[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘పదహారేళ్ళ వయసు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
మధ్యాహ్నం మూడు కావస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న నలభై అయిదేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుధాకర్, చేసే కంప్యూటర్ పని ఆపి వంటింట్లోకి వెళ్లి, కాఫీ కలుపుకొని విశ్రాంతిగా సోఫాలో కూర్చుని తన పర్సనల్ కంప్యూటర్‌లో ఆత్మీయ మిత్రులతో ఉన్న ఆన్‌లైన్ గ్రూప్ తెరిచాడు. ఎదురుగా తన మిత్రుడు రవి ఎంతో భావుకత్వంతో రాసిన ఒక చిన్న అనుభూతుల వ్యాసం కనబడింది. చదవడం మొదలు పెట్టాడు.
‘అవి కౌమారం దాటి లేలేత యవ్వనంలో అడుగుపెడుతున్న కాలేజీ రోజులు. రంగురంగుల సీతాకోకచిలకల మధ్య తిరుగుతున్నంత ఉత్సాహంగా ఉండేది. సినిమాలంటే పిచ్చి ఇష్టం కూడా! అందులో అందంగా ఉండే హీరోయిన్స్‌ని ఎంతసేపు చూసినా తనివి తీరేది కాదు. సినిమా పత్రికలలో వచ్చే వాళ్ల కలర్ ఫొటోలని కట్ చేసి దాచుకుని మళ్ళీ మళ్ళీ చూసుకునే వాళ్ళం. సరిగ్గా అప్పుడు వచ్చిన సినిమా ‘పదహారేళ్ళ వయసు.’ ఆ సినిమాలో ఆ చెరువు సీన్లో నటించిన కుర్రాడితో, ప్రతి కుర్రాడూ తాదాత్మ్యం చెందాల్సిందే! అలా ఒకో సినిమా మనల్ని కలల ప్రవాహంలో మునకలేస్తూ ఈదేట్లు చేసేది. ఆ రోజుల్లో వచ్చిన ఈ సినిమా గుర్తుందా ఫ్రెండ్స్! చూసిన రోజు మన ముగ్గురికీ జ్వరం వచ్చినంత పనయ్యింది కదా! ఒక్కసారి ఈ పాట చూడండి. మనం మళ్లీ మన పదహారేళ్ల ఇంటర్‌కి వెళ్లకపోతే నామీదొట్టే!’
అది చదివి, రవి పెట్టిన ఆ సినిమాలో పాట చూస్తూ ఉండిపోయాడు సుధాకర్. కాఫీ చల్లారిపోయింది. ఆ పాట మూడున్నర నిమిషాలే అయినా, దాన్ని మళ్ళీ మళ్ళీ మొదటినుండీ చూస్తూ అతను స్పృహలోకి వచ్చేసరికి ఒక గంట గడిచింది. ఆ పాట ఇంటర్ ఫస్టియర్ చదువుతూ ఉండగా తన మిత్రులు రవి, బాబ్జీ, రాంబాబులతో కలిసి చూసిన సినిమాలోనిది. ఆ పాటని, ఇంట్లో ఒంటరిగా చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా అనిపించి, సుధాకర్ తన కాలేజీ రోజులకు వెళ్లిపోయి ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టుగా ఉండిపోయాడు. కాలేజీలో అమ్మాయిల్ని గట్టిగా తలెత్తి చూడడానికి మొహమాట పడేవాళ్లు అబ్బాయిలు. ఏ అమ్మాయైనా పలకరిస్తే తలవంచుకొని జవాబు చెప్పేవాళ్ళు ఆ పిల్ల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలన్న ఉత్సుకతను తొక్కిపెట్టి. అప్పుడు వాళ్ళ ఊరికి వచ్చిన సినిమా అది.
