[డా. శ్రీమతి కోఠారి వాణిచలపతి రావు గారు రచించిన ‘పాపం.. దేవుడు’ అనే హాస్య వ్యంగ్య కథని అందిస్తున్నాము.]
ఎవరండీ ఆ అన్నది ‘దేవుళ్ళంతా స్వర్గంలో అమృతం తాగుతూ, అందమైన ఆడవాళ్ళతో కులుకుతూ ఎంజాయ్ చేస్తూ వుంటారు’ అని? అసలు విషయం తెలుసుకోకుండా అలా ఎంత మాట పడితే అంత మాట.. అది దేవుళ్ళను, అనెయ్యటమేనా..? కళ్ళు పోతాయ్. అన్న వాళ్ళెవరో చెంపలేసుకోండి. ‘అందరూ అలా అన్నవాళ్ళే.. అనుకుంటున్న వాళ్ళే’ అంటారా.?
కొన్ని అంతే. అపప్రధలు జనం మనసుల్లో అలా పడిపోయి నోట్లో నానుతూ ఉంటాయి.
అసలు నన్నడిగితే దేవుళ్ళకు ఉన్నన్ని కష్టాలు మనుషులకు కూడా ఉండవండీ. ఇంకా మనిషంటే ఎవడికి వాడే పెత్తందారు గనుక వాడ్ని అనేవాడు ఉండడు. కానీ దేవుడి విషయం అలా కాదు. ‘అందరి వాడు’ అంటూ అందరూ పెత్తందార్లు అయిపోతుంటారు. ‘మావాడు’ అంటే ‘మావాడు’ అంటూ ఎవడికి వాడు దేవుడ్ని ఇష్టమొచ్చినట్లు వాడేసుకుంటున్నారు
మొన్నామధ్య మా వీధి చివర్లో ఒకడు కల్లు కాంపౌండ్ ఓపెన్ చేసి ‘శ్రీవేంకటేశ్వర కల్లు దుకాణం’ అని పేరు పెట్టాడు. పైగా నల్లటి బోర్డు మీద తాటికాయలంత తెల్లటి అక్షరాలు రాయించి, ఆ పెద్ద పాక ముందు కొట్టొచ్చినట్టు అందరికీ కనిపించడం కోసం అని అంతెత్తున వెళ్ళాడగట్టాడు.
కాలనీవాళ్ళం అంతా వెళ్ళి గొడవ పెడితే “నేను ఆ ఏడుకొండల వాడి భక్తుణ్ణి. సంవత్సరానికి రెండుసార్లు తిరుపతి వెళ్ళి తిరుమల కొండ మీద గుండు గీయించుకుంటా. నా కల్లు దుకాణం మీద వచ్చే లాభాలలో టెన్ పర్సెంట్ నీ హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. అయినా నాకు తెలీక అడుగుతాను నా కొట్టుకు వెంకటేశ్వరస్వామి పేరు పెట్టకూడదనంటూ పంచాయితీకి మీరంతా ఓ ఎగేసుకొని వచ్చారే? అసలు ఆ ముక్క అనటానికి మీరెవ్వరు. మీకేం హక్కుంది. ఆ దేవుడ్ని మీరేమయినా కొనేసారా? ఆ విషయం అట్టా ఉంచి ఒక నికార్సయిన మాట అడుగుతాను – సమాధానం చెప్పండి. కల్లు అమ్ముకొని బతికేవాడు వాడి కొట్టుకు దేవుడి పేరు పెట్టకూడదు అని ‘లా’ ఏమయినా ఉందా? రాజ్యంగంలో ఎక్కడైనా ఉందా? ఉంటే ఎన్నో పేజీలో ఎన్నో లైన్లో ఉందో ముందు అది చెప్పండి” అంటూ ‘లా’ పాయింట్స్ లాగాడు.
