Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాట్లు

[శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి రచించిన ‘పాట్లు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

రామారావు గోవిందయ్యగారింట్లో అద్దెకుండటం మొదలు పెట్టి అప్పుడే ఐదేళ్ళు గడిచిపోయింది.

గోవిందయ్య మంచివాడేగానీ, రామారావులాంటి జగజ్జంత్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం తిక్కవాడని కూడా అనిపిస్తాడు. రామారావు, భార్య సంధ్య పెళ్ళయిన కొత్తల్లో కొత్త కాపురం గోవిందయ్యగారింట్లోనే మొదలు పెట్టారు. రెండేళ్ళు గడిచేసరికి కొడుకు పుట్టాడు. ఇంకో ఏడాదికి అతను చేస్తున్న ఈవెంట్స్ మేనేజ్‌మెంట్ రంగంలో అభివృధ్ధి సాధించి కారు కూడా కొన్నాడు. జగజ్జంత్రీ అయిన రామారావుకి కొంచెం సెంటిమెంట్ పాలు కూడా ఎక్కువే. ఆ ఇంట్లే చేరిన దగ్గరనుంచీ అంతా కలసి వస్తోందని భావించాడు. కానీ గోవిందయ్య దగ్గర మాత్రం ఆ ఇంట్లో తనకి కలసి వచ్చిందనే నమ్మకాన్ని దాచిపెట్టి తను ఎదుగుతున్నాడు గనుక గోవిందయ్యకి మొదట్లో ఇచ్చిన గౌరవం ఇవ్వటం మానేశాడు. తాను గొప్పవాడిననే అహంభావం ప్రదర్శించేవాడు.

అతని భార్య సంధ్య కూడా కొంచెం బధ్ధకస్థురాలు. ఇల్లు నీట్ గానే వుంచేది కాదు. ఎప్పుడూ అద్దెకిచ్చిన ఇంట్లో అడుగు పెట్టని గోవిందయ్య, నాలుగేళ్ళ తర్వాత ఒక రోజు ఎందుకో రామారావు పోర్షన్ లోకి వెళ్ళి ఆ ఇంటి పరిశుభ్రత చూసి అది తన ఇల్లేనా అని ఆశ్చర్యపోయాడు.

ఇంటి నిండా తాళ్ళు కట్టి దానిమీద బట్టలు ఆరేసినవో, ఉతకాల్సినవో తెలియకుండా వేళ్ళాడుతున్నాయి. వంటింట్లో సింక్ నిండా అంటు గిన్నెలు ఎన్నాళ్ళనుంచి వున్నాయో కొంచె చెడు వాసన రావటం మొదలు పెట్టాయి. గోడల నిండా మరకలు. ఇల్లు అద్దెకిచ్చే ముందే రంగులు వేయించి ఇచ్చాడు. ఆ రంగులు ఏ రంగు వేశారో కూడా గుర్తుపట్టటానికి వీలు లేకుండా గోడల నిండా మరకలు.

“అదేంటమ్మా?” అంటే “మిక్సీ వేస్తుంటే పచ్చడి పడ్డదండీ” అన్నది వంటింటికీ హాల్ కీ మధ్యలో వున్న మసిగుడ్డలాంటి కర్టెన్‌ని నైటీ మీద కప్పుకుంటూ.

“మిక్సీకి వేరే పాయింట్ వుంది కదా?” అంటే, ‘అది సరిగ్గా పని చెయ్యటం లేదం’ది.

అప్పుడు చూశాడు నేల మీద తను వేయించిన టైల్స్ మధ్యలో అతికించినట్లు పెట్టిన సిమెంటు వుండలని.

“ఇదేంటమ్మా టైల్స్ ఎలా పగిలాయి. నాకు చెప్పచ్చుగా” అన్న గోవిందయ్యకి

“మొన్న మంచం లాగుతుంటే ఇక్కడ టైల్స్ పగిలాయి. ‘అంతకుముందు ఎలుకలు తవ్విపోస్తున్నాయంటే మందు పెట్టండి’ అన్నారుట కదా. మీరేమీ చేయించనన్నారని ఆయనకి వచ్చినట్లు రిపేర్ చేశారు మళ్ళీ ఆ పగుళ్ళు పెద్దవవుతాయని.”

