Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేటి యువతకు ప్రేరణనిచ్చే నవల ‘పచ్చబొట్టు’

[శ్రీమతి సి. సుజాత గారి ‘పచ్చబొట్టు’ అనే నవలని సమీక్షిస్తున్నారు డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి.]

1965లో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీమతి సి.సుజాత ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలలో సబ్‌ఎడిటర్‌గా, హారతి మాసపత్రిక మేనేజింగ్ ఎడిటర్‌గా, స్నేహ, సెల్యూట్, రైతుసేవ పత్రికలకు ఎడిటర్‌గా కళ్యాణమస్తు, సందడి డాట్ కామ్‌లకు కంటెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. వాస్తవిక రచయిత్రి అయిన సి. సుజాత గారి కలం నుండి జాలువారిన ఆణిముత్యం వంటి రచన ఈ ‘పచ్చబొట్టు’ నవల.

ఇవాళ ప్రపంచం అంతా డిజిటల్ రంగం మీదే ఆధారపడి సాగుతుంది. అందరి జీవితాల్లోనూ ఇది ఒక విడదీయరాని బంధంగా మారిపోయింది. ఏ వస్తువు కావాలన్నా బయటికి వెళ్ళి దుకాణాలు తిరిగి తిరిగి వెదికి కొనే అవసరం లేదు. ఇంట్లో ఉండే యాప్ తెరచి కావలసిన వస్తువును ఆర్డర్ పెడితే చాలు. మన గుమ్మం తలుపు తట్టి అది మన ఇంటిలో చేరిపోతుంది. ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధిని కల్పించింది. ఈ రంగంలో స్త్రీలు కూడ బాగా రాణిస్తున్నారు. తమ ఆకాంక్షలను సాకారం చేసుకోగలుగుతున్నారు. తమ తమ అభిరుచుల మేరకు, వారిలోని సృజనాత్మకతకు, కళకు పదునుపెట్టి వెబ్‌సైట్‌ల ద్వారా, యాప్‌ల ద్వారా ప్రచారం చేసుకోగలుగుతున్నారు. స్త్రీలు స్వతంత్రతకు, ఆర్థిక స్వావలంబనక. ఎంత శ్రమ పడటానికైనా సిద్ధంగా ఉన్నారు.

ఈ వాస్తవ పరిస్థితిని ఆధారం చేసికొని, అవకాశాలను అందిపుచ్చుకొని ఒక కంపెనీ స్థాపించి తాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటమే కాక మరో పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించగల స్ధాయికి ఎదిగిన ప్రభాత అనే యువతి ప్రస్థానం ఈ నవలలో ఇతివృత్తం. పర్యావరణానికి హాని కలిగించని ఎకోఫ్రెండ్లీ వస్తువుల వివరాలను యాప్‌ల ద్వారా అందరికీ అందించి, వాటినే కొనుగోలు చేసే విధానంగా ప్రయత్నించిన పర్యావరణ ప్రేమికురాలుగా ప్రభాత ఈ కధలో చిత్రింపబడింది. మరో మహిళ విమల. కళాశాలల్లో ఉత్సాహవంతులైన విద్యార్ధులలోని అభిరుచులను వెలికితీసి వారిలో ఆసక్తిని పెంపొందింపచేసి, అప్పటికే వ్యాపార రంగంలో గణనీయమైన ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకున్న వారిని పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువతను ప్రోత్సహిస్తుంది. విమల తాను సాధికారత సాధించే క్రమంలో ఎంతో పోరాటం సాగించింది. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎటువంటి రీతులలో జీవనోపాధి సంపాధించుకోవచ్చో నిరూపించిన నవల ఇది.

ప్రభాత ప్రపంచవ్యాప్తంగా ఎకోఫ్రెండ్లీ వస్తువులు ఏవేవి ఎక్కడెక్కడ తయారు చేయబడుతున్నాయో పరిశోధించి ఆ సంస్థలతో పరిచయం చేసుకుంటుంది. చాలా ప్రదేశాలు తిరుగుతుంది. వాటిని గురించిన అవగాహన కలిగించటానికి ‘లోటస్’ అనే యాప్‌ను స్వయంగా రూపొందించింది. 1570 రకాల వివిధ ఉత్పత్తులను తన వెబ్‌సైట్ ద్వారా ప్రమోట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత వస్తువుల వ్యాపారాన్ని విస్తరింపచేసింది. ప్రపంచాన్ని కలుపుతూ పెద్ద బిజినెస్ చేసింది. గ్లోబలైజేషన్‌కి అసలైన అర్థం చెప్పింది. ఉదాహరణకు కంబోడియాలో తయారు చేసిన కలువపూల కాండం నుండి తీసిన దారంతో నేసిన స్కార్ఫ్ గురించి, ప్రచారం చేసింది. ‘గోగ్రీన్ కాన్సెప్ట్’ను కూడ జనుల దగ్గరకు తీసుకువెళ్ళే ప్రచారం చేపట్టింది. అంటే పైనాపిల్, వెదురు వంటి మొక్కలతో తయారైన నూలుతో బ్యాగ్‌లు, బట్టలు, చెప్పులు, తమిళనాడులో అరటి బోదెల నారతో తయారుచేసే వస్తువులు, ఇటువంటివి పర్యావరణానికి హాని కలిగించని అనేక వస్తువులను తన యాప్ ద్వారా వ్యాప్తి చేసింది. పుత్తూరులో శేఖర్ అనే వ్యక్తి 25 రకాల నారలతో చీరకొంగును తయారుచేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన అంశాన్ని వివరిస్తుంది. అలాగే వేగాన్ లెదర్‌తో బ్యాగులు, బెల్టులు, ఎకోఫ్రెండ్లీ చీరలు, వెదురు సిల్క్ చీరలు, పట్టు చీరలు ఎకోఫ్రెండ్లీ వస్తువులు ఏం కావాలన్నా తన యాప్‌లో ఆర్డర్ చేస్తే చాలు అని బి.టెక్. విద్యార్ధులకు ప్రేరణ కలిగించింది. వారిలో కొత్త ఆలోచనలను అంకురింపచేసింది. బి.టెక్ విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు ప్రాణం పోసింది.

