాయి. చరణాలెన్ని ఉన్నా వాటి రాగస్వరాలు సంచారక్రమం చరణాలు పల్లవిలోని అర్థానికి విస్తరణగా సాగుతాయి. “ఒక్కో చరణానికి రాగ తాళాదులు వేర్వేరుగా ఉండేలా చేసిన ‘సూళాదులు’ 15-16 శతాబ్దాలలో కన్నడంలో పుట్టినవి. కానీ అవి వ్యాప్తికి రాక అడుగున పడిపోయినవి” అని రాళ్లపల్లి వారు వ్రాశారు.

కర్తముద్ర: చివరి చరణంలో భగవన్నామం గానీ, లేదా ఆ గేయకర్త నామం గానీ ఉంటుంది. దీన్ని కర్తముద్ర అంటారు.

కావ్య నియమాలు: కావ్యాల నియమాల ప్రకారం యతి, ప్రాస ఉంటాయి. మాత్రావృత్తం పద్ధతిలో గురువుకు రెండు లఘువులు లెక్కన నడక ఉంటుంది.

తాళ నియమాలు: గేయానికి తాళం ముఖ్యం. తాళ సంరక్షణ చేస్తూ, వర్ణ, స్వర తాన గతులతో అక్షరాల పూరణం ఉంటుంది.

భాష: గేయానికి ఆధ్యాత్మికం లేదా శృంగారం చక్కగా ఒప్పుతాయి. జనసామాన్యానికి బాగా ఎరిక ఉన్న శబ్దాలతో, నుడికారాలతో, జాతీయాలతో, చమత్కారాలతో పరిహాసాలతో, వక్రోక్తులతో ఆద్యంతం ఆహ్లాదభరితంగా గేయాలు సాగుతాయి.

కల్పన: అద్భుతం అనిపించే కల్పనలు గేయానికి సొబగునిస్తాయి. ఆసక్తి కలిగించటం ముఖ్యం కాబట్టి, ఇంపైన రాగతాళాలతో, మధుర గాత్రాలతో మైమరపించేవిగా ఉంటాయి.

శరణాగతి తత్త్వం

శ్రుతులై శాస్త్రములై పురాణకథలై సుఙ్ఞాన సారంబులై/యతిలోకాగనవీధులై విపుల మంత్రార్థంబులై నీతులై

కృతులై వేంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై/నుతులై తాళులపాక అన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్”

అనే పద్యం ‘సంకీర్తనలక్షణం’ గ్రంథంలోది. మొత్తం అన్నమయ సాహిత్య తత్వాన్ని ఇందులో విశ్లేషించాడు చినతిరుమలయ్య.

శరణాగతి తత్త్వాన్ని, భక్తి ప్రవృత్తిని చాటే ఆధ్యాత్మిక సంకీర్తనలు, జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చాటే అమలిన దివ్యశృంగార సంకీర్తనల ద్వారా శ్రీ వేంకటేశ్వరుని తత్త్వాన్ని లోకానికి చాటేందుకు తాళ్లపాక కవిత్రయంగా ప్రసిద్ధులైన అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యులు, మనుమడు చినతిరుమలాచార్యులు చేసిన కృషి అనితర సాధ్యమైనది. భక్తి, సాహిత్యం, సంగీతం,ముప్పేటగా పెనవేసుకున్న త్రివేణి అన్నమయ్య పదసంకీర్తన.

“శరణం గృహరక్షిత్రో:” అని అమరకోశం. శరణం అంటే రక్షణ. ఆగతి అంటే approach for protection రక్షణకోరి వెళ్ళటం అని! భగవంతుడు తనను తప్పక రక్షిస్తాడనే ఒక బలమైన నమ్మకం, గాఢమైన శ్రద్ధ శరణాగతి తత్త్వంలో ముఖ్యమైనవి. తనకు రక్షకులు వేరెవరూ లేరనే అన్యథాశరణం నాస్తి అనే నిర్ణయం వలన ఏకాగ్రత సాధ్యం అవుతుంది.

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్/అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనమ్” అని భాగవతం భక్తిని అనేకరకాలుగా వర్గీకరించింది. కీర్తనం అనేది భక్తిలో ముఖ్యమైన అంశం. భగవంతుడి నామ సంకీర్తనమే భగవంతుడి దగ్గరకు మనల్ని చేరుస్తుందనేది నామసిద్ధాంతం. కలి దోష నివారణకు నామ సంకీర్తన ఉత్తమ సాధనంగా భావించారు. “హరేరామ హరేరామ రామరామ హరేహరే/హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే.. ఇతి షోడశతం నామ్నాం కలికల్మషనాశనమ్” లాంటి సిద్ధాంతాలు అవతరించిన కాలం అది! ఇంతకు మించిన ఉపాయం సమస్త వేదాలను గాలించినా కనిపించదనే ఉపదేశం ఉండేది. నామసిద్ధాంతం ప్రబలం కాకపోయి ఉంటే కర్ణాటక సంగీతానికి ఇంత వైభవం దక్కేది కాదేమో!

శ్రీ వేంకటేశుఁడే శేఖరపు దైవమని/సావధానుఁడితనికి శరణుచొచ్చి

భావము లోపలఁ దన పాపబంధములఁబాపి/తావుల నాతని కృప దండచేరరాదా”

ఈ చరణంలో శ్రీ వెంకటేశుడు శిఖరప్రాయమైన దైవమని, ఆయనకు శరణాగతుడివి కావాలనే భావం కలిగితేనే పాపబంధాలు పోతాయని, ఆయన అండ చేరాలని తీర్మానిస్తాడు.

భగవద్గీత ప్రబోధించిన శరణాగతి తత్వాన్ని అన్నమయ్య పరమోపాయంగా భావించాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః” అన్ని ధర్మాల్ని పరిత్యజించి తనను శరణు కోరమన్నాడు భగవంతుడు. రామానుజులు కూడా ఇదే భావాన్ని ప్రచారం చేశారు. “ఒక్కడే మోక్షకర్త-వొక్కటే శరణాగతి-దిక్కని హరిఁగొల్చి బదికిరి తొంటివారు” అంటూ శరణాగతి తత్త్వాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చాడు.

“నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని/ ఉన్నవాఁడ నిఁక వేరే ఉపాయమేమిటికి?” అంటూ అన్నమయ్య శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన-వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి” అంటూ వేంకటేశ్వరుని మహిమని లోకానికి చాటేందుకు ఆయన అంకితమయ్యారు.

“ఓ కమలాస్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్ష దూర! కు/య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా

నోకహ! యో మునీశ్వరమనోహర! యో విమలప్రభావ! రా/వే, కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁగావవే”

అని గజేంద్ర మోక్షం ఘట్టంలో పోతనగారు గజేంద్రుడు తన ప్రయత్నాలన్నీ విఫలమైనాక భగవండుడొక్కడే తనను రక్షించగలడని శరణాగతుడయ్యాకే శ్రీహరి తరలి వచ్చి మొసల బారినుండి రక్షించినట్టు వర్ణించాడు. శరణాగతి తత్త్వం అంటే అది!