ఒక ఊరిలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటారు. ఆ ఊరి చెరువులో, పిల్లలకి స్నానాలు చేసే అలవాటు. ఒకరోజు వాళ్ళిద్దరూ స్నానం చేస్తుంటే ఎందుకో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరూ మిగిలిపోతారు. ఆ అమ్మాయి ఎప్పటిలాగే లంగా, జాకెట్‌తో స్నానం చేసి, వెళ్ళిపోబోతుంటే ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడతారు. దగ్గరగా చూసిన ఆ అబ్బాయి తొలిసారిగా ఆమెలో ఒక యవ్వనవతిని చూస్తాడు. చిన్నప్పటినుండీ తెలిసిన ఆ అమ్మాయి ఇప్పుడతనికి కొత్తగా కనిపిస్తుంది. అద్భుతమైన అందం ఆ అమ్మాయిది. ఆ సందర్భంగా ప్రేమ మత్తు కలిగించే ఒక బ్యాక్‌గ్రౌండ్ పాట వస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షింపబడే క్రమంలో నీళ్లలోనూ, పక్కనే ఉన్న తోటలోనూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకుంటూ ఉండగా ఆ పాటని కాస్త మోతాదు మించి తీశాడు కొత్త దర్శకుడు. ఆ సినిమా తర్వాత అతను ప్రముఖ దర్శకుడైపోయాడు. ఆ అమ్మాయిని మరీ ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేశాడతను. సినిమాసూపర్ హిట్టయ్యింది.ఎందుకో ఆ అమ్మాయి మళ్లీ నటించలేదు. సుధాకర్ మిత్రబృందం ఆ సినిమాని ఆడినన్ని రోజులూ, అన్ని ఆటలూ చూశారు. ఆ పాట ఉన్న సీన్ వచ్చేప్పటికి వెళ్లి పాట పూర్తి కాగానే వెళ్ళిపోయేవారు. ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చాయి సుధాకర్ కి.
ఆ సినిమాలో ఈ పాట ఎలా సెన్సార్ నుంచి తప్పించుకుందో గానీ సినిమా మొత్తం తనలాంటి కుర్రకారుని సీట్లో నుంచి లేచి నిలబడి చూసేట్టు చేసింది.ఆ పాట గురించి, రవి రాసిన రైటప్ ఎంత బావుందో! సుధాకర్ కాఫీ వేడిచేసుకుని తాగి, రవికి ఫోన్ చేశాడు “ఆ పాటనీ, ఆ రోజుల్నీ భలే గుర్తుచేసావురా! అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి పాటలు పెట్టడం వల్లనేరా యాభై దగ్గర పడుతున్నా మనం ఇంకా యూత్‌లా ఫీలవుతున్నాం. ఇలాంటి పోస్టింగ్స్ చూసినప్పుడు ఆనాటి మన థ్రిల్స్ గుర్తొచ్చి తిరిగి విద్యార్థులుగా మారిపోతున్నట్టుగా అనిపిస్తుందిరా. ఎనీ హౌ థాంక్స్ రా!” అన్నాడు సుధాకర్.”బాబ్జీ, రాంబాబు కూడా ఇలాగే ఫీలయ్యారు. ఈ ఆదివారం మనం పార్టీ చేసుకోవాల్సిందే!” అన్న రవి మాటకి “తప్పకుండారా! మేమే నీకిస్తాం!” అని నవ్వుతూ ఫోన్ పెట్టేసాడు సుధాకర్. ఒకే ఊరి వాళ్లయిన ఆ నలుగురూ ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లోనే ఉద్యోగాలు చేస్తున్నారు.
***
“రోజు ఉదయాన్నే గంటసేపు జిమ్‌కి వెళ్లడం వల్ల అలసిపోతున్నావేమో!” బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర ముచ్చెమటలతో వచ్చి, తను దారిలో వస్తూ తెచ్చిన టిఫిన్స్, ప్లేట్స్‌లో పెడుతున్న భార్య మాలతిని ఉద్దేశించి అన్నాడు సుధాకర్. “ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటాం! అందంగా ఉంటేనే యంగ్‌గా కనబడతాం!” జవాబిచ్చింది మాలతి.
