[శరీరావయవాలకు మాటలు వస్తే, అవి ఒకదానితో ఒకటి తమ బాధలు చెప్పుకుంటూ, మనుషులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నట్లు ఈ రచనలో వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
‘ఖళ్ ఖళ్’ మని దగ్గుతూనే ఉన్నాయి ఊపిరితిత్తులు. ఒక్క నిమిషం కూడా ఆగకుండా దగ్గుతూ ఉన్నాయి. సమయం రాత్రయింది. శరీరంలో ఉన్న మూత్రపిండం, కాలేయం, క్లోమం, జీర్ణాశయం వంటి అవయవాలన్నీ నిద్రపోయే వేళయింది. కానీ ఈ ఊపిరితిత్తుల దగ్గుకు ఎవరికీ నిద్ర పట్టడం లేదు. నిద్ర పోదామంటే ఈ ఊపిరితిత్తుల దగ్గు గోల ఎక్కవయింది. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నాయి.
జీర్ణాశయం లేచి ఊపిరితిత్తుల దగ్గరకు వెళ్ళి పలకరించింది. “ఏమైనా నీళ్ళు కావాలా మిత్రమా! తెగ దగ్గుతూనే ఉన్నావు” అని ప్రేమగా అడిగింది. దానికి ఊపిరితిత్తి దగ్గుతూనే సమాధానం చెప్పింది. “నాక్కావలసింది గాలి మాత్రమే కదా మిత్రమా నాకు నీళ్ళెందుకు” అన్నది. ‘అవును కదా’ అని జీర్ణాశయం నాలిక కరుచుకుంది.
“ఎందుకు ఇంత బాధ పడుతున్నావు. పైగా ఈ మధ్య నువ్వు నల్లగా కూడా అయిపోయావు. ఏమైందసలు?” అని జీర్ణాశయం మెల్లగా పలకరించింది. దానికి ఊపిరితిత్తి బాధగా మొహం పెట్టి “ఏం చేయమంటావు మిత్రమా! ఈ మనుషులు చెప్పిన మాట వినరు కదా! రోజూ పెట్టెలు పెట్టెలు సిగరెట్లు తాగుతారు కదా! ‘Smoking is injurious to health’ అని సిగరెట్ల పెట్టెల మీద రాసి ఉన్నా తాగుతూనే ఉంటారు. ధూమపానం వల్ల నా ఆరోగ్యం చెడిపోతుంది కదా!” బాధపడిపోతూ అన్నది ఊపిరి తిత్తి.
“అవును మిత్రమా! నీవు చెప్పింది నిజమే! బీడీలు, చుట్టలు, సిగార్లు అంటూ రకరకాల ధూమపానాలున్నాయి కదా! అయినా మనషుల విచిత్ర ప్రవర్తన నాకు అర్ధం కాదు. అలాంటి హానికారక సిగరెట్లు తయారు చేయట మెందుకు? మళ్ళీ సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అని దాని మీద రాయటం ఎందుకు? ఏమిటో ఈ మనుషుల ఆలోచన?” అంటూ జీర్ణాశయం తల పట్టుకుని కూర్చింది.
“నిజమే జీర్ణాశయం! అంతే కాదు ఎన్నో ఫ్యాక్టరీలు పెడతారు. ఆ ప్యాక్టరీలలో నుండి ప్రమాదకర వాయువులు వెలువడతాయి. ఆ వాయువుల్ని పీలుస్తారు. నన్ను ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తారు. ఆ ప్రమాదకర వాయువుల్ని న్యూట్రలైజ్ చేయవచ్చు కదా! నాకు నష్టం కలగజేస్తే వారి ప్రాణలకే నష్టం కదా!” అన్నది మరో ఊపిరితిత్తి ఆయాసపడుతూ!
“ఏమో మిత్రమా నాకూ అదే అర్ధం కాదు టెక్నాలజీ పెరిగింది. కొత్త కొత్త వస్తువులు కనిపెట్టాం అంటూరు గానీ ప్రాణాలకు ముప్పు కలిగించే వస్తువులను నివారించవచ్చు కదా! నాక్కూడా అరగని నూడుల్స్, జంక్ ఫుడ్ పెట్టి నన్ను బాధిస్తూ ఉంటారు. నాక్కూడా చాలా కోపం వస్తుంటుంది. ఏం చెయ్యాలో అర్ధం కాదు!” కోపంగా అన్నది జీర్ణాశయం.