“గతులన్ని ఖిలమైన కలియుగమందును/గతి యీతఁడె చూపె ఘనగురుదైవము”

“శరణంటి మాతని సమ్మంధమునఁ/మరిగించి మమునేలి మన్నించవే”

“ఇహమే కాని యిఁక బరమే కాని/బహళమై హరి నీ పై భక్తే చాలు” ఇవన్నీ శరణాగతి తత్వానికి చెప్పదగిన సాక్ష్యాలు.

 “కొండవంటిది యాస గోడవంటిది తగులు/బెండువంటిది లోని పెద్దతనము

పుండు వంటిది మేను పోల్చినను మేడి/పండు వంటిది రసభావమింతయును”

కొండ= ఎత్తైనది; గోడ=అవతల ఏముందో కనిపించకుండా అడ్డు ఉండేది; బెండు= లోపలంతా డొల్లతనం; పుండు=రగిలి బాధపెట్టేది. మేడిపండు= లోపలంతా పురుగులుండేది. కంచు=గలగలామోగేది; మంచు త్వరగా కరిగిపోయేది; మించు=మెరుపు, క్షణ భంగురమగు వెలుగు; మట్టిపెంచు= మట్టి పెంకులాంటిది భ్రాంతి; ఆకు=ఎండి రాలిపోయేది, అడవి=విశాలంగా ఉంటుంది గానీ నివాసానికి వీలైనది కాదు, పాకు=జీడిపాకం; వేంకటేశుని తలచుకోవాలనే కోరిక ఉంటే ఇవన్నీ తొలగిపోయి సౌఖ్యాలు అమరౌతాయనేది తాత్పర్యం. నామసిద్ధాంత ప్రాధాన్యతని ఈ సంకీర్తన సూచిస్తుంది. భగవంతుడికన్నా భగవన్నామమే ఎక్కువ శక్తివంతమైనదనేది ప్రబోధం.

ఇతర కవుల జీవనవిధానం వేరు, భక్తకవి ఆలోచనావిధానం వేరు. భక్తకవికి భగవంతుడితో ఉన్నంత అనుబంధం సామాన్యుడితో కూడా ఉంటుంది. మామూలు కవుల విషయంలో ప్రభుదర్శనానికి ఎదురు చూస్తూ, ఆయన కరుణాకటాక్షాల కోసం ప్రాకులాడుతూ, ఆయన్ని మెప్పించేందుకు ఇంద్రుడు చంద్రుడు అని కీర్తిస్తూ, ఆయన విదిల్చే ముష్టికోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంత శ్రమపడితే కావ్యం వెలుగులోకి వచ్చేది! కానీ, భక్తకవి విషయం వేరు. భగవంతుడి కరుణకోసం శ్రమపడటం శరణాగతితత్త్వ రచన.

పుట్టుకతో అద్వైతి, ఎదిగాక విశిష్టాద్వైతి

అన్నమయ్య అద్వైత భావన కలిగిన ఇంట జన్మించాడు. నందవరీక స్మార్తబ్రాహ్మణ కుటుంబం. రామానుజ ప్రభావం ఏమీలేని భక్తి తత్పరుల ఇల్లది! జీవాత్మ పరమాత్మ వేర్వేరు కాదు ఒక్కరే అని నమ్మిన కుటుంబం. శివుడు, విష్ణువే కాదు దేవత లందరిపట్లా సమభావనతో ఆరాధన చేసే ఆచారం వాళ్లది. కానీ, అన్నమయ్య వాగ్గేయకారుడిగా ఎదిగే కొద్దీ ఈ అద్వైత భావనకు క్రమేణా దూరం కాసాగాడు. విశిష్టాద్వైతం పట్ల ఆయన ఎక్కువ మక్కువ కనబరిచాడు. చిన్ననాటినుండీ నమ్ముతూ ఎదిగిన అద్వైతాన్ని ఖండిస్తూ ఆయన అనేక కీర్తనలు వ్రాశాడు కూడా! పుట్టుకతో వైష్ణవుడు కాదు, కానీ పరమ వైష్ణవుడిగా ఎదిగాడు.

అహోబలంలో విశిష్టాద్వైత వేదాంతాధ్యయనం చేశాడని, అక్కడే అహోబల మఠ జియరు, నృసింహోపాసకుడు ఆదివన్ శఠగోపయతి నుండి మంత్రోపదేశం పొందాడని, 32 అక్షరాల ఆ మంత్రాన్నే శ్రీ వెంకటేశ్వరుడిపై గురిచేసి ఉపాసన చేశాడని చెప్తారు. అక్షరానికి వెయ్యి చొప్పున 32 వేల కీర్తనల్ని ఆయన రచించటం, కాకతాళీయమా లేక 32 వేల కీర్తనలు వ్రాసేనాసరికి అన్నమయ్య జీవితం ముగిసిందా అనే చర్చ పండితుల మధ్య ఉంది.

“ఏకాత్మావాదులాల యిందు కేది వుత్తరము/మీకు లోకవిరోధ మేమిటఁ బాసీ నయ్యలాల||” అనే సంకీర్తనలో ఆయన ఏకాత్మవాదులైన అద్వైతుల్ని ఖండించటం గమనార్హం. అందరిదీ ఒకటే ఆత్మ అనటాన్ని కూడా అన్నమయ్య వెక్కిరించాడు.:

“పాపమొక్కఁడు సేసితే పాపులే యిందరుఁ గావలదా

యేపున వొకరి పుణ్య మిందరికి రావలదా

కోపించి యొక్కడసురైతే కోరి యిందరుఁ గావలదా

చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరు గావలదా||” అని ప్రశ్నించాడు

“జలధి లోపలి మీను జలధి దా నౌనా

జలములాధారమైన జంతువు గాక

నెలవై నీలోని వాఁడ నీవే నే నౌదునా

పొలసి నీయ్యాధరువు బొమ్మ నింతేకాక”

సముద్రంలో ఉండే చేప జలాల ఆధారమైన జంతువే గాని, సముద్రం అవుతుందా? నీలో నెలవైన వాణ్ణి నీవే నేనౌతానా? నీ ఆధారంగా కదిలే బొమ్మని నేను అవుతాను” అంటున్నాడు. ‘అహంబ్రహ్మాస్మి అన్నంత మాత్రాన నేను భగవంతుణ్ణి కాను భగవంతుడు ఆడించే తోలుబొమ్మని’ అని సారాంశం.