“అవును డాడీ! నేను అమ్మ స్కూల్‌కి వెళ్తే మీ సిస్టర్ క్లాసులో ఉన్నారు. వెయిట్ చేయండి అంటారు వీళ్ల స్కూల్లో.” అంది నవ్య నవ్వుతూ. కూతురు వైపు మెచ్చుకోలుగా చూస్తూ, మెరుపు కళ్ళతో భర్త వైపు చూసింది మాలతి. “అవునవును నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వెయిట్ పెరుగుతున్నాను. మీరిద్దరూ అక్కచెల్లెళ్ళు! నేను మీ ఇద్దరికీ డాడీని కదరా! నవ్యా” అన్నాడు సుధాకర్.ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు.
ఆ రోజు రాత్రి శుక్రవారం డిన్నర్ చేస్తుండగా అన్నాడు సుధాకర్. “మాలా! ఎల్లుండి ఆదివారం కదా! మనం రాబోయే ఉగాదికి మన ముగ్గురం బట్టలు కొనుక్కొని లంచ్ చేసి ఒక మ్యాట్నీ సినిమాకి వెళదామా!” అన్నాడు ఉత్సాహంగా. ఆనందంతో నవ్య గొంతులోంచి “వావ్!” అన్న ఆనందపూర్వకమైన శబ్దం వచ్చింది. “నో.. నో.. నో.. ఎల్లుండి నాకు స్కూల్ ‘యాన్యువల్ డే’ ఫంక్షన్స్‌కి సంబంధించిన రిహార్సల్స్ ఉన్నాయి” అంది మాలతి. ఏదో అనబోయిన సుధాకర్, భార్య కళ్ళలోని అభ్యర్థనను గుర్తించి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.
తండ్రి తల్లిని ఒప్పించడం కానీ, మరొక రోజు వెళ్దాం అనడం గానీ చెయ్యకపోవడంతో నవ్యకి ఏడుపొచ్చింది. వెంటనే ఇద్దరూ ఆ విషయం వదిలేసి, మరేదో సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడంతో అక్కడి నుంచి దిగాలుగా లేచి వెళ్ళిపోయింది.
“ఏంటి మాలా? ఏదో ఆ స్కూల్ నీదే అన్నట్టు పని చేస్తావు” అన్నాడు సుధాకర్.
“నేను భరతనాట్యం నేర్చుకున్న డాన్సర్‌ని, నటిని, సింగర్‌ని అనే కదా, మా ప్రిన్సిపాల్ మేడమ్ నాకు మిగిలిన టీచర్స్ కన్నా ఎక్కువ జీతం ఇచ్చి, రోజూ స్కూల్‌కి తీసుకెళ్లి, తీసుకురావడానికి కారు కూడా పంపుతోంది! ఇలా అవసరమైనప్పుడు నేనామెకు హెల్ప్ చెయ్యకపోతే ఎలా?నువ్వు అన్నీ తెలిసి కూడా ఏదో ఒకటి మాట్లాడుతావు” అని భర్తపై చిరాకు పడింది మాలతి. “పోనీ మీ ఇద్దరూ వెళ్లొచ్చు కదా!” అన్న భార్య మాటకి, “నువ్వు లేకుండానా! బేబీ ఏదో ఓటీటీ మూవీ చూసుకుంటుందిలే ఆ రోజు. నేను బైటికి వెళతాను” అంటూ లేచాడు సుధాకర్.
***
తర్వాతి నెలలో, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ఓ మిత్రుడు వినోద్ తక్కువ రేటులో ఏవో స్థలాలు కొనిపెడతాను రమ్మంటే శనివారం బయలుదేరి సూర్యాపేట వచ్చాడు సుధాకర్. ఆ రాత్రి వినోద్ మిత్రులతో ఒక పార్టీ అయ్యాక పడుకుని ఆలస్యంగా లేచి, ఊరికి చాలా దూరంగా ఉన్న, ఆ స్థలాలు చూడడానికి బయలుదేరారు. ఇంతలో వినోద్‌కి ఫోన్ రావడంతో అరగంటలో వస్తానని వెళ్ళాడు. ఒక హోటల్లో కూర్చుని టీ తాగుతున్నాడు సుధాకర్. సమయం ఉదయం పదవుతోంది. అప్పుడతనికి, నర్మద అనే ఓ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది.
