Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక స్వప్నం.. ఒక సత్యం

[శ్రీ పి. రాజేంద్రప్రసాద్ గారు రాసిన ‘ఒక స్వప్నం.. ఒక సత్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

భిజిత్ వేగంగా కారు నడుపుతున్నాడు. హైవేనుంచి మలుపు తిరిగిన తరువాత ఒక మామూలు తారురోడ్డు మీద పోతున్నది కారు. ఆ దారిలో నిజానికి అంత వేగం మంచిది కాదు కానీ అభిజిత్ ఉన్న మనస్థితిలో అవన్నీ పట్టించుకునేలా లేడు. పైగా సాయంకాలం మనశ్శాంతి కోసం పుచ్చుకున్న ఆల్కహాల్ ప్రభావం అతన్ని సవ్యంగా ఆలోచించనివ్వడంలేదు. “స్వప్నా.. స్వప్నా..” నిమిషానికొకసారి బాధగా అనుకుంటున్నాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ వెళ్ళిన ప్రదేశం అతన్ని మళ్ళీ రమ్మని పిలుస్తోంది. సంవత్సరం క్రితం ఇదే రోజు.. అతని మనస్సు ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళింది.

***

“హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీవారూ!” అభిజిత్‌ను నిద్రలేపుతూ అన్నది స్వప్న. బదులుగా రెండుచేతులతో తనని మీదకి లాక్కోబోయాడు అభిజిత్.

“అమ్మమ్మా! అదేమీ కుదరదు శ్రీవారూ! నేను ఎప్పుడో లేచి తలస్నానం చేసి పూజకు వెళుతున్నాను. నా పూజ ముగిసేలోపు మీరూ మంచిపిల్లాడిలా తలారా స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకోండి.” అతని చేతుల నుండి లాఘవంగా తప్పించుకుని దూరం జరుగుతూ అన్నది స్వప్న.

“వెరీ బా..డ్ స్వప్న..” దొంగకోపంతో వేలు చూపుతూ అన్నాడు అభిజిత్.

“సరేలే! ఏం పర్లేదు. నేను బ్యాడే.. సరేనా. ఇక లేవండి..” చెయ్యి పట్టుకుని గుంజుతూ అన్నది స్వప్న.

“అబ్బా.. లేవాలా..” అంటూనే బద్ధకంగా లేచాడు అభిజిత్. బ్రష్ చేసుకుంటూ అడిగాడు “స్వప్నగారూ! ఇవాళ ప్రోగ్రామ్ ఏమిటండీ!” అంటూ.

“మధ్యాహ్నం ఏదైనా రెస్టారెంటుకి వెళదాం అభీ. సాయంకాలం అలాగ ఊరిచివరి కొండ మీద అమ్మవారి గుడికి వెళ్దాం. సెరీన్‌గా ఉంటుంది. మనమిద్దరమే ప్రకృతి అందాలను చూస్తూ సరదాగా గడపొచ్చు. అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఏమంటారు?” అడిగింది స్వప్న.

“రియల్లీ యు ఆర్ గ్రేట్ స్వప్నా. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ సెట్ చేశావు. తప్పకుండా అలాగే చేద్దాం. ఓ కే!” అంటూ థమ్స్ అప్ అన్నట్టు వేలు చూపాడు అభిజిత్. నవ్వుకుంటూ ఇద్దరూ రెడీ అవడం మొదలుపెట్టారు.

