[ఒమన్ దేశంలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు డా. నర్మద రెడ్డి.]
ఇటీవల మేము ఒమన్ దేశంలోని మస్కట్‌లో పర్యటించాము. మస్కట్ అనే పదం ఫ్రెంచ్ పదం మస్కట్ నుండి వచ్చింది. దీని అర్థమేమిటంటే అదృష్టం ఆకర్షణ. మా ఈ పర్యటనలో మేము 2 నైట్స్, 3 డేస్ ఉన్నాము.
మేము మస్కట్ కి సాయంత్రం 7:00 కి చేరాము. అక్కడ ఒక కార్ తీసుకొని షెరటాన్ హోటల్‌లో దిగాము. ఇక రాత్రికి తినేసి విశ్రమించాము. మర్నాడు ఉదయం, దర్శనీయ ప్రాంతాల కోసం నెట్‍లో వెతికితే, చాలా దూరంగా ప్లేసెస్ చూపించింది. చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కాని మేము ఉండే ఆ రెండు రోజులలో వెళ్ళిరావడానికి కుదరదనినిపించింది. కిందికి వెళ్లి రిసెప్షన్‌లో కనుక్కుంటే వారు 7 చూడదగ్గ స్థలాల జాబితా ఇచ్చారు.
ఆ జాబితా లోని కింగ్స్ ప్యాలస్‍కి వెళ్ళాము. తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేటివ్ హాల్ చూసాము. వేరువేరు దేశాల నుంచి వచ్చిన వారంతా సభలు నిర్వహించుకోవడానికి ఉద్దేశించిన ప్రదేశానికి వెళ్ళాము.
అక్కడి నుంచి ఫోర్ట్‌కి అంటే మన రాజు గారి కోట లాంటి భవనానికి వెళ్ళాము. రాజ భవనాల తోటి ఉన్న ఆ ఫోర్ట్ బాగా శిథిలమైంది. ఈ కోట సముద్రం పక్కగా, ఎత్తైన కొండ మీద ఉంది.
ఇక్కడ చూడాల్సినవన్నీ చూస్కోని మేము సముద్ర తీరానికి వచ్చాము. ఆ సీ షోర్ దగ్గర ‘సుక్కు’ అంటే వారి భాషలో అది షాప్స్ అన్నమాట! ఆ షాప్స్ ఉన్న వీధులలోకి వెళ్ళాము. షాపులు చాలా వరకు చిన్నవి, పెద్దవి మాత్రం దగ్గర దగ్గర 8, 9 ఉన్నాయి లోపల. అక్కడ చక్కటి ఆర్ట్ వేసిన చిత్రాలు, సుగంధ ద్రవ్యాలు అమ్మే షాపులు, బట్టలు కార్పెట్స్ ఇవి అవి అని తేడా లేకుండా అన్నీ వస్తువులు అక్కడ దొరుకుతాయి. పురాతనమైనవి, అత్యంత ఆధునికమైన వస్తువులు కూడా దొరుకుతాయి. అవన్నీ చూస్కోని భోజనం చేసి మేము మా హోటల్ కి వచ్చి ఒక గంట రెస్ట్ తీసుకొన్నాం. ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు.
తిరిగి మధ్యాహ్నం 3:00 గంటలకి బయటికి వెళ్లాము. 3:00 గంటలకి మేము కుర్రం అనే చోట బీచ్‌కి వెళ్ళాము. ఈ బీచ్‌లో చక్కగా అందరూ హ్యాపీ బర్త్‌డేలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకచోట పెద్ద శబ్దాలతోటి ఫైవ్ స్టార్ హోటల్లో కూడా బర్త్‌డే చేసేసుకుంటున్నారు. అవన్నీ చూసుకుంటూ దగ్గర దగ్గర ఒక 10,000 అడుగులు వేసాము బీచ్‌లో. ఆ చక్కటి సాయంత్రం, సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించిన వేళ – ఆ సూర్యబింబం తోటి, హ్యాపీగా అలలతో ఆడుకుంటూ పాడుకుంటూ సూర్యాస్తమయన్ని తిలకించుతూ దగ్గర దగ్గర రాత్రి 8:00 గంటల వరకు అక్కడే ఉన్నాము.