‘ఓరి వీడి తెలివి చల్లగుండ.. పొట్టలో అక్షరం ముక్క లేకపోయినా రూల్స్ మాట్లాడుతూ ఠక్కున ఎట్టా మా నోళ్లు మూయించేస్తున్నాడు’ అనుకుంటూ అది “తప్పు. పాపం, సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయి.” అంటూ నసిగాం మేమంతా, అప్పటికే మా మనసులు గాలి తీసిన బెలూన్లలా మెత్తబడి పోవటంతో.
“ఎవడి మనోభావాలో దెబ్బతింటాయని నేను నా యాపారం మానుకోవాలా? మరి నేను బతకొద్దా? నా పెళ్ళాం పిల్లలకి తిండెట్టా పెట్టుకోవాల?” అంటూ ఎదురు సవాళ్ళేస్తూ రెచ్చిపోయాడు ఆ కల్లు దుకాణం అతను.
ఆ సాయంత్రం వేరే ఊళ్లో వుండే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడికి ఫోన్ చేసి చెపితే, నవ్వుతూ – “ఇంకా నయం కాదూ నువ్వు చెప్పింది. మా ఊళ్లో అయితే ఒకడు నాలుగు బజార్ల కూడలిలో ‘శంభో శంకర వైన్ షాప్’ పేరుతో ఒక సారా కొట్టు పెట్టాడు. మా దగ్గర ప్రభుత్వం బెల్టుషాపుల పేరిట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది కదా. దాంతో చిన్నచిన్న వ్యాపారస్థులు రెచ్చిపోతున్నారు.
ఆ శంభో శంకర వైన్ షాప్ బోర్డు మా ఇంటి కిటికిలో నుంచి మా మొహం మీద గుద్దినట్టుగా ఇంతెత్తున కనిపిస్తుండటంతో భరించలేక నలుగుర్ని వెంటేసుకొని నేనే వాడి మీదికి యుద్ధానికి వెళ్ళాను.. ఇలాగే నువ్వు చెప్పినట్టే ‘మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేమంతా శైవభక్తులం’ అంటూ! దానికి, వాడు మా మీదికి చేసిన ఎదురుదాడి వుందీ, చూసి తీరాలే గాని మాటల్లో అంత పవర్‌ఫుల్‌గా రాదు. ‘నేనూ శివభక్తుడ్నే. నా పేరు కూడా మా నాయన శంకరం అని పెట్టిండు. మా హోల్ ఫామిలీ ఆ శివయ్య భక్తులం. అందుకే యాపారం బాగా సాగాలని నా సారాకొట్టుకు ఆ సామి పేరే పెట్టుకున్నా. అందులో తప్పేముంది. బియ్యం కొట్టుకి, కిరాణా కొట్టుకి ‘శంకరం మర్చంట్స్’ అన్న పేరు ఉండొచ్చుగానీ సారా కొట్టుకు ఉండకూడదా! అదేం తక్కువ చేసింది పాపం. అయినా నాకు తెలియక అడుగుతున్నా పురాణాలు చదివావా నువ్వసలు. నువ్వు సారా తాగుతావో లేదో నాకు తెలియదు గానీ – దేవుళ్ళంతా స్వర్గలోకంలో కూర్చొని అదేంది.. ఆఁ.. ‘సుర’ అట, అది తాగుతారు. ‘సుర’ అంటే ఏందనుకున్నావ్. ఇదే ‘సారా’నే. ఆ రోజుల్లో ఆ మాట అనేవాళ్లు, ఈ రోజుల్లో ఈ మాటంటున్నారు. అంతే తేడా. అయినా సారూ, మీ పిచ్చిగానీ నేను ఉట్టిగా నా కొట్టుకు శివుడి పేరు పెట్టుకున్నా గానీ నేనేమయినా ఆయనకు సారా పోస్తన్నా? ఒకవేళ – అహఁ మాట వరసకి అంటున్నా. ఓ గుక్కెడు పోసినా, ఆ ‘విషం’ తాగిన వాడికి ఈ విషం ఒక లెక్కా చెప్పండి. అప్పుడు