Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఊరి వాసన

చీకటికొట్టంలో బంధించుకున్న ప్రాణాలు
వెలుతురు పోసుకుంటున్నాయి.
రాత్రిని తాగిన కొందరి నిషా
హాంగోవర్‌కి తగిలించబడింది.

నీళ్ళబిందెలు ఇంకా తలల్ని మోస్తున్నాయ్.
నవ్వుల్లో బాధలు గాలిలో కలిసిపోతున్నాయ్.
మునిపంటిన వయసు ఊపిరిపోసుకొని
కొత్తగారాలు పోతుంటుంది.

ఏరోజు ప్రత్యేకతల్లోనూ దూరని కొందరు
పనుల్ని బాక్సుల్లో పట్టుకొని వెళ్ళిపోతున్నారు.
మర్రిచెట్టు బెంచీపై కూర్చున్న పెద్దోళ్ళు
పేపర్లో దూరిపోయారు.
పిల్లల ట్యూషన్ హడావుడిలో ఊరు ఎప్పటి పాతదే.

పంచాయితీలో గ్రామఫోన్
గుళ్ళలో మంత్రాలూ
నిత్యనూతనమే.

సైకిల్మీద అమ్మొచ్చే కూరగాయలకి
కొందరు ఆడవాళ్ళు బయటకొస్తున్నారు.
కాలవగట్టున కూర్చుని పట్టే చేపలను చూస్తున్న మరికొందరు..

విరిగిన నవ్వులు ఉండవు
మొహమ్మీదే అన్నీ ఆరేసే జాడ్యం
మొత్తానికి ఊరైతే నిర్మలమే..

Exit mobile version