[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘ఊడల మారెమ్మ’. రచన శ్రీమతి రమాదేవి కులకర్ణి.]
పక్షుల కిలకిలరావములతో తెలంగాణ లోని ఓ మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న రుద్రంకొండ గూడెం నిద్రలేచింది. వెంటనే వార్త గుప్పుమన్నది.
‘చిన్న పటేల్ ఊడల మర్రికాడ రక్తం కక్కుకొని సచ్చిపోయిండు. ఆ ఊడల మర్రి దయ్యం వాడిని చంపింది’.
ఇప్పటికే ఇది మూడో సావు ఆ గూడెంల. చదువు సంధ్యా లేని ఆ కూలి నాలి జనం, చిన్న పటేల్ శవం చూసి భయంతో వణికిపోతున్నారు.
పెద్ద పటేల్, కొడుకు శవానికి దూరంగా నిలబడి రుద్రతాండవం చేస్తున్నాడు. ఏడుపు, కోపం రెండు తన్నుకొని వస్తున్నాయి అతడికి.
“ఇట్టా కుక్క సావు సచ్చినాడు ఏందిరా నా బిడ్యా..!” ఏడుస్తుంది చిన్న పటేల్ తల్లి.
“మారెమ్మని పిలుసుండ్రి, పొగ ఏత్తది. మంత్రం సదుతాది. ఆనాక నా బిడ్డెను తీసుకపోదాము” అరుస్తూ చెప్పాడు పనివాళ్లకి పెద్ద పటేలు.
లింగు పరిగెత్తుకుంటూ మారెమ్మ గుడిసెకు వెళ్ళాడు. “అవ్వా.. సిన్న పటేలు రత్తం కక్కుకొని సచ్చిపోనాడు. ఊడల మర్రి దెయ్యం సంపిన్యాది. పెద్ద పటేలు నిన్ను బేగి రమ్మన్యాడు.” వంగి బయటనుండే నమస్కరిస్తూ..తల మీద గొంగడి భుజం మీద వేసుకుంటూ పిలిచాడు లింగు. ముల్లుగర్ర తీస్కొని లోపల ఉన్న మనుమరాలు దుర్గికి “పైలేం ఊడల మర్రికాడికి ధూపం ఏనీకి పోతాండ” అని చెప్పి లింగు వెంట నడిచింది మారెమ్మ.
మారెమ్మకు కొడుకు, కూతురు. గత్తర లేచినప్పుడు కూతురు చచ్చిపోయింది. అల్లుడు మారు మనువాడిండు. కొడుకు కూలి పని కని దుబాయ్ పోయిండు. వెళ్లి పదిహేను ఏండ్లు అయ్యింది. వాడు ఉన్నాడో.. చచ్చిపోయాడో కూడా తెలియదు. ‘చచ్చిపోయాడు’ అని అంటారు చాలామంది. తల్లిదండ్రి లేని మనుమరాళ్లకు ముసలి అమ్మమ్మ దిక్కయ్యింది. మారెమ్మ మొగుడు ఎప్పుడు చనిపోయాడో ఆఁ పల్లెకు కూడా గుర్తులేదు. కాయ కష్టం చేసుకుని బతికే బీద జనాలకి మారమ్మే పురుడు పోస్తది. ఆకు అలము దంచి ఇంత మందిస్తది. మంత్రం ఏదో సదువుతది. ఆ గ్రామంలో అందరికీ ఆమె మీద నమ్మకం! ఊడలమర్రి దయ్యానికి బలైన మూడో ప్రాణం ఇది. మారెమ్మ వచ్చి ధూపం వేసి ఏదో మంత్రం చదువుతది, అప్పటికి కానీ ఎవరు ఆ శవాన్ని ముట్టుకోవడానికి సాహసించరు. భయంకరమైన ఊడలు, అక్కడికి వెళ్లే సాహసం కేవలం మారెమ్మ వల్లే అవుతది. అందుకే ఆమె ఊడల మారెమ్మ అయ్యింది. సిన్న పటేల్ ఘోరంగా పడి ఉన్నాడు చెట్టు దగ్గర. అప్పుడే ఈగలు ముసురుతున్నాయి. రక్తం వాసనకి పందికొక్కులు కూడా వచ్చాయి.