పురుషుండని శ్రుతి వొగడీనట ఆ పురుషుడు నిరాకారమట

విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు||

మొగమున బ్రాహ్మలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుఁడట

తగు బాహువులను రాజులట ఆ తత్త్వమే యెంచఁగ శూన్యమట||

పగటున తొడలను వైశ్యులట ఆ బ్రహ్మము దేహము బయలట

అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట||

ఇలా అద్వైత భావాన్ని వ్యతిరేకిస్తూ విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదిస్తూ అన్నమయ్య చెప్పిన అనేక సంకీర్తనలు ప్రసిద్ధి పొందాయి.

శ్రుతులు నిర్వికారుణ్ణి పురుషుడనటాన్ని విరస వాక్యాలు, అసంబద్ధం అన్నాడు. బ్రాహ్మణులు అవయవరహితుడి ముఖం నుంచి వచ్చారనటాన్ని యద్దేవా చేశాడు. బాహువులు రాజులని, వైశ్యులు తొడలనుంచి వచ్చారనీ, పాదాలనుండి శూద్రులు వచ్చారనీ చెప్పటాన్ని శూన్యతత్త్వంగా అభివర్ణించాడు. సంకీర్తన చివరి పాదంలో అంటాడు: “పంతపు శ్రీ వేంకటపతి మాయలు పచారించిన వివియట” అని! పచారించటం అంటే ప్రసరించటం, వ్యాపింపచేయటం. ఇవన్నీ శ్రీ వెంకటేశ్వరుడి కల్పనలే అంటాడు.

‘రాజు వద్దనున్న బంటు రాజే తానౌనా?’ అని సూటిగా ప్రశ్నిస్తాడు. భగవంతునిలో ఐక్యమైతే “ముత్తెపుఁజిప్పలనీరు మున్నిటివలె నుండునా/ముత్తెములై బలిసి లో మొనఁపుగాక” ముత్యపుచిప్పలో నీరులా పరమాత్మలో చేరితే మంచి నిక్కమైన ముత్యంలా అవుతా మంటాడు. ఇదంతా ద్వైతమే, అద్వైతం కాదు! “మొత్తపు లోకుల మాముక్తులము గాక” అంటూ భగవంతుణ్ణి చేరి సమస్త మానవాళీ ఆముక్తులు కావాలని ఆకాంక్షిస్తాడు.

అన్ని మతాలూ ఒకటే అనే సిద్ధాంతం కూడా అన్నమయ్యకు రుచించినట్టు కనిపించదు. “అన్ని మతములు సరియైతేను వాసి లేదా/ చెన్నగుఁ బురాణాలు చెప్పుఁగాక/యెన్నఁగ సొర్ణాటంక మింతటానుఁ జెల్లినట్టు/ సన్నపుఁదోలు బిళ్లలు సరిగాఁజెల్లునా” అని ప్రశ్నించాడు. అన్ని మతాలూ సరి అయినవేనని, వాసి గలవేనని పురాణాలు చెప్తే చెప్పవచ్చు గాక! బంగారపు నాణానికి చెల్లుబాటు ఉన్నట్టు పనికిరాని తోలునాణాలకు చెలామణి ఉంటుందా?”అనడుగుతున్నాడు.

వైష్ణవం అంటే?

ఇన్ని సిద్ధాంతాలని వివరించిన అన్నమయ్య తాను భక్తిపడి, ఇష్టపడి నమ్మి స్వీకరించిన వైష్ణవం ప్రశస్తిని కూడా అనేక సంకీర్తనల్లో వివరించాడు.

“ప్రపన్నులకు నిది పరమాచారము/విపరితాచారము విడువఁగవలయు||

భగవదపచారాము భాగవతాపచారముఁ / దగులక దేవతాంతరము మాని

నగధరు శరణము నమ్మి యాచార్యుని /బగివాయనిదే పరమ వైష్ణవము||

దురహంకారము దుఃఖము సుఖమునుఁ/బొరయక ప్రాకృతుల పొంతఁ బోవక

దరిశనాభిమానాన ధర్మము వదలకపోయేసరికి/పరిశుద్ధి నుండుటే పరమ వైష్ణవము||

ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి /యెపుడూఁదీర్థప్రసాదేచ్ఛతోడ

నిపుణత శ్రీ వేంకట నిలయుఁడే హతి యని/ప్రవృత్తి గలుగుటే పరమవైష్ణవము||”

భగవంతుడి పట్ల భక్తిప్రపత్తత కలవారికి వైష్ణవం పరమాచారం అన్నాడు. విపరీతాచారాల్ని విడవాలన్నాడు. భగవదపచారమూ, భాగవతులపట్ల అపచారాన్ని వదలాలన్నాడు. ఈ దేవుడా.. ఆ దేవుడా.. ఎవరు గొప్ప? అనే ఆలోచన వద్దన్నాడు. విష్ణువుని నమ్మి రామానుజాచార్యుని నిర్దేశాన్ని తప్పకుండా పాటించేది వైష్ణవం. దురహంకారము, సుఖదుఃఖాల పట్టింపు లేకుండా, మానవ సహజమైన ప్రకృతుల జోలికిపోకుండా, భగవద్ సందర్శన భగవదభిమాన ధర్మాలతో పరిశుద్ధుడుగా ఉండటమే పరమ వైష్ణవం. వేరే ఉపాయాలు, వెదక్కుండా, భక్తితో, తీర్థ ప్రసాదేఛ్చతో శ్రీ వెంకటేశుడే గతి అనే ప్రవృత్తి కలిగి ఉండటం పరమవైష్ణవం అన్నాడు.

తీర్థ ప్రసాదాలు గుడికి వెడితేనే దొరుకుతాయి కాబట్టి తీర్థప్రసాదేచ్ఛ అంటే గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలనే కోరిక.. అని!

“అన్నిటాను హరిదాసులధికులు/కన్నులవంటివారు కమలజాదులకు” సమాజ గౌరవం విష్ణుదాసులకే ననేది అన్నమయ్య అభిప్రాయం.

వెంకటాచల మాహాత్మ్య రచన

1491కి అన్నమాచార్యుడికి అరవై ఏళ్లు ఉండి ఉంటాయి. జియ్యర్ రామానుజయ్యంగారి కోరికమీద తిరువేంకటాచల మాహాత్మ్యాన్ని వినిపించారని స్వామి వారికి కొన్ని ఉత్సవాలు జరపటానికి అవసరమైన ధనం ఇచ్చి స్థానాపతులతో శిలాశాసనాలు చెక్కింపచేసుకున్నారని వేటూరి వారు వ్రాశారు.

“ఆ రామానుజ జియ్యంగారు కవీశ్వరుఁడయిన యున్నమాచార్యునిచే వేంకటాద్రి మాహాత్మ్యమును రచింపించి తన సమర్పణముగా స్వామి సన్నిధిని విన్నపింవఁ గోరియుండవచ్చును” అని ఆయన అభిప్రాయపడ్డారు.