దేవతల ప్రాణాలకి ముప్పు రాకుండా విషాన్ని తాగి మింగకుండా గొంతులోనే నిలుపుకున్నవాడికి – జనం ప్రాణాలు తీస్తున్న ఈ సారాని తాగి గొంతులోనే నిలుపుకోవాలని తెలియదా! నేను నా కొట్టుకి ఆయన పేరు పెట్టుకున్నందుకయినా ఆయన ఆ పని చేస్తే నా యాపారం దివాలా తీసినా పర్వాలేదు గానీ జనం జీవితాలు బాగుపడతాయి, ఆడోళ్ళు కంట కన్నీట పెట్టకుండా ఉంటారు’ అంటూ చాలా తెలివిగా లాజిక్, పురాణం, తెలివితేటలు అన్నీ కలిపి అదరగొట్టడం మొదలుపెట్టాడు. ఫైనల్‌గా అతితెలివి ఉపయోగిస్తూ, ‘ఇంతకూ ఏమంటారు మీరు? బోర్డు పీకెయ్యమంటారు. అంతేనా – నేను పీకను. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎళ్లి – కోర్టులో కేసు ఏత్తే ఏసుకోండి. అది దేవుడి పేరు, కాదు – నా పేరు అని చెప్పి ప్లేటు ఫిరాయించేస్తా’ అంటూ దీమాగా తలెగరేస్తూ మాట్లాడాడు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు’ అంటారు కదా. అదే అయింది అక్కడ. వాడు అంత మాట్లాడాక మాకు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక వెనక్కి తిరిగి వచ్చేసాం.” అని మా ఫ్రెండ్ చెబుతుంటే “దేవుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. నడి బజార్లో నేమ్ పెట్లను అడ్డమైన పనులకు పెట్టి ఇజ్జత్ తీసేస్తున్నారు కదా..” అన్నాను నేను. ‘ఆ రోజుల్లో దేవుళ్లకు శాపాలు, తపోభంగాలు వంటి కష్టాలయితే ఈ రోజుల్లో ఇలాంటి కష్టాలు ఈ మూర్ఖుల చేతుల్లో బడి’ అని అనుకొని ఇద్దరం దేవుళ్ళ మీద బోలెడు జాలిపడిపోయాం – ఏమీ చేయలేని మా నిస్సహాయతకు మాకు మేమే వాపోయాం.
***
దేవుడి విషయంలో-
కొంతమంది ఆస్తికత్వంతో ఉంటారు. అంటే దేవుడు ఉన్నాడని గట్టిగా నమ్ముతూ గుళ్ళు, పూణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు తిరుగుతూంటారు. పుణ్యస్నానాలు, పూజలు చేసేవాళ్ళు ఉంటారు. మరికొంత మంది నాస్తికత్వంతో ఉంటారు.. వీళ్లు దేవుడు లేడు గీవుడు లేడు.. ఉన్నదంతా సైన్స్ ఒక్కటే అంటూ దేముడ్ని నమ్మకుండా గుళ్ళకెళ్ళటం, పూజలు చేయటం వంటివి చేయకుండా ఉండేవాళ్లు.
నేను అదేంటో గానీ విచిత్రంగా ఆస్తికుడ్నీ కాదు; నాస్తికుడ్నీ కాదు. దేవుడు ఉన్నాడు అనే అనను – లేడు అనీ అనను. అలాంటి నాకు భక్తురాలైన మా అమ్మ చిన్నప్పటి నుంచే నా చెయ్యి పట్టుకొని తన వెంట గుడికి తీసుకెళ్ళి మూలవిరాట్టు ముందు నిల్చోబెట్టి దణ్ణం పెట్టు, దణ్ణం పెట్టు అనేది. అన్నది కదా అని ఉట్టిగా అలా చేతులు జోడించేవాడిని గానీ నా మనసులో ఎలాంటి భక్తి భావం కలిగేది కాదు. మనసు బ్లాంక్ ఉన్నట్టు అనిపించేది.