గోవిందయ్యకి మతి పోయింది. తను ఇంటిని ఎప్పటినుంచో అద్దెకి ఇస్తున్నాడు. ఇంత ఛండాలంగా ఎవరూ పెట్టలేదు. అద్దె పెంచమంటే ఈ నెల నుంచీ, వచ్చే నెల నుంచీ అంటూ ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. పైగా అద్దె ఏ నెలా సరైన సమయానికివ్వడు. ఎన్నోసార్లు చెప్పి చూశాడు. తాను రిటైర్డ్ ఎంప్లాయీనని, ఈ అద్దెలే తమకి ఆధారమనీ. రామారావు అతి వినయంగా సమాధానం చెప్పేవాడు. బేంక్‌కి వెళ్ళటానికి సమయం కుదరలేదనీ, ఫోన్ పే అయితే వెంటనే చేస్తాననీ. గోవిందయ్యకి అద్దె డబ్బు రూపంలో చేతికి వస్తే తాము వాడుకోవటానికి వీలుగా వుంటుంది గానీ ఫోన్ పే అంటే తమ దైనందిన ఖర్చులన్నీ ఫోన్ పే తో కావు కదా అనే ఇబ్బంది. కానీ రామారావు కావాలని చేసేవాడో ఏమోగానీ ఫోన్ పట్టుకుని వచ్చేవాడు.

ఒకసారి గోవిందయ్యకి వళ్ళు మండి “సరే అదే చెయ్యి, నా తిప్పలు నేను పడతాను” అన్నాడు. అలా చేస్తే రామారావు జగజ్జంత్రీ ఎందుకవుతాడండీ. అద్దె డబ్బుల్లో కొంత ఫోన్ పే చేసి, బేలన్స్ లేదు, ఇంట్లో కేష్ వుంది, తెచ్చిస్తానని వెళ్ళేవాడు. మళ్ళీ గోవిందయ్యకి ఒక అర డజను సార్లు ఫోన్ చేశాక ఆ డబ్బులు వచ్చేవి. ప్రతి నెలా అదే తంతు. విసుగొచ్చిన గోవిందయ్య ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడు.

సాధారణంగా అద్దెకున్న వాళ్ళు ఖాళీ చెయ్యాలంటే ఓనర్ గానీ, అద్దెకున్నవాళ్ళు గానీ ఒక నెల నోటీసు ఇవ్వాలి. గోవిందయ్య దాన్ని పాటించాడు.

“వచ్చే ఫస్టు తారీక్కల్లా నువ్వు ఖాళీ చెయ్యి” అని చెప్పేశాడు రామారావుకి.

రామారావు “సరేనండీ, మాకూ ఇల్లు సరిపోవటం లేదు, పైగా కారు పెట్టుకునే స్ధలం కూడా లేదు. నేనూ పెద్దిల్లు తీసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు. గోవిందయ్య కూడా రామారావు ఇల్లు ఖాళీ చేస్తే దాని రిపేర్లకెంత అవుతుంది అని బడ్జెట్ వేసుకోవటం మొదలు పెట్టాడు.

అలా ఇంకో మూడు నెలలు గడిచి పోయాయి. రామారావులో ఏ మార్పూ లేదు, గోవిందయ్య ప్రతి నెలా ఈ ఫస్టుకన్నా ఖాళీ చెయ్యి అని చెప్పటం సాగుతూనే వున్నది. ఐదు నెలల తర్వాత విసుగొచ్చిన గోవిందయ్య “ఎన్ని సార్లు చెప్పాలయ్యా, రేపు ఫస్టుకి ఖాళీ చెయ్యకపోతే కరెంటూ, నీళ్ళూ ఇవ్వను” అని కూడా బెదిరించాడు.