మారెమ్మ వెళ్లి పెద్ద పటేల్‌కు వంగి దండం పెట్టింది.ఆ తర్వాత గట్టిగా ముల్లుగర్రతో భూమిపైన కొడుతూ ధైర్యంగా మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తన బొడ్డులో నుంచి ఏదో పొట్లం, అగ్గిపెట్టె తీసి ధూపం వేసింది. ఆ తర్వాత ఏవో.. మంత్రాలు చదివి “తీసుకపోండి దొరా..!” అని చెప్పి అక్కడి నుంచి కదిలింది.
“రేపు ఇంటి కాడికి వచ్చి నూకలు తీస్కపో” కొడుకు శవం ముందు ఏడుస్తూ కూడా దర్పంగా చెప్పింది పెద్ద పటేల్ పెండ్లాం, మారెమ్మతో.
సరే అన్నట్టు తలాడించి, నమస్కారం చేసి వచ్చేసింది మారెమ్మ మాట్లాడకుండా.
***
చీకటిగా మారుతున్న ఆ సాయంత్రం.. గుడిసెలను చుట్టుముట్టే చలి గాలులు, గుబులు గుబులుమనిపించే వేళ. చివరనున్న గుడిసె ముందు నెమ్మదిగా బీడీలు చూడుతూ కూర్చుంది మారెమ్మ.
ఎనభై దాటిన వయసు, కళ్ళల్లో ఏ భావమూ లేదు. ముఖమంతా ముడతలు పడి ఉంది, కాయాకష్టం చేసిన దేహం గట్టిగానే ఉంది.
పైడితల్లి బయట నుంచి చూస్తూ “మారెమ్మత్త దండం, ఏం సేత్తున్నవ్ ఇంకా ఈయాల” అంటూ అడిగాడు.
“పిల్ల రాలే ఇంకా.. సూత్తున్న” అంది.
“మారెమ్మవ్వా.. పైలం గీ సందెటాల దాక యాడికి పోయింది మనుమరాలు. పైలం. ఊడలమర్రి దయ్యం అందరినీ పీక్క తింటుంది గంద, నువ్వే మంత్రం ఎత్తున్నవాయే.” అన్నాడు పైడితల్లి.
సమాధానమివ్వకుండా తల ఊపింది మారెమ్మ.
రాత్రి పదకొండు అయింది, మారెమ్మ అప్పుడు వచ్చిన మనుమరాలిని చూసి అడిగింది “ఏమే బిడ్యా.. అలీషిమయ్యింది” అని.
“బస్సు దొరకలే.. అమ్మమ్మా..! శెల్లెకు ఎక్కియ్యనీకి గులాబీ రంగు రిబ్బన్లు తెచ్చిన. దేవులాడేసరికి ఆలీషమయ్యింది” చెప్పింది దుర్గి.
“ముసిలి దాన్ని. ఆలీషమైతే పానం డక్కుడక్కుమంతాది” అనుకుంటూ మనవరాలి చేయి పట్టుకుని లోపలికి వెళ్ళింది మారెమ్మ.
కిందటేడు జాతరలో తను, చెల్లి, అవ్వ దిగిన ఫోటో ఒక అట్టకు అతికించి ఉంది. ఫోటోలో ఉన్న చెల్లెలి మొహం మీద బొట్టుపెట్టి, తను తీసుకొచ్చిన గులాబీ రంగు రిబ్బన్లు చెల్లి ముందు పెట్టి కళ్ళు మూసుకుంది దుర్గి.
