[శ్రీమతి నంద్యాల సుధామణి రచించిన ‘ఒకే ఒక్కడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండ్‌లో మావూరి బస్సెక్కి కూర్చున్నానన్న మాటే గానీ.. ఎప్పుడెప్పుడు ఊరికి చేరుతానా.. అని ఒకటే తహతహ నాలో. ఎందుకంటే ఊరి మొహం చూసి పదహైదేళ్ల పైమాటే అయింది.
నా కొడుకుకు తన కూతురిని చేసుకోలేదన్న (వాడు తన క్లాస్‌మేట్‌ను ఇష్టపడి చేసుకున్నాడు లెండి) కోపం మనసులో పెట్టుకుని.. అన్నావొదినా నాతో అంటీముట్టనట్లు వుండటం, నా పిల్లలు ఇద్దరూ అమెరికాలో వుండటంతో.. నాకూ గ్రీన్ కార్డు రావడంతో.. మనవలను, మనుమరాళ్లనూ పెంచడానికి మీద మీద అమెరికా ప్రయాణాలూ.. చాలా రోజుల పాటు అక్కడే వుండి పోవడం.. దీంతో ఊరికి పోవడమే కుదరలేదు. అన్నా వాళ్లూ మాట్లాడటం చాలా అరుదై పోయింది.
ఇప్పుడైనా ఊరి ముందర పొలం ప్లాట్లుగా చేసి అమ్మడానికి నా సంతకం కావాల్సి వొచ్చింది కాబట్టి.. మా అన్న పిలవడం, నేను పోవడం జరుగుతోంది.
మాగాణి భూములు, కొబ్బరితోటలూ, పెద్ద పెద్ద నదులు, చెట్ల తోపులూ, కాలవలూ ఏమీ వుండవు మా వూళ్ల వైపు.
చిన్నచిన్న కొండలూ, మెట్ట పొలాలూ, అక్కడక్కడా చిన్న చెరువులు, చిన్న నదులూ, తాడిచెట్లూ, వేప, ఇతర చెట్లు వుంటాయంతే! ఆ కొండలన్నీ నల్లమల కొండల కొస భాగాలు.
అయితే మాత్రమేం తక్కువ యిందీ.. ఆ గాలిలోని స్వచ్ఛమైన, కమ్మని ఆత్మీయ పరిమళాలు శరీరాన్ని, మనసునూ హత్తుకొని సేదతీరుస్తాయి. ఎన్నెన్నో ఊసులు చెబుతాయి.
కొట్టినట్టుగా వుండే అక్కడి ప్రజల మాటతీరులో నిష్కాపట్యమూ, మొరటుగా కనిపించే ఆ మనుషుల్లోని స్నేహశీలతా నా మనసును కట్టిపడేస్తాయి. పదహైదేళ్లుగా నేను దూరం చేసుకున్న ఆ నల్లరేగడి పొలాలనూ, బోడిగా వున్న కొండలూ బండలనూ, వాటి మధ్య పెరిగి, ఎండిన గడ్డినీ చూస్తూ వున్నాను.
ఆ ప్రకృతిలోని సౌందర్యాన్ని అణువణువూ ఆస్వాదిస్తూ, ఇవన్నీ నావి అనే భావంతో తాదాత్మ్యం చెందుతూ వుండగానే బనగానపల్లె బస్టాండ్‌లో బస్సు ఆగింది.
సూట్‌కేస్ పట్టుకుని దిగిన వెంటనే ఆ మట్టిని కాస్త తీసుకుని తలపై చల్లుకోవాలని అనిపించింది. ఎందుకంటే అది నేను పుట్టిన నేల.. మా ఊరు అక్కడికి దగ్గరే. అది పోతులూరి వీరబ్రహ్మం గారు నడిచిన నేల! బంగారం లాంటి బంగినపల్లి (బేనీషా) మామిడిపండ్లు పండే నేల!
నేను నేల పైకి ఒంగే లోపలే.. “అక్కా.. నువ్వే కదా ఎంకటేశ్వర రావు సారు సెల్లెలివి. ఇందిరమ్మక్కవు నువ్వే కదా.. ఎప్పుడో చిన్నప్పుడు చూసినానక్కా.. గుర్తుపట్టలేదు. ఏమనుకోవొద్దు. నేను బండ మీద పల్లె నుంచి వొచ్చినానక్కా.. నా పేరు అంజి. గొల్ల సుంకన్న కొడుకును. సారు నిన్ను పిల్సుకోని రమ్మన్నాడు” అని గబగబా మాట్లాడినాడు అంజి.
నన్ను పిలుచుకొని పోవడానికి అన్న రానందుకు మనసు చివుక్కుమంది. అయినా సర్దుకున్నాను.
“అట్లనా? అయితే పద. నువ్వు సంజమ్మ కొడుకువా? పెద్దోణివైనావురా.. మీ అమ్మానాయనా బాగున్నారా? నీవేం చేస్తున్నావు.. ఎందరు పిల్లలు..” అంటూ ప్రశ్నలు వేస్తున్నాను.