అన్నమయ్య కుమారుడు పెదతిరుమలాచార్యుఁడు తన తండ్రి రచన అనే అభిమానంతో ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని నిత్యం స్వామి సన్నిధిలో చదివించే ఏర్పాటు చేశారట. అందుకోసం అనంతాచార్యులనే భక్తుడికి కొంత జీవిక కల్పించి ఈ బాధ్యత అప్పగించినట్టు వేటూరివారు వ్రాశారు. తిరుపతి శిలాశాసనముల సంపుటి: నెం 95 శాసనము. ​69ని ఉదహరించారు.

“అంతకుఁబూర్వమే యీ స్థలమాహాత్మ్య సముచ్చయము కలదని నిరూపింపఁగల సాధనములు గానరా నంతవఱకు నిది యన్నమాచార్య రచితమని తలఁచుట యసంగతముగాదు” అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.

“పెరియాళ్వారు అంటే, విష్ణుచిత్తుడు తులసీవనంలో జనించిన గోదాదేవిని రంగనాథస్వామి కొసంగి పెండ్లిచేసి మామగా రయినట్లే యన్నమాచార్యులు గూడఁ బద్మసరోవరమున జన్మించిన మంగాంబికను వెంకటేశ్వరస్వామి కిచ్చి పెండ్లిచేసి మామగా రయ్యెను. ఇట్టి మహత్త్వముగలవాఁడు గనుకనే తిరుపతివేంకటేశ్వరస్వామి సన్నిధి నీతనికి, నీతనివంశమునకుఁ గూడ నానాఁ డఖండగౌరవ మల వడినది” అని వ్రాశారాయన.

సామ్యవాదం

అన్నమయ్య సామాజికవాది కూడా! భక్తి వరకూ మాత్రమే ఆయన పరమ వైష్ణవుడు. కానీ సమాజంలో దురాచారాల్ని, మూఢనమ్మకాల్నీ, అసమానతల్ని ఆయన అంగీకరించలేదు. దేవుడు కూడా వాటిని అంగీకరిస్తాడని ఆయన భావించలేదు. అన్నమయ్య ఆలోచనల్లోని సామ్యవాదాన్ని నిరూపించే కీర్తనలు అనేకం ఉన్నాయి. అంటరానితనాన్ని ఖండించే ఈ సంకీర్తనను చూడండి:

“జాతి యిందే దంత్యజాతి యిందేది/జాతు లన్నిటా నాత్మ సర్వేశ్వరుఁడు

ఆతలను అంటుముట్టనెడి భావనలెల్ల/బాఁతిపడి యెఱఁగనోపని వెలితె తనది||

తెలివి గలదాఁకా దెగనిమఱఁగులివి /తెలిసినంతటి మీఁద దీరు సంశయములతీర్చి

యిలలోన శ్రీ వెంకటేశ్వరుని కరుణచే/వెలసి యీ ఙ్ఞానంబు విడువకు మనసా||”

మనుషుల్లో అగ్రజాతి, కడజాతి అందరిలోనూ ఆత్మ సర్వేశ్వరుడు, ఆతల అంటే అవతల అంటుముట్టనే భావనలన్ని బాతి లేదా బ్రాతి అంటే గొప్ప విశేషం అని తెలియకపోవటమే ఆ ప్రభువు వెలితి అంటాడు. తెలిసే దాకా తెగని మరగులివి, తెలిశాక సంశయాలన్నీ తీరి ఈ లోకంలో శ్రీ వెంకటేశ్వరుడి కరుణతో కలిగిన ఈ ‘ఙ్ఞానాన్ని విడవకు మనసా..అంటున్నాడు. సామ్యవాదం అలవడాలన్నా దేవుడి దయ ఉండాలన్నాడు. “భూపాళం ఏకులజుఁ డేమి యెవ్వఁడైన నేమి ఆకడ నాతఁడే హరి నెఱింగినవాఁడు” అంటాడు.

అన్నమయ్య పదప్రయోగాలు

“వ్యావహారికభాషను యథేచ్ఛగా వాడిన అన్నమాచార్యుల కృతులలో వ్యాకరణ చర్చ ఏలబ్బా?” అని సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు అంటే, గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు, “అరసున్నలు శకటరేఫలు స్థానపతితములు ఆస్థానపతిములు దండిగా నుండుటచే ఆ భాషను శిష్టవ్యావహారికగనో గ్రాంథిక సన్నిహితమైన దానిని విమర్శించక ఎట్లుండేది స్వామీ” అని సమాధానం చెప్పారట. అధ్యాత్మసంకీర్తనలు (1998) 2వ సంపుటంలో ఈ విషయాన్ని వ్రాశారాయన. అన్నమయ్య చాలా సందర్భాల్లో వ్యాకరణాన్ని పట్టించుకోలేదని గౌరిపెద్దివారు అనేక ఉదాహరణలు ఎత్తి చూపారు. కొన్ని పదాలను యథేచ్ఛగానే ప్రయోగించారు. కొన్ని ఆయన సృష్టించినవే! అవి నిఘంటువులకు అందవు. కొన్నింటిని మనం ఊహించి భావాన్ని అన్వయించుకోవలసిందే! 32000 కీర్తనల్ని వాటిని ఏరి చూపించటమూ కష్టసాధ్యమే కొన్నింటిని పరిశీలిద్దాం.

వుద్ధగళలీరణకేళి

“అర్పులు బొబ్బలు నవె వినుఁడు/యేర్పడ నసురుల నిటువలె గెలిచె||

కూలిన తలలును గుఱ్ఱపు డొక్కలు/నేలపైఁబారిన నెత్తురులు

వోలి; జూడుఁ డిదె వుద్ధగళలీరణ/కేలిని విష్వక్సేనుఁడు గెలిచె” అనే సంకీర్తనలో ఈ ‘వుద్ధగళలీరణకేళి’ అనే పదం కనిపిస్తుంది.

అరుపులు పెడబొబ్బలు వినండి.. అసురుల్ని ఇలానే గెలిచాడు. కూల్చిన తలలు, గుర్రాల అస్థిపంజరాలు, నేలమీద పారిన నెత్తురు ఇవన్నీ దాగి ఉన్నాయి. వుద్ధగళలు+ ఈ+ రణకేలి= ఉద్ధతి అంటే గర్వం పైన పరమాత్ముడు ప్రకటించిన ఈ రణకేళిలో మహావిష్ణువు సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు గెలిచాడు అని భావం.

పాదచింతకొమ్మ

“ఘన మోహపాశములగాలిఁబొయ్యెడి నాకు/         కొసల నీ పాద చింతకొమ్మయే దిక్కు” గొప్ప మోహపాశాలనే గాలిలో కొట్టుకు పోతున్న నాకు, చివరికి నీ పాదాలను ఆశ్రయించాలనే ఆలోచన ఊతకొమ్మ దొరికిందనేది సారాంశం.

