Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక ఆగమన దృశ్యం

[శ్రీ అవధానుల మణిబాబు రచించిన ‘ఒక ఆగమన దృశ్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మూడున్నర కిలోల గులాబీ పువ్వును
మురిపెంగా గుండెలకు హత్తుకున్నదామె.
అది – అయిదు రోజుల క్రితం అర్థరాత్రి వేళ
తనకు అమ్మమ్మగా పదోన్నతినిచ్చిన ఆర్డర్ కాపీ.
ఎగిరి గంతేయాలన్న సంబరాన్ని
ఎత్తుకున్న బాధ్యత అడ్డుకుంటుంటే
నెమ్మదిగా నడుస్తూనే
అమ్మై ఇంటికోస్తోన్న
అమ్మాయివైపు చూస్తోంది.
***
ఊతం లేకుండా నడిస్తే కాలు తడబడుతోంది
పలకరింతలకు బదులివ్వాలంటే
నోరు పొడిబారిపోతోంది.
ఐనా, కన్నుల్లో గర్వరేఖ
పళ్ళెంలో హారతితో పోటీ పడుతోంది.
గడపలో అడుగుపెడుతూ
నాన్నేడీ? అని చెల్లెలిని అడిగింది.
***
ఆరు నెలలుగా పిలిచిన వెంటనే పలికిన
ఆటో అబ్బాయికి మరీ మరీ థాంక్స్ చెప్పి
సంచులు దింపి, డబ్బిచ్చి పంపి
అదనపు బాధ్యతలు స్వీకరించిన అధికారిలా
హడావిడిగా మరో జాబితాతో బజారుకి బయలుదేరుతూ
ఓసారి కిటికీలోంచి వసారాలోకి చూశాడు
***
ఇప్పటి దాకా స్పిరిట్ వాసన తప్ప తెలియదేమో!
వెల్లుల్లి బీరకాయ్ గానుగ నూనెలో మగ్గుతుంటే
పాతచీరల బుజ్జిబొంతలో
కొత్త శిశువు కమ్మగా నిద్రపోతోంది.

Exit mobile version