దుర్గి కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు రాలి కింద కూర్చున్న అమ్మమ్మ తల పైన పడ్డాయి. “ఏడ్సమాకు.. ఊకో” ఓదార్చింది మారెమ్మ.
“ఏం జేసినవ్ అవ్వా.. ఇయ్యాల్ల, కొమురమ్మకు కాన్పు ఆయేనా..” అడిగింది దుర్గి.
“హా.. మాపటేల్లకే ఆయే.. అంబడాల పిల్లలు ఆడి బిడ్డెలు” చెప్పింది మారెమ్మ.
“ఆఁ.. బా–కావ్‌కు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన్రా.. సాక్తడా సంపుతడా” అన్నది దుర్గి.
“గవేం మాటలే పొల్ల.. ఊకో” గదిమింది మారెమ్మ.
“మర్రిసెట్టు దయ్యం ఇంకోడ్ని బలిగొన్నాది. దారిల సూసిన ఆడికి ఎందుకని గుడిసె కొచ్చిన” అంది దుర్గి
“హా” అంది మారెమ్మ.
పదహారు ఏండ్ల దుర్గి నీలి మేఘాల్లో మెరిసే చందమామలా ఉంది. పాలజొన్న కంకిలా పరువాలతో ఆఁ గూడెంలోని రుద్రం కాలువ వంపులా మెలి తిరిగిన నడుముతో నడుస్తుంటే నర్తకి విన్యాసంలా ఉంది. భానుడి లేత కిరణపు బంగారంలో ముంచి తీసినట్టున్న మేని ఛాయ ఆఁ పిల్ల సొంతం!
మారెమ్మ మనుమరాలిని ఆర్ద్రంగా చూసింది. “ఏంది కితాపతు కూనా..!” అంది.
“ఊడల మారెమ్మ ఉండంగ ఏమైతది అవ్వా, మానాది కాకు” అన్నది.
“పైలం.. పెద్ద పిట్టెలు ఉన్న దునియాల ఉన్నం” అంది.
తెల్లారింది. ప్రతి ఉదయం ఒక విశ్వాసాన్ని మోసుకొస్తుంది. నమ్మకమే ధైర్యం, నమ్మకమే విజయం!
“దండాలు మారెమ్మ..!” గుడిసె బయటనుండి అరుస్తున్నారు ఎవరో.
“ఓల్లాలు..!” బయటకు వచ్చింది దుర్గి.
“అవ్వ ఉన్నదా పొల్లా..! మాయత్తకు జొరం. మందిస్తదని” చెప్పింది అక్కడికి వచ్చిన కమ్లి.
ఇంతలో అక్కడికి వచ్చిన మారెమ్మ ఏదో పసరు మందు ఇచ్చి, కాసేపయ్యాక వచ్చి మంత్రం వేస్తానని చెప్పింది.
కమ్లి, మారెమ్మ కాళ్ళకు దండం పెట్టి వెళ్ళిపోయింది.
***
“వెల్కమ్ టు మై ఛానెల్ ఖతర్నాక్ కార్తి..! తెలంగాణలో అందరు విస్మరించిన ఒక మారుమూల గూడెం ‘రుద్రంకొండ’ కథలు వింతలు విశేషాలతో మన జర్నీ స్టార్ట్ చేద్దాం” చెబుతున్నాడు.. యూట్యూబర్ ఖతర్నాక్ కార్తి!
పెద్ద పటేల్ ఇంటి ముందు ఉన్నాడు కార్తి, తన స్నేహితుడు జగ్గుతో కలిసి. ఒక చిన్న కెమెరాతో అతను చెప్పేది రికార్డు చేస్తున్నాడు జగ్గు.