ఎనిమిదింటికి మళ్ళీ ఒక రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ చక్కటి సీ ఫిష్ ఆర్డర్ చేసుకొని చిప్స్ తర్వాత అన్ని కలిపి తినేసి అక్కడినుంచి హోటల్‍కి వెళ్ళాలని ట్రై చేస్తే, ఎంతసేపటికి కారు దొరకలేదు. చాలా దూరం నడుస్తూ వెళ్ళాకా, చివరికి ఒక టాక్సీ దొరికింది. దాంట్లో రూమ్‌కి చేరాము.
***
మర్నాడు ఉదయం 9:30కి బయలుదేరి, డాల్ఫిన్స్ చూడ్డానికి సముద్రం దగ్గరకు వెళ్ళాము. మరీనా బీచ్ వ్యూస్ కి వెళ్ళాము. మరీనా బీచ్ వ్యూస్ కి వెళుతూ ఉంటే చాలా ఎత్తయిన కొండలు, దోహా అంతా మనకు కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో మేమైతే మస్కట్ మొత్తము ఒక రౌండ్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకి తిరిగేసాము ఈ కారులో. ఆ చుట్టు తిరుగుతూ భూసాన్ అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఈ భూసాన్ అనే ప్లేస్ అంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం పచ్చగా ఉండేదట. భూసాన్ అంటే గ్రీన్ మౌంటెన్ అంటే పచ్చటి కొండలు అనేది అర్థమట. అయితే ఆ పచ్చటి కొండలన్ని ఇప్పుడు ఎలా తయారైనాయంటే అసలు మనకు ఒక చెట్టు కూడా కనిపించదు, అలాంటి ఎడారి ప్రాంతం లాగా అయిపోయింది ఆ ప్రాంతమంతా. అక్కడ ఒక సెవెన్ స్టార్ హోటల్ కూడా ఉంది. ఆ సెవెన్ స్టార్ హొటల్ చాలా బాగా కట్టారు. అక్కడ నుంచి బయలుదేరి మేము ఈ డాల్ఫిన్ వ్యూస్ దగ్గరికి వెళ్ళాము. ఆ రోజు మాకు డాల్ఫిన్స్ కనిపించలేదు. కానీ ఆరోజు అలలు 3 మీటర్ల ఎత్తున పొంగి, రెండు బోట్లు విరిగిపోయాయి. అది చూసి నాకు చాలా బాధ వేసింది. ఆ బోట్స్ అన్నీ విరిగిపోయాయి. మళ్ళీ ఒక మిషన్ తోటి బ్లాకు అని తీసుకొని పైకి తీసుకొచ్చారు. అక్కడే, అదే రోజు 4.2 స్కేల్‌తో భూకంపం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. అవన్నీ చూస్తూ మేము సీ షోర్ దగ్గర చాలాసేపు గడిపాము. అక్కడ నుంచి హోటల్‍కి చేరడానికి టాక్సీ కోసం ట్రై చేస్తే దొరకలేదు. ఈలోపు ఒక మలయాళీ అబ్బాయి మా దగ్గరకు వచ్చి మాది ఒక వెహికిల్ వస్తుంది, ఆ వెహికిల్‌లో మీరు వెళ్లొచ్చు, అని కాస్త ఎక్కువగానే రేటు చెప్పాడు. కానీ మేము కాస్త బార్గెయిన్ చేశాము. తను 8 అడిగాడు మేము 5 ఇస్తామనంటే సరే అన్నాడు. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు అదే స్థలానికి ఒకటిన్నర రియాల్స్ ఖర్చు పెడితే, ఇప్పుడు 8 అడుగుతున్నాడు.
బార్గెయిన్ చేసి 5కి ఆ అబ్బాయిని ఒప్పించాము. లేకపోతే, ఆ ఎడారి ప్రాంతంలో ఇక మేము స్ట్రక్ అయిపోయేటట్టు ఉన్నాము. అందుకని వెంటనే బయలుదేరి వచ్చేశాము. మాకు ఇక్కడో ఒక పెద్ద గ్రూప్ కనిపిచింది. వాళ్లను అడిగాము – డాల్ఫిన్స్ చూడడానికి వెళ్ళారు కదా, డాల్ఫిన్స్ కనిపించయా అని. లేదని చెప్పారు. మేము కూడా బోట్‌లో వెళ్దామనుకుంటే బోట్ విరిగి పోయింది కాబట్టి మేము వెళ్ళలేకపోయాము. అక్కడి పరిసరాలు అన్నీ చాలా అందంగా ఉన్నాయి అవన్నీ తిలకిస్తూ కాసేపు కూర్చున్నాము.
