[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘ఒక నిశ్శబ్ద కావ్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నునులేత కొమ్మలపై వాలిన
చిన్నారి తేనెపిట్ట (హమ్మింగ్ బర్డ్)
ఊయలలూగుతూ
పూల తేనెలు ఆస్వాదించే దృశ్యం
ఒక నిశ్శబ్ద కావ్యం.
జామచెట్టుమీద వాలిన చిలకమ్మ
దొరకాయను తీరికగా
చిన్న చిన్న ముక్కలుగా కొరుకుతూ
గింజలను ఇష్టంగా తింటున్న దృశ్యం
అందమైన అద్భుత మైన అనుభవం.
ఎవరో తరుముకు వస్తున్నారన్నట్టు
చిట్టి ఉడతా బెదురుకళ్ళతో
అటూఇటూ పరికిస్తూ
సగం తినిపారేసే
చిలిపి అల్లరిని చూస్తుంటే
మనసుకి కలుగుతుంది పారవశ్యం.
గగనవీధులలో విహరించే
గరుడ పక్షి తన తీక్షణమైన
కళ్ళతో ఎర కోసం గాలిస్తోంది
ఆ ఏరకు చిక్కుకునేది
ఎవరైనా విషాదమే కానీ
అది గరుడ పక్షి జీవన పోరాటం.
రివ్వున ఎగురుతూ గుంపులుగా
వచ్చే బుజ్జి పిచ్చుకలు
నేలమీద గింజలను
ఏరుకోడానికి పోట్లాడుకోడం
తిలకించే వారికి ముచ్చట గొలుపుతాయి.
తెల్లవారగానే కమ్మని గొంతుతో
రాగాలాపన చేసే కోయిలమ్మలు
మరి ఎవరిని మురిపించడానికో
హుషారుగా పాటలు పాడుతుంటాయి.
కువకువమంటూ గోలచేసే
పావురాలను భరించడం కష్టం కానీ
అవి దూరదూరతీరాలకు
విరామం ఎరుగక సందేశాలను
మోసుకుపోయే ఉపకారులు
మచ్చిక చేస్తే రోజూ వస్తుంటాయి
మనకు స్నేహితుల్లాగా ఉంటాయి
వాటి భాషలో కబుర్లు చెప్పి
మనలను అలరిస్తాయి.
ఎవరో తోడు వస్తారని
ఏదో మేలు చేస్తారని
ఎదురుచూడటంకన్నా
ప్రకృతి ప్రసాదించిన
అవకాశాలు అందుకోవడం
ఆనందం కలిగిస్తుంది.
ఎక్కడో దూరంలో
వెతుక్కోవలసిన పనిలేదు
మన చుట్టూనే కనిపిస్తాయి
సంతోషాలకు నెలవులు పూలు పక్షులు
ఇంటి ముంగిట తోటలో విరిశాయి
కనువిందు చేస్తూ అలరిస్తాయి.
పూలకు భాషలేదు కానీ
విరిసీ విరియని మొగ్గలు
సిగ్గులు వొలకబోస్తుంటే
విరిసిన విరులనిండా
మధువు నింపుకుని
గాలిలో కదలాడుతూ
సందేశాలు పంపుతాయి.
ఇన్ని రంగులు
ఇంతటి అందాలు
ఎక్కడివో కన్నె కుసుమాలకు
స్వచ్ఛమైన తెల్లదనం
పరిమళాల సుగంధం
అలుముకున్న విరిబాలలు
మగువల మనసును చూరగొంటాయి
మగరాయుళ్ళను ఆకర్షణలో పడవేస్తాయి.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.