“నేను ఆక్సిజన్ ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడును బయటకు వదిలిపెట్టాలి కదా! వాతావరణంలో ఆక్సిజన్ శాతం తక్కువై పోతే నేను పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను. వాయు ప్రసార నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల నాకు ఆస్మా వచ్చేస్తోంది. ఆయాసంతో పని చేయలేక చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చలేక పోతున్నాను. మనుషులు చెట్లు నరికేస్తున్నారు. అడవులు ధ్వంసం చేస్తున్నారు. ఆక్సిజన్ వాయువు తగ్గిపోతే బతికేదెలా?” బాధను వ్యక్తం చేసింది ఊపిరితిత్తి.
“మీరింకా తోడుగా ఇద్దరున్నారు. నాకైతే నేనొక్కదాన్నే చేసుకోవాలి. మనిషి తినే చెత్తనంతా అరిగించలేక ఏడుపొస్తోంది. ఎక్కడ పడితే అక్కడ తింటారు. వాటిని అరిగించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది” తన కడుపులో రగులుతున్న బాధను సైతం వెళ్ళ గక్కింది. జీర్ణాశయం.
“ఏం చేస్తే ఈ మనిషి మారతాడు. నాకు న్యూమోనియా, బ్రాంకియోలైటిస్, టిబి, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్, లంగ్ క్యాన్సర్, వంటి అనేకానేక వ్యాధుల్ని తెచ్చిపెట్టి కష్టపెడుతున్నాడు” అంటూ ఉపిరితిత్తులు ఏడవటం మొదలుపెట్టాయి.
ఏడుపు శబ్దం విని ఇటువైపు తొంగి చూసిన గుండె “ఏమైంది ఎందుకేడుస్తున్నావు” అంటూ అడిగింది.
జీర్ణాశయం విషయమంతా వివరించింది. ఇది విన్న గుండె అవునంటూ తలుపుతూ “అంతే కాదు వీళ్ళంతా నగరాల్లోనే ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు నడిపే వాహనాల పొగ వాళ్ళే పీలుస్తూ ఊపిరితిత్తుల్ని నరకయాతన పెడుతన్నారు. నగరాల్లో ఎటు చూసినా గంటల ప్రయాణం. పల్లెల్లో ఉందామని లేదు. ఎందుకో మన కష్టాలు వీళ్ళకేమీ అర్థం కాదు” ఆవేదనగా అన్నది గుండె.
“మిత్రమా మీరన్నా ఏదైనా సలహా ఇవ్వండి. పాపం ఈ ఊపిరితిత్తుల బాధ చూడలేక పోతున్నాను” అని జీర్ణాశయం చెప్పింది.
గుండె కాస్త ఆలోచన చేసి “ఓ పని చెయ్యి నవ్వు చెడు రక్తాన్ని శుభ్రపరిచి మంచి రక్తంగా మారుస్తావు కదా! రెండు రోజులు చెడు రక్తాన్ని శుభ్రం చేయకు. అలాగే నాకు పంపించు. నేను శరీరమంతా పంపించేస్తాను. మంచి రక్తం బదులు చెడు రక్తం శరీరమంతా వ్యాపిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకు అర్థమవుతుంది. అత్యవసరంగా డాక్టరు దగ్గర పడతాడు. అప్పుడు డాక్టరు నీతి సూత్రాలు బోధిస్తాడు. నువ్వు కష్టపడుతూ ఐనా మంచి చేయడానికి ప్రయత్నిస్తే మనుషులు పట్టించుకోరు. కొద్దిగా మనం కూడా స్ట్రైక్ చేస్తే గానీ మాట వినరు. నాలుగు రోజులు ఐసియూలో పడి నరకం కళ్ళ జూస్తేనే గాని మనిషి దారికి రాడు. ఏం చేస్తాం ఎవరైనా మంచిగా చెపితే వినరు కదా! దండోపాయం ప్రయోగం చేస్తేనే మాట వింటారు. ప్రయత్నించు” అని గుండె చెప్పింది.