***

పొద్దున్న స్వప్న చెప్పినట్టే మధ్యాహ్నం రెస్టారెంట్లో భోజనం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంకాలం కారులో సిటీకి దూరంగా ఉన్న అమ్మవారి గుడికి బయలుదేరారు. అది ఊరికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒక పెద్ద  కొండపైన ఎప్పటిదో ఎవరో రాజులు కట్టించి శిథిలమైపోయిన కోట ఒకటి.  కొండకు అవతలి పక్క లోతైన లోయ.. భయపడకుండా కిందకి చూడగలిగితే ఒక అద్భుతమైన పెద్ద సరస్సు. దాని చుట్టూ అల్లిబిల్లిగా, పిచ్చిపిచ్చిగా పెరిగిన వృక్షసంపద. ఎంతో సుందరంగా, అంతే భయంకరంగా ఉంటుంది. ఆ ఏరియాను చూసినప్పుడల్లా అభిజిత్‌కి పెద్దపులి, సింహాలలోని అందమూ క్రూరత్వమూ గుర్తొస్తాయి.. ఆ ఆలయాన్నీ, కోటనూ టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చెయ్యడానికి ప్రభుత్వం వారు వేయించిన రోడ్డు, అనేక రాజకీయ, ఆర్థికకారణాల వల్ల, శిఖరానికి పది అడుగుల దూరంలో ఆగిపోయింది.

ఆ కోటలో అప్పటిదే ఆలనా పాలనా లేని  అమ్మవారి గుడి. అందులోని అమ్మవారి విగ్రహం ఎంతో అందంగానూ, మరెంతో భయంకరంగానూ ఉంటుంది.  అక్కడికి ఎంతోమంది జనం రారు. అందుకే స్వప్న “అక్కడ సెరీన్‌గా, మనమిద్దరమే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు” నని చెప్పి అభిజిత్‌ను లాక్కొచ్చింది. కారులో దగ్గరదాకా వెళ్ళి దాదాపు నిలువుగా ఉన్న పది అడుగుల ఎత్తూ ఎక్కి ఇద్దరూ ఆలయం చేరుకున్నారు. పూజారి లేని ఆ గుడిలో అక్కడే ఉన్న నాగమల్లి చెట్లపువ్వులను కోసి అమ్మవారికి భక్తిగా దణ్ణం పెట్టుకున్నారు.

గాలి చల్లగా, హాయిగా వీస్తూ ఉన్నది. పేర్లు తెలియని చెట్లపువ్వులు వింత పరిమళాలను వెదజల్లుతున్నాయి. పెద్ద మర్రిచెట్టు నీడలో కూర్చున్నది స్వప్న. ఆమె ఒడిలో పడుకుని ఆమె సౌందర్యాన్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ ఆస్వాదిస్తున్నాడు అభిజిత్. వాళ్లిద్దరి మధ్యనా ఏవేవో తీపి కబుర్లు అలా, అలా కాలంతో సంబంధం లేకుండా దొర్లిపోతున్నాయి. చిరు చీకటి అలముకొన్నది. “స్వప్నా! ఇక బయలుదేరదామా!” అడిగాడు అభిజిత్.

“అప్పుడేనా? ఇంకొద్దిసేపు ఈ సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఉంది అభిజిత్!” తన్మయంగా అన్నది స్వప్న.

“వద్దు స్వప్నా! మనం వచ్చి చాలాసేపయ్యింది. పైగా చీకటి పడుతోంది. బాగా చీకటయితే మనం కొండ దిగడం చాలా కష్టమవుతుంది. బయలుదేరదాం.” అనునయంగా చెప్పాడు తను.

“తప్పదా!?” గోముగా అడిగింది.

“లే స్వప్నా! చీకటి పడితే కష్టం.” చేయి అందిస్తూ అన్నాడతడు.

“ఉండు. ఒక్కసారి ఆ చెట్టు చాటుకి వెళ్లివస్తాను.” అన్నది స్వప్న లేస్తూ.

“ఉండు.. నేనూ వస్తాను.” అన్నాడు అభిజిత్. మరుక్షణం నాలిక్కర్చుకొని సారీ అన్నట్టు చూశాడు.

“ఏయ్!” బెదిరిస్తున్నట్టు తర్జని చూపిస్తూ చెట్టు చాటుకు కదిలింది స్వప్న. అభిజిత్ అటు తిరిగి నించున్నాడు. రెండు నిమిషాలు గడిచాయి. “ఇంకా రాదేమీ!” అసహనంగా అనుకుంటున్నాడు అభిజిత్.

