Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక వెలుగు చార

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సింహప్రసాద్ గారి ‘ఒక వెలుగు చార’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

టిఫిన్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ యథాలాపంగా చూశాను. నాన్న ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు.

“ఏంటి నాన్నా”

“ఏమీ లేదమ్మా. మొన్నోసారి మనం ఓ మ్యాచ్ బాగుంటుందనుకున్నామే, వాళ్ళు ఫోన్ చేశారు.సాయంత్రం ఇంటికి వస్తామన్నారు. నువ్వు ఆఫీసు నుంచి ఒక్క అడుగు ముందు వస్తే..!”

“పిల్ల చూపులకా!” నవ్వాను. అమ్మ చిత్రంగా చూసి బుగ్గలు నొక్కుకుంది.

నాతో శృతి కలుపుతూ అన్నారు నాన్న. “అక్కడికీ ఏ రెస్టారెంటులోనో కలిస్తే బావుంటుందని చెప్పాను. కాదు ఇంటికే వస్తామన్నారు”

“ఇదే మంచిది నాన్నా. మీ పేరు మాణిక్యాలరావు గనుక మీ వెనుక మణులూ మాన్యాలూ ఉన్నాయనుకునే ప్రమాదం తప్పుతుంది!”

నేను మళ్లీ నవ్వేసరికి, అమ్మకు ఉడుకుమోత్తనం వచ్చేసింది. “నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి ఇవాళ రేపు ఎంత పెద్ద సమస్యో నీకేం తెలుసు!”

“నాన్న నన్ను నిటారుగా ఉండమని, నిదానంగా నడవమని, ఎన్నడూ తల దించుకునే పని చేయొద్దని, ఎల్లప్పుడూ తల ఎత్తుకునే ఉండమని, ప్రశ్నించడానికి వెనుదీయొద్దని నేర్పారు. ప్రతి తల్లి, తండ్రి ఆడపిల్లల్ని ఆలా పెంచితే అమ్మాయి పెళ్లి ఒక సమస్య కాదు, రెండు కుటుంబాల అపురూప సంగమ దృశ్యం అవుతుంది!”

“కబుర్లు నేనూ చాలా చెప్తాను. ఎదిగిన ఆడపిల్ల ఎప్పుడూ గుండెల మీది కుంపటేనే. ఇంకా పెళ్లి చేయలేకపోయామన్న దిగులు మా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తెలుసా!”

“అదే అనవసరం అంటున్నాను. పెళ్లి ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. దాని గురించి మీరు వూరికే బీపీ తెచ్చుకోకండి. అయినా కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని నువ్వే చెబుతూంటావుగా!”

బుగ్గలు నొక్కుకుని నా వంక మిర్రి చూసింది. పెళ్లి కాకుండా నాకు కక్కు రాదని నమ్మకం కుదిరిందో ఏమో, “ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు..” అని ఇంకేదో చెప్పబోతోంటే అడ్డు తగిలాను. “ఇంకా చాలా చాలా అన్నారు గాని కాలం మునుపట్లా లేదమ్మా. బాగా మారిపోయింది. కొందరు తల్లిదండ్రులే ఇంకా గుర్తించడం లేదు!”

“అయ్యో తల్లి! కాలం ఎంత మారినా ఆడదాని రాత మారదు. ఆడపిల్ల పెళ్లి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా నిప్పుల మీద నడకే!”

“ఆడపిల్ల వంటింటికీ, పిల్లల్ని కని పెంచడానికీ మాత్రమే అన్న ఒక్క ఆలోచన మారితే చాలు అన్నీ వాటికవే ఠక్కున మారిపోతాయి.. బై నాన్నా..”

లిఫ్ట్‌లో నా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ వంక ఆబగా చూశాడో అంకుల్. చిన్నగా నవ్వాను. “నేను మీ అమ్మాయినే అంకుల్. అలా చూస్తున్నారేంటి? నా దుస్తుల్ని వాచ్ చెయ్యడం మానేసి, మీ ఆలోచనల్ని వాచ్ చేస్తే బాగుంటుందేమో!”

అతను కంగారు పడ్డాడు. పెద్దగానే నవ్వాను. లిఫ్ట్ ఆగటం ఆలస్యం ఎవరో తరుముతున్నట్టు బయటికి దూకి మరీ పారిపోయాడు.

హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేస్తోంటే కొన్ని జతల కళ్ళు, రోజూలానే, ‘బైక్ మీద ఆడపిల్లా!’ అని కళ్ళెగరేశాయి.