“దారిలో అన్నీ చెప్తా రా అక్కా..” అంటూ చనువుగా నా చేతిలోని సూట్‌కేస్ అందుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటలయింది. వైశాఖమాసం ఎండ ఈడ్చీడ్చి కొడుతున్నది. అయినా నా ఆనందానికి అది పెద్ద అడ్డంకి కాలేదు. నాకు మలయ పర్వతం మీద నడుస్తున్నట్టుగా వుంది. అతని ఆటో దగ్గరికి తీసుకెళ్లినాడు. అది చాలా పెద్ద ఆటో .
“అక్కా.. నువ్వేమనుకోకుంటే.. మన వూరోళ్లు కొందరు ఆటోలో కూర్సుంటారక్కా..” అని ప్రాధేయపూర్వకంగా అడిగినాడు అంజి.
“అయ్యో.. కూర్చోనీవయ్యా.. ఇంత పెద్ద ఆటోలో నేనొక్కదాన్నే ఎట్లా కూర్చుంటాను..” అన్నాను.
నన్ను ముందు సీట్లో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంజి. ఆడా మొగా అందరూ బిలబిల్లాడుతూ ఆటోలో సర్దుకోని కూర్చున్నారు. అందరూ కలగాపులగంగా మాట్లాడుకుంటూ వున్నారు. అంజి తన కుటుంబం గురించి ఏవో చెప్పినాడు. కానీ ఆటో సౌండులో సగం మాటలు అర్థం కాలేదు.
ఆటో బనగానపల్లె వీధుల్లో నుంచి పోతుంటే చిన్నప్పుడు చదువుకున్న హైస్కూలు కనిపించింది. అప్పటి స్నేహితురాళ్లు, టీచర్లూ, అప్పటి విషయాలూ అన్నీ గుర్తుకొచ్చినాయి. పోతులూరి వీరబ్రహ్మం గారి మఠం కనిపించింది. దండం పెట్టుకున్నాను. ఊరు మారి పోయింది. కొంత ఆధునికతను సంతరించుకుంది.
రోడ్డు బాగుండటంతో ఆటో త్వరగానే మా వూరి వైపు పరిగెత్తింది. మా వూరి పరిసరాలన్నీ మారిపోయినాయి. ఎండాకాలంలో కూడా పొలాల్లో పంటలు వేసినారు. ప్రతీ పొలంలో బోరింగ్ పంపులు నీళ్లు తోడి పోస్తున్నాయి. మరోవైపు రకరకాల చెట్లు వరుసలు వరుసలుగా కనిపిస్తున్నాయి. అంతకుముందు అక్కడ మట్టి, రాయి మిశ్రమంగా వుండే బంజరు భూములు ఉండేవి.
ఆశ్చర్యంగా చూస్తుండగానే మావూరిని ఆనుకొని వుండే కొండ కనిపించింది దూరంగా.
కానీ కొండ మీద, బట్టతల వారి మీద తలమీద జుట్టులా అక్కడక్కడా పెద్దా చిన్నా చెట్లు కనిపించినాయి.
ఆశ్చర్యపోతూ.. “అంజీ.. మన వూరి కొండ బోసిగా వుండేది కదా.. ఇన్ని చెట్లు ఎప్పుడొచ్చినాయి? ఎండాకాలంలో కూడా మన వూరి చెరువులో అన్ని నీళ్లు ఎట్లా వున్నాయి?” అన్నాను ఆశ్చర్యంతో.
“అక్కా.. నువ్వు వూరిని అస్సలు గుర్తుపట్టలేవక్కా.. అంత మారిపోయింది మనూరు. ఆ ఒక్క మణిసి ఊరినంతా కూడగట్టి, బాగుచేసినాడక్కా.. ఆ మగానుభావుడు.. చెయ్యెత్తి దండం పెడుతున్నారక్కా.. వూరి వాళ్లందరూ..” పరవశంతో, భక్తితో చెప్పినాడు అంజి.
“మన వూళ్లో పుట్టిన అంతటి ‘మగానుభావుడు’ ఎవరు నాయనా అంజీ..?” ఆసక్తిగా, ఎగతాళిగా అంజి మొహంలోకి చూస్తూ అడిగినాను నేను నవ్వుతూ. అతను కొంచెం హర్ట్ అయినట్టుంది.
అతను జవాబు చెప్పే లోపలే వెనక నించి “ఇంకా నీకు తెలియదా అమ్మా.. ఆ పిల్లోని గురించి? మీ అన్న గారింట్లో బట్టలుతికే అన్మంతు కొడుకు బాలరాజు.. మగానుబావుడు” కంఠంలో కొంచెం గర్వం తొణుకుతుండగా చెప్పింది యాగంటమ్మ అనే కూరగాయలమ్మే ఆమె. నా అజ్ఞానానికి ఆమె ఆశ్చర్యం ప్రకటించినట్లనిపించింది.
మా వూరికి దగ్గర్లోనే యాగంటి క్షేత్రం వుంటుంది కనుక ఆ పేర్లు ఆ ఊళ్లలో ఇంటికొకరికుంటాయి.
“వాడా? బాలరాజా.. మహానుభావుడు అంటే..? ఉత్త పోరంబోకుగా తిరుగుతుండేవాడు కదా.. టెన్త్‌లో ఎన్ని డింకీలు కొట్టినాడో లెక్కలేదు కదా..? వీధుల్లో పడి అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు.. వాడు మహానుభావుడు ఎప్పుడైనా డబ్బా..” అన్నాను తిరస్కార భావం నా గొంతులో వీలైనంత పలికిస్తూ.