“సర్.. దయ్యాలు భూతాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? మీ అబ్బాయి ఎలా రక్తం కక్కుకుని చనిపోయాడు. దయ్యమే అతన్ని చంపేసిందా? ఈ మారెమ్మ ఎవరు? ఆమె ముట్టుకుంటే కానీ మీరందరూ శవాన్ని ఎందుకు ముట్టుకోవట్లేదు? ముగ్గురు ఇదేవిధంగా ఎలా రక్తం కక్కుకొని చనిపోయారు? మీరేమనుకుంటున్నారు?” ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతున్నాడు ఖతర్నాక్ కార్తి పెద్ద పటేల్‌ను.
అంతటి గంభీరమైన మనిషి కూడా దయ్యం భయంతో హడలిపోతున్నాడు.
ఇంటిల్లిపాది చేతులకు తాయత్తులు గమనించాడు కార్తి.
***
తెల్లవారి తిరిగి మళ్ళీ తన కెమెరా, జగ్గుతో తన బుల్లెట్ బండి మీద రుద్రంకొండ బయలుదేరాడు ఖతర్నాక్ కార్తి. ఇది మూడవ రోజు అతని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి.
“జగ్గూ.. నీవేమనుకుంటున్నావ్ రా ఈ రుద్రంకొండ గురించి” అడిగాడు కార్తి.
“ఫస్ట్ టైం ఇప్పసార తాగిన అన్నా! మస్తు కిక్ వచ్చింది” అన్నాడు జగ్గు.
“బండి మించి తోసేసాను అనుకో, కాలువలో పడి చస్తావ్. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావ్ రా తాగుబోతు వెధవా” తిట్టాడు.
“సారీ అన్నా.. బీదరికం. అమాయకులు. కానీ ఈ చావులే నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆ ముసలిదాన్ని చూస్తే భయం వేస్తుంది. కానీ మనమరాలు దుర్గి మాత్రం మస్తు స్మార్ట్ ఉంది” అన్నాడు జగ్గు.
ఆ రోజంతా గూడెంలో అందరితో మాట్లాడుతూ తిరుగుతూనే ఉన్నాడు కార్తి. సాయంత్రం జగ్గుకు బండి ఇచ్చి హైదరాబాద్ పంపించేశాడు. నీవెక్కడుంటావని అడిగితే సమాధానం చెప్పకుండా, తనను తిరిగి మరుసటి రోజు రమ్మని చెప్పాడు.
చీకటి పడుతున్న వేళలో ఆ మర్రిచెట్టుకు కొద్ది దూరంలో ఉన్న ఒక గుడిసెవైపుకు దుర్గి ఎవరితోనో వెళ్తుంది. కార్తి మెల్లిగా అనుసరించాడు.
అదొక చింకి చీదరమైపోయిన గుడిసె. లోపలికి లావుగా ఉన్న అతనితో సహా వెళ్ళి తడక అడ్డంగా పెట్టుకున్నారు.
కార్తిని వాళ్లు గమనించలేదు. వాళ్లు లోపలికి వెళ్లాక తడక కంతల్లోంచి లోపల జరిగేది చూసి ఆశ్చర్యపోయాడు. నోట మాట రాలేదు కార్తికి!
పదిహేను నిమిషాల తర్వాత పూర్తిగా స్పృహ లేకుండా ఇప్పసారా కంపుతో తూలుతూ బయటకు వచ్చాడు అతను. అతని రెండు భుజాలు పట్టుకొని మెల్లగా బయటకు వస్తున్నారు దుర్గి, లింగు, మారెమ్మ వాళ్ళ వెనకాల కర్ర చంకలో పెట్టుకోని నడుస్తుంది. ఒళ్లు తెలియని స్థితిలో నడుస్తున్నాడు ఆ వ్యక్తి. మర్రిచెట్టు వరకు నడిపించారు అతనిని. అక్కడ తూలి కింద పడిపోయాడు. కాసేపటికి రక్తం కక్కుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు ఆ వ్యక్తి. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరారు మారెమ్మ, దుర్గి, లింగు.