‘నేను ఆడపిల్లను కాదు, ఆడపులిని’ అని చాటుతూ చూపుల శూలాలు విసిరి, బైక్‌ని ముందుకు దూకించాను.

కమ్యూనిటీ గేటు దగ్గర స్కూల్ బస్సు కోసం నిరీక్షిస్తున్న ఆడపిల్లల్లో ఒకరు ముందుకొచ్చి, “హాయ్ అక్కా” విష్ చేశారు. వారి కళ్ళల్లో నా పట్ల ఆరాధనా భావం తొంగి చూసింది. ఆగి పలకరింపుగా నవ్వాను.

ఒక గులాబీ ఇచ్చి, “నిన్ను చూస్తే నాకు ఎంతో శక్తి వచ్చేస్తుందక్కా” అంది.

మరో అమ్మాయి- కాస్త పెద్దది- “అందరూ నీలాగా ఉంటే మనల్ని ఎవరో ఏదో చేస్తారన్న భయం ఉండనే ఉండదు కదక్కా” అంది.

“ఏ స్త్రీ అయితే తనను తాను రక్షించుకోగలనన్న నమ్మకంతో ఉంటుందో, ఆమె ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. ఆ భావం గుండెల్లోకే కాదు కండరాల్లోకి, ఎముకల్లోకి, ఆఖరికి మూలుగుల్లోకీ చొచ్చుకుపోవాలి. అర్థమైందా. బీ బ్రేవ్ మై లిటిల్ సిస్టర్స్!” బొటన వేలు చూపించి, బైక్ ముందుకు దూకించాను.

చలికి తట్టుకోలేక దాయిలిలో ముడుచుకు పడుకున్న పిల్లిలా ఉంది మా సాఫ్ట్‌వేర్ కంపెనీ.

ఎదురైన సహోద్యోగుల్ని విష్ చేస్తూ వెళ్ళి నా సీట్లో బైఠాయించాను. వెంటనే పనిలో మునిగిపోయాను. కొత్త మెసేజ్ వచ్చిన శబ్దం అయింది. తెరచి చూశాను. 11 గంటలకు మీటింగ్ ఉందిట!

‘మీటింగుల్తోనే సగం కాలం తినేస్తారు!’ చిన్నగా నిట్టూర్చాను.

గ్రీన్ టీ తాగి మీటింగ్ హాల్లోకి వెళ్ళాను. అప్పటికే రెండు టీములకు చెందిన సుమారు పదిహేను మంది వచ్చి ఉన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడర్స్ ఉన్నారు. విషయం ఏవిటోనని ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాను.

“మీకో గుడ్ న్యూస్. అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ నుండి మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. కాస్ట్లీ ప్రాజెక్ట్. సమయం తక్కువ. దానికోసం ప్రత్యేకంగా మీలోని మెరికల్తో పైలట్ టీం ఫార్మ్ చేద్దామనుకుంటున్నాం. వాచీ వంక చూడకుండా పని చేసేవారు కావాలి. టైంలీ డెలివరీ ఇవ్వగలిగితే, పైప్ లైన్లో ఉన్న చాలా ప్రాజెక్ట్స్ మనకు వస్తాయని మేనేజ్మెంట్ ఆశిస్తోంది..”ప్రాజెక్ట్ మేనేజర్ ఆగి అందరి వంకా కలయ చూసాడు.

“వెల్కమ్, ఆన్‌సైట్ అవకాశం ఉంటుందా!” విజయారెడ్డి ఆరా తీసాడు.

“అది ఈ ప్రాజెక్టు పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే టీం లీడ్‌గా స్ఫూర్తి ఐడియల్‌గా ఉంటుంది గానీ, లేడీ గనుక ఇబ్బంది అవుతుంది. ట్రావెలింగ్ ఎక్కువగా చేయాల్సి రావొచ్చు. అందుకని..” నా వంక సంశయాత్మకంగా చూసి ఏదో చెప్పబోతే అడ్డు తగిలాను.

“నో ప్రాబ్లం సార్. ఐ కెన్ హ్యాండిలిట్” కాన్ఫిడెంట్‌గా చెప్పాను.

“కానీ సార్, స్ఫూర్తి గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎప్పుడైనా పెళ్ళవ్వొచ్చు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ లీవ్ షరా మామూలే!”

రవికాంత్ మాటలకు అంతా నవ్వారు. నా మొఖం అరుణిమ దిద్దుకుంది.

“మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?” ప్రాజెక్టు మేనేజర్ అతన్ని అడిగాడు.

“ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశం చాలా వుంది. ఐ మీన్ ప్రాజెక్ట్ అర్జెన్సీ సంగతి దేవుడెరుగు, మొత్తానికే గోవింద కొడుతుందేమోనని నా భయం సార్” అన్నాడు రవికాంత్.

నా ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. “ప్రెగ్నెన్సీ లేకపోతే మీరు వుండరు. నేనూ ఉండను. అమ్మ సాయం లేనిదే ఆ బ్రహ్మ కూడా సృష్టి ఆపేసి గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవలిసిందే!”

పిన్ డ్రాప్ సైలెన్స్ తిష్ట వేసింది.

“పక్షపాతాన్ని ఛేదించండి – అన్నది ప్రపంచ మహిళా దినోత్సవ నినాదం సార్. లింగ సమానత్వం చేతల్లో ఎలాగూ చూపలేరు. కనీసం మాటల్లో నైనా చూపితే ఆ నినాదానికి కొంతైనా న్యాయం చేసినట్లవుతుంది”

అంతా అమాంతం మన్ను తిన్న పాములైపోయారు.

“సో యు థింక్ యు కెన్ హేండిల్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం? “ప్రాజెక్ట్ మేనేజర్ సూటిగా నన్ను అడిగాడు.

“నా శక్తి సామర్ధ్యాల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది….!”

“ఓకే. మీ వర్త్ మాకు తెలీనిది కాదు. సో, స్ఫూర్తి టీం లీడర్‌గా ఉంటారు..” అతడి మాట పూర్తికాకుండానే,

“ఆ టీంలో నన్ను చేర్చకండి ప్లీజ్. ఆడ బాస్ దగ్గర పనిచేసి మెప్పు పొందటం ఇంపాజిబుల్” అన్నాడు రవికాంత్.

“అది కరెక్టే. మేము మల్టీ టాస్కింగ్ చేస్తాం. అన్నీ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాం. పై పై కబుర్ల వాళ్లని గాక, అంకితభావం ఉన్న రియల్ వర్కర్లని మా టీంకి అలాట్ చేయండి. టార్గెట్ డేట్ కన్నా ముందే పూర్తి చేసి మా సత్తా చాటుకుంటాం!”

“దట్స్ ద ట్రూ స్పిరిట్” అంటూ కొన్ని పేర్లు ప్రకటించాడు.

“ఉయార్ రేడీ టు ఫేస్ ఛాలెంజ్” సభ్యులందరి తరఫునా చెప్పాను.

కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి.

ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకుని స్టడీ చేశాను. ఆర్కిటెక్చర్‌తో డిస్కస్ చేసి మా టీం సభ్యుల్ని సమావేశపరిచాను. ఏం చేయాలి, ఎలా చేయాలన్నది డిజైన్ చేసి టీం సభ్యులకు వివరించి, పని విభజించి, ఆఫీసు నుంచి బయట పడేసరికి 6:35 అయింది.

మిస్డ్ కాల్స్ ఉన్నాయేమోనని చూశాను. లేవు. పనిలో ఉండగా డిస్టర్బ్ చేయడానికి నాన్న ఇష్టపడరు. స్టార్ట్ అయినట్టు నాన్నకు మెసేజ్ పెట్టి పార్కింగ్ లాట్ వైపు నడిచాను.

ఇంటికి వెళ్లేసరికి పెళ్లి బృందం వచ్చి ఉంది. మొత్తం ఆరుగురు ఉన్నారు. జ్యూస్ తాగుతున్నారు. ప్లేట్లలో పెట్టిన పదార్థాలు ఎవరూ టచ్ చేసినట్లు లేరు. తలలు తిప్పి నా వంక ఆసక్తిగా చూశారు.

అందరినీ మూకుమ్మడిగా విష్ చేసాను. ఎవరు ఎవరో వివరించి చెప్పారు నాన్న. అమ్మ కర్టెన్ వెనక నిలబడి నన్ను లోపలికి రమ్మని సైగ చేస్తుంటే, “ఫర్వాలేదమ్మా. వర్కింగ్ ఉమన్‌ని కదా. ఇలాగే ఉంటానని వాళ్లకి తెలుసు. నువ్వూ వచ్చి కూర్చో” పిలిచాను.

“లోపలికెళ్లి ఫ్రెషప్ అయి రామ్మా. తొందరేం లేదు” అన్నాడు వాళ్లలో పెద్దాయన.