అందరూ ఒక నిముషం పాటు మాటరానట్టు మ్రాన్పడిపోయినారు. అందరూ నన్ను ధిక్కార భావంతో చూస్తున్నట్టు అనిపించింది. వారందరికీ కోపం కూడా వొచ్చిందనిపించింది.
“నీకేం తెలుసక్కా వా(ఆ)యన గురించి? ఊరి మొగం చూడకుండా, నీవెక్కడో అమెరికాలో కూర్సోని, ఇప్పుడొచ్చి ఏమేమో మాట్లాడుతాన్నావు? వాయన దేవుడి కంటే ఎక్కవ మాకు! ఒకానొకప్పుడు నీవు చెప్పినట్టే వుండేవాడులే.. కానీ, మిలిట్రీలో చేరినాంక వాయిన మణిసే మారిపోయినాడక్కా..” అంటూ కొంచెం కినుక బూనిన స్వరంలో అంజి, బాలరాజు గురించి చెపుతూంటే..ఆటోలోని వాళ్లంతా తలో మాటా చెప్పడం మొదలుపెట్టినారు.
ఇంతలో మావూరి చెరువుగట్టు మీద ఆటో ఆగింది.
కొందరు అక్కడ దిగినారు.
“అదుగో అక్కా.. వాయనే.. బాలరాజు. ఆ పక్కనే నిల్సుకుని వుండేటాయన ఈ వూరి పంచాయతీ ప్రసిడెంటు యాగంటి రెడ్డి. పక్కనే ఊళ్లోని పెద్దోళ్లున్నారు” అంటుండగానే వాళ్ల మధ్యలో నిలుచుకోని మాట్లాడుతున్న మా అన్న గబగబా వొచ్చి “అమ్మా.. ఇందిరా.. ప్రయాణం బాగా సాగిందా? ఎన్నాళ్లకు చూసినానే నిన్ను..” అంటూ ప్రేమగా చేతులు పట్టుకోని అడిగినాడు. చిన్న తడి ఆ కళ్లలో. ఆ స్పర్శ పదహైదేళ్ల దూరాన్ని కాస్త తగ్గించింది. నేనూ కళ్లలోకి పొంగుకొచ్చిన కన్నీళ్లతో చూసినాను అన్నను. కాసేపు నా చెయ్యి వదల్లేదు అన్న.
ఇంతలో బాలరాజు, యాగంటి రెడ్డి, ఇతరులు వొచ్చి నమస్కారాలు చెప్పి కుశల ప్రశ్నలు వేసినారు.
బాలరాజు చిన్నప్పుడు బక్కగా వుండేవాడు. జులాయి లాగా వుండేవాడు. ఇప్పుడు బలంగా, పొడుగ్గా, చూడగానే గౌరవనీయుడు, నెమ్మదస్తుడి మాదిరి కనిపిస్తున్నాడు. ఎంత మార్పు?
“బాలరాజూ.. పెద్ద హీరో అయిపోయినావు కదయ్యా.. అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు” అన్నాను ఆటో దిగుతూ.
“అదేం లేదక్కా. మనోళ్లకు ఇంతుంటే అంత చెప్పడం అలవాటే కదా.. నేను మిలట్రీలో చేరి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను అక్కా.. అవి కొన్ని ఇక్కడ అమలులో పెట్టినానక్కా.. అంతే..” అన్నాడు ఎటో చూస్తూ.
“నువ్వు రాంగ్ టైము లో వొచ్చినావక్కా.. నేను రేపే వెళ్లిపోతున్నా.. కొంచెం టైం వుంటే నీకు మేము చేసిన మంచిపనులు అన్నీ దగ్గరుండి చూపేవాణ్ని. నీవు జర్నలిస్టువు కదక్కా. బాగా అర్థం చేసుకుంటావని.. అంతే! నీకు ఓపికుంటే ఇప్పుడైనా కొన్ని చూపిస్తానక్కా. ఇంకా పొద్దు గూకడానికి గంటపైనుంది” అన్నాడు బాలరాజు వాచీ చూసుకుంటూ. నా మొహం లోకి అతను ప్రశ్నార్థకంగా చూస్తూన్నాడు.
“నాకేమీ అలసట లేదయ్యా.. మన వూరిని చూడగానే ఎక్కడలేని ఓపిక, ఉత్సాహం కలిగాయి. చూద్దాం పద..” అన్నాను.
అక్కడే వున్న సోడాబండి పిల్లోడితో గోలీ సోడా కొట్టించి నాకు ఇచ్చినాడు బాలరాజు. ఆ గోలీసోడా నా పురాతన జ్ఞాపకాలను తవ్వి పోస్తూ నా గొంతులోకి చల్లగా జారింది.
నా సూట్‌కేసును మా అన్నగారి ఇంట్లో పెట్టమని అంజికి చెప్పి చెరువు వొడ్డున నడుస్తున్నాడు బాలరాజు. పక్కనే యాగంటి రెడ్డి కూడా. వారి పక్కన నేను నడుస్తూన్నాను.
