ఎండలు మండుతున్నాయ్.
ఈ సీజన్లో..
బండలు దొర్లుతున్నాయ్.
ఈ రోజుల్లో..
కొండలు బహు రూపాలై లారీ లెక్కి సవారీ చేస్తున్నాయి.
రూపురేఖల్ని మార్చుకున్న ప్రకృతి కొత్త పల్లవి అందుకుంది కొత్తగా..
కొంగ్రొత్తగా పల్లవించాలనుకున్న కోయిల
సొంత రాగాల్ని అరువు తెచ్చుకోవలసిన దారుణం.
ఇక్కడంతా అగమ్యగోచరం.
ఇప్పుడంతా అయోమయ రాగాలాపన గంధర్వ గాన కచేరి.
తొలకరి ఆకుపచ్చ కాన్వాసుపై అస్పష్ట చిత్రాల స్పష్టీకరణ.
మండుతున్న అధరాలపై ఆవిరి జల్లుల ఆశనిపాతం.
వర్షం..
బహు రూపాల చిత్రాతి చిత్రమైన సన్నివేశం.
గ్రీష్మం..
అదిరే పెదాలపై అందని ప్రాణ జలధార విక్రీడనం.
శీతలం..
వెచ్చ వెచ్చని అనుభూతి దొంతరల ఆగమనమని
అనుకోవడానికి కూడా చోటు లేని వ్యథార్థ చిత్రం.
కంకి కొసల్లో శూన్యాన్ని బంధించి కారణాలన్వేషించే సందర్భం.
ఇక్కడ ఏదీ స్పష్టం కాదు. ఇక్కడేదీ అస్పష్టం కూడా కాదు.
ఇది స్పష్టాస్పష్టాల వైకుంఠపాళీ.
కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.