[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘పసిఫిక్ సముద్ర తీరాలు’ అనే రచనని అందిస్తున్నాము.]
భూగోళంపై ఉన్న ఏడు ఖండాలలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఖండం యెక్క అధికారిక నామం ‘కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా’. ప్రపంచంలోని దేశాలలో ఈ ఆస్ట్రేలియా ఆరవ స్థానాన్ని ఆక్రమించుకున్నది. ఆస్ట్రేలియా దేశం హిందూ మహా సముద్రానికీ, పసిఫిక్ మహా సముద్రానికీ మధ్యలో ఉన్నది. ఆస్ట్రేలియా తన చుట్టు పక్కన ఉన్న ద్వీపాలతో కలిసి ఒక సమాఖ్యగా మారింది. ఈ దేశ రాజదాని ‘కాన్బెర్రా’. ఈ ద్వీప సముదాయం మిగతా ప్రపంచంతో విడిపోయి ఉంటుంది. లక్షల సంవత్సరాల నుంచే మిగతా దేశాలకు ఆస్ట్రేలియా దూరంగా ఉండడం వల్ల ఇక్కడ జీవ వైవిధ్యం ఎక్కడా లేని విధంగా ఉంటుంది. ఇటీవల ద్వీపకల్పమైన భారతదేశం నుండి ఆస్ట్రేలియా ద్వీపాన్ని చూడటానికి వెళ్ళాము. సిడ్నీ నగరంలో ఉన్నాము. ముప్పై ఏళ్ళ క్రితం నా ఒక్కగానొక్క తమ్ముడు చదువుకోవడానికి ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్కు వెళ్ళాడు. ప్రపంచ పటంలోని చాలా చిన్న ఖండానికి వెళ్ళాడనీ, అమెరికాలో సీటు రాలేదనీ చుట్టాలు చెవులు కొరుక్కున్నారు. చదువు పూర్తవగానే అందరూ కోరుకున్నట్లుగానే యువత కలల రాజ్యమైన అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడు. మా కుటుంబాలన్నింటి లోనూ తొలి సారిగా అమెరికా వెళ్లి స్థిరపడిన వాళ్ళలో మొదటివాడు మా తమ్ముడు.
జంతువులవులన్నింటిలో అత్యంత వైవిధ్యంగా తన పిల్లలను పొట్ట సంచిలో పెట్టుకుని పెంచే కంగారూలు ఆస్ట్రేలియా దేశంలో ప్రత్యేకంగా పెరుగుతాయి. ఆస్ట్రేలియన్లను ‘కంగారూలు’ అని పిలిచే సంప్రదాయం కూడా ఉన్నది. మేము కూడా ఎప్పుడెప్పుడు కంగారూలను చూస్తామా అని ఆస్ట్రేలియా దేశంలో దిగిన దగ్గర నుంచీ ఎదురు చూస్తూనే ఉన్నాం.
ఆస్ట్రేలియా వైశాల్యంలో పెద్దగా ఉంటుంది కానీ ఇక్కడ నివసించే జనాభా చాలా తక్కువ. ఎందుకుటే మిగతా భూమి ఎడారిగా ఉంటుంది. ఇక్కడున్న పెద్ద పట్టణాలన్నీ సముద్ర తీరానికి ఆనుకునే ఉన్నాయి. జీవితంలో తొలిసారిగా పసిఫిక్ సముద్రాన్ని చూసి నేను ఉద్వేగానికి లోనయ్యాను. అతి పెద్దదీ, లోతైనదీ అని చిన్ననాటి పాఠాలలో చదువుకున్న పసిఫిక్ సముద్రాన్ని చూసి సంబరపడ్డాను. సిడ్నీ నగరంలో పసిఫిక్ మహా సముద్ర తీరంలో కాళ్ళు పెట్టి మురిసిపోయాం!