ప్రభాత ఒక సాహస యువతి. ఆమె చేసే వ్యాపారానికి తండ్రి ఏమాత్రమూ సహకరించడు సరికదా, ఆ పనులు వదిలి హాయిగా పెళ్ళి చేసుకోమని, ఆమెలో నిరుత్సాహం నింపే ప్రయత్నం చేస్తాడు. ప్రభాత ఇది నాకు ఇష్టం. ఇది నా కంపెనీ. ఇది నా నిర్ణయం అని సూటిగా, స్పష్టంగా ప్రకటించిన విధానమూ, నిజాయితీతో కూడిన పరిశ్రమ, నేటి నిరుద్యోగ యువతకు ఒక ఆశాకిరణంగా మలచినారు రచయిత్రి సుజాత గారు. చాలా అద్భుతమైన ఆలోచనలు (Amazing ideas) ఈ నవల ద్వారా రచయిత్రి యువతలో రేకెత్తించారు. ఉద్యోగం ఎవరో ఇవ్వాలని, ప్రభుత్వం ఆదుకోవాలని నిరీక్షిస్తూ కూర్చోక స్వయంకృషితో సృజనాత్మకమైన ఆలోచనలే పెట్టుబడిగా యువత నుండి ఎంతో మంది స్టార్టప్‌లు అవతరించటానికి ఈ నవల స్ఫూర్తి కలిగిస్తుంది.

ఈ నవలలో మరోకోణం ఏమిటంటే అత్యంత బలహీనమైన, వెనుకబడిన కులంలో పుట్టిన వరహాలరాజు అనాథాశ్రమంలో తిండికి, గుడ్డకు పూర్తిగా నోచుకోక అనేక కష్టాలను ఎదుర్కొంటూ ప్రభాత స్థాపించిన కంపెనీకి సిఇఓ గా నియమింపబడిన స్ధాయికి ఎదిగిన వృత్తాంతం. సమాజంలో ఉన్నత వర్గాల వారమని చెప్పుకొనే వారు అంటరానివాడని నోటితో చెప్పకనే ప్రవర్తనలో ప్రదర్శిస్తారు. కుల వివక్షను, వర్గ వివక్షను చిరునవ్వుతో ఎదుర్కొంటూ తన గమ్యం తాను చేరే ప్రస్ధానం వరహాలరాజుది. తన తెలివితేటలు తన కఠోర పరిశ్రమతోనే అందరికీ సమాధానం చెప్పగలిగాడు.

వరహాలరాజు తండ్రి సత్యం చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తాను చేయని తప్పుకు దొంగగా ముద్ర వేయించుకున్నాడు. తన దారిలోని ముళ్ళని ఏరిపారేసి ఎత్తు పల్లాలు సరిచేసి ఒక బాటను నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆ దారిని చక్కగా స్వీకరించి రాజు సద్వినియోగం కావించుకున్నాడు. తాను నడిచివచ్చిన మార్గాన్ని విస్మరించలేదు. తాను పుట్టి పెరిగిన పల్లెలో తన వలె వివక్షను ఎదుర్కొంటూ, దైన్యంతో కాలం గడుపుతున్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే అవకాశం కల్పించాడు. తన కోసం అవమానాలు దిగమ్రింగిన తండ్రిని గౌరవించిన ఉత్తమ సంస్కారి రాజు. నవల ముగింపులో రాజు తన తండ్రితో పలికిన పలుకులు ప్రతి యువకులు మననం చేసుకోవలసిన పలుకులు.

‘‘నాన్నా! ఇసుకలోంచి నూనె పిండావు. నువ్వు వేసిన రహదారి పైన నడిచి వెళ్ళటానికి నాకేం కష్టం కలిగింది? దారే లేని చోట నీ కాళ్ళకు ఎన్ని గాయాలో తగిలి ఉంటాయి.. నాకు నడకైనా రాకముందే నా భవిష్యత్తు చూడగలిగావు. ఇంతకంటే అద్భుతమైన రోజులు ఇంకేముంటాయి నాన్నా!”

సమాజంలో ప్రతివ్యక్తి నిబద్ధతతో, నిజాయితీతో తన జీవితాన్ని మలచుకోగలిగినప్పుడు సమాజ సంక్షేమం తప్పక జరుగుతుంది. ఇదే నేటి యువతకు అవసరమైన ప్రేరణ, ప్రోత్సాహం.

***

పచ్చబొట్టు (నవల)
రచన: సి. సుజాత
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్,
పేజీలు: 100
వెల: ₹ 120
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/PACHHA-BOTTU-C-SUJATHA/dp/B0B88BDPHX

 

Exit mobile version