Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒంటరి జంట

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఒంటరి జంట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

వాన ఎండల నడుమ
ఋతు చక్రంలో చలినవ్వు
రోజులు మారిన క్రమంలో
ముందో వెనుకో చలి గాండ్రించే పులి

మంచు దుప్పటి ముసుగేసే
ఎద ఎదపై
కౌగిలి నెగళ్ళ చేతుల్లో వేడి
అందీ ఉందని
ఊహల లోకంలో చెక్కిలిచెలి

ఊపిరిగొట్టాలన్నీ పేరుకునున్న కఫఫేనం
మొసమర్లని వింతలు మనలో
వేడీ వెచ్చదనం వెతికే
మనసుకు
నెబులైజేషన్ చాలా గొప్ప రిలీఫ్

యవ్వనానంతర వృద్ధోపనిషత్
ఉడిగిపోయే పరిషత్ మాత్రమే కాదు
ఆగని కాలంలో
ఆఖరి చరణం దూరం తెలియదు
అందాక
అనుభవాల లాఘవంతో లాగేదే జీవకావ్యం

శిశువులు వృద్ధులు
తొలిమలి జీవితాలు వెలిగించే శక్తులు
యుక్తితో
కష్టాల కడలి ఈదుతున్న అజేయులు

ఎముకలు కొరికే చలి
హిమాలయాల్లోనే కాదు పచ్చని
పొలాల ఊరువాడల ఎదల్లో
కన్నేసిన ఒంటరి తుంటరి కోరే తోడు

Exit mobile version