[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఒక్కసారి పలికావంటే..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వేల వసంతాలని
ఒక్కసారిగా వీక్షించలేము!
అందమైన వెన్నెలలు
ప్రతిరోజు పలకరించవు!
నీలాకాశం వెలుగురేఖలని
నిరంతరం పంచలేదు!
కోయిలమ్మల సుస్వరాలు
సంవత్సరమంతా వినిపించవు!
పూలెంతగా పుష్పించినా
పరిమళాలు విశ్వమంతా వ్యాపించవు!
ఒక్కసారి తను తలపుకొస్తే
ప్రియంగా నా వైపు చూస్తూ పలకరిస్తే..
అసాధ్యాలన్నీ సుసాధ్యాలనిపిస్తాయి!
ప్రకృతి ప్రసాదించే ప్రతి అందం, ఆనందం
తనలో అగుపించే సమ్మోహనం!
నా ప్రియనేస్తం వరములు
గుప్పించే దేవత తానై ఎదురవుతుంటే..
ఎన్నడూ వీడని అనుబంధాల
పరవశాలన్నీ నావవుతుంటాయి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.