సరే, అప్పుడంటే చిన్నతనం..! ఇప్పుడేమయింది పెద్దయి బుద్ధి తెచ్చుకున్నా కదా – అయినా అదే శూన్యభావం మనసులో. అలాంటి నేను ఆ రోజు మా వీధి కల్లు దుకాణం యజమాని మీదికి ‘మా మనోభావాలు దెబ్బతింటున్నాయి’ అంటూ అందరితో కలిసి యుద్ధానికి వెళ్ళానంటే ఇక మీరే నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి.
అందరూ వెళుతుంటే నేను వెళ్ళకపోతే బాగుండదనో – రానంటే దేవుడి విషయంలో వెనకంజ వేస్తున్నానని అందరూ అనుకుంటారనో మొత్తానికి వెళ్తాను. లేక, నాలోనే ఏదో మూల ఒక విషయాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలనే కోరిక వుండటం వల్లనో -ఈ మూడింటిలో ఏదో ఒకటి అయివుంటుంది.
ఇది ఆత్మద్రోహమా – లేక దేవుడిని మోసం చేయటమా అని ఆ సంఘటన తర్వాత ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించు కుంటున్నాను. నాలాగా ఇంకెందరో కదా – ‘పాపం దేవుడు!’ అని అనుకుంటూ.
భక్తురాలైన అమ్మకు ప్రత్యేకంగా ఒక పూజ గది వుండేది. అందులో మందిరంలో ఈ మూల నుంచి ఆ మూలకు దేవుడి పటాలు – వాటికింద చిన్నచిన్న ఇత్తడి విగ్రహాలూ ఉండేవి. మా అమ్మ ఆ ఫోటోలకు అద్దిన ఇంతింత మందపాటి కుంకుమబొట్లు, పెట్టిన ఎర్రటి మందారం పూలు, ఇంత పొడుగున వెళ్లాడే మల్లె లేక జాజి, మరువం దండలు నన్ను భలేగా ఆకర్షించేవి.
నేను రోజూ స్నానం చెయ్యగానే దేవుడి గది లోకి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళాలి. అది అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ పెట్టిన రూల్. వినాయక చవితి, దసరా వంటి పండగలు వచ్చినప్పుడు నన్నొక పక్క, మా నాన్నను మరోపక్క కూర్చోబెట్టుకొని పూజలు చేసేది. ఏవేవో మంత్రాలు చదివేది. వాటి అర్థం నాకు తెలియకపోయినా వినటానికి బాగుండేది. పూజ అయిపోయి, నేను దండం పెట్టుకోవడం అయిపోయాక. “విష్ణూ! దేవుడికి ఏమని దండం పెట్టుకున్నావ్?” అని అడిగేది ఏం చెప్పాలో అర్థం గాక “ఏమీ అనలేదు. ఉట్టిగా దండంపెట్టుకున్నా” అంటే; “అదేంటి? చదువు బాగా రావాలని – పెద్ద కలక్టరో ఇంజనీరో అవ్వాలని, డబ్బులు బాగా సంపాదించాలనీ కోరుకోలేదా?” అంటూ నా వంక కోపంగా చూసేది. “అవన్నీ కోరితే దేవుడు ఇచ్చేస్తాడా అమ్మా నాకు? నేను కష్టపడి చదవకపోయినా పర్వాలేదా? దేవుడికి మనం పూజలు చేసేది ఇలా ఆయన మన కోరికలు తీర్చడానికేనా? ఒకవేళ ఆ దేపుడు మనం అడిగింది ఇవ్వకపోతే -ఈ పూజలు మానేయొచ్చా?” అని నేను అమాయకంగా అంటుంటే మా అమ్మ “పిచ్చి పిచ్చి ప్రశ్నలెయ్యకు!” అని నన్ను గద్దించడం, ప్రసాదం తింటున్న మా నాన్న ముసిముసి నవ్వులు నవ్వటం నాకు ఇప్పటికీ గుర్తొస్తూ, ఆ దృశ్యం కళ్ళముందు ఆ మెదులుతూ ఉంటుంది.
