Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒకే హృదయం!!

[ఓ హెన్రీ, ‘The gift of the Magi’ కథకి యథేఛ్ఛ అనుసృజనగా ‘ఒకే హృదయం!!’ అనే కథని అందిస్తున్నారు శ్రీ సముద్రాల హరికృష్ణ.]

న దగ్గర ఉన్న మొత్తాన్ని, అది ఆరో సారి ఆ మధ్యాహ్నం, కౌముది లెక్కపెట్టడం!

ఎన్ని సార్లు చూసినా అదే, 2563/- రూపాయలు.

పప్పు ఉప్పు, కూరలు, మిగతా సామాను కొంటునప్పుడల్లా షాపు వాళ్ళతో స్నేహ పూర్వకంగా మాట్లాడి, ఒప్పించి, తెచ్చుకున్న చిన్నచిన్న డిస్కౌంట్లని, అతి జాగ్రత్తగా కూడబెడితే పోగైన మొత్తం అది!

“ఏంటమ్మా ఈ గీచీగీచి బేరాలాడటం”, అనీ, “ఇంత పిసినిగొట్టువి ఏవిఁటమ్మా”, అనీ అన్ని విధాలా మాటలు పడుతూ కూడా తెచ్చిన, భద్రంగా పోగు చేసిన, పైకం అది!

ఏం లాభం, ఎంత లెక్కబెట్టినా, ఎన్ని సార్లు లెక్కించినా, అదే రొక్కం, 2563/-, ఒక్క రూపాయి  పెరగదు!

మర్నాడే భర్త చంద్రవదన్ పుట్టినరోజు!

తరుము కొచ్చేస్తోంది!

***

ఆ రోజు ఎటూ డబ్బింగ్ లేదు కాబట్టి, ఇక చేసేది ఏమీ కనిపించలేదు కాబట్టీ, సోఫాలోకి జారగిలింది కౌముది. జీవితంలో నవ్వులు, నిట్టూర్పులు ఉంటాయేమో గానీ, రెండో వాటి పర్వమే ఎక్కువేమో అనిపించింది, ఆమెకు ఆ క్షణంలో!

చిన్న అద్దె ఇల్లు, చిరు ఉద్యోగాలు ఇద్దరివీ! ఇద్దరి సంపాదనలో, ఇంటి అద్దె పోగా, మిగతా ఖర్చులకు బొటాబొటీ!

ఇంక పుట్టినరోజు కానుకలు, పెళ్ళిరోజు విందులు, ఎక్కడి నుంచి వస్తాయి?!

ఇంటి ముందు బోర్డు, ‘కౌముదీ చంద్రవదన్’ అని ఘనంగా పెట్టారు, ఈ ఇంట్లోకి దిగిన కొత్తల్లో ఉత్సాహంగా!

అవును అప్పుడు చంద్ర మంచి జీతం వచ్చే ఉద్యోగంలో ఉండేవాడు మరి!

బోర్డులో ‘చంద్ర’ కూడా పూర్తి కళలతో మెరిసిపోయేది!

ఏదో గొడవ వచ్చి ఉద్యోగం మారాల్సి వచ్చింది, తక్కువ జీతానికి!

బయటి బోర్డుపై ‘చంద్రవదన్’ కూడా కాస్త వెలతెల పోతున్నట్టు ఉంటోందీ మధ్య!

***

కాస్సేపటికి తేరుకొని, ఉత్సాహం నింపుకొని, మెల్లగా లేచి ముఖం కడుక్కుని పౌడరు వగైరా అద్దుకుని తయారవటం మొదలు పెట్టింది కౌముది. అనుకున్న పని ఎట్లా సాధించాలా అన్న ఆలోచనలు సాగిస్తూనే, మెదడులో!

***

‘చంద్ర పుట్టిన రోజుకి ఏదైనా మాంఛి బహుమతి ఇవ్వాలి. నన్ను తనలో భాగంగా చూసుకునే అతని మార్దవంతో కూడిన హుందాతనానికి  తగ్గట్టుగా ఉండాలి. ఎంత వెచ్చదనం ఆ స్నేహంలో, ఎంత స్నేహం ఆ పలకరింపులో, ఎంత అనురాగం ఆ లాలనలో! దానికి తూగేట్టు ఇవ్వాలి కానుక! ఏమైనా సరే!ఏం చేసైనా సరే! కానీ ఏం చేయాలి?!’ ఇట్లా సాగుతున్నాయి కౌముది ఆలోచనలు తన ప్రియాతి ప్రియమైన చంద్రవదన్ పుట్టిన రోజు గురించీ, అతనికి తాను ఇవ్వదల్చుకున్న ఆ కానుక గురించి!