సిడ్నీ నగరంలో హోటల్లో దిగాక టూరు బస్సుల్లో సిటీ టూరు తిరిగాము. రెడ్ లైన్, బ్లూలైన్ బస్సుల్లో ఊరంతా తిరిగి చూశాము. రెడ్ లైన్ బస్సులో ఆస్ట్రేలియా మ్యూజియం చూశాక సిడ్నీ బీచ్‌కు వెళ్ళాము. సిడ్నీలో దిగిన దగ్గర నుంచీ వర్షాలే. బీచ్ దగ్గరకు వెళ్ళడానికి రోడ్డు దాటి వెళుతుంటే ఈదురు గాలులు భరించలేకపోయాం. వర్షం కూడా సన్నగా పడుతూనే ఉన్నది. మఫ్లర్ మెడకు చుట్టుకుని, తల మీద టోపీలు పెట్టుకుని బీచ్‌కు వెళ్ళే సరికి విపరీతమైన గాలులున్నాయి. ఒకరిద్దరి గొడుగులు ఎగిరిపోయాయి. మేము కూడా ఎగిరిపోతామేమో అని భయం వేసింది. ఇక్కడ తెల్లని ఇసుకతో బీచ్ అందంగా ఉన్నది. నురగలతో అలలు పైకి లేస్తూ మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. ఈ అలల్ని గాలుల్నీ వీడియో తీసుకున్నాం. కానీ చలి మాత్రం తట్టుకోలేకపోయాం. బీచ్ లో ఎక్కువగా జనాలు లేరు. బహుశా ఈదురు గాలులకు భయపడి రాలేదనుకుంటా. బీచ్ పరిశుభ్రంగా ఉన్నది. తెల్లని నురగలతో నీళ్ళు ఉరకలేసుకుంటూ వస్తున్నాయి. మేము వేసుకున్న కోట్లు గాలికి ఎగిరిపోతూ రక్షణ ఇవ్వడం లేదు. జుట్టు కూడా పైకి లేచి ఎగురుతూ ఉన్నది. ఫోటో కోసమైనా ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వటం లేదు. వర్షాల వల్ల ఇలాంటి ఈదురు గాలులున్నాయో లేక ఎప్పుడూ ఇలాగే ఉంటుందో తెలియదు. కానీ మేమైతే ఎక్కువ సేపు బీచ్‌లో నిలబడలేక పోయాం. ఒక్క అరగంటలో ఫోటోలన్నీ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాం. పసిఫిక్ మహా సముద్రం తన అలలతో పలకరిస్తున్నా ఎక్కువ సేపు ఉండలేకపోయాం.
మహా సముద్రాలన్నింటిలో పసిఫిక్ మహా సముద్రం అతి పెద్దదైనదీ, అత్యంత లోతైనది. అని పాఠాలలో చదువుకొనటమే గానీ ఇప్పటి వరకూ చూడలేదు. ‘మేర్ పసిఫికమ్’ అనే పేరును ఈ మహా సముద్రానికి పెట్టారు. ఫెర్డినాండ్ మాగిల్లాన్ అనే పోర్చుగీసు నావికుడు ఈ పేరును పెట్టాడు. ‘మేర్ పసిఫికమ్’ అనే పేరుకు లాటిన్ భాషలో ‘ప్రశాంతమైన సముద్రం’ అని అర్థమట. భూగ్రహం మీద పరుచుకున్న అనంత జలరాశిలో పసిఫిక్ మహ సముద్రమే ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది. భూమధ్యరేఖ దగ్గర విడిపోవటం వలన ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహ సముద్రం అనే రెండు భాగాలుగా ఏర్పడినాయి. పసిఫిక్ మహా సముద్రపు సగటు లోతు నాలుగు వేల మీటర్లు. కాలేజీలో ఉన్నపుడు జికె ప్రశ్నలలో ‘పసిఫిక్ సముద్రం లోతు ఎంత?’ అని అడిగేవారు. ఇప్పుడు సముద్రాన్ని చూస్తుంటే ఇవన్నీ గుర్తుకోస్తున్నాయి.
పసిఫిక్ కూడా సముద్ర కాలుష్యానికి గురి అవుతున్నది. ఎరువులుగా వాడే రసాయనాలు వాగులు, నదుల నుంచి సముద్రాల లోకి చేరి అనర్థాలను సృష్టిస్తాయి. రసాయనాల వలన ఆక్సిజన్ క్షీణించి ‘హైపాక్సియా’ ఏర్పడుతుంది మానవులు సృష్టించిన వ్యర్థాలు నీటిలో తేలుతూ తీర ప్రాంతాలలో పేరుకుపోతాయి. పసిఫిక్‌లో అణు వ్యర్థాలు కూడా ఎన్నో చేరుతున్నాయి. ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి రేడియో ధార్మికత గల వ్యర్థాల వలన సముద్రంలో నివసించే జలచరాలకు ముప్పు కలుగుతుంది.