అప్పుడు చిన్నతనంలో తెలియక దేవుడి ఏమీ అడగక పోవటం కాదు – ఇప్పటికీ అదే నిష్కామభావం నా మనసులో. దేవుడి ముందు నిల్చుంటే ఏం ఇవ్వమని అడగాలో ఏం కోరిక కోరుకోవాలో తెలియదు.
మా అమ్మ దేవునికి చీటికీ మాటికీ మొక్కులు మొక్కేది. మాటి మాటికి నన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు చేయించేది. అందమైన నా క్రాఫ్ పోవటంతో అద్దంలో గుండు చూసి నేను బావురుమంటూ, ‘నా జుట్టు నాకు కావాలి’ అని నేల మీద కూర్చొని కాళ్ళు భూమికి గట్టిగా తాటిస్తూ ఏడుస్తుంటే – “తప్పు అలా ఏడవకూడదు. దేవుడికి జుట్టు ఇస్తే ఏడుస్తారా ఎవరన్నా? అప్పుడు నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మొక్కుకున్నాను.” అనేది అమ్మ.
నాన్నకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, “నేను దేవుడికి మొక్కోవటం వల్లే మీకు ప్రమోషన్ వచ్చింది. పెరిగిన మీ మొదటి జీతం దేవుడి హుండీలో వెయ్యండి” అని ఒక పెద్ద నోట్ల కట్టను నాన్న చేత హుండీలో వేయించింది. మా అన్నయ్య శివ ఎమ్‌సెట్ ఎగ్జామ్ రాయటానికి వెళుతున్నప్పుడు “నీకు మంచి ర్యాంక్ వచ్చి మెడిసిన్‌లో సీటు వస్తే కొండకు నీతో కలిసి నడిచి వస్తాను అని మొక్కుకున్నాను, అంటూ అన్నయ్యను తిరుపతి మెట్లు ఎక్కించి తీసుకెళ్ళింది.
అదే గాక, అమ్మ నోట మాటికీ మాటికి పుణ్యం, పుణ్యం అన్న మాట వినబడుతుండేది. ‘ఈ రోజు ముక్కోటి ఏకాదశి గుడికెళితే పుణ్యం, ఈ రోజు శివరాత్రి, ఉపవాసం ఉండే పుణ్యం. అడుక్కునే బిచ్చగాళ్ల బొచ్చెలో డబ్బులు వేస్తే పుణ్యం’ అంటూ అవన్నీ మా చేత కూడా చేయించేది. అప్పటి నుంచీ ఇంట్లో పటాల ముందయినా, గుడ్డి విగ్రహం ముందయినా నిల్చొని దండం పెడుతుంటే నాకు ఆ దేవుడి ముఖం దీనంగా కనిపించి జాలేసేది.. దేవుడు అలసటగా కూడా కనిపించేవాడు, అప్పుడు మనసులో ‘నీ భక్తుల కోరికలు తీర్చీ తీర్చీ అలసిపోయావా స్వామీ? పుణ్యం మూటలు అందించీ అందించీ నీ చేతులు కందిపోయాయా?’ అనుకునే వాడ్ని జాలిగా.
అయినా మాటలు రాని దేవుడు, నా చర్మచక్షువులకు వినిపించని దేవుడు నాకు సమాధానం ఇచ్చేవాడు కాదు.