వాళ్లని అనుసరిస్తూ వచ్చిన కార్తి దయ్యం లాగా వెళ్లి వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఊహించని ఈ హఠాత్ సంఘటనకి దయ్యాన్ని చూసినట్లు గజ గజ వణికిపోయారు ముగ్గురూ..!
***
అర్ధరాత్రి పన్నెండు అవుతుంది. మారెమ్మ గుడిసెలో కూర్చుని ఉన్నారు నలుగురు. ఆ ముగ్గురితో బాటు కార్తి!
మెల్లిగా.. ఇలా చెప్పసాగింది మారెమ్మ.
“సావు పుటక మడిసి సేతులో ఉందవు. ఆ దేవుని దయ అంతరు. అట్టే అనుకుండా గానీ.. మడిసి ఎట్టా బతుకాల్నో ఆడి సేతులనే ఉంతాది దొరా, అడవి మడుసులం, ఆకు అలము సెట్టు పుట్టా వాగు వంకనే మాకు దేముడు. మా ఆడిబిడ్డెలు మాకు అమ్మోరు నెక్క. మా ఆడిబిడ్డెలనే పొట్టన ఎత్తుకుంటే.. సూత్తా కూకోనేము. నా సిన్న మనుమరాలు ఎన్నెల. ఎన్నెల కాసినట్టే ఉండేది. ఎనిమిదేండ్ల పసికూన. నాలుగు అడవి పందులు మీద పడి రక్కి మానం పానం తీసినాయి. వాగులమ్మ, వంకమ్మ సెట్టు పుట్ట పటేలు, దొర, పోలీసు అందరి కాల్లు మొక్కిన ఓలు ఆసరగాలె. ఊర కుక్కలను తరిమినట్టు తరిమినారు. ఏమి సేసేది? యాడ దాసేది ఆడబిడ్డెల్ని..!” చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడవడం మొదలు పెట్టింది మారెమ్మ.
దుర్గి అమ్మమ్మని ఓదారుస్తూ.. తను మొదలుపెట్టింది ఏం జరిగిందో చెప్పడం “సిన్నపిల్ల దొరా.. నా సెల్లి సదువంటే పానం సదుకో నీకి గూడెంల పెట్టిన బడికిపోతుండె. లింగు మామ గా బడి కాడ ఊడ్చెటోడు. ఓపాలి ఆ బడిల సదువు సెప్పే పంతులు, పెద్ద పటేల్ కొడుకు సిన్న పటేలు, కంటాట్టరు గుర్నాతం, ఇప్పుడు సచుండ్ల ఆ పోలీసు అందరూ సందెటాల గదే బడిల కూకొని తాగుతా ఉన్నరు. లింగు మామనే మందు పోస్తాన్నడు. మా గాచారం బానేక నా సెల్లి ఏదో పుత్తకం మరిసినానని బడి క్యాడికి పోనాది. ఆ బాడ్..వ్ల కండ్ల బడింది. పసిపిల్లని కూడా సూడకుండ రాచ్చచంగ సెరిసి సంపినారు. సంపి మర్రిసెట్టు దగ్గర పారేసినారు దొరా..!” వెక్క సాగింది దుర్గి.
“నాను.. సానా బతిమాడిన, కాల్లు మొక్కిన అయినా ఇడ్సలేదు బిడ్డెను. ఓలకు సెప్పే దైర్నం మాకు నేదు. ఓలు మా మాట ఇనరు దొరా.. మా బతుకు ఎట్టుంటాదంటే.. దేవుని గుడిల తల దాసుకోనికి పోతే కప్పు ఇరిగి నెత్తి మీద పడతాది దొర. అసలు మేము మడు సులమేకాదు దొర. మా బతుకులకు, మా పానంకు ఇజ్జతు, ఇలువ నేదు.” చెప్పాడు లింగు.
