(1)
అనుభూతుల తోరణం, ఆనంద తీరాలకు డోల
తేనెల ఊట, తియ్యదనాల మూట
తీపి గురుతుల గని, పుడమినుండి లేచిన మొలక
నిత్య నూతనం, అజరామరం – అదే పాట
(2)
మృదుమధుర మంజుల పదాలతో గిలిగింతలు
నవరస భరితమైన అలరింపులు
జోల పాడి నిదుర పుచ్చే కన్న తల్లి
మొద్దు నిద్దుర తట్టి లేపి వెలుగునిచ్చే దీపం పాట
(3)
నైరాశ్యాన్ని పారద్రోలే ఆశా కిరణం
జగతిని జాగృత పరిచే వజ్రాయుధం
యువతను కార్యోన్ముఖులను చేసే నగారా
ప్రేయసీ ప్రియులకు ఆలంబనం పాట
(4)
లాలి పాటలతో శైశవం
ఉత్తేజాన్నిచ్చే సందేశాలతో కౌమార్యం
మరులొలికించే, గిలిగింతల పుంతతో యవ్వనం
బంధాల బంధుత్వం, వేదాంతపు రంగరింపులతో వృద్దాప్యం
(5)
పృథివి, ఆకాశం, వాయువు, నిప్పు, నీరు, జీవనాధారాలు
మానవ మేధను సేద తీర్చే దివ్యఔషధం పాట
సమస్త సృష్టినీ రసరాగ రంజితం చేసేది పాట
పాటకు నీరాజనం, పాట కర్తలకు సుమాంజలి