చిత్తాహరి

చిత్తములో ఉన్న హరి, హరి మీద లగ్నం చేసిన మనసు, చిత్తము అనేది తెలిసింది, బుద్ధి వచ్చింది ఙ్ఞానోదయం అయ్యింది అనే అర్థాల్లో తెలుగువారి వాడుకలోని పదమే! చిత్త+ఆహరి= మనసు దోచినవాడు.. ఇలా పరిపరి విధాల మనం ఆలోచించేలా అన్నమయ్య పదప్రయోగా లుంటాయి.

సేనాసాన

“పేరుచున్నవి నాలోనఁ బెక్కువికారములు! వూరుచున్న వెన్నైనా వూహ లెల్లాను! చేరుచున్న వొక్కొక్కటే సేనా సేన కోరికలు! యిదారీతి నున్నాఁడ నాకు నేది గతి యింకను” అనే సంకీర్తనలో సేన, చేన, శాన, సేనా, సెనా అంటే చాలా అని! చాలాచాలా much. Long అనే అర్థంలో సేనాసాన అని ప్రయోగించాడు.

జుంటీగ

“భూమెల్ల మేసినా నాఁబోతుకు బందెలేదు/నేమపు బ్రపన్నునికి నిందలేదు

యీమేర శ్రీ వేంకటేశ్వరుని శరణని/ సోమరి కర్మమంటితే జుంటీఁగ కతవును”

“సోమరి కర్మమంటితే జుంటీఁగ కతవును” అనే వాక్యంలో సోమరి అంటే కర్మల్ని వదిలినవాడు అనే అర్థం తీసుకుంటే, కర్మలు వదిలినవాడు మళ్ళీ కర్మలో పడితే తేనెలో పడ్డ ఈగలాగా తిరుగుతుంటాడనే భావం వస్తుంది. జున్ను అంటే తేనె. జుంటీగ అంటే తేనె టీగ. భూమినెల్లా మేసినా అచ్చోసిన ఆంబోతుని ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే అది తమ గోవులకు పుత్ర ప్రాప్తినిస్తుంది కాబట్టి.

ప్రపన్న అంటే చేరటం. “ఇయం ప్రపన్నా తపసె తపోవనం” అంటే మునులు తపోవనం చేరారని. ఇక్కడ ‘ప్రపన్న’ అంటే భగవంతుని చేరటం అని! నేమపు ప్రపన్నుడు అంటే శరణాగతుడు (one who seeks refuge) అని! భూమంతమేసినా ఆంబోతుకు బందె అంటే, బందీగా పట్టుకుని శిక్షించటం లేనట్టే శరణాగతుడైన భక్తుడికీ నిందలేదంటున్నాడు. శరణాగతులు లోకోపకారులని,వెంకటేశ్వరుని శరణు కోరితే తన సోమరితనాన్ని వదిలి తేనెటీగలాగా తేనెని పంచుతాడని అర్థం.

గడెకుడుక

“..సూర్యచంద్రులనే గడెకుడుకల/ముంచి కొలచి పోసీని మునుకొని కాలము” సూర్యచంద్రుల గమనాన్నే కాలం అంటున్నాం. వారి గమనాన్ని బట్టే రాత్రీ పగలూ ఏర్పడుతున్నాయి. గంటలూ నిమిషాలు, సెకన్లూ ఇలా కాలాన్ని కొలుస్తున్నాం. కాలాన్ని కొలిచే కాలమానిని లేదా గడియారాన్ని అన్నమయ్య గడెకుడక అన్నాడు. బహుశా కుడక అంటే మూకుడు లేదా తట్ట. ఇసుక గడియారం (శాండ్ టైమర్) ఈ గడెకుడక కావచ్చు.

పులుగు

“పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుఁడు నీకు/ తలఁచుకో నేఁడు దాఁచినర్థము”

మా గురుడు నీకు పులుగు చెప్పాడనుకోకు, దానిలో దాచినర్థం తలచుకో అంటున్నాడు ఈ పల్లవిలో. పుళుహు అనే తమిళ శబ్దానికి అబద్ధం అనే అర్థాన్ని గౌరిపెద్దివారు వ్రాశారు. తెలుగులో ఈ పదం ఉన్నట్టు లేదు.

రాచాఙ్ఞ

అన్నమాచార్య చాలా పదాలను అచ్చతెలుగీకరించి ప్రయోగించాడు. ఉదాహరణకు రాచాఙ్ఞ అనే పదాన్ని తీసుకోండి.

రాచాఙ్ఞ మరలింప రాజే కర్త గాన/యేచి నీకు శరణంటి నిది మానుపవే!” అనే పల్లవిలో రాజాఙ్ఞ అనకుండా రాచాఙ్ఞ అనటానికి కారణాన్ని గౌరిపెద్ది వారు “తద్భవశబ్దముతోనే స్వతంత్రముగ సమసించిన సమాసం కావచ్చు” నని వ్రాశారు. రాజాఙ్ఞ అంటే ఫలానా రాజుగారు ఇచ్చిన ఫలానా ఆఙ్ఞ అని! రాచ (lordly) ఆఙ్ఞ అంటే రాచవారి ఆఙ్ఞ. అది మొత్తం రాజపరివారం ఆఙ్ఞ కావచ్చు, ప్రభువు మాటకి, ప్రభుత్వం మాటకి ఎంత తేడా ఉందో రాజాఙ్ఞకీ రాచాఙ్ఞకీ అంత తేడా ఉంది.

పంట వంట

“పరము నిహము పంటవండినయట్టు/యిరవుగాఁదానే యెట్టయెదుట నున్నాఁడు” అనే పల్లవిలో పంటవండినయట్టు అంటే పంటను వండటం కాదు, పంట+పండిన = పంటవండిన అనే అర్థంలో ప్రయోగించాడు అన్నమయ్య.

పరుసం

యెంచీనా అంటే యెంచమంటావా అనే ప్రశ్నార్థకం కాదు. పరుసము అంటే, పరుసవేది-బంగారం తయారు చేయటానికి ఉపయోగించే మూలిక. లోహఁపు గాళికల నెల్ల యెంచీనా” అంటే లోహపు ముక్కల్ని ఇది ఫలానా లోహం అంటూ పరుసవేది ఎంచకుండా అన్నింటినీ బంగారం చేస్తుందని!