న్యూజిలాండ్ దేశంలోని పసిఫిక్ తీరంలో నల్లని ఇసుక మట్టి కలగలిసి నట్లున్నది. కాలు వేస్తే లోపలికి దిగపడేలా అన్పించింది. చాలా పక్షులు తీరంలో ఎగురుతూ కన్పించాయి. కొన్ని పావురాలు దగ్గరకు వచ్చి నిలబడుతున్నాయి. కొన్ని పక్షులు అత్యంత తెల్లగా, నారింజ రంగు ముక్కు, నారింజ రంగు కాళ్ళతో ఉన్నది. నారింజ రంగు అని అనకూడదేమో! గులాబీ నారింజ రంగుల మిశ్రమంలా కన్పించింది. తీరపు నేల నల్లగా ఉన్నదీ. దాని మీద ఈ ధవళ వర్ణపు పక్షుల్ని చూస్తే చాలా బాగుంది.
న్యూజిలాండ్ దేశంలోని పసిఫిక్ బీచ్‌లో ‘కాంప్ఫైర్’లు అమర్చబడి ఉన్నాయి. రాత్రి పూట బహుశా ఆ మంటలు వెలిగించుకుంటారేమో. మేమైతే ఉదయమే వెళ్ళాము. బీచ్ మొత్తం బోలెడు షాపులున్నాయి. టోపీలు, స్వెట్టర్లు అమ్ముతున్నారు. చాలామంది రకరకాల టోపీలు కొనుక్కున్నారు, నేను కొనుక్కోలేదు. మామూలుగా చలిని ఆపేటందుకు మంకీ క్యాప్ పెట్టుకున్నాం. కానీ ఫ్యాషన్‌గా ఉండే మహారాణుల టోపీలు బాగున్నాయి. నేను ఇంతకు ముందు వేరే దేశాలు వెళ్ళినపుడు మహా రాణుల టోపీలు కొనుక్కున్నాను. వాటిని పెట్టుకుని ఫోటోలు కూడా తీసుకున్నాను.
ఈ బీచ్‌లో కాళ్ళు తడపకుండా వచ్చేద్దామని ఫోటోలకు పోజులిస్తున్నాము. మరి సముద్రం ఊరుకుంటుందా! ఇంకా వేగంగా పరిగెత్తుకొచ్చి నా కాళ్ళను తడిపేసింది. పసిఫిక్ సముద్రమంటే చాలా ఇష్టమని అందరికి చెప్పి ఇప్పుడు తడవకుండా వెళతావా అన్నట్లుగా నన్ను చిలిపిగా చూసింది. అలాగే మహాసాగరా! అంటూ నమస్కరించి నీళ్ళు నెత్తిన చల్లుకున్నాను. చెక్కల్ని క్యాంప్పైర్లా అమర్చిన చోట డాక్టర్లందరం నిలబడి ఫోటోలు తీసుకున్నాం. మంటలు లేవు కాబట్టి ఆ క్యాంప్‌ఫైర్ మధ్యలో ఖాళీగా ఉన్నది. అక్కడ చిన్న పిల్లల్ని కూర్చో బెట్టి వాళ్ళ ఆటపాటల్ని ఫొటోల్లోనూ, వీడియోల్లోనూ కొంత మంది భద్రపరచుకున్నారు. ఈ తీరంలో చదునుగా గుండ్రంగా ఉన్న రాళ్ళు దొరుకుతున్నాయి. ఎంత నున్నగా ఉన్నాయంటే ఆడపిల్ల బుగ్గలంత నున్నగా ఉన్నాయి. నేను పది రాళ్ళు దాకా ఏరుకుని తెచ్చుకున్నాను. ఇంత మంచి కానుక నీకు ఇద్దామంటే దూరం నుంచీ పొటోలు దిగేసి వెళతానంటావేమిటి, అన్నట్లుగా చూసింది పసిఫిక్ సముద్రం. నా సాక్సులు, బూట్లు తడిచి పోతాయని తప్ప నాకూ పసిఫిక్ నీళ్ళలో గెంతాలని ఉన్నది. సాయంత్రం మరలా రావచ్చని అనుకున్నాం గానీ సముద్రపు అలలు ఊరుకోలేదు. ఇంత ప్రేమ నాపై ఎందుకో తెలుసా! నేను పుట్టిన చీరాలలో బంగాళాఖాతం సముద్రం ఉన్నది. నా చిన్ననాటి ఆటలన్నీ అక్కడే కదా! అందుకే బంగాళాఖాతం “మా అమ్మాయిని బాగా చూసుకో” అని పసిఫిక్ కు చెప్పి పంపింది. చీరాలలో మా ఇల్లు సముద్ర తీరానికి కిలో మీటరు దూరంలోనే ఉంటుంది. మా ఇంటి చుట్టు పక్కలంతా తెల్లని ఇసుక మేటలే.