తరువాత మేము ఒపేరా హౌస్‍కి వెళ్ళాము. ఒపేరా హౌస్ చాలా బాగుంది. ఒపేరా హౌస్ ఎందుకో ఆ రోజు మాత్రం మూసి ఉంది. శనివారం నాడు తెరవరట. ఒపేరా హౌస్ చూడకుండా ఒపేరా హౌస్ చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసాము. ఈలోపల అక్కడే చక్కటి ఫ్రెంచ్ మ్యూజిక్ తోటి ఒక సంగీత వాయిద్యాల తోటి జరుగుతున్న ప్రదర్శన కనబడింది. ఇలాంటివి, ఎప్పుడో చిన్నపుడు చూసాను కానీ అంత గుర్తు లేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా వింతగా అనిపించింది. అది ఎలా ఉంది అంటే, ఒక అబ్బాయి పియానో మీద మ్యూజిక్ వేస్తున్నాడు; ఒక అమ్మాయి తన హావభావాల తోటి పాట పాడుతుంది. ఎంత పెద్దగా అంటే ఆ మొత్తం బిల్డింగ్ అంతా దద్దరిల్లిపోయింది. పెద్దగా పాడుతూ హావభావాల తోటి చక్కటి విన్యాసాల తోటి ఓ పాటను పాడుతూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకో అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు వచ్చారు ఆ హావభావాల తోటి. నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి అబ్బాయి బయట ఒక గార్డెన్‍లో కలుస్తారు. పలుకరించుకొని వాళ్ళిద్దరూ కొద్దీ రోజులకి లవర్స్‌గా మారిపోతారు. ఆ భావనను వాళ్ళిద్దరూ వ్యక్తీకరించుకుని కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి బయటికి వెళ్ళి, వారి దేశానికి వెళ్లిపోవడానికి ఆ అమ్మాయి వద్ద సెలవు తీసుకుంటాడు. అప్పుడా అమ్మాయి బాధా, బయటికి వెళుతూన్న ఆ అబ్బాయి బాధా అన్నీ కూడా ఈ పాటలో కనిపిస్తాయి. చాలా బాగా చిత్రీకరించారు. నేను దగ్గర దగ్గరగా 12:30 నుంచి 1:30 వరకు ఈ సంగీత విన్యాసాలను విని చాలా ఆనందిస్తూ బయటికి వెళ్ళాను.
మమ్మల్ని ఈ ట్రిప్ కారులో తీసుకొచ్చిన అబ్బాయి చెప్పాడు – కొండపైన చివారున, ముంతాజ్ అనే ఒక హోటల్ ఉందని. ఆ ముంతాజ్ అనే హోటల్ మన ఇండియన్ రెస్టారెంట్ అట. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిందట. ఈ మస్కట్‌లో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ఈ హోటల్‌కి వెళ్ళండి అని చెప్పాడు. సరే మేము బయటికివచ్చి ఆ ముంతాజ్ హోటల్‌కి వెళ్ళాము. నిజంగా ముంతాజ్ హోటల్ అలనాడు ఆగ్రాలో ముంతాజ్ పేరు మీద షాజాహన్ కట్టించిన తాజ్‍మహల్ అంతటిది కాదు కానీ చక్కటి ప్రదేశంలో అంత ఎత్తులో, చాలా బాగా కట్టారు. ఆ కొండ పైనా ఆ చుట్టు పక్కల ఉన్న అందాలన్నీ చూస్తూ మేము భోజనం చేసాము. అక్కడ దగ్గర దగ్గర రెండు గంటలు కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది. అప్పుడు మావారు “These are the memories forever” అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఈ అనుభూతూల్నీ, కొన్ని పాత జ్ఞాపకాలనీ నెమరువేసుకుంటూ అక్కడ కొన్ని ఫోటోస్ దిగి మేము కిందకి వచ్చాము.