“మాయమ్మ నిన్ను ఎప్పుడూ తలుచుకుంటా వుంటాదమ్మా.. నీవొస్తాన్నావంటే నీ కోసం కాసుకోని కూర్సోనుంది. ఎంకటేశ్వర్లు సారుతో నిన్ను ఊరికి రమ్మని ఎందుకు పిలవలేదని కొట్లాడుతా వుంటాది” అన్నాడు యాగంటి రెడ్డి నవ్వుతూ.
“అవునా? రేపు కలుస్తాలే.. ఎట్లయినా చిన్ననాటి స్నేహితురాళ్లం కదా!” అన్నాను నేను తలెత్తి అతని వైపు చూస్తూ.
అక్కడ చెరువు గట్టు మీద ఆంజనేయులు గుడి, పక్కనే గ్రామదేవత మూలమ్మ గుడి వున్నాయి. గుడి ముందరున్న అరుగు మీద కూర్చోని మాటల్లో పడినారు మా అన్న, ఇంకా వూళ్లోని వాళ్లు. చిన్నగా వుండే మూలమ్మ గుడి ఇప్పుడు విశాలంగా కట్టించినారు. ఆంజనేయునికి కూడా పెద్ద గుడి కట్టించినారు. మనసులోనే అమ్మవారికి, హనుమంతునికి నమస్కరించుకున్నాను.
బాలరాజు తన విషయాలన్నీ చెప్పడం మొదలు పెట్టినాడు.
బాలరాజు ఏదో తప్పుచేస్తే తన తండ్రికి కోపమొచ్చి చావబాదాడట. దాంతో ఏదో ఒకటి సాధించాలని కర్నూలుకు పారిపోయి అక్కడ మిలటరీలో చేరిన వైనం చెప్పాడు. తను మిలటరీలో ధోభీగా చేరాడట. గుజరాత్ లోని కచ్‌లో పోస్టింగ్ ఇచ్చినారట. అన్ని రకాల సైనిక శిక్షణలూ పొందాడు. మిలటరీ ఇంజనీర్ జగన్నాథ్ పాండే అనే ఒరియా ఆయన దగ్గర పనిచేశాడు. వాళ్ల యూనిట్ లోని సిపాయిల బట్టలుతికి, ఇస్త్రీ చెయ్యడం.. తాను, తనతో పాటు పనిచేసే మరి కొందరు ధోభీల పని.
కొన్ని రోజులకు పాండే గారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మిలటరీ శిక్షణతో పాటు, ఆయన ప్రేరణతో దేశభక్తి అంటే ఏమిటో.. దేశాన్ని ముందుకు తీసుకొనిపోవడానికి ఏమేమి చెయ్యాల.. ఎంత అవిశ్రాంతంగా కృషి చెయ్యాల.. ఎంత నిబద్ధతతో పని చెయ్యాలో అర్థం చేసుకున్నాడు. అక్కడి వాతావరణం బాలరాజులో దేశభక్తిని ప్రోదిచేసింది. దేశం కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టాలనే పట్టుదల పెరిగింది.
పాండే గారికి రాని పనంటూ లేదు. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. అలా ఆయన దగ్గర, తన తోటి పనివాళ్ల దగ్గర తోట పని, కరెంటు రిపేరు పనులూ, ప్లంబింగ్ పనులూ, కార్పెంటర్ పనులూ, మిషన్ల రిపేర్లు అన్నీ నేర్చుకున్నాడు. సిమెంటు ఇటుకలు తయారుచేయడం నుంచి కారు, మోటార్ సైకిల్ రిపేర్ దాకా ప్రతీ ఒక్క విషయంలో కొంత నైపుణ్యాన్ని సంపాదించు కున్నాడు.
పని చెయ్యడంలో, నేర్చుకోవడంలో అతని చురుకుదనం చూసి అతనిని సొంత కొడుకులా చూసుకున్నాడు పాండే సాబ్. ఎన్నో విషయాలు చెప్పేవాడు. తరువాత కాలంలో ప్రైవేటుగా డిగ్రీ కూడా చేయించినాడు. అట్లా అతనెన్నో విషయాలు ఆకళింపు చేసుకుని మనోవికాసం పొందినాడు.
సైన్యంలో చేరిన తర్వాత సంవత్సరానికి సెలవులు వొస్తే ఊరికి వొచ్చినాడు బాలరాజు. అమ్మా నాయనా ప్రయోజకుడై తిరిగొచ్చిన కొడుకును చూసి ఆనందించినారు. ఇంటి బాధ్యతలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లు చేసినాడు బాలరాజు.
కానీ, ఊరి పరిస్థితి అతనికి బాధ, ఆందోళన కలిగించింది. ముఖ్యంగా నీళ్ల కరువు, ఊరి వాళ్లను వేధిస్తున్న కోతులు గుంపులు, ఊళ్లో పిల్లలకు సరైన చదువు లేకపోవడం, పూర్తి స్థాయి ఆసుపత్రి లేకపోవడం, సరైన స్కూలుభవనం లేకపోవడం, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేకుండా అల్లరి చిల్లరగా తిరగడం, విచ్చలవిడిగా మద్యం సేవించడం వంటి అనేక సమస్యలు అతన్ని ఆందోళనకు గురిచేసినాయి.