“ఓకే ఓకే అలాగే చేద్దాం అంటూ బాధను మర్చిపోయి గంతులేసింది ఊపిరితిత్తి. “ఆగు ఆలోచిద్దాం. వెంటనే మొదలుపెట్టకు” అంటూ రెండో ఊపిరి తిత్తి సలహా ఇచ్చింది. “ఏమైనా దీని కన్నా మంచి మార్గం కనిపించటం లేదు” అంటూ రెండు ఊపిరితిత్తులూ ఒకే మాట మీదకు వచ్చాయి.
ఆ క్షణం నుంచీ ఊపిరితిత్తులు కారన్ డయాక్సైడును బయటకు పంపటం మానేశాయి. చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చటం మానుకున్నాయి. మంచి రక్తాన్ని గుండెకు పంపాల్సిన ఊపిరితిత్తులు చెడు రక్తాన్నే పంపటం మొదలు పెట్టాయి. బిగ్ బాస్ మెదడు కూడా ఈ విషయం తెలిసినా సహకరించింది. మనిషికి గుణపాఠం నేర్పాలనే పథకంలో తానూ భాగస్వామురాలయ్యింది.
గుండె సిరల నుంచి వచ్చిన చెడు రక్తాన్ని తీసుకుని ధమనుల ద్వారా మంచి రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది. ఇప్పుడు ఊపిరితిత్తులు పంపిన చెడు రక్తాన్నే మనిషి శరీరంలోని మిగతా అంగాలన్నిటికీ పంపేసింది. అంగాలన్నీ ఆక్సిజన్ లేక గగ్గోలు పెట్టాయి. రక్తంలో పోషకాలు లేక పనిచేయలేక పోయాయి. శరీరంలో అన్ని అంగాలూ కూలబడి పోయాయి. కణాలన్నీ ఆక్సిజన్ లేక తెల్లమొహం వేశాయి. దేహం అంతా అతలా కుతలమై ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. మనిషి ఊపిరి తీసుకోలేక అవస్థ పడ్డాడు.
ఎమర్జెన్సీలో అంబులెన్స్‌ను పిలిచి మనిషిని పెద్ద హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్‌లో ఐసీయూలో జాయిన్ చేశారు. ముక్కుకు, గొంతుకు, కాళ్ళకు, చేతులకు రకరకాల పైపులు అమర్చారు. పరీక్షలు, సెలైన్లు, ఇంజక్షన్లు అంటూ రకరకాల బాధలకు మనిషి కళ్ళు తేలేశాడు.
డాక్టరు ప్రసాదరావు వచ్చాక పరిస్థితి వివరించాడు. “మీరు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. కొన్ని రోజులు నగరానికి దూరంగా ఉండండి. పల్లెలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి. కలుషితమైన గాలికి దూరంగా ఉండండి. అప్పుడే నేనిచ్చిన మందులు పనిచేస్తాయి. అలాగే సిగరెట్లు, బీడిలకు దూరంగా ఉండాలి. నేను చెప్పినవి పాటిస్తే మీరు బతికుంటారు లేదంటే నావల్ల కాదు” అంటూ మొహమాటం లేకుండా వివరించి చెప్పాడు.
ఈ మాటలు విన్న ఊపిరితిత్తులు సంతోషంగా ఎగిరి గంతేశాయి. ‘అమ్మయ్యా! మాక్కొంచెం బాధ తగ్గుతుంది. మేము సంతోషంగా ఉండవచ్చు. ఈ కలుషిత గాలిని పీల్చే బాధ తప్పుతుంది. కొన్నాళ్ళయినా సుఖంగా ఉండవచ్చు. శాశ్వత పరిష్కారం కూడా కనుక్కోవాలి’ అనుకుంటూ ఉల్లాసంగా ఎగరసాగాయి.
జీర్ణాశయం గుండె “మీ బాధ తీరింది కదా! నువ్వు అన్నట్లుగా శాశ్వత పరిష్కారం రావాలి. అయినా ఒకడుగు వేశాం మిగతా అడుగులు పరిష్కార దిశగా పడతాయి” అన్నాయి సంతోషంగా.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.