రామారావు నింపాదిగా సమాధానం చెప్పాడు “లేదు సార్, వెనక వీధిలో ఒక ఇల్లు కొత్తగా కడుతున్నారు. దానిలో ఇస్తామన్నారు. వచ్చే నెల పూర్తవుతుందిట. రేపు నెల తప్పనిసరిగా ఖాళీ చేస్తాను” అన్నాడు. నమ్మటం తప్ప ఏమీ చెయ్యలేని గోవిందయ్య ‘పోనీలే, ఇన్నాళ్ళున్నారు, ఈ ఒక్క నెల ఓపిక పడితే సరిపోతుంద’నుకున్నాడు.

కానీ రామారావు గోవిందయ్య సహనానికి పరీక్షపెట్టాడు. ఫస్టు వచ్చింది. వెళ్ళిది. రామారావులో మార్పులేదు.

ఇంక ఇలా కాదు అని గోవిందయ్య ఒక పేపర్ మీద రామారావు వచ్చే నెలాఖరుకల్లా ఇల్లు ఖాళీ చేస్తాననే హామీ ఇస్తున్నట్లు రాయించుకొచ్చి, తను సంతకం పెట్టి రామారావుని పెట్టమన్నాడు. దానికేమీ వ్యాఖ్యానించకుండా సంతకం పెట్టిచ్చాడు రామారావు. ఎందుకైనా మంచిదని ఒక కాపీ తను తీసుకుని ఒక కాపీ రామారావుకిచ్చాడు గోవిందయ్య.

మళ్ళీ ఒకటో తారీకు వచ్చింది. రామారావు ఇల్లు ఖాళీ చేస్తున్న సూచనలేమీ లేవు. మళ్ళీ అడిగిన గోవిందయ్యకి అమావాస్య, మంగళవారం అనే సమాధానం వచ్చింది. పోనీలే ఒక రోజులో ఏం పోతుంది

అని ఓపిక పట్టిన గోవిందయ్య అసలు రామారావు ఉద్దేశమేమిటో అర్థం కాలేదు. ఇంకో రెండు రోజులు చూసి పోలీసు కంప్లైంట్ ఇద్దామని ఆగాడు. మూడు రోజుల తర్వాత వెనక సందులో చెత్తా చెదారం అంతా

పడి వుండటం చూసి అమ్మయ్య, ఖాళీ చేస్తున్నాడని సంతోషించాడు. గోవిందయ్య సంతోషించినంత తొందరగా ఖాళీ చెయ్యలేదు రామారావు. కారు డిక్కీలో పట్టిన సామాను తీసుకుని తనకి వీలయినప్పుడు కొంత సామాను చొప్పున కొత్త ఇంటికి తరలించాడు. ఈ లెక్కన ఎప్పటికి అవుతుందో అనుకున్నాడు.

మొత్తానికి ఇంకో వారం రోజులు సతాయించి ఇల్లు ఖాళీ చేశాడు రామారావు. ఖాళీ అయిన ఇంటిని చూసి నిశ్చేష్టుడయ్యాడు గోవిందయ్య, రిపేర్లకే మళ్ళీ ఆ పోర్షన్ కట్టినంత డబ్బు ఖర్చవుతుందని. అద్దెలతో లక్షలు కూడబెట్టి నాలుగైదు అంతస్తుల మేడలు కడుతున్నవారు ఎలా కడుతున్నారో, తను రెండు పోర్షన్ల సరిగా అద్దెకు ఇచ్చి అద్దె వసూలు చేసుకోలేక పోతున్నాడు. వసూలు చేసిన అద్దెకన్నా, ఇంటి రిపేర్లకే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు.

‘అద్దెకున్న వాళ్ళకి వేరే ఇల్లు చూసుకుని, సామాను తరలించటం పాట్లయితే, తనకి అద్దెకున్న వాళ్ళు వదిలి వెళ్ళిన ఇల్లు ఎక్కువ మొత్తంతో బాగు చేయించటం పాట్లు. ఎవరి పాట్లు వాళ్ళవి. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కూడా కొన్ని కండిషన్లు పెట్టాలి’ అనుకున్నాడు ఖాళీ అయిన ఇల్లుని మరోసారి చూసుకుంటూ.

Exit mobile version