తాను సంపాదనపరుడై తన ఇంటిని చక్కదిద్దుకుంటున్నాడు. కానీ ఊరికేమైనా చెయ్యాలి. అదే కదా పాండే సాబ్ చెప్పేది.
అందుకే ముందు ఊళ్లోని పిల్లలను కూర్చోబెట్టి దేశమంటే ఏందో, దేశసేవ అంటే ఏమిటో, మన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాల్నో, దాని కోసం ముందు మనం ఊరినెట్లా కాపాడుకోవాల్నో, సైనికులు దేశం కోసం ఎట్లా ప్రాణాలను పణంగా పెడతారో, ఏయే సైనికులు ఎన్నెన్ని సాహసాలు చేసినారో.. తమ రెజిమెంట్ మీద పాకిస్తాన్ దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే.. తమ సైనికులు వాళ్లను ఎట్లా మట్టి కరిపించినారో.. ఇట్లా అందరినీ ఉర్రూతలూగించేలాగా చెప్పేవాడు. అలానే రోజూ సాయంత్రం గుళ్లో భజన చేయించేవాడు. దేశభక్తికి దైవభక్తి కూడా తోడు కావాలని అతని అభిప్రాయం. మిలటరీలో కూడా వారానికోసారి భజన వుంటుంది. అతని మాటలు వినే శ్రోతలలో పెద్దవాళ్లు కూడా చేరినారు. అట్లా అందరినీ తన మాట వినేటట్టు చేసుకున్నాడు. తన బంధువుల పిల్లలు కొందరు, ఊళ్లో పిల్లలు కొందరూ సైన్యంలో చేరుతామని ముందుకొచ్చినారు. చుట్టుపక్కల ఊళ్ల పిల్లలు కూడా అతన్ని రకరకాలుగా సంప్రదించడం మొదలుపెట్టినారు. ఆ తరువాత కాలంలో చాలా మంది సైన్యంలో చేరినారు కూడా. కొందరు పోలీసు శాఖలో కూడా చేరినారు.
***
ఊళ్లో నీటి కరువు పోవాలంటే ముందు చెరువులో పూడిక తీయించాలని యాగంటి రెడ్డిని, ఊళ్లో ఇతర పెద్దవాళ్లను సంప్రదించి, ఒప్పించినాడు బాలరాజు.
రైతులందరూ వారి వారి ఖర్చుతో, శ్రమతో చెరువులోని ఒండుమట్టిని తమ చేలల్లోకి తోలుకున్నారు.
పంచాయతీ డబ్బు, ఊరివారు ఇచ్చిన చందాలతో చెరువును మరింత లోతుగా, వెడల్పుగా తవ్వుకున్నారు. ఊరివారు శ్రమదానం చేసినారు. ఈ విషయం ఫోనులో పాండే గారికి చెప్పినాడు బాలరాజు. ఆయన మరో సలహా ఇచ్చినాడు. కొండపై నుంచి చెరువులోకి వచ్చే నీరు పక్కకు పోకుండా, అన్ని నీళ్లూ అందులోకి చేరేటట్టుగా కొండ దిగువన కొన్ని కాలువలు (కాంటూర్లు) తవ్వించమని చెప్పారు. వీళ్లకు సాంకేతిక సహాయం అందజెయ్యడం కోసం తనకు తెలిసిన సివిల్ ఇంజనీరు ఒకాయనను ఒడిస్సా నుంచి పంపించినాడు పాండే సాబ్. ఆ ఇంజనీరు ఈ రకమైన పనుల్లో నిష్ణాతుడు.
ఆయన వచ్చి నాలుగు రోజులుండి ఆ కాలువలు ఎట్లా, ఎంత లోతు తవ్వాలో, ఏ ప్రాంతంలో తవ్వాలో అన్నీ డ్రాయింగ్‌లు గీసి, ఆ వూళ్లో వున్న రిటైర్డ్ సీవిల్ ఇంజనీరుకు సలహాలు చెప్పి వెళ్లిపోయినాడు. ఆయన ఫీజు కూడా తీసుకోలేదు.
ఆ ప్రాంతపు రాజకీయనాయకుల సహాయంతో ఆ పని పూర్తి అయింది. చెరువు కట్ట పైన చింత, వేప, కానుగ వంటి చెట్లు నాటించి, వాటికి రక్షణ, నీళ్లు మొదలైన ఏర్పాట్లు చేసి, తన సెలవు పూర్తికావడంతో తాను గుజరాత్‌కు వెళ్లిపోయినాడు బాలరాజు. మరుసటి ఏడాది వర్షాలు సమృద్ధిగా పడటంతో చెరువు నిండింది. కొండ పైన పడిన ప్రతి వర్షపు చినుకూ చెరువులోకి చేరి, ఎన్నడూ చూడని విధంగా పొంగి పొర్లింది చెరువు. దాని వల్ల వూళ్లోని బావుల్లో సమృద్ధిగా నీళ్లు వూరినాయి. అట్లా నీళ్ల సమస్య పరిష్కారం అయింది.
నన్ను మంత్రముగ్ధురాలిని చేసింది బాలరాజు ప్రసంగం. ఊపిరి బిగబట్టి విన్నాను.