‘ఆయనలోని ఆ ఉలకని పలకనితనమే, భక్తులు ఆడించినట్లలా ఆడే ఆ బోళా శంకరుని తత్వమే కదా, ఆయన్ని భక్తులకు అలుసు చేసింది. ‘పాపం దేవుడు..!’ అనుకున్నాను. దేవుడి మీద బోలెడు సానుభూతి నా గుండెల్లో నుంచి కురుస్తుండగా,
***
భక్తురాలైన మా అమ్మకు గుడి ప్రదక్షిణ చేస్తూ వుంటే సినిమాల్లో చూపించినట్టు ఓ పిల్ల భక్తురాలు – పిల్ల అంటే పిల్లకాదు ఓ కన్నెభక్తురాలు కనిపించి ఈ లక్షణమైన పిల్ల నా ఇంటికోడలైతే ఇంకంత లక్షణంగా ఉంటుందీ – అనుకొని మాటలు కలిపి ఆ అమ్మాయిని బుట్టలో వేసుకొని వాళ్ళ పెద్దలతో మాట్లాడి నాకు అంటగట్టింది. “పూజలూ – వ్రతాలూ చేసుకునే అమ్మాయి నా పెళ్ళాం అయితే ఆ దేవుడ్ని తప్ప నన్నేం పట్టించుకుంటుందే. నాకు వేళకు కూడయినా పెడుతుందో లేదో?” అంటే –
“నోరు మూసుకోరా ఎబ్రాసి వెదవ – అన్యాపదేశంగానే అయినా ఆ దేవుడ్ని తక్కువ చేసి మాట్లాడితే కళ్ళు పోతాయి” అంది. దాంతో ‘ఈ దేవుడు అస్తమానం తప్పుచేసిన భక్తుల కళ్ళే ఎందుకు పోగొడతాడు? కాళ్ళో, చేతులో ఎందుకు పోగొట్టడు?’ అని ఆలోచనలో పడ్డాను నేను.
మా ఆవిడ భగవతి ఆ భగవంతమ్మలా మా ఇంట్లో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయగానే మా అమ్మ ఆ శ్రీ మహలక్ష్మినే తన ఇంటికి నడిచి వచ్చినట్టు తెగ గారాబం చేసింది. ఇద్దరూ కలిసి పూజలూ, వ్రతాలతో ఇంటిని గుడిని చేసేసారు. రోజు కళ్ళు మూసుకొని దేవుడి ముందు నిల్చొని ‘దేవుడా నాకు పండంటి పాపాయిని ఇవ్వు.. దాని పుట్టెంట్రుకలు నీ కొండ మీదే తీయిస్తాను’ అని మొక్కుకుంటే విని ఉలిక్కిపడి ‘ఇదేంటి, దీనికి పాపాయిని ఇచ్చేది నేను కదా – ఆ దేవుడ్ని అడుగుతుందేంటి? నన్ను అడగాలి గానీ – పైగా వెంట్రుకలు లంచం ఇస్తుందట ఆ దేవుడికి!’ అని అనుకుంటూ ఆశ్చర్యపోయాను.
రోజూ లాగే ఆ రోజూ మా అమ్మ, మా ఆవిడా గుడికి వెళ్తూ “ఈ రోజు గుడికి వెళితే మంచిది. నువ్వూ రా!” అంటూ నన్నూ తీసుకెళ్ళారు. ఆ రోజు ఏం పుణ్యదినమో నాకు తెలియదు గానీ చాలామంది జనం ఉన్నారు. మా ఊరి మోతుబరి వ్యాపారస్థుడు పట్టాభిరామయ్యను ఆ జనంలో చూసి గతుక్కుమన్నాను నేను. కల్తీలు, మోసాలు, బ్లాక్ మార్కెట్ దందాలూ చేసి కోట్లు సంపాదించాడని పేరు. రెండు చేతులకూ కలిపి ఎనిమిది వేళ్ళకు బంగారు ఉంగరాలు, రాళ్ళు పొదిగినవి పెట్టుకున్నాడు. చేతికి మొద్దుకు మొద్దే అన్నట్టున్న బంగారు బ్రేస్‌లెట్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మూలవిరాట్టుకు దండం పెట్టుకుంటున్నాడు.
