[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సింగీతం ఘటికాచల రావు గారి ‘ఓస్ ఇంతేనా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
యశోద తీవ్రంగా ఆలోచిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సమస్య గురించి ఆలోచించిన కొద్ది చికాకు ఎక్కువ అవుతుందే గాని సమాధానం దొరకడం లేదు. తన సమస్యను ఎవరితో చెప్పుకోవాలో పరిష్కారం ఎవరు చూపిస్తారో అర్థం కాలేదు. ఇక ఆలోచించలేక కంప్యూటర్ షట్ డౌన్ చేసి బయలుదేరింది. ఇంటికి వచ్చాక కూడా అదే సమస్య ఇంకా ఆమెను వెంటాడుతూనే ఉంది. అంతలో ఆమె ఫోన్ మోగింది. ప్రణవి ఫోన్ చేస్తుంది. తీసి “హలో” అన్నది.
“ఏమిటి సాయంత్రం చెప్పా పెట్టకుండా నీ పాటికి నువ్వు బయలుదేరి వెళ్ళిపోయావు? ఏమిటి అంత పరధ్యానం?” అన్న మాటలు వినిపించాయి.
“ఏదో ఒక చిన్న సమస్య లేవే. అయినా గాని దానికి నాకు సమాధానం దొరకడం లేదు. ఎలా చేయాలో అర్థం కావడం లేదు. అందుకే చికాకు ఎక్కువై కంప్యూటర్ కట్టేసి పరధ్యాసలో బయలుదేరి వెళ్ళాను. అంతకన్నా మరేం లేదు” అన్నది యశోద నిట్టూరుస్తూ.
“ఇంత చెప్పావు కానీ సమస్య ఏంటో చెప్పలేదు. అసలింతకూ ఏమిటి నీ సమస్య?”
“ఆఫీసులో సమస్య కాదు. వ్యక్తిగత సమస్య, పర్సనల్ మేటర్” అన్నది యశోద.
“అదే, ఆ వ్యక్తిగత సమస్య ఏమిటని అడుగుతున్నాను. నాకు తోచినట్టు నేనేదైనా సహాయం చేయొచ్చు కదా. కనీసం మాట సాయమైనా చేయొచ్చు కదా”
“మా అబ్బాయి తెలుసు కదా ప్రణవ్. వాడితోనే సమస్య. స్కూల్లో తన తోటి పిల్లలందరితోనూ గొడవపడుతున్నాడంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు”
“ఓస్ ఇంతేనా” అన్నది ప్రణవి చాలా సహజంగా.
“అదేంటి అంత తేలికగా తీసి పారేశావు. ఇప్పటికి వారం రోజులుగా స్కూల్ నుంచి వాళ్ళ క్లాస్ టీచర్ రోజూ ఫోన్ చేసి వాడి మీద ఫిర్యాదు చేస్తూనే ఉంది. రేపు కచ్చితంగా వచ్చి కలవమని మరీ మరీ చెప్పింది. మళ్ళీ వాడేం గొడవ చేశాడో”
“ఓహో అలాగైతే నువ్వు రేపు ఆఫీస్ కి రావడం లేదన్నమాట”
“అవునే. ఒకసారి స్కూలుకు వెళ్లి మాట్లాడి వస్తాను”
“చూడు ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనుకోకు. రేపు అక్కడికెళ్ళాక నీకే తెలుస్తుంది. నిజంగానే నేనన్నట్టు నువ్వు కూడా ‘ఓస్ ఇంతేనా’ అనుకుంటావు” అన్నది ప్రణవి.
“అంతే అయితే పర్లేదు. సరేలే, ఎల్లుండి కలుస్తాను ఆఫీసులో” అని ఫోన్ పెట్టింది యశోద.
మర్నాడు ఆఫీస్ కు వచ్చిన తర్వాత కలిసిన యశోదను పలకరించింది ప్రణవి.
జరిగిన విషయం చెప్పింది యశోద.