“కార్జం ముక్కనైనాది.. సాన మొత్తుకున్నం, దేవుడు గోడు ఇన నప్పుడు మడిసె దేవుడైతడు, దయ్యం సుత అయితడు. సచ్చిన మా ఎన్నెల దయ్యమైనాది. అందర్నీ పీక్క తింటున్నాది. మర్రిసెట్టుమీద ఉన్యాది. ఊడలకు యల్యాడుతున్యాది. మా ఇంటిదానికి కనబడి సెప్పిన్యాది. రగతం కక్కుకుని సచ్చిన పీనుగను ఓలు ముట్టరు. మారెమ్మే ముందు ముట్టాల గందుకే ఊడల మారెమ్మ అయినాది” చెబుతున్నాడు లింగు.
“మ్మ్..!” అంటూ గాఢంగా నిట్టూర్చాడు కార్తి అర్థమైందన్నట్టు తల ఊపుతూ!
***
“హాయ్.. హలో దిస్ ఇస్ ఖతర్నాక్ కార్తి. నేను ఇప్పుడు మీకు చెప్పేది నిజంగా నమ్మలేని నిజం! ఈనాటి ఆధునిక ప్రపంచంలో కూడా ఇంకా దయాలు భూతాలు ఉన్నాయా! ఉన్నాయి అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ‘రుద్రంకొండ’ గూడెం!
అకాలమృత్యువుకు గురైన ఒక పసిపాప దయ్యంగా మారి ఆ గూడెంలో ఆడపిల్లల పైన అత్యాచారం చేస్తున్న వాళ్లని చంపుతుంది. ఇది నిజమా?! కాదా?! అక్కడ చనిపోయిన శవాలను కూడా ముట్టుకునే సాహసం ఎవరూ చేయడం లేదు. కేవలం ఆ ఊర్లో ఉన్న ఎనభై ఏళ్ల ముసలి అవ్వ ‘మారెమ్మ’ మాత్రమే శవాలని ముట్టుకోగలుగుతున్నది. ఆమే ‘ఊడల మారెమ్మ’. ఆవిడతో ముచ్చట్టిద్దాం” అంటూ తన ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు ఖతర్నాక్ కార్తీ తన ఛానల్‌లో!
***
ఇంటర్వ్యూ అయ్యాక జీపులో మారెమ్మను, దుర్గిని వాళ్ళ గూడెంలో వదిలిపెట్టి తిరిగి ప్రయాణమయ్యారు కార్తి మరియు జగ్గు.
“చదువు సంధ్యా లేని ఓ పదిహేనేండ్ల అమ్మాయి, ఓ పండు ముదుసలి ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఆలోచిస్తేనే భయం వేస్తుంది” అన్నాడు జగ్గు.
“భయపడేది ఏముంది జగ్గు? చట్టం, ధర్మం, దైవం చేయలేని సహాయాన్ని తమకు తామే చేసుకుంటున్నారు. తమకు తామే రక్షగా నిలబడ్డారు. అలా ఉండడమే కాకుండా ఆ గూడెంలో ఇంక యే కామపిశాచి కూడా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడకుండగా న్యాయ వ్యవస్థను ఊడలమర్రి దయ్యం పేరుతో పటిష్టం చేశారు” అన్నాడు కార్తి.
“ఇలా దయ్యం చంపడం. ఇవన్నీ ఛానల్లో చూపిస్తే నమ్ముతారా అన్నా..! జనాలు” అన్నాడు జగ్గు
“పొద్దున్న లేస్తే.. లక్షల వ్యూస్ ఉన్న వీడియోస్ ఏంటో నువ్వు చూడట్లేదా!? జాతకాలు దయ్యాలు, భూతాలు మంత్రాలు – తంత్రాలు, క్షుద్రపూజలు వీటినే ఆధునిక మానవులు గుడ్డిగా నమ్ముతున్నది! ఆధునికులం అనుకుంటున్న చాలా మంది వీటినే నమ్ముతున్నారు. అలాగని శాస్త్రమే లేదని నేను వాదించట్లేదు. మూర్ఖత్వం ఎక్కువ అయిపోయింది అని చెప్తున్నాను” అన్నాడు.