‘వచ్చే ఆదాయానికి, ఖర్చులు ఎప్పుడూ ఎక్కువే!, ఆ పోటీలో ఖర్చులదే ఎప్పుడూ పై చేయి, ఎంత చెట్టు కంత గాలి! 2500/- లలో ఏమొస్తుంది, ఇవాళ రేపు! చేతిలో కనీసం ఇంకో ఐదువేలన్నా ఉంటే గానీ, అనుకున్న కానుక ఇవ్వలేను!’

ఆమె తన గది కిటికీ దగ్గర నుంచొని ఊరికే చూస్తూ నిలబడ్డది కాస్సేపు!

కిటికీల మధ్యన పెద్ద అద్దం ఉన్నది. ఒక్కసారి పక్కకు జరగటంతో, ఆమె ప్రతిబింబాలు, ఆ అద్దపు నిలువు పలకలలో పడ్డాయి. మొహంలో కాస్త కాంతి, చురుకు తగ్గినట్టున్నా, ఆమె తన జుట్టు చూసుకుని, మురిసిపోయింది.

ఒక్కసారి ఆగి, మళ్ళీ మళ్ళీ చూసుకుంది. మోకాళ్ళవరకూ వస్తోంది, నల్లటి జలపాతంలా!

అదేదో, ఒక రకం ఫ్యాషన్ డ్రెస్ లాగా!

అందమైన పొడవైన జుట్టు! కవులు వర్ణించిన పెన్నెరివేణి!

తల్లిదండ్రులు పెట్టని సహజ పెన్నిధి! కేశ ‘సంపద’, అని పిలువబడేది.

ఒకసారి కిందకు అంతటి జట్టును జార్చి, చూసుకుంది. నల్ల త్రాచులా, అందమైన జడ ‘అల్లిక’లో ఇంకా ఇనుమడించే శోభతో ఉన్న కేశపాశం!

నిజానికి వాళ్లకు ఉన్న వస్తువుల్లో, రెండు విషయాల్లో వారు గర్వపడుతుంటారు. ఒకటి చంద్రవదన్ చేతి గడియారం! రెండు, కౌముది పొడవాటి అందమైన జుట్టు!

నిజాము నవాబు గారి రాణి గనుక కౌముది ఎదుటి ఫ్లాట్ లోకి వచ్చి నివసిస్తే, ఒక్క రోజులో ఆమెకు తన నగల దుస్తుల గొప్పదనం, ఈ జుట్టు ముందు, ఏపాటి చిన్నదో చూపించేదే, పింఛం ఆరబోసినట్టు పరచి!

అట్లాగే కింగ్ సాలమన్ గనుక తన ఐశ్వర్యం అంతా ప్రదర్శన చేస్తూ, అక్కడే, బేస్మెంట్‌లో ఉంటే, చంద్ర తన వాచ్ తళతళలాడించి, ఆ రాజు చేత అబ్బో అనిపించుకునే వాడే!

***

ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది, ఈ ‘సంపద’ విషయంలో! దానితో తన బహుమతి కొనాలనే కోరిక తీరబోతోంది.

కానీ ఎందుకో రెండు కన్నీటి బొట్లు రాలిపడ్డాయి, ఆమె కళ్ళలోంచి ఆ క్షణంలో!

***

అవును మరి, ఎంత అపురూపం, ఏ ఆడపిల్లకైనా తన అందమైన జుట్టు! కానీ ఇవాళ, గత్యంతరం లేక అది అమ్మాల్సిన అవసరం ఏర్పడ్డది, భర్త పుట్టినరోజు కానుక కొనటానికి!

ఆ రెండు కన్నీటి చుక్కలు అందుకు రాలిపడ్డట్టున్నాయి, అప్రయత్నంగా, ఆమె ఆ నిర్ణయానికి రాగానే!

ఇక ఆలస్యమెందుకు, ఇల్లు తాళం పెట్టి బయలుదేరింది.

అపురూప బహుమతి కొనటానికి అనవచ్చు,అపురూప కేశ సంపద విక్రయించి డబ్బు తెచ్చుకోవటానికీ అనవచ్చు.

కానీ ఆమెకు భర్త పై గల అనురాగం, ఇవేవీ ఆలోచింపనీయలేదు..