“ప్రణవ్ స్కూల్లో పక్కనున్న అబ్బాయి నోటు పుస్తకం తీసి దానిలోని పేజీలన్నీ చింపి ఓరిగామి చేస్తున్నాడట. అంతకు ముందురోజు పక్కనున్న మరో అబ్బాయి పెన్సిల్ బాక్స్ తీసుకుని దానిలోని పెన్సిల్ మొత్తం చెక్కేసి ఆ వచ్చిన ముక్కలతో ఏదో మళ్ళీ డిజైన్లు తయారు చేస్తున్నాడట. అక్కడి టీచర్ ముందే వాణ్ణి బాగా నాలుగు పీకి మందలించాను మళ్లీ అలాంటి పనులు చేయడు” అన్నది యశోద.
అది విని కొద్దిగా నొచ్చుకున్నది ప్రణవి.
“తప్పు చేసావ్ యశోద. అలా నలుగురి ముందు వాడిని మందలించ కూడదు. అందులోనూ టీచర్ ముందు అసలు కూడదు. అవునూ, ఇంతకుముందు వాడలాంటి పనులేమైనా ఇంట్లో చేస్తున్నట్టు నువ్వు చూసావా?”
“చూశాను. వాడు టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తూ అవి నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవాడు. నన్ను రెండు మూడు సార్లు అలాంటి పేపర్లు కొనిపెట్టమని కూడా అడిగాడు. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు”
“చూశావా. తప్పు నీలో పెట్టుకుని వాణ్ణి మందలిస్తే ఎలా? వాడిలో ఉన్న క్రియేటివిటీని నువ్వు మొత్తం అణిచేయాలని చూశావు. అదే నువ్వు చేసిన తప్పు. మరో మార్గం లేక వాడు పక్కనున్న అబ్బాయి పుస్తకాలు తీసి చించేసాడు. నువ్వు కావాలంటే చూడు. ఇంట్లో వాడి పుస్తకాలు కూడా పూర్తిగా చినిగిపోయి ఉంటాయి. ఆ కాగితాలన్నీ అయిపోయాక పక్కవాడి కాగితాలు తీసుకున్నాడు. అలాగే పెన్సిళ్ళు కూడా. వాడి బాక్స్ లో ఒక్క పెన్సిల్ కూడా ఉండదు. కావాలంటే చూడు”
ఆ మాటలు విని తలదించుకున్న యశోద తను కూడా బాగా నొచ్చుకున్నది. ఐతే ప్రణవి చెప్పినంత సులభంగా ఓస్ ఇంతేనా అనుకోలేకపోయింది. పిల్లలకు నచ్చజెప్పడం అంత తేలికైన విషయం కాదన్న విషయం ఆమెకు బాగా తెలుసు. ప్రణవి కూడా తనను సమాధానపరచేందుకే అలా చెప్పి ఉంటుందని అనుకుంది యశోద. సాయంత్రం ఇంటికి వెళ్ళి వాడి పుస్తకాలన్నీ చూశాక ప్రణవి చెప్పింది నిజమన్న సంగతి అర్థమైంది.
మర్నాడు ఉదయం ముఖం వేలాడదీసుకుని ఆఫీస్ లోనికొస్తున్న కోమలి కంటపడింది.
దగ్గరకు రాగానే “ఏమైంది కోమలి? ఎందుకలా ఉన్నావు?” అని అడిగింది ప్రణవి.
సమాధానం చెప్పకుండా తన సీటు వద్దకు వెళ్లిపోయింది కోమలి.
వెంటనే పలకరించడం మంచిది కాదనుకుని కాసేపయ్యాక టీ టైంలో పలకరించింది ప్రణవి.
“ఏమిటే అదోలా ఉన్నావు?”
“రెండు రోజులుగా మా అత్తగారు ఒకటే గొడవ పెడుతున్నారు. ఉదయం సాయంత్రం పార్క్ కు తీసుకెళ్ళమని ఒకటే పోరు. ఇంతకుముందు మా ఇంటి పక్కనే పార్క్ ఉండేది. రోజూ సాయంత్రం వాకింగ్ వెళ్ళేది. క్రితం వారం కొత్తగా కట్టించిన ఇంట్లోకి మారాము. అక్కడ పక్కన పార్కులేవీ లేవు. మొదటి రెండు రోజులు మౌనంగా ఉన్నా తరువాత గొడవ ప్రారంభించింది. పాత ఇంట్లో ఐతే రోజూ తనే వెళ్ళి వచ్చేది. ఇప్పుడలా లేదు. ఇంటికి ఆఫీసు దూరమైంది. ఆయన ఆఫీసునుంచి వచ్చేసరికి సాయంత్రం ఏడు గంటలు దాటుతుంది. అలసిపోయి ఉంటారు. మరి నేను కూడా అంతే కదా. ఆఫీసు పని ముగించుకుని ఇంటికెళ్తే ఇంటి పని, వంట పనితోనే సరిపోతుంది. ఆ కారణంగా రెండు రోజులుగా ఒకటే గొడవ. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు” అన్నది.