“ఫర్వాలేదండి. ఇప్పటికే చాలా సేపు వెయిట్ చేయించాను” వారికి ఎదురుగా కూర్చుంటూ అన్నాను.

వారు ముఖాముఖాలు చూసుకున్నారు. పెళ్ళికొడుకు కృష్ణని తేరపారి చూసాను. ఫోటోలో లానే హుందాగా వున్నాడు. ముఖం ప్రసన్నంగా వుంది. హ్యాపీ ఫీలయ్యాను.

“ఈ కాలం పిల్లలు ఇలాగే వుంటున్నారు” ఒకరు వ్యాఖ్యానించారు. నేను చురుగ్గా చూసేసరికి సర్దుకున్నాడు.

పేరు దగ్గర మొదలు పెట్టి జీతం వరకూ అన్నీ అడుగుతూ ఇంటర్వ్యూ చేశారు. వారికి నచ్చుతుందా లేదా అన్నది పట్టించుకోకుండా నిజాలు చెప్పేసాను.

“అన్ని రకాల వంటలు చేయడం వచ్చా” కృష్ణ తల్లి అడిగింది.

“అన్నం కూరల్లాంటివి వచ్చు. అంతా అన్నీ నేర్చేసుకొంటే జొమాటో లాంటి కంపెనీలు దివాళా తీసేస్తాయి!” చిన్నగా నవ్వాను.

మా అమ్మ ముందుకొచ్చింది. “వంటా వార్పూ అన్నీ వచ్చు. వాళ్ళ నాన్నకి హోటల్ తిండి పడదు. నేను ఊరికి వెళ్ళినప్పుడు తనే చక్కగా వండి పెడుతుంది. తను వండినట్లు క్షీరాన్నం ఎవరూ వండలేరంటారు వాళ్ళ నాన్న”

“మీ తండ్రి ప్రేమ చూస్తోంటే ముచ్చటేస్తోంది. మీ నాన్న అదృష్టవంతులు” అన్నాడు అబ్బాయి తండ్రి.

“ఆయన కూతుర్ని కావడం నా అదృష్టం. కాలేజీలో చేరినప్పుడు ‘ఆడపిల్ల ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. దానికి చదువొక్కటే ఆయుధం’ అని నూరిపోశారు. ఉద్యోగంలో చేరుతున్నప్పుడు ‘నువ్వు స్ఫూర్తిగా ఉండిపోకూడదు, ఎందరికో స్ఫూర్తివి కావాలి’ అని ఆశీర్వదించారు. మా అమ్మా తక్కువ కాదులెండి. నా కలల్ని కుదించుకోనివ్వకుండా చూసింది మా అమ్మే. ఇద్దరూ కలిసి నేనూ, మా తమ్ముడూ శ్రమ లేకుండా ప్రయాణించడానికి చక్కని రహదారి నిర్మించి ఇచ్చారు.”

కృష్ణ కళ్ళల్లో మెరిసిన ప్రశంసలు నాలో ఉత్సాహం పెంచాయి.

“మీరూ మీ అబ్బాయికి ఆత్మగౌరవం, ఆడవారిని గౌరవించడం లాంటివి నేర్పేవుంటారుగా!”

అయన నోరు విప్పలేదు.

“మీతో ప్రైవేట్‌గా మాట్లాడాలి” కృష్ణ అన్నాడు లేస్తూ.

“వెల్కమ్” నా రూములోకి తీసుకెళ్ళాను.

పొందిగ్గా ఉన్న నా రూముని, రాక్స్ నిండా ఉన్న పుస్తకాలని, గోడకు వేలాడుతున్న ఆర్ట్ చిత్రాలని చూసి తల పంకించాడు.

“మీరెంత సిస్టమెటిక్కో మీ రూమ్ చూస్తే తెలుస్తోంది”

“థాంక్స్. అంతా ఇలాగే ఉండాలి. ఆడవాళ్ళు కాస్త ఎక్కువగా ఉండాలి. అంటే వారికి ఇంటా బయటా బరువు బాధ్యతలు ఎక్కువ కదా. ఆఫ్‌కోర్స్ పంచుకునే వారు ఉంటే.. మీరు పంచుకుంటారా?’’

“ఇద్దరూ వర్కింగ్ అయినప్పుడు, బండి సాఫీగా వేగంగా నడవాలంటే పంచుకోవలసిందేగా!”