ఏమని కోరుకుంటున్నాడు దేవుడ్ని ఈ పెద్దమనిషి? నల్ల బజార్ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయమనా? జనాన్ని ఇంకా మోసం చేసే అవకాశాన్ని ఇప్పించమనా? ఎన్ని తప్పుడు పనులు చేసినా పోలీసులకు పట్టుబడకూడదని మొక్కుకోవటానికి వచ్చాడా లేక ‘నేను ఎన్ని వెధవ పనులు చేసినా నేను చచ్చాక నన్ను నరకానికి తీసుకెళ్ళొద్దు – సీదా స్వర్గానికి టిక్కెట్ ఇప్పించు’ అని అడగటానికా? అని అనుకుంటూ వుండగా ఇంతెత్తునుండే ఆ మనిషి వెనక ఎర్రచీరలో ఓ ఆడమనిషి తల, భుజాలు కనిపించాయి. నెత్తి మీద ముసుగేసుకొని, అరమోడ్పు కళ్ళతో భక్తిపారవశ్యంలో మునిగి తేలుతూ కనిపించింది.
అంత చనువుగా ఆయన్ని అంటుకొని వస్తున్న ఆ మనిషి ఎవరా అని పరిశీలనగా చూస్తే ఆమె వెంకటనర్సమ్మ అని అర్థం అయింది. ఆశ్చర్యంతో అదిరిపడ్డాను నేను. వెంకటనర్సమ్మ పట్టాభిరామయ్య కీప్ అన్న విషయం మా ఊళ్లో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈయనకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు – ఆమెకు ఇల్లూ, మొగుడు, పిల్లలు ఉన్నారు. అయినా ఇద్దరి మధ్యా అక్రమసంబంధం ఏర్పడింది. ఎవరేమనుకున్నా మాకేం లెక్క లేదన్నట్టు ఇద్దరూ కలిసి గుడికి వచ్చారు. దాంతో గులోని భక్తుల కళ్ళన్నీ దేవుడి మీద కాక వాళ్ళిద్దరి మీదే ఉన్నాయి. వంటికి బూడిద రాసుకునే శివుడి దగ్గర ఏముంది, చల్లటి, తెల్లటి బూడిద తప్ప. మసాలా ఏమయినా ఉందా- ‘అది ఇక్కడ ఉంది’ గానీ అని అనుకున్నారో ఏమో వాళ్ళిద్దరి వంకా వాలుచూపులు చూస్తూ చెవులు కొరుక్కుంటున్నారు. మా అమ్మ సైతం – ‘అబ్బ. గుళ్ళో ఏమిటి ఈ చండాలం’ అని నా వెనక నుంచి అనటం నా చెవుల బడింది. దాంతో నాలో ఆలోచనలు కందిరీగల్లా ఉవ్వెత్తున లేచాయి.
గుడి అందరిదీ. మంచివాళ్ళది – మడిగట్టుకున్న వాళ్ళది మాత్రమే కాదు. గుళ్లో దేవుడూ అంటే అందరివాడు. మంచివాడికున్నట్టే దుర్మార్గుడికి కోరికలు ఉంటాయి. అవి తీర్చమని అడగటానికి గుడికి వస్తాడు. దేవుడు ఉన్నదెందుకు? తప్పులు చేసే వాళ్ల తప్పుల్ని కాయడానికి. అవన్నీ తన నెత్తి మీద వేసుకొని వాళ్ళకి పుణ్యం వచ్చేలా చెయ్యడానికి, పట్టాభిరామయ్య పాపాల కట్టగట్టి హుండీలో వేసేసాడు. పెద్దగానే ఉంది కట్ట. ఇంకేం – ఆ ముడుపుతో తప్పులకు చెల్లుచీటీ ఇచ్చేసే వుంటాడు దేవుడు. ‘అసలు తప్పులు చేయడం ఎందుకు – నా దగ్గరికి వచ్చి చెంపలేసుకోవడం ఎందుకు?’ అని, మనతో మాట్లాడని ఆ దేవుడూ అనడు – నోరున్న ఈ మనుషులూ ‘ఇంక తప్పులు చెయ్యంలే’ అని దేవుడికి మాటా ఇవ్వరు. ‘ఎవరు ఏం చేసినా, ఏం చెప్పినా చూస్తూ, వింటూ భరిస్తూ ఉండటమే ఆ దేవుడి పని’ అనుకున్నాను నాలో నేను.