“ఓస్ ఇంతేనా” అన్నది ప్రణవి. ఉలికిపడి చివాలున చూసింది కోమలి.
“ఏంటీ, తేలికగా తీసి పారేశావు. ఆమెను సమాధాన పరచడం అంత తేలికనుకున్నావా?”
అప్పుడే అక్కడికొచ్చిన యశోద “ఇదంతే. అన్నింటికీ ‘ఓస్ ఇంతేనా’ అని ఒక్క మాట అనేస్తుంది. అదేదో అంత తేలికైనట్టు. అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది” అన్నది.
“నిజమా కాదా మాత్రం చెప్పు. నిన్న నువ్వు చెప్పిన సమస్య నిజంగానే చిన్నదే కదా. తప్పు నీదగ్గరుంచుకుని దాన్నర్థం చేసుకోకుండా పిల్లాణ్ణి మందలిస్తే సమస్య పరిష్కారమౌతుందా?”
వాగ్వాదం పెంచడం ఇష్టం లేక యశోద మౌనం వహించింది.
“సరే అలాగైతే సమస్యకు పరిష్కారం చెప్పు”
కొద్దిగా ఆలోచించిన ప్రణవి “మీరు ఇంతకు ముందున్నది బాడుగ ఇల్లు. ఇప్పుడు సొంతిల్లు. పైగా పెద్దది కూడా. ఇంట్లోనే పార్కు వాతావరణాన్ని కల్పించాలి. అది చాలా సింపుల్. ఇంటి మేడపైన పూల కుండీలు, ఇంటి ముందు వరండాలో ప్రస్తుతం కొంతమేరకు ఆర్టిఫిషియల్ పచ్చిక వేస్తే సరి. మీ ఇల్లు చూశాం కదా. నేను చెప్పింది చేసేందుకు కావలసినంత స్థలం ఉంది. తరువాత నిదానంగా అక్కడ పచ్చిక పెంచే ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్క వారం రోజులు ఓపిక పట్టమను. పచ్చిక చుట్టూ కూడా పూల కుండీలు పెట్టేస్తే ఆమె కోరుకున్నట్టే ఇంట్లోనే పార్కు తయారౌతుంది. అంతే” అన్నది.
కోమలి ఆశ్చర్యంగా చూసి, ‘నిజమే. అలా చెయ్యొచ్చుగా’ అనుకుంటూ “థాంక్స్” అన్నది.
ఐతే యశోదకు మాత్రం అది ఓస్ ఇంతేనా అనుకునేంత చిన్న విషయంగా అనిపించలేదు. పిల్లలనైతే ఎలాగో ఏమార్చ వచ్చును. కానీ పెద్దవాళ్ళను అలా ఏమార్చడం సులభం కాదు అనుకుంది మనసులో. ఇప్పుడు కూడా ప్రణవి కోమలికి కష్టం తెలియకుండా ఉండాలనే అలా చెప్పిందనుకుంది.
పైకి మాత్రం ప్రణవివంక విభ్రాంతిగా చూస్తూ “నిజమే. ‘ఓస్ ఇంతేనా’ అనుకునేంత చిన్న సమస్యే. స్థిమితంగా ఆలోచించాలి అంతే” అన్నది ప్రశంసా పూర్వకంగా చూస్తూ.
ఆరోజు టీ టైంలో మదన్ ముభావంగా కూర్చుని ఉండడాన్ని గమనించింది ప్రణవి. ‘ఉదయమంతా బాగానే ఉన్నాడుగా. ఇంతలోనే వీడికేమైంది. ప్రతివాడిని ఎంకరేజ్ చేయడమే పనిగా ఉంది నాకు. ఎవరు కూడా లైఫ్ ను టేకిటీజీగా తీసుకోవడం లేదు. ఎందుకిలా చేస్తారో. సమస్యను సమస్యగా చూస్తే సమస్యగానే అనిపిస్తుంది. ‘ఓస్ ఇంతేనా’ అనుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా తేలికగా చిక్కుముడి విడిపోతుంది’ అనుకున్నది.