కాకిజున్ను

“కాకిజున్ను జున్ను లంటా గంపెఁడేసి తినిపించి/ వా కొలిపి బాలులెల్ల వాపోవఁగా

ఆ కడ శ్రీ వేంకటేశుఁడా బాలుల కంటినీరు/ జోకగ ముత్యాలు సేసెఁ జూడఁగానే నేము”

జున్నని అబద్దం చెప్పి నోరు తెరిపించి, కాకిజున్ను పెడితే పిల్లలంతా వాపోయారు. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆ పిల్లల కన్నీటిచుక్కల్ని జోకగా అంటే సొగసుగా మంచి ముత్యాలు చేశాడట. నాణ్యత లేని నకిలీ వస్తువుల్ని కాకి పేరుతో పిలుస్తారు. కాకి బంగారం కాకి వెండి, కాకి ఎంగిలి ఇలాంటి ప్రయోగాలు తెలుగులో ఉన్నాయి. కాకి జున్నుని ఆయన ఆయుర్వేద పండితుల సాయంతో ముసాంబరం అని గుర్తించారు. కలబంద గుజ్జుని ఎండించి ముసాంబరం చేస్తారు. కటిక చేదుగా ఉంటుంది. పిల్లలచేత తల్లిపాలు మాన్పించటానికి పాలిండ్లకు ముసాంబరం పట్టిస్తారు. అలా, పాలకోసం ఎగబడ్డ పిల్లవాడు ఏడిస్తే, చోద్యంగా కన్నీళ్ళు మంచిముత్యా లయ్యాయనటం ఓ అద్భుతమైన ఊహ.

పెంచు

కంచూఁగాదు పెంచూఁగాదు కడుఁబెలుచు మనసు/యెంచరాదు పంచరాదు యెట్టిదో యీ మనసు

మనసు కంచూ కాదు, పెంచూ కాదు అంటున్నాడు. పెంచు అంటే కుండపెంకు! అది కడు పెళుసైనది దాన్ని ఎంచరాదు, పంచరాదు అంటున్నాడు. ఈ మనసనేది నాలో ఉండే దైవం కూడా కాదంటున్నాడు. దాన్ని కప్పి మూటగట్టడానికి వీలైన ఘనపదార్థమూ కాదు. అలాగని గాలీ కాదు. మాటలు చాలని మహిమల శ్రీ వెంకటేశుని తలచుకుంటే, ఇప్పుడు అన్నింటా గెలిచింది మనసంటున్నాడు.

ఉద్యోగి-సహజి

 “మహినుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు/సహజివలె నుండేమీ సాధింపలేఁడు”

ఈ పల్లవిలో ఉద్యోగి, సహజి అనే రెండు అన్నమయ్య శబ్దాలు మనల్ని పరిపరివిధాల ఆలోచింపచేస్తాయి. ఉద్యోగం అంటే ఒక కార్యాన్ని సాధించే ప్రయత్నం, ఒక వృత్తి, ఒక దాస్యం, ఉద్యోగి ఒక కార్య నిర్వాహకత. ఉద్యోగించటం అంటే కార్యాన్ని నిర్వహించటం. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలా నిష్క్రియాపరంగా ఉండిపోవటం సహజం. అలా కాకుండా పూని ఏదైనా సాధించేవాడుగా ఉండాలనేది అన్నమయ్య నీతి!

వెదకి తలచుకుంటే విష్ణువే కనిపించవచ్చు, పొదలి నడిచితే భూమెల్లా మెట్టి రావచ్చు, చెదరి మరిచితే సృష్టంతా చీక టౌతుందనీ, నిద్రపోతే కాలం నిమిషమై పోతుందనీ అంటాడు.

 ‘కాలము నిమిషమీ తోచటం’ అంటే ఆయుష్షు తీరిపోతుందని! జీవం ఉంటేనే మనిషి తన పరమావధిని తెలుసుకుని సాధించేందుకు తననుతాను ఉద్యోగించుకోవాలంటాడు.

సహజి వలన ఏం సాధిస్తాం? అంతా మిధ్య అనే భావన కన్నా అంతా విష్ణుమయం అనే భావన ఇందులో కనిపిస్తుంది. వేడుకతో అంటే ఇష్టంతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడు కావచ్చు, జాడతో అంటే విచారిస్తూ కూర్చుంటే జడుడౌతాడంటాడు. ఙ్ఞానం అనేది తపస్సు. పరిక్షల్లో తప్పినా నెగ్గినా పట్టు విడవకుండా చదివితే తపసి అవుతాడు. కూడక సోమరి ఆయితే గుణహీనుడౌతాడన్నాడు.

శరణంటే శ్రీ వెంకటేశ్వరుడు రక్షిస్తాడు. అవునా కాదా అంటూ సందేహిస్తే పాషండు డౌతాడు. మనిషి భగవద్కర్యాన్ని నెరవేర్చే ఉద్యోగి కావాలి. అందుకు ఙ్ఞానతపస్సు చేయాలి.

సందడించు

“హరి నీకు నజుఁడు పంచాగంబు వినిపించ/నిరతముగ వాకిటను నిలిచినాఁడు

సురలు నీ యవసరము చూచుకొని కొలువునకు/సరవి నాయిత్తపడి సందడించేరు”

సాక్షాత్తు విష్ణు రూపుడైన వేదవేత్త రోజూ నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి తిథివారనక్షత్రాలను గుర్తుచేస్తున్నాడు. అంటే, రోజులు గడిచిపోతున్న వైనాన్ని హెచ్చరిస్తున్నాడు.

దేవుడి అనుగ్రహం ఉంటేనే దేవుణ్ణి చేరుకోగలుగుతాడు మనిషి. అలాగే దేవతలు కూడా నీ అవసరాన్ని చూసుకుని సరవి అంటే సకాలంలో ఆయిత్తపడి అంటే సర్వసన్నద్ధంగా ‘సందడి’స్తారట. అంటే గుంపులుగా వస్తారని!

తేజి గుర్రము

“..దిట్టయైన చిత్తమనే తేజి గుఱ్ఱమునకు/ వొట్టుక రేవంతుఁ వుపమింప నీవు” మనసు దిట్టంగానే ఉంది అది తేజి గుర్రంలాంటిది. తెలుగులోతేజి అంటే వేగంగా వెళ్ళే ఉత్తమాశ్వం అని! తేజికాశ్వము అనటమూ ఉంది. అలాంటి గుర్రాన్ని అదుపుచేసే రేవంతుడు అంటే అశ్వపాలకుడితో (a horse trainer) నిన్ను పోల్చాలి..” అంటున్నాడు స్వామిని. .

మేఘపుష్పాలు

“మేకొని నీవే నిండు మేఘవర్ణుఁడవుగాన/ నీకు మేఘపుష్పాలే పన్నీరు కాపు” మేఘపుష్పాలంటే మబ్బుల్లో నీళ్ళు. మేఘవర్ణుడవు కాబట్టి నీకు మేఘపుష్పాలే పన్నీటి కాపు” అంటున్నాడు. ఇక్కడ కాపు అంటే Keeping, Protection, guard అని!

కొన్ని ఆమ్రేడితాలు

గతుగతుకు= “యీవల వానగురిసి యేరెంత బంటి వారినా/కావరపు జీవునకు గతుగతుకే” గతుకు+గతుకు=గతుగతుకు కావచ్చునని గౌరిపెద్దివారి వ్యాఖ్యానం.

సాసముఖా= సనుఖ+సముఖ కావచ్చునని గౌరిపెద్ది వారు.