ఇంతలో చల్లని నిమ్మకాయ సోడాలు పంపించినారు అన్నా వాళ్లు. చెరువు ఒడ్డున ఒక బండపై కూర్చుని నిమ్మకాయ సోడా తాగి “ఆ తరువాత ఏం జరిగిందో చెప్పు బాలరాజూ..” అన్నాను.
అతని మాటల్లో ఏదో కట్టిపడేసే శక్తి, నిజాయితీ, నిబద్ధత వుందనిపించింది.
“మళ్లీ ఆర్నెల్లకు సెలవు పై వొచ్చి నాను. వొచ్చే ముందే పాండే సాబ్ అడిగినాడు.. “ఈసారి ఊరి కోసం ఏం చెయ్యాలనుకుంటే ఉన్నావ్?” అని.
“సార్.. ఈసారి మావూరి మీద దాడి చేస్తున్న కోతులను తరిమేస్తాను సార్..” అన్నాను కోపాన్ని చూపిస్తూ.
“అదే మరి ఆలోచన లేకపోవడం మంటే.. కోతులను పట్టుకోని అడివిలో వొదులుతావు. వాటి తిండీతిప్పల సంగతేమిటి? అవెట్లా పోయినా ఫర్వాలేదా? అవి మన పిల్లల్లాంటివి కావా? మనుషులు మాత్రం బాగుండాలా? అవి జీవులు కాదా.. మళ్లీ రోజూ హనుమంతుడి పూజ చేస్తావు. మళ్లీ కోతులను ఎందుకు ద్వేషిస్తున్నావు? అవి చేసిన తప్పేమిటి? అవి ఊరి మీద ఎందుకు పడుతున్నాయి చెప్పు? పిడికెడు తిండి కోసం రాజూ.. అడవులన్నీ నరికేస్తిమి. వాటికి తిండీ లేదు. నీళ్లూ లేవు. నివాసానికి తగిన చెట్లు లేవు. ప్రకృతిలోని జీవులన్నింటినీ ప్రేమించడం నేర్చుకో.. ప్రకృతి నీకు అనుకూలంగా స్పందిస్తుంది. అప్పుడు ప్రకృతి మాత చూపించే ప్రేమను తట్టుకోలేవు. ముందు మీ ఊరి కొండ మీద పండ్ల చెట్లు పెంచు. కొండపైన వీలు పడితే నీళ్ల వసతి ఏర్పాటు చెయ్యి. లేదా వాన నీళ్లు నిలిచేందుకు చిన్న గుంటలు తవ్వించు. కనీసం కొన్ని నెలల పాటైనా కోతులకు, ఇతర జంతువులకు దాహం తీరుతుంది. అవన్నీ మిమ్మల్ని, ఊరినీ దీవిస్తాయి.”
“ఇట్లా ఎన్నో పద్ధతులు చెప్పారు పాండే గారు. నాకు ఒక్కసారి నెత్తి తిరిగిపోయిందక్కా..తల్లో లైటు వెలిగినట్టు అయింది. చేయాల్సిందేమో అర్థమయింది. తెలియక ఎన్ని తప్పులు చేస్తామో అర్థమయింది.
నేను ఊరి కొచ్చి యాగంటన్నతో కోతుల సమస్య గురించి మాట్లాడినాను. అసలు ఈ అన్న సహాయం లేకుంటే ఒక్క పని కూడా ముందుకు పోయేది కాదక్కా.. ఇద్దరం కలిసి విషయమంతా ఊరోళ్లందరినీ కూర్చోబెట్టి వివరం చెప్పినాము. దీనికి విరాళాలు అడిగినాము. కొంత డబ్బు సేకరించినాము. కొందరు శ్రమదానం చేస్తామన్నారు. అట్లా కొండంతా తిరిగి రాళ్లకు మధ్య బీటలున్న చోట్ల తవ్వి, లోతు చేసి, ఒండుమట్టి పోసి, సీతాఫలం, రేగు, గంగరేగు, జామ, దానిమ్మ, చీనీ, నిమ్మ, సపోటా లాంటి పండ్లచెట్లను నాటినాము. కొండల్లోనే పండే కొన్ని చిన్న చిన్న పండ్ల చెట్లు బిక్కిపండ్లు, చిటిముటిపండ్లు, జముడుపండ్ల వంటి అనేక రకాల విత్తనాలు సేకరించి, వీలున్న చోటంతా నాటినామక్కా.. అక్కడికి ఎవరూ పోకూడదని, అక్కడి పండ్లు కోయకూడదని, పసువుల కాపరులు కొండెక్కకూడదనీ యాగంటన్న చాటింపు వేయించినాడు.
మరి పండ్లచెట్లు పెరిగి పెద్దవయ్యే వరకూ కోతులకు తిండి ఎట్లా.. అనే ప్రశ్నవొచ్చింది. అప్పుడు ఊరివాళ్లందరి దగ్గర్నుంచి నెలకు పది రూపాయలు వసూలు చేసినాము. దాంతో రోజూ జొన్నన్నమో, వరి అన్నమో కొంచెం పప్పు, కూరగాయలు కలిపి వండించి, కొండమీద ఒక విశాలమైన బండ మీద గంపలతో పెట్టిస్తూన్నాము. కొన్ని పచ్చి కూరగాయలు, ఊర్లో దొరికే పండ్లూ కూడా పెడుతున్నాము. ఒక్కొక్క రోజు జొన్న రొట్టెలు చేయించి పెడుతూ వున్నాము.