“నేను ఇక్కడి ఎమర్జెన్సీ వింగ్ ఆపరేటర్ ని మాట్లాడుతున్నాను. మీరు సుధాకర్ గారేనా ? మీ అమ్మాయి పేరు నవ్య కదా! మీ భార్య మాలతి కదా?” అంటూ అడిగింది ఒకమ్మాయి. “అవునండి” అన్నాడు. “సుధాకర్ గారూ! మీ అమ్మాయి గత రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. మా హాస్పిటల్ లోనే ఉంది. ప్రమాదం తప్పింది లెండి. ఆమెకు సెలైన్ ఎక్కిస్తున్నారు. వెంటనే రండి. ఈ నెంబరు మీ భార్య ఇచ్చారు.” అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఒక్క క్షణం అతని బుర్ర పనిచేయడం మానేసింది. మతి పోయినట్లుగా పిచ్చి చూపులు చూసాడు. కొన్ని సెకండ్లకి తేరుకున్నాడు. జేబులోంచి వంద రూపాయలు నోట్ తీసి టీ కప్పు కింద పెట్టి, పరుగు పరుగున కారెక్కి హైదరాబాద్ బయలుదేరాడు.
ఎలా డ్రైవ్ చేశాడో అతనికే తెలీదు. తన చిన్నారి కూతురు, మిడ్డీలు, స్కర్ట్‌లు వేసుకుని తన ఒడిలో కూర్చుని డాడీ, అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి గారాలుపోయే తమ బంగారుతల్లి నవ్యకు ఆత్మహత్య చేసుకోవలసిన అవసరమేంటి? ఇంటర్ చదువుతున్న పదహారేళ్ల తన పాపాయికి కష్టాలా? అవి ఆత్మహత్య చేసుకునే అంతగానా! అసలు ఈ కాల్ తనది కాకపోతే ఎంత బాగుండును! మాలతి ఫోన్ చెయ్యవచ్చుగా! బహుశా తను కూడా షాక్‌లో ఉండిపోయి మాట్లాడలేకపోయి ఉంటుంది. ఆగమేఘాల మీద ఆ ఆస్పత్రికి చేరుకున్నాడు సుధాకర్. రిసెప్షన్‌లో అడిగి ఎమర్జెన్సీ వార్డ్‌కి పరుగు తీశాడు.
గత నెల తన పుట్టినరోజుకి “ముగ్గురం లీవ్ తీసుకుని ఇంట్లో ఉందాం డాడీ! నువ్వు దమ్ బిర్యాని, మంచూరియా ఆర్డర్ చెయ్. అమ్మ సేమియా చేస్తుంది. అమ్మ ఆ రోజు నాకోసం చీర కట్టుకోవాలి” అంటూ అడిగిన తమ ప్రాణమైన చిన్నారి కూతురు నవ్య, హాస్పిటల్ బెడ్‌పై ఉండడం నిజమేనా? ‘ఇదేమైనా పీడకల కాదుకదా!’ అన్నట్టు మతిలేని దానిలా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని బెడ్ పై ఉన్న కూతురి వైపు చూస్తోంది మాలతి.