ఇంతట్లో చెవులు చిల్లులు పడేలా, హృదయ విదారకమైన కేక. ఆ గొంతు స్వప్నదే. నిశ్శబ్దాన్ని చీలుస్తూ  భయంకరమైన ఆర్తనాదం.. “అభీ!.. పట్టుకోవా.. ప.. డి.. పో.. తు.. న్నా.. ను..” అంతే.. ఒకటి రెండు రాళ్ళు కదిలిన చప్పుడు. ఆ తర్వాత నిశ్శబ్దం.

కేక వినిపించగానే అభిజిత్ “స్వప్నా!.. వస్తున్నా..” అంటూ పరిగెత్తాడు గాలి కన్నా వేగంగా. అతని కేక అడవిలో ప్రతిధ్వనించింది. ఒకే ఒక్క క్షణంలో చెట్టుకు అవతలి పక్కకు చేరుకున్నాడు. స్వప్న అక్కడనుంచే అరిచిందనడానికి నిదర్శనంగా ఆమె ధరించిన గులాబీ రంగు చున్నీ అక్కడే  రాళ్ళ మీద పడి ఉంది.

“స్వప్నా.. స్వప్నా..” దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. నీరవ నిశ్శబ్దమే అతనికి బదులైంది. అలా ఎంతసేపు అరుస్తూ ఉండిపోయాడో అతనికే తెలియదు. ఉన్నట్టుండి అతనికి కనిపించిదది. ఒక రాతికి తగిలి రక్తంతో తడిసిన స్వప్న ముత్యపుటుంగరం. అభిజిత్ గుండెలవిసిపోయాయి. కిందికి చూశాడు. చీకట్లు వేగంగా పరుచుకుంటున్నాయి. కింద లోయలో, సరస్సులో చీకటి తప్ప మరేదీ కానరావడం లేదు. అభిజిత్ కిందకు పరిగెత్తాడు. దారిలో కాలికి ఏదో తగిలింది. ఇంకా ఆన్ లోనే ఉండి వెలుగుతూ ఉన్న ఫోన్. అది స్వప్నది కాదు. కోపంగా దానిని విసిరేసి కారు వేపు పరుగు పెట్టాడు. కొండదారి చివర ఒక కారు తెల్లది కాబోలు.. వేగంగా కొండ దిగుతూ కనిపించింది. అభిజిత్ అది పట్టించుకోలేదు. తన కారు వైపు పరుగు పెట్టి, వేగంగా డాష్ బోర్డ్ తెరిచి ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయసాగాడు.

అతని ఫోన్ కాల్ అందుకుని వెంటనే వచ్చిన పోలీసులు సెర్చ్ లైట్‌లు వేసి వెతికినా స్వప్న జాడ తెలియలేదు. వారం గడిచింది.. నెల గడిచింది.. సంవత్సరం గడిచింది.. మళ్ళీ స్వప్న, అభిజిత్‌ల పెళ్ళిరోజు వచ్చింది. జీవచ్ఛవంలా బ్రతుకుతున్న అభిజిత్ ఈ రోజు అదే చోటికి వచ్చాడు. గుండెలు పగిలేలా మనసులోనే రోదించాడు. చీకటి చిక్కగా కమ్ముకోవడంతో భారమైన హృదయంతో ఇంటికి బయలుదేరాడు.

దారిలో ఏవేవో జ్ఞాపకాలు మనసునిండా కమ్ముకున్నాయి. మ్యాట్రిమోనీ యాప్‌లో చూసి స్వప్న తండ్రి తనకు రిక్వెస్ట్ పెట్టడం. ఆమె ఫోటో చూడగానే తను మైకంలో పడిపోవడం. కలలోలాగా వేగంగా జరిగిన పరిణామాలు. వైభవంగా జరిగిన పెళ్లి. ఏ ఆధారం లేని కడు బీద వాళ్ళైన స్వప్న తల్లిదండ్రుల పేరున తను కోటి రూపాయలు వేయడం. వాళ్ళు విడిగానే ఉంటామని స్వప్నని మాత్రం తన ఇంటికి పంపడం. అమ్మా, నాన్నలు స్వప్నను స్వంత కూతురిలా చూసుకోవడం. సంవత్సర కాలం ఇట్టే గడిచి తమ పెళ్లి రోజు రావడం.  “దేవుడా!..” కారు నడుపుతూనే బాధగా కణతలు నొక్కుకున్నాడు.

