[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఆపరేషన్ అంటే..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒక రోజు యాదికొచ్చే బతికిన బోధన
కళలూ మెలకువలు నేర్పిన సముద్ర యాతన, తపన
వైద్య సేద్యంలో అద్భుతమైన హస్తవాసి
నేర్పరి వదిలినదేగా గురితప్పని బాణం ఎప్పుడూ
క్రమశిక్షణ ధైర్యం ఓపికల శక్తి
చేతపట్టిన నాడి కత్తి కూడా
నాగలి సేద్యమైన ఆకుపచ్చ కావ్యం.
ఆరోగ్య గీతం ఎందరిని
గుండెల హత్తుకుని తల నిమిరిందో గాని
కోట్లాది తలలకు నిమ్మళమైన చక్కని చల్లని భరోసా
కోయడం కుట్టేయడం వృత్తిగీత కరతలామలక కరచాలనమే
సర్జరీలో దిట్ట గురువైన గుండె దీపం
ఎందరెందరో నాలాగే
వైద్యులు ఆ చెట్టునీడన వెలిగారో
కొత్తకోణంలో యజ్ఞం
బాధలు వ్యాధులు నయంచేసిన గాథలు నాటివి.
నొప్పి బాధ ఉండి ఏడిస్తే ఎవరైనా
తల్లడిల్లిన వేళ
ఆపరేషన్ అంటే పరేషాన్ ఎందుకు!?
నాగలితో పొలం దున్నినట్లు అవ్వా!
నేరులేని భూమి ఓర్సుకొని నవ్వదా!!
అయినా, తియ్యగుంటదా లడ్డూలా! కత్తికాటు నొయ్యక!
ఊకో ఇచ్చింత్రంగనీ
అనే చతురోక్తి రసగుళిక ఓషధితో
జీవితాల అనుభవ పాఠం ఉవాచ
స్వరపేటిక నుండి కురిసే తీపికారంగా
ఇన్నాళ్లు చేసిన కళాత్మక వైద్యసేద్యం
బరువు బాధల విన్యాసం విప్పిచెప్పే
ప్రాణంతో నిత్య పోరాటమే వైద్య
సేద్యసూత్రాన్ని తగిలించే మెడకు
యుద్ధమంత అలుకన కాదు
వైద్య క్రతువులో ఆరోగ్యాన్ని కాపాడడం
మనిషిగా బతుకుతూ కళల వృత్తిని
నెత్తికెత్తుకోవడం ఏమంత సులభంకాదు
అది ప్రతిసమయం కత్తిమీద సామే మరి.
బతికించిన వాడు దేవుడు లేదా యముడు కిరీటధారే
కానీ, అతడు ‘మర’ కాదు మనిషి
తీపిబాధ, సుఖం, దుఃఖం అన్నీ
గిర్నీలో పోసిన వరిధాన్యం
ఒత్తిడి ప్రకంపనాల దెబ్బలు తిని
బియ్యం నూకలు తౌడూ ఉనుక
రూపాంతరమైన శ్రమవేదమే ఆపరేషన్.
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.