పైన గుంటలలో నీళ్లు ఎండిపోతే రాతిమీద తొట్ల మాదిరి మలిచి, అందులో మావాళ్లే నీళ్లు పోసి వొస్తారు. చాలకుంటే కిందికొచ్చి చెరువులో నీళ్లు తాగుతాయి కోతులు. అవి కొండ దిగి రాకుండా చెయ్యాలని మా ప్రయత్నం. ఇప్పుడు కొండమీద చెట్లు బాగా పెరిగినాయి. సొర, బీర, దొండ, దోస, బుడమ వంటి కూరగాయల మొక్కల విత్తులు కూడా ప్రతి ఏడాదీ చల్లుతాము. పండ్లే చాలవు కదా కోతులకు.! వీటన్నింటికీ ఊరి వాళ్లు బాగా ముందుకొస్తున్నారు అక్కా.. కోతులను కాపాడడం అంటే, ఆంజనేయస్వామికి ప్రత్యక్షపూజ చేయడమన్న సెంటిమెంట్ ఏర్పడింది ఊరివాళ్లకు.
ఇప్పుడు కొండంతా చెట్లూతీగెలూ అల్లుకోనిపోయి చిట్టడవి మాదిరి తయారైంది. కోతులకు పెట్టే అన్నం చాలా తక్కువ అవసరం అవుతున్నది. అయినా ఆకలితో వుండిపోతాయేమోననే భయంతో రొట్టెలు పెట్టివొస్తుంటారు మావాళ్లు. ఇప్పుడు ఊరి మీద కోతులు దాడి చెయ్యడం, ఇళ్లలోకి దూరి అన్నపు గిన్నెలు ఎత్తుకోని పోవడం, ఆరేసిన బట్టలు చించడం వంటి సంఘటనలు దాదాపుగా లేవు. వొస్తాయి అప్పుడప్పుడు. వాటి అంతట అవే వెళ్లిపోతాయి. ఇప్పుడు ఇళ్లలో వేసుకున్న చెట్లు బతుకుతున్నాయి. పూలూ కాయలూ దక్కుతున్నాయి. కొండమీదికి పక్షులు విపరీతంగా వొస్తున్నాయి. చిన్నచిన్న జంతువులు కూడా కనిపిస్తున్నాయి. మన యాగంటన్న చీనీ పండ్ల(బత్తాయి) తోట, జామతోటలను పెట్టినాడు. తోటలో కొన్ని చెట్లకు కాయలు కోయకుండా వొదిలి పెడతాడు. అవన్నీ పిట్టలకు, కోతులకు అన్నమాట! అట్లా తోటల వాళ్లు చాలామంది చేస్తున్నారు.
చెరువు వొడ్డున, మరికొన్ని ఖాళీ స్థలాలలో ఇతర చెట్లతో పాటు చింత చెట్లు బాగా పెంచుతున్నాము. అవి మొండిగా పెరుగుతాయి. ఫలసాయం కూడా ఇస్తాయి. మేఘాలను ఆకర్షిస్తాయి. ఈ మధ్య మన ఊళ్లోనూ, చుట్టు పక్కల ఊళ్లల్లోనూ, మిగతా చోట్ల కంటే కాస్త ఎక్కువ వర్షం పడుతున్నాదట. కొండపైన చెట్లు పెరగడంతో ఊరు ఎండాకాలంలో కూడా చల్లగా వుంటున్నది.
తరువాత మనూరికీ, పక్కవూరికీ మధ్య బంజరు భూముల్లో కూడా చాలా చెట్లు రకరకాలవి నాటినామక్కా. ఇప్పుడు ఆ రాతి నేలలు వనాలయినాయి. పశువుల కాపరులు ఆ వనాల్లో పశువులను మేపుతున్నారు. చాలా మంది రైతులకు బ్యాంకు లోన్లు ఇప్పించి, చేలల్లో బోరింగ్ పంపులు వేయించినామక్కా.. అయితే వరి లాంటివి వేస్తే చాలా నీళ్లు కావాల్సి వొస్తుంది. దానివల్ల బోర్లు తొందరగా ఎండిపోయే అవకాశం వుందని, పత్తి, నూనె గింజలు, పప్పుధాన్యాలు, కూరగాయలు పండించు కొమ్మని చెబుతున్నాము. కొందరు పండ్లతోటలు పెంచుతున్నారు. ఆ బోర్లు ఎండిపోకుండా పొలంలో పడిన వాననీటిని పొలం చివర్లో తవ్విన చిన్న కుంటలు వంటి వాటిలోకి మళ్లించాలని అనుకుంటున్నాము. గుజరాత్‌లో ఈ రకమైన వాన నీటి సంరక్షణ బాగా చేస్తున్నారక్కా. వాన నీటి సంరక్షణ నిపుణుడిని ఒకాయనను పిలిపించి, ఊళ్లో ఎక్కడా ఒక్క చుక్క నీరు వృధా కాకుండా చూడాలని మా ప్రయత్నం.