***

తిరుమంగళం అనేది తమిళనాడులోని మదురై జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. దొంగనోట్ల కుంభకోణంలో కొంతమంది అనుమానితులు ఆ ఊరిలో దాక్కుని ఉన్నారన్న పక్కా సమాచారంతో  తన మందీ మార్బలాన్ని ఒక్కొక్కళ్ళనే రహస్యంగా ఆ ఊరిలో దింపి చివరిగా తను మామూలు సివిల్ డ్రెస్సులో, ఈ కేసు కోసం బాగా పెంచిన పొడవాటి క్రాఫుతో సామాన్య పల్లెటూరి వాడిలాగా వచ్చాడు ఆ జిల్లా డీ.ఎస్.పీ. ఆనంద్. తెలుగు రాష్ట్రాలనుండి వచ్చిన ఆనంద్, ఊరికి తగ్గట్టుగా ఆనందన్‌గా చలామణీ అవుతూ తమిళ భాషను పూర్తిగా నేర్చుకున్నాడు. దేశం లోని ఏ ప్రాంతంలో పనిచేసినా ఆ ప్రాంతపు యాసనూ, భాషనూ పూర్తిగా నేర్చుకోవడం ఐపీఎస్ ఆఫీసర్లకు తప్పనిసరి. ఒక టీ కొట్టులో టీ తాగుతూ పొన్నాంబళం అనే వ్యక్తి అడ్రస్ కనుక్కున్నాడు. వాళ్ళ అమ్మాయిని సంబంధం అడగడానికి వచ్చినట్టు అడిగినతనికి చెప్పాడు. పొన్నాంబళం ఇంటిలో వాళ్ళమ్మాయిని చూడడం జరిగింది. అమ్మాయి దేవకన్యలాగా ఉంది. ఆ అమ్మాయితో విడిగా మాట్లాడాడు. అమ్మాయి నంబర్ తీసుకుని ఆ అమ్మాయితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇంకా అతనికి కోరిక తీరలేదు. రకరకాల డ్రెస్సుల్లో తన ఫొటోలు తీసుకుని తన ఫోన్లోని డ్రైవ్‌లో దాచుకున్నాడు. వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చాక సంతోషంగా ఫోన్  తీసి డయల్ చేశాడు.

***

హైదరాబాద్ నుండి రెండు ఫ్లైట్లు మారి, బస్సెక్కి అక్కడికి రావాల్సి వచ్చింది. “వెధవ, అర్జెంటంట ఏమిటో చెప్పడు.” ఆనంద్ పంపిన కార్లో ఆ ఊరికి వెళుతూ మనసులో తిట్టుకుంటున్నాడు అభిజిత్.  కారు ఆగింది. బయటే నిలబడ్డాడు డీ.ఎస్.పీ ఆనంద్. అభిజిత్ బయటకు దిగాడు. ఆనంద్ అభిజిత్‌ను కౌగిలించుకుని, స్టేషన్ లోకి తీసుకు వెళ్ళాడు.

“ఏమిటి ఆనంద్.. ఇంత అర్జంటుగా రమ్మన్నావు..” లోపలికి నడుస్తూ లాకప్ వైపు తల తిప్పిన అభిజిత్, అక్కడ తలవంచుకుని బెంచీ మీద తల్లిదండ్రులతో పాటు కూర్చున్న యువతిని చూసి స్తంభించిపోయాడు. అతని పెదవులు అప్రయత్నంగా “స్వప్నా..” అంటూ ఉచ్చరించాయి.

“అవును అభిజిత్! ఈమె స్వప్ననే. స్వప్న ఉరఫ్ మీనా ఉరఫ్ పల్లవి ఉరఫ్ అశ్విని ఉరఫ్ తేజు. ఈమె చరిత్ర చెప్పనా!” నిశ్చేష్టుడై నిలబడ్డ అభిజిత్ వైపు జాలిగా చూస్తూ కొనసాగించాడు ఆనంద్.