మెల్లగా మదన్ దగ్గరికెళ్లి “ఏంటి తమ్ముడు? ఏం సమాచారం? ఏమన్నాడు బాస్?” అన్నది.
“మామూలే కదక్కా. ఎంత పని చేసినా వీడికి తృప్తి లేదు. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వాడనేదాంట్లో కూడా తప్పేమీ లేదులే. ఒక వారం రోజులుగా వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత చేసినా పని తీరట్లేదు. అసలు పని మీద కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ జీవితం మొత్తం మరీ రొటీన్ గా అయిపోయింది. ఏం చేయాలో తోచడం లేదు” అన్నాడు బాధగా తల పట్టుకుంటూ.
“ఓస్ ఇంతేనా” అన్నది ప్రణవి ఎప్పటిలాగే.
చురుగ్గా చూశాడు మదన్ “చెప్పినంత సులభం కాదది. నా పరిస్థితిలో నువ్వుంటే నీకే అర్థమవుతుందక్కా” అన్నాడు విసుగ్గా.
“నాకంతా అర్థమవుతుంది కానీ ఈ రొటీన్ నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఒక నాలుగు రోజులు సెలవు పెట్టేసి ఎటైనా ఒక జాలీ ట్రిప్ వేసేసి రా. అప్పుడంతా సర్దుకుంటుంది మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది” అన్నది.
“ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బాస్ గాడు నాలుగు రోజు సెలవిస్తాడా. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని అంటున్నాడు. ఎలా వెళ్లగలను?”
తలపంకించింది ప్రణవి “నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే, ఎలాగైనా ఒక్క రెండు రోజులు ఓర్చుకుని ఆ తర్వాత నాలుగు రోజులు కాదు ఒక్క వారం రోజులు సెలవు పెట్టి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. వీలుంటే బాస్ ఫోన్ నెంబర్ నీ ఫోన్లో నుంచి డిలీట్ చేసేయ్ లేదా తాత్కాలికంగా బ్లాక్ చేసేయ్. అదే నేను నీకు ఇవ్వగలిగిన సలహా. నిజానికి నీదేం పెద్ద సమస్య కాదు. నేను చెప్పింది ఆలోచించు నీకే అర్థమవుతుంది.”
ప్రణవి మదన్ తో మాట్లాడే మాటలన్నీ యశోద కోమలి విన్నారు.
‘ఈ అమ్మాయేమిటి తగుదునమ్మా అంటూ అందరికీ సలహాలు ఇచ్చేస్తుంది. ప్రతిదానికి ఓస్ ఇంతేనా, ఓస్ ఇంతేనా అనుకుంటూ ఎగేసుకుని వచ్చేస్తుంది. వాళ్ల వాళ్ల వ్యక్తిగత విషయాల్లో ఉన్న సమస్యలు వాళ్లకే తెలుస్తాయి బయట వాళ్లకి ఎలా తెలుస్తాయి’ అనుకున్నారు.
అయితే మదన్ మాత్రం సాలోచనగా ప్రణవి వంక చూసి “నువ్వు చెప్పింది నిజమే అక్కా. ఇప్పుడే వెళ్లి వాణ్ణి నాలుగు రోజులు సెలవు అడుగుతాను. ఇచ్చాడా సరే, లేకుంటే నామం పెట్టేస్తాను” అన్నాడు ఆవేశంగా.
“నో నో. ఆ పని మాత్రం చేయొద్దు. ఎందుకంటే ప్రాజెక్ట్ ముగించాలి అంటున్నావు కాబట్టి ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత నీ వర్క్ ప్రెషర్ తగ్గాలంటే నేను చెప్పిన పని చెయ్. నాలుగు రోజులు సెలవు తీసుకుని రొటీన్ కు భిన్నంగా అలా వెళ్లి వస్తే మనసుకి కాస్త ప్రశాంతత చేకూరుతుంది. ఓకే” అన్నది.