ఇప్పటికే చాలామంది ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. యాగంటన్న కొత్తగా కట్టిన ఇంట్లో, ఇంటి కిందనే పెద్ద ట్యాంకు కట్టి, మిద్దె మీద పడిన వాన నీటిని ఫిల్టర్ చేసి, టాంకులో నిల్వ చేస్తున్నాడు. మన ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ కదా. అయినా ఆ నీళ్లే ఆయన కుటుంబానికి సంవత్సరం పొడుగునా తాగడానికి, వాడుకోవడానికి సరిపోతున్నాయి.
ఊళ్లో ప్రతి ఇంటిముందు ఒక చెట్టును పెంచాలని నియమం పెట్టినాము. డ్రైనేజి కాలువలు తవ్వించి నాము. అయితే వాటిని పక్కాగా కట్టించాల. అన్నిటికీ ఫండ్స్ కొరతగా వుందక్కా.
పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు చదువులు చెప్పుకోలేరు. చాలామంది పెద్దగా చదువుకోని వారే. అందుకే కొందరు రిటైర్డ్ టీచర్లను, కొందరు గవర్నమెంట్ టీచర్లను, కొందరు ఉత్సాహవంతులను ఒక గ్రూప్‌గా ఏర్పరిచి, మన ఊరి రామాలయంలో వెనుక ఖాళీ స్థలంలో ఒక షెడ్డు వేయించి, అక్కడ ట్యూషన్లు చెప్పిస్తున్నాము. దాంతో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. టెన్త్ పరీక్షలలో చాలామంది మంచి మార్కులతో పాసయినారు. వాళ్లను పై చదువులకు కర్నూలు, హైదరాబాద్, విజయవాడ లాంటి చోట్లకు పంపడం ఇబ్బంది అవుతావుంది. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సుల్లో చేరాలంటే సిటీలకు వెళ్లక తప్పడం లేదు. తల్లిదండ్రులు పేదవారు. అందుకే ఆయా ఊళ్లలో సెటిలైన మన వూరి వాళ్లను ఒప్పించి, వాళ్లకు వాళ్ల ఇండ్ల దగ్గర, చుట్టుపక్కల వసతి ఏర్పాటు చేయాలని, వాళ్లను, వాళ్లు చదువులను చూసుకుంటూ వుండాలని కోరుతున్నాము. కొందరు ఈ విధంగా చాలా బాగా సాయం చేస్తున్నారక్కా.. మన ఊరి పిల్లలు హైదరాబాద్ లాంటి చోట్ల ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఇద్దరు ఇంజనీర్లు అయి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఆడపిల్లలను కాలేజీకి బనగానపల్లెకు పంపడానికి చాలామంది అమ్మాయిలకు స్కూటీలు లాంటివి కొనుక్కునే ఏర్పాటు చేసినాము. వాళ్లంతా కలిసి కాలేజీకి పోయి వొస్తారు. మన వూరి అమ్మాయిలు కొందరు నర్సింగ్ కోర్సులు చేస్తున్నారు. ముగ్గురు ఇంజనీరింగ్ చేస్తున్నారు..”
బాలరాజు ఇంకా ఏదో చెప్పబోతూంటే..
“బాలరాజూ.. హైదరాబాద్‌లో చదువుకునే పిల్లలకు మా ఇంట్లో ఔట్ హౌస్ ఇస్తాను. అయితే నేను సగం రోజులు అమెరికాలో వుంటుంటాను. నేను మా పిల్లలతో చెప్పి ఆర్థికసాయం కూడా చేయిస్తాను.. అయితే వాళ్లు కూడా బాధ్యతగా ఉండాల మరి!” అన్నాను ఉత్సాహంగా.
“థాంక్స్ అక్కా.. అందరూ ముందుకొస్తేనే ఊరు బాగుపడుతుంది. ఇంకా చెయ్యాల్సినవి చాలా వున్నాయి. స్కూలు బిల్డింగ్, ఆస్పత్రి బిల్డింగ్ రిపేరీ, చాలా పనులు వున్నాయక్కా.. అన్నిటికీ లచ్చుమక్క కావాల. అదే పెద్ద సమస్య. “నిట్టూర్చినాడు బాలరాజు.
“మరేం ఫర్వాలేదు బాలరాజూ.. మంచిపనులు చేసేవాళ్లకు కాలం తప్పక అనుకూలిస్తుంది. నేను కూడా నాకు తెలిసినవాళ్ల ద్వారా విరాళాలు కోసం ప్రయత్నిస్తాను” భరోసా ఇచ్చినాను బాలరాజుకు. చీకటి పడుతున్నది. తిరుగుముఖం పట్టినాము. ఇంతలో
“ఒరే.. బాలరాజూ.. ఇంకా నీ మాటలు తెగలేదా? నీ పాసుగూల! ఆయమ్మను ఇంటికి పంపించవా.. నీవు రేపు పొద్దున్నే ఊరికి పోవాల కదా.. ఇంకేమన్నా చెప్పేదుంటే ఆయమ్మతో పోనులో మాట్లాడుదువు లే.. తొందరగా ఇంటికి రా..” అని అదిలించినాడు హన్మంతు.. బాలరాజు తండ్రి. అందరం నవ్వుతూ ఇంటిదారి పట్టినాము.