ముందు రోజు ఒక హోటల్లో ఉన్న అమ్మాయి మాకు ఇక్కడ ఒక యాప్ వేసి ఇచ్చింది. ఓలా కార్ మాకు చాలా బాగా నచ్చింది. చక్కగా మేము బయటికి వచ్చేముందే మన ఊబర్ లాగా బుక్ చేసుకుంటున్నాము. అది వన్ డాలరు టూ డాలర్స్ లో చక్కగా ఊరంతా తిప్పుతుంది. అది చాలా చాలా నచ్చేసింది. ముందు రోజు మాత్రం మేము ఎయిర్‍పోర్ట్ నుండి వచ్చేటప్పుడు 8 రియాల్స్ కడితే వెళ్ళే రోజు మేము కట్టింది 4 రియాల్స్.
అక్కడి ప్రజలతోటి కలుస్తూ చక్కటి ఫ్రెండ్లీ నేచర్ తోటి అందరితోటి మాట్లాడుకుంటూ ఒపేరా హౌస్ నుండి మేమూ మా హోటల్‌కి వచ్చేశాము. హోటల్‌లో అక్కడే చిన్న షాప్ ఉంది. ఆ షాప్‌లో అన్నీ పూసలు దండలు కాశ్మీరీ షాల్స్, పాస్పిన్ షాల్స్ ఇలా ఎన్నెన్నో రక రకాల వస్తువులు ఉన్నాయి. అవి చూసి – ఈయన ఇంత పెద్ద షాప్ పెట్టాడు కానీ ఇక్కడికి ఒక మనిషి కూడ రావట్లేదు, ఈ అబ్బాయి ఏం సంపాదించుకుంటున్నాడో అని అనిపించింది. షాపంతా చూసి అక్కడే సోఫాలో ఫ్లైట్ టైం అయ్యేవరకు అక్కడే కూర్చున్నాము.
ఒక గంట తరువాత ఆ షాప్ ఓనర్ బయటికి వచ్చాడు. “మీరు ఇంత పెద్ద షాప్ పెట్టారు అయినా ఒక మనిషి రాలేదు మేము అప్పటి నుండి చూస్తున్నాం మీకు బిజినెస్ ఎలా నడుస్తుంది” అని అడిగాము. “లేదండి, మీరు మధ్యహ్నం వచ్చారు కాబట్టి ఎవరు లేరు. మాకు ఉదయం 7:00 గంటల నుంచి 10:00 గంటల వరకు నడుస్తుంది. సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు నడుస్తుంది అని చెప్పాడు. సాయంత్రం 5 నుంచి 9 వరకు బాగా రష్ ఉంటుంది. నేను 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. మాది కాశ్మీర్. అక్కడి నుంచి ఆ వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాను. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి” అని చెప్పాడు. ఆయనతో కాసేపు మాట్లడి టీ తాగి మేము మా ఫ్లైట్ టైం అయ్యిందని అక్కడి నుంచి వచ్చేసాము.
ఎయిర్‍పోర్ట్‌లో ఒక అబ్బాయి ఒక టికెట్ గురించి ఇబ్బంది వచ్చింది. ఆ అబ్బాయి టికెట్‍లో పాస్‍పోర్ట్ నెంబర్ ఉంది. కానీ టీ.ఎన్.ఆర్ నెంబర్ లేదు. దానివల్ల ఆ అబ్బాయి చాలా అవస్థలు పడుతున్నాడు. అబ్బాయి ఒక కౌంటర్‌కి వెళ్తే ఆ అమ్మాయేమో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. ఆ అబ్బాయికేమో హిందీ మాత్రమే వచ్చు. నేను ఆ అబ్బాయికి కాస్త హెల్ప్ చేసి, ఇద్దరి ముగ్గురితో మాట్లాడి లోపలికి పంపే విధంగా హెల్ప్ చేశాను. తరువాత నేను మా వారు కలసి లౌంజ్ లోపలికి వెళ్లాము.