బహుమతి కొనాలి, అతను సంతోషించాలి, ఇదే ఆమె మదిలో ఉన్న ఒకే ఒక భావం, ఆ సమయంలో!

***

ఆ షాపు ముందు ఆటో ఆగగానే, డబ్బులిచ్చి తుర్రుమని, లోపలికి పరుగెత్తింది కౌముది. ఆలశ్యం చేస్తే, మనస్సులో వేరే ఆలోచనలు వస్తాయేమో?!

చంద్ర తిడతాడు “ఇదేం పని” అని మానేస్తానేమో అని, ఒక చిన్న అనుమానం మెదడులో!

ఆమె ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడంతో, లేడీ ఆర్టిస్టుల విగ్స్ వ్యాపారం చేసే వారి గురించి ఎప్పుడో విని ఉన్నది.

అద్దంలో జుట్టు చూసుకున్నప్పుడు, ఆ విగ్గు వ్యాపారం, అందులో కొంతమంది జుట్టు కొంటారన్నది గుర్తొచ్చింది.

ప్రస్తుతం, ఆమె అట్లాంటి షాపులో ఉన్నది, జుట్టు అమ్మి, కనీసం 5000 సంపాదించి, ఆ మొత్తం 7563/- తో తన భర్తకు ఒక పుట్టినరోజు కాన్క కొనాలని!

చకచకా పని ముగించి, వచ్చిన 4860/-రూపాయల డబ్బు జాగ్రత్తగా హాండ్‍బ్యాగులో సర్దుకుని బయటపడ్డది.

***

వెంటనే తాను అనుకున్నది దొరికే షాపు కెళ్ళి, షాపు వాడు విసుక్కునేట్టు, అన్ని వెరైటీలు తీయించి, ఎట్టకేలకు ఒక బంగారు రంగు చైన్ కొన్నది, చంద్ర తాతలనాటి నుంచి వారసత్వంగా వస్తున్న ఆ వాచ్ కోసం!

‘అబ్బ ఎంత బాగుందో, చంద్ర లాగే హుందాగా, నాజూగ్గా’ అనుకుంది, సంతోషం పట్టలేక!

మొత్తం ఖరీదు 7200/- అయింది. 243/- మాత్రం మిగిలింది బ్యాగులో!

అసలామె కది పట్టనే పట్టలేదు, ఆ ఆనందోద్వేగంలో!

నిన్న రాత్రి వరకు, అంతెందుకు ఇవాళ్టి పొద్దున వరకు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది.

తను రేపు చంద్రకు అనుకున్న బహుమానం ఇవ్వగలదు.

అదీ ఆమెకు కావాల్సింది.

ఇక ఇప్పుడు, ఏదో దొంగతనంగా, లేదా సిగ్గపడుతూ వాచీ టైమ్ చూడనక్కరలేదు చంద్ర తన పాత లెదర్ స్ట్రాప్ వల్ల!

దర్జాగా అందరి మధ్యలో ఉన్నా, వాచీలో టైమ్ చూసుకోవచ్చు, ఈ చైన్ వేసినప్పటి నుంచి!

***

తాపీగా బస్ స్టాండు కొచ్చి, ఒక కొబ్బరి బోండాం నీళ్ళు తాగి, తృప్తిగా లోకల్ బస్సెక్కి, గంటలో ఇంటికి చేరుకుంది.

తల మీద భారం తగ్గిందేమో కానీ, గుండెలో ఉత్సాహం, సంతోషం నిండిపోయాయి, కౌముది అనే మహాప్రేమస్వరూపమైన చంద్రవదన్ భార్యకు!

***

చంద్ర తిట్టకుండా ఉండాలంటే, తనలో మార్పు కొట్టొచ్చినట్టు వెంటనే తెలియకూడదు.

ఇది దారిలోనే అనుకుంటూ వచ్చిన ఆమె, ఇంటికి రాగానే  చేసిన మొదటి పని, కాస్త తన తలను విగ్గుల వాళ్ళు వాడే పధ్ధతి ద్వారా, ఎంతో కొంత మామూలుగా కనిపించేట్టు చేసుకోవటమే!

తాను డబ్బింగ్ చెప్పిన ఒకరిద్దరు తనతో చనువుగా ఉండే చిన్న హీరోయిన్లు, వద్దంటున్నా ఎప్పుడో గిఫ్టుగా ఇచ్చిన ‘కర్లింగ్ అయన్సు’ ఇప్పుడు కాస్త ఉపయోగపడ్డాయి అని అనుకుంటూ!!