ఆవేశంగా లేచినవాడు అయిష్టంగానే తలుపుతూ మళ్లీ తన సీట్లో కూర్చున్నాడు మదన్.
అతనివంక తృప్తిగా చూసి తన సీటు వద్దకు వచ్చింది ప్రణవి ‘హమ్మయ్య వాడికి కాస్త ప్రశాంతత కలిగించాను’ అనుకుని తన సీట్ లో కూర్చుంది.
తనకే చూస్తున్న యశోద కోమలిలను చూసి ఏమిటన్నట్టు కళ్లగరేసింది. అబ్బె ఏం లేదన్నట్టు వేగంగా తల అడ్డంగా ఆడించారు ఇద్దరూ. సన్నగా నవ్వేసి తన పనిలో లీనమైంది ప్రణవి.
***
ఆరోజు ఉదయం అరగంట ఆలస్యంగా ఆఫీసుకు వచ్చింది ప్రణవి. ఎప్పుడూ అలా చేయని ప్రణవి ఆరోజు ఆలస్యంగా రావడం యశోద కోమలిలకు విచిత్రంగా అనిపించింది.
పైగా ప్రణవి ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు ఆమె ముఖ కవళికలే చెప్తున్నాయి.
కొద్దిసేపు అయ్యాక యశోద ప్రణవి దగ్గరికి వచ్చింది.
ఏంటి ప్రణవి ఏమైంది అదోలా ఉన్నావు అని అడిగింది.
నిన్న సాయంత్రం హఠాత్తుగా మా ఇంటి ఓనర్ వచ్చి ఒక వారంలోగా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి వెళ్లిపోయాడు. మరి ఒక వారంలోగా ఇల్లు ఎలా ఖాళీ చేయగలం? అప్పటికీ ఒక నెల అయినా గడువు ఇమ్మని చెప్పి చూశాను. అయితే ఆ ఛండశాసనుడు ఏ మాత్రం వినకుండా అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక నిన్న రాత్రి నుంచి ఒకటే దిగులుగా ఉంది. వారం తరువాత వచ్చి మళ్ళీ ఏం గొడవ పెడతాడో అని దిగులుగా ఉంది. ఐనా ఒక వారం లోపల వేరే బాడుగ ఇల్లు ఎక్కడ దొరుకుతుంది?” అన్నది మరింత దిగులుగా ముఖం పెట్టి.
అది విన్న కాసేపటికి యశోద “ఓస్ ఇంతేనా” అన్నది.
తన మాట తనకే అప్పజెప్పడంతో ఉలిక్కిపడి చురుగ్గా చూసింది ప్రణవి.
“అవునే పిచ్చి మొద్దు. ఇది చాలా సింపుల్ విషయం. ఎప్పుడైనా ఇంటి ఓనర్ అనేవాడు తన కిరాయిదారుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నెల ముందుగానే ఇల్లు ఖాళీ చేసేందుకు నోటీసు ఇవ్వాలి. అది నువ్వు రాసుకున్న అగ్రిమెంట్ లోనే ఉంటుంది ఒకసారి చూడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా వచ్చి నిన్ను వెంటనే ఖాళీ చేయమని చెప్పేందుకు అధికారమే లేదు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. మరేం పర్వాలేదు నెల వరకూ కూడా నీకే ఇబ్బంది లేదు. ఈ నెలలోగా వేరే ఇల్లేదైనా చూసుకోవచ్చు నేను కూడా దానికి హెల్ప్ చేస్తాను” అన్నది యశోద.
అలాగా అన్నట్టు చూసింది ప్రణవి. అందరికీ వాళ్ళ వాళ్ళ సమస్యను తేలికపరిచేలా మాట్లాడి ఉపశమనం కలిగించే ప్రణవి మాత్రం తనకున్న ఆ సమస్యను “ఓస్ ఇంతేనా” అనుకోలేక పోయింది. ఐతే యశోద వచ్చి చెప్పిన తరువాత గానీ ఆమెకు కూడా తన సమస్య కూడా “ఓస్ ఇంతేనా” అన్నది అర్థం కాలేదు. యశోద వంక కృతజ్ఞతగా చూసి తేలికగా నవ్వేసింది ప్రణవి.