ఏటన్+ఏటన్= నేఁటనేఁట “..గోనేటిలోన తెప్పిరిల్లె నేఁటనేఁట తెప్పతిరుణాళ్ళు” ఏటేటా అనే అర్థంలో నేటనేట అని ప్రయోగం.

నందునందు= “ఇన్నాళ్లు నందునందు నేమి గంటిని/అన్నిటాశరణు చొచ్చి హరి నిను గంటిని” అక్కడక్కడా అని!

ఒకపరికొకపరి= ఒకపరికొకపరి కొయ్యారమై మొకమునం గళలెల్లా మొలచినట్టుండె ||

వేలాది సంకీర్తనల్లో ప్రతీ సంకీర్తనలోనూ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన వాడిన ప్రతీ పదం వెనుక అనంతమైన విశ్లేషణ అవసరమైనంత లోతు ఉంటుంది. వ్యాస పరిమితి కూడా ముఖ్యం కాబట్టి స్పర్శామాత్రంగానే అన్నమయ్య పరిచయం చేసేందుకు చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.

అన్నమయ్య కీర్తనలు వెలుగులోకి

అన్నమయ్య పదసంకీర్తనల్ని అచ్యుతదేవరాయుల అండతో, అన్నమయ్య కుమారుడు పెద తిరుమ్నలాచార్యులవారు రాగి రేకులపై చెక్కించి తిరుపతిలో సంకీర్తనభాండారము అనే అరలో పెట్టించి ఉండకపోతే మనకు ఏ ఒక్క కీర్తన దక్కేది కాదు. దక్కినా అది అన్నమయ్యది అనే సంగతి ఎవరికీ తెలిసేది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాల్లో మొదటగా 1530లోని ఒక శాసనంలో అన్నమాచార్య సంకీర్తనల భాండాగారం ప్రస్తావన కనిపించగా, 1545, 1547, 1554, 1558 సంవత్సరాల నాటి శాసనాల్లో ఈ భాండాగారం ప్రస్తావన ఉందని దేవస్థానం వారు ప్రకటించారు. కాబట్టి పెదతిరుమలయ్య కాలంలోనే అన్నమాచార్య భాండాగారం అక్కడ ఏర్పడిందని భావించవచ్చు. అక్కడ భద్రపరచిన రాగిరేకులలో పెదతిరుమల, చినతిరుమల కవుల సంకీర్తనలు కూడా ఉన్నాయని చెప్తారు.

1922-23 లలో అప్పటి దేవస్థాన అధికారి శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి పూనికతో రాగి రేకుల నుండి పరిష్కరణ ప్రకటన కార్యక్రమం మొదలయ్యింది. వేంకట రమణశాస్త్రులనే తెలుగు పండితుడికి ఈ సంకీర్తనలను కాయితాలమీద ఎత్తిరాసే బాధ్యత అప్పజెప్పారు. కొంత పని జరిగాక సుబ్రహ్మణ్యశాస్త్రిగారిని వేరే చోటుకి బదిలీ చేయటంతో ఆ పని అక్కడితో ఆగిపోయింది ఆయన అప్పటిదాకా ఎత్తివ్రాసిన కాయితాల్ని కొన్ని చెక్క పెట్టెల్లో ఉంచారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోలేదు.

తరువాత కె సీతారామరెడ్డి గారు కమీషనర్ గా వచ్చినప్పుడు దేవస్థానం శాసన పరిష్కర్త పండిత విజయరాఘవాచార్యుల చేత ఈ కృషిని కొనసాగింప చేశారు. 1935లో తొలి ప్రచురణగా ‘తాళ్లపాక కవుల లఘుకృతులు’ గ్రంథాన్ని వెలువరించారు. 1936లో ఆధ్యాత్మసంకీర్తనలు, 1937లో శృంగార సంకీర్తనలు వెలువడ్డాయి.

తాళ్ళపాక వంశానికి చెందిన చినతిరెవెంగళనాథ (చిన్నన్న) రచించిన మూడు ద్విపద కావ్యాలు, అస్టమహిషీకళ్యాణం, ఉషాకళ్యాణం, పరమయోగి విలాసం గ్రంథాలు 1937-38లలో ప్రచురణ అయ్యాయి.

1939లో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యపరిశోధన సంస్థని ఏర్పరచారు. మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి తెలుగు పరిశోధకులుగా ఇందులో పనిచేశారు. 1940-41లో శ్రీ వేంకటేశ్వర సంస్కృత పాఠశాలని తి.తి.దే వారు శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యకళాశాలగా మార్పుచేసి, తెలుగు హిందీ తమిళభాషల్లో విద్వాన్ పట్టాలు ఇచ్చే కళాశాలగా రూపొందించారు. ఈ కళాశాలలో కొంతకాలం వేటూరి వారు తెలుగు శాఖాధ్యక్షులుగా కూడా పనిచేశారు. తాళ్లపాక కవుల వాఙ్మయం పై విశిష్ఠ పరిశోధనకు వేటూరి వారు పూనుకున్నారు.

1945లో వేటూరివారు తాళ్లపాక పెదతిరుమలాచార్యుల వైరాగ్య పదగీతాల్ని తిరుమలలో ఉన్న రాగిరేకుల్లోంచే కాకుండా తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలో ఉన్న వాటిని కూడా కలిపి 1945లో ‘వైరాగ్యవచన మాలికలు’ అనే గ్రంథాన్ని ప్రచురించారు.

విజయరాఘవాచార్యులవారి కృషిని కొనసాగిస్తూ ‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు’ మరో సంపుటంగా ప్రకటించారు. 1950లో అన్నమాచార్య ఆధ్యాత్మిక సంకీర్తనల 5వ సంపుటాన్ని తెచ్చారు. చిన్నన్న రచించిన అన్నమాచార్య చరిత్ర ద్విపద 47 పుటల గ్రంథానికి 133 పేజీల పీఠికతో విపుల పరిశోధనాగ్రంథంగా వెలువరించారు. శ్రీ వెంకటేశ్వర లఘుకృతులు పేరుతో వివిధ కవులు వివిధ సందర్భాల్లో వ్రాసిన కృతుల్ని ప్రచురించారు.

వేటురి వారి తరువాత అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారు 1951లో ప్రాచ్యపరిశోధనా సంస్థ పక్షాన 101 నుండి 150 వరకు ఉన్న రాగి రేకుల్లో ఉన్న 234 సంకీర్తనల్ని 6వ సంపుటంగా ప్రచురించారు. ఇందులో 121 నుండి 130 వరకూ 10 రేకులు దొరకలేదని ప్రకటించారు. 1951-52లలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారితో కలిసి ఆధ్యాత్మిక 7, 8 సంపుటాల్ని, 1961లో శృంగార సంకీర్తనల 14వ సంపుటాన్ని వెలువరించారు. తితిదే నుండి విశ్రాంతి పొందిన తరువాత కూడా రాళ్లపల్లి వారు అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనలు 9, 10 సంపుటాల్ని 1952లోనూ, 11వ సంపుటాన్ని 1955 లోనూ శృంగార సంకీర్తనలు 12, 13 సంపుటాలనూ ప్రచురించారు, ఉత్సవగాయకుల కోసం రాళ్లపల్లి వారు 150 పాటలతో ‘అన్నమాచార్య సంకీర్తనలు’ పుస్తకాన్ని ప్రచురించారు.