అభినందన పూర్వకంగా చూశాను. “లైఫ్‌లో మీ ఆంబిషన్ ఏమిటి? “అతడు అడిగాడు.

“ఉత్తమ గృహిణి. ఉత్తమ ఉద్యోగి”

“రెంటికీ లంకె కుదురుతుందా?”

“గగనంలో సగం అవడంతోనే మహిళల విస్తృతి ఆగిపోలేదు, ఆగిపోకూడదు. ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ కోట్లాది మంది మహిళలు విజయవంతంగా రాణించారు. రాణిస్తున్నారు. మీకు మా ప్రతిభ మీద, సామర్థ్యం మీద డౌట్ ఉందా?”

“అహ అలా అని కాదు.. ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేకపోతే?”

“ఉద్యోగం డబ్బు సంపాదన కోసమే అనుకోను. నా శక్తిని, విజ్ఞానాన్ని సద్వినియోగించుకోవడంగా భావిస్తాను. మహిళా శక్తిని నిర్లక్ష్యం, నిర్వీర్యం చేసే ఏ సమాజమూ అభివృద్ధి సాధించలేదని నా ప్రగాఢ విశ్వాసం! ”

“డిబేట్‌లో చాలా కప్పులు గెలుచుకుని ఉంటారేమో!”

“డిబేటింగ్, ఎస్సే రైటింగ్, టేబుల్ టెన్నిస్సులో గెలుచుకున్నవే ఆ షీల్డులన్నీ!” కప్పుల్తో నిండుగా ఉన్న అలమారని చూపించాను.

“స్పోర్ట్స్ ఉమన్ కూడా నన్నమాట. గుడ్”

“మీరు ఇంటిపని షేర్ చేసుకుంటారా లేక అది నా పని కాదని ఫోన్లోనో, టీవీ ముందో నాటుకు పోతారా!”

“నో నో. చేతనైనది చెయ్యగలిగింది తప్పకుండా చేస్తాను”

“మీరూ సాఫ్ట్‌వేరే గనుక ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుని అప్డేట్ అవుతూనే ఉంటారు. అలాగే ఇంటిపనీ నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకొనే పుట్టం కదా. పుట్టేకే నేర్చుకొంటాం. పూర్వం ఎప్పుడో, ముదితల్ నేర్వగరాని విద్య కలదే – అన్నారు. అది మగవారికీ వర్తిస్తుంది!”

నవ్వేశాడు. “మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు?”

“అయాం ఏ ఫ్యామిలీ ఉమన్. ఐ లవ్ మై ఫ్యామిలీ!”

“థాంక్స్. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా?”

“అడిగాను. మీరే సమాధానం ఇవ్వలేదు”

“ఏది? ఓ అదా. ఎవరైనా సరే మనసుపెట్టి నేర్చుకుంటే ఎందుకు రాదు? ఏదీ బ్రహ్మవిద్య కాదు”

“థాంక్స్. మగాడి ప్రతి విజయం వెనుక ఒక ఆడది వుంటుందంటారు. అలాగే మహిళ విజయం వెనుక మగాడూ ఉండొచ్చు. నా గమ్యం చేరుకోడానికి మీరు ప్రేరణగా నిలుస్తారా?”

తలూపి లేచాడు. ఎగిసి తన్నుకొస్తోన్న ఉత్సాహాన్ని అదిమిపట్టాను. ఎస్, నాకితడే సరిజోడి!

అతడు హాల్లోకి వెళ్ళాడు. వెనుకే వెళ్తున్న నన్ను ఆపి “నీ సొమ్మేం పోదు గాని, మొహానికింత పౌడర్ రాసుకోవే” అంది అమ్మ అర్థింపుగా.

అమ్మని నొప్పించలేక ముఖం కడుక్కుని, పౌడర్ రాసుకుని వెళ్లి కూర్చున్నాను. కృష్ణ, అతడి తల్లిదండ్రులు ఇబ్బందిగా చూశారు.

“అమ్మాయ్, నువ్వు లోపలికి వెళ్లొచ్చు” మధ్యవర్తి అన్నాడు.

“వారి అబ్బాయి ఇక్కడే ఉన్నప్పుడు, వీరి అమ్మాయి ఇక్కడ ఉండకూడదా! అమ్మా, నువ్వూ రా. ఇది ఫామిలీస్ మీట్. ఇది మన గురించి వాళ్ళూ, వాళ్ళ గురించి మనమూ తెలుసుకునే సమయం. ఎందుకు రెక్కలు ముడుచు కోవాలి. ఫ్రీగా ఉందాం. ఇన్హిబిషన్స్ లేకుండా మాట్లాడుకుందాం. అంతేకదా కృష్ణ గారూ!”