బీచ్ నిండా షాపులున్నాయి అని చెప్పాను కదా! పాపుల్లోపల కెళ్ళి చేస్తే ‘స్టోన్ ఆర్ట్’ ఎంత అద్భుతంగా ఉన్నదో. బాగా గమనించి చూస్తే సముద్ర తీరంలో దాగిన రాళ్ళమీద పెయింటింగులు వేస్తున్నారు. అయితే నేను కూడా ఇంటికి వెళ్ళి పెయింటింగ్ చెయ్యవచ్చని అనుకున్నాను. నా చేతిలోని రాళ్ళు నాకు అందమైన కాన్వాసులుగా కనిపించాయి. అలా నడుస్తుండగా రోడ్డు మీద చిన్న లేడి బగ్ పురుగు కనిపించింది. కిందికి వంగి చూస్తే అది కూడా స్టోన్ పెయింటింగ్. ఎవరి సంచి నుంచో జారిపడింది అనుకుంటాను. దాన్ని చేతిలోకి తీసుకొని కొద్దిసేపు చూశాను. ఎవరూ రాలేదు. ఇది కూడా సముద్రం నాకిచ్చిన బహుమతి అనుకుని దానికి బ్యాగులో వేసుకున్నాను. ఎర్రటి రంగులో మెరిసిపోతున్న లేడీ, బగ్ పసిఫిక్ సముద్రం నుంచి మా ‘మిల్కీ మ్యూజియం’ కు చేరింది.
స్టోన్ ఆర్ట్‌కు సంబంధించి ఇంతకు ముందే ఎన్నో బొమ్మలు తయారు చేశాను. చిన్న చిన్న గవ్వల మీద చాలా పెయింట్లు చేశాను. ఆసుపత్రి సింబల్స్, వ్యాధుల చిహ్నాలు, మామూలు ప్రకృతి చిత్రాలు వేశాను. ప్రవాళాల మీదా పగడాల మీదా ఎన్నో చిత్రాలు వేశాను. గవ్వల్ని అతికించి జంతువుల బొమ్మల్ని చేశాను. నాగార్జున సాగర్ దగ్గర దొరికే గవ్వలతో చిన్నప్పుడు పిల్లి, కుక్క బొమ్మల్ని చేశాను. మహాబలిపురం దగ్గర దొరికిన గవ్వలతో సీలింగ్‌కు వేలాడదీసే షాండ్లియర్ చేశాను. నేను చిన్నది తయారు చేశాను. హాస్పిటల్ కోసం పెద్ద షాండ్లియర్‌ను మహాబలిపురం నుంచి కొనుక్కోచ్చాను. గవ్వలు అతికి డోర్ కర్టెన్ను తయారు చేశాను. అల్చిప్పల మీద చక్కని పెయింట్ వేసి దుకాణల్లో అమ్ముతున్నారు. అంతే కాక సముద్రంలో దొరికే రాళ్ళతో సావనీర్లా తయారు చేసి అమ్ముతున్నారు. జెమ్స్‌తో జ్యుయలరీ కూడా అమ్ముతున్నారు. ఆల్చిప్పల గాజులు, లోలాకులు లాకెట్లు చాలా బాగున్నాయిు. కానీ కొనడానికి సమయం మిగల్లేదు. ప్రతి సముద్రం దగ్గరా దొరికే గవ్వల్లో వైవిధ్యం ఉంటుంది. నేను చేసే చిత్రాలు కూడా వైవిధ్యంగానే ఉటాయి నాకిలా అన్ని రకాల సముద్ర గవ్వలతో బొమ్మలు చేసి ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు బాటిల్ ఆర్ట్, హాస్పిటల్ వేస్ట్, హౌస్ వేస్ట్, చెట్ల ఆకులతో రకరకాల ఎగ్జిబిషన్లు పెట్టాను. అన్ని సముద్రాల గురించి రాసిన వ్యాసాలతో పుస్తకం కూడా వెయ్యాలనుకుంటున్నాను.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.