శ్రీనివాసాచార్యులుగారు 1961లో అన్నమయ్య శృంగార సంకీర్తనలు 15వ సంపుటాన్ని, 1962లో శృంగారాధ్యాత్మిక కీర్తనల 16వ సంపుటాన్ని వెలువరించారు.

రాళ్లపల్లి వారు విశాంతి పొందాక వారి స్థానంలో శ్రీ పి టి జగన్నాథరావుగారిని పరిశోధకులుగా నియమించారు. ఆయన 1964లో ఆధ్యాత్మిక కీర్తనల 18, 19, 20 21సంపుటాల్ని 1964-1975 మధ్య కాలంలో వెలువరించారు. అన్నమాచార్యుల కుమారుడు పెద తిరుమలయ్య వ్రాసిన ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనల్ని1976లో 21, 22, 23 సంపుటాలుగా వెలువరించారు. వారి తరువాత శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 1977లో 24,25 సంపుటాలను వెలువరించారు.

1978లో అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థీకృతం అయ్యింది. అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించిన సంగీతవేత్తలు, పరిశోధకుల కారణంగా అన్నయమయ్య పదాలు జనసామాన్యాన్ని చేరటం ఆరంభం అయ్యింది.

1979లో అన్నమాచార్య వాఙ్ఞయ పరిష్కరణ శాఖని శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ అధ్యక్షతన 1979-83 మధ్య కాలంలో ప్రారంభించారు. రాగి రేకుల్ని రసాయనాలతో శుద్ధి చేయించారు. మరో 50 యేళ్ళ వరకూ అవి పదిలంగా ఉండేలా బాగు చేయించారు. అన్నమయ్య కీర్తనలు 26,27, 28, 29, 30 సంపుటాలను వెలువరించారు.

1998లో కొత్తగా 1వ సంపుటం నుండి 30వ సంపుటందాకా వరుసక్రమాన్ని మార్పు చేశారు. ఉదాహరణకి ఆధ్యాత్మ సంకీర్తనలు 10,11 సంపుటాలు 4వ సంపుటంగా వచ్చాయి. 12, 4, 11,14, 15 సంపుటాలుగా వెలువడిన శృంగార సంకీర్తనలు 5, 6, 7, 8, 9 సంపుటాలుగా వెలువడ్డాయి. 16వ సంపుటిగా వెలువడిన ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలు 10వ సంపుటంగా వెలువడింది. మొత్తం 35 సంపుటాలు 29 సంపుటాలుగా వెలువడ్డాయి. తరువాత 100 రేకుల్ని ఒక సంపుటంగా మార్పు చేయటాన ఈ తేడా వచ్చింది.

శ్రీయుతులు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, పి టి జగన్నాథరావు, గౌరిపెద్ద రామసుబ్బశర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు చేసిన శేముషీ కృషి అన్నమయ్య కీర్తనలు వెలుగులోకి రావటానికి కారణం. సాహిత్యాభిమానం, సంగీతాభిమానం కలవారికి ఈ ఏడుగురూ ఏడు నక్షత్రాల్లా ప్రాతఃస్మరణీయులు. సింగరాజు సచ్చిదానందంగారు, ఆచార్య కె సర్వోత్తమరావుగారు, ఆచార్య ఎం శ్రీమన్నారాయణమూర్తి ప్రభృతుల సేవలు అపురూపమైనవి.

చివరిగా ఒక మాట

పన్నిద్దరు ఆళ్వారులు తమిళభాషలో మన సీసపద్యాల్లాంటి 4,000 సంకీర్తనలు రచిస్తే వాటిని ద్రావిడ వేదం అనీ, పంచమాగమం అనీ దివ్యప్రబంధం అనీ విష్ణు భక్తులు కీర్తిస్తుంటారు. అన్నమయ్య వెంకటేశ్వరుడి మీద భక్తితో తానొక్కడే 32000 కీర్తనల్ని రచించాడు. భగవంతుడికీ భక్తుడికీ పతిపత్నీ, నాయికా నాయక భావాల్ని, కల్పించి శరణాగతి మహత్మ్యాన్ని వివరించి, నామ మహిమని చాటి విష్ణుతత్త్వ రహస్యాన్ని సామాన్యులక్కూడా అర్థం అయ్యేలా విడమర్చి చెప్పిన భక్తాగ్రేశ్వరుడు అన్నమయ్య.

ఆ మహనీయుడికి చాలినంత గౌరవం అందిస్తున్నాం అని గట్టిగా చెప్పలేం. వైష్ణవంలో తమిళ ఆధిపత్యం కొంత ఇందుకు అవరోధం కావచ్చు. అన్నమయ్య అధ్యయనం ఇంకా విస్తృత స్థాయిలో జరగాలని అనేకులు కోరుకుంటున్నారు. అన్నమయ్యది భక్తి సాహిత్యమే అయినప్పటికీ, ఆయన రచనలు సామాజిక వేదం అనదగినవి. అన్నమయ్య సాహిత్యంలో సామాజిక అంశాలు, భాష, సాహిత్యం సంస్కృతి పరమైన అంశాలు కొల్లలుగా ఉన్నాయి. వాటి అధ్యయనం చాలా అవసరం. విశ్వవిద్యాలయాలు అన్నమయ్య తమకు సంబంధం లేని విషయం అనుకోవటం విచిత్రం.

వేటూరి ప్రభాకర శాస్త్రిగారు అన్నమయ్య సంకీర్తనల గురించి వ్రాస్తూ, “దివ్యప్రబంధరచనల కివి తీసిపోవు. దేశ ప్రజాదౌర్భాగ్యముచే నివి వెలసిననాఁటనుండి నేఁటిదాఁక రహస్యరక్షలో నున్నవే కాని రాణ కెక్కవయ్యెను” అనే వాక్యాలు చదివినప్పుడు మనసు చివుక్కు మంది. రక్షణ ఇవ్వటం అంటే మూసి దాచి ఉంచటం కాదు విశ్వవ్యాప్తి కల్పించగలగాలి. అది వెంకటేశ్వరుని భక్తిని పెంచే చర్యలో భాగమే!

“నే నొక్కండ లేకుండితే నీకృపకుఁ బాత్ర మేది? వూని నావల్లనే కీర్తిఁ బొందేవు నీవు” అనగలిగిన భక్తుడు అన్నమయ్య. ఆయన కీర్తిని నిలబెట్టవల్సిన బాధ్యత మనది. మనందరిది.

Exit mobile version