“ఒక దొంగనోట్ల కేసు విషయమై ఈ అమ్మాయి తండ్రి మీద అనుమానంతో పిల్లనడిగే సాకు అడ్డం పెట్టుకొని ఇక్కడకు వచ్చి అమ్మాయిని చూసి నీకులాగే ఆశ్చర్యపోయాను. ఆమె నన్నెప్పుడూ అంతకు ముందు చూసి ఉండనందున నన్ను గుర్తుపట్టలేదు. ట్రైనింగ్‌లో ఉన్న నేను మీ పెళ్లికి కూడా రాకపోవడంతో నేనెవరో ఆమెకు తెలియలేదు. నేను నెమ్మదిగా అన్ని విషయాలూ ఎంక్వైర్ చేసి తెలుసుకున్నాను. ఈ అమ్మాయికీ, ఈ తల్లిదండ్రులకీ ఈ దొంగనోట్ల వ్యవహారానికి ముందు ఇదే పని. నీలాంటి డబ్బున్న వాళ్ళని వలవేసి పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపరం చేసి అన్ని రకాలుగా వాళ్ళని దోచుకుని తరవాత ఇదిగో ఇలాగ చనిపోయినట్టు ఎవిడెన్స్ సృష్టించి వేరే స్టేట్స్‌కి పారిపోవడం. మాట్రిమొనీలో వీళ్లు విసిరిన వలలో చిక్కిన చేపవి నువ్వు. సంవత్సరం పాటు నీతో చేసిన కాపురంలో నిన్ను నమ్మించి కాగితాలమీద సంతకాలు పెట్టించుకుని బ్యాంకు లాకర్లలో ఉన్న ఇరవై కోట్ల విలువగల వజ్రాల, రత్నాల ఆభరణాలనూ స్వంతం చేసుకున్నారు. స్వప్న చనిపోయిన దుఃఖంలో నువ్వు కనీసం ఆ లాకర్లు ఓపెన్ చెయ్యబడ్డాయని కూడా అనుమానించలేదు. అయిదు కోట్ల రూపాయలకు తన పేర ఇన్స్యూర్ చేయించుకుని నామినీగా తన తండ్రి పేరు పెట్టుకొని నీ సంతకాన్ని దొంగతనంగా తీసుకుంది. తను చనిపోయినట్టు తనే డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆ అయిదు కోట్లూ కొట్టేసింది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలావరకు నగలు, ఖర్చు కాగా మిగిలిన కాష్‌ను మేం రికవర్ చేయగలిగాం.” ఆనంద్ ఊపిరి తీసుకోవడానికి ఆగాడు.

“మరి.. చెట్టు వెనకనుంచి లోయలో పడిపోవడం.. అదీ..”

“ఎస్.. తను చెట్టు వెనుక నుండి ముందే దిగిపోయి సిద్ధంగా ఉన్న కారులో పారిపోయింది. చెట్టు దగ్గర పవర్ ఫుల్ బ్లూ టూత్ స్పీకర్ పెట్టి, ఒక ఫోన్‌లో ముందుగానే రికార్డ్ చేసి ఉంచిన వాయిస్‌ను ఆన్ చేసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. నీ కాళ్ళకి అడ్డం పడిన ఫోన్ అదే. ఉదయం పోలీసులకు బ్లూటూత్ స్పీకర్ కనిపించినా అది ఎవరో మర్చిపోయి వదిలేసి ఉంటారని విడిచిపెట్టేశారు. నువ్వు ఫోన్ గురించి చెప్పి ఉంటే అది వేరే విధంగా ఉండేది.” ముగించాడు ఆనంద్.

లాకప్ లోంచి తనవంక దీనంగా చూస్తున్న స్వప్న గురించి తను ఏ విధంగా అనుకోవాలో తెలియక నిర్వేదంగా చూస్తూ ఉండిపోయాడు అభిజిత్.

Exit mobile version