రొప్పుతూ వచ్చిన భర్తను చూసి గబుక్కున లేచి, “ఉదయం ఎనిమిదయ్యాక లేపబోతే ఎంతకీ లేవలేదు. మంచం మీద మా అమ్మ నిద్రమాత్రలుంటే భయమేసి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కవరేజ్ ఏరియాలో లేరు అని వస్తోంది. కాళ్ళూ చేతులూ ఆడలేదు. కూడదీసుకుని ఆస్పత్రికి తీసుకుని వచ్చాను. డాక్టర్ వెంటనే చూసి ట్రీట్‌మెంట్ మొదలెట్టారు. ప్రాణభయం లేదు. టాబ్లెట్లు ఎక్కువ వేసుకోలేదు అన్నారు” అని ఏడుపు ఆపుకుంటూ, భర్తకు చెప్పడానికి ఎంతో ప్రయాసపడుతూ, భర్త దగ్గరకు తీసుకున్నాక తేరుకుంది మాలతి.
నవ్యని, మరో రెండు రోజులు హాస్పిటల్‌లో ఉంచి మరికొన్ని పరీక్షలు చేశారు. భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి “యువార్ లక్కీ! అంతా నార్మల్ గానే ఉంది. ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నారు. అర్థం పర్థం లేని సినిమాలొస్తున్నాయి. స్టూడెంట్స్ ప్రపంచమూ, నేటి సమాజమూ కూడా విపరీతంగా ఉంటోంది. ఈ వయసు పిల్లలకి తల్లితండ్రుల ప్రేమ, స్నేహం, దగ్గరితనం చాలా అవసరం, అందునా ఒక్కతే, తోబుట్టువులు లేని పిల్ల. గుర్తు పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్!” అన్నాడు డాక్టర్. ఇద్దరూ ఆయనకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పారు.
మాలతీ, సుధాకర్ నవ్యని ఆనందంగా ఇంటికి తీసుకొచ్చారు. మిగిలిన వారం శలవు పెట్టుకున్నారు. వచ్చిన వెంటనే ముగ్గురికీ కాఫీ తీసుకొచ్చింది మాలతి. ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ స్నానం చేయమని చెప్పి తను స్నానం చేసి దీపారాధన చేసి వంట చేసి ముగ్గురికీ వడ్డించింది. భోంచేశాక ముగ్గురూ ఒక డబుల్ కాట్ మీద పడుకున్నారు. ఎప్పటిలాగే మధ్యలో నవ్య పడుకుంది. నవ్య కొంచెం నీరసంగా ఉన్నా, ఇంటికొచ్చి మంచం మీద పడుకున్నాక ఆమె కళ్ళలో కాస్త రిలీఫ్ కనబడింది. కొంతసేపటి మౌనం తర్వాత సుధాకర్ నెమ్మదిగా “ఏంటి బేటా ఇది?” అన్నాడు గొంతులో దుఃఖాన్ని నొక్కిపెట్టి. వెంటనే తండ్రి వైపు తిరిగి అతని భుజంపై తల దాచుకుంది నవ్య మాట్లాడలేనట్టు.
మాలతి ఆమె వీపు మీద మృదువుగా రాస్తూ “చెప్పరా బంగారు తల్లీ!” అంది. ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. నవ్య మరో రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా నోరు విప్పింది. “ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఆయుష్ ఇంటికి వెళ్లాను. పూణేలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే తన కజిన్ రాకేష్ వచ్చాడు. అతను మా ఇద్దరికీ పెంట్ హౌస్ టెర్రస్ గార్డెన్‌లో మంచి మంచి పోజులు పెట్టించి ఫోటోలు తీశాడు. ఇంతలో ఆయుష్‌కి ఫోన్ కాల్ రావడంతో లోపలికి వెళ్ళింది. అప్పుడు రాకేష్ తన కెమెరాతో నా పక్కకు వచ్చి నిలబడి, నా భుజం మీద చేయి వేసి ఒక సెల్ఫీ తీశాడు. నేను షాక్ అయ్యి “అదేంటి మనిద్దరికీ ఎందుకు ఫోటో తీశారు? డిలీట్ చేయండి” అన్నాను. అతను గట్టిగా నవ్వి “కూల్ బేబ్! ఇదిగో డిలీట్ చేసేస్తున్నా!” అన్నాడు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. కానీ నాకు చాలా భయమేసింది అతను నా ఫోటోని డిలీట్ చెయ్యకుండా ఎక్కడైనా షేర్ చేస్తాడేమో! అని.”