“చిలిపి స్కూలు పిల్లవాడిలాగా ఉన్నావోయ్”, అని తేలిగ్గా తీసుకుంటాడో, కోపం తెచ్చుకుంటాడో, తేల్చుకోలేక పోయింది ఆమె, ఎన్నిసార్లు అటూ ఇటూ అద్దంలో చూసుకున్నా!

ఏం చేయాలి, తప్పలేదు మరి – ఆ 2563/- తో ఏం కొనేది, ఎట్లా కొనేది, అని కూడా అనుకుంది, కాస్త విసుగ్గా!

***

సరిగ్గా 7 గంటలకు చంద్ర వచ్చే సమయానికి కాఫీ తయారుచేసి రెడీగా ఉంచేసింది.

స్టవ్ మీద బాణలి పెట్టింది సిద్ధంగా, అతను ఏది అడిగితే, అది ఇష్టంగా వేడివేడిగా చేసి పెట్టటానికి!

నేరుగా ఆఫీసు నుంచి ఇంటికే వచ్చే అలవాటున్న చంద్ర ఆ రోజు కూడా అదే సమయానికి వచ్చి మెట్లు ఎక్కుతున్నాడు.

ఆ శబ్దం విని తలుపు నానుకొని ఉన్న  టేబుల్ దగ్గర కుర్చీలో సిద్ధంగా, ఉత్కంఠతో కూచుంది కౌముది.

ప్రతి చిన్న విషయానికీ, దేవుణ్ణి వేడుకునే, ఆమె ఆ రోజు ఇట్లా ప్రార్థించింది.

“దేవుడా, దయచేసి ఈ దశలో కూడా అతని కళ్ళకు నేను అందంగా కనిపించేట్టు చేయి స్వామీ” అని!

***

చంద్ర తలుపు తీసి, ప్రవేశించాడు. కాస్త అలసటగా కనబడ్డాడు. ఇంకా 24 ఏళ్ళే, అపుడే కుటుంబ బాధ్యతలు!

***

లోపలికి రాగానే తను చూసిన కౌముది కొత్త అవతారం అతనికి అర్ధం కాలేదు, ముందు.

తరువాత అతను చూసిన చూపులో కోపమో, ఆశ్చర్యమో, అన్నీ కలిపిన భావమో, ఏముందో చెప్పటం కష్టమే!

దాంతో, కౌముది ఒక్కసారి అతని చేయి పట్టుకుని, “చంద్రా! నన్నట్లా చూడకు దయచేసి, ఏమీ లేదు, జుట్టు అమ్మేసి ఆ డబ్బుతో నీకు పుట్టిన రోజు కానుక తెచ్చాను. మంచి కానుక ఇవ్వాలనే ఇదంతా చేశాను చంద్రా! ఏమీ దిగులు లేదు, నీకు తెలుసుగా, నాకు చాలా తొందరగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు! అతి త్వరలో మళ్ళీ మామూలుగా అయిపోతాను. పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రా! నేనెంత మంచి కానుక తెచ్చానో తెలుసా, నీకు చాలా నచ్చుతుందనే గట్టి నమ్మకం నాకుంది” అన్నది ఆవేశంగా, కొంత జంకుగానే, ఏమంటాడో అని!

చంద్ర అవన్నీ పట్టించుకోకుండా,”నువ్వు జుట్టు కత్తిరించుకొన్నావా?!” అన్నాడు, ఇంకా విషయం పూర్తిగా అర్థం కానట్టు!

“అవును, కత్తిరించుకొని, అమ్మేశాను. అయినా నేను నీ కౌముదినే, చూడు వేరే ఏ మార్పు లేదు! అదే, ఇదివరకు కౌముదినే! జుట్టు లేకున్నా అదే మనిషిని, కౌముదినే!” అని కౌముది అభ్యర్థన!

“నాకేం అర్థం కావట్లేదు, జుట్టు అమ్మడం మేమిటి?!” అన్నాడతను, అసహనంగా!

“అవును, నిజంగా అమ్మేశాను, అయిపోయింది, ఆ విషయం! పుట్టిన రోజు ముందున్నది చంద్రా దాని గురించి మాట్లాడుకుందాం! రా ఏదైనా తింటావా?! వేడిగా ఏదైనా టిఫిన్ చేయనా?”, అడిగింది ఆత్రంగా!!