అతడు తలూపాడు. అమ్మని , నాన్నని బలవంతాన కూర్చో పెట్టాను.

నాన్న కళ్ళల్లో చిరు ప్రశంస ఉరకలేసింది. కానీ అతిథులు ఆశ్చర్యం మింగారు.

“అబ్బాయికి అమ్మాయి నచ్చింది. మరి మీ అమ్మాయికి..?” పెద్దాయన అడిగాడు.

నాన్న నా వంక చూశారు. “మీకు ఓకే అయితే, నాకు ఓకే నాన్నా!”

“శుభం. ఇక ఇచ్చిపుచ్చుకోవటాల గురించి రెండు మాటలు అనుకుంటే ముందు కెళ్ళిపోవచ్చు”

“నేను ఇవ్వగలిగిందీ, ఇచ్చేదీ ముందే చెప్పాను..” నాన్న చెప్పారు – కాదు మనవి చేసుకున్నారు.

నాకు చిర్రెత్తుకొచ్చినా నాన్న ముఖం చూసి మౌనం వహించాను.

“చెప్పారు. ఇవాళ రేపు మార్కెట్టులో ఉన్న రేటును బట్టి చూస్తే అది మరీ తక్కువ!” చప్పరించేసాడు.

“మార్కెట్? ఏ మార్కెట్?” గబుక్కున పేపర్ తీసి చూస్తూ, “బిజినెస్ కాలంలో ఎక్కడ వేశారు ?”అడిగాను.

అంతా అదిరిపడ్డారు.వారి ముఖాలు తెల్లరంగు పులుముకున్నాయి. కృష్ణ ఎంబరాస్సింగా చూస్తే, మిగతా వాళ్ళు నీళ్లు నమిలారు.

“మీ అభిప్రాయం ఏమిటి” నాన్న అడిగారు.

“ఓ బేరసారాలా!” పెద్దగా అని, చిన్నగా నవ్వాను.

మరి ఏమనిపించిందో గాని ఎవరూ మరి నోరు తెరవలేదు. కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఉండిపోయారు.

“కరోనా మహా విపత్తు మనిషికి ఏమి కావాలో, ఎంత కావాలో ముఖం మీద గుద్ది మరీ నవీన గీత బోధించింది. అయినా మన దృష్టిలో దృక్పథంలో డబ్బుకిచ్చే విలువలో మార్పు రాకపోతే అంతకంటే విషాదం వుంటుందనుకోను!”

పరిస్థితి అర్థమైనట్టుంది, మింగలేక కక్కలేక కూర్చున్నారు.

“నేనొక మాట చెప్పవచ్చా?” అడిగాను.

అదిరిపడ్డారు. ఆపైన చెప్పమన్నట్లు చూశారు. ఇబ్బంది పడుతూ చూసారు. అనుమానంగా చూసారు. అసహనంగా చూసారు. భయంగానూ చూసారు!

“నన్ను ఎవరో ఒకరి చేతుల్లో పెట్టి ‘నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబూ’ అని దీనంగా చెప్పేంత అబలగా మా నాన్న నన్ను పెంచలేదు. చక్కని వ్యక్తిత్వంతో ఉన్నత విలువలతో సంస్కారయుతంగా పెంచారు. విద్యావతిని, ఉద్యోగవతిని చేశారు. ఆపైన మీ ఇష్టం!” లేచి చేతులు జోడించి లోపలికి వెళ్ళిపోబోతుంటే కృష్ణ, “స్ఫూర్తి గారూ” అంటూ పిలిచాడు.

ఆగి వెనుతిరిగి చూశాను. “మీ పరిపూర్ణ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే మీరు ఆడపిల్లలకు ఒక స్పూర్తిలా, ఆత్మవిశ్వాసపు బావుటాలా నా కళ్ళకు కన్పిస్తున్నారు, హాట్సాఫ్!” నుదిటి మీద అరచెయ్యి పెట్టి మరీ సలాం చేసాడు.

ఆ వెంటనే నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని, “నన్ను పెళ్లి చేసుకుంటారా?” అడిగాడు.

నా పెదాల మీదే కాదు, అమ్మా నాన్నల కళ్ళల్లోనూ విజయ హాసం రెపరెపలాడింది!

Exit mobile version