“చేస్తే ఏమవుతుంది?” నవ్వుతూ అన్నాడు సుధాకర్.
“ఆ ఫోటో చూపించి మిమ్మల్నిద్దర్నీ డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తే?”
“అలా ఏమీ చెయ్యరు కన్నా!” అనునయంగా అన్నాడు.
“అది ఎవరెవరైనా చూడొచ్చు కదా? మన బంధువులు గాని ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ?”
“నథింగ్ విల్ హాపెన్ మొద్దూ!” కూతురి వీపు మీద కొట్టి నవ్వుతూ అంది మాలతి. నవ్య తల్లి వైపు తిరిగి ఆమె గుండెల్లో తలపెట్టుకుంది. నవ్య తలనిమురుతూ ఉండిపోయిందామె నీళ్ళు నిండిన కళ్ళతో.
ఆ రాత్రి ఇద్దరి మధ్యా పడుకుంది నవ్య. “ఆ టాబ్లెట్స్ నీకు ఎక్కడివి నాన్నా? అసలు ఎందుకు నీకు అవి వేసుకోవాలని పించింది?” లాలనగా నవ్య జుట్టు సర్దుతూ అడిగాడు సుధాకర్.
“ఆ టాబ్లెట్లు నేను అమ్మమ్మ కోసం మందుల షాపు నుంచి తెస్తూ ఉండేదాన్ని. అవి అమ్మమ్మ కబోర్డ్‌లో మర్చిపోయి వెళ్ళిపోయింది. నువ్వు ఊరికి వెళ్ళిన రాత్రి నేను ఓటిటీలో ఒక మూవీ చూశాను. అందులో ఒక అమ్మాయి ఫోటోలోని మొహాన్ని తీసుకుని మార్ఫింగ్ చేసి, ఇంకో అబ్బాయి పక్కన పెట్టి ఆమె ఫ్యామిలీలో అందరికీ పంపుతాడు ఒకడు. అప్పుడు అందరూ ఆమెను అనుమానిస్తారు. వాళ్ళ అమ్మానాన్నా కూడా ఆ అమ్మాయిని నమ్మరు. ఇంకా ఏదో చాలా కథ ఉంది. నాకు భయమేసి కట్టేసాను. ఆ సినిమా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి రాత్రి రెండయినా నిద్ర పట్టలేదు. అమ్మేమో నిద్రపోతోంది. అమ్మను లేపడం ఇష్టం లేదు. నాకు బాగా నిద్ర పట్టాలని ఆ టాబ్లెట్లు ఎన్నో చూడలేదు వేసేసుకున్నా! అందుకే ఇలా అయ్యింది. సారీ అమ్మా! సారీ డాడీ! మీ ఇద్దరికీ చాలా టెన్షన్ అయింది.”
“టెన్షన్ అవ్వడం కాదే! నీకు ఏదైనా అయితే మేము ఏమైపోవాలే?” ఆపై మాట రాలేదు మాలతికి దుఃఖంతో. కూతురితో పాటు భార్యను కూడా దగ్గరకు తీసుకున్నాడు సుధాకర్.
“నాకు మా కాలేజీలో రాగింగ్ కొంచెమే ఉన్నా, నన్నెవరైనా ఏడిపిస్తారేమో అని నాకు భయంగా ఉంటుంది. గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను కదా, అందుకే అబ్బాయిలు పలకరిస్తే దడగా ఉంటోంది. నా హైస్కూల్ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా ఈ కాలేజ్‌కి రాలేదు.నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు తెలుసా!” నవ్యలో గూడుకట్టుకున్న దిగులు మాటల్లో బైటపడింది.
“నీ భయాలన్నీ అమ్మకి గానీ, నాకు గానీ చెప్పొచ్చు కదరా!” అన్నాడు సుధాకర్.