చంద్ర అప్పటికి విషయం బోధపడినవాడి లాగా తేరుకుని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

***

జీతాలు తక్కువ అయితే మాత్రం ఏం, మనసుల్లో ఈ ప్రేమలు ఉన్నంత వరకు వీరే కోటీశ్వరులు కారూ?!

ఈ ప్రేమధనం విలువ ఇంత అని వెలకట్టే ధీరుడు ఉన్నాడా ఈ భూమ్మీద!!

***

తరువాత, చంద్ర తన ప్యాంటు జేబులోంచి ఒక చిన్న ప్యాకెట్ తీసి, టేబుల్ మీద ఉంచాడు.

“పిచ్చిదానా, నువ్వెట్లా ఉన్నా, నాకు ఓకేనే! కానీ నిన్ను చూడగానే నేనెందుకు అట్లా అయ్యానో, నీకే అర్థం అవుతుంది, ఆ ప్యాకెట్ విప్పి చూస్తే! రేపే నీ పుట్టిన రోజు కూడా! మర్చిపోయావా?! నేను మర్చిపోలేదులే! అందుకే ఈ కానుక! తీసుకో, తెరిచి చూడు!”అన్నాడు తాపీగా, తన సహజ ధోరణిలో!

క్షణంలో ఆమె ఆ ప్యాకెట్ తెరవటం, అందులో ఉన్న వస్తువు చూసి ముచ్చట పడటం, వెంటనే “అయ్యో” అంటూ నిరాశతో  నిట్టూర్చటం, జరిగి పోయినై!

అందులో ఉన్నవి ఒక సెట్టు అందమైన దువ్వెనలు! కోమలుల కుంతలాలను అల్లన దువ్వి, అందంగా తీర్చేవి!

కొంతమందికి ఎంతో ఇష్టమైనవి!

అవి ఖరీదైనవనే చెప్పాలి, వారి స్థాయికి!

వెంటనే దువ్వెనలు వాడుకోవాలని ఉన్నా, పాపం నిస్సహాయత!

కొంత సమయం ఆగాల్సిందే!

వేటిని లాలించి దువ్వి చక్క జేసేవో, ఆ కురులే ఇప్పుడు లేవు. అదీ ఆ ఆనందంలో కౌముది, విషాదం!

“పర్వాలేదు కాస్త ఆగి అయినా వాడుకోవచ్చులే”, అని ఆప్యాయంగా నిమిరి బాక్సులో భద్రపరుస్తూ, “ఏమీ దిగులు లేదు, నా జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది, ఏం పరవాలేదు,” అన్నది, తనను ఓదార్చుకుంటన్నట్టు, చంద్రకి ధైర్యం చెపుతున్నట్టూ!

అప్పుడు మళ్ళీ తేరుకుని, “అయ్యో నీకు చూపించనే లేదు కదూ” అని, తాను కొన్న వాచీ చైను అరచేతిలో పెట్టుకుని మెరిపించింది!

“బాగుంది కదూ చంద్రా, ఊళ్ళో ఉన్న షాపులన్నీ గాలించి పట్టుకున్నాను. నీ చేతికి, నీ వాచీకీ చాలా బాగుంటుంది. ఏదీ ఒకసారి నీ వాచీ ఇవ్వు, వేసి చూద్దాం!” అన్నది, ఉత్సాహం ఉరకలు వేస్తుంటే!

ఒక్కసారి, సోఫాలో కూలబడి, “కౌముదీ, ఈ సారికి వాడుకోవటం కుదరదులే మన పుట్టిన రోజు కానుకలు, కొన్ని రోజులు ఆగుదాం! నీకు కానుకగా ఆ దువ్వెనలు కొనటానికి, నా వాచీ అమ్మేశాను. ఏం పర్వాలేదులే, మళ్ళీ కొనుక్కుందాం తొందరలో! ఆఁ, ఏదో టిఫిన్ పెడ్తానన్నావ్, పెట్టు పెట్టు” అన్నాడు గబగబా, ఆకలి నటిస్తూ!

ఇద్దరి నవ్వులతో, ఆ చిన్న ఇల్లు, వంద గదుల భవనం అంత విశాలంగా అనిపించింది, ఆ క్షణం!

భవనం అంతా వారిద్దరి అనురాగ పరిమళ భరితమే!

మరునాడు వారిద్దరి పుట్టిన రోజులే కాదు, సరికొత్త దీపావళి లాగా కూడా అనిపించింది ఆ యువ దంపతులకు, ఆ మధుర క్షణంలో!!

Exit mobile version