ఇంకా మాకు ఒక గంట టైం ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. అక్కడ కూర్చున్నాం. ఆ టైం లో ఒక అమ్మాయి కలిసింది. అక్కడే మస్కట్‌లో పనిచేస్తుందట. వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు కలిసి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళని పలకరించాను. ఒక అమ్మాయి ఇక్కడికొచ్చి రెండు సంవత్సరాలు అవుతోందట. మరో రెండు సంవత్సరాల తరువాత ఇండియాకి వస్తుంది. ఆ అమ్మాయిది భీమవరం. ఆమె గురించి అడిగాను. ఎంత వస్తుందంటే 20,000 వస్తుంది నాకు. నేను మన భారతదశంలో ఉండి ఇవే వంట పనులు అన్నీ చేసినా కూడా ఇరవై వేలు సంపాదించలేను. కాబట్టి అది ఒక్కటే కాకుండా ఒక కొత్త దేశానికి వచ్చినా చూసిన అనుభూతి, ఆ ఉత్సుకత బాగుటుంది. మా ఊరిలో కూడా మా గౌరవం బాగుటుంది అనే ఉద్దేశంతోటి నేను ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను అని చెప్పింది.
ఇంతకీ ఎంతమంది పిల్లలు అని అడిగితే, ఇద్దరు అమ్మాయిలని చెప్పింది. ఇద్దరు అమ్మాయిలే పుట్టినందుకు, మగ పిల్లాడు కలగనందుకు భర్త ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడట. ఆ అమ్మాయి అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈ దేశానికి వచ్చిందట.
ఇక్కడ పని ఎలా ఉంటుంది అని అడిగితే “నాకు 24 గంటలూ పని ఉంటుందమ్మా. పొద్దున లేచి వంట చేస్తాను. ఇల్లంతా ఊడుస్తాను. బట్టలు ఉతుకుతాను. ఇల్లు తుడుస్తాను తరువాత మళ్ళీ వంట వండుతాను. ఇవ్వన్నీ చేశాక కూడా నాకు రెస్ట్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక తల్లి కొడుకు కూతురు వీళ్ళు ముగ్గురే ఉన్నా కూడా తల్లి చాలా ఏజ్డ్ పర్సన్. అందుకే ఆ అమ్మకి నేను సేవలు చేస్తూ ఉండాలి. ఆమె నన్ను ప్రతీ అరగంటకి ఒకసారి పిలుస్తూనే ఉంటుంది హెల్ప్ చేయమని. తనని బాత్రూమ్ వరకు తీసుకెళ్ళి యూరిన్ పోయించాలి. తరువాత మగ్గులోని వాటర్ అని ఇదని అదని రాత్రంతా కూడా నాకు సరిగ్గా నిద్ర ఉండదు. చాలా కష్టపడుతున్నాను అని చెప్పింది. అయితే ఈ రెండు సంవత్సరాలలో నాకు భోజనం బట్టలు అని అక్కడే జరుగుతాయి కాబట్టి వచ్చినవీ వచ్చినట్టుగా కూడబెట్టుకొని ఒక 5 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. 5 లక్షల్లో నేను పెట్టింది 450000/- మాత్రమే మిగతా 50000/ మా అన్నయ్య ఇచ్చాడు. మా అన్నకి తిరిగి ఇవ్వాలి. అయితే ఈసారి మేము ఇక్కడికి రావటం లేదు, కువైట్ వెళ్దామని అనుకుంటున్నాము. అప్పుడు ఒక కొత్త ప్రదేశం, కొత్త మనుషులు! అదొక్కటే కాకుండా పని కూడా తక్కువ ఉంటుందేమో. అప్పుడు అక్కడ ఇలా ఉంటుందంటే వంట పని అయితే ఒండ్లి వంట పని అలాగా అయ్యితే మనం చేసుకోవచ్చు. మిగతా టైమతా నాకు రెస్ట్ దొరుకుతుంది. అందువల్ల నేను వేరే దేశానికి వెళ్ళాలని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
ఆ అమ్మాయి బాధ విన్న తరువాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకే వెళ్లగొట్టడా అని చాలా చాలా బాధేసింది. ఆ అమ్మాయి ఇండియాకి వచ్చినప్పుడు కలవాలని అనుకున్నాను. ఇండియా నుంచి తీసుకెళ్ళిన చెకోడిలు, ఆల్మండ్ హౌస్ నుండి తీసుకెళ్ళిన బిస్కట్సు.. ఇలాగా నా దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ అక్కడున్న నలుగురైదుగురు అమ్మాయిలకీ పంచి పెట్టాను, వాళ్ళు హాయిగా తినుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ముచ్చటేసింది. అంత కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ల నవ్వు చూసి హ్యాపీగా అనిపించింది.
అలా మిశ్రమ అనుభూతులతోటి మేము తిరిగి వచ్చాం.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన డా. నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.