“అమ్మేమో ఎప్పుడూ స్కూల్లో పంద్రాగస్టు అనీ, ఛబ్బీస్ జనవరి అనీ, యాన్యువల్ డే అనీ బిజీగా ఉంటుంది. అవి లేకపోతే ఫ్రెండ్స్‌తో కిట్టీ పార్టీలుంటాయి. మీకేమో వీకెండ్ పార్టీలుంటాయి. మీరు ఇద్దరూ బిజీగానే ఉంటారు. నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? నా బెస్ట్ ఫ్రెండ్ ఆయుష్ ఒక్కతే కదా! తన కజిన్ గురించి ఆ సెల్ఫీ సంగతి ఎలా చెప్పగలను? అందుకే చెప్పకుండా నేనే టెన్షన్ పడ్డాను.”
“ఇక నుంచీ నేనే నీ బెస్ట్ ఫ్రెండ్! నీ భయాలన్నీ నాకు చెప్పాలి.” కూతురి చెంపలు నిమురుతూ అన్నాడు సుధాకర్. “నేను కూడా నీ బెస్ట్ ఫ్రెండ్‌నే” అంది మాలతి కూతురి చెవి రింగ్స్ సర్దుతూ. ఇద్దరి దగ్గరా చేతిలో చెయ్యి వేయించుకుని ప్రామిస్ తీసుకుని, ఇద్దరి పైనా చెరో చెయ్యి వేసి బోర్లా పడుకుంది నవ్య. భార్యాభర్తలిద్దరూ కూతుర్ని తీసుకుని నాలుగు రోజులూ వరసగా ఫిలిం సిటీ, యాదాద్రి, గండిపేట, గోల్కొండ వెళ్లారు. అలా వారం గడిచింది.
ఆ ఆదివారం సుధాకర్ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్ర లేచేసరికి, ఇస్త్రీ చీర కట్టుకుని స్కూల్‌కి తయారై బాక్సులు, స్నాక్స్ కవర్లు సర్దుతూ అటు ఇటూ పరుగులు తీస్తోంది మాలతి. సోఫాలో తీరికగా కూర్చున్నాడతను, చేతులెత్తి ఒళ్ళు విరుచుకుంటూ. ఇంతలో నిద్ర లేచి వచ్చిన నవ్య, తల్లి నడుం చుట్టూ చేతులు వేసి, ఆమె గుండెల్లో తలపెట్టుకొని “నేను కూడా కాలేజీకి వెళ్ళనా?” అంది గోముగా.
“వెళ్ళాలి కదా నాన్నా! నీ బాక్స్ రెడీ! బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ! చకచకా తయారవ్వు” అన్న తల్లి మాటలకి నవ్య బాత్రూంలోకి వెళ్ళింది. లేచి మొహం కడుక్కుని కాఫీ తాగుతూ, పేపర్ చూస్తూ ఉన్న సుధాకర్ కి తల్లీ,కూతురూ నవ్వుతూ ‘బై’ చెప్పి వెళ్లిపోయారు. తర్వాత టేబుల్ ముందు కూర్చుని తన పర్సనల్ కంప్యూటర్ ఓపెన్ చేసాడు. అతని చెయ్యి తగిలి, వారం క్రితం రవి పెట్టగా తమ మిత్రబృందం చూసి ఆనందపడిన ‘పదహారేళ్ళ వయసు’ సినిమాలోని పాట ఆటోమేటిగ్గా ప్రారంభమైపోయి రావడం మొదలు పెట్టింది. చిత్రంగా, ఆ పాట సుధాకర్‌లో ఎటువంటి స్పందననీ కలిగించలేదు ఈ రోజు. ముప్ఫయి సంవత్సరాలుగా, గుర్తొచ్చినప్పుడల్లా, పదే పదే తన నూతన యవ్వనాన్ని గుర్తుచేస్తూ మురిపింపచేసిన, ఆ సినిమా పాటలోని అందాల హీరోయిన్ మొహం, ఇప్పుడు అచ్చం తన కూతురి మొహంలా అనిపించింది సుధాకర్‌కి.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.