[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘ఆపరేషను సిందూరు’ అనే రచనని అందిస్తున్నాము.]
~
తే.గీ.:
క్రౌంచ మిథునమ్మునందు మగ విహగమును
క్రూరుఁడగు బోయ యొక్కడు కూల్చఁ గాంచి,
శోక తప్తుడై వాల్మీకి శ్లోక మందు
నాడు బోయ కిచ్చిన సాపెనయె పునాది
నవ్య సంస్కృతి రామాయణంబు పేర
పరమ యాదర్శమై మన ప్రజల కంద.
(క్రౌంచ = ఒకానొక పక్షి, మిథునము = ఆలుమగల జత, విహగము = పక్షి, క్రూరుఁడు = దయలేనివాడు, బోయ = కిరాతుడు, కూల్చు = చంపు, కాంచు = చూచు, శోకము = దుఃఖము, తప్తుడు = తాపము పొందినవాడు, నాడు = ఆ కాలములో, సాపెన = శాపము, పునాది = ఆధారము, నవ్య = క్రొత్తది, సంస్కృతి = నాగరికత, పరమ = శ్రేష్ఠమైన, ఆదర్శము = అనుకరింపదగినది, అందు = గ్రహించు)
వాల్మీకి రామాయణంలోని బాలకాండములో 2వ సర్గములో చెప్పబడిన సంఘటన ఇది. తమసా నదీ తీరంలో స్వేచ్ఛగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల్లో మగ పక్షిని ఒక బోయవాడు వాల్మీకి మహర్షి చూస్తుండగానే చంపాడు. మగ పక్షి వియోగానికి విలపిస్తున్న ఆడు పక్షిని చూచిన వాల్మీకి హృదయం ద్రవించి ఆయన నోటి నుండి వచ్చిన మాటలివే:
“మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః, యత్ క్రౌఞ్చ మిథునాదేకమవధీః కామ మోహితం” (నిర్భాగ్యుడవైన ఓ కిరాతుడా! నీవు క్రౌంచ పక్షుల జంట నుండి మన్మథపరవశమైన ఒక పక్షిని చంపావు. అందుచేత నీవు చాలా కాలం జీవించకుందువు గాక.)
“ఈ మాటలు నేను శోకార్తుడనై ఉండగా నా నోటి నుండి వచ్చాయి. ఇవి నాల్గు పాదాలలో ఒక్కొక్క పాదానికి సమానమైన అక్షరాలతో ఉన్నాయి. పాడడానికి బాగుంది. అందుకని దీన్ని శ్లోకమనే అనాలి.” అని మనస్సులో ఆ మాటలే (శ్లోకమే) మననం చేసుకున్నాడు వాల్మీకి. ఈ మాటలు (శ్లోకము) రామాయణ కథ నంతా సంక్షేపంగా సూచించాయి అని పండిత విమర్శకులు అన్నారు. ఇలాంటి శ్లోకాలే (పాదానికి 8 అక్షరాలు చొప్పున నాల్గు పాదాలకి 32 అక్షరాలతో – అంటే అనుష్టుప్పు ఛందస్సులో) 24,000 వ్రాసి రామాయణాన్ని అందించాడు వాల్మీకి మహాముని. ఇక ప్రస్తుత పద్యం యొక్క అర్థాన్ని పరిశీలిద్దాం.
క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని క్రూరుడైన బోయ ఒకడు చంపడం చూచి, దుఃఖముతో పీడింపబడిన వాడై వాల్మీకి శ్లోకరూపంలో ఆ కాలంలో బోయ కిచ్చిన శాపమే రామాయణం పేరిట క్రొత్త నాగరికతను శ్రేష్ఠమైన ఆదర్శంగా ప్రజలు గ్రహించడానికి ఆధార మయ్యింది.
తే.గీ.:
ఒక్క మిథునమ్మె బోయకు చిక్కె నాడు
యిర్వదైదుగు రాల్మగల్ యిట్లె నేడు
తీవ్రవాదుల హింస కధీన మైరి
యనెడి ఘటన పెహల్గాము నందు జరుగ
శక్తి యుక్తుల దోషుల శాస్తిఁ జేసి
జమ్ము కాశ్మీరు కలఁకుల శాంతి నిలిపి
నవ్య నాగరికతకు పునాది వేయు
వాడు యభినవ వాల్మీకి మోడి కాదె?
(ఇర్వదైదుగురు = ఇరవై ఐదు మంది, ఆల్మగలు = దంపతులు, అధీనము = వశము, ఘటన = సన్నివేశము, శక్తి = సామర్థ్యము, యుక్తి = ఉపాయము, దోషి = అపరాధి, శాస్తి = దండన, కలఁకు = ప్రదేశము, పునాది = మూలబంధము, అభినవ = నవీనము)
ఆ కాలంలో ఒక్క జంటే బోయకు చిక్కింది. ఇరవై ఐదుగురు దంపతులు ఈ కాలంలో ఇదే విధంగా తీవ్రవాదుల హింసకు వశమయ్యారు అన్న ఘటన పెహెల్గాములో జరుగగా (అంటే, భర్తలు చంపబడి భార్యలు ఒంటరిగా మిగిలిపోవడం), సామర్థ్యము ఉపాయములతో అపరాధులకు దండన విధించి జమ్ము కాశ్మీరు ప్రదేశాలలో శాంతిని నెలకొల్పి క్రొత్త నాగరికతకు పునాది వేసినవాడు నవీన వాల్మీకి మన ప్రధాని నరేంద్ర మోడీ కాదా?
తే.గీ.:
భరత మాత సిందూరము వంటి ప్రాంత
మందు తీవ్రవాదులు స్త్రీల సిందురమును
తుడువ యా దుండగులను సింధురము వోలె
‘ఆపరేషను సిందూరు’ యణచి వేసె.
(సిందూరము, సిందురము = కుంకుమ, దుండగుడు = దుర్మార్గుఁడు, సింధురము = ఏనుఁగు, అణచివేయు = బలప్రయోగం ద్వారా తొక్కివేయు)
భారత మాత నుదుటి కుంకుమ వంటి ప్రాంతమైన కాశ్మీరులో తీవ్రవాదులు స్త్రీల నుదుటి కుంకుమ తుడిచి వేయగా, అనగా వారి భర్తలను చంపి వేయగా, ఆ దుర్మార్గులను ఏనుగు లాగా ‘ఆపరేషను సిందూరు’ అణచి వేసింది.
ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.