నాకు ఈ ఆలోచనల సంతతోనే సరిపోవడంతో దేవుడి మీద కాన్సన్‌ట్రేట్ చెయ్యలేక పోయాను. “దిక్కులు చూస్తావేంటిరా – దేవుడ్ని చూడు” అంది అమ్మ వెనకనుంచి నా వీపున చరుస్తూ.
మా ఊరి సంగతులేమీ తెలియనీ కొత్త కోడలు భగవతి “మనుషుల ముఖాల్లో ఏముందండీ?” అంది.
‘అక్కడే వుందే పిచ్చిమొహమా అసలు కథ’ అనుకున్నాను నాలో నేను నర్మగర్భంగా.
***
గంగానదిలో పడవలో తిరుగుతూ ఘాట్లన్నీ దర్శిస్తున్నాం. భక్తులు పుణ్యగంగానదిలో స్నానాలు చేస్తున్నారు. అక్కడే శవదహనాలు – కాశీలో గంగానది ఒడ్డున అంతిమ సంస్కారం చేస్తే స్వర్గానికి వెళతారు అని నమ్మకం.
అమ్మ, నాన్న, నా భార్య అందరూ గంగానదిలో మునిగి స్నానాలు చేస్తున్నారు. “రా రా. గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలిగిపోతాయి” అంది అమ్మ, ఏదో ఆలోచిస్తూ ఒడ్డున నిల్చున్న నన్ను చూసి. నేనూ మునిగాను – మునుగుతూ, తేలుతూ అనుకున్నాను. గంగలో మునిగితే పాపాలు తొలిగిపోతాయా – అసలు పాపాలు చెయ్యటం ఎందుకు? వాటిని కడిగెయ్యమని గంగాదేవిని కోరుకోవటం ఎందుకు? ప్రతిరోజూ లక్షల, కోట్ల మనుషుల పాపాలు కడిగి కడిగీ ఈ గంగ ఎంత మైలపడిపోయి ఉంటుంది? పాపుల పాపాలు కడిగి కడిగే గంగ మురికి అయిపోయింది. ‘గంగా మైలా హో గయీ పాపియోంకే పాప్ ధోకే ధోకే’ అన్న హిందీ పాట గుర్తుకొచ్చింది ఆ సమయంలో.
‘పూర్ దేవుడూ.. దేవతా! మనుషులకు మీరంటే ఎంత అలుసు? ఎలా వాడుకుంటున్నారు! భక్తి అంటే ఇదేనా? మనిషి మానవత్వంతో మంచి పనులు చేస్తూ నిష్కామభక్తితో నిన్ను కొలవలేడా? తనను సృష్టించినందుకు, జీవితం అనే ఒక స్థితిని ఇచ్చినందుకు నిన్ను పంచభూతాలలో లయింప చేసి ముక్తిని ప్రసాదిస్తున్నందుకు నీకు కృతజ్ఞుడిగా నిన్ను పూజించలేడా?’ అనుకున్నాను నేను.
అలా ఆలోచనలో మునిగివున్న నన్ను చూసి అమ్మ “ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ వుంటాడు. ఏముంటాయో అన్ని ఆలోచనలు?” అంది అమ్మ స్వగతంలా.
యోగిలా నవ్వి ఊరుకున్నాను నేను.
(సమాప్తం)
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448