“అసలు ఏం చేశారన్న వాళ్ళు” అడిగాడు
“ఆ చిన్న గూడెంలో అమాయక జనం మీద దౌర్జన్యం చేస్తూ ఆడపిల్లలను వేపుకు తింటున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పారు ఆ మనవరాలు, ముసలవ్వ, లింగు సహాయంతో. ఎన్నెలను హత్య చేసిన తర్వాత వాళ్లు చాలా మంది కాళ్ళా వెళ్ళాబడ్డారు. ఎవరు కనికరించలేదు. లింగుకు వాళ్లే చంపారు అని చెప్పే ధైర్యం లేదు. అసలు లింగును ఒక మనిషిగానే గుర్తించలేదు ఆ దుర్మార్గులు. మారెమ్మ అప్పుడు ఒక ఆలోచన చేసింది. తనకు తెలిసిన అడవి వైద్యంతో కొన్ని మూలికలు సేకరించి ఒక విషపూరితమైన లేహ్యాన్ని తయారు చేసేది. తాము చంపాలి అనుకున్న వాళ్ళని దుర్గి సాయంవేళలో మెల్లిగా కవ్వించి గుడిసె దగ్గరికి తీసుకు వచ్చేది. ఇప్పసారాలో ఆ లేహ్యం కలిపి తాగించేది దుర్గి. అప్పటికే ఆ గుడిసె వెనకాల ఉన్న లింగు, మారెమ్మ కూడా గుడిసెలోకి వచ్చేవారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని మెల్లిగా నడిపించుకుంటూ మఱ్ఱిచెట్టు వరకు తీసుకెళ్లడం, అక్కడ వాడు రక్తం కక్కుకొని చనిపోయాక, చనిపోయాడు అని నిర్ధారణ చేసుకున్నాక చడీ చప్పుడు కాకుండా తిరిగి తమ గుడిసెకు చేరుకునేవారు. తన భార్యకు ఎన్నెల దయ్యంగా మారి కనబడిందని, మారెమ్మ మంత్రం వేస్తుందని, మారెమ్మను దయ్యం ఏమి చేయదని ఇలా ప్రచారాలు చేస్తూ రావడం లింగు పని. లింగుతో పాటుగా గ్రామంలో కొంతమంది కూడా ఇదే నిజమని నమ్మి తెలియకుండగానే మారెమ్మని ఒక మాంత్రికురాలిగా చేసారు. లింగు మౌత్ పబ్లిసిటీ ఆ గ్రామంలో వీళ్ళకి రక్షణగా తయారైపోయింది. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా మార్చేశాయి. తమను తాము రక్షించుకోవడం వాళ్ళకి ఆ ప్రకృతమ్మనే నేర్పించింది. నేను చేస్తున్నది రైటో.. రాంగో నాకు తెలియదు. మర్డర్ చేసింది వాళ్లే అని తెలుసు. కానీ ఆ ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి వాళ్లే ఒక పోలీసు దళంగా, న్యాయవ్యవస్థగా మారి పనిష్మెంట్ వేశారు అని నమ్ముతున్నాను. మారెమ్మ ‘ఊడల మారెమ్మ’ గానే ఉండాలి. అదే దుర్గితో బాటు మిగతా కొందరు ఆడపిల్లలకు రక్ష!
అందుకే నేను కూడా నా చిన్న ఛానెల్ ద్వారా ఆ భయాన్ని ఇస్తున్నాను. భయం అవసరమే!! నేను కూడా ఆ ప్రకృతి సాక్షిగా చనిపోయిన ఆ పసిపిల్లకి ఇస్తున్న నివాళి” అన్నాడు కార్తి ఆర్